సాక్షి, అమరావతి: బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకునేందుకు కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుపై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు పనులను తక్షణమే నిలుపుదల చేసేలా కర్ణాటకను ఆదేశించి, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు పరిరక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం ఎస్‌ఎల్‌పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయనుంది.
అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్, కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు కృష్ణా డెల్టాలో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని నివేదించనుంది. తమ అభ్యంతరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అప్పర్ భద్రకు కల్పించిన జాతీయ హోదాను, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇచ్చిన సాంకేతిక అనుమతులను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించనుంది.
హక్కులు తాకట్టు పెట్టిన చంద్రబాబు
తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) స్పష్టం చేయగా.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చింది.
► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగాను దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్‌లలో మిగిలిన 6 టీఎంసీలు.. వెరసి 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోగా) తరలించేలా అప్పర్ భద్రను 2015లో కర్ణాటక చేపట్టింది.
► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి చిక్‌మంగుళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్లకు (5,57,259 ఎకరాలు) నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని కర్ణాటక పేర్కొంది.
► నీటి కేటాయింపులు లేని అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ నోరు మెదపకుండా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కల్పించింది. ఫలితంగా 2019 మార్చి నాటికే రూ.4,830 కోట్లను వ్యయం చేసి, అప్పర్ తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్ భద్ర ద్వారా 2019–20లో 3.44, 2020–21లో 6.61, 2021–22లో 6.82 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్‌కు తరలించింది.
నీటి కేటాయింపులే లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా!
► అప్పర్ భద్రకు జాతీయ హోదా సాధించడం ద్వారా కేంద్ర నిధులను రాబట్టేందుకు సిద్ధమైన కర్ణాటక సర్కార్ సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి, కేంద్ర జల్ శక్తి శాఖ నుంచి పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్) కోరుతూ ప్రతిపాదనలు పంపింది.
► బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండానే 2020 డిసెంబర్ 24న అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది.
► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సైతం అమల్లోకి రాలేదని, ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే న్యాయ ఉల్లంఘనకు పాల్పడటమేనని స్పష్టం చేస్తూ సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయగా అభ్యంతరాలను తోసిపుచ్చింది.
► ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్ భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021 మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది.
► దుర్భిక్ష ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీళ్లందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది.
► ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలంటే బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు అంగీకరించాలని కేంద్రమే మార్గదర్శకాలు రూపొందించింది. అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021 నవంబర్ 6న సమావేశం నిర్వహించింది.
► నీటి కేటాయింపులే లేకుండా జాతీయ హోదా ఇవ్వడం సరికాదన్న తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ 2022 ఫిబ్రవరి 15న అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. ఈ క్రమంలో 2023–24 బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయించింది.
తెలుగు రాష్ట్రాలకు తిప్పలే..
కర్ణాటక సర్కార్ ఇప్పటికే కేటాయించిన నీటి కంటే అధికంగా తుంగభద్ర జలాలను వాడుకుంటోంది. ఇక అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంలో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు.
ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టు, కేసీ కెనాల్, ఏపీ–తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాపై కూడా ప్రభావం పడుతుంది. కృష్ణా బేసిన్‌లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు
అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 36 టీఎంసీలు కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనను బచావత్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా 9 టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించింది. కానీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని, నాలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సెల్పీ దాఖలు చేసింది. దీంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇక విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల నీటి మిగులు లేదు. కే–8, కే–9 బేసిన్లలో కర్ణాటక అధికంగా నీటిని వాడుకుంటున్న నేపథ్యంలో నీటి మిగులు లేదు. నీటి కేటాయింపులు లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం.
– సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జల వనరుల శాఖ
తక్షణమే నిలిపివేయాలి..
అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించేందుకు తాను జారీ చేసిన మార్గదర్శకాలను జల్ శక్తి శాఖే ఉల్లంఘించింది. నీటి కేటాయింపులు లేకుండా, బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది.
అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రను తక్షణమే నిలుపుదల చేయడంతోపాటు సాంకేతిక అనుమతి, జాతీయ హోదాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేస్తాం.
– శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment