Himalayas
-
ఇది సిమ్లా యాపిల్ కాదు... కల్పా యాపిల్
యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం. ‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్‌ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్‌లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు. కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్‌లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి. (చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
‘అమ్మో’ అన్నవారే ‘ఆహా’ అంటున్నారు! ఇతిషా మహిమే!
అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.అరుణాచల్‌ప్రదేశ్‌లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్‌లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మూలన పడ్డాయి. లాక్డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్‌లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్ఎఫ్) సెంటర్లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది. వారిలో ఒకరిగా...అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా View this post on Instagram A post shared by Northeast Waste Collective (@northeastwastecollective) -
Mahima Mehra: స్వచ్ఛందాల మహిమాలయం
హిమాలయాలు అంటే మంచు అందాలు గుర్తు రావచ్చు. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియవచ్చు. మరోవైపు చూస్తే... అందమైన హిమాలయప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో పేదరికరం ఉంది. నిరక్షరాస్యత ఉంది. నిరుద్యోగం ఉంది. వ్యసనాలు ఉన్నాయి. చుట్టపు చూపుగా హిమాలయాలకు వెళ్లాలనుకోలేదు మహిమ మెహ్ర.వారిలో ఒకరిగా బతకాలనుకుంది. వారి బతుకు బండికి కొత్త దారి చూపాలనుకుంది.పుణె, దుబాయ్‌లలో బోధన రంగంలో దశాబ్దకాలం పనిచేసింది మహిమ మెహ్ర. పుణెలోని ‘స్పెక్ట్రమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, నిరుపేద ప్రజల కోసం పనిచేసిన మహిమ తన సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, పర్యావరణ స్పృహకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన వాతావరణం మధ్య పనిచేయాలనే ఆసక్తి మహిమను లద్దాఖ్‌కు తీసుకువెళ్లింది. ఈ హిమాలయప్రాంతానికి రావడంతో ఆమె జీవితమే మారి΄ోయింది.‘ఇది నా జీవితాన్ని మార్చిన ప్రయాణం. ఇక్కడ నేను అవసరమైన వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాను’ అంటుంది మహిమ. సేవాకార్యక్రమాలు చేయడానికి పట్టణాలు లేదా పల్లెలను ఎంపిక చేసుకుంటారు. హిమాలయప్రాంతం మారుమూలలో నివసిస్తున్న వారిపై తక్కువమంది దృష్టి పడుతుంది. వీరి గురించి తెలుసుకున్న తరువాత మార్పు తీసుకురావాలనే తపన మహిమలో మొదలైంది. ఆ తపనే వందలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకువచ్చింది.‘నగరానికి చెందిన వారు గ్రామీణ్రపాంత ప్రజలతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటారు. గ్రామీణ ప్రజలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించడం ఆ మార్పులో ఒకటి’ అంటుంది మహిమ మెహ్ర.హిమాలయప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో పనిచేయాలనుకున్నప్పుడు వారి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది మహిమ. ఒక ఆన్లైన్ సెషన్లో మహిమకు పంకీ సూద్ పరిచయం అయ్యాడు. సూద్ ద్వారా హిమాలయప్రాంత ప్రజల గురించి మహిమకు కొంత అవగాహన వచ్చింది.‘కులు లోయలోని పిల్లల కోసం మీరు కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తే బాగుంటుంది’ అని సూచించాడు సూద్. వెంటనే అక్కడికి వెళ్లి వర్క్‌షాప్‌లు మొదలు పెట్టింది. ఈ వర్క్‌షాప్‌లకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వచ్చేవాళ్లు. ఆ తరువాత ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ను మొదలుపెట్టింది. ఈ సెంటర్ కోసం ఉపాధ్యాయుల సహకారం అవసరం కావడంతో ఫేస్బుక్ పేజీ ్రపారంభించింది.వాలంటీర్లను ఆహ్వానించింది. మొదట్లో 10 ఆ తరువాత... 15...ఆ తరువాత 50 నుంచి 500 వరకు వాలెంటీర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ‘సన్‌షైన్ లెర్నింగ్’ తరఫున పనిచేయడానికి 24,500 పైగా వాలెంటీర్లు ఉన్నారు.ఈ అనూహ్యమైన స్పందనే ‘హిమాలయన్ వాలంటీర్ టూరిజం’ ఏర్పాటుకు దారి తీసింది. హిమాలయప్రాంతంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేవి హిమాలయన్ వాలంటీర్ టూరిజం(హెచ్విటీ) లక్ష్యాలు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ‘హెచ్విటీ’ మొదటి ్రపాజెక్ట్ మొదలైంది. నాలుగు గ్రామాల నుంచి ఎంతోమంది ‘హెచ్విటీ’ వర్క్‌షాప్‌లకు హాజరయ్యారు. లెర్నింగ్ యాక్టివిటీస్‌లో భాగం అయ్యారు.డిగ్రీ చేసిన అమ్మాయిలు ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ ద్వారా ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని నామమాత్రం వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ‘హెచ్విటీ’ హిమాలయాలలోని ఎన్నోప్రాంతాలలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. పది టాయ్ లైబ్రరీలను, 35కి పైగా పుస్తక లైబ్రరీలను ఏర్పాటు చేసింది. విద్యకు సంబంధించిన వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి, వృత్తి విద్యకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు హిమాలయప్రాంతంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి.అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు. చదువుపైనే కాదు రివర్స్ మైగ్రేషన్, ఆర్థిక స్థిరత్వం, రెవెన్యూ జెనరేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయప్రాంతాల్లో పనిచేయాలనే తన ఆలోచన విన్న కొందరు.... ‘అంత దూరం వెళతావా!’ అని ఆశ్చర్య΄ోయారు. అలా ఆశ్చర్య΄ోయిన వారే ఇప్పుడు ‘ఇంత మార్పు తీసుకువచ్చావా’ అని మహిమ మెహ్రను అభినందిస్తున్నారు. -
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్‌లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం
రుద్రప్రయాగ్: కేదర్నాథ్లో దైవదర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అద్భుత దృశ్యం ఆహ్వానం పలికింది. హిమాలయ పర్వత శిఖరాల నుంచి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతున్న ‘హిమపాతం’ దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యం, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది. భక్తులు ఒకింత భయపడుతూనే ఆ దృశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు–సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్‌పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్నాథ్ ఆలయం దాకా దూసుకురాలేదు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. -
హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు
యశవంతపుర: ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వతాలలో విహారయాత్రకు వెళ్లి ఉత్తరకాశీ జిల్లా సహస్ర తాల్ వద్ద మంచు తుపానులో చిక్కుకున్న కన్నడిగుల విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సుమారు 18 మంది బెంగళూరు గత నెలాఖరులో హిమాలయాల ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కానీ మంగళవారం సంభవించి మంచు తుపానులో 5 మంది మరణించి, 9 మంది గల్లంతయ్యారు. గురువారానికి మృతుల సంఖ్య 9 కి పెరిగింది.కన్నడిగుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చే విషయంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మంత్రి కృష్ణబైరేగౌడ చర్చలు జరిపారు. గురువారం ఉదయం 11 గంటలకు 9 మృతదేహాలకు ఉత్తరకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. అక్కడి నుంచి విమానంలో డెహ్రాడూన్‌కు తరలించారు. మరణించిన తొమ్మిది మంది ట్రెక్కర్ల మృతదేహాలలో ఐదుగురి మృతదేహాలు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాయి. మిగిలిన నాలుగు మృతదేహాలు మరో విమానంలో చేరుకోనున్నాయి.Update on Uttarakhand Trekkers: After a continuous two-day rescue operation, the bodies of five out of the nine deceased trekkers have arrived at Bangalore Airport. The remaining four bodies will be arriving on the next flight. We paid homage to these trekkers, who succumbed to… pic.twitter.com/ZkltXtLWR9— Krishna Byre Gowda (@krishnabgowda) June 7, 2024 మృతులు వీరే మృతుల్లో ముగ్గురు పురుషులు, ఆరుమంది మహిళలు ఉన్నారు. ఇందులోనే మృతుడు సుధాకర్ (71) ఉన్నారు. ఆయనే కర్ణాటక మౌంటెనీరింగ్ సంఘం (కేఎంఏ)ని స్థాపించి తరచూ ఔత్సాహికులను హిమాయల పర్వతాల అధిరోహణకు తీసుకెళ్లేవారని తెలిసింది. మిగతా మృతుల వివరాలు.. సింధు వకీలం (44), సుజాత ముంగుర్‌వాడి (52), ఆమె భర్త వినాయక్.బి (52), చిత్రా ప్రణీత్ (48), కె.వెంకటేష్ ప్రసాద్ (53), కేపీ పద్మనాభ (50), అనితా రంగప్ప (55), పద్మిని హెగ్డే (34) ఉన్నారు. వీరందరూ బెంగళూరు వాసులే. తమవారు ఇక లేరని తెలిసి వారి పిల్లలు, జీవిత భాగస్వాములు తీవ్ర శోకంలో మునిగిపోయారు. -
Aurora borealis: వినువీధిలో రంగుల వలయాలు
చుట్టూరా తెల్లగా పరుచుకున్న హిమాలయాలు. పైన లేత ఎరుపు రంగు కాంతులు. ఈ వింత వెలుగులు లద్దాఖ్‌లోని హాన్లే వినువీక్షణ కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆకాశ వీధిలో ఇలా కనువిందు చేశాయి. చూపరులను కన్ను తిప్పుకోనివ్వకుండా కట్టిపడేశాయి. భూ అయస్కాంత క్షేత్రం గుండా ప్రసరించే కాంతి సౌర తుఫాన్ల కారణంగా చెదిరిపోవడం వల్ల ఆకాశంలో ఇలాంటి అందమైన కాంతులు ఏర్పడుతుంటాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ల్లోని ఎత్తైన ప్రాంతాల నుంచి అత్యంత స్పష్టతతో కని్పంచే ఈ అద్భుత కాంతి వలయాలకు అరోరా అని పేరు. ఇవి ఏర్పడే దిక్కును బట్టి అరోరా బొరియాలిస్ (ఉత్తర కాంతులు), అరోరా ఆస్ట్రలిస్ (దక్షిణ కాంతులు) అని పిలుస్తారు. ఇవి చాలా రంగుల్లో అలరిస్తాయి. అయితే లద్దాఖ్‌లో కనువిందు చేసినవి అత్యంత అరుదైన ఎరుపు రంగు కాంతులు. అత్యంత మనోహరంగా ఉండటమే గాక ఎక్కువసేపు స్థిరంగా కని్పంచడం ఈ ఎరుపు కాంతుల ప్రత్యేకత. లద్దాఖ్‌తో పాటు అమెరికా, రష్యా, ఆ్రస్టేలియా, యూరప్‌లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలండ్ తదితర దేశాల్లో అరోరాలు కనువిందు చేశాయి.ఐదు తీవ్ర సౌర తుపాన్లు సూర్యుని ఉపరితలంపై ఏఆర్13664గా పిలిచే చోట గత బుధవారం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన ఐదు తుపాన్లు సంభవించాయి. తద్వారా అపార పరిమాణంలో విడుదలైన శక్తి కణాలు ఈ వారాంతం పొడవునా సౌరవ్యవస్థ గుండా ప్రయాణించనున్నాయి. ఆ క్రమంలో భూ అయస్కాంత క్షేత్రంతో ప్రతిచర్య జరిపే క్రమంలో అవి చెదిరిపోతూ ఆకాశంలో ఈ అందాల కాంతి వలయాలను సృష్టించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యంత తీవ్రతతో కూడిన సౌర తుపాన్లు ఇవేనని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని అసాధారణ పరిణామంగా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్ అభివరి్ణంచింది. 2003లో ఇలాంటి సౌర తుపాన్ల కారణంగా స్వీడన్లో పలు ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి, సరఫరాలకు అంతరాయం కలిగింది. దక్షిణాఫ్రికాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. – వాషింగ్టన్ -
అంత ఎత్తు ఎలా అయ్యాయి?
హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన కొండలని అందరికీ తెలుసు. అందులోని ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనదని అందరూ అనుకుంటారు. అది నిజమా, కాదా అన్న చర్చ ఇప్పుడు మనకు అప్రస్తుతం. ఇంతకు హిమాలయాలు అంత ఎత్తుకు ఏ రకంగా ఎదిగాయి అన్న ప్రశ్నకు కూడా చాలా రోజులుగా ఒక జవాబు ఉంది. అదీ నిజమా, కాదా అన్న సంగతి మామూలు మనుషులకే కాదు పరిశోధకులకు కూడా తెలియదు. అయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంగతి ఏమిటంటే ఇప్పటివరకు హిమాలయాలు అంత ఎత్తుకు చేరడానికి గల కారణం గురించి తెలిసిన సంగతులు అంతగా నిజం కాదని! భూమి ఉపరితలం టెక్టానిక్ ప్లేట్స్ అనే విడిభాగాల రూపంలో ఉంది. ఆ భాగాలు కదులుతూ ఉంటాయి. అలా కదిలే ఒక భాగం వచ్చి తగిలినందుకు హిమాలయాలు అంత ఎత్తుకు ఎగిశాయని అందరూ అనుకుంటున్నారు. హిమాలయాలలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ప్రస్తుతం 8,849 మీటర్ల ఎత్తు ఉన్నది. కొత్తగా జరిగిన పరిశోధనల ప్రకారం, హిమాలయాలు కానీ, అందులోని ఎవరెస్టు కానీ అంత ఎత్తుకు చేరడానికి టెక్టానిక్ ప్లేట్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం కారణం కానే కాదనీ, అంతకుముందే అవి దాదాపు అంత ఎత్తుగా ఉన్నాయనీ తెలిసింది. ప్లేట్లు గుద్దుకున్నందుకు హిమాలయాల ఎత్తు పెరగడం నిజమే, కానీ అప్పటికే అవి ఎంతో ఎత్తుగా ఉన్నాయి, అందుకు కారణం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదంటున్నారు పరిశోధకులు. ఒక ఖండం ముక్క వచ్చి ఇంకొక ఖండం ముక్కకు తగిలితేనే ఇటువంటి మార్పులు కలుగుతాయని చాలాకాలం వరకు పరిశోధకులు అనుకున్నారు. అప్పుడు మాత్రమే రెండు ముక్కలు తగిలిన ప్రాంతం మరీ ఎత్తుకు చేరుకుంటుందని కూడా అనుకున్నారు. యూఎస్‌లోని ‘బ్రౌన్ విశ్వవిద్యాలయం’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డేనియల్ ఇబారా బృందం వారు ఈ మధ్యన ఈ అంశాన్ని గురించి ఒక వైజ్ఞానిక పత్రాన్ని వెలువరించారు. ‘నేచర్ జియోసైన్సెస్’ అనే ప్రఖ్యాత వైజ్ఞానిక పత్రికలో ఆ పత్రం ప్రచురించబడింది. ఈ పత్రం కారణంగా ఆ రంగంలోనే కొత్త మలుపులు వచ్చాయనీ, పరిశోధన మరొక మార్గంలో సాగుతుందనీ ప్రపంచమంతటా నిపుణులు అంటున్నారు. అమెరికా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందానికి చైనాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్’ వారు కూడా ఈ పరిశోధనలో సహకరించారు. ‘సెడిమెంటరీ శిలల’ నిర్మాణాల ఎత్తు గతంలో ఉండిన తీరు గురించి పరీక్షించడానికి వీరంతా కలిసి ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. అంగారక శిలలను పరిశీలించడంలో వాడుతున్న ఒక పద్ధతిని ఈ పరిశోధకులు ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు. హిమాలయాలలోని శిలల్లో ఉన్న ఐసోటోపుల కొలతలు తీసి వాటి ప్రకారం శిలల కాలం ఎప్పటిది అని వారు నిర్ణయించారు. ఐసోటోపులు అంటే ఒకే రసాయనం తాలూకు వేరువేరు రకాలు. ఈ పద్ధతి గురించి మరింత చెబితే అది చాలా సాంకేతికంగా ఉండవచ్చు. కొండకు వెచ్చని గాలి తగిలి అది పైకి లేచి కొండకు ఆవలి భాగంలోకి ప్రవేశించి చల్లబడుతుంది. అప్పుడది వర్షం గానూ, మంచు గానూ కిందకు రాలుతుంది. గాలి పైకి వెళ్ళిన కొద్దీ అందులోని రసాయనాల తీరు మారుతుంది. ఎక్కువ న్యూట్రాన్లు గల ఆక్సిజన్ వంటి రసాయనాలు, అంటే ఐసోటోపులు బరువుగా ఉండి, మేఘాల నుంచి ముందే కిందకు జారుతాయి. ఇక తేలిక ఐసోటోపులు కొండపై కొమ్ము మీద ఆ తరువాత వచ్చి రాలుతాయి. మూడు సంవత్సరాల పాటు ఈ ఐసోటోపులను పరిశీలించిన తరువాత టెక్టానిక్ ప్లేట్ అంచులో ఉన్న హిమాలయ పర్వతాలు అప్పటికే 3,500 మీటర్ల కన్నా ఎత్తు లేదా ఇంచుమించు అంత ఎత్తులో ఉన్నాయని గమనించారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎత్తులో ఇది 60 శాతం కన్నా ఎక్కువన్నమాట. ఈ రకంగా చూస్తే హిమాలయాల చుట్టుపక్కల గల పాతకాలపు వాతావరణ వివరాలు మరొకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ టిబెట్‌లోని ప్రాచీన కాలపు శీతోష్ణస్థితి గురించి కొత్త సిద్ధాంతాలు ఈ రకంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదే పద్ధతిలో ఆండీస్, సియెరా నెవాడా పర్వతశ్రేణులనూ, అక్కడి ప్రాచీన వాతావరణ పరిస్థితులనూ మరొకసారి విశ్లేషించే అవకాశం కూడా ఉంది. గతంలోని శీతోష్ణస్థితులను గురించి ఉన్న సిద్ధాంతాల తీరు మారనుందనీ, ఆయా ప్రాంతాలలోని గత కాలపు శీతోష్ణస్థితులను గురించిన సిద్ధాంతాలూ, ఆలోచనలూ కొత్తదారి పట్టే పద్ధతి కనబడుతున్నదనీ, అక్కడి జీవవైవిధ్యం గురించి కూడా అవగాహనలు మారుతాయనీ అంటారు ఇబారా. కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు తక్షణం ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ప్రపంచం, దాని గురించి అవగాహన కలిగించే సైన్సు క్రమంగా మారుతున్నాయని అర్థం కావడం మాత్రం అసలైన నిజం! కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
India Environment Report – 2024: హిమగిరులకు పెనుముప్పు!
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది. నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్ అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్‌డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నటుడి నగ్న ఫోటోలు.. మీరు అలా ఎందుకు చేయకూడదు?
గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నగ్నంగా ఓ మేగజైన్ కవర్ ఫోటోగా ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఆయన బాటలోనే మరో బాలీవుడ్ నటుడు కనిపించి అందరికీ షాకిచ్చాడు. గతేడాది విద్యుత్ జమ్వాల్ తన పుట్టిన రోజు సందర్భంగా హిమాలయల్లో నగ్నంగా కనిపిస్తూ ఉన్న ఫోటోలను పంచుకున్నారు. అతని ఫోటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. కొందరు విమర్శించగా.. మరికొందరు మద్దతుగా పోస్టులు పెట్టారు. తాజాగా విద్యుత జమ్వాల్ ఆ ఫోటోలపై స్పందించారు. అలా ఉండడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. విద్యుత్ జమ్వాల్ మాట్లాడుతూ..' నాకు సొంత పనులు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినట్లు లైఫ్‌ను ఎంజాయ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. ఇష్టమైన పుస్తకాన్ని చదవడం చాలా ఇష్టం. మీరు చూసిన ఈ ఫోటోలు నేను గత 14 ఏళ్లుగా సందర్శించిన వాటిలో ఒక భాగం మాత్రమే. ఈ విషయంలో నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ నగ్నంగా ఉండి తమ కోసం సమయం ఎందుకు కేటాయించకూడదు. మీరు అలా చేస్తే ఈ ప్రపంచంలో సిగ్గుపడని ఏకైక వ్యక్తి మీరు మాత్రమే.' అని అన్నారు. మీ నగ్న చిత్రాలపై వచ్చిన కామెంట్స్ బాధించాయా అని ప్రశ్నించగా.. 'ఇలాంటి చిన్న విషయాలు కేవలం దోమ కుట్టినట్లుగా మాత్రమే అనిపిస్తాయని అన్నారు. ఇలాంటి విమర్శలు నన్ను ఏ విధంగా బాధించవని చెప్పారు. ఎందుకంటే అది తన గురించి ఒకరి అభిప్రాయం మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం క్రాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. My retreat to the Himalayan ranges - “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y — Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023 -
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్‌లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్‌లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్‌లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్‌లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్‌ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్‌లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
IAF: కార్గిల్‌లో నైట్ ల్యాండింగ్
భారత వాయుసేన (ఐఏఎఫ్) అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్‌పై సి–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రి పూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ఈ ఎయిర్ స్ట్రిప్‌పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి! గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఐఏఎఫ్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి. నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్‌వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాల్లో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ర్స్టిప్లు సేవలందిస్తున్నాయి. ఎల్ఏసీ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్జీ) సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్ కావడం గమనార్హం. వాయుసేన వద్ద 12 సి–130జే విమానాలున్నాయి. ఇవి సైనికుల తరలింపు, సహాయక సామగ్రి రవాణాలో ఉపయోగపడుతున్నాయి. – న్యూఢిల్లీ -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్‌కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్‌ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్‌షాప్‌లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్‌షాప్‌లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్‌లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్‌ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్‌కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్‌గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్‌లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
ఆ ఊరిలోని మహిళలు ఏడాదిలో ఐదు రోజులు దుస్తులు లేకుండా..
కొన్ని ఊర్లలో చాలా వింతైనా ఆచారాలు ఉంటాయి. వింటేనా చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఊరిలా ఓ వింత ఆచారం ఉంది. అది వింటే ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. బాబోయ్ ఇదేమి ఆచారం రా బాబు అనేస్తారు. అంత వింతగా జుగుప్సకరంగా ఉంటుంది. వివరాల్లోకెళ్తే..హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి ఒడిలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఇది సాంప్రదాయ జీవన విధానానికి చాలా ప్రసిద్ధి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ గ్రామంలో ఉత్సుకతను రేకెత్తించే ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ పిని గ్రామంలో మహిళలంతా స్వచ్ఛందంగా ఏడాదిలో ఒక ఐదు రోజుల పాటు దుస్తులు ధరించడం మానేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. ఎందుకిలా అంటే?.. గ్రామస్తులు ప్రకృతికి, స్థానిక దేవత పట్ల ప్రగాఢమైన గౌరవం, కృతజ్ఞతకి గుర్తుగా ఇలా చేస్తారట. ఐదురోజుల పాటు బట్టలు లేకుండా ప్రకృతితో గడుపుతరట. తమ గ్రామంలోని స్త్రీలు సూర్యుని కాంతి, వెలుగు, స్వచ్ఛమైన గాలిని తమ మేనిపై స్వాగతించేలా ప్రకృతిని ఆలంగినం చేసుకుంటారని అక్కడ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. ఈ సంప్రదాయం వెనుకు ఉన్న ప్రధాన కారణం తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా స్త్రీలు వివస్త్రగా ఉంటారట. ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ.. ఇలా బట్టలు విప్పి తమ గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ ఐదు రోజులు వారికి గొప్ప ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక భక్తి మార్గం అని చెప్పాలి. అంతేగాదు దుస్తులు దైవంతో అనుబంధం ఏర్పరుచుకోవడానికి అవరోధంగా అక్కడ మహిళలు భావిస్తారట కూడా. నిజమే కదా! ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే మనల్ని సృష్టించిన భగవంతుడు ముందు సిగ్గు, బిడియం ఉండకూదు. మనం చిన్నగా ఉన్నప్పుడూ మన తల్లిదండ్రలు వద్ద ఎలా ఉంటామో అలానే భగవంతుడితో ఉండాలని చెప్పకనే చెబుతున్నారు వీళ్లు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: 62వ వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది. యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా, మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. -
AP: వచ్చే నెల వర్షాలే వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే నెల ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ సీజన్లో కొద్దిరోజులుగా కానరాని వర్షాలు నాలుగైదు రోజుల్లో తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి. ⛈️ ఆగస్టులో వర్షాల జాడ లేదు. ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. ఆ మధ్య సమయంలోనే కొద్దిరోజుల పాటు బ్రేక్ మాన్సూన్ (వర్షాలకు విరామం) ఏర్పడి వానలకు అడ్డుకట్ట వేస్తుంది. ⛈️ అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు. ⛈️ ఈ ద్రోణి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ⛈️ రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకు మించి ఒకింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ కూడా అంచనా వేసింది. జాడలేని అల్పపీడనాలు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్‌నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్‌లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్‌లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
పర్వతాలు పిలిచాయి
‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్ మ్యూర్. ఒకానొక సమయంలో శాలిని సింగ్‌కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్‌లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్.... లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్ పీజీ కాలేజీలో శాలిని సింగ్ బీఏ స్టూడెంట్. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని. 19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు. ఎన్సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్‌లో శాలిని సింగ్ సీనియర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జమ్ములోని పహల్గామ్లో గత సంవత్సరం బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్డ్ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని. ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్ పునీత్ శ్రీవాస్తవ. ‘శాలిని విజయం ఎన్సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని. ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది శాలిని సింగ్ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని! -
ఎవరెస్ట్ పైకి 27 సార్లు..!
కఠ్మాండు: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని పసంగ్ దవా షెర్పా(46) పర్వతారోహకుడు 27సార్లు అధిరోహించారు. 8,848.86 మీటర్ల ఎత్తైన ఈ హిమాలయ శిఖరాన్ని సోమవారం ఉదయం 8.25 గంటలకు ఆయన చేరుకున్నట్టు పర్వతారోహక యాత్ర నిర్వహిస్తున్న ‘ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్’ తెలిపింది. తద్వారా కమి రిటా షెర్పా రికార్డును ఆయన సమం చేశారు. ఎవరెస్ట్ రీజియన్‌లో జన్మించిన పసంగ్ తొలిసారి 1998లో ఎవరెస్ట్‌ను అధిరోహించారు. మరోవైపు 53 ఏళ్ల కమి రిటా షెర్పా ఈ సీజన్లోనే ఎవరెస్ట్‌ను 28వ సారి ఎక్కి పసంగ్ను అధిగమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. -
Char Dham Yatra 2023: 30దాకా కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ నిలిపివేత
రిషికేశ్: ఎగువ హిమాలయాల ప్రాంతం గర్వాల్ హిమాలయాల్లో వర్షం, హిమపాతం కారణంగా కేదార్నాథ్ యాత్ర కోసం రిషికేశ్, హరిద్వార్‌లలో జరిగే యాత్రికుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 30వ తేదీదాకా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మంగళవారం తెరుచుకోనున్న సంగతి తెల్సిందే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల దర్శనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. -
హిమానీ నదాలు శరవేగంగా కనుమరుగు! విస్మయకర వాస్తవాలు వెలుగులోకి
హిమాలయాల్లో హిమానీ నదులు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఎంతగా అంటే, గత 20 ఏళ్లలో కరిగిపోయిన హిమానీ నదాల పరిమాణం ఏకంగా 57 కోట్ల ఏనుగుల బరువుతో సమానమట! అంటే హీనపక్షం 170 కోట్ల టన్నుల పై చిలుకే...! ఈ ప్రమాదకర పరిణామాన్ని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అతి తొందర్లోనే హిమాలయాల్లో పెను మార్పులు చూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు... 2000 నుంచి 2020 మధ్య కేవలం 20 సంవత్సరాల్లో హిమాలయాల్లో ప్రోగ్లేషియల్ సరస్సులు ఏకంగా 47 శాతం పెరిగాయి. సరస్సుల సంఖ్య పెరిగితే మంచిదే కదా అంటారా? కానే కాదు. ఎందుకంటే హిమానీ నదాలు కరిగిపోయి కనుమరుగయ్యే క్రమంలో ఏర్పడే సరస్సులివి! ఇవి ఎంతగా పెరిగితే హిమానీ నదాలు అంతగా కుంచించుకుపోతున్నట్టు అర్థం! ఈ పరిణామామంతా చాలావరకు భూమి పై పొరకు దిగువన జరుగుతుంది గనుక ఇంతకాలం పర్యావరణవేత్తల దృష్టి దీనిపై పడలేదు. కానీ ఈ సరస్సుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ఈ పరిణామంపై వాళ్లు ఇటీవలే దృష్టి సారించారు. హిమాలయాల్లో కరిగిపోతున్న హిమనీ నదాల పరిమాణాన్ని తొలిసారిగా లెక్కగట్టగా ఈ విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లోని సెయింట్ ఆండ్రూస్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కార్నిగీ మెలన్ వర్సిటీలకు చెందిన రీసెర్చర్ల బృందంలో ఇందులో పాల్గొంది. అధ్యయన ఫలితాలను నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘హిమాలయాల వద్ద భూ ఫలకాలు అత్యంత చురుగ్గా ఉంటాయి. నిత్యం కదలికలకు లోనవుతూ ఉంటాయి. దాంతో హిమానీ నదాల ప్రవాహ మార్గాలు తరచూ మారిపోతున్నాయి’’ అన్నారు. హిమాలయాల్లో 6.5 శాతం తగ్గిన మంచు ♦ తాజా అధ్యయనం పలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైనవి... ♦ కనుమరుగవుతున్న హిమానీ నదాల రూపంలో గ్రేటర్ హిమాలయాలు ఇప్పటికే తమ మొత్తం మంచులో 6.5 శాతాన్ని కోల్పోయాయి. ♦ మధ్య హిమాలయాల్లో హిమానీ నదాల అంతర్థానం చాలా వేగంగా కొనసాగుతోంది. ♦ గాలోంగ్ కో హిమానీ నదం ఇప్పటికే ఏకంగా 65 శాతం కనుమరుగైంది. ♦ హిమాలయాల్లో 2000–2020 మధ్య ప్రోగ్లేషియల్ సరస్సుల సంఖ్యలో 47 శాతం, విస్తీర్ణంలో 33 శాతం, పరిమాణంలో 42 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది ♦ ఇందుకు కారణం హిమాలయాల్లోని హిమానీ నదుల పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 1.7 గిగాటన్నుల మేరకు తగ్గిపోవడమే. అంటే 1.7 లక్షల కోట్ల కిలోలన్నమాట! ఇది భూమిపై ఉన్న మొత్తం ఏనుగుల బరువుకు కనీసం 1,000 రెట్లు ఎక్కువ!! ♦ ఈ ధోరణి 21వ శతాబ్దం పొడవునా కొనసాగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ♦ ఫలితంగా హిమాలయాల్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా హిమానీ నదాలు ప్రస్తుతం భావిస్తున్న దానికంటే అతి వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్వత పుత్రికలు: శశి, గునిత్, అనుష.. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు సైతం
హిమాలయాలు... వింధ్య పర్వతాలు... వీటిని చూడాలని ఎవరికి ఉండదు? రాబోయే వేసవి సెలవుల్లో పర్వత సౌందర్యం చూడాలని చాలామంది అనుకుంటారు. కాని ఆరోగ్య, వయసు సమస్యలు, దివ్యాంగ పరిమితులు కొందరిని భయపెట్టవచ్చు. అయితే ఎవరికైనా సరే పర్వతాలను దగ్గరుండి చూపిస్తాం అంటున్నారు ముగ్గురు మహిళా ట్రెక్ గైడ్లు – శశి, గునిత్, అనుష. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ వీరు అపరేట్ చేస్తున్న ట్రెక్ టూర్లు అద్భుత పర్వత దర్శనం చేయిస్తున్నాయి. ‘కలగను.. కనుగొను’ అనే ట్యాగ్‌లైన్ ఉంటుంది అనుష, శశి, గునీత్ నడిపే ‘బొహెమియన్ అడ్వంచర్స్’ అనే ట్రెకింగ్ ఏజెన్సీకి. లోకాన్ని చూసి రావాలన్న కలను నెరవేర్చుకోవడానికి దారిని కనుగొనమని, ఆ దారి కనుగొనడంలో తాము సాయం చేస్తామని అంటారు వీరు ముగ్గురు. మన దేశంలో పూర్తిగా స్త్రీలు మాత్రమే నడుపుతున్న ట్రెకింగ్ ఏజెన్సీలలో వీరిది ఒకటి. అయితే వీరి ప్రత్యేకత అంతా పర్వతాలే. ‘డెహరాడూన్లో మా ఆఫీస్ ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో, లద్దఖ్‌లో, హిమాలయాల బేస్ క్యాంప్ వరకు, వింధ్య పర్వతాల్లో మేము పర్వతారోహణకు తీసుకెళతాం. ప్రతి ముగ్గురు టూరిస్టులకు ఒక గైడ్ అనే పద్ధతిని మేము పాటిస్తాం.అందుకే వృద్ధులు, పిల్లలు, ఒంటరి స్త్రీలు... ఎవరైనా సరే క్షేమంగా మాతో పాటు ట్రెకింగ్ చేయవచ్చు. మా గైడ్లు కూడా స్ట్రీలే. అందుకే మేము నిర్వహించే పర్వత యాత్రలకు విశేషంగా టూరిస్టులు వస్తారు’ అంటుంది శశి బహుగుణ. 2013లో మొదలు బ్యాంకింగ్ రంగంలో పని చేసే శశి బహుగుణది డెహ్రాడూన్. పబ్లిషింగ్ రంగంలో పని చేసిన గునిత్ పురిది రుద్రపూర్ (ఉత్తరాఖండ్). గతంలో బిజినెస్ జర్నలిస్ట్‌గా పని చేసిన అనుష సుబ్రమణియన్ది ముంబై. వీరు ముగ్గురికీ పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. తరచూ చేసే ట్రెక్కింగ్‌లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. అయితే 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదలు వీరు ముగ్గురిని కదిలించాయి. వెంటనే పనులన్నీ ఆపి వరద ప్రాంతాలకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటకులను కాపాడారు. ఆ సమయంలోనే వారికి అనిపించింది పర్యాటకులను సురక్షితంగా ఉంచే పర్వతారోహణ యాత్రలను నడిపే సంస్థను ప్రారంభించాలని. ‘అబ్రహం లింకన్‌ను గుర్తు చేసుకున్నాం. పర్వతాల వలన పర్వతాల చేత పర్వతాల కొరకు ఇకపై బతకాలని నిర్ణయించుకున్నాం’ అంది శశి బహుగుణ. ట్రెకింగ్‌ను ఎక్కువగా శశి ప్లాన్ చేస్తుంది. గునిత్ వాహనాలు నడపడంలో ఎక్స్పర్ట్. వంటలో కూడా. అనుష మంచి గైడ్. ‘అందువల్ల మేము కారులో హిమాలయాల్లోని ప్రతి మూల తిరిగాము. మాకు తెలియని పర్వత దారులు లేవు’ అంటారు వారు. ప్రతి ఒక్కరికి హక్కుంది ‘పర్వతారోహణ అంటే వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్లనే అందరూ అనుమతిస్తారు. కాని మేము ఆ నియమం పెట్టుకోలేదు. ఇన్‌క్లూజివ్ ట్రెకింగ్స్ను నిర్వహించాలనుకున్నాం. అనారోగ్యం ఉన్నవారిని, దివ్యాంగులను కూడా ఆరోహణకు తీసుకెళ్లాలనుకున్నాం. ఎందుకంటే పర్వతాలు అందరివి. అందరికీ వాటిని చూసే హక్కుంది. అందుకే పర్వతాలు చూడాలనుకుని వచ్చేవారి హెల్త్ హిస్టరీ అంతా చెక్ చేస్తాం. వారికి ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తాం. అంధులను కూడా చేయి పట్టి 50 కిలోమీటర్ల దూరం మేరకు ట్రెకింగ్‌కు తీసుకెళ్లిన అనుభవం మాకు ఉంది. పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లను కూడా తీసుకెళ్లాం. డయాబెటిక్ పేషెంట్లు కూడా వచ్చారు. అయితే ప్రతి దశలో ఆరోగ్యం చెక్ చేయిస్తూ తీసుకెళతాం. మరీ జటిలంగా మారితే వెంటనే హెలికాప్టర్ తెప్పించి వెనక్కు పంపించేస్తాం’ అంటారు వారు. పహాడీ గైడ్లు అనుష, శశి, గునిత్లు తాము నడుపుతున్న ట్రెకింగ్‌ల కోసం స్థానిక యువతులను గైడ్లుగా తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ‘అందరూ కొండప్రాంతం వారే. లోకల్ గిరిజన యువతులు. వారికి పర్వతాలు కొట్టిన పిండి. అందుకని వారికి తగిన శిక్షణ ఇచ్చి మా టీమ్‌లో కలుపుకున్నాం. మా దృష్టి ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలపై ఉంటుంది. వీరు పిల్లలు ఎదిగొచ్చాక పర్యటనలకు వెళదామనుకుంటారు. అటువంటి వారికి సురక్షితమైన ఏజెన్సీలు ఉన్నాయని తెలియాలి. వారు ఊపిరి పీల్చుకుంటే కుటుంబ కార్యక్రమాల్లో మళ్లీ ఫ్రెష్‌గా పడతారు. మా విన్నపం ఏమంటే ఒంటరిగా తిరగాలనుకున్నా మంచి ఏజెన్సీలను చూసి వెళ్లండి వెళ్లనివ్వండి అని చెప్పడమే’ అంటారు. పర్వతాలను చూపడానికి చుక్కానులుగా మారిన ఈ ముగ్గురు అభినంద నీయులు. -
మంచుకొండల్లో మహాముప్పు.. తక్షణం అడ్డుకట్ట వేయకుంటే విధ్వంసమే
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్‌లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్‌పోస్టులు, హెలిప్యాడ్లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఎల్ఏసీ వెంట అధిక ముప్పు.. భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్‌హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్‌కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్‌లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్‌లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నిర్మాణాలు టిబెట్ పీఠభూమిలో ► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం ► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం ► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు ► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్‌లు ► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు ► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి. ► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం నేపాల్ వైపు ► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ► ఉద్యాన వనాలు ► హైడ్రోపవర్ ప్రాజెక్టులు ► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు ► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన భారత్ నిర్మాణాలు ► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ► అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిమ్‌లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు ► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్లను కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు ► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్పీడీ)హైవే ► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం ► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి. ► సింధు నదికి సమీపంలో చిలాస్‌లో డ్యామ్‌లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది. ► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ► అవలాంచ్‌లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి ► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్‌లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. ► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు. ► భారత్‌లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు. ► భారత్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. ► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత?
హిమాలయాల్లో భూమి పొరల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మనల్ని భయపెడుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన నెలకొంది. తుర్కియే, సిరియాల్లో భూకంపం మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్‌లను త్వరలోనే పెను భూకంపం అతలాకుతలం చేస్తుందన్న అంచనాలున్నాయి. ఇంతకీ భారత్‌కి ఉన్న ముప్పు ఎంత ? నేలకింద భూమి ఉన్నట్టుండి కదిలిపోతే, మిన్ను విరిగి మీదపడినట్టు ఆకాశన్నంటే భవనాలు కుప్పకూలిపోతే, మన నివాసాలే సమాధులుగా మారి మనల్ని మింగేస్తే ఆ ప్రకృతి విలయం ఎంత భయంకరం..? తుర్కియే, సిరియాల్లో కుదిపేసిన పెను భూకంపంతో భారత్‌కు భూకంపం ముప్పు ఎంత అనే చర్చ జరుగుతోంది. తుర్కియే భూకంపాన్ని ముందే అంచనా వేసిన డచ్ అధ్యయనకారుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో త్వరలో భూకంపం వస్తుందని హెచ్చరించడం గుబులు రేపుతోంది. మన దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. తీవ్ర ముప్పులో ఢిల్లీ ఢిల్లీ, దాని పక్కనే ఉన్న గురుగ్రామ్‌కు భూకంప ముప్పు అత్యంత ఎక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూపొరల్లో ఫలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్‌గా ఉన్న సొహనా, మథుర, ఢిల్లీ–మొరాదాబాద్ వల్ల కూడా ఢిల్లీ ప్రమాదంలో ఉంది. హిమాలయాలు యమాడేంజర్ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలను పెను భూకంపంతో అతలాకుతలం చేసే భూకంప కేంద్రం హిమాలయాలేనని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాల్లో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయాలే అని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో 2,400 కి.మీ. పొడవునా హిమాలయాల్లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉండే అవకాశం ఉంది. హిమాలయ భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్‌పై 700 ఏళ్లుగా అత్యంత ఒత్తిడి ఉంది. ఫలకాలు కదులుతూ ఉండడం వల్ల అంచులపై ఒత్తిడి పెరిగిపోతూ వస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా భూకంపం రావొచ్చు లేదంటే 200 ఏళ్ల తర్వాత తర్వాతైనా రావచ్చునని, ఇది మధ్య హిమాలయాలపై పెను ప్రభావం చూపిస్తుందని 2016లోనే శాసవ్రేత్తలు హెచ్చరించారు. హిమాలయాల్లో కంగారాలో 1905లో భూకంపం వచ్చింది. 1934లో హిమాలయ కేంద్రంగా నేపాల్, బిహార్‌లో భూకంపానికి 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశిలో వచ్చిన భూకంపంలో 800 మంది మరణించారు. ఇక 2005లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంభవించిన భూకంపానికి 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాలు కాకుండా 2001లో గుజరాత్లో కచ్‌లో వచ్చిన భూకంపంలో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. భారత్, యూరోషియన్ ప్లేట్స్ తరచూ రాపిడి కారణంగా చిక్కుకుపోతూ ఉండడంతో హిమాలయాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోలజీలో జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ వివరించారు. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జోషిమత్: ఊరికి ఊరే కుంగిపోతోంది! ఎందుకో తెలుసా?
అది పరమ పవిత్ర ప్రాంతం. హిందువులకు బద్రీనాథ్, సిక్కులకు హేమకుండ్ సాహిబ్ లాంటి పుణ్యక్షేత్రాలకు చేరువగా ఉండే నిలయం. హిమాలయాల పర్వతారోహకులకు అదొక ద్వారం. పైగా చైనా సరిహద్దులో భద్రత విషయంలో భారత కంటోన్మెంట్ ఏరియాగా కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి ఊరు కుంగిపోతోంది. ఉన్నట్లుండి వందల ఇళ్లకు.. రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ఏడాది కాలంగా పునరావాసం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఆ ఊరి ప్రజలు. రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో.. ముఖ్యమంత్రి తమకు ఓ పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ, అది జరగలేదు. అందుకే పోరాటాన్ని ఉధృతం చేశారు. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమత్(చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వంద సంఖ్యలో ఇళ్లకు బీటలు వారాయి. అయినప్పటికీ ఉండడానికి మరో చోటులేక అక్కడే ఉండిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వం వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే అరవైకిపైగా కుటుంబాలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరికొందరి ఇళ్లు మరీ దారుణంగా తయారు అయ్యాయి. దీంతో 29 కుటుంబాలను అధికారులే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినా మరో 500 కుటుంబాలు అక్కడే భయం భయంగా గడుపుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనుకుంటూనే.. ఎక్కడ ఉండాలో తెలియక.. ఆవాసం కోసం బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ స్పందన.. జోషిమత్‌లో భూమి కుంగడం, ఇళ్లకు పగళ్లు రావడంపై ఎట్టకేలకు ఉత్తరాఖండ్ స్పందించింది. ఐఐటీ రూర్కీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించి ఓ నివేదికను రూపొందించబోతోంది. ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భావిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించబోతున్నారట. మూడు వేల మంది జనాభా ఉంటున్న ఈ ప్రాంతం.. ముప్పు ముంగిట ఉండడం వెనక కారణాల కోసం అన్వేషిస్తోంది ప్రభుత్వం. జోషిమత్‌లో ఇళ్లు మాత్రమే కాదు.. రోడ్లు కూడా దారుణంగా నాశనం అయ్యాయి. రవిగ్రామ్, గాంధీనగర్, మనోహర్‌బాగ్, సింగ్‌ధర్, పర్సారీ, ఉప్పర్‌బజార్, సునీల్, మార్వాడీ, లోయర్ బజార్.. ఇలా జోషిమత్‌లో పలు ఏరియాల్లో ఇళ్లకు పగళ్లు వచ్చాయి. అయినప్పటికీ పునరావాసం లేక అక్కడే ఉండిపోతున్నారు జోషిమత్ ప్రజలు. వెదరు బొంగులు, బరువైన వస్తువులను కుంగిపోతున్న నేలకు, గోడలకు సపోర్ట్‌గా ఉంచుతూ.. సునామీకి గొడుగు అడ్డుపెట్టే యత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడి పరిస్థితిపై నివేదిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సేవ్ జోషిమత్ కమిటీ కన్వీనర్ అతుల్ సతి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆధ్వర్యంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని, తమను కాపాడాలంటూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కారణాలు అవేనా? అయితే ఈ ప్రకృతి వైపరిత్యానికి గల సరైన కారణాలను తేల్చాల్సి ఉందని జోషిమత్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ చెబుతున్నారు. కానీ, జోషిమత్ భూకంపాలకు సంభావ్యత ఉన్న ప్రాంతం. చమోలీ జిల్లాకు ఆరు వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. హై రిస్క్ జోన్(జోన్-5) పరిధిలో ఉంది ఈ చోటు. పైగా భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలోనే ఇలా జరుగుతుందోనేమోనని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చమోలీ జిల్లా జాయింట్ మేజిస్ట్రేట్ దీపక్ సైనీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జోషిమత్‌కు పరమ పవిత ప్రాంతంగా వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు.. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్య నలు దిక్కుల నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి జోషిమత్(జ్యోతిర్మఠ్). ఉత్తరామ్నాయ మఠ్ పీఠం ఇది. (మిగతావి శృంగేరి, పూరీ, ద్వారకా). ఆదిశంకరాచార్య మఠంతో పాటు భవిష్య కేదార్ టెంపుల్, నార్సింగ్ ఆలయం, తపోవన్, గారి భవాని ఆలయం వీటితో పాటు ఔలీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్కడ ఉంది. 2021 ఉత్తరాఖండ్ వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యింది ఈ ప్రాంతం. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్‌ను బేస్ క్యాంప్‌గా సహాయక చర్యలకు ఉపయోగించారు కూడా.