
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) స్మారక చిహ్నాల జాబితా టాప్ 10లో నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం చార్మినార్ చోటు దక్కించుకుంది. అంతేకాదు అత్యధిక సంఖ్యలో భారతీయ సందర్శకులను ఆకట్టుకుని వార్షిక పెరుగుదలలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది.
అన్నింటికన్నా మిన్నగా..
గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితాలో చార్మినార్ 9వ స్థానంలో నిలిచింది. దేశీయ పర్యాటకుల సంఖ్య 2022–23లో 9.29లక్షలు కాగా, గత ఏడాది 2023–24 కల్లా 12.9లక్షలకు పెరిగింది. సందర్శకుల సంఖ్యలో పెరుగుదల 38 శాతానికి పైగా ఉండడంతో అన్ని ఏఎస్‌ఐ స్మారక చిహా్నల్లో కలిపి 10.8 శాతంగా ఉన్న మొత్తం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. గత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఏఎస్‌ఐ స్మారక చిహా్నల్లో మొత్తం దేశీయ పర్యాటకుల సంఖ్య 479.01 లక్షలు కాగా ఇది 2023–24లో 530.9 లక్షలకు పెరిగింది.
గోల్కొండ కోటకూ..
చారి్మనార్‌తో పాటు, నగరంలోని గోల్కొండ కోట కూడా అత్యధిక భారతీయ సందర్శకులను సాధించిన స్మారక చిహ్నాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చారిత్రక స్మారక చిహ్నాన్ని 2022–23లో 15.27 లక్షల మంది సందర్శించగా, 2023–24లో 5 శాతానికి పైగా పెరిగి 16.08 లక్షల మంది సందర్శించారు. ఇక అత్యధిక భారతీయ సందర్శకులను ఆకట్టుకున్న టాప్ 10 స్మారక చిహ్నాల జాబితాలో తాజ్ మహల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది 20 శాతానికి పైగా సందర్శకుల సంఖ్యను పెంచుకుంది. అయితే ఇది చార్మినార్ పెరుగుదలతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం.