ఔలి... ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. పూర్తి పేరు ఔలి భుగ్యాల్. గర్వాలి భాషలో పచ్చికభూములు అని అర్థం. మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో! ఇది మరీ ఆశ్చర్యం అని కూడా అనిపిస్తుంది. తొమ్మిదిన్నర వేల అడుగుల ఎత్తులో దట్టంగా పరుచుకున్న మెత్తటి మంచు క్రమంగా గట్టిపడి బండరాళ్లకంటే గట్టిగా ఉంటుంది. మంచుతో ఆడుకోవచ్చు. స్నో స్కీయింగ్ చేయాలంటే ప్రపంచంలో ది బెస్ట్ ప్లేస్ ఇదే. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రకృతి ఇచ్చిన ప్రతి సౌకర్యాన్ని టూరిజం అభివృద్ధికి మలుచుకుంటోంది. ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉన్నటువంటి స్నో గేమ్స్ కోసం ఫ్రాన్స్ నుంచి స్నో బీటర్స్ తెప్పించి ఫ్రెంచి స్కీయింగ్ ఎక్స్‌పర్ట్‌ల సహకారంతో డెవలప్ చేశారు. స్కీ రిసార్ట్‌లో అయితే ఏకంగా మంచు కుర్చీలు, మంచు టేబుళ్లు తెల్లగా మెరుస్తుంటాయి.
సరిహద్దు కనిపిస్తుంది!
పర్యాటక ప్రదేశాల్లో కేబుల్ కార్‌లు సాధారణం గా పరిమితమైన దూరానికే ఉంటాయి. ఆ ప్రదేశం మొత్తాన్ని ఆకాశమార్గంలో చూడగలిగినట్లు మాత్రమే ఉంటాయి. ఔలిలో కేబుల్ కార్ చాలా పెద్దది. ఔలి నుంచి జోషిమఠ్ వరకు ఉంటుంది. ఈ ఇరవై నిమిషాల కేబుల్ కార్ జర్నీలో భారత్– టిబెట్ సరిహద్దు కనిపిస్తుంది. అలాగే భారత్–టిబెట్ సరిహద్దు గ్రామాల్లో ఒకటైన ‘మాణా’ గ్రామాన్ని, నీల్‌కాంత్, నందాదేవి శిఖరాలను కూడా చూడవచ్చు. వీటితో సంతృప్తి చెందాల్సిందే. హిమాలయాల సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఇరవై నిమిషాల కేబుల్ కార్ ప్రయాణం ఏ మాత్రం తృప్తినివ్వదు.
మంచు బయళ్లు
ఔలిలో ఎటు చూసినా మంచుశిఖరాలే. ఇలాంటి నేలకు పచ్చిక భూములనే పేరు విచిత్రంగా అనిపిస్తుంది. కానీ పైన చెప్పుకున్న చిత్రమంతా శీతాకాలం, ఎండాకాలం మాత్రమే కనిపిస్తుంది. శీతాకాలంలో పేరుకున్న మంచు మార్చి నుంచి కరుగుతుంది. జూలై నుంచి మంచును చీల్చుకుంటూ పచ్చదనం తన ఉనికిని ప్రకటిస్తుంది. మంచుతో పోటీపడి మొలిచిన మొక్కలు ఆగస్టు నాటికి మొగ్గలు తొడిగి పూలు పూస్తాయి. ఆ దృశ్యాన్ని చూస్తే మంచు– మట్టి పోటీ పడుతున్నాయేమో అనిపిస్తుంది. మంచుతో పోటీ పడి మరీ మట్టి మొగ్గ తొడుగుతుంటే... ఆ పచ్చిక కూడా మంచు తివాచీలాగ చల్లగా ఉంటుంది. ప్రకృతి చేసే అందమైన విన్యాసాల్లో ఇదొకటి. హిమాలయాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ అద్భుతాలే. బద్దకం కొద్దీ సూర్యోదయాన్ని మిస్ అయినప్పటికీ సూర్యాస్తమయం చేసే కనువిందును జారవిడుచుకోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment