కొనసాగుతున్న భీం స్మారక పనులు
వర్ధంతి నాటికి పూర్తికానున్న మేజర్ పనులు
కెరమెరి : చారిత్రాత్మక నిర్మాణాలతో అమర వీరుడి పురిటిగడ్డకు కొత్త శోభ సంతరించనుంది. నూతన నిర్మాణాలతో జోడేఘాట్ కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు జోడేఘాట్‌లోనే బసజేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. 16న నిర్వహించనున్న కుమ్రం భీం 76 వర్ధంతికి ఎలాగైన నిర్మాణాలు పూర్తి చేయాలని కృత నిశ్చయంతో అధికారులు మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నారు.
2014 వ సంవత్సరం సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లో నిర్వహించిన 74 కుంమ్రం భీం వర్ధంతికి హాజరై కుమ్రం భీం మ్యూజీయం, జల్, జంగల్, జమీన్ ఆర్చీలు, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, బొటానికల్ గార్డెన్, హంపీథియేటర్ నిర్మాణాల కోసం రూ. 25 కోట్లను మంజూరు చేశారు. అందులో రూ. 16 కోట్లతో మ్యూజియం, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, హంపీథియేటర్ పనులు వెనువెంటనే ప్రారంభించారు.
కొనసాగుతున్న పనులు
గడిచిన ఏడాదిన్నరగా పనులు కొనాగుతున్నాయి. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం శనివారం ఒకే రోజు గడువు ఉండడంతో ఆయా శాఖలకు చెందిన అధికారులు రాత్రి పగలు అక్కడే ఉండి పనులు చేస్తున్నారు. స్మృతి చిహ్ననికి సంబంధించిన సెంట్రింగ్ వర్క్ పూర్తి అయ్యింది. సమాధి, 8 ఫీట్ల నిలువెత్తు కుమ్రం భీం విగ్రహం అమర్చడమే తరువాయి. అలాగే నాలుగు మాసాల క్రితమే జల్, జంగల్, జమీన్ ఆర్చీలు పూర్తి అయ్యాయి.
మ్యూజియానికి సంబంధించిన మేజర్ పనులు సమాప్తమవగా చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. మ్యూజియంలో గుస్సాడీలు నృత్యాలు చేస్తున్నట్లు, కళాకారులు వాయిద్యాలను వాయిస్తున్నట్లు ఉన్న ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు కుమ్రం భీం తన తోటి వారితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నట్లు ఉన్న ప్రతిమలు అచ్చం మనిషిలాగానే పోలి ఉన్నాయి. మ్యూజీయం గోడలకు రకరకాల గిరిజన సంసృ్కతికి సంబంధించిన చిత్రాలు అమర్చారు.
గిరిజన సంస్కృతి ఉట్టి పడేలా..
గిరిజన సంసృ్కతి ఉట్టి పడేలా కళలు, కళాకారులతో అలంకరిస్తున్నారు. కొన్ని ప్రతిమలను గ్లాస్‌తో తయారు చేసిన పరికరాల్లో అమర్చనున్నారు. గిరిజన సంసృ్కతీ, పురాతన సామగ్రితో మ్యూజియాన్ని అలంకరించనున్నారు. ఆదివాసీ దేవలు బల్లి, భీమ దేవరా, జంగుబాయి, నాగోబా, పెర్సాపేన్ దేవలను ఏర్పాటు చేయనున్నారు. బీహార్, జెఎన్‌టీయు లకు చెందిన కళాకారులచే అలంకరణ కొనసాగుతుంది. మునుపెన్నడు లేని విధంగా జోడేఘాట్‌కు కళకళాలాడనుంది.
ఇక జనరంజకంగా జోడేఘాట్
Published Sat, Oct 15 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement
Advertisement