సాగర్ టు శ్రీశైలం.. బోటు షికారు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిప్రవాహం మొదలైన నేపథ్యంలో నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య ‘బోటు షికారు’కు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ శ్రీకారం చుడుతోంది. గతంలో నీటిప్రవాహం బాగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పర్యాటకుల నుంచి మంచి స్పందన రావడాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం దీనిని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చేవారం నుంచి బోటు షికారుకు శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు. వారంలో రెండు పర్యాయాలు ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు తీసుకెళతారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి.
11 గంటలకు నాగార్జునసాగర్ నుంచి బోటు షికారు మొదలవుతుంది. సాయంత్రం ఐదున్నరకు శ్రీశైలం చేరుకుంటుంది. బోటులోనే భోజన వసతి ఉంటుంది. సాయంత్రం శ్రీశైలంలోని కొన్ని పర్యాటక కేంద్రాలను సందర్శించాక అక్కడే రాత్రి బస ఏర్పాటు చేస్తారు. ఉదయం శ్రీశైలం దేవాలయం, జలాశయం, రోప్‌వే తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బోటులో తిరుగుప్రయాణం మొదలవుతుంది. మధ్యలో ఎత్తిపోతల, నాగార్జునకొండ సందర్శన అనంతరం సాగర్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకల్లా బస్సులో పర్యాటకులను హైదరాబాద్ చేరుస్తారు. ఇందుకు పెద్దలకు రూ.3,150, పిల్లలకు రూ.2,520 రుసుముగా నిర్ణయించారు. ఒక ట్రిప్పులో వందమంది పర్యాటకులకు అవకాశం కల్పిసారు. వివరాలకు 1800-42545454 (టోల్‌ఫ్రీ నం.), 9848007028 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.