Government of Karnataka
-
కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం
బెంగళూరు: అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్‌లో ఉత్వర్వులు జారీ చేసింది. -
అప్పర్ భద్రపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకునేందుకు కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుపై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు పనులను తక్షణమే నిలుపుదల చేసేలా కర్ణాటకను ఆదేశించి, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు పరిరక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయనుంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్, కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు కృష్ణా డెల్టాలో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని నివేదించనుంది. తమ అభ్యంతరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అప్పర్ భద్రకు కల్పించిన జాతీయ హోదాను, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇచ్చిన సాంకేతిక అనుమతులను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించనుంది. హక్కులు తాకట్టు పెట్టిన చంద్రబాబు తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) స్పష్టం చేయగా.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చింది. ► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగాను దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్లలో మిగిలిన 6 టీఎంసీలు.. వెరసి 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోగా) తరలించేలా అప్పర్ భద్రను 2015లో కర్ణాటక చేపట్టింది. ► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి చిక్‌మంగుళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్లకు (5,57,259 ఎకరాలు) నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని కర్ణాటక పేర్కొంది. ► నీటి కేటాయింపులు లేని అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ నోరు మెదపకుండా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కల్పించింది. ఫలితంగా 2019 మార్చి నాటికే రూ.4,830 కోట్లను వ్యయం చేసి, అప్పర్ తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్ భద్ర ద్వారా 2019–20లో 3.44, 2020–21లో 6.61, 2021–22లో 6.82 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్‌కు తరలించింది. నీటి కేటాయింపులే లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా! ► అప్పర్ భద్రకు జాతీయ హోదా సాధించడం ద్వారా కేంద్ర నిధులను రాబట్టేందుకు సిద్ధమైన కర్ణాటక సర్కార్ సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి, కేంద్ర జల్ శక్తి శాఖ నుంచి పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ► బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండానే 2020 డిసెంబర్ 24న అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. ► విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సైతం అమల్లోకి రాలేదని, ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే న్యాయ ఉల్లంఘనకు పాల్పడటమేనని స్పష్టం చేస్తూ సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయగా అభ్యంతరాలను తోసిపుచ్చింది. ► ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్ భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021 మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ► దుర్భిక్ష ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీళ్లందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. ► ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలంటే బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు అంగీకరించాలని కేంద్రమే మార్గదర్శకాలు రూపొందించింది. అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021 నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ► నీటి కేటాయింపులే లేకుండా జాతీయ హోదా ఇవ్వడం సరికాదన్న తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ 2022 ఫిబ్రవరి 15న అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. ఈ క్రమంలో 2023–24 బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయించింది. తెలుగు రాష్ట్రాలకు తిప్పలే.. కర్ణాటక సర్కార్ ఇప్పటికే కేటాయించిన నీటి కంటే అధికంగా తుంగభద్ర జలాలను వాడుకుంటోంది. ఇక అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంలో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టు, కేసీ కెనాల్, ఏపీ–తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాపై కూడా ప్రభావం పడుతుంది. కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 36 టీఎంసీలు కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనను బచావత్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా 9 టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించింది. కానీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని, నాలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సెల్పీ దాఖలు చేసింది. దీంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల నీటి మిగులు లేదు. కే–8, కే–9 బేసిన్లలో కర్ణాటక అధికంగా నీటిని వాడుకుంటున్న నేపథ్యంలో నీటి మిగులు లేదు. నీటి కేటాయింపులు లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జల వనరుల శాఖ తక్షణమే నిలిపివేయాలి.. అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించేందుకు తాను జారీ చేసిన మార్గదర్శకాలను జల్ శక్తి శాఖే ఉల్లంఘించింది. నీటి కేటాయింపులు లేకుండా, బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రను తక్షణమే నిలుపుదల చేయడంతోపాటు సాంకేతిక అనుమతి, జాతీయ హోదాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేస్తాం. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ -
హిజాబ్... తప్పనిసరి మతాచారం కాదు
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్‌కు అనుమతివ్వాల్సిందే.. కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్‌కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
మా మీద విద్వేషపూరిత వివక్ష
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాము ధరించే హిజాబ్‌ను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వివక్ష చూపుతోందని కర్ణాటక హైకోర్టులో ముస్లిం విద్యార్థినులు వాదించారు. ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ చట్టవ్యతిరేకమని, ఈ విషయంపై ఎంఎల్ఏ ఆధ్వర్యంలోని కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ(సీడీసీ)కి నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. భారతీయులు లాకెట్లు, శిలువ, బుర్కా, గాజులు, హిజాబ్, బొట్టు, తలపాగా లాంటి పలురకాల మత చిహ్నాలు ధరిస్తారని విద్యార్థినుల తరఫు న్యాయవాది రవి వర్మ కుమార్ చెప్పారు. ఈ పిటీషన్‌ను సీజే జస్టిస్ అవస్తీతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. 1995 విద్యా శాఖ నిబంధనల్లో 11వ నిబంధన ప్రకారం విద్యాసంస్థలు యూనిఫామ్ మార్పుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనీసం ఏడాది ముందు తెలియజేయాలన్నారు. అలాగే ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ గురించి పీయూ విద్యాశాఖ నిబంధనలు ఎక్కడా ప్రస్తావించలేదని కుమార్ చెప్పారు. ఎక్కడా హిజాబ్‌ను నిషేధించాలని లేనప్పుడు ఏ అధికారంతో పిల్లలను క్లాసు నుంచి బయటకు పంపుతున్నారని ప్రశ్నించారు. సీడీసీలను విద్యాప్రమాణాల మెరుగుదల కోసం, నిధుల సక్రమ వినియోగ పర్యవేక్షణ కోసం ఒక సర్క్యులర్ ద్వారా 2014లో ఏర్పాటు చేశారని, ఈ కమిటీకి విద్యార్థుల సంక్షేమంతో సంబంధం లేదని వాదించారు. కమిటీ అధిపతులైన ఎంఎల్ఏకు కార్యనిర్వాహక అధికారాలివ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వాదనల అనంతరం కోర్టు విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో అదే తంతు వారం రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ కాలేజీలు బుధవారం తెరుచుకున్నాయి. అయితే పలు చోట్ల బుర్కా ధరించిన విద్యార్థినులకు కాలేజీల్లోకి ప్రవేశాన్ని నిరాకరించారు. సున్నిత ప్రాంతాల్లోని కాలేజీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలామంది ముస్లిం విద్యార్థినులు బుర్కా తీసివేయడానికి నిరాకరించారు. ఉడిపిలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హిజాబ్‌పై హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ముస్లిం బాలికలు కళాశాలకు హాజరు కాలేదని ప్రిన్సిపాల్ రుద్ర గౌడ చప్పారు. మిగిలిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసివేసి క్లాసులకు హాజరయ్యారని చెప్పారు. కుందాపూర్‌లో హిజాబ్ తీసివేయడానికి నిరాకరించిన 23 మంది విద్యార్థినులు కూడా కాలేజీకి హాజరుకాలేదు. గతవారం గందరగోళం జరిగిన మణిపాల్‌లోని ఎంజీఎం కాలేజీ సహా ఆందోళనలు తలెత్తిన ప్రాంతాల్లో కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం హిజాబ్ తీసివేసిన విద్యార్థినులనే తరగతులకు అనుమతించారు. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు సైతం బుధవారం ఆరంభమయ్యాయి. అయితే వీటిలో ఎలాంటి యూనిఫామ్ నిబంధన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అసెంబ్లీలో వెల్లడించారు. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ యూనిఫామ్ నిబంధన డిగ్రీ కాలేజీలకు వర్తించదని వివరణ ఇచ్చారు. గాజులు మత చిహ్నాలు కాదా? సమాజంలోని భిన్న వర్గాలు భిన్న మత చిహ్నాలు ఉపయోగిస్తాయని, కానీ ప్రభుత్వం కేవలం హిజాబ్‌పై వివక్ష చూపుతోందన్నారు. అలాంటప్పుడు గాజులు మత చిహ్నాల కిందకు రావా? అని న్యాయవాది కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల్లో ఇతర మత చిహ్నాలను వదిలికేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించిన ఆయన కేవలం ముస్లింల విశ్వాసానికి చెందినది కాబట్టే హిజాబ్‌ను వద్దంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ముస్లిం బాలికలపై ఈ వివక్ష 15వ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినకుండా నేరుగా శిక్ష విధించినట్లయిందని, ఇది అమానుషమని వాదించారు. విద్య బహుళత్వాన్ని బోధించాలని, తరగతి గదులు సమాజంలో భిన్నత్వాన్ని ప్రతిబింబించాలని చెప్పారు. -
కర్ణాటకలోనూ ఇంటికే రేషన్!
‘అధికారం కేవలం విధానసౌథకే పరిమితం కాకుండా పంచాయతీల పరిధిలోనే ప్రజలకు అన్ని సేవలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటాం. అభివృద్ధే ప్రజల వద్దకు వచ్చేలా పాలన సాగాలి. జనవరి 26 తరువాత రేషన్ సరుకులను ఇంటివద్దే అందించే యోచన చేస్తున్నాం. అతి త్వరలో కార్యాచరణను రూపొందించి ప్రకటిస్తాం. ఇదే కాకుండా పింఛన్లు లాంటి సామాజిక భద్రత సేవలు కూడా ఇంటివద్దే అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం’ – ఇటీవల దావణగెరె జిల్లా సభలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తరహాలోనే పలు పథకాలను ఇంటివద్దే లబ్ధిదారులకు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. ప్రధానంగా రేషన్ సరుకులను ఇంటివద్దే డోర్ డెలివరీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించింది. ‘అన్నభాగ్య’ పథకం కింద లబ్ధిదారులకు ఇంటివద్దే రేషన్ సరుకులను అందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటి వద్దే రేషన్ సరుకులను అందచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంపై కర్ణాటక పౌర సరఫరాల శాఖ అధికారులు నిశితంగా అధ్యయనం చేశారు. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో తదనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తైన కంప్యూటరైజేషన్.. కర్ణాటకలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేశారు. ప్రస్తుతం అక్కడ 10,89,445 అంత్యోదయ, 1,15,02,798 బీపీఎల్, 21,44,006 ఏపీఎల్ కార్డులతో కలిపి మొత్తం 1,47,36,249 రేషన్ కార్డులున్నాయి. 19,963 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల బీపీఎల్, ఏపీఎల్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఏపీఎల్ కార్డుదారులకు కేజీ రూ.15 చొప్పున 10 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అనుసరించడం ద్వారా వీరందరికి ఇంటి వద్దే రేషన్ సరుకులు అందనున్నాయి. కొత్త విధానం ఇలా.. ఆయా రేషన్ దుకాణాల నుంచి లగేజ్ ఆటో ద్వారా సరుకులు తరలిస్తారు. ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేసేందుకు ఇద్దరు సిబ్బందిని నియమిస్తారు. సరుకుల బరువు తూచే తూకం యంత్రం తదితరాలు ఆటోలో ఉంటాయి. -
సమాంతర కాలువ తవ్వాకే 'నవలి'పై నిర్ణయం
సాక్షి, అమరావతి, సాక్షి,బళ్లారి: తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతరంగా రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా వరద కాలువను తవ్వాక నవలి రిజర్వాయర్ నిర్మాణం అవసరమా? లేదా అనే అంశంపై తేల్చుదామని తుంగభద్ర బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్సష్టం చేసింది. నవలి రిజర్వాయర్, సమాంతర కాలువ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) ఇస్తే 3 రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నాక చర్చిద్దామని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే చేసిన సూచనకు ఏపీ, కర్ణాటక ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, లక్ష్మణబాబు పీష్వా అంగీకరించారు. తుంగభద్ర జలాశయంలో అనుమతిచ్చిన దాని కంటే అధికంగా 5.045 టీఎంసీలను ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ అంగీకరించింది. వాటిని తమ రాష్ట్ర కోటా కింద పరిగణించి కోత వేయాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది. ఫిషరీష్ డెవలప్మెంట్ బోర్డు (ఎఫ్డీసీ)లో సభ్యత్వం ఇవ్వాలన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చేసిన ప్రతిపాదనను ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తోసిపుచ్చారు. తుంగభద్ర బోర్డు నిర్వహణ వ్యయం వాటా నిధులపై ఏడేళ్లుగా తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆక్షేపించారు. బుధవారం విజయనగర జిల్లా టీబీ డ్యాం వద్ద బోర్డు కార్యాలయంలో చైర్మన్ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన 217వ సర్వ సభ్య సమావేశం వర్చువల్ విధానంలో వాడివేడిగా జరిగింది. నవలి అవసరమేముంది? తుంగభద్ర జలాశయం సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.85 టీఎంసీలకు తగ్గిపోవడంతో మూడు రాష్ట్రాలు నష్టపోతున్నాయని కర్ణాటక ఈఎన్సీ లక్ష్మణబాబు పీష్వా పేర్కొన్నారు. తగ్గిన సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసేందుకు తుంగభద్ర జలాశయం ఎగువన నవలి వద్ద 30 నుంచి 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని, తద్వారా మూడు రాష్ట్రాలు కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.పది వేల కోట్లను మూడు రాష్ట్రాలు దామాషా పద్దతిలో భరించాలని కోరడంపై ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నవలి రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తుంగభద్ర జలాశయానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించేలా హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అక్రమ తరలింపును అంగీకరించిన కర్ణాటక తుంగభద్ర జలాశయంలో ఎత్తిపోతల పథకాల ద్వారా 4.34 టీఎంసీలను వాడుకోవడానికి గతంలో కర్ణాటక సర్కార్‌కు బోర్డు అనుమతిచ్చింది. కర్ణాటక సర్కార్ అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా 9.385 టీఎంసీలను తరలిస్తున్నట్లు ఇటీవల బోర్డు నియమించిన జాయింట్ కమిటీ సర్వేలో తేలింది. అనుమతి లేకుండా 5.045 టీఎంసీలను తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈమేరకు బోర్డు సమావేశంలో జాయింట్ కమిటీ నివేదికను కార్యదర్శి నాగమోహన్ ప్రవేశపెట్టారు. తాగునీటి పథకాలను కర్ణాటక సర్కార్ హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ప్రధాన కాలువలపై కాకుండా డిస్ట్రిబ్యూటరీలపై ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సూచించారు. తాగునీటి పథకాల్లో మార్పులు చేసుకోవాలని కర్ణాటక సర్కార్‌కు బోర్డు సూచించింది. టోపోగ్రాఫికల్ సర్వే ప్రకారం తుంగభద్ర జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా పరిగణించి నీటి కేటాయింపులు చేయాలని ఏపీ కోరగా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ తెలిపారు. -
నేడు తుంగభద్ర బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) జలాశయానికి ఎగువన కర్ణాటక సర్కార్ ప్రతిపాదిస్తున్న నవలి బ్యారేజీ నిర్మాణం, అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా జలదోపిడీ అజెండాగా బుధవారం తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జలవరులశాఖల ఈఎన్సీలు పాల్గొననున్నారు. టీబీ డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.85 టీఎంసీలకు తగ్గిందని చెబుతోన్న కర్ణాటక సర్కార్, తగ్గిన సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ డ్యామ్‌కు ఎగువన నవలి వద్ద బ్యారేజీ నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీబీ బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించింది. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి వాటాల్లో దామాషా ఆధారంగా భరించాలని ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశాయి. ఈ అంశంపై చర్చించాలని కర్ణాటక సర్కార్ కోరిన నేపథ్యంలో దాన్ని బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే అజెండాలో చేర్చారు. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, 105 టీఎంసీలని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైందని టీబీ బోర్డు పేర్కొంది. కానీ దీన్ని కర్ణాటక సర్కార్ తోసిపుచ్చుతోంది. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై రీ సర్వే చేయాలని కోరింది. కర్ణాటక ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యాన్ని 105 టీఎంసీలుగా పరిగణించి నీటి కేటాయింపులు చేయాలని ఇప్పటికే బోర్డును కోరారు. బోర్డు సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించనున్నాయి. టీబీ డ్యామ్‌లో ఎత్తిపోతల ద్వారా రెండు టీఎంసీలను తరలించడానికి మాత్రమే గతంలో బోర్డు నుంచి కర్ణాటక సర్కార్ అనుమతి తీసుకుంది. కానీ అక్రమ ఎత్తిపోతల ద్వారా అదనంగా 7.38 టీఎంసీలు తరలిస్తున్నట్లు బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో తేల్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్‌పై చర్యలు తీసుకుని ఆ రాష్ట్ర వాటాలో కోత వేసేలా బోర్డుపై ఒత్తిడి చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. -
నీటి లెక్కలు తేల్చిన తుంగభద్ర బోర్డు
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్)లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను టీబీ బోర్డు తేల్చింది. ఈ నీటి సంవత్సరంలో బోర్డు అంచనా వేసిన లభ్యత కంటే 7.80 టీఎంసీలు డ్యామ్‌లో అధికంగా లభించాయి. డ్యామ్‌లోని నీటిని దామాషా పద్ధతిలో దక్కిన కోటాలో ఏపీ 52.831, తెలంగాణ 5.253, కర్ణాటక 111.673 టీఎంసీలను వినియోగించుకున్నాయి. ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి భారీ ఎత్తున ప్రవాహ జలాలు వచ్చినా.. రబీలో నిలిచిపోవడంపై బోర్డు వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎగువన కర్ణాటక సర్కార్ అక్రమంగా భారీగా ఎత్తిపోతల పథకాలను చేపట్టడం వల్లే వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి చేరడం లేదని.. ఇది ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన టీబీ డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో 8 టీఎంసీలు పోను హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. దామాషా పద్ధతిలో.. నీటి సంవత్సరం ఏటా జూన్ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభంలో జూన్ 9, 2020న డ్యామ్‌లో 163 టీఎంసీల లభ్యత ఉంటుందని బోర్డు అంచనా వేసింది. ఆ తర్వాత నవంబర్ 11న 168 టీఎంసీలు, డిసెంబర్ 20న 170.80 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. ఈ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు.. దామాషా పద్ధతిలో కర్ణాటకకు 111.979, ఏపీకి 53.576, తెలంగాణకు 5.245 టీఎంసీలను కేటాయించింది. ఇందులో మూడు రాష్ట్రాలు 169.757 టీఎంసీలు వాడుకున్నాయి. రబీలో డీలా.. మే 30 2020 నాటికి డ్యామ్‌లో 1,584.56 అడుగుల్లో 6.35 టీఎంసీలు నిల్వ ఉండేవి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకూ ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి 288.477 టీఎంసీల ప్రవాహం వచ్చింది. మూడు రాష్ట్రాలు 92.661 టీఎంసీలు వాడుకున్నాయి. డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తేసి 92.443 టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 3.913, 2.597 వృథా అయ్యాయి. రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి.. అంటే అక్టోబర్ 1 నాటికి 1,627.90 అడుగుల్లో 82.425 టీఎంసీలు నిల్వ ఉండేవి. అక్టోబర్ 1, 2020 నుంచి ఏప్రిల్ 4, 2021 వరకూ డ్యామ్‌లోకి కేవలం 3.982 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి భారీగా వచ్చేది. కానీ.. కర్ణాటక ఎగువన భారీగా అక్రమ ఎత్తిపోతల చేపట్టి.. నీటిని తోడేస్తుండటం వల్ల రబీలో డ్యామ్‌లోకి ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోయింది. రబీలో మూడు రాష్ట్రాలు 77.096 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 2.412, 1.999 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈ నెల 10 నాటికి డ్యామ్‌లో 4.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
కేసీ కెనాల్ కోటా నీటి దోపిడీ!
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా కింద దక్కాల్సిన జలాలు మన రాష్ట్ర సరిహద్దు చేరకుండా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోంది. నదిలో వరద తగ్గాక దామాషా పద్ధతిలో టీబీ డ్యామ్ నుంచి కేటాయింపుల ప్రకారం కేసీ కెనాల్‌కు విడుదల కావాల్సిన నీటిని చౌర్యం చేస్తోంది. ఈ నీటిని తుంగభద్రపై బళ్లారి జిల్లా సిరిగుప్ప తాలుకా సుగూరు వద్ద బొరుకా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) 4.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం వద్ద నిల్వ చేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి ఎగువన అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ద్వారా కర్ణాటక సర్కార్ చౌర్యం చేస్తుండటం తాజాగా తుంగభద్ర బోర్డు, కేసీ కెనాల్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో బీపీసీఎల్‌కు నోటీసులు ఇచ్చారు. నిబంధనల మేరకు నదిలో వరద ప్రవాహం ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని, వరద లేనప్పుడు ఎలా విద్యుదుత్పత్తి చేస్తారంటూ నిలదీశారు. కర్ణాటక అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల్లో నీటి తరలింపును ఆపివేశారు. బీపీసీఎల్ వద్ద నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేయించారు. వరద లేనప్పుడు విద్యుదుత్పత్తి చేస్తే విద్యుత్కేంద్రం అనుమతులను రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది. కర్ణాటక ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయడంతో ఎట్టకేలకు కేసీ కెనాల్‌కు వాటా జలాలు చేరాయి. 2.65 లక్షల ఎకరాలకు జీవనాడి.. కేసీ కెనాల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ కెనాల్‌పై ఆధారపడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్రలో సుంకేసుల వద్ద 29.9 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కకట్టిన బచావత్ ట్రిబ్యునల్ మిగిలిన పది టీఎంసీలను వరద తగ్గాక టీబీ డ్యామ్ నుంచి విడుదల చేయాలని పేర్కొంది. టీబీ డ్యామ్‌లో నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో ఈ ఏడాది కేసీ కెనాల్‌కు 8 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇందులో హెచ్చెల్సీ ద్వారా రెండు టీఎంసీలను విడుదల చేసింది. తుంగభద్ర పుష్కరాల సమయంలో నది ద్వారా 2.3 టీఎంసీలను విడుదల చేసింది. మిగతా 3.7 టీఎంసీల కోటాను మార్చి 25 నుంచి రోజుకు 2,500 క్యూసెక్కుల చొప్పున టీబీ డ్యామ్ నుంచి బోర్డు విడుదల చేసింది. అయితే ఈ నీటిని బీపీసీఎల్ వద్ద నిల్వ చేయించిన కర్ణాటక సర్కార్ ఎగువన ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. దీంతో టీబీ డ్యామ్ నుంచి విడుదల చేసిన జలాలు కేసీ కెనాల్‌కు చేరడం లేదు. ఈ నేపథ్యంలో టీబీ బోర్డు అధికారులు, కేసీ కెనాల్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయడంతో కర్ణాటక జలచౌర్యం బహిర్గతమైంది. -
‘స్పందన’ సూపర్
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా అమితంగా ఆకర్షించింది. ‘స్పందన’ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పందన కార్యక్రమం పనితీరును పరిశీలించడానికి కర్నాటక అధికారుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించింది. సచివాలయంలోని స్పందన మానిటరింగ్ యూనిట్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమం ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నారన్న విషయాలను సీఎం కార్యాలయంలోని ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ, ఆర్టీజీఎస్ సీఈవో విద్యాసాగర్‌లు వారికి వివరించారు. స్పందన కార్యక్రమం సీఎం జగన్ మానసపుత్రిక అని.. ఆ పేరును ఆయనే సూచించారని చెప్పారు. అంతేకాకుండా దాని పనితీరును ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ప్రజల సమస్యలను ఒక విజ్ఞప్తిగా చూడకుండా.. ఒక ఆదేశంగా భావించాలని చెప్పడమే కాకుండా, ఇందుకు అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేసి.. ఇప్పుడు గ్రామ సచివాలయాల వరకు తీసుకువెళ్లారని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మెచ్చుకున్న కర్ణాటక ప్రభుత్వాధికారులు.. గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా సందర్శించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. కర్ణాటక అధికారుల బృందంలో ఆ రాష్ట్ర సీఎం ఆఫీస్‌కు సంబంధించి ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలు పర్యవేక్షించే ప్రాజెక్టు డైరెక్టర్ జి.రషి్మ, ఈ–గవర్నెన్స్ ప్రోగ్రాం మేనేజర్ కేఎస్ రఘునాథ్, అధికారులు రాజేశ్, భారతి, ప్రైస్ వాటర్ కూపర్స్‌కు చెందిన సౌరభ్, సౌరభ్ భట్ ఉన్నారు. -
బెంగళూరులో 33 గంటల లాక్ డౌన్
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో 33 గంటల లాక్ డౌన్ ప్రకటించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. లాక్ డౌన్ శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది. బెంగళూరు పరిధిలో లాక్ డౌన్ ను సీఎం యెడియూరప్ప విధిస్తున్నారని బెంగళూరు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కేవలం నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందని, ఇతరులెవరు బయట తిరిగినా చర్యలు ఉంటాయని ప్రకటించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ లాక్ డౌన్ విధిస్తోందని చెప్పారు. దీంతో పాటు హోం ఐసోలేషన్ కాలాన్ని 14 రోజుల నుంచి 17 రోజులకు పెంచుతున్నట్లు చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు బూత్ లెవల్లో ఓ కమిటీని ఏర్పాటు చేశారు అందులో ఓ ఆరోగ్యాధికారి, పోలీసు, స్థానిక మున్సిపాలిటీ లేదా పంచాయతీ వాలంటీర్లు ఉంటారు. ఇలా మొత్తం 8,800 టీంలు బెంగళూరులో తయారయ్యాయి. ప్రతి 198 వార్డులకు రెండు అంబులెన్సులను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ 32 మంది విద్యార్థులకు కరోనా పదో తరగతి చివరి పరీక్షలు రాసేందుకు హాజరైన 7,71,506 మంది విద్యార్థుల్లో 32 మంది కరోనా సోకిందని కర్ణాటక ప్రభుత్వం శనివారం తెలిపింది. ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు వద్దంటున్నప్పటికీ ప్రభుత్వం ఈ పరీక్షలను జూన్ 25–జూలై 3 మధ్య నిర్వహించింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. మరో 80 మంది విద్యార్థులను హోం క్వారంటైన్లో ఉంచారు. 32 మంది విద్యార్థులను కలసిన వారిని, ఒకేచోట పరీక్షలు రాసిన వారిని క్వారంటైన్లోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. -
లాక్డౌన్: బేకరీలకు మినహాయింపు
బెంగళూరు : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిత్యావసర, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మినహాయింపును ఇచ్చారు. ఇక లాక్‌డౌన్‌తో రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆహార ప్రియులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ రాష్ట్రంలోని ఆహార ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. లాక్డౌన్ నుంచి బేకరీలకు మినహాయింపు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. బిస్కెట్లు, బ్రెడ్, స్వీట్లు తయారు చేసి సప్లయి చేస్తున్న బేకరీలు కొద్ది మంది సిబ్బందితో నాణ్యత ప్రమాణాలతో నడపాలని ఆదేశించినట్లు ప్రభుత్వ అధికారి రాజేంద్రకుమార్ కటారియా పేర్కొన్నారు. అదేవిధంగా బేకరీల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అయితే బేకరీల్లో డైనింగ్‌కు అనుమతి లేదని కేవలం పార్శిళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. తయారీ మొత్తం పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించకపోతే ఆ బేకరీని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇక ప్రజలకు ఆహార పదార్థాలు అందించే బేకరీలకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. అయితే వీటిపై పూర్తి నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించింది. చదవండి: డాక్టర్లపై లాఠీఛార్జ్.. అరెస్ట్ లాక్డౌన్: ‘ఖైదీననే భావన కలుగుతోంది’ దేశం కోసం ఓ మంచి పని చేద్దాం -
నవలి రిజర్వాయర్‌కు నో!
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్) ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు 52 టీఎంసీల సామర్థ్యంతో నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తమను సంప్రదించకుండా నవలి బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని టీబీ బోర్డుకు స్పష్టంచేసింది. సింగటలూరు ఎత్తిపోతల, అప్పర్ భద్ర, టీబీ డ్యామ్‌ల నుంచి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నీటిని మళ్లిస్తోందని.. నవలి బ్యారేజీకి అనుమతిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని ఏపీ సర్కార్ ఆందోళన వ్యక్తంచేస్తూ టీబీ బోర్డుకు ఇటీవల లేఖ రాసింది. నిజానికి టీబీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 1953లో 132.47 టీఎంసీలు. జలాశయంలో పూడిక పేరుకుపోవడంవల్ల నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు తగ్గింది. అంటే.. 31.615 టీఎంసీలు తగ్గింది. ఇది టీబీ డ్యామ్‌లో నీటి లభ్యతపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో.. టీబీ బోర్డు దామాషా పద్ధతిలో నీటిని కేటాయిస్తోంది. పూడికవల్ల కేటాయించిన మేరకు జలాలను నియోగించుకోలేకపోతున్నామని.. ఫలితంగా ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోతన్నామనే వాదన కర్ణాటక సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. నదిపైనే రిజర్వాయర్ నిర్మించాలి రిజర్వాయర్ నిర్మిస్తే అది నదిపై నిర్మించాలని.. దానిని బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ సర్కార్ చెబుతోంది. కానీ, అలా కాకుండా 57.81 టీఎంసీల నీటిని మళ్లించడానికే కర్ణాటక సర్కార్ ఈ ప్రతిపాదన చేసిందని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతేకాక.. ఎడమ కాలువ ద్వారా కర్ణాటక సర్కార్ అడ్డగోలుగా నీటిని ఇప్పటికే వినియోగించుకుంటున్నా బోర్డు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు గండ్లు కొట్టి.. కర్ణాటక రైతులు జలచౌర్యానికి పాల్పడుతున్నా బోర్డు చర్యలు తీసుకోవడంలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో.. బోర్డు పరిధిలో లేని ప్రాంతంలో 57.81 టీఎంసీల నీటిని మళ్లించడానికి కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. అలాగే, రిజర్వాయర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని టీబీ బోర్డుకు స్పష్టంచేసింది. సింగటలూరు ఎత్తిపోతల, అప్పర్ భద్ర ప్రాజెక్టుల్లో కర్ణాటక సర్కార్ భారీఎత్తున జలాలను మళ్లిస్తోందని.. దీనివల్ల తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గుతోందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని బోర్డును కోరింది. పూడిక పేరుతో కర్ణాటక జిత్తులు టీబీ డ్యామ్‌లో పూడికను తొలగించి.. ఒక టీఎంసీ నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి రూ.380 కోట్లు ఖర్చవుతుందని.. ఈ లెక్కన 31.615 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా పూడిక తీయడానికి రూ.12వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కర్ణాటక సర్కార్ లెక్కకట్టింది. అలాగే, పూడిక తీసిన మట్టిని నిల్వ చేయడానికి 65 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని.. ఈ భూమి సేకరణకు అధికంగా ఖర్చుచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తుంగభద్ర జలాశయానికి ఎగువన, హీరేబెనగల్ వద్ద నుంచి రోజుకు 22,787 క్యూసెక్కుల (1.96 టీఎంసీలు) ప్రవాహ సామర్థ్యంతో 47 కిమీల పొడవున తవ్వే వరద కాలువ ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదిస్తోంది. నవలి వద్ద 52 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేయడంతోపాటు.. శివపుర చెరువు సామర్థ్యాన్ని 4.25, విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి.. వరద జలాలను ఒడిసిపట్టడం ద్వారా ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామని, దీనివల్ల తుంగభద్ర జలాశయంపై ఒత్తిడి తగ్గుతుందని.. తద్వారా మూడు రాష్ట్రాలు కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోవచ్చని కర్ణాటక చెబుతోంది. అలాగే, నవలి బ్యారేజీకి రూ.9,500 కోట్లు ఖర్చవుతుందని.. ఈ వ్యయాన్ని మూడు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలని ప్రతిపాదిస్తూ.. అందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇటీవల టీబీ బోర్డుకు పంపింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు తుంగభద్ర బోర్డు ఇటీవల లేఖ రాసింది. -
కృష్ణమ్మకు అడ్డుకట్ట!
కృష్ణాపై మరో నాలుగు ఎత్తిపోతల పథకాలు చేపట్టిన కర్ణాటక అదనంగా 21 టీఎంసీల వినియోగానికి ప్రణాళిక ఇప్పటికే ఓకే చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ అవి పూర్తయితే రాష్ట్రానికి భారీగా తగ్గిపోనున్న నీటి రాక సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఎగువనే పూర్తిగా బందీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైనుంచి కిందకు నీటి ప్రవాహాలు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేందుకు యత్నిస్తోంది. ఇందు లో భాగంగా కొత్త ఎత్తిపోతల పథకాలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే నాలుగు ఎత్తిపోతల పథకాలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు అధికారికమైతే దిగువకు 21 టీఎంసీల మేర ప్రవాహాలు తగ్గిపోనుండడం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అవి పూర్తయితే మనకు కష్టమే.. ఇప్పటికే అప్పర్ కృష్ణా ఇరిగేషన్ ప్రాజె క్టు(యూకేఐపీ) కింద కర్ణాటక.. బీజాపూర్, గుల్బర్గా, ఉద్గీర్, భగల్‌కోట్, రాయచూర్ జిల్లాల్లోని 6.22 లక్షల హెక్టార్ల ఎకరాలకు నీరందిస్తోంది. ఈ ఆయకట్టును మరింత విస్తారించాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (కేబీజేఎన్ఎల్) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అప్పర్ కృష్ణాలో బీజాపూర్ జిల్లా బుధిహాల్– పీరాపూర్, రాయిచూర్ జిల్లాల్లోని నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్ వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను రూ.3,710 కోట్లతో చేపట్టాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. వీటికి మొత్తంగా 21 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు వేసింది. వీటిద్వారా 1.29 లక్షల హెక్టార్లకు సాగునీటిని ఇవ్వాలని చూస్తోంది. ఈ ఎత్తిపోతల పథకాల కోసం 2,403 హెక్టార్ల మేర భూసేకరణ అవసరం ఉండగా... కేబీజేఎన్ఎల్ ఇప్పటికే 822 హెక్టార్ల మేర భూసేకరణను పూర్తి చేసింది. తాజాగా పర్యావరణ, అటవీ, ఇతర అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇది తెలంగాణను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు నీటి వినియోగాన్ని మొదలు పెడితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు తగ్గుతాయి. ఇప్పటికే ఎగువన వచ్చిన వరదను వచ్చినట్టే కర్ణాటక పట్టేసుకుంటోంది. కిందకు చుక్క నీటిని వదలకపోవడంతో తెలంగాణ, ఏపీలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గడ్డుకాలం తప్పడం లేదు. ఒకవేళ నీరొచ్చినా ఖరీఫ్ సాగుకు నవం బర్, డిసెంబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి వస్తోంది. అదనంగా మరో 21 టీఎంసీల నీటి వినియోగం మొదలు పెడితే దిగువకు నీటి రాక మరింత తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. పోలవరం వాటాల్లోంచేనా? గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం ప్రాజెక్టును చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఉంది. ప్రస్తుతం పోలవరానికి జాతీయ హోదా కట్టబెట్టడంతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కాయి. ఇందులో 14 టీఎంసీలు మహారాష్ట్రకు దక్కనుండగా, కర్ణాటకకు 21 టీఎంసీలు దక్కుతాయి. దీన్ని ఆధారంగా చేసుకొనే కర్ణాటక 4 ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని, అందుకే కేంద్ర పర్యావరణ శాఖ సైతం వెంటనే అనుమతులు జారీ చేసి ఉండవచ్చని తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు అంటున్నాయి. నిజంగా ఆ నీటి వాటాలపై ఆధారపడే ఈ ఎత్తిపోతలు చేపట్టారా? లేదా అదనపు నీటి వినియోగమా? అన్న అంశమై సోమవారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈఎన్సీ మురళీధర్ హైడ్రాలజీ, అంతరాష్ట్ర వ్యవహారాల విభాగపు అధికారులతో భేటీ నిర్వహించారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే తదుపరి ప్రతిస్పందన తెలియ జేయాలని నిర్ణయించారు. ‘కృష్ణా’ నియంత్రణపై వెనక్కి తగ్గని బోర్డు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నియం త్రణలోకి తెచ్చుకునే అంశంపై బోర్డు వెనక్కి తగ్గట్లేదు. ఈ విషయమై గత ముసాయిదా నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభు త్వం అభ్యంతరం చెప్పనందున తమ సిఫార్సులకు సమ్మతిగానే భావిస్తామని పేర్కొంటోంది. బుధవారం జరగనున్న బోర్డు భేటీలో నోటిఫికేషన్ అంశాన్ని ఎజెండాగా చేర్చింది. దీనిని తప్పుబడు తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పని మొదలు పెట్టకముందే కృష్ణా బోర్డు తన ‘ఎజెండా’తో ముందుకు సాగుతుండటం గమనార్హం. ప్రాజెక్టులను నియంత్రణ లోకి తెచ్చుకునేందుకే దీన్ని ఎజెండాలో చేర్చారని తెలంగాణ ప్రభుత్వం అనుమా నిస్తోంది. పారదర్శకంగా నీటి వినియో గం జరిగేందుకు టెలిమెట్రీ పరికరాలను సైతం ఏర్పాటు చేస్తుండగా మళ్లీ ప్రాజె క్టుల నియంత్రణ అవసరం ఏమిటని వాదిస్తోంది. పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఏపీ తీసుకోవాల్సిన చర్యలపైనా లేవనెత్తనుంది. -
అశనిపాతం
కర్ణాటకకు వ్యతిరేకంగా మహదాయి ట్రిబ్యునల్ తీర్పు బెళగావి, గదగ్ ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనలు నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన కన్నడ సంఘాలు న్యాయవాదులతో చర్చించి తదుపరి నిర్ణయం: సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: మహదాయి నదీ జలాల వివాదానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర అర్జీని మహదాయి నదీజలాల ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెళగావి, గదగ్‌లోని నరగుంద తదితర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. మహదాయి నది నుంచి మలప్రభకు ఎత్తిపోతల ద్వారా 7.56 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ట్రిబ్యునల్ ఎదుట మధ్యంతర అర్జీని దాఖలు చేసింది. కర్ణాటక తరఫున ప్రముఖ న్యాయవాది ఫాలి నారీమన్ వాదనలు వినిపించగా, గోవా తరఫున ఆత్మారామ్ నాడికర్ణి ఆ రాష్ట్ర వాదనలను వినిపించారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తన మధ్యంతర తీర్పును బుధవారం వెలువరించింది. 7.56టీఎంసీల నీటిని కోరుతూ కర్ణాటక దాఖలు చేసిన మధ్యంతర అర్జీని ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ ప్రాంతంలోని ప్రజలు తాగునీటి అవసరాల కోసం మహదాయి నదీ జలాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏడాది కాలంగా ఈ అంశంపై పోరాటం సాగిస్తున్నారు. తీర్పు విషయం తెలిసిన వెంటనే బెళగావి, గదగ్ జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. వివిధ రైతు సంఘాలు, కన్నడ సంఘాల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గదగ్‌లోని ఎంపీ శివకుమార ఉదాసీ కార్యాలయంపై నిరసన కారులు దాడికి పాల్పడ్డారు. ఎంపీ కార్యాలయం వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌ను విరిచేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇక బైలహొంగళ నగరంలో కళసా-బండూరి పోరాట సమితి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీని నిర్వహించి నిరసనను తెలియజేశారు. బెళగావిలోని అనేక ప్రాంతాల్లో సైతం రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు టైర్లకు నిప్పుపెట్టి, ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే సందర్భంలో వివిధ కన్నడ సంఘాలు నేడు(గురువారం) కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. న్యాయవాదులతో చర్చించి తదుపరి నిర్ణయం...... మహదాయి నదీజలాల ట్రిబ్యునల్ తీర్పుపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మేము శాయశక్తులా ప్రయత్నించాం. అఖిల పక్ష సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సైతం భేటీ అయి విషయాన్ని వివరించాం, అయినా ఫలితం లేకుండా పోయింది. ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర తీర్పునకు సంబంధించిన ప్రతులు ఇంకా మాకు అందలేదు. ట్రిబ్యునల్ తీర్పు ప్రతి కోసం రాష్ట్ర న్యాయవాదులు ఇప్పటికే అర్జీ దాఖలు చేశారు. తీర్పు ప్రతి అందిన తర్వాత న్యాయవాదులతో చర్చించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటాము. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం’ అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. 30న కన్నడ చలనచిత్రసీమ బంద్ మహదాయి నదీజలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ తీర్పు కర్ణాటకకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఈనెల 30న కన్నడ చలనచిత్ర సీమ బంద్ పాటించనుందని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సా.రా.గోవిందు వెల్లడించారు. కర్ణాటకకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ బంద్‌ను పాటించనున్నట్లు చెప్పారు. ఇదే సందర్భంలో కన్నడ సంఘాల ఒక్కూట నేతృత్వంలో ఈనెల 30న కర్ణాటక బంద్ పాటించనున్నట్లు ఒక్కూట అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ తెలిపారు. గురువారం నుంచే తమ నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. గురువారం రోజున గోవా, మహారాష్ట్ర సీఎంల దిష్టిబొమ్మలను తగల బెట్టడం ద్వారా తమ పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తీర్పునకు వ్యతిరేకంగా ధర్నా తుమకూరు: మహదాయి నదీ జలాలపై కర్ణాటకకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తుమకూరు నగరంలోని టౌన్‌హాల్ సర్కిల్లో బుధవారం రైతు సంఘం నేత కోడి హళ్ళి చంద్రశేఖర్ నేతృత్వంలో రైతులు ఆందోళనకు దిగారు. టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. -
కర్ణాటక ‘అడ్డుక ట్ట’ తొలగించండి
► నీళ్లిచ్చి తాగునీటి కష్టాలు తీర్చండి ► పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన ► జేసీ హామీతో రాస్తారోకో విరమణ మాగనూర్: కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా వేస్తున్న నీటి అడ్డుకట్టలను తొలగించాలని.. తమ సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ మండలంలో ని టైరోడ్‌లో మంగళవారం కృష్ణానది తీరప్రాంత రైతులు 3గంటల పాటు రా స్తారోకో నిర్వహించారు. కొందరు రైతు లు పురుగుమందు డబ్బాలను చేతపట్టుకొని నిరసన తెలిపారు. అడ్డుకట్టను తొలగించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని కొందరు రైతులు తమ ఆవేదన వెళ్లగక్కారు. కర్ణాటక దౌర్జన్యంగా మన భూభాగంలోని నదినీటికి అడ్డుకట్టవేస్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీ ఆర్కు తాము తాగునీటికి పడుతున్న సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నదితీర ప్రాంతంలోని ప్రజలు ఇంతటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటుండగా ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ కృష్ణస్వామి అక్కడిచేరుకుని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసాఇచ్చారు. కానీ రైతులు సమ్మతించలేదు. చివరికి అక్కడినుంచే జేసీ రాంకిషన్‌కు తహశీల్దార్ సమస్యను ఫోన్లో వివరించారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు సిద్రాంరెడ్డి, సంతోష్, వెంకటేష్, సూగిరెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణ, నింగప్ప, గుండప్ప, తిమ్మప్ప, రవి, గణపతి, రాంబాబు, శివప్ప, శంక్రప్ప, బషీర్, వెంకటేష్, ఉషెనప్ప, రాకేష్, తిమ్మప్ప, ప్రతాప్ పాల్గొన్నారు. పరిశీలించిన డీఆర్ఓ, డీఎస్పీ కృష్ణానదిలో నీటి ప్రవాహానికి అడ్డుకట్టవేసి ఆ నీటిని కేపీసీ పవర్‌ప్లాంట్‌కు కర్ణాటక తరలిస్తున్న ప్రాంతాన్ని డీఆర్ఓ బాస్కర్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, జూరాల ప్రాజెక్టు ఈఈ శ్రీధర్ పరిశీలించారు. ఉదయం నదితీరప్రాంతాల రైతులు కర్ణాటక వేసి న అడ్డుకట్టలను తొలగించాలని డిమాం డ్ చేస్తూ టైరోడ్‌లో రాస్తారోకో చేసిన విషయాన్ని తహశీల్దార్ కృష్ణస్వామి అధికారులకు వివరించారు. ఈ విషయమై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుని, ఈ ప్రాంతరైతులకు న్యాయం చేస్తామన్నారు. వారివెంట సీఐ శ్రీనివాస్, ఆర్ఐ సురేష్, కృష్ణ ఎస్ఐ రియాజ్ ఆహ్మద్, మాగనూర్ ఎస్ఐ నర్సయ్య, పలువురు రైతులు ఉన్నారు. -
'కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణం'
బెంగళూరు: ప్రముఖ హేతువాద నాయకుడు, అభ్యుదయవాది కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చెప్పారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. 77 ఏళ్ల కల్బర్గీని ధార్వాడ్‌లోని ఆయన ఇంటివద్ద ఇటీవల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇటీవల హత్యకు గురైన మహారాష్ట్ర హేతువాది గోవింద్ పన్సారేకు కల్బర్గీ సహచరుడు. -
సీబీఐకి కల్బర్గీ హత్య కేసు
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెంగళూరు/ధార్వాడ్: ప్రముఖ హేతువాద నాయకుడు, అభ్యుదయవాది కల్బర్గీ హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సోమవారం కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కల్బర్గీ హత్యకు గురికావడం దురదృష్టకరమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. 77 ఏళ్ల కల్బర్గీని ధార్వాడ్‌లోని ఆయన ఇంటివద్ద ఆదివారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇటీవల హత్యకు గురైన మహారాష్ట్ర హేతువాది గోవింద్ పన్సారేకు కల్బర్గీ సహచరుడు. సోమవారం ధార్వాడ్‌లో కల్బర్గీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. విగ్రహారాధనకు వ్యతిరేకంగా కల్బర్గీ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ, బజరంగ్దళ్ వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. అలాగే, సనాతన ఆచారాలు, మత విశ్వాసాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీశాయి. కల్బర్గీ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర మీడియాకు తెలిపారు. దాంతోపాటు ఈ కేసు విచారణను సీఐడీ కూడా తక్షణమే చేపడుతుందని ఆయన చెప్పారు. కాగా పలువురు సాహితీవేత్తలు, విద్యార్థులు, రాజకీయనాయకులు, అభిమానులు కల్బర్గీకి నివాళులర్పించారు. -
కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిజమే!
- పొడవు 1,170 మీటర్లు... గేట్ల సంఖ్య 194 - ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక - కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని - అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం - కేంద్రమంత్రి ఉమాభారతికి - వివరించాలంటూ ఎంపీ జితేందర్‌కు ఫోన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై రాయచూర్ జిల్లాలో గిరిజాపూర్ గ్రామం వద్ద కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీ చేపట్టడం నిజమేనని పేర్కొంటూ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక అందగానే శనివారం సాగునీటి శాఖ మంత్రి మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై వెంటనే కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాలని ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషిని, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్‌ను మంత్రి ఆదేశించారు. సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, న్యాయ నిపుణులను సంప్రదించి ఫిర్యాదును తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయడానికి చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జూరాలకు వరద కష్టమే! కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణానికి సమాయత్తమవుతుందన్న సమాచారంపై మంత్రి హరీశ్‌రావు నిజ నిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారుల కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి ఫోటోలతో సహా నివేదికను సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌పీటీఎస్) నిర్మిస్తోంది. ‘‘బ్యారేజీ పొడవు 1,170 మీటర్లు. గేట్ల సంఖ్య-194. 24 నెలల కాల పరిమితితో రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ ఏడాది జూలై 28న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బ్యారేజీలో సుమారు రెండు టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. దానికి తోడు నారాయణపూర్ నుంచి రావాల్సిన రీజనరేటెడ్ ఫ్లో కూడా రాకుండా పోతుందని తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దిగువ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలుపలేదు. కేంద్ర జల సంఘానికి, కేంద్ర విద్యుత్ అథారిటీకి అయినా తెలిపిందా, వారి నుంచి సూత్రప్రాయమైన అనుమతులైనా ఉన్నాయా అన్న విషయం తెలియరాలేదని కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ప్రొక్లైన్లు, టిప్పర్లు కనిపించాయని, పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపింది. -
కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణం!
మాగనూర్ (మహబూబ్‌నగర్) : కృష్ణానదిపై కర్ణాటక మరో అక్రమ నిర్మాణానికి పూనుకుంది. కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకుండానే బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. గిరిజాపూర్ వద్ద నిర్మించే ఈ బ్రిడ్జి నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోపాటు గతనెల 28న రూ.150 కోట్ల నిధులనూ విడుదల చేసింది. బ్యారేజీ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించింది. బ్యారేజీ పొడవు 1.35 కిలోమీటర్లు నిర్మించే ఈ బ్యారేజీకి 194 గేట్లు ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదిపై గూగల్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మించింది. మళ్లీ ఇదే నదిపై కర్ణాటక తెలంగాణ సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో బ్యారేజీ నిర్మాణానికి పూనుకుంది. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని ప్రాజెక్టులకు, ఎత్తిపోతల పథకాలకు నీరందడం గగనంగా మారనుంది. మరోపక్క భీమా నదిపై గూడూర్, యాద్గిర్ల వద్ద ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించి నీటిని నిల్వ చేస్తున్నది. వీటికి కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ లేవు. కర్ణాటక అక్రమ నిర్మాణంపై పక్షం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్‌కు, భారీ నీటిపారుదలశాఖ మంత్రికి ఫిర్యాదు చేశామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. -
జోక్యం చేసుకోం
కావేరి జలాల విషయంలో, మేఘదాతు డ్యాంల నిర్మాణంలో కర్ణాటక ప్రయత్నాల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఇది డెల్టా అన్నదాతల్లో ఆగ్రహం రేపుతోంది. సాక్షి, చెన్నై : తమిళనాడుకు కావేరి జలాల పంపిణీలో ప్రతి ఏటా కర్ణాటక సర్కారు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న విషయం తెలి సిందే. తాజాగా ఆ నీటిని అడ్డుకునే రీతిలో మేఘదాతులో డ్యాంల నిర్మాణానికి కసరత్తు ల్లో పడింది. దీనిపై రాష్ర్టంలో ఆగ్రహజ్వాల రగిలింది. ఎట్టకేలకు ప్రతి పక్షాలు ఓ వైపు, అధికార పక్షం మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని జోక్యం చేసుకోవాలని విన్నవించారు. డ్యాంల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరాయి. ఇందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చి పంపించారు. ఇంత వరకు బాగానే ఉన్నా మంగళవారం కోయంబత్తూరుకు వచ్చిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్జవదేకర్ చేసిన వ్యాఖ్యలు అన్నదాతల్లో , రైతు సంఘాల్లో, ప్రతి పక్ష పార్టీల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. జోక్యం చేసుకోం: కోయంబత్తూరు పీల మేడులో ఈసా సంస్థ నేతృత్వంలో 43 లక్షల మొక్కల నాటడం లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఇప్పటికే 33 శాతం మేరకు మొక్కల్ని నాటి ఉన్నారు. ఈఏడాదికిగాను మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రకాష్ జవదేక ర్ కావేరి జలాల విషయంలో, మేఘదాతులో డ్యాంల నిర్మాణ విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోబోదని వ్యాఖ్యానించారు. ఈ రెండు సమస్యలు రాష్ట్రాలకు సంబంధించిందని, వారి హక్కుల విషయంలో కేంద్రం వేలు పెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించడం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. రెండు నాల్కల ధోరణితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పయనిస్తున్నట్టుందని విమర్శిస్తున్నారు. ఇక, ప్రతి పక్షాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఉన్నాయి. బాధ్యత గల మంత్రి జోక్యం చేసుకోమని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కారణంగా మళ్లీ రాష్ట్రంలో ఆందోళనలు బయలు దేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. కర్ణాటకకు నోటీసు : ఇదిలా ఉండగా, కావేరి నదిలో మురికి నీరు కలుస్తుండడంపై పర్యావరణ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. న్యాయవాది సుదన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారణకు స్వీకరించింది. ఆ నదిలో ఏడాదికి 148 కోట్ల లీటర్ల మురికి కలుస్తున్నదని, కర్ణాటకలోని అనేక సంస్థలు ఆ నదిలోకి మురికి నీటిని వదలి పెడుతున్నాయని తన పిటిషన్లో ఆయన వివరించారు. దీనిని పరిశీలించిన చెన్నైలో ట్రిబ్యునల్ కర్ణాటక సర్కారుకు నోటీసులు జారీ చేసింది. జూలై 28లోపు వివరణ ఇవ్వాలని, మురికి నీరు కలుపుతున్న సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించింది. అలాగే, తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తూ, మురికి నీటి అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ పైమ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.