thungabhadra dam
-
తుంగభద్ర మూడు రాష్ట్రాల ప్రాజెక్ట్.. ఎల్లో మీడియాకు అంబటి కౌంటర్
సాక్షి, గుంటూరు: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తుంగభద్ర మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, అంబటి రాంబాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. తుంగభద్ర మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారు. గేటు కొట్టుకుపోవడం వల్ల అనంతపురం జిల్లాకు వరద ముంపు ఉంది.ఇక, ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారు. కాపర్ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నాడు సూపర్ సిక్స్ అన్నారు.. ఇప్పుడేమో భయం వేస్తోందంటున్నారు. రెండున్నర నెలలకే కూటమి సర్కార్ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇప్పటికైనా చెప్పిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
అప్పర్ భద్రపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకునేందుకు కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుపై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు పనులను తక్షణమే నిలుపుదల చేసేలా కర్ణాటకను ఆదేశించి, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు పరిరక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయనుంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్, కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు కృష్ణా డెల్టాలో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని నివేదించనుంది. తమ అభ్యంతరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అప్పర్ భద్రకు కల్పించిన జాతీయ హోదాను, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇచ్చిన సాంకేతిక అనుమతులను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించనుంది. హక్కులు తాకట్టు పెట్టిన చంద్రబాబు తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) స్పష్టం చేయగా.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చింది. ► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగాను దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్లలో మిగిలిన 6 టీఎంసీలు.. వెరసి 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోగా) తరలించేలా అప్పర్ భద్రను 2015లో కర్ణాటక చేపట్టింది. ► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి చిక్‌మంగుళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్లకు (5,57,259 ఎకరాలు) నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని కర్ణాటక పేర్కొంది. ► నీటి కేటాయింపులు లేని అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ నోరు మెదపకుండా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కల్పించింది. ఫలితంగా 2019 మార్చి నాటికే రూ.4,830 కోట్లను వ్యయం చేసి, అప్పర్ తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్ భద్ర ద్వారా 2019–20లో 3.44, 2020–21లో 6.61, 2021–22లో 6.82 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్‌కు తరలించింది. నీటి కేటాయింపులే లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా! ► అప్పర్ భద్రకు జాతీయ హోదా సాధించడం ద్వారా కేంద్ర నిధులను రాబట్టేందుకు సిద్ధమైన కర్ణాటక సర్కార్ సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి, కేంద్ర జల్ శక్తి శాఖ నుంచి పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ► బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండానే 2020 డిసెంబర్ 24న అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. ► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సైతం అమల్లోకి రాలేదని, ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే న్యాయ ఉల్లంఘనకు పాల్పడటమేనని స్పష్టం చేస్తూ సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయగా అభ్యంతరాలను తోసిపుచ్చింది. ► ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్ భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021 మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ► దుర్భిక్ష ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీళ్లందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. ► ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలంటే బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు అంగీకరించాలని కేంద్రమే మార్గదర్శకాలు రూపొందించింది. అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021 నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ► నీటి కేటాయింపులే లేకుండా జాతీయ హోదా ఇవ్వడం సరికాదన్న తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ 2022 ఫిబ్రవరి 15న అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. ఈ క్రమంలో 2023–24 బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయించింది. తెలుగు రాష్ట్రాలకు తిప్పలే.. కర్ణాటక సర్కార్ ఇప్పటికే కేటాయించిన నీటి కంటే అధికంగా తుంగభద్ర జలాలను వాడుకుంటోంది. ఇక అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంలో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టు, కేసీ కెనాల్, ఏపీ–తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాపై కూడా ప్రభావం పడుతుంది. కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 36 టీఎంసీలు కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనను బచావత్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా 9 టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించింది. కానీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని, నాలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సెల్పీ దాఖలు చేసింది. దీంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల నీటి మిగులు లేదు. కే–8, కే–9 బేసిన్లలో కర్ణాటక అధికంగా నీటిని వాడుకుంటున్న నేపథ్యంలో నీటి మిగులు లేదు. నీటి కేటాయింపులు లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జల వనరుల శాఖ తక్షణమే నిలిపివేయాలి.. అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించేందుకు తాను జారీ చేసిన మార్గదర్శకాలను జల్ శక్తి శాఖే ఉల్లంఘించింది. నీటి కేటాయింపులు లేకుండా, బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రను తక్షణమే నిలుపుదల చేయడంతోపాటు సాంకేతిక అనుమతి, జాతీయ హోదాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేస్తాం. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ -
కృష్ణమ్మ పరుగులు
సాక్షి,అమరావతి/హొళగుంద/హొసపేటె/రాయచూర్ రూరల్: శ్రీశైలం ప్రాజెక్టు దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల డ్యామ్‌ల గేట్లు ఎత్తేసి.. దిగువకు వరదను విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టు గేట్లనూ ఎత్తేశారు. ఈ ప్రవాహానికి.. స్థానికంగా కురిసిన వర్షాల ప్రభావంవల్ల వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 39,351 క్యూసెక్కులు చేరుతున్నాయి. నిజానికి.. గతేడాది జూలై 11న ఎగువ నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ చేరగా.. ఈ ఏడాది రెండ్రోజులు ఆలస్యంగా చేరుకుంది. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా, తుంగభద్ర, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి. మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు.. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లను కర్ణాటక సర్కార్ మంగళవారం ఎత్తేసింది. అలాగే, తుంగభద్ర డ్యామ్‌లోకి సైతం భారీఎత్తున 1,27,188 క్యూసెక్కుల నీరు చేరుతుండటం.. నీటినిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో 20 గేట్లనూ ఎత్తేశారు. డ్యాం చరిత్రలో 1971 తర్వాత ఈ స్థాయిలో జలాశయానికి జూలై నెలలో వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరద ప్రవాహం బుధవారం శ్రీశైలానికి చేరుకోనుంది. నాగార్జునసాగర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంవల్ల మూసీ, వైరా వంటి ఉప నదుల నుంచి పులిచింతలలోకి 11,548 క్యూసెక్కులు చేరుతోంది. అలాగే, పులిచింతలకు దిగువన పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలవల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి 45,985 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4,800 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 41,185 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
సమాంతర కాలువతోనే ప్రయోజనం
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 30 నుంచి 50 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక ప్రతిపాదించిన నవలి రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించే ప్రశ్నేలేదని ఏపీ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు మరోసారి తేల్చిచెప్పింది. హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కి సమాంతరంగా రోజుకు 2 టీఎంసీలు తరలించేలా కాలువ తవ్వి.. వరద రోజుల్లో నీటిని తరలిస్తే.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వచేసిన నీటితో మిగతా ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని సూచించింది. సమాంతర కాలువతో ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణకూ ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీంతో.. సమాంతర కాలువ, నవలి రిజర్వాయర్‌పై సమగ్ర అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుందామని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే చెప్పారు. ఈయన అధ్యక్షతన గురువారం తుంగభద్ర బోర్డు సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున ఈఎన్సీ మురళీధర్, కర్ణాటక తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి కృష్ణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నవలితో ప్రయోజనాలకు విఘాతం తుంగభద్ర డ్యామ్‌లో పూడిక పేరుకుపోయిన నేపథ్యంలో నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు తగ్గిందని.. దాంతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీలను వాడుకోలేకపోతున్నామని కర్ణాటక అధికారులు చెప్పారు. నీటినిల్వ సామర్థ్యం తగ్గిన మేరకు నవలి వద్ద కొత్త రిజర్వాయర్‌ను నిర్మించి.. నిల్వ చేద్దామని.. దీనివల్ల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చునని ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికయ్యే రూ.పది వేల కోట్ల వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా మూడు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలని కోరారు. దీనిపై ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నవలి రిజర్వాయర్వల్ల తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. నవలికి బదులుగా హెచ్చెల్సీకి సమాంతర కాలువ తవ్వడానికి అనుమతివ్వాలని నారాయణరెడ్డి కోరారు. డిస్ట్రిబ్యూటరీల ద్వారానే తాగునీరు హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ప్రధాన కాలువలపై తాగునీటి పథకాలను ఏర్పాటుచేయడానికి అనుమతివ్వాలని కర్ణాటక అధికారులు చేసిన ప్రతిపాదనపై ఏపీ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందన్నారు. డిస్ట్రిబ్యూటరీలపై తాగునీటి పథకాలు ఏర్పాటుచేసుకుని.. వాడుకున్న నీటిని కర్ణాటక కోటాలో కలపాలని సూచించారు. ఇందుకు తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే సానుకూలంగా స్పందించారు. మరోవైపు.. తుంగభద్ర బోర్డు నిర్వహణ వ్యయాన్ని భరించకుండా.. సిబ్బందిని సమకూర్చని తెలంగాణకు బోర్డులో ఎలా సభ్యత్వం ఇస్తారని నారాయణరెడ్డి బోర్డు చైర్మన్‌ను నిలదీశారు. నిర్వహణ వ్యయం, సిబ్బందిని సమకూర్చడంపై తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. ఇక హోస్పేట్ పరిసరాల్లో బోర్డుకు చెందిన 70 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని కర్ణాటక అధికారులు కోరడంపై ఏపీ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. బోర్డు భూములు మూడు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులని.. వాటిని కర్ణాటకకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై బోర్డు చైర్మన్ రాయ్‌పురే స్పందిస్తూ.. ఉమ్మడి ఆస్తులను ఏ రాష్ట్రానికీ ఇచ్చే ప్రశ్నేలేదని స్పష్టంచేశారు. -
నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా.. 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకోవడానికి కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వడంలో, జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర జల్ శక్తి శాఖ వ్యవహరించిన తీరును దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో లేవనెత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని వివరించనున్నాయి. రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే అనుమతి తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే తేల్చింది. కానీ.. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగానూ దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్లలో మిగిలిన 6 టీఎంసీలు వెరసి.. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక ప్రతిపాదించింది. అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలి. కానీ.. ఈ రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్ 24న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికకీరణ వల్ల నీళ్లు మిగల్లేదని.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇస్తారని ఏపీ, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. అప్పర్ భద్రను 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనపై ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులే.. అప్పర్ భద్ర పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టుతోపాటు కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. -
కేంద్ర జలసంఘం తీరుపై నీటిపారుదల రంగ నిపుణుల విస్మయం
సాక్షి, అమరావతి: తుంగభద్రలో 29.90 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకునేలా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు హైడ్రలాజికల్, టెక్నికల్ (సాంకేతిక) అనుమతివ్వడంలో సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వ్యవహరించిన తీరును నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతివ్వడంపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ‘బచావత్ ట్రిబ్యునల్’ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయింపుల ఆధారంగానే అప్పర్ భద్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సీడబ్ల్యూసీ సమర్థించుకోవడాన్ని చూసి నివ్వెరపోతున్నారు. తుంగభద్రలో నీటి లభ్యతలేదని చెబుతూ అప్పర్ భద్రకు అనుమతిచ్చేందుకు బచావత్ ట్రిబ్యునల్ నిరాకరించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్–9 (బీ) ప్రకారం.. తుంగభద్రలో 295 టీఎంసీలకు మించి వాడుకోకూడదని నియంత్రణ పెట్టినా.. కర్ణాటక 1980–81 నాటికే ఏటా 319.558 టీఎంసీలను వాడుకుందని.. ఆ తర్వాత నీటి వినియోగం మరింత పెరిగిందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టంచేయడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల ఉత్తర్వులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టాన్ని పాటించాల్సిన సీడబ్ల్యూసీనే.. ఆ చట్టాన్ని తుంగలో తొక్కడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కార్లు నిర్ణయించాయి. అప్పర్ భద్రకు ఇచ్చిన హైడ్రాలాజికల్, టెక్నికల్ అనుమతులను పునఃసమీక్షించి.. దిగువ పరీవాహక రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేయనున్నాయి. తప్పును సమర్థించుకునేందుకు మరో తప్పు 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్ భద్రకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పది టీఎంసీలను మాత్రమే కేటాయించింది. కానీ, ఈ తీర్పును కేంద్రం ఇప్పటికీ అమలుచేయలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమల్లో ఉంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం అమలుచేసే వరకూ.. కృష్ణా బేసిన్ (పరీవాహక ప్రాంతం)లో ఏ ప్రాజెక్టును చేపట్టినా దానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కేటాయింపుల ఆధారంగానే సీడబ్ల్యూసీ అనుమతివ్వాల్సి ఉంటుంది. ‘కృష్ణా’.. అంతర్రాష్ట్ర నది అయిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ ఏ ప్రాజెక్టుకు అనుమతివ్వాలన్నా బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, కర్ణాటక సర్కార్ తుంగభద్రలో 29.90 టీఎంసీలను వాడుకోవడానికి చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చే సమయంలో నిబంధనలను తుంగలో తొక్కింది. ఇదే తప్పును ఏపీ సర్కార్ ఇటీవల ఎత్తిచూపుతూ.. అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతిని పునఃసమీక్షించాలని కోరింది. ఈ అనుమతిని సమర్థించుకునే క్రమంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే ఇచ్చామని తప్పులో కాలేసింది. బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు అనుమతిని నిరాకరించడాన్ని సీడబ్ల్యూసీ విస్మరించడంపై నీటిపారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. తీర్పు అమల్లోకి రాకముందే అదనపు వినియోగానికి ఓకే అప్పర్ భద్ర ద్వారా తరలించే 29.90 టీఎంసీల్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన పది టీఎంసీలు కూడా ఉన్నాయని డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లో కర్ణాటక స్పష్టంచేసింది. కానీ, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలుపై కేంద్రం ఇంకా ఉత్తర్వులు జారీచేయలేదు. అయినా ఆ ట్రిబ్యునల్ కేటాయించిన పది టీఎంసీలను వాడుకోవడానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు చట్టవిరుద్ధమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్రలో కేటాయించిన నీటి కంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. అప్పర్ భద్ర పూర్తయితే.. ఆ వినియోగం మరింత పెరుగుతుందని.. ఇది తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్ (కర్నూల్–కడప కాలువ), ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీలపై ఆధారపడ్డ ఆయకట్టుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. -
శ్రీశైలం @ 150 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది, దాని ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగానే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదులుతున్నారు. దాంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 871.8 అడుగుల నీటిమట్టంతో నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 65 టీఎంసీల నీరు అవసరం. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 25,427 క్యూసెక్కులను విడుదల చేస్తోంది. ఆ జలాలు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇక్కడ కూడా విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని తెలంగాణ దిగువకు వదులుతోంది. ఇక తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దాంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. కృష్ణా వరదకు, తుంగభద్ర ప్రవాహం తోడవుతున్న నేపథ్యంలో మంగళవారం శ్రీశైలంలోకి వరద ఉధృతి పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్రంలో 43,870 చెరువులకు గాను 23,400 చెరువులు నిండాయి. -
అనూహ్యం తుంగభద్రలో 4.94 టీఎంసీల పెరుగుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలుగా తేలింది. 2008లో ఇది 100.85 టీఎంసీలు కాగా.. గడచిన పుష్కర కాలంలో వరద ప్రవాహం వల్ల డ్యామ్‌లో పూడిక తొలగడంతో నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగింది. తుంగభద్ర బోర్డు ఇటీవల డ్యామ్‌లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు చేయించిన టోపోగ్రాఫిక్ (స్థలాకృతి), బ్యాథిమెట్రిక్ (నీటి లోతు) సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ దృష్ట్యా వచ్చే బోర్డు సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని ఖరారు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా నీటి నిల్వ సామర్థ్యం మేరకు.. మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేయాలని తుంగభద్ర బోర్డును ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరింది. తొలినాళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు 1944లో బ్రిటిష్ సర్కార్ పాలనలో మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కర్ణాటకలో హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ నిర్మాణం చేపట్టారు. 1953 నాటికి నిర్మాణం పూర్తికాగా.. అప్పట్లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ పూర్తి సామర్థ్యం132.47 టీఎంసీలని తేలింది. డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), తెలంగాణకు 6.51 చొప్పున మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేస్తూ వస్తోంది. ఏటా 0.57 టీఎంసీల తగ్గుదల ఏటా ప్రవాహంతో కలిసి డ్యామ్‌లోకి మట్టి చేరుతూ వస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు డ్యామ్‌లో నీటి నిల్వ ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు తొలిసారిగా 1963లో తుంగభద్ర బోర్డు సర్వే చేయించింది. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని అప్పట్లో బోర్డు తేల్చింది. పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నదిలో వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని గుర్తించిన బోర్డు నీరు లభించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే 1953 నుంచి 2008 వరకూ 55 ఏళ్లలో 21.62 టీఎంసీల మేర తగ్గింది. 1953 నుంచి 2008 వరకూ వివిధ సందర్భాల్లో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏటా 0.57 టీఎంసీల మేర తగ్గుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలావుంటే.. 2008 తర్వాత వివిధ సందర్భాల్లో డ్యామ్‌కు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరగా.. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేశారు. ఆ వరద ప్రవాహంలో డ్యామ్‌లోని పూడిక కొంతమేర తొలగిపోయినట్టు తాజా సర్వేల్లో వెల్లడైంది. దాంతో నీటి నిల్వ సామర్థ్యం 2008లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజాగా 4.94 టీఎంసీల మేర పెరిగినట్టు తేలింది. వచ్చే సమావేశంలో మూడు రాష్ట్రాల అధికారులతో తుంగభద్ర బోర్డు చర్చించి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించనుంది. -
వారంలో శ్రీశైలానికి కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/హొసపేటె: ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి కృష్ణా వరద జలాలు జూరాల, శ్రీశైలానికి మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉందని అధికాలు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 73,791 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 92.45 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి నిండాలంటే ఇంకా 37 టీఎంసీలు అవసరం. శనివారం నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఆల్మట్టిలోకి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలే అవకాశంఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శనివారం నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం ► ఆల్మట్టికి దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 27,756 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 29.86 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే మరో 8 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి నుంచి భారీ వరదను విడుదల చేయనున్న నేపథ్యంలో ఒకే రోజులో నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ గేట్లను బుధవారంలోగా ఎత్తే అవకాశం ఉంది. ► కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం పెరిగింది. తుంగభద్ర జలాశయంలోకి 34,374 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.25 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం. ► తుంగభద్ర జలాశయానికి దిగువన కురిసిన వర్షాలకు సుంకేశుల బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయగా మిగిలిన నీటిని దిగువకు వదులుతున్నారు. ► నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,23,122 క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7,900 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 1,15,222 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. జూన్ 1 నుంచి శనివారం వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 52.885 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ► గొట్టా బ్యారేజీలోకి వంశధార ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 5,474 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 5,180 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి శనివారం వరకు గొట్టా బ్యారేజీ నుంచి 7.477 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ► నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,808 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 980 క్యూసెక్కులను వదలి మిగిలిన 1828 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఐదు గేట్లు ఎత్తివేత సముద్రంలోకి 3,625 క్యూసెక్కుల నీరు విడుదల కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండటంతో శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మున్నేరు, కట్టలేరు, వైరా నుంచి కృష్ణా నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంచి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయించగా.. సాయంత్రం 4 గంటలకు కీసర నుంచి 11,725 క్యూసెక్కుల నీరు వచ్చిందని డ్యామ్ కన్జర్వేషన్ ఈఈ రాజా స్వరూప్‌కుమార్ తెలిపారు. దీంతో 3,625 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టినట్టు చెప్పారు. -
కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి /బళ్లారి: తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాల వినియోగం లెక్కలు చెప్పకుండా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) అందజేయకుండా ‘నవలి’ జలాశయం నిర్మాణానికి ఆమోదం తెలపాలంటూ కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తోసిపుచ్చాయి. జలాశయంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిందంటూ కర్ణాటక చెబుతున్న లెక్కలు తప్పని తుంగభద్ర బోర్డు నిర్వహించిన పరిశోధనలోనే వెల్లడైందని, తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా బోర్డు తేల్చిందని ఏపీ పేర్కొంది. టీబీ ఎల్లెల్సీ (దిగువ కాలువ)లో 30 కి.మీ.ల పైపులైన్ నిర్మిస్తే జలచౌర్యం జరగకుండా కర్నూలు జిల్లాకు సమర్థంగా నీటిని తరలించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించగా పూర్తి వివరాలు అందజేస్తే పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని కర్ణాటక పేర్కొంది. తుంగభద్ర జలాశయం జల విస్తరణ ప్రాంతంలో ఎత్తిపోతల ద్వారా ఐదు టీఎంసీలను వినియోగిస్తున్నారని, దీన్ని కర్ణాటక కోటాలో లెక్కించాలన్న ప్రతిపాదనకు బోర్డు సానుకూలంగా స్పందించింది. ఎత్తిపోతల పథకాల ద్వారా కర్ణాటక వినియోగిస్తున్న జలాలను ఆ రాష్ట్రం ఖాతాలోనే పరిగణిస్తామని స్పష్టం చేసింది. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలని మూడు రాష్ట్రాలు నిర్ణయించాయి. చైర్మన్ డి.రంగారెడ్డి నేతృత్వంలో తుంగభద్ర బోర్డు శనివారం బెంగళూరులోని వికాససౌధలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈఎన్సీలు ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్, రాకేష్సింగ్లు ఇందులో పాల్గొన్నారు. నీటి లెక్కలతోపాటు డీపీఆర్ అందచేయాలన్న బోర్డు తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయానికి ఎగువన కొప్పళ జిల్లా ‘నవలి’ వద్ద 31.15 టీఎంసీలతో ఒక జలాశయం, మరో రెండు చెరువులను జలాశయాలుగా మార్చడం ద్వారా మొత్తం 50 టీఎంసీలను నిల్వ చేస్తే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవచ్చునంటూ కర్ణాటక ప్రతిపాదించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాలను కర్ణాటక సర్కార్ భారీగా వినియోగిస్తోందన్నారు. ఆ లెక్కలు చెప్పకుండా, నవలి జలాశయం డీపీఆర్ అందజేయకుండా ఈ ప్రతిపాదనపై చర్చించలేమని తేల్చి చెప్పారు. వచ్చే సమావేశం నాటికి తుంగభద్ర జలాశయానికి ఎగువన వినియోగిస్తున్న నీటి లెక్కలతోపాటు నవలి డీపీఆర్‌ను అందజేయాలని టీబీ బోర్డు కర్ణాటక సర్కార్‌కు సూచించింది. మూడు రాష్ట్రాలు, సీడబ్ల్యూసీ ఆమోదం లేకుండా నవలి జలాశయం నిర్మాణానికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని బోర్డు చైర్మన్ రంగారెడ్డి తేల్చి చెప్పారు. తుంగభద్ర హెచ్చెల్సీ(ఎగువ కాలువ)కి సమాంతరంగా వరద కాలువను తవ్వితే అటు కర్ణాటకలో బళ్లారి.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలను తరలించవచ్చని, దుర్భిక్ష ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనను కర్ణాటక తోసిపుచ్చింది. బోర్డు లెక్క పరిగణనలోకి.. తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిపోయిందని కర్ణాటక వాదిస్తోంది. కానీ ఇటీవల బోర్డు చేసిన పరిశోధనలో నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలని తేలింది. ఆ లెక్కలనే పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. దీనిపై కర్ణాటక జలవనరుల అధికారి రాకేష్‌సింగ్ స్పందిస్తూ బోర్డు లెక్కలపై అధ్యయనం చేశాక తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. తుంగభద్ర ఎల్లెల్సీ ద్వారా కర్నూలు జిల్లాకు సక్రమంగా నీళ్లు రావడం లేదని, మధ్యలో చౌర్యం జరుగుతోందని, దీన్ని నివారించడానికి 30 కి.మీ.ల మేర పైపులైన్‌కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ బోర్డును కోరింది. దీనిపై కర్ణాటక జలవనరుల శాఖ అధికారి రాకేష్ సింగ్ స్పందిస్తూ పైపులైన్‌కు ఎంత భూమి అవసరం? దీనివల్ల కేటాయించిన మేరకు నీటిని తరలించడం సాధ్యమవుతుందా? అనే వివరాలను ఆంధ్రప్రదేశ్ అందజేస్తే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలన్న బోర్డు ప్రతిపాదనకు మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. -
ప్రతి ఏడాది అన్యాయమే..!
సాక్షి, పులివెందుల రూరల్ : పులివెందుల ప్రాంత రైతులకు ప్రాణాధారమైన పులివెందుల బ్రాంచ్ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి రావాల్సిన 4.4 టీఎంసీల నీటి విడుదల విషయంలో ఈసారి కూడా రైతులకు నిరాశ మిగిలింది. కర్ణాటకలోని తుంగభద్ర నది నుంచి పులివెందుల ప్రాంతంలో ఉన్న సీబీఆర్‌కు ప్రతి ఏడాది 4.4 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రతి సంవత్సరం హెచ్ఎల్సీ అధికారులు అరకొరగా నీటిని విడుదల చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయలేదు. ఈ ఏడాది 4.4 టీఎంసీలకుగానూ.. 3.172 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. ఆ నీరు ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గత ఏడాదిలో కర్ణాటకలో బాగా వర్షాలు పడి తుంగభద్ర డ్యాంకు వరద నీటితో కళకళలాడింది. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నా అధికారులు పులివెందుల ప్రాంత రైతులపై పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి కేటాయిపుల్లో అన్యాయం.. ప్రతి ఏడాది సీబీఆర్‌కు నీటి కేటాయింపులలో అన్యాయం జరుగుతూనే ఉంది. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు పండక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రబీలో సాగు చేసిన ధనియాలు, జొన్న, బుడ్డశనగ, వేరుశనగ పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది ఆగస్టులో అనంతపురంలో జరిగిన సాగునీటి సలహా కమిటీ ఇరిగేషన్ అడ్వయిజరీ సమావేశంలో పీబీసీకి 3.172 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్మానం చేశారు. కానీ ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు. పీబీసీ కింద 50 వేల ఆయకట్టు.. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా పీబీసీ కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పీబీసీకి 35ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఒక్కసారి (2014–15)మాత్రమే పూర్తి నీటిని విడుదల చేశారు. సీబీఆర్ నీటి కేటాయింపులో ప్రతి ఏడాది తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీ కాలువ ద్వారా మిడ్ పెన్నార్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసి అక్కడ నుంచి సీబీఆర్‌కు నీటిని విడుదల చేస్తారు. సీబీఆర్ ద్వారా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టుకు పైపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదైనా సీబీఆర్‌కు రావాల్సిన 4.4టీఎంసీల నీటిని వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు పేర్కొంటున్నారు. సీబీఆర్‌కు విడుదలైన నీటి కేటాయింపులు.. -
చంద్రబాబుకు అవినాష్ రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్సార్ కడప జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాంలో ఉన్న నికర జలాలను చిత్రావతి జలాశయానికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాం నుంచి నికర జలాలను తరలిస్తే పులివెందుల బ్రాంచ్ కెనాల్, లింగాల కుడి కాల్వకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. కృష్ణా నది వరద జలాలను నమ్ముకుని తుంగభద్ర నికర జలాల హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. తుంగభద్ర నుంచే పులివెందుల, ధర్మవరం వంటి పట్టణాలకు 2 టీఎంసీల తాగునీరు ఇవ్వాలి. అవి పోను సాగు నీటికి ఏమి మిగలదన్నారు. తుంగభద్ర నికర జలాల హక్కులను ఎలా వదులుకోమంటారని ప్రశ్నించారు. చిత్రావతి కింద దుస్థితి చేసే దివంగత నేత వైఎస్సార్ ఆ ప్రాజెక్టును పూర్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. మా నికర జలాలను కొల్లగొట్టే ప్రయత్నాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. -
‘తుంగభద్ర’కు పోటెత్తిన వరద
- 31,303 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - 67.750 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ హొసపేటె(కర్ణాటక): తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగుంబె, శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, మంగళూరు, భద్రావతి తదితర చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతోంది. శుక్రవారం సుమారు 31,303 క్యూసెక్కుల మేర డ్యాంలోకి నీరు చేరింది. వర్షాభావం నేపథ్యంలో డ్యాం చరిత్రలోనే ఈ ఏడాది జలాశయంలో అతి తక్కువ నీరు నిల్వ ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో నాలుగైదు రోజులుగా ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే పదిరోజుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని నీటిమట్టం 1623.33 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 67.750 టీఎంసీలకు చేరింది. వివిధ కాలువలకు 2264 క్యూసెక్కుల వరకు మండలి అ«ధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటిమట్టం 1617.06 అడుగులు, నీటి నిల్వ 50.630 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 3800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 10866 క్యూసెక్కులుగా ఉండేదని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. -
ఆశలు గల్లంతు
– ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు – బీళ్లుగా మారనున్న లక్షలాది ఎకరాల ఆయకట్టు – తాగునీటి పథకాలకూ పొంచి ఉన్న ప్రమాదం – వందలాది గ్రామాలకు తప్పని దాహార్తి హెచ్చెల్సీ ఆయకట్టు : 2.84 లక్షల ఎకరాలు ఆధారపడిన గ్రామాలు : 2,068 ఆధారపడిన జిల్లాలు : అనంతపురం, వైఎస్సార్‌జిల్లా, కర్నూలు జిల్లాలో రిజర్వాయర్లలో ఉన్న నీళ్లు: పీఏబీఆర్‌లో– 1.45 టీఎంసీలు మిడ్‌పెన్నార్‌లో– 0.173 టీఎంసీ చిత్రావతిలో – 0.172 రిజర్వాయర్లపై ఆధారపడి తాగునీటి పథకాలు : సత్యసాయి తాగునీటి పథకాలు, మరో ఆరు ప్రభుత్వ పథకాలు తుంగభద్ర జలాశయంపై అనంత వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని ఆదివారం బెంగుళూరులో తుంగభద్ర బోర్డు నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశంలో నిర్ణయించారు. దీంతో అనంతకు సాగు, తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చనున్నాయి. - అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయంపై జిల్లాలో లక్షలాది ఎకరాల ఆయకట్టు, వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా ఆధారపడి ఉంది. ఇప్పటికే హై లెవల్ మెయిన్ కెనాల్(హెచ్‌ఎల్‌ఎంసీ) కింద దాదాపు 40 వేల ఎకరాలకు సరిపడ వరినార్లు పోసుకుని రైతులు సిద్ధ౾ంగా ఉన్నారు. అయితే ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు నీటిపారుదల సలహా సమితి ప్రకటించడంతో ప్రస్తుతం నార్లు పోసుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సాగునీరు లేక రెండేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులు ఈసారైనా పంటలు సాగు చేసుకుందామని ఎంతో ఆశతో ఉన్నారు. ఈ మేరకు వేలాది ఎకరాలు దుక్కులు చేసుకుని సాగు సిద్ధం ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో తుంగభద్రకు నీళ్లు రావడం లేదని నీటి విడుదలను బోర్డు అధికారులు వాయిదా వేశారు. దీంతో వందలాది మంది రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి. ఒట్టిపోనున్న తాగునీటి పథకాలు జిల్లాలో 70 నుంచి 80శాతం గ్రామాలకు పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లపై ఏర్పాటు చేసిన తాగునీటి పథకాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. పీఏబీఆర్‌లో మరో 20 రోజుల వరకూ నీటి కొరత ఏర్పడకపోయినా... చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మాత్రం మరో వారం రోజులకు సరిపడా కూడా నీళ్లు లేవు. ఈ రిజర్వాయర్ ద్వారా ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి తాగునీటి పథకాలు ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాలో పులివెందుల మున్సిపాలిటీకి, యురేనియం ఫ్యాక్టరీకి ఇక్కడి నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నారు. అయితే వారం రోజుల తర్వాత రిజర్వాయర్‌లో చుక్క నీరు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మన జిల్లాలోనే వేలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. అధికారపార్టీ నేతల విఫలం జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నంద్యాల ఉప ఎన్నికపై చూపుతున్న శ్రద్ధ జిల్లా రైతాంగం సంక్షేమంపై చూపడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జిల్లా వాసులంతా వర్షాకాలంలోనూ తాగునీటి తిప్పలు పడుతున్నా వారికి పట్టడం లేదు. కనీసం తుంగభద్ర జలాశయం నుంచి తాగేందుకైనా నీళ్లు తెప్పిద్దామనే ధ్యాస ఎవరిలోనూ కనిపించడం లేదు. ముఖ్యంగా మంత్రి కాలవ శ్రీనివాసులు నియోజకవర్గంలో రైతులు ఆపారంగా నష్టపోతున్నా... ఆయన పట్టించుకునే స్థితిలో లేరు. ఆదివారం తుంగభద్రబోర్డు సమావేశం జరుగుతుందని తెలిసినా... ఎవరూ ఆ సమావేశం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఫలితంగా జలాశయంలో 48.433 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నా... తాగేందుకు కూడా విడుదల చేయకుండా వాయిదా వేశారు. దీని వల్ల అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కానుంది. పరిస్థితి జఠిలంగా ఉన్నా... బోర్డు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితిలో అధికారపార్టీ నాయకులు లేకపోవడం బాధాకరం. ఇబ్బందులు తప్పవు ఆగస్టు నెలాఖరు వరకూ హెచ్చెల్సీకి నీళ్లు విడుదల చేయకపోతే జిల్లా వాసులందరికీ ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చనుంది. పీఏబీఆర్‌లో సరిపడ నీళ్లున్నా... చిత్రావతిలో మాత్రం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాగునీటి పథకాలు నిలుపుదల చేసే ప్రమాదం ఉంది. అలాగే కర్ణాటకలోని ఆయకట్టుకు ముందుగా వదులకుంటే శాంతిభద్రతల సమస్య కూడా ఏర్పడే ప్రమాదముంది. ఎక్కువశాతం నీళ్లు వారే తీసుకుంటారు. అక్కడి రైతులను కట్టడి చేసే పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోతా. ఈనెల 22న ఐఏబీ సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. - టి.వి శేషగిరిరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్, హెచ్చెల్సీ -
క్రాప్ హాలిడే తప్పదా..?
- తుంగభ్రద డ్యామ్‌లో ఆశించిన స్థాయిలో లేనినీరు - హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటసాగు ప్రశ్నార్థకం - రైతులను జాగృత పరిచే దిశగా అధికారుల అడుగులు కణేకల్లు : హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర డ్యామ్‌లో నీటి పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆయకట్టుకు సాగునీరివ్వకూడదనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. దామాషా ప్రకారం హెచ్చెల్సీకి వచ్చే నీరు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించారు. డ్యామ్‌లో ఇప్పుడున్న నీటి పరిస్థితి దృష్ట్యా వరి కాదు కదా... ఆరుతడి పంటలకు కూడా నీరిచ్చే పరిస్థితిలో లేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. చూస్తుంటే హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది క్రాప్ హాలిడే తప్పదా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. 36 వేల ఆయకట్టు హెచ్చెల్సీ కింద కణేకల్లు, బొమ్మనహళ్, విడపనకల్లు మండలాల్లో 15 డిస్ట్రిబ్యూటరీలు, కణేకల్లు చెరువు కింద మొత్తం 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది తుంగభద్ర డ్యామ్ పరివాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా డ్యామ్‌లో నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. దీంతో దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 10.50 టీఎంసీల నీరు కేటాయించారు. ఈ నీళ్లు కూడా తాగునీటికే సరిపోయాయి. ఎప్పటిలాగే రైతులు ముందుగా వరినారు పోసుకొని నాట్లకు సిద్ధంగా ఉండటంతో సాగునీరివ్వకపోతే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో అడపదడప సాగునీరిచ్చి రైతులను గట్టెక్కించారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు సైతం సక్రమంగా ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. సాగునీరు డౌటే.. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో 40.955 టీఎంసీలతో 1612.83 అడుగుల నీరు నిల్వ ఉంది. టీబీ డ్యామ్‌కు ఇప్పుడున్న ఇన్‌ఫ్లో... నీటి నిల్వ, తగ్గుతున్న ఇన్‌ఫ్లో ఈ లెక్క ఆధారంగా టీబీ డ్యామ్‌లో నీటిమట్టం పెరిగే అవకాశం లేదని బోర్డు అధికారులు తేల్చి చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హెచ్చెల్సీకి 10 టీఎంసీలకు మించి నీరొచ్చే అవకాశం లేదు. ఈ నీళ్లను తాగునీటితో పాటు సాగుకు సర్దుబాటు చేయడం కుదరదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ క్రమంలో డ్యామ్ పరిస్థితి గురించి ఏమాత్రం లెక్క చేయకుండా వరినారు పోసుకొని పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులను జాగృతి చేయాలని హెచ్చెల్సీ అధికారులు నిర్ణయించారు. ఇన్‌ఫ్లో పెరిగితే చూద్దాం ఆయకట్టుకు ఒక్కసారిగా సాగునీరివ్వలేమని చెబితే రైతులు ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశముండటంతో తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే సాగుకు నీరిచ్చే విషయం ఆలోచిస్తామని చెప్పి ఆయకట్టు రైతులను నచ్చ చెప్పాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఇన్‌ఫ్లో ఆశించినంత లేదు కాబట్టి... ఇప్పడు సాగుకు నీరివ్వలేం. భవిష్యత్తులో ఇన్‌ఫ్లో పెరిగి నీటి లభ్యత పెరిగితే ఏ ఇబ్బంది లేకుండా నీరిస్తామని చెప్పాలని నిర్ణయించారు. నేడు సాగునీటి సంఘాల అధ్యక్షులతో భేటీ కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సాగునీటి సంఘాల అధ్యక్షులతో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు కబురు పెట్టినట్లు కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న తెలిపారు. టీబీ డ్యామ్‌లో నీటి పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో హెచ్చెల్సీ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. -
తుంగభద్ర జలాశయంలో 14.03 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్ : తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గురువారం నాటికి జలాశయంలో 14.03 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాకు తాగు , సాగు నీరు అవసరాలు తీరుస్తున్న తుంగభద్రకు ఈసారి అనుకున్నంతగా నీరు చేరలేదు. జలాశయంలో గత సంవత్సరం ఇదే సమయానికి 30.856 టీఎంసీలు నిల్వ ఉండగా... ప్రస్తుతం 14.034 టీంసీల నీరు మాత్రమే ఉండని అధికారులు తెలిపారు. -
విడతల వారీగా సాగునీరు
– పది రోజుల నిలుపుదల.. అనంతరం సరఫరా – నవంబర్ ఆఖరు వరకు ఇదే విధానంలో కాలువలకు నీరు – నేటి నుంచి నీటి విడుదల నిలుపుదల – తుంగభద్ర ఐసీసీ సమావేశంలో తీర్మానం సాక్షి, బళ్లారి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున నవంబర్ ఆఖరు వరకు కాలువలకు విడతల వారీగా నీరు విడుదల చేయాలని తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం బెంగళూరులోని వికాససౌధలో బళ్లారి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్‌లాడ్ అ«ధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 41 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నందున అన్ని కాలువలకు యథాప్రకారం నీరు విడుదల సాధ్యం కాదని అధికారులు తెలిపారు. యథాప్రకారం విడుదల చేయాలంటే 71 టీఎంసీల నీరు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో డ్యాంపై ఆధారపడిన హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ, ఎల్‌బీఎంసీ, రాయబసవణ్ణ తదితర కాలువలకు నెలలో 10 రోజుల పాటు నీరు నిలుపుదల చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ విధానాన్ని నవంబర్ వరకు కొనసాగించాలని, పది టీఎంసీలను తాగునీటి కోసం నిల్వ ఉంచుకోవాలని నిర్ణయించారు. హెచ్చెల్సీ, ఎల్ఎల్సీలకు ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు 10 రోజుల పాటు ఏకకాలంలో నీటి విడుదల నిలిపివేస్తారు. 27 నుంచి అక్టోబర్ 11 వరకు హెచ్ఎల్సీకి 1,200 క్యూసెక్కుల చొప్పున, ఎల్ఎల్సీకి 700 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తారు. అక్టోబర్ 12 నుంచి 21 వరకు మళ్లీ కాలువలకు నీటి విడుదల ఆపేస్తారు. 22వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు మళ్లీ యధాప్రకారం విడుదల చేస్తారు. నవంబర్ 6 నుంచి 15 వరకు ఆపేసి.. 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు యధాప్రకారం నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. -
'కర్ణాటక జల దోపిడీని అడ్డుకోండి'
కర్ణాటక జల దోపిడీని తక్షణమే కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లాలని.. రాజకీయాలను పక్కనపెట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం, వ్యవసాయానికి మేలు జరిగేలా ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కర్నూలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. "పూడికతో తుంగభద్ర డ్యాం సామర్థ్యం తగ్గింది. దీనికి తోడు చుట్టూ 62 ఎత్తిపోత పథకాల ద్వారా 15 టీఎంసీ నీటిని చోరీ చేస్తున్నారు. వాటికి ఆ ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ సౌకర్యం కల్పించింది. సింగటలూరు ప్రాజెక్టు వల్ల మరో 40 టీఎంసీల నీటి దోపిడీ జరుగుతోంది. ఇక పరిశ్రమలకు 3.5 టీఎంసీలు వాడుకుంటున్నామంటూ ఏకంగా 15 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఇవి కాకుండా తాజాగా భద్రపైన 30 టీఎంసీలు, తుంగపైన 30 టీఎంసీల చొప్పున 60 టీఎంసీల నీటి వినియోగంతో రెండు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇవి పూర్తయితే మనకొచ్చే 130 టీఎంసీల నీటిని తన్నుకుపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు.. ప్రధానంగా రాయలసీమకు తీరని నష్టం జరుగుతంది" అని బెరైడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా ఈ గండం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలన్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేయాలన్నారు.