రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. కోస్తా తీరానికి 9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. వ్యాయవ్య బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది.
అయితే విశాఖపట్నం జిల్లాలో సముద్రం తీరం ఉగ్రరూపం దాల్చింది. దాంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దాంతో విశాఖపట్నం జిల్లాలోని భీమిలి పరిసర ప్రాంతాలలోని తీరంలోని భూమి తీవ్ర కోతకు గురైంది. మరో రెండు రోజుల పాటు అలల ఉధృతి కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఓ వైపు అల్పపీడనం, మరో వైపు పౌర్ణమి కావడంతోనే అలల తీవ్రంగా ఎగసి పడుతున్నాయని సముద్ర అధ్యయన వేత్తలు అంచనా వేస్తున్నారు.