బిల్డర్లకూ ఫైన్
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర
బెంగళూరు : అక్రమ-సక్రమ పథకం కింద బిల్డర్లకూ అపరాధ రుసుం విధించే విషయం ఆలోచిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. విధానసౌధాలో మీడియాతో గురువారం ఆయన మాట్లాడారు. ‘అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారి నుంచి కొంత అపరాధ రుసుం వసూలు చేసి ఆ కట్టడాలను సక్రమం చేసే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు అనుమతులు లేకుండా కట్టడాలను నిర్మించి వినియోగదారులకు విక్రయించారు. ఈ విషయం సదరు వినియోగదారులకు తెలియదు. ఇలాంటి విషయాల్లో బిల్డర్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలనే ఆలోచన ఉంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నాం.’ అని వివరించారు. ఇక మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విషయమై రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు.
ఈ విషయమై అధికారులతో చర్చించి పరిష్కృత ధరను సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తామని మంత్రి టీ.బీ జయచంద్ర పేర్కొన్నారు. మేకదాటు వద్ద జలాశయన్ని నిర్మించే విషయమై నిర్వహించిన గ్లోబల్ టెండర్ ప్రక్రియలో ఆరు కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయన్నారు. ఏ కంపెనీని ఇందుకోసం ఎంపిక చేయాలన్న విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.