తెలంగాణలో 29 శాతం.. ఏపీలో 43 శాతం అధిక వర్షపాతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణంకంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు 707.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 759.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వివరించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో సాధారణం కన్నా భారీ వర్షాలు కురిశాయని, అందులో రెండు తెలుగు రాష్ట్రాలున్నాయని తెలిపింది.
తెలంగాణలో 581.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కన్నా 29 శాతం అధికంగా 751.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో 373.6 మిల్లీమీటర్లకు గానూ 534.3 మిల్లీమీటర్లు అంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వెల్లడించింది. తెలంగాణలో ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవగా, ఏపీలో నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడినట్లు వివరించింది. అలాగే భారీ వర్షాల జాబితాలో తెలంగాణలో 11, ఏపీలో 21 జిల్లాలున్నట్లు తెలిపింది. మిగతా జిల్లాలో సాధారణ వర్షపాతం ఉందని పేర్కొంది. దేశంలో అతిభారీ వర్షాలు కురిసిన జిల్లాలు అధికంగా తమిళనాడులో 19, రాజస్తాన్‌లో 14 జిల్లాలు ఉన్నాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment