tourist spot
-
అభివృద్ధి దిశగా దూసుకుపోతోన్న చారిత్రక నగరం రాజమండ్రి
-
ప్రకృతి ఒడిలో అలజడి.. టూరిస్ట్ స్పాట్లో చీకటి ఉదంతాలు!
బనశంకరి: కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా చార్మాడీ ఘాట్ ప్రకృతి అందాలకు నిలయం ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామం. పర్వతాలు, లోయలు పచ్చగా, పొగమంచుతో అద్భుతం అనిపిస్తాయి. కానీ ఇటీవల వేర్వేరు కారణాలతో హాట్‌టాపిక్‌గా మారుతోంది. దుండగులు ఎక్కడో హత్యలు చేసి ఆ మృతదేహాలను తీసుకువచ్చి చార్మాడీ ఘాట్‌లో పడేసి వెళ్లడం పెరిగింది. దీని వల్ల కేసుల విచారణ కష్టమవుతుంది. మరోపక్క పర్యాటకులు ఇక్కడ ప్రమాదకర స్థలాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. సాయంత్రం కాగానే.. చార్మాడీఘాట్‌లో 28 కిలోమీటర్లు విల్లుపురం–మంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని వెళుతుంది. ఈ మార్గంగా నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. ఎత్తైన పర్వతాలతో కూడిన ఘాట్‌లో సాయంత్రం తరువాత వాహనాల సంచారం తక్కువై నిర్మానుష్యమవుతుంది. ఈ సమయంలో నేర ముఠాలు మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ప్రకృతి సోయగాలకు నిలయమైన చార్మాడీఘాట్‌కు రక్తపు మరకలు అంటిస్తున్నారు. పనిచేయని సీసీ కెమెరాలు.. కొట్టిగేహార అటవీశాఖ చెక్‌పోస్టులో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఘాట్‌లోకి ప్రవేశించే చెక్‌పోస్టులో వాహనాల తనిఖీ నామమాత్రమే. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవారికి ఘాట్ స్వర్గధామంగా తయారైంది. హంతకులు జంకు లేకుండా వాహనాల్లో మృతదేహాలను తీసుకొచ్చి వదిలేస్తుంటారు. ఇదే కాదు కొన్ని వాహనాల డ్రైవర్లు మృతిచెందిన పందులు, కోళ్లను ఇదే ఘాట్ రోడ్డులో పడేస్తున్నారు. అడ్డుకట్టకు చర్యలు చేపడతాం: ఎస్పీ కొట్టిగుహర, చార్మాడీ గ్రామాల్లో చెక్‌పోస్టుల్లో పగలూ రాత్రి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కాగా, ఘాట్‌లో మృతదేహాలు లభిస్తున్నట్లు తెలిసింది, సంఘ సంస్థలు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి నియంత్రణ గురించి చర్చిస్తాం, చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాలు అమర్చడానికి చర్యలు తీసుకుంటామని దక్షిణ కన్నడ ఎస్పీ ఉమాప్రశాంత్ తెలిపారు. ఎన్నో చీకటి ఉదంతాలు 2008 జూన్ 11 తేదీన శివగంగమ్మ అనే మహిళ మృతదేహాన్ని పడేశారు. 2012లో వజ్రాల వ్యాపారిని బెంగళూరులో హత్యచేసి చార్మాడీ కనుమలో వేశారు. అదే ఏడాది అల్దూరిలో ఒక డాక్టరు స్పృహలేని స్థ్దితిలో కనబడ్డారు. 2013 జూన్ 21 న మలయమారుత వద్ద శివమొగ్గ మంగోటి గ్రామ మమతా, 2016లో చెన్నరాయపట్టణ కాంత అనే మహిళల మృతదేహాలు సోమనకాడు వద్ద కనిపించాయి. 2020లో చార్మాఢీఘాట్ రోడ్డులోని కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత ఏడాది డబ్బు విషయంపై చిక్కబళ్లాపుర శరత్ అనే వ్యక్తిని హత్యచేసి చార్మాడి ఘాట్‌లో విసిరేశారు. ఇలా అనేక హత్యల్లో మృతదేహాలను పడవేసి ఈ ప్రాంతమంటే భయాందోళన కలిగించే దుస్థితిని తెచ్చారు. ఆచూకీ లేని అనేక మృతదేహాలు ఇక్కడి నేలలో లీనమౌతున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. సెల్ఫీ ప్రమాదాలు అలెకాన్ జలపాతం, ఆలయం వద్ద సెల్పీ తీసుకోవడానికి వెళ్లి పలువురు మృత్యవాత పడ్డారు. 2015 సెప్టెంబరులో హండుగళి మహేంద్ర, 2016 జనవరి 18 చిత్రదుర్గ కు చెందిన హనుమంతప్ప(34), నాగభూషణ్ (28) ప్రాణాలు కోల్పోయారు. -
AP: టూరిస్ట్ స్పాట్‌గా ఉబ్బలమడుగు.. వాటర్ ఫాల్స్ స్పెషల్ అట్రాక్షన్
వరదయ్యపాళెం: స్వచ్ఛమైన నీరు, గాలి, పచ్చటి అడవి.. పక్షుల కిలకిలారావాలు, కొండ కోనల్లోంచి నిరంతరం ప్రవహించే సెలయేరు... జలపాతం, చుట్టూ ఎతైన కొండలు... ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉబ్బలమడుగు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తోంది. అటవీశాఖ ఎకో టూరిజం అభివృద్ధి పనులతో ఉబ్బలమడుగు వేసవి విడిది ప్రదేశంగా కొత్త అందాలను దిద్దుకుంటోంది. వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల సరిహద్దుల్లో కాంబాకం రిజర్వు ఫారెస్టులో ఉబ్బలమడుగు వరదయ్యపాళెం నుంచి 10కిలోమీటర్లు దూరంలో ఉంది. ఒకరోజు విహారయాత్రకు ఇది చక్కటి ప్రదేశం. ఆహ్లాదం, విజ్ఞానం పర్యాటకులకు ఆహ్లాదం పంచడంతోపాటు విజ్ఞానం అందించే దిశగా అటవీశాఖ చెట్లు, వాటి శాస్త్రీయ నామం, పుట్టుక లాంటి విశేషాలను దారి పొడవునా పేర్లతో సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. రాజులు వాడిన ఫిరంగి, టన్ను బరువు ఉన్న తిరగలి, పూసలదిబ్బ, ఎలిజబిత్ రాణి బంగ్లా, పాలేగాళ్లు, వారి తోటలు.. ఇలా అన్నింటినీ పర్యాటకులు చూడదగినవే. చూడాల్సిన ప్రాంతాలు వరదయ్యపాళెం నుంచి 7కి.మీ ప్రయాణిస్తే అవంతి ఫ్యాక్టరీ వస్తుంది. ఈ ఫ్యాక్టరీని దాటితే రిజర్వు ఫారెస్టు మెుదలవుతుంది. ఫారెస్టు మెుదట్లో తెలుగుగంగ కాలువ, టోల్ గేట్ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి సుమారు 12 కి.మీలలో సెలయేరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. దీని పక్కన వరుసగా తంతి పందిరి, దొరమడుగు, సీతలమడుగు, తంగశాల, పెద్దక్కమడుగు, ఉబ్బలమడుగు, సిద్ధేశ్వరగుడి, సద్దికూటి మడుగు, అంజూరగంగ, దోగుడుబండ జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సీతాళం అని పిలుస్తారు. సిద్ధేశ్వరగుడి నుంచి 3 కిలోమీటర్లు కొండపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో పర్యాటకులు ఉబ్బలమడుగుకే పరిమితవుతారు. ఈ ప్రాంతాలను సందర్శించడానికి అటవీశాఖ నావువూత్రపు రుసుంతో సహాయకులను నియమించింది. తంతిపందిరి(తన్నీర్ పందల్) ఒకప్పుడు బ్రిటీష్ పాలకులు చేపల పెంపకం కోసం ఎంపిక చేసిన ప్రాంతమై ఈ తన్నీర్ పందల్ ఇప్పుడు తంతిపందిరిగా మారింది. వరదయ్యపాళెం నుంచి ఇక్కడి వరకు తారు రోడ్డు ఉంది. ఉబ్బలమడుగు వరకు వెళ్లలేనివారు ఇక్కడి మడుగులోనే సేదదీరుతుంటారు. ఉబ్బలమడుగు(ఉపరి మడుగు) తంతి పందిరి నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉబ్బలమడుగు ఉంది. వాహనాలలో వెళ్లేందుకు గ్రావెల్ మార్గం ఉంది. 1953 ప్రాంతంలో చిత్తూరుకు చెందిన శ్రీనివాసన్ బ్రిటీష్ మిలటరీలో కీలక స్థానంలో విధులు నిర్వహించి తన రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవనం కోసం ఈ ప్రాంతాన్ని అంగ్లపాలకుల నుంచి ఇనాంగా పొందారు. ఇక్కడే దొరమడుగు, మామిడి చెట్ల మడుగు, తంగశాలమడుగు, పూలమడుగు, చద్దికూటి మడుగులున్నాయి. శివరాత్రి రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. మిగిలిన సమయాల్లో ఆటోలు నడుస్తుంటాయి. సిద్ధులకోన పూర్వం మునులు ఈ ప్రాంతంలో ఉండటం మూలాన సిద్ధులకోన అనే పేరు వచ్చింది. ఇక్కడకు వెళ్లాలంటే ట్రాక్టరు వంటి వాహనాల్లోగానీ కాలినడకన 2కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు పక్కనే ఉన్న సిద్ధుల మడుగులో స్నానమాచరించి సిద్ధేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దిగువ శీతాలం లోతైన మడుగులు, నిలువెత్తు జలపాతాలకు నెలవు ఈ దిగువశీతాలం. రెండు కొండ చరియల నడుమ ఉన్న ఈ ప్రాంతాల్లో ఎటుచూసినా తేనెతుట్టెలు కనిపిస్తుంటాయి. సిద్ధులకోన నుంచి కొండబండల నడుమ 2కి.మీ దూరం కాలినడకన దిగువశీతాలం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న నీటి మడుగులు రెండు తాటిచెట్లకు పైగా లోతున్నా నీరు స్వచ్ఛంగా ఉండడంతో లోపల ఉన్న రాళ్లు సైతం కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తూంటాయి. నీటి మడుగులోకి దిగితే ఎంత వేసవిలోనైనా చలితో వణుకు తెప్పిస్తాయి. పర్యాటకులకు మరిన్ని వసతులు ఉబ్బలమడుగుకు వచ్చే సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే కొన్ని వసతులు కల్పించాం. జలపాతాల వద్ద బోటింగ్ పార్కులు, మరో వన్య పాయింట్, విశ్రాంత గదులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనికి సంబంధించి రూ. 2కోట్ల నిధులు అవసరముంది. నిధులు కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. –జి. జయప్రసాదరావు,ఎఫ్ఆర్ఓ, సత్యవేడు -
భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం.. ఎక్కడంటే !
కొరాపుట్(భువనేశ్వర్): పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న దేవమాలి పర్వతం కొరాపుట్ జిల్లాకు మరింత వన్నె తెస్తోంది. పొట్టంగి సమితి కొఠియా సమీపంలోని ఈ పర్వతాన్ని చేరుకునేందుకు రోడ్డుమార్గం, ఇతర సదుపాయాలు ఉన్నాయి. కుందిలి సంత నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ఎత్తయిన ఈ శిఖరం ఉంది. సముద్ర మట్టానికి 1,762 మీటర్లు ఎత్తులో నిలిచిన ఈ పర్వతం, 1996 తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. 2018లో 29,350 మంది, 2019లో 29,950 మంది పర్యాటకులు సందర్శించినట్లు పర్యాటక విభాగం తెలిపింది. కరోనా కారణంగా 2020లో పర్యాటకుల సంఖ్య కొంత తగ్గినా(9765 మంది), 2021లో ఇప్పటివరకు 14,688 మంది సందర్శించినట్లు పర్యాటక విభాగం అధికారులు పేర్కొన్నారు. ( చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య ) దినదిన ప్రవర్ధమానంగా.. సిమిలిగుడకి చెందిన సాహిద్ లక్ష్మణ్ నాయక్ యువజన సంస్థ నిర్వహించిన పర్వతారోహణతో దేవ్‌మాలి పర్వతం బాహ్య ప్రపంచానికి పరిచయమైంది. ప్రస్తుత భువనేశ్వర్ ఎంపీ అపరాజితా షడంగి.. కొరాపుట్ జిల్లా కలెక్టర్‌గా(2000సంవత్సరం) పనిచేసిన సమయంలో దేవ్‌మాలి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శిఖరానికి చేరుకొనేందుకు రహదారి నిర్మాణంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఐదు టవర్లు నిర్మించారు. 2001లో కొరాపుట్ జిల్లా సాంస్కృతిక ఉత్సవం పరభ్ ఇక్కడే ప్రారంభమైంది. దీంతో పర్వతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. 2004–05లో దమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) ఈ పర్వతం అభివృద్ధికి రూ.35 లక్షలు మంజూరు చేసింది. పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, వ్యూ పాయింట్, త్రాగునీటి సదుపాయం, స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారు. ఆపై పర్యాటక విభాగం, అటవీ శాఖ, ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో దేవ్‌మాలి ప్రాంతం అభివృద్ధి చెందింది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చే పర్యాటకులలో అధిక శాతం మంది దేవ్‌మాలిని సందర్శించడం విశేషం. అభివృద్ధికి మరిన్ని నిధులు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న దేవ్‌మాలి పర్వతం అభివృద్ధికి డీపీఎం నుంచి రూ.1.25 కోట్లు, పర్యాటక విభాగం నుంచి రూ.1.30 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ అబ్దుల్ అక్తర్, పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతం పాడి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క దేవ్‌మాలిని సందర్శించి, పర్వతం అభివృద్ధికి నిధుల వినియోగింపై సమీక్షించారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో పొట్టంగి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి, టికెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం వినియోగించాలని నిర్ణయించారు. చదవండి: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే.. -
Tourist Spot: సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేకత అదే!
లోకంలో దీపాలకాంతులు వెలగడానికి దుష్టసంహారం రూపంలో చీకట్లు పారదోలే గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ప్రధాన భూమిక సత్యభామదే. అందుకే... దీపావళి పండుగలో ప్రధాన పాత్ర సత్యభామదే. ఈ కథనంలో కృష్ణుది సపోర్టింగ్ పాత్ర మాత్రమే. నరకాసుర వధ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపకాంతులతో ఆనందంగా నిర్వహించుకునే ఈ వేడుక అందరికీ తెలిసిందే. అయితే అంత గొప్ప మహిళకు ఆలయం ఎక్కడైనా ఉందా?... ఉంది. అనంతపురం జిల్లా మడకశిర సమీపాన కృష్ణుని విగ్రహంతోపాటు సత్యభామ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల కంటే మిన్నగా దీపావళి వేడుకలు జరుగుతాయి. అలాగే చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కృష్ణుడితోపాటు సత్యభామ పూజలందుకుంటోంది. ధీర వనిత సత్యభామను పూజలందుకునే పౌరాణిక పాత్రగా గౌరవించింది మన సంస్కృతి. ఈ పండుగలో సత్యభామది నాయిక పాత్ర అయితే ప్రతినాయక పాత్ర నరకాసురుడిది. నరకాసురుడికి ఆలయం లేదు కానీ, అస్సాంలో నరకాసురుడు కట్టించిన ఆలయం ఉంది. అది గువాహటిలోని కామాఖ్య ఆలయం. చిత్తూరు జిల్లా, కార్వేటి నగరంలో సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారితో పూజలందుకొంటున్న రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి మూర్తులను కార్వేటి నగరానికి తెప్పించి వైఖానసులచే ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఆకాశరాజు వంశానికి చెందిన నారాయణరాజుకు సంతానం లేకపోవడంతో తపస్సు చేసినట్లు, అదే వంశానికి చెందిన వెంకట పెరుమాళ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం. ఈ ఆలయంలో శిల్పనైపుణ్యం అద్బుతంగా ఉంటుంది. ఆలయంలో మకరతోరణం, గోమాత సహిత రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం. గాలి గోపురానికి ఎదురుగా ఉన్న 105 అడుగుల ధ్వజస్తంభం ఏకశిల నిర్మితం. రాణి మహల్ 14 ఎకరాల పుష్కరిణి ఈ ప్రాంతాన్ని 19వ శతాబ్దంలో తీవ్రమైన కరువుపీడించింది. అçప్పుడు ప్రజలను కాపాడేందుకు కార్వేటినగరం సంస్థానధీశుడు వెంకట పెరుమాళ్ రాజు 14 ఎకరాల విస్తీర్ణంలో స్కంధపుష్కరిణిని నిర్మించాడు. ఏ దిక్కు నుంచి చూసినా నీటి మట్టం సమాంతరంగా కనిపించడం దీని నిర్మాణ విశిష్టత. పుష్కరిణి మెట్ల మీద దేవతామూర్తులు, సర్పాలు, శృంగార శిల్పాలు నాటి శిల్పకళకు ప్రతిబింబిస్తున్నాయి. పుష్కరిణి కోసం పని చేసిన వారికి వెంకట పెరుమాళ్ రాజు స్వయంగా దోసిళ్లతో నాణేలను ఇచ్చారని స్థానిక కథనం. ఇక్కడి చెరువుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చెరువు నుంచి ఏడు బావులకు నీరు సరఫరా అవుతుంది. ఏడు బావుల నుంచి స్కంద పుష్కరిణికి చేరుతుంది. స్కంద పుష్కరిణి చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. కార్వేటి నగరంలో చూసి తీరాల్సిన మరో నిర్మాణం రాణి మహల్ (అద్దాల మహల్). ఈ మహల్ నిర్మాణంలో కోడిగుడ్డు సొన ఉపయోగించిన కారణంగా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతోపాటు నీటితో తుడిస్తే గోడలు అద్దంలా మెరుస్తుంటాయి. అందుకే దీనికి అద్దాల మహల్ అనే పేరు వచ్చింది. ఏపీ టూరిజం నిర్వహించే ప్యాకేజ్ టూర్లో తిరుమలతోపాటు చంద్రగిరి, నారాయణవనం, నాగులాపురం, కార్వేటి నగరం ఉంటాయి. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల ఆలయం ఏకశిల ధ్వజస్తంభం చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
హార్సిలీహిల్స్ అసలు పేరేంటో తెలుసా....!
చిత్తూరు: హార్సిలీహిల్స్..ఈపేరు వింటే మండువేసవిలోనూ హాయిగొలిపే ఆంధ్రాఊటీగా గుర్తొస్తుంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి ఆకాశాన్ని తాకుతున్న అనుభూతిని కలిగించే కొండకు ఎక్కెక్కడి నుంచో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఏ రుతువుతోనూ సంబంధం లేకుండా విడిది చేసేందుకు సందర్శకులు ఇష్టపడ్తారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలంలోని ఈ హార్సిలీహిల్స్ కథేంటి, అసలా పేరెలా వచ్చింది, కొండను ఎలా గుర్తించారన్నదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీహిల్స్ బి.కొత్తకోట మండలం కోటావూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నప్పటికి కొండలు, ఆడవి బయ్యప్పగారిపల్లె గ్రామంతోపాటు కురబలకోట మండలం తెట్టు అటవీప్రాంతంతో కలిసి ఉంటుంది. దీని అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ. కొండపై మల్లమ్మ పశువులను కాస్తూ, ఏనుగులతో స్నేహంగా ఉండేది. దాంతో ఏనుగుమల్లమ్మ కొండగా పేరు. ్రçపస్తుతం కొండపైన గట్టు గ్రామం, ములకలచెరువు మండలం బురకాయలకోటల్లో ఏనుగుమల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. వీటికి మాన్యం భూములు ఉన్నాయి. చల్లదనం కొండెక్కించింది 1850లలో బ్రిటన్‌కు చెందిన డబ్ల్యూ.డీ.హార్సిలీ మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా, తర్వాత చిత్తూరు, కడప ఉమ్మడిజిల్లాలకు కలెక్టర్‌కు పనిచేశారు. సబ్‌కలెక్టర్‌గా ఉన్న సమయంలో హార్సిలీ గుర్రంపై కోటావూరు గ్రామం పరిధిలో పర్యటిస్తుండగా వాతావర ణం చల్లగా ఉండటం గుర్తించారు. గుర్రంపైనే కొండెక్కేశారు. దట్టమైన అడవి, అత్యంతచల్లదనానికి ముగ్దుడైపోయాడు. తర్వాత ఆయన కడప కలెక్టర్ కావడంతో కొండను వేసవి విడది కేంద్రం చేసుకోవాలని నిర్ణయించాడు. 1869లో ఏనుగుమల్లమ్మ కొండను వేసవి విడది కేంద్రంగా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. దీనికి సమ్మతిస్తూ ప్రభుత్వం 1869 మే 4న జీవోఎంఎస్ నంబర్ 11579 జారీ చేసింది. అప్పటినుంచి కొండ వేసవి విడది కేంద్రంగా మారిపోయింది. అలా పేరు మారిపోయింది కొండను వేసవి విడిదిగా చేస్తున్న కలెక్టర్ హార్సిలీ అంతటితో ఆగలేదు. ఏనుగుమల్లమ్మ కొండ పేరును తనపేరు వచ్చేలా హార్సిలీహిల్స్‌గా మారేందుకు ప్రయత్నాలు చేశారు. పశువులు మేపుకునేందుకు వచ్చే కాపరులకు పానీయాలు, తినుబండరాలు ఇస్తూ వారిచేత హార్సిలీహిల్స్ అని పలికించడం ప్రారంభించి కొండకు ఆపేరు చిరస్థాయిగా ఉండిపోయేలా చేశారు. దాంతో ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీíß ల్స్‌గా మారిపోయింది. ఇప్పడు రాష్ట్రంలో ఏకైక వేసవి విడది కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. అయితే ఏనుగుమల్లమ్మ ఇక్కడి ప్రజలకు దేవతగా కొలువబడుతోంది. కొండపైనున్న ఆలయంలో నిత్యం పూజలందుకుంటోంది. -
మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో!
ఔలి... ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. పూర్తి పేరు ఔలి భుగ్యాల్. గర్వాలి భాషలో పచ్చికభూములు అని అర్థం. మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో! ఇది మరీ ఆశ్చర్యం అని కూడా అనిపిస్తుంది. తొమ్మిదిన్నర వేల అడుగుల ఎత్తులో దట్టంగా పరుచుకున్న మెత్తటి మంచు క్రమంగా గట్టిపడి బండరాళ్లకంటే గట్టిగా ఉంటుంది. మంచుతో ఆడుకోవచ్చు. స్నో స్కీయింగ్ చేయాలంటే ప్రపంచంలో ది బెస్ట్ ప్లేస్ ఇదే. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రకృతి ఇచ్చిన ప్రతి సౌకర్యాన్ని టూరిజం అభివృద్ధికి మలుచుకుంటోంది. ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉన్నటువంటి స్నో గేమ్స్ కోసం ఫ్రాన్స్ నుంచి స్నో బీటర్స్ తెప్పించి ఫ్రెంచి స్కీయింగ్ ఎక్స్‌పర్ట్‌ల సహకారంతో డెవలప్ చేశారు. స్కీ రిసార్ట్‌లో అయితే ఏకంగా మంచు కుర్చీలు, మంచు టేబుళ్లు తెల్లగా మెరుస్తుంటాయి. సరిహద్దు కనిపిస్తుంది! పర్యాటక ప్రదేశాల్లో కేబుల్ కార్లు సాధారణం గా పరిమితమైన దూరానికే ఉంటాయి. ఆ ప్రదేశం మొత్తాన్ని ఆకాశమార్గంలో చూడగలిగినట్లు మాత్రమే ఉంటాయి. ఔలిలో కేబుల్ కార్ చాలా పెద్దది. ఔలి నుంచి జోషిమఠ్ వరకు ఉంటుంది. ఈ ఇరవై నిమిషాల కేబుల్ కార్ జర్నీలో భారత్– టిబెట్ సరిహద్దు కనిపిస్తుంది. అలాగే భారత్–టిబెట్ సరిహద్దు గ్రామాల్లో ఒకటైన ‘మాణా’ గ్రామాన్ని, నీల్కాంత్, నందాదేవి శిఖరాలను కూడా చూడవచ్చు. వీటితో సంతృప్తి చెందాల్సిందే. హిమాలయాల సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఇరవై నిమిషాల కేబుల్ కార్ ప్రయాణం ఏ మాత్రం తృప్తినివ్వదు. మంచు బయళ్లు ఔలిలో ఎటు చూసినా మంచుశిఖరాలే. ఇలాంటి నేలకు పచ్చిక భూములనే పేరు విచిత్రంగా అనిపిస్తుంది. కానీ పైన చెప్పుకున్న చిత్రమంతా శీతాకాలం, ఎండాకాలం మాత్రమే కనిపిస్తుంది. శీతాకాలంలో పేరుకున్న మంచు మార్చి నుంచి కరుగుతుంది. జూలై నుంచి మంచును చీల్చుకుంటూ పచ్చదనం తన ఉనికిని ప్రకటిస్తుంది. మంచుతో పోటీపడి మొలిచిన మొక్కలు ఆగస్టు నాటికి మొగ్గలు తొడిగి పూలు పూస్తాయి. ఆ దృశ్యాన్ని చూస్తే మంచు– మట్టి పోటీ పడుతున్నాయేమో అనిపిస్తుంది. మంచుతో పోటీ పడి మరీ మట్టి మొగ్గ తొడుగుతుంటే... ఆ పచ్చిక కూడా మంచు తివాచీలాగ చల్లగా ఉంటుంది. ప్రకృతి చేసే అందమైన విన్యాసాల్లో ఇదొకటి. హిమాలయాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ అద్భుతాలే. బద్దకం కొద్దీ సూర్యోదయాన్ని మిస్ అయినప్పటికీ సూర్యాస్తమయం చేసే కనువిందును జారవిడుచుకోకూడదు. చదవండి: Travel: వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట -
రారండోయ్.. డార్జిలింగ్ పిలుస్తోంది!
సాక్షి ప్రతినిధి, డార్జిలింగ్ : డార్జిలింగ్.. పశ్చిమబెంగాల్లో సముద్రమట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం. హిమాలయ పర్వత పాదాల్లో ఉండే ఈ ప్రాంతం.. బ్రిటీష్ కాలం నుంచే కాఫీ, టీ, పర్యాటకానికి, విడిదికి ప్రసిద్ధి. ఊటీ, కొడైకెనాల్, కర్ణాటక పశ్చిమ కనుమలు, సిమ్లా, కశ్మీర్‌కు.. ఇక్కడి భౌగోళిక వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాలు ఏటవాలుగా ఉంటే.. ఇది మాత్రం నిట్టనిలువుగా ఉంటుంది. నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్‌లకు మధ్యలో ఉంటుంది. భారతదేశ చికెన్ నెక్‌ను కలిపే సిలిగురి, డార్జిలింగ్ చాలా దగ్గరగా ఉంటాయి. వేసవిలో రాత్రిపూట కనిష్టంగా 6 డిగ్రీలు.. పగలు గరిష్టంగా 28 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటే ఈ ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ వారు ఏనాడో గుర్తించారు ఈ ప్రాంతానికి 1814 దశకంలోనే బ్రిటీష్ వారు చేరుకున్నారు. తర్వాత గుర్ఖా రాజును ఓడించి ఈస్టిండియా కంపెనీ తమ వలస ప్రాంతంగా మార్చుకుంది. ఈ ప్రాంతం బ్లాక్ ఫర్మెంటెడ్ టీకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అస్సాం టీ లాంటి అరుదైన రకాలకు డార్జిలింగ్ చిరునామా. ఈ రకాలకు యురోప్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. ఇక్కడ తేయాకు తోటల పెంపకాన్ని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున చేపట్టారు. స్థానికంగా ఉండే గుర్ఖా, షేర్పా ప్రజలు, మరికొందరు తెగల ప్రజలను కూలీలుగా నియమించుకుని విస్తారంగా సాగు చేసేవారు. దాదాపు 200 ఏళ్లుగా తేయాకు తోటల వ్యాపారం నిరి్వరామంగా కొనసాగుతోంది. రోడ్డు రైలు మార్గాలు అద్భుతం.. సాగుచేసిన తేయాకు తరలింపు ప్రారంభంలో కష్టమయ్యేది. దీంతో రైలు, రోడ్డు మార్గాలను నిర్మించారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ అని పిలుస్తారు. ఇది ఇండియన్ రైల్వేలో అంతర్భాగం. కానీ నేటికీ ఇది మీటర్ గేజ్‌గా ఉండటంతో దీన్ని టాయ్ ట్రైన్ అని ముద్దుగా పిలుస్తారు. మైదాన ప్రాంతమైన న్యూ జపాలాయ్, సిలిగురి నుంచి శిఖరపు అంచున్న ఉన్న డార్జిలింగ్ వరకు 79 కి.మీ. దూరం ఈ రైల్వే ఇప్పటికీ పనిచేస్తూ పర్యాటకులను అలరిస్తోంది. ఇందులో ‘గుమ్’రైల్వే స్టేషన్ 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ కావడం గమనార్హం. యునెస్కో దీన్ని గుర్తించింది. ఇండియాలో బొగ్గుతో నడిచే ఏకైక రైలు ఇదే. పాములా మెలికలు తిరిగిన రోడ్డు అంచు నుంచి వేల మీటర్ల లోతులో ఉండే లోయలను చూస్తే కలిగే ఆ ఆనందమే వేరు. ఇంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నా.. ఏ వాహనం కూడా పట్టు తప్పకుండా రోడ్డు నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్ విలువలు, టైర్లు జారిపోకుండా ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలు చూసి ఆశ్చర్యపోతాం. ప్రతి మూల మలుపు వద్ద వాహనాలు ప్రమాదవశాత్తూ జారిపోయినా లోయలోకి పడిపోకుండా.. 50 మీటర్ల వరకు ఏపుగా పెరిగే దృఢమైన దేవదారు వృక్షాలు పెంచారు. నేషనల్ హైవే 55గా ఈ రోడ్డు మార్గాన్ని పిలుస్తారు. సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రాంతం నేపాల్‌కు చాలా సమీపంలో ఉంటుంది. పర్వతం అంచుకు వెళ్తే నేపాల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ దాదాపు గుర్ఖాలే ఉంటారు. వీరి మాతృభాష నేపాలీనే. మెజారిటీ హిందువులు, తర్వాతి స్థానంలో బౌద్ధులు ఉంటారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో 99 శాతం వ్యాపారులే. హోటల్, వాహనాలు, రిటైల్, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. మైదాన ప్రాంతం నుంచి నీరు, కూరగాయలు, సరుకులు, గ్యాస్ ప్రతిరోజూ పర్వతంపైకి రవాణా చేస్తారు. అందుకే ఇక్కడ ధరలు కాస్త అధికంగానే ఉంటాయి. గణపతి, శివుడి ఆలయాలు అధికం. బౌద్ధ దేవాలయాలు, అక్కడక్కడా బ్రిటీష్ వారి కాలంలో నిర్మించిన చర్చీలు కన్పిస్తుంటాయి. ఇక్కడ ఉండే ప్రధాన వర్గం నేపాలీ గుర్ఖాలు, షెర్పాలు తదితర వర్గాలు ఉంటాయి. భారత సైన్యంలో వీరికి ప్రత్యేక రెజిమెంట్లు ఉంటాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో వీరిదే కీలక పాత్ర. ఒక సందర్భంలో బోస్‌ను కాపాడేందుకు బ్రిటీష్ యుద్ధ ట్యాంకులను పేల్చేందుకు వీరే మానవబాంబులుగా మారారు. అందానికి అధిక ప్రాధాన్యం! ఈ ప్రజలు సాధారణ ఎత్తు ఐదున్నర అడుగల ఎత్తు. గుండ్రటి ముఖాలు. విశాలమైన నుదురుతో తెల్లగా, అందంగా ఉంటారు. అందానికి ప్రాధాన్యం ఇస్తారు. వీరు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుంటారు. మహిళలు జుట్టుకు, ముఖానికి, పెదాలకు రంగు లేకుండా కనిపించరు. ఈ విషయంలో మగవారూ తక్కువేమీ కాదు. అన్నీ లేటెస్ట్‌వే వాడతారు. తమ ఇంటికి ఇంధ్రధనస్సు రంగులతో తోరణాలు ఉంటా యి. వీరి ఇళ్లపైనా రంగురంగుల జెండాలు ఎగురుతుంటాయి. డార్జిలింగ్‌లో రోడ్డుకు సమాంతరంగా ఐదు లేదా ఏడో అంతస్తు ఉంటుంది. ఏడో అంతస్తు నుంచి కిందికి వెళ్తుంటారు. ఎందుకంటే ఇంటి లోయలో పునాదులు ఉంటాయి. అందుకే, రోడ్డుకు సమాంతరంగా కట్టుకుంటూ వచ్చేసరికి అది ఐదు లేదా ఏడవ అంతస్తు అవుతుంటుంది. ఎలా చేరుకోవచ్చు? హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌కు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానంలో శంషాబాద్ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయం వరకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి డార్జిలింగ్ తేయాకు తోటలకు దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాగ్డోగ్రాలో డార్జిలింగ్ కొండలపైకి చేరుకునేందుకు ట్యాక్సీలు ఉంటాయి. ఒంటిరిగా వెళ్లేవారు, ఔత్సాహికుల కోసం బైకులు కూడా కిరాయికి లభిస్తాయి. ఘాట్‌రోడ్డు అందాలు చూసుకుంటూ నిట్టనిలువునా 80 కిలోమీటర్ల దూరం ఉన్న డార్జిలింగ్ చేరుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇస్తుంది. కాగా, నగరాల్లో బోటనీ, అగ్రికల్చర్, జువాలజీ, ఆయుర్వేదం, ఎంబీబీఎస్, వెటర్నరీ, సోషియాలజీ తదితర విద్యనభ్యసించే విద్యార్థులకు డార్జిలింగ్ ఓ అద్భుత అధ్యయన కేంద్రం. అలాంటి విద్యార్థులకు సబ్సిడీతో ఇక్కడికి వచ్చేలా చేస్తే వారికి క్షేత్రస్థాయి విజ్ఞానం పెరుగుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. హోం స్టే పర్యాటకంలో భాగం చేసేలా చూస్తామని పేర్కొన్నారు. అరుదైన వృక్ష, జంతు జాలాలు.. డార్జిలింగ్‌లో కాఫీ, టీ తోటలతో పాటు ఎన్నో వేల అరుదైన వృక్ష, జంతు జాలాలకు నిలయం. ఇక్కడ ఉండే వృక్షజాతులు ఇండియాలో మరెక్కడా కనబడవు. ఇక్కడి ప్రజలు తమ ఇళ్ల ముందు అందమైన పూలు పూసే గుల్మాలు, ఆర్కిడ్స్‌ను పెంచుకుంటారు. గోడలపై అరుదైన శైవలాలు, శిలీంధ్రాలు, పరాన్న జీవి మొక్కలు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు అధికంగా ఉంటాయి. వీటి రాకను తెలుసుకునేందుకు ప్రతి ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటారు. -
హిమాలయాలను చూస్తూ హాయిగా సిప్ చేయొచ్చు..
ఓ కప్పు కాఫీ కోసం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాలా? హిమాలయాలను చూస్తూ సిప్పు చేయాలంటే తప్పదు. సరిహద్దుకు ఈవల ఉండి ఆవలి టిబెట్‌ను చూస్తూ... టీ తాగాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిలో... తాపీగా ఓ టీ తాగాలంటే అంతదూరం వెళ్లాల్సిందే. టీ తాగడమే కాదు... టీ తాగుతూ చాలా చూడవచ్చు. సరస్వతి నది మీద ద్రౌపది కోసం... భీముడు కట్టిన రాతి వంతెనను చూడవచ్చు. ఇంకా... ఇంకా... చూడాలంటే... ‘మానా’ గ్రామానికి ప్రయాణం కట్టవచ్చు. మానా అనేది చాలా చిన్న గ్రామం. ఓ వంద ఇళ్లుంటాయేమో! కొండవాలులో ఉన్న ఈ గ్రామంలో ఏది నివాస ప్రదేశమో, ఏది వ్యవసాయ క్షేత్రమో అర్థం కాదు. అంతా కలగలిసి ఉంటుంది. ఇంటి ముందు క్యాబేజీ పంటలు కనిపిస్తాయి. దుకాణం వెనుక ఒక కుటుంబం నివసిస్తుంటుంది. ఓ వైపు ధీరగంభీరంగా హిమాలయాలు, మరో దిక్కున కిందకు చూస్తే నేల ఎక్కడుందో తెలియనంత లోతులో మంద్రంగా ప్రవహించే నదులు. నింగికీ నేలకూ మధ్యలో విహరిస్తున్నామనే భావన ఊహల్లో తేలుస్తుంది. నేనూ ఉన్నానంటూ సూర్యుడు తన ఉనికిని ప్రకటించే ప్రయత్నంలో ఉంటాడు. దారి చూపే బ్యాంకు ఇక్కడ రోడ్లు తీరుగా ఉండవు. భారతీయ స్టేట్ బ్యాంకు పెట్టిన బోర్డుల ఆధారంగా వెళ్లాలి. వ్యాసగుహ 150 మీటర్లు, గణేశ గుహ 30 మీటర్లు, భీమ్‌పూల్– సరస్వతి దర్శన్ 100మీటర్లు, కేశవ్ ప్రయాగ 600 మీటర్లు, వసుధారా జలపాతం ఐదు కిలోమీటర్లు అని బోర్డులుంటాయి. వసుధారా జలపాతం పాండవుల స్వర్గారోహణ ప్రస్థానంలో మానా తర్వాత మజిలీ. చాయ్ ప్రమోషన్ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడం వస్తే చాలు... సముద్ర తీరాన ఇసుకని అమ్మవచ్చు, నడి సముద్రంలో ఉప్పు నీటిని అమ్మనూవచ్చు. మానా గ్రామస్థులు టీ, కాఫీలు అమ్మడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘దేశం చివరి గ్రామం ఇది. ఇక్కడ టీ తాగిన అనుభూతిని మీ ఊరికి తీసుకెళ్లండి’ అని కొత్త ఆలోచనను రేకెత్తించడంతో ప్రతి ఒక్కరికీ టీ కానీ కాఫీ కాని తాగి తీరాలనిపిస్తుంది. ప్రతి పది మీటర్లకు ఒక చాయ్ దుకాణం ఉంటుంది. ప్రతి దుకాణం మీద ‘హిందూస్థాన్ కీ అంతిమ దుకాన్’ అనే బోర్డు ఉంటుంది. వ్యాపార నైపుణ్యం అంటే అదే. అసలైన చివరి దుకాణం ఏదనే ప్రశ్నార్థకానికి సమాధానం కూడా స్టేట్ బ్యాంకు బోర్టే. స్టేట్ బ్యాంకు జోషిమ శాఖ చివరి దుకాణం దగ్గర ‘ఇదే చివరి చాయ్ దుకాణం అనే బోర్డు ఉంటుంది. మానా గ్రామం పొలిమేర అది. ఆ తర్వాత వచ్చే దారి మానా పాస్. ఆ దారిలో ముందుకు వెళ్తే సరిహద్దు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపేస్తారు. మానా గ్రామం... దేశం చివరిలో సరిహద్దు వెంబడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఉత్తర ఎల్లలో హిమాచల్ ప్రదేశ్‌లోని చిత్కుల్ కూడా సరిహద్దు గ్రామమే. అయితే అది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందలేదు. మానా గ్రామం భారతీయులకు సొంతూరిలాగ అనిపించడానికి కారణం ఇక్కడ మన పురాణేతిహాసాల మూలాలు కనిపించడమే. -
టూరిస్టుల గోల్కొండ
హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చే ల్యాండ్‌మార్క్.. చార్మినార్. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతి చెందిన ఈ చారిత్రక కట్టడం పర్యాటకులను ఆకర్షించడంలో మాత్రం వెనుకబడుతోంది. దీనిని కాదని గోల్కొండ ఖిల్లా.. స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకుల సందర్శనీయ ప్రాంతాల జాబితాలో గోల్కొండ ప్రథమ స్థానంలో ఉంది. మూడేళ్లుగా ఈ చారిత్రక కట్టడాలను సందర్శిస్తున్న పర్యాటకుల లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. నిర్మాణ చాతుర్యపరంగా చార్మినార్ కట్టిపడేస్తున్నా.. గోల్కొండ కోటలోని వివిధ నిర్మాణాల ఇంజనీరింగ్ నైపుణ్యమే పర్యాటకులను ఎక్కువ ఆకట్టుకుంటోందని తేలింది. పైగా, కోట విశాలంగా ఉండటం, ఆహ్లాదకర వాతావరణం, ఎక్కువసేపు అక్కడ గడిపేందుకు అనువైన పరిస్థితులు ఉండటం వంటివి గోల్కొండకు పెద్దసంఖ్యలో పర్యాటకులను రప్పిస్తోంది. -
ఇక జనరంజకంగా జోడేఘాట్
కొనసాగుతున్న భీం స్మారక పనులు వర్ధంతి నాటికి పూర్తికానున్న మేజర్ పనులు కెరమెరి : చారిత్రాత్మక నిర్మాణాలతో అమర వీరుడి పురిటిగడ్డకు కొత్త శోభ సంతరించనుంది. నూతన నిర్మాణాలతో జోడేఘాట్ కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు జోడేఘాట్‌లోనే బసజేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. 16న నిర్వహించనున్న కుమ్రం భీం 76 వర్ధంతికి ఎలాగైన నిర్మాణాలు పూర్తి చేయాలని కృత నిశ్చయంతో అధికారులు మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. 2014 వ సంవత్సరం సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లో నిర్వహించిన 74 కుంమ్రం భీం వర్ధంతికి హాజరై కుమ్రం భీం మ్యూజీయం, జల్, జంగల్, జమీన్ ఆర్చీలు, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, బొటానికల్ గార్డెన్, హంపీథియేటర్ నిర్మాణాల కోసం రూ. 25 కోట్లను మంజూరు చేశారు. అందులో రూ. 16 కోట్లతో మ్యూజియం, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, హంపీథియేటర్ పనులు వెనువెంటనే ప్రారంభించారు. కొనసాగుతున్న పనులు గడిచిన ఏడాదిన్నరగా పనులు కొనాగుతున్నాయి. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం శనివారం ఒకే రోజు గడువు ఉండడంతో ఆయా శాఖలకు చెందిన అధికారులు రాత్రి పగలు అక్కడే ఉండి పనులు చేస్తున్నారు. స్మృతి చిహ్ననికి సంబంధించిన సెంట్రింగ్ వర్క్ పూర్తి అయ్యింది. సమాధి, 8 ఫీట్ల నిలువెత్తు కుమ్రం భీం విగ్రహం అమర్చడమే తరువాయి. అలాగే నాలుగు మాసాల క్రితమే జల్, జంగల్, జమీన్ ఆర్చీలు పూర్తి అయ్యాయి. మ్యూజియానికి సంబంధించిన మేజర్ పనులు సమాప్తమవగా చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. మ్యూజియంలో గుస్సాడీలు నృత్యాలు చేస్తున్నట్లు, కళాకారులు వాయిద్యాలను వాయిస్తున్నట్లు ఉన్న ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు కుమ్రం భీం తన తోటి వారితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నట్లు ఉన్న ప్రతిమలు అచ్చం మనిషిలాగానే పోలి ఉన్నాయి. మ్యూజీయం గోడలకు రకరకాల గిరిజన సంసృ్కతికి సంబంధించిన చిత్రాలు అమర్చారు. గిరిజన సంస్కృతి ఉట్టి పడేలా.. గిరిజన సంసృ్కతి ఉట్టి పడేలా కళలు, కళాకారులతో అలంకరిస్తున్నారు. కొన్ని ప్రతిమలను గ్లాస్‌తో తయారు చేసిన పరికరాల్లో అమర్చనున్నారు. గిరిజన సంసృ్కతీ, పురాతన సామగ్రితో మ్యూజియాన్ని అలంకరించనున్నారు. ఆదివాసీ దేవలు బల్లి, భీమ దేవరా, జంగుబాయి, నాగోబా, పెర్సాపేన్ దేవలను ఏర్పాటు చేయనున్నారు. బీహార్, జెఎన్టీయు లకు చెందిన కళాకారులచే అలంకరణ కొనసాగుతుంది. మునుపెన్నడు లేని విధంగా జోడేఘాట్‌కు కళకళాలాడనుంది. -
సంగమేశ్వరాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దుతాం
– త్వరలో గెస్టుహౌస్నిర్మాణం – శ్రీశైలానికి టూరిజం బోటు ఏర్పాటు శ్రీశైలం(జూపాడుబంగ్లా): సంగమేశ్వర క్షేత్రాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. ఆదివారం ఆయన లింగాలగట్టు దిగువఘాటులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణాపుష్కరాల నిర్వహణలో కర్నూలు జిల్లాప్రథమస్థానంలో నిలవటం హర్షించదగిన విషయమన్నారు. సంగమేశ్వరం పుష్కరఘాటు, లింగాల ఘాట్‌కు అత్యధిక భక్తుల రద్దీ ఉన్నా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడంతో జిల్లాకు ప్రథమ స్థానం లభించిందన్నారు. సంగమేశ్వరం క్షేత్రంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం హోటల్‌ను అలాగే కొనసాగిస్తామన్నారు. త్వరలో ఓ గెస్టుహౌస్ను నిర్మించటంతోపాటు సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి టూరిజం బోటు ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మార్గమధ్యంలో అనువైన ప్రాంతాన్ని చూసుకొని భక్తులు సేదతీరేందుకు ఓ హోటల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పుష్కరాల విజయవంతానికి కషిచేయటంతో జిల్లాకు మంచి పేరొంచిదన్నారు. పుష్కరాల చివరి రోజున లింగాలగట్టులో ఆడపడచులకు సారె ఇవ్వనున్నట్లు తెలిపారు. -
సాగర్ టు శ్రీశైలం.. బోటు షికారు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిప్రవాహం మొదలైన నేపథ్యంలో నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య ‘బోటు షికారు’కు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ శ్రీకారం చుడుతోంది. గతంలో నీటిప్రవాహం బాగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పర్యాటకుల నుంచి మంచి స్పందన రావడాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం దీనిని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చేవారం నుంచి బోటు షికారుకు శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు. వారంలో రెండు పర్యాయాలు ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు తీసుకెళతారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. 11 గంటలకు నాగార్జునసాగర్ నుంచి బోటు షికారు మొదలవుతుంది. సాయంత్రం ఐదున్నరకు శ్రీశైలం చేరుకుంటుంది. బోటులోనే భోజన వసతి ఉంటుంది. సాయంత్రం శ్రీశైలంలోని కొన్ని పర్యాటక కేంద్రాలను సందర్శించాక అక్కడే రాత్రి బస ఏర్పాటు చేస్తారు. ఉదయం శ్రీశైలం దేవాలయం, జలాశయం, రోప్‌వే తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బోటులో తిరుగుప్రయాణం మొదలవుతుంది. మధ్యలో ఎత్తిపోతల, నాగార్జునకొండ సందర్శన అనంతరం సాగర్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకల్లా బస్సులో పర్యాటకులను హైదరాబాద్ చేరుస్తారు. ఇందుకు పెద్దలకు రూ.3,150, పిల్లలకు రూ.2,520 రుసుముగా నిర్ణయించారు. ఒక ట్రిప్పులో వందమంది పర్యాటకులకు అవకాశం కల్పిసారు. వివరాలకు 1800-42545454 (టోల్‌ఫ్రీ నం.), 9848007028 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.