Minister tb Jaya Chandra
-
సీబీఐకి కల్బర్గీ హత్య కేసు
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెంగళూరు/ధార్వాడ్: ప్రముఖ హేతువాద నాయకుడు, అభ్యుదయవాది కల్బర్గీ హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సోమవారం కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కల్బర్గీ హత్యకు గురికావడం దురదృష్టకరమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. 77 ఏళ్ల కల్బర్గీని ధార్వాడ్లోని ఆయన ఇంటివద్ద ఆదివారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇటీవల హత్యకు గురైన మహారాష్ట్ర హేతువాది గోవింద్ పన్సారేకు కల్బర్గీ సహచరుడు. సోమవారం ధార్వాడ్లో కల్బర్గీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. విగ్రహారాధనకు వ్యతిరేకంగా కల్బర్గీ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్పీ, బజరంగ్దళ్ వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. అలాగే, సనాతన ఆచారాలు, మత విశ్వాసాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీశాయి. కల్బర్గీ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర మీడియాకు తెలిపారు. దాంతోపాటు ఈ కేసు విచారణను సీఐడీ కూడా తక్షణమే చేపడుతుందని ఆయన చెప్పారు. కాగా పలువురు సాహితీవేత్తలు, విద్యార్థులు, రాజకీయనాయకులు, అభిమానులు కల్బర్గీకి నివాళులర్పించారు. -
బిల్డర్లకూ ఫైన్
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర బెంగళూరు : అక్రమ-సక్రమ పథకం కింద బిల్డర్లకూ అపరాధ రుసుం విధించే విషయం ఆలోచిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. విధానసౌధాలో మీడియాతో గురువారం ఆయన మాట్లాడారు. ‘అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారి నుంచి కొంత అపరాధ రుసుం వసూలు చేసి ఆ కట్టడాలను సక్రమం చేసే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు అనుమతులు లేకుండా కట్టడాలను నిర్మించి వినియోగదారులకు విక్రయించారు. ఈ విషయం సదరు వినియోగదారులకు తెలియదు. ఇలాంటి విషయాల్లో బిల్డర్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలనే ఆలోచన ఉంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నాం.’ అని వివరించారు. ఇక మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విషయమై రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై అధికారులతో చర్చించి పరిష్కృత ధరను సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తామని మంత్రి టీ.బీ జయచంద్ర పేర్కొన్నారు. మేకదాటు వద్ద జలాశయన్ని నిర్మించే విషయమై నిర్వహించిన గ్లోబల్ టెండర్ ప్రక్రియలో ఆరు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయన్నారు. ఏ కంపెనీని ఇందుకోసం ఎంపిక చేయాలన్న విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.