land sink
-
జోషిమత్: ఊరికి ఊరే కుంగిపోతోంది! ఎందుకో తెలుసా?
అది పరమ పవిత్ర ప్రాంతం. హిందువులకు బద్రీనాథ్, సిక్కులకు హేమకుండ్ సాహిబ్ లాంటి పుణ్యక్షేత్రాలకు చేరువగా ఉండే నిలయం. హిమాలయాల పర్వతారోహకులకు అదొక ద్వారం. పైగా చైనా సరిహద్దులో భద్రత విషయంలో భారత కంటోన్మెంట్ ఏరియాగా కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి ఊరు కుంగిపోతోంది. ఉన్నట్లుండి వందల ఇళ్లకు.. రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ఏడాది కాలంగా పునరావాసం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఆ ఊరి ప్రజలు. రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో.. ముఖ్యమంత్రి తమకు ఓ పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ, అది జరగలేదు. అందుకే పోరాటాన్ని ఉధృతం చేశారు. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమత్(చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వంద సంఖ్యలో ఇళ్లకు బీటలు వారాయి. అయినప్పటికీ ఉండడానికి మరో చోటులేక అక్కడే ఉండిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వం వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే అరవైకిపైగా కుటుంబాలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరికొందరి ఇళ్లు మరీ దారుణంగా తయారు అయ్యాయి. దీంతో 29 కుటుంబాలను అధికారులే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినా మరో 500 కుటుంబాలు అక్కడే భయం భయంగా గడుపుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనుకుంటూనే.. ఎక్కడ ఉండాలో తెలియక.. ఆవాసం కోసం బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ స్పందన.. జోషిమత్‌లో భూమి కుంగడం, ఇళ్లకు పగళ్లు రావడంపై ఎట్టకేలకు ఉత్తరాఖండ్ స్పందించింది. ఐఐటీ రూర్కీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించి ఓ నివేదికను రూపొందించబోతోంది. ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భావిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించబోతున్నారట. మూడు వేల మంది జనాభా ఉంటున్న ఈ ప్రాంతం.. ముప్పు ముంగిట ఉండడం వెనక కారణాల కోసం అన్వేషిస్తోంది ప్రభుత్వం. జోషిమత్‌లో ఇళ్లు మాత్రమే కాదు.. రోడ్లు కూడా దారుణంగా నాశనం అయ్యాయి. రవిగ్రామ్, గాంధీనగర్, మనోహర్‌బాగ్, సింగ్‌ధర్, పర్సారీ, ఉప్పర్‌బజార్, సునీల్, మార్వాడీ, లోయర్ బజార్.. ఇలా జోషిమత్‌లో పలు ఏరియాల్లో ఇళ్లకు పగళ్లు వచ్చాయి. అయినప్పటికీ పునరావాసం లేక అక్కడే ఉండిపోతున్నారు జోషిమత్ ప్రజలు. వెదరు బొంగులు, బరువైన వస్తువులను కుంగిపోతున్న నేలకు, గోడలకు సపోర్ట్‌గా ఉంచుతూ.. సునామీకి గొడుగు అడ్డుపెట్టే యత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడి పరిస్థితిపై నివేదిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సేవ్ జోషిమత్ కమిటీ కన్వీనర్ అతుల్ సతి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆధ్వర్యంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని, తమను కాపాడాలంటూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కారణాలు అవేనా? అయితే ఈ ప్రకృతి వైపరిత్యానికి గల సరైన కారణాలను తేల్చాల్సి ఉందని జోషిమత్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ చెబుతున్నారు. కానీ, జోషిమత్ భూకంపాలకు సంభావ్యత ఉన్న ప్రాంతం. చమోలీ జిల్లాకు ఆరు వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. హై రిస్క్ జోన్(జోన్-5) పరిధిలో ఉంది ఈ చోటు. పైగా భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలోనే ఇలా జరుగుతుందోనేమోనని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చమోలీ జిల్లా జాయింట్ మేజిస్ట్రేట్ దీపక్ సైనీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జోషిమత్‌కు పరమ పవిత ప్రాంతంగా వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు.. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్య నలు దిక్కుల నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి జోషిమత్(జ్యోతిర్మఠ్). ఉత్తరామ్నాయ మఠ్ పీఠం ఇది. (మిగతావి శృంగేరి, పూరీ, ద్వారకా). ఆదిశంకరాచార్య మఠంతో పాటు భవిష్య కేదార్ టెంపుల్, నార్సింగ్ ఆలయం, తపోవన్, గారి భవాని ఆలయం వీటితో పాటు ఔలీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్కడ ఉంది. 2021 ఉత్తరాఖండ్ వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యింది ఈ ప్రాంతం. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్‌ను బేస్ క్యాంప్‌గా సహాయక చర్యలకు ఉపయోగించారు కూడా. -
ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయిన శాస్త్రవేత్తలు
-
ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయిన శాస్త్రవేత్తలు
సాక్షి, కడప : హఠాత్తుగా పడుతున్న గుంతలు వైఎస్ఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అలజడి రేపుతున్నాయి. వర్షం పడితే ఎక్కడ భూమి కుంగుతుందో తెలియక అక్కడి ప్రజలు వణుకుతున్నారు. ఏదో మాయలా సమీపంలోని భూమి కుంగడం, ఆ గుంతల్లోంచి గాలి వీస్తున్నట్లు శబ్దాలు రావడం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఠారెత్తించిన ఇలాంటి గుంతలు ఇప్పుడు మళ్లీ మంగళవారం కనిపించాయి. అప్పట్లో అవి ఎందుకు ఏర్పడ్డాయో ఎవరూ చెప్పలేక పోయారు. రోజుల తరబడి వర్షాలు పడిన ప్రతిసారి బుగ్గవంక ప్రాజెక్టు సమీప గ్రామాల్లో ఇలాంటి గుంతలు ఏర్పడుతున్నాయి. 2015 సంవత్సరం అక్టోబర్‌లో వర్షాలు బాగా కురవడంతో చింతకొమ్మదిన్నె మండలంలోని అనేకచోట్ల భూమి కుంగిపోయి గుంతలు ఏర్పడ్డాయి. మొదటగా నాయనోరిపల్లెలో ఈ గుంతలు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని నీటి ట్యాంకు కూడా కూలిపోయింది. అనంతరం బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంతోపాటు గూడావాండ్లపల్లె, చిన్నము సల్రెడ్డిపల్లె, బుగ్గలపల్లె, నాగిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో సుమారు 40 గుంతలు ఏర్పడ్డాయి. అప్పట్లో నాయనోరిపల్లె గ్రామాన్ని ఖాళీ చేయించి ఇందిరానగర్‌లో ఉన్న ఓ అనాథ శరణాలయంలో గ్రామస్తులకు కొన్ని నెలలపాటు ఆశ్రయం కల్పించారు. వేంపల్లె మండలంలో కూడా గుంతలు పడ్డాయి. బయటపడని గుంతల రహస్యం ఈ గుంతల పరిశీలనకు హైదరాబాదుకు చెందిన శాస్త్రవేత్తలు వచ్చినా రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. భూమిలోపల సున్నపు పొర ఉండటంతో వర్షం పడినపుడు గుంతలు ఏర్పడుతున్నాయని చెప్పి వెళ్లిపోయారు. గతంలో ఎప్పడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఏర్పడుతున్నాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత ఢిల్లీ నుంచి శాస్త్రవేత్తలు వస్తారని అధికారులు చెప్పినా.. వారు రాకపోవడంతో రహస్యం అలాగే ఉండిపోయింది. వర్షం పడగానే మళ్లీ గుంతలు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంతోపాటు గూడావాండ్లపల్లె సమీపంలోని మామిడితోటలో మంగళవారం రెండు గుంతలు పడ్డాయి. గుంతల రహస్యాన్ని చేధిస్తే గానీ తమలో ఆందోళన తొలగిపోదని స్థానికులు పేర్కొంటున్నారు. బుగ్గవంక ప్రాజెక్టు వల్లే ఇలా అవుతోందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహించాలి: ఆర్కే
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... రాజధానిలో మొన్న ఇళ్ళు కుంగాయి. నేడు తాత్కాలిక సచివాలయం ప్లోరింగ్ కుంగింది. నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఈ భూమి రాజధానికి పనికిరాదు అని చెప్పినా స్వార్ధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి మాటలను పెడ చెవిన పెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం బాబు చదివి ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పంతాలకు పోకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలి.' అని డిమాండ్ చేశారు. కాగా సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో గురువారంనాడు మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. -
అమరావతిలో కలకలం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం పనుల్లో కలకలం రేగింది. సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కొంతమేర నేల కుంగిపోయింది. మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రులకు, ప్రిన్సిపాల్ కార్యదర్శలకు కేటాయించనున్న బ్లాకులో నిర్మాణ లోపాలు బయట పడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి జూన్ 27కల్లా వెలగపూడికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించడంతో తాత్కాలిక సచివాలయం పనులు హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తమకు కొంత సమయం కావాలని ఉద్యోగులు కోరినా చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులు వచ్చి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరుకు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేయాలని భావించారు. కాగా ఈ వార్తల్ని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లికార్జున ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు అమరావతి రాజధాని నగర పరిధిలో తుళ్లూరు మండలం వెలగపూడి దగ్గర నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్సు ప్రాంతంలో నేల కుంగినట్టు సాక్షి టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న వార్తలో వాస్తవం లేదని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ డాక్టర్ ఎ. మల్లికార్జున తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టే ముందుగానే సాయిల్ టెస్టింగ్ చేసి అనుకూలమైన చోటే పనులు చేపట్టామన్నారు. రెండో బ్లాకులో ఫ్లోరింగ్ దెబ్బతిన్నదని సాక్షి చానల్ ఇచ్చిన వార్త అవాస్తవమన్నారు. నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మల్లికార్జున పేర్కొన్నారు. నేల కుంగడంతో మళ్లీ పనులు చేస్తున్నట్టు ఇచ్చిన వార్తలోనూ వాస్తవం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ భవనాల కాంప్లెక్సులో ఎక్కడా నేల కుంగలేదన్నారు. కొత్తగా ఎటువంటి పనులు ప్రారంభించలేదని, లూజ్ సాయిల్ వల్లే అలా జరిగి ఉండవచ్చని అనుమానం సరికాదన్నారు. -
నాయినోరిపల్లెలో కుంగుతున్న భూమి..
వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నాయినోరిపల్లెలో భూమి కుంగిపోతోంది. దాంతో ఊరి జనం భయంతో వణికిపోతున్నారు. భూమి కుంగి తమ ఇళ్లు ఎక్కడ కూలిపోతాయోనని శనివారం రాత్రి ఊరి ప్రజలందరూ పాఠశాల సమీపంలో కాస్త ఎత్తై ప్రదేశంలో గుమిగూడి జాగారం చేస్తున్నారు. ఇళ్లన్నీ ఖాళీచేసేశారు. రెండు రోజులుగా ఆ పల్లెలో ని భూమి పెద్ద శబ్దాలు చేస్తూ కుంగిపోతోంది. బావి తవ్వినట్లు పెద్దపెద్ద గోతులు పడుతున్నాయి. నాయినోరిపల్లెలో మూడు చోట్ల గోతులు ఏర్పడ్డాయి. పక్కనేఉన్న బుగ్గమల్లెశ్వరస్వామి ఆలయం వద్ద 15 చోట్ల భూమి కుంగింది. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పైకిరావడంతో భూమిలో పొరలు ఏర్పడి లోపలికి కుంగుతోందని అధికారులు అంటున్నారు. విషయం తెలిసిన జిల్లా ఉన్నతాధికారులు శనివారం ఆ గ్రామాన్ని సందర్శించారు. పైనుంచి పెద్ద పెద్ద గుండ్లు వేసినట్లు శబ్దం చేస్తూ భూమి కుంగుతున్న విషయం గమనించారు.