జోషిమత్: ఊరికి ఊరే కుంగిపోతోంది! ఎందుకో తెలుసా? | Land Sinking In Uttarakhand Holy Town Joshimath CM Seeks Report | Sakshi
Sakshi News home page

జోషిమత్: పవిత్రమైన ఆ ఊరు మొత్తం కుంగిపోతోంది! ఇళ్లకు పగుళ్లు.. ఎందుకో తెలుసా?

Published Thu, Jan 5 2023 1:14 PM | Last Updated on Thu, Jan 5 2023 2:05 PM

Land Sinking In Uttarakhand Holy Town Joshimath CM Seeks Report - Sakshi

అది పరమ పవిత్ర ప్రాంతం. హిందువులకు బద్రీనాథ్‌, సిక్కులకు హేమకుండ్ సాహిబ్ లాంటి పుణ్యక్షేత్రాలకు చేరువగా ఉండే నిలయం. హిమాలయాల పర్వతారోహకులకు అదొక ద్వారం. పైగా చైనా సరిహద్దులో భద్రత విషయంలో భారత కంటోన్మెంట్‌ ఏరియాగా కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి ఊరు కుంగిపోతోంది. ఉన్నట్లుండి వందల ఇళ్లకు.. రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ఏడాది కాలంగా పునరావాసం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఆ ఊరి ప్రజలు. రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో.. ముఖ్యమంత్రి తమకు ఓ పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ, అది జరగలేదు. అందుకే పోరాటాన్ని ఉధృతం చేశారు. 
  
డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమత్‌(చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వంద సంఖ్యలో ఇళ్లకు బీటలు వారాయి. అయినప్పటికీ ఉండడానికి మరో చోటులేక అక్కడే ఉండిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వం వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే అరవైకిపైగా కుటుంబాలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరికొందరి ఇళ్లు మరీ దారుణంగా తయారు అయ్యాయి. దీంతో 29 కుటుంబాలను అధికారులే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినా మరో 500 కుటుంబాలు అక్కడే భయం భయంగా గడుపుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనుకుంటూనే..  ఎక్కడ ఉండాలో తెలియక.. ఆవాసం కోసం బిక్కచూపులు చూస్తున్నాయి. 

ప్రభుత్వ స్పందన.. 
జోషిమత్‌లో భూమి కుంగడం, ఇళ్లకు పగళ్లు రావడంపై ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ స్పందించింది. ఐఐటీ రూర్కీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించి ఓ నివేదికను రూపొందించబోతోంది. ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి భావిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించబోతున్నారట. మూడు వేల మంది జనాభా ఉంటున్న ఈ ప్రాంతం.. ముప్పు ముంగిట ఉండడం వెనక కారణాల కోసం అన్వేషిస్తోంది ప్రభుత్వం.  

జోషిమత్‌లో ఇళ్లు మాత్రమే కాదు.. రోడ్లు కూడా దారుణంగా నాశనం అయ్యాయి. రవిగ్రామ్‌, గాంధీనగర్‌, మనోహర్‌బాగ్‌, సింగ్‌ధర్‌, పర్సారీ, ఉప్పర్‌బజార్‌, సునీల్‌, మార్వాడీ, లోయర్‌ బజార్‌.. ఇలా జోషిమత్‌లో పలు ఏరియాల్లో ఇళ్లకు పగళ్లు వచ్చాయి. అయినప్పటికీ పునరావాసం లేక అక్కడే ఉండిపోతున్నారు జోషిమత్‌ ప్రజలు. వెదరు బొంగులు, బరువైన వస్తువులను కుంగిపోతున్న నేలకు, గోడలకు సపోర్ట్‌గా ఉంచుతూ.. సునామీకి గొడుగు అడ్డుపెట్టే యత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడి పరిస్థితిపై నివేదిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సేవ్‌ జోషిమత్‌ కమిటీ కన్వీనర్‌ అతుల్‌ సతి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆధ్వర్యంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని, తమను కాపాడాలంటూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. 

కారణాలు అవేనా?
అయితే ఈ ప్రకృతి వైపరిత్యానికి గల సరైన కారణాలను తేల్చాల్సి ఉందని జోషిమత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శైలేంద్ర పవార్‌ చెబుతున్నారు. కానీ, జోషిమత్‌ భూకంపాలకు సంభావ్యత ఉన్న ప్రాంతం. చమోలీ జిల్లాకు ఆరు వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. హై రిస్క్‌ జోన్‌(జోన్‌-5) పరిధిలో ఉంది ఈ చోటు. పైగా భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలోనే ఇలా జరుగుతుందోనేమోనని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చమోలీ జిల్లా  జాయింట్ మేజిస్ట్రేట్ దీపక్ సైనీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

జోషిమత్‌కు పరమ పవిత​ ప్రాంతంగా వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు.. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్య నలు దిక్కుల నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి జోషిమత్‌(జ్యోతిర్‌మఠ్‌). ఉత్తరామ్నాయ మఠ్‌ పీఠం ఇది. (మిగతావి శృంగేరి, పూరీ, ద్వారకా). ఆదిశంకరాచార్య మఠంతో పాటు భవిష్య కేదార్‌ టెంపుల్‌, నార్సింగ్‌ ఆలయం, తపోవన్‌, గారి భవాని ఆలయం వీటితో పాటు ఔలీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్కడ ఉంది. 2021 ఉత్తరాఖండ్‌ వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యింది ఈ ప్రాంతం. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్‌ను బేస్‌ క్యాంప్‌గా సహాయక చర్యలకు ఉపయోగించారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement