తుంగభద్ర డ్యాం నుంచి 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యం
సాక్షి,అమరావతి/హొళగుంద/హొసపేటె/రాయచూర్ రూరల్: శ్రీశైలం ప్రాజెక్టు దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల డ్యామ్‌ల గేట్లు ఎత్తేసి.. దిగువకు వరదను విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టు గేట్లనూ ఎత్తేశారు. ఈ ప్రవాహానికి.. స్థానికంగా కురిసిన వర్షాల ప్రభావంవల్ల వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 39,351 క్యూసెక్కులు చేరుతున్నాయి. నిజానికి.. గతేడాది జూలై 11న ఎగువ నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ చేరగా.. ఈ ఏడాది రెండ్రోజులు ఆలస్యంగా చేరుకుంది. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా, తుంగభద్ర, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి.
మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు.. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లను కర్ణాటక సర్కార్ మంగళవారం ఎత్తేసింది. అలాగే, తుంగభద్ర డ్యామ్‌లోకి సైతం భారీఎత్తున 1,27,188 క్యూసెక్కుల నీరు చేరుతుండటం.. నీటినిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో 20 గేట్లనూ ఎత్తేశారు. డ్యాం చరిత్రలో 1971 తర్వాత ఈ స్థాయిలో జలాశయానికి జూలై నెలలో వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరద ప్రవాహం బుధవారం శ్రీశైలానికి చేరుకోనుంది.
నాగార్జునసాగర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంవల్ల మూసీ, వైరా వంటి ఉప నదుల నుంచి పులిచింతలలోకి 11,548 క్యూసెక్కులు చేరుతోంది. అలాగే, పులిచింతలకు దిగువన పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలవల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి 45,985 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4,800 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 41,185 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment