
హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చే ల్యాండ్‌మార్క్.. చార్మినార్. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతి చెందిన ఈ చారిత్రక కట్టడం పర్యాటకులను ఆకర్షించడంలో మాత్రం వెనుకబడుతోంది. దీనిని కాదని గోల్కొండ ఖిల్లా.. స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకుల సందర్శనీయ ప్రాంతాల జాబితాలో గోల్కొండ ప్రథమ స్థానంలో ఉంది. మూడేళ్లుగా ఈ చారిత్రక కట్టడాలను సందర్శిస్తున్న పర్యాటకుల లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. నిర్మాణ చాతుర్యపరంగా చార్మినార్ కట్టిపడేస్తున్నా.. గోల్కొండ కోటలోని వివిధ నిర్మాణాల ఇంజనీరింగ్ నైపుణ్యమే పర్యాటకులను ఎక్కువ ఆకట్టుకుంటోందని తేలింది. పైగా, కోట విశాలంగా ఉండటం, ఆహ్లాదకర వాతావరణం, ఎక్కువసేపు అక్కడ గడిపేందుకు అనువైన పరిస్థితులు ఉండటం వంటివి గోల్కొండకు పెద్దసంఖ్యలో పర్యాటకులను రప్పిస్తోంది.