సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతం ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తీవ్రరూపం దాల్చకపోయినా అల్పపీడనంగానే 4, 5 రోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారాయి.
ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు మండలం బోరంగులలో 5.3 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. అరకు లోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలలో 3 నుంచి 3.5 సెం.మీ. వర్షం పడింది.
వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268), విజయవాడ–బిట్రగుంట–విజయవాడ (07978/07977) రైళ్లు ఈ నెల 11 నుంచి 13 వరకు పూర్తిగా రద్దు చేశారు. కాకినాడ పోర్టు–విజయవాడ (17258) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరి, విజయవాడ వరకు నడుస్తుంది. విజయవాడ–కాకినాడ పోర్టు (17257) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు విజయవాడలో బయలుదేరి, రాజమండ్రి వరకు నడుస్తుంది.
భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 3077
కాకినాడ ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 0884 2368100
పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 9606363327
Comments
Please login to add a commentAdd a comment