
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
హిజాబ్‌కు అనుమతివ్వాల్సిందే..
కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్‌కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment