సీబీఐకి కల్బర్గీ హత్య కేసు
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం
బెంగళూరు/ధార్వాడ్: ప్రముఖ హేతువాద నాయకుడు, అభ్యుదయవాది కల్బర్గీ హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సోమవారం కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కల్బర్గీ హత్యకు గురికావడం దురదృష్టకరమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. 77 ఏళ్ల కల్బర్గీని ధార్వాడ్‌లోని ఆయన ఇంటివద్ద ఆదివారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇటీవల హత్యకు గురైన మహారాష్ట్ర హేతువాది గోవింద్ పన్సారేకు కల్బర్గీ సహచరుడు.
సోమవారం ధార్వాడ్‌లో కల్బర్గీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. విగ్రహారాధనకు వ్యతిరేకంగా కల్బర్గీ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. అలాగే, సనాతన ఆచారాలు, మత విశ్వాసాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీశాయి.
కల్బర్గీ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర మీడియాకు తెలిపారు. దాంతోపాటు ఈ కేసు విచారణను సీఐడీ కూడా తక్షణమే చేపడుతుందని ఆయన చెప్పారు. కాగా పలువురు సాహితీవేత్తలు, విద్యార్థులు, రాజకీయనాయకులు, అభిమానులు కల్బర్గీకి నివాళులర్పించారు.