బుధవారం కమ్ముకున్న కారుమబ్బులు
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశవైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఆవర్తనం ఎత్తు తగ్గడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment