‘తుంగభద్ర’కు పోటెత్తిన వరద
- 31,303 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- 67.750 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
హొసపేటె(కర్ణాటక): తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగుంబె, శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, మంగళూరు, భద్రావతి తదితర చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతోంది. శుక్రవారం సుమారు 31,303 క్యూసెక్కుల మేర డ్యాంలోకి నీరు చేరింది. వర్షాభావం నేపథ్యంలో డ్యాం చరిత్రలోనే ఈ ఏడాది జలాశయంలో అతి తక్కువ నీరు నిల్వ ఉంది.
అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో నాలుగైదు రోజులుగా ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే పదిరోజుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని నీటిమట్టం 1623.33 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 67.750 టీఎంసీలకు చేరింది. వివిధ కాలువలకు 2264 క్యూసెక్కుల వరకు మండలి అ«ధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటిమట్టం 1617.06 అడుగులు, నీటి నిల్వ 50.630 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 3800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 10866 క్యూసెక్కులుగా ఉండేదని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు.