
అందుబాటులోకి పార్కింగ్ స్థలాలు!
రంజాన్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుల చర్యలు
పాతబస్తీలో 7 ప్రాంతాల్లో ఏర్పాటు
డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: నగర ట్రాఫిక్ డీసీపీ–3
చార్మినార్: రంజాన్ మాసం చివరి దశకు చేరుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో ముందస్తు చర్యలు చేపట్టారు. మార్కెట్లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చార్మినార్ (Charminar) యునానీ ఆసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నగరం నుంచే కాకుండా శివారు జిల్లాల ప్రజలు కూడా పాతబస్తీలోని మార్కెట్లకు వస్తుండడంతో క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతోంది.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మండలం ట్రాఫిక్ పోలీసులు చార్మినార్ పరిసరాల్లో వాహనదారులకు పార్కింగ్ (Parking) సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మక్కా మసీదులో నమాజ్‌లకు ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారి వాహనాలు పార్క్ చేసేందుకు పంచమొహల్లాలో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. అలాగే కూలగొట్టిన చార్మినార్ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు
రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి సందర్శకులతో పాటు వినియోగదారుల సందడి అధికంగా ఉంటోంది. దీంతో వాహనదారుల సౌకర్యార్థ్యం పంచమొహాల్లాలో అతి పెద్ద ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేశాం. అలాగే ఖిల్వత్ గ్రౌండ్, కుడా స్టేడియం, చౌక్‌మైదాన్ ఖాన్‌లోని ముఫిదుల్లా నాం ఖాళీ స్థలాలతో పాటు యునానీ ఆసుపత్రి ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా అక్రమంగా పార్కింగ్‌ల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఆర్.వెంకటేశ్వర్లు, నగర ట్రాఫిక్ డీసీపీ–3
చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు!
Comments
Please login to add a commentAdd a comment