సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఏడో తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరుతుంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది.
తొలుత ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. తాజా అంచనాల ప్రకారం దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈ నెల ఆరో తేదీ తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణ కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో శనివారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.
చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment