Heavy Rains in Andhra Pradesh
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
ఏపీ: వానలే వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు (ఫొటోలు)
-
Cyclone Mandous: తీవ్ర తుపానుగా మాండూస్.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
వైఎస్సార్ కడప జిల్లా: తుఫాను, భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయ రామరాజు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుఫాను బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూమ్-08562 - 246344 కడప రెవెన్యూ డివిజన్.. కంట్రోల్ రూమ్-08562 - 295990 జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ -9440767485 బద్వేలు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్-9182160052 పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్- 7396167368 కొనసాగుతున్న మాండూస్ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండూస్ తుఫాను కొనసాగుతుంది. మామల్లపురంకి 135 కిలోమీటర్ల దూరంలో చెన్నైకి 170 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైంది. ఈ అర్థరాత్రి, తెల్లవారుజామున శ్రీహరికోట మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వలన రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, సత్య సాయి జిల్లా, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు: మంత్రి కాకాణి తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎండీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ►మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ►అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ►ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ►తీరప్రాంత మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మంత్రి కాకాణి తిరుపతి జిల్లా ►బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి: నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి ►ఇప్పటివరకు తిరుపతి నగరంలో 10 లోతట్టు ప్రాంతాలను గుర్తించాం ►లోతట్టు ప్రాంతాల్లో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపు ►నగర పాలక సంస్థ తరపున హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశాం తూర్పుగోదావరి జిల్లా ►మాండూస్ తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మారిన వాతావరణం ►మేఘావృతంగా మారిన ఆకాశం పలు చోట్ల మోస్తరు వర్షం ►ఓడలరేవు, అంతర్వేది, కాట్రేనికోన ప్రాంతాల్లో ఎగసిపడుతున్న అలలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ►మాండూస్ తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారుతున్న సముద్రం ►అంతర్వేది, ఓడల రేవు తీరాల్లో స్వల్పంగా ఎగసిపడుతున్న అలలు ►వాతావరణశాఖ హెచ్చరికలతో తీరానికి వచ్చేస్తున్న మత్స్యకారులు ►జిల్లా కేంద్రంతో పాటు, తీర ప్రాంతంలో మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసిన అధికారులు కాకినాడ జిల్లా ►మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. కల్లోలంగా మారిన ఉప్పాడ తీరం ►కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు పై ఎగసిపడుతున్న కెరటాలు ►పది మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ►అధికారుల హెచ్చరికలతో వేటను ఇవాళ, రేపు నిలిపివేసిన మత్స్యకారులు తిరుపతి జిల్లా ► నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు: జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ►బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారిన నేపథ్యంలో నేటి మధ్యాహ్నం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవుగా ప్రకటన.. జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ►సంబంధిత పాఠశాలలు కళాశాలలు వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశం నెల్లూరుకు పొంచి ఉన్న మాండూస్ తుపాను ముప్పు ►జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు ►తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం ►కలెక్టరేట్‌తో పాటు ,అన్ని మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు ►ఆస్తి, ప్రాణనష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన ►పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్ చక్రధర్ బాబు చిత్తూరు ►జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు ఈరోజు మధ్యాహ్నం నుంచి సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ హరి నారాయణ ►పాఠశాల పునఃప్రారంభంపై తిరిగి సమాచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తిరుపతి జిల్లాపై మాండూస్ తుపాను ప్రభావం ►మాండుస్ తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు ►తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆ మోస్తరుగా చిరుజల్లులు ►సముద్రతీర ప్రాంత మండలాలు తడ, సూళ్ళురు పేట,వాకాడు,కోట, లో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం ►మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేసిన రెవెన్యూ యంత్రాంగం ►ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ అలెర్ట్ ►తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం సాక్షి, చెన్నై/అమరావతి: మాండూస్ తుపాను ప్రభావంతో.. పలు పోర్టుల్లో తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. కడలూరు, పుదుచ్చేరి, నాగపట్నం, కారైకల్.. ఓడరేవుల్లో ఐదవ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పార్క్‌లు, బీచ్‌లు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో మాండూస్ తుపాను కేంద్రీకృతం. సాయంత్రం కల్లా మహాబలిపురం-పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది మాండూస్. తుపాను తాకే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #CycloneMandous intensified to a #SevereCyclonicStorm,will make landfall near #Chennai b/w #Puducherry & #Sriharikota, around #Mahabalipuram. Wind speed Max 65-75 gusting to 85 kmph around midnight of 09th Dec as a #CyclonicStorm. #MandousCyclone (Visuals - Marina Beach) pic.twitter.com/w2k9CZoi8c — Sitam Moharana(ANI) (@SitamMoharana) December 8, 2022 తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీకి సంబంధించి.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుపాను ప్రభావం పడనుంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు భారీ వర్ష సూచన. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నిచోట్లా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని అధికార యంత్రాంగాలు ప్రకటించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం వద్ద శుక్రవారం అర్దరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని వల్ల పుదుచ్చేరి, శ్రీహరికోట, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంట 65 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు ఈ నెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ సూచించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం చూపే ఆరు జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఏపీ అలర్ట్ ద్వారా ఇప్పటికే ఆరు జిల్లాలో హెచ్చరిక సందేశాలు పంపామన్నారు. -
Rain Alet: దక్షిణ కోస్తా వైపునకు వాయుగుండం!.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఏడో తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరుతుంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. తొలుత ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. తాజా అంచనాల ప్రకారం దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈ నెల ఆరో తేదీ తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణ కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో శనివారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
ఏపీకి మరో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో గురువారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం ఈ అల్పపీడనం 11వ తేదీ వరకు వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఈనెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. -
10, 11 తేదీల్లో గాలులు, వానలు
సాక్షి, విశాఖపట్నం: మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వానలు మొదలుకానున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం (రేపు) అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి. ఈ అల్పపీడనం వాయవ్యదిశగా తమిళనాడు, పుదుచ్చేరిల వైపు పయనించనుంది. దీని ప్రభావంతో బుధవారం ఒకటిరెండు చోట్ల తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని, ఈనెల 10వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. 11వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వీచే ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. సోమవారం విజయనగరం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అనంతపురం జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. -
Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి,అమరావతి: రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో బుధవారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో గురువారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇక మంగళవారం అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 13 సెం.మీ., అనంతపురం జిల్లా కనేకల్‌లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా మల్లంలో 7.9, వాకాడులో 5.7, పూలతోటలో 4.1, గునుపూడులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న కుండపోత వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆ జిల్లా వ్యాప్తంగా సగటున 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 13.2 సెం.మీ. వర్షం పడింది. కారెంపూడి మండలం శంకరపురంసిద్ధాయిలో 8.6 సెం.మీ, నకరికల్లు మండలం చాగల్లులో 7.3, నాదెండ్ల మండలం గణపవరంలో 7, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది. ఇక కాకినాడ సిటీలో పలుచోట్ల 15–16 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరయ్యపాలెంలో 6.1, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెలలో 6.1, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 5.9, గుంటూరు జిల్లా తాడికొండ మండలం బెజత్పురంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని నల్లడ్రెయిన్కు గండి పడింది. ఫలితంగా వందలాది ఎకరాల్లోకి నీళ్లు చేరాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం సగటు వర్షపాతం 28.6 మి.మీ., కృష్ణా జిల్లాలో 16.3 మి.మీ.గా నమోదైంది. ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఒంగోలు నగరంలో ముసురుపట్టినట్లు రోజుకు నాలుగైదుసార్లుగా వర్షం పడుతూనే ఉంది. నల్లవాగు, చిలకలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఎగువన కురిసిన వర్షాలకు మల్లవరం రిజర్వాయర్ ద్వారా శనివారం అర్ధరాత్రి నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆదివారం బ్యారేజీకి చెందిన 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఎగువ నుంచి 5,09,431 క్యూసెక్కుల వరద వస్తుండగా, కాలువలకు 2,827 క్యూసెక్కులు, సముద్రంలోకి 5,06,604 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి ఐదు లక్షల క్యూసెక్కుల పైబడి వరద రావడం ఇదే తొలిసారి. అలాగే, జూన్ 1 నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకూ మొత్తం 1,035.768 టీఎంసీలు కడలిలో కలవడం గమనార్హం. అలాగే, నాగార్జునసాగర్‌లో 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇక ఆదివారం సా. 6 గంటలకు శ్రీశైలంలోకి 4,01,187 క్యూసెక్కులు చేరుతుండటంతో తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3,59,978 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి దిగువకు 3,67,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.650 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.760 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. -
మహోగ్ర కృష్ణా
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఎగువన ప్రాజెక్టులన్నీ నిండిపోయి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 4,53,067 క్యూసెక్కులు వస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా డెల్టాకు 2,827 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,50,240 క్యూసెక్కులను బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో జూన్ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు వెయ్యి టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. శ్రీశైలంలోకి కొనసాగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,02,786 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ 65,643 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్, పులిచింతలలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. సాగర్, పులిచింతలలోకి వచ్చిన వరదను దిగువకు వదలిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన తగ్గుతున్న వరద.. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వచ్చే వరద తగ్గింది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల స్పిల్ వే గేట్లను మూసివేశారు. తుంగభద్ర, భీమా నదుల్లోనూ వరద తగ్గింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి శ్రీశైలంలోకి చేరే వరద తగ్గనుంది. విజయవాడకు ముంపు భయం లేదిక ప్రతి ఏటా కృష్ణా నది వరదల సమయంలో ముంపు ముప్పును ఎదుర్కొనే విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు ఇప్పుడా భయం లేదు. గతంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి మూడు లక్షల క్యూసెక్కులు వదిలితే దిగువన విజయవాడలోని కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. దాంతో ఆ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్ప మిగిలిన ముఖ్యమంత్రులెవరూ ఈ ప్రాంతాల ప్రజల అవస్థలను పట్టించుకోలేదు. కృష్ణా వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో యనమలకుదురు నుంచి కోటినగర్ వరకు కృష్ణా నదికి 2.28 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడలు నిర్మించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు కోటినగర్ నుంచి తారకరామనగర్ వరకు 1.56 కిలోమీటర్ల పొడవున రూ. 125 కోట్లతో రక్షణ గోడ నిర్మించారు. ఈ పనులను 2021 మే 31న ప్రారంభించి.. రికార్డు సమయంలో పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినా లోతట్టు ప్రాంతాలకు వరద చేరకుండా పటిష్ఠంగా ఈ గోడ నిర్మించారు. దీంతో లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు ప్రజలకు ముంపు ముప్పు తొలగింది. ప్రస్తుతం పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు కృష్ణా నదికి రక్షణ గోడ నిర్మిస్తున్నారు. దీనికి రూ.135 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెన్నాలో మరింత పెరిగిన వరద కర్ణాటక, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. పెన్నా ప్రధాన పాయతోపాటు ఉప నదులు జయమంగళ, కుముద్వతి, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, బాహుదా, పించా, సగిలేరు ఉరకలెత్తుతున్నాయి. దీంతో పెన్నాలోకి భారీగా వరద వస్తోంది. శనివారం నెల్లూరు బ్యారేజ్ నుంచి 81 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారంటే.. పెన్నాలో వరద స్థాయిని అంచనా వేయచ్చు. ఇప్పటికే పెన్నా ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడం, వరద భారీగా వస్తుండటంతో అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. ఒక సీజన్లో ప్రాజెక్టుల గేట్లను రెండోసారి ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారి. -
AP: రాష్ట్రానికి తుపాను ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ సముద్రం, దాని పరిసరాల్లో ఈ నెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 20వ తేదీ నాటికి ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. క్రమంగా ఇది ఏపీ–ఒడిశా తీరం వైపు కదులుతూ 24, 25 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా మారుతుందని పలు అంతర్జాతీయ ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. కాగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. కుంభవృష్టితో కోనసీమ తడిసి ముద్దైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చంపావతి, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 4.33 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండ లం ఓలేరు, పల్లెపాలెం, పెదలంక, కాకుల డొంక వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోం ది. కాగా వర్షాల నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ఉధృతితో ప్రవహించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో వాగుల్లో కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. అష్టదిగ్బంధంలో అమరావతి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. గత టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా నిర్మించిన అమరావతిని వాన నీరు చుట్టుముట్టింది. భూసమీకరణ పేరుతో వేలాది ఎకరాలు సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంతంలో అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించకపోవడంతో సచివాలయ ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బందిపడ్డారు. -
వరద గుప్పిట్లో అనంతపురం
సాక్షి ప్రతినిధి, అనంతపురం/కర్నూలు (అగ్రికల్చర్): భారీ వర్షాలతో అనంతపురం జిల్లా కకావికలమైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కనీవినీ ఎరుగని రీతిలో అనంతపురంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయదుర్గంలో 14.6, బుక్కరాయసముద్రంలో 12, పెద్దపప్పూరులో 11.6, గుత్తిలో 9.8, పుట్లూరులో 8.5, యాడికిలో 8.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ప్రధానంగా అనంతపురం మండలం కక్కలపల్లి, కాటిగాని కాలువ, కట్టకిందపల్లి, ఆలమూరు, కామారుపల్లి, సజ్జల కాలువ, కురుగుంట, కొడిమి, రాచానపల్లి, ఎ.నారాయణపురం తదితర ప్రాంతాలతో పాటు రుద్రంపేట, చంద్రబాబు కొట్టాల, విమలా ఫారుఖ్‌నగర్, సుందరయ్య కాలనీ, వికలాంగుల కాలనీ, జాకీర్ కొట్టాల, నగరంలోని ఆజాద్‌నగర్, విశ్వశాంతి నగర్, హనుమాన్ కాలనీ, శాంతినగర్, ప్రశాంతి నగర్, రంగస్వామి నగర్, రజక నగర్, ఆదర్శ నగర్, యువజన కాలనీ, నాలుగు, ఐదు, ఆరో రోడ్డు, సోమనాథ నగర్, సుఖదేవ నగర్, శ్రీశ్రీనగర్, గౌరవ్ గార్డెన్, తడకలేరు తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వంక పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి కారణంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బుక్కరాయసముద్రం వద్ద వాగులో సిమెంట్ కంటైనర్ బోల్తాపడింది. అనంతపురం ఐదో రోడ్డులో ఆహార పొట్లాల పంపిణీ ఉమ్మడి కర్నూలులో భారీ వర్షాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సగటున 85.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంలో ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. దేవనకొండలో రికార్డు స్థాయిలో 160.2 మి.మీ. వర్షం కురిసింది. నందవరంలో 112.6, బనగానపల్లెలో 107.4, పగిడ్యాలలో 98.2, పెద్దకడబూరులో 97.2, గోనెగండ్లలో 96.2, వెల్దుర్తిలో 96.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. హంద్రీ నది, వేదావతి నదితోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షాలతో వెల్దుర్తి మండలంలో నాలుగు మట్టి మిద్దెలు కూలిపోయాయి. హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదావతి నది పొంగిపొర్లడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సీఎం చొరవతో సహాయక చర్యలు వేగవంతం అనంతపురంలో జిల్లాలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించడంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత ప్రజలకు అన్న పానీయాలు, నిత్యావసర వస్తువులు, మందులు అందజేస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మేయర్ వసీం, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు లోతట్టు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈస్ట్ మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ. సెంట్రల్, నార్త్, వెస్ట్ మండలాల్లో 29.6 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే, విజయవాడ రూరల్‌లో 25.2మి.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలో 9.2.మి.మీ. సగటు వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా బంటుమిల్లిలో 27.2మి.మీ, అత్యల్పంగా ఉయ్యూరులో 1.8మి.మీ కురిసింది. అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. కుందుర్పిలో 60.2 మి.మీ., ఆత్మకూరులో 50.2 మి.మీ మేర భారీ వర్షం కురిసింది. కంబదూరు 37 మి.మీ, కూడేరు 32.2 మి.మీ, రాప్తాడు 20.2 మి.మీ. వర్షం కురిసింది. శ్రీశైలానికి పెరుగుతున్న వరద మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి లక్షా 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,28,106 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. రెండు గేట్లను 10 అడుగుల మేర తెరచి 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. అలాగే, సాగర్ జలాశయం నుంచి 10 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 80,690 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. -
10 రోజులు ఏపీ వ్యాప్తంగా అనూహ్య వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా అన్ని ప్రాంతాల్లోను పడుతుండడం ప్రత్యేకంగా చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నా గతంలో అది కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి అన్ని జిల్లాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధికం ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 10 రోజుల్లో 82.3 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ 99.99 మిల్లీమీటర్ల వర్షం పడింది. 8 జిల్లాల్లో 50 నుంచి 90 శాతం అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధిక వర్షం పడింది. అక్కడ 84.9 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 161.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో 70 శాతం, విజయనగరం జిల్లాలో 62.2 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61.2, ఏలూరు జిల్లాలో 66.4, కృష్ణాలో 51, గుంటూరు జిల్లాలో 64.5, పల్నాడు జిల్లాలో 50.4 శాతం అధిక వర్షం కురిసింది. ఒక్క నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షం పడింది. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లు కళకళ భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లలోకి బాగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. గోదావరి బేసిన్లో లక్ష్మి, సమ్మక్క బ్యారేజీల నుంచి దిగువకు భారీగా నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో తుంగభద్ర, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీ నిండిపోవడంతో 10 రోజులుగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా బేసిన్లో గండికోట, మైలవరం, సోమశిల రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో నీటిని కిందకు వదులుతున్నారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. నైరుతి మురిసింది.. ఈ నైరుతి సీజన్లో రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 657 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 683.1 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 41.3 శాతం అధిక వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 36.6, బాపట్ల జిల్లాలో 30.6 మిల్లీమీటర్ల అధిక వర్షం పడింది. మిగిలిన అన్ని జిల్లాల్లోను సాధారణ వర్షపాతం నమోదైంది. -
సిక్కోలు, ఉమ్మడి విశాఖలో కుంభవృష్టి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెం.మీ. వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 722 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షానికి శ్రీకాకుళం నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. సూర్యమహల్ వద్ద ముంపు అంచనా వేయలేకపోవడంతో ఓ కారు కల్వర్టులోకి దూసుకెళ్లిపోయింది. పెదపాడు చెరువు పొంగి ప్రవహించడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు మునిగిపోయేంత మేర నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై నీటిని కల్వర్టుల ద్వారా మళ్లించారు. ఇక నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన రైతు కొల్లి వనజనాభం (40) పొలంలో నీటిని మళ్లిస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. భారీ వర్షాలతో 13 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి విశాఖలోనూ కుండపోత.. మరోవైపు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కుంభవృష్టి కురిసింది. సోమవారం అర్థరాత్రి దాటాక మొదలైన వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. విశాఖ నగర శివారుల్లో పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. భీమునిపట్నంలో అత్యధికంగా 17.9 సెం.మీల వర్షపాతం రికార్డయింది. గోపాలపట్నంలో 12.1, విశాఖ రూరల్‌లో 10.8, గాజువాక 8.2, అనకాపల్లి జిల్లా పరవాడలో 6.3, అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 4.6 సెం.మీల చొప్పున వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. రుతుపవన ద్రోణితో భారీ వర్షాలు ఇక రుతుపవన ద్రోణి చురుగ్గా ఉండడం భారీ వర్షాలకు దోహదపడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు ఒక్క విశాఖ జిల్లా మాత్రమే లోటులో ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు ఈ జిల్లా వర్షపాతం సాధారణం కంటే 20.9 శాతం లోటులో ఉండేది. కానీ, ప్రస్తుత వర్షాలతో 3.9 శాతం అధిక వర్షపాతానికి చేరుకుంది. అంటే మూడ్రోజుల వ్యవధిలో దాదాపు 24 శాతం వర్షపాతం పెరిగినట్లయింది. -
తప్పిన వాయు‘గండం’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి ఒడిశాలోని భవానీపటా్ననికి 80 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 110 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు 210 కిలోమీటర్లు, కంకేర్కి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ సోమవారానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మళ్లీ మహోగ్రం.. పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టికి దిగువన తుంగభద్ర, వేదవతి, భీమా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,26,201 క్యూసెక్కులు చేరుతుండగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 12,500, హంద్రీ–నీవా ద్వారా 1,125, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,091 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్‌వే పది గేట్లను 15 అడుగుల మేర పైకి ఎత్తి 3,76,670 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు కుడిగట్టు కేంద్రంలో 15.201 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.761 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 589 అడుగుల్లో సాగర్ శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 4,23,819 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో 589 అడుగుల్లో 309.06 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 75.50 మీటర్లకుగానూ 73.46 మీటర్లకు చేరుకుంది. పులిచింతలలోకి 3,67,262 క్యూసెక్కులు చేరుతుండగా 169.55 అడుగుల్లో 37.73 టీఎంసీలను నిల్వ చేస్తూ 3,98,349 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వందేళ్లలో రికార్డు వరద.. పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి సానువుల్లో జన్మించి దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి లోయ గుండా ప్రవహించే వేదవతి (హగరి) వందేళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చింది. అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు(బీటీపీ)లోకి 62,085 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బీటీపీ చరిత్రలో ఇదే అత్యధిక వరద. బీటీపీ నుంచి దిగువకు వదిలేస్తున్న జలాలు తుంగభద్ర మీదుగా సుంకేశుల బ్యారేజ్‌లోకి, అక్కడి నుంచి శ్రీశైలంలోకి చేరుతున్నాయి. పెన్నా పరవళ్లు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెన్నా నది మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి 16,500 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటి నిల్వ ఇప్పటికే గరిష్ట స్థాయి 1.52 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి 21,030 క్యూసెక్కులు చేరుతున్నాయి. పీఏబీఆర్ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా నిర్మాణ లోపంతో గరిష్ట స్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. పీఏబీఆర్‌లో 5.78 టీఎంసీలను నిల్వ చేస్తూ 13,770 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్‌లోకి 15,329 క్యూసెక్కులు చేరుతున్నాయి. రిజర్వాయర్ నీటి నిల్వ గరిష్ట స్థాయి 4.96 టీఎంసీలకు చేరుకోవడంతో 16,125 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మిడ్ పెన్నార్ చరిత్రలో ఇదే అత్యధిక వరద. చాగల్లు రిజర్వాయర్‌లోకి 24,990 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలు కాగా 0.86 టీఎంసీలను నిల్వ చేసి 25 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. చాగల్లు చరిత్రలోనూ ఇదే గరిష్ట వరద. గండికోట ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ గరిష్టంగా 25.37 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మైలవరం రిజర్వాయర్‌లో 9.98 టీఎంసీలకుగానూ 5 టీఎంసీలను నిల్వ చేస్తూ 32 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు 78 టీఎంసీలకుగానూ ఇప్పటికే 72.14 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 11,893 క్యూసెక్కులు చేరుతుండగా కండలేరుకు కాలువ ద్వారా 8 వేలు, విద్యుదుత్పత్తి చేస్తూ 2,453 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కండలేరు రిజర్వాయర్‌లోకి 7,790 క్యూసెక్కులు చేరుతుండటంతో నిల్వ 47 టీఎంసీలకు చేరుకుంది. మరో 21 టీఎంసీలు చేరితే కండలేరు నిండిపోనుంది. సోమశిల రిజర్వాయర్‌కు దిగువన కొత్తగా నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 0.45 టీఎంసీలు, నెల్లూరు బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సోమశిలకు వరద ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనున్నారు. సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలోకి పెరిగే వరద ప్రవాహాన్ని బట్టి మిగులు జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు. నేడు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక! ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్‌లోకి 2,73,222 క్కూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 15,472 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,57,750 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి బ్యారేజ్‌లోకి శుక్రవారం ఉదయానికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేస్తున్నారు. -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. శనివారం నాటికి...
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారంనాటికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలకు చేరువలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి వెల్లడించింది. శుక్రవారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. శనివారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పిడుగులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2, 3 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ వార్నింగ్‌ను జారీ చేసింది. 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రజలు శిథిల భవనాలు/ఇళ్లలో ఉండవద్దని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెరువులు, కాలువలు, నదులు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది. -
ఏపీలో మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండడంతో అక్కడ వానలు ఎక్కువ పడుతున్నాయి. బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఈనెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి. ఇటు ద్రోణి, అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో ఉత్తరకోస్తాలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. కాగా మంగళవారం రాత్రి వరకు వెంకటగిరిలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు, సీతానగరం 8.8, బొబ్బిలి 8.3, సాలూరు 7.3, కొయ్యూరు 6.6, లింగసముద్రం 6.1, అమలాపురం 5.8, చోడవరం 5.2, గోకవరం 5.0, గుత్తి (అనంతపురం జిల్లా)లో 4.2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
Rain Alert: 9న అల్పపీడనం! రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈనెల 8 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే వీలుందని వివరించింది. అదే సమయంలో గంటకు 45 – 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమూ ఉందని పేర్కొంది. -
ఏపీ వాసులకు అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. పెద్దపప్పూరు, ధర్మవరాల్లో కుండపోత ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఐదురోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో 15 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ప్రధాన వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. పదుల సంఖ్యలో చెరువులు నిండి మరువ పారుతున్నాయి. వందలాది చెరువుల్లోకి వరదనీరు చేరుతోంది. చిత్రావతి, స్వర్ణముఖి, పెన్నా తదితర నదుల పరీవాహక ప్రాంతాలు వరదతో పోటెత్తాయి. దాదాపు ఆరులక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. -
శ్రీశైలంలోకి పెరిగిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల): కృష్ణా ప్రధానపాయపై నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన.. తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి మళ్లీ వరద పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,79,268 క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్టస్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.80 టీఎంసీలను నిల్వచేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688, కల్వకుర్తి ద్వారా 1,967 క్యూసెక్కులు తరలిస్తున్నారు. స్పిల్ వే ఏడుగేట్లను పదడుగులు ఎత్తి 1,96,525 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడిగట్టు కేంద్రం ద్వారా 30,924, ఎడమగట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,09,791 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 17,246 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. స్పిల్ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ 1,93,185 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.9 అడుగుల్లో 308.76 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. పులిచింతలలోకి 1,82,816 క్యూసెక్కులు చేరుతుండగా.. 169.79 అడుగుల్లో 38.04 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 1,69,871 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,60,937 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,687 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 1,45,250 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా బేసిన్లో ఎగువన మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ అంచనాల నేపథ్యంలో కృష్ణాలో వరద ఉధృతి మరో 3, 4 రోజులు ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
AP: మూడు రోజులు వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో వానలు తగ్గాయి. కొన్నిచోట్ల అరకొరగా కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి. తాజాగా ఉత్తర బంగాళాఖాతం మీదుగా వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. మరోవైపు ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా బీకే సముద్రం మండలం రేకులకుంటలో అత్యధికంగా 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.