అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి.
దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు.
సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్‌లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్‌పోస్టులు, హెలిప్యాడ్‌లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది.
ఎల్‌ఏసీ వెంట అధిక ముప్పు..
భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్‌హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్‌కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్‌లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్‌లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది.
చైనా నిర్మాణాలు
టిబెట్ పీఠభూమిలో
► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం
► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం
► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్‌లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు
► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్‌లు
► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు
► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి.
► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం
నేపాల్ వైపు
► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు
► ఉద్యాన వనాలు
► హైడ్రోపవర్ ప్రాజెక్టులు
► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు
► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన
భారత్ నిర్మాణాలు
► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు
► అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిమ్‌లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు
► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బదిరీనాథ్‌లను కలిపేలా చార్‌ధామ్ ప్రాజెక్టు
► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్‌పీడీ)హైవే
► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం
► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం
ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి.
► సింధు నదికి సమీపంలో చిలాస్‌లో డ్యామ్‌లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది.
► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది.
► అవలాంచ్‌లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి
► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్‌లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి.
► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్‌లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు.
► భారత్‌లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు.
► భారత్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి.
► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment