Accidents And Risks Increasing At Charmadi Ghat In Karnataka - Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో అలజడి.. పర్యటక స్థలంలో చీకటి ఉదంతాలు!

Published Mon, Feb 6 2023 7:23 AM | Last Updated on Mon, Feb 6 2023 9:08 AM

Accidents And Risks Increasing At Charmadi Ghat In Karnataka - Sakshi

బనశంకరి: కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా చార్మాడీ ఘాట్‌ ప్రకృతి అందాలకు నిలయం ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామం. పర్వతాలు, లోయలు పచ్చగా, పొగమంచుతో అద్భుతం అనిపిస్తాయి. కానీ ఇటీవల వేర్వేరు కారణాలతో హాట్‌టాపిక్‌గా మారుతోంది. దుండగులు ఎక్కడో హత్యలు చేసి ఆ మృతదేహాలను తీసుకువచ్చి చార్మాడీ ఘాట్‌లో పడేసి వెళ్లడం పెరిగింది. దీని వల్ల కేసుల విచారణ కష్టమవుతుంది. మరోపక్క పర్యాటకులు ఇక్కడ ప్రమాదకర స్థలాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.  

సాయంత్రం కాగానే..  
చార్మాడీఘాట్‌లో 28 కిలోమీటర్లు విల్లుపురం–మంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని వెళుతుంది. ఈ మార్గంగా నిత్యం వేలాది వాహనాలు  సంచరిస్తుంటాయి. ఎత్తైన పర్వతాలతో కూడిన ఘాట్‌లో సాయంత్రం తరువాత వాహనాల సంచారం తక్కువై నిర్మానుష్యమవుతుంది. ఈ సమయంలో నేర ముఠాలు మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ప్రకృతి సోయగాలకు నిలయమైన చార్మాడీఘాట్‌కు  రక్తపు మరకలు అంటిస్తున్నారు.  

పనిచేయని సీసీ కెమెరాలు.. 
కొట్టిగేహార అటవీశాఖ చెక్‌పోస్టులో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఘాట్‌లోకి ప్రవేశించే చెక్‌పోస్టులో వాహనాల తనిఖీ నామమాత్రమే. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవారికి ఘాట్‌ స్వర్గధామంగా తయారైంది. హంతకులు జంకు లేకుండా వాహనాల్లో మృతదేహాలను తీసుకొచ్చి వదిలేస్తుంటారు. ఇదే కాదు కొన్ని వాహనాల డ్రైవర్లు మృతిచెందిన పందులు, కోళ్లను ఇదే ఘాట్‌ రోడ్డులో పడేస్తున్నారు.  

అడ్డుకట్టకు చర్యలు చేపడతాం: ఎస్పీ  
కొట్టిగుహర, చార్మాడీ గ్రామాల్లో చెక్‌పోస్టుల్లో పగలూ రాత్రి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన  అవసరం ఉంది. కాగా, ఘాట్‌లో మృతదేహాలు  లభిస్తున్నట్లు తెలిసింది, సంఘ సంస్థలు, పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించి నియంత్రణ గురించి చర్చిస్తాం,  చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాలు అమర్చడానికి చర్యలు తీసుకుంటామని దక్షిణ కన్నడ ఎస్పీ ఉమాప్రశాంత్‌ తెలిపారు.  

ఎన్నో చీకటి ఉదంతాలు
2008 జూన్‌ 11 తేదీన శివగంగమ్మ అనే మహిళ మృతదేహాన్ని పడేశారు. 2012లో వజ్రాల వ్యాపారిని బెంగళూరులో హత్యచేసి చార్మాడీ కనుమలో వేశారు. అదే ఏడాది అల్దూరిలో ఒక డాక్టరు స్పృహలేని స్థ్దితిలో కనబడ్డారు. 2013 జూన్‌ 21 న మలయమారుత వద్ద శివమొగ్గ మంగోటి గ్రామ మమతా, 2016లో చెన్నరాయపట్టణ కాంత అనే మహిళల మృతదేహాలు సోమనకాడు వద్ద కనిపించాయి. 2020లో చార్మాఢీఘాట్‌ రోడ్డులోని కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత ఏడాది డబ్బు విషయంపై చిక్కబళ్లాపుర శరత్‌ అనే వ్యక్తిని హత్యచేసి చార్మాడి ఘాట్‌లో విసిరేశారు. ఇలా అనేక హత్యల్లో మృతదేహాలను పడవేసి ఈ ప్రాంతమంటే భయాందోళన కలిగించే దుస్థితిని తెచ్చారు. ఆచూకీ లేని అనేక మృతదేహాలు ఇక్కడి నేలలో లీనమౌతున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు.  

సెల్ఫీ ప్రమాదాలు
అలెకాన్‌ జలపాతం, ఆలయం వద్ద సెల్పీ తీసుకోవడానికి వెళ్లి పలువురు మృత్యవాత పడ్డారు. 2015 సెప్టెంబరులో హండుగళి మహేంద్ర, 2016 జనవరి 18 చిత్రదుర్గ కు చెందిన హనుమంతప్ప(34), నాగభూషణ్‌ (28) ప్రాణాలు కోల్పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement