ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి రాష్ట్రపతి, ప్రధాని సహా
పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల నివాళి
ప్రియతమ కామ్రేడ్‌ను కోల్పోవడం తీవ్ర విషాదకరమన్న సీపీఎం
నేటి సాయంత్రం వసంత్‌కుంజ్‌లోని నివాసానికి భౌతికకాయం
రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ ఆఫీసులో పార్థివ దేహం
వైద్య పరిశోధనల నిమిత్తం భౌతికకాయాన్ని
ఎయిమ్స్‌కు అప్పగించనున్న కుటుంబం
సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రజెండా నీడలో ప్రకాశించిన అరుణతార నేల రాలింది. దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసిన వామపక్ష యోధుడు, ప్రజా ఉద్యమకారుడు, సామాజిక వేత్త, కాలమిస్ట్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతూ ఆగస్టు 19వ తేదీన ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఐసీయూలో చేరిన ఏచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమవడంతో రెండురోజుల క్రితం విదేశాల నుంచి మెడిసిన్ తెప్పించారు.
అది కూడా ఫలితాన్నివ్వకపోవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీతారాం ఏచూరి కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్య బృందం ప్రకటించింది. ఆయన భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు పరిశోధనల నిమిత్తం దానంగా ఇవ్వనున్నారు. ఏచూరి కోరిక మేరకే ఆయన కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య పేరు ఇంద్రాణి మజుందార్. రెండో భార్య సీమ చిస్తీ. ఆయనకు కుమార్తె అఖిల, కుమారుడు డానిష్ ఉన్నారు. పశి్చమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత బుద్ధదేవ్ భట్టాచార్యకు నివాళులర్పిస్తూ ఆగస్టు 22న చివరిసారిగా ఏచూరి ఒక వీడియో సందేశంలో కని్పంచారు. ‘అనారోగ్యం కారణంగా ఎయిమ్స్ నుంచే మాట్లాడాల్సి వస్తోంది. విప్లవ లాల్ సలామ్‌లు బుద్ధదేవ్ గారికి..’ అని ఆ సందేశంలో ఏచూరి అన్నారు.
ఏచూరి మరణంతో అటు కమ్యూనిస్టు పార్టీలోనూ, ఇటు కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియతమ కామ్రేడ్‌ను కోల్పోవడం తీవ్ర విషాదకరమని సీపీఎం పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏచూరి మృతిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఏచూరి భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తల నివాళులు, సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంచుతామని సీపీఎం తెలిపింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు.
పరిశోధనల కోసం పార్థివ దేహం
ఏచూరి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం చేస్తున్నట్లు ఆయన కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు. పార్థివ దేహాలను పరిశోధనల కోసం దానం చేసే పద్ధతిని కమ్యూనిస్టులు కొంతకాలంగా కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య భౌతికకాయాన్ని కూడా దానం చేశారు. ఇలాగే మరికొందరి భౌతికకాయాలను కూడా ఆసుపత్రులకు అప్పగించారు.
నేడు విదేశీ కమ్యూనిస్టు నేతల రాక
ఏచూరి మరణవార్తను తెలుసుకున్న విదేశాలకు చెందిన కమ్యూనిస్టుల పార్టీల నేతలు, ఆయనకు నివాళులరి్పంచేందుకు ఢిల్లీ రానున్నారు. శుక్రవారం చైనా, నార్త్ కొరియా, వియత్నాం, క్యూబా వంటి దేశాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూడురోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
1977
అక్టోబర్ నెల.. ఓ నూనుగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా చేరారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లెగిచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమెరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.
ఏచూరికి ప్రముఖుల సంతాపం
⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్‌కడ్, ఉప రాష్ట్రపతి
⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరు నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను – అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి
⇒ ఏచూరి మరణం బాధాకరం. సుదీర్ఘ ప్రజాజీవితంలో పార్లమెంట్ సభ్యునిగా ఉంటూనే పౌర సమస్యలపై పోరాడుతూ విశిష్టమైన నేతగా ఎదిగారు. – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
⇒ భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఏచూరి ఒకరు. ఆయన కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎదిగారు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
– సీఎం చంద్రబాబు
⇒ జీవితాంతం వామపక్ష భావాలతో ఏచూరి గడిపారు. దేశ ప్రగతి కోసం నిరి్వరామంగా చొరవ చూపారు. సీతారాం స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారు. ఏచూరి మృతి దేశ రాజకీయాల్లో తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్, మాజీ సీఎం
⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తారు. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. పార్లమెంటేరియన్‌గా ప్రజాసమస్యలను బలంగా వినిపించారు. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్
⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత
⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్‌లో పనిచేశాం. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment