రారండోయ్..‌ డార్జిలింగ్‌ పిలుస్తోంది! | Darjeeling: Best Tourist Spot In West Bengal | Sakshi
Sakshi News home page

యాత్రికులకు డార్జిలింగ్‌ పిలుపు

Published Wed, Mar 3 2021 1:58 PM | Last Updated on Wed, Mar 3 2021 2:56 PM

Darjeeling: Best Tourist Spot In West Bengal - Sakshi

సాక్షి ప్రతినిధి, డార్జిలింగ్‌ : డార్జిలింగ్‌.. పశ్చిమబెంగాల్‌లో సముద్రమట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం. హిమాలయ పర్వత పాదాల్లో ఉండే ఈ ప్రాంతం.. బ్రిటీష్‌ కాలం నుంచే కాఫీ, టీ, పర్యాటకానికి, విడిదికి ప్రసిద్ధి. ఊటీ, కొడైకెనాల్, కర్ణాటక పశ్చిమ కనుమలు, సిమ్లా, కశ్మీర్‌కు.. ఇక్కడి భౌగోళిక వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాలు ఏటవాలుగా ఉంటే.. ఇది మాత్రం నిట్టనిలువుగా ఉంటుంది. నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్‌లకు మధ్యలో ఉంటుంది. భారతదేశ చికెన్‌ నెక్‌ను కలిపే సిలిగురి, డార్జిలింగ్‌ చాలా దగ్గరగా ఉంటాయి. వేసవిలో రాత్రిపూట కనిష్టంగా 6 డిగ్రీలు.. పగలు గరిష్టంగా 28 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటే ఈ ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

బ్రిటిష్‌ వారు ఏనాడో గుర్తించారు 
ఈ ప్రాంతానికి 1814 దశకంలోనే బ్రిటీష్‌ వారు చేరుకున్నారు. తర్వాత గుర్ఖా రాజును ఓడించి ఈస్టిండియా కంపెనీ తమ వలస ప్రాంతంగా మార్చుకుంది. ఈ ప్రాంతం బ్లాక్‌ ఫర్మెంటెడ్‌ టీకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అస్సాం టీ లాంటి అరుదైన రకాలకు డార్జిలింగ్‌ చిరునామా. ఈ రకాలకు యురోప్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండేది. ఇక్కడ తేయాకు తోటల పెంపకాన్ని బ్రిటీష్‌ వారు పెద్ద ఎత్తున చేపట్టారు. స్థానికంగా ఉండే గుర్ఖా, షేర్పా ప్రజలు, మరికొందరు తెగల ప్రజలను కూలీలుగా నియమించుకుని విస్తారంగా సాగు చేసేవారు. దాదాపు 200 ఏళ్లుగా తేయాకు తోటల వ్యాపారం నిరి్వరామంగా కొనసాగుతోంది. 

రోడ్డు రైలు మార్గాలు అద్భుతం.. 
సాగుచేసిన తేయాకు తరలింపు ప్రారంభంలో కష్టమయ్యేది. దీంతో రైలు, రోడ్డు మార్గాలను నిర్మించారు. డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే లైన్‌ అని పిలుస్తారు. ఇది ఇండియన్‌ రైల్వేలో అంతర్భాగం. కానీ నేటికీ ఇది మీటర్‌ గేజ్‌గా ఉండటంతో దీన్ని టాయ్‌ ట్రైన్‌ అని ముద్దుగా పిలుస్తారు. మైదాన ప్రాంతమైన న్యూ జపాలాయ్, సిలిగురి నుంచి శిఖరపు అంచున్న ఉన్న డార్జిలింగ్‌ వరకు 79 కి.మీ. దూరం ఈ రైల్వే ఇప్పటికీ పనిచేస్తూ పర్యాటకులను అలరిస్తోంది. ఇందులో ‘గుమ్‌’రైల్వే స్టేషన్‌ 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్‌ కావడం గమనార్హం. యునెస్కో దీన్ని గుర్తించింది. ఇండియాలో బొగ్గుతో నడిచే ఏకైక రైలు ఇదే. పాములా మెలికలు తిరిగిన రోడ్డు అంచు నుంచి వేల మీటర్ల లోతులో ఉండే లోయలను చూస్తే కలిగే ఆ ఆనందమే వేరు. ఇంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నా.. ఏ వాహనం కూడా పట్టు తప్పకుండా రోడ్డు నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్‌ విలువలు, టైర్లు జారిపోకుండా ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలు చూసి ఆశ్చర్యపోతాం. ప్రతి మూల మలుపు వద్ద వాహనాలు ప్రమాదవశాత్తూ జారిపోయినా లోయలోకి పడిపోకుండా.. 50 మీటర్ల వరకు ఏపుగా పెరిగే దృఢమైన దేవదారు వృక్షాలు పెంచారు. నేషనల్‌ హైవే 55గా ఈ రోడ్డు మార్గాన్ని పిలుస్తారు. 

సంస్కృతి, సంప్రదాయాలు 
ఈ ప్రాంతం నేపాల్‌కు చాలా సమీపంలో ఉంటుంది. పర్వతం అంచుకు వెళ్తే నేపాల్‌ కనిపిస్తుంటుంది. ఇక్కడ దాదాపు గుర్ఖాలే ఉంటారు. వీరి మాతృభాష నేపాలీనే. మెజారిటీ హిందువులు, తర్వాతి స్థానంలో బౌద్ధులు ఉంటారు. డార్జిలింగ్‌ పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో 99 శాతం వ్యాపారులే. హోటల్, వాహనాలు, రిటైల్, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. మైదాన ప్రాంతం నుంచి నీరు, కూరగాయలు, సరుకులు, గ్యాస్‌ ప్రతిరోజూ పర్వతంపైకి రవాణా చేస్తారు. అందుకే ఇక్కడ ధరలు కాస్త అధికంగానే ఉంటాయి. గణపతి, శివుడి ఆలయాలు అధికం. బౌద్ధ దేవాలయాలు, అక్కడక్కడా బ్రిటీష్‌ వారి కాలంలో నిర్మించిన చర్చీలు కన్పిస్తుంటాయి. ఇక్కడ ఉండే ప్రధాన వర్గం నేపాలీ గుర్ఖాలు, షెర్పాలు తదితర వర్గాలు ఉంటాయి. భారత సైన్యంలో వీరికి ప్రత్యేక రెజిమెంట్లు ఉంటాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో వీరిదే కీలక పాత్ర. ఒక సందర్భంలో బోస్‌ను కాపాడేందుకు బ్రిటీష్‌ యుద్ధ ట్యాంకులను పేల్చేందుకు వీరే మానవబాంబులుగా మారారు. 

అందానికి అధిక ప్రాధాన్యం! 
ఈ ప్రజలు సాధారణ ఎత్తు ఐదున్నర అడుగల ఎత్తు. గుండ్రటి ముఖాలు. విశాలమైన నుదురుతో తెల్లగా, అందంగా ఉంటారు. అందానికి ప్రాధాన్యం ఇస్తారు. వీరు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుంటారు. మహిళలు జుట్టుకు, ముఖానికి, పెదాలకు రంగు లేకుండా కనిపించరు. ఈ విషయంలో మగవారూ తక్కువేమీ కాదు. అన్నీ లేటెస్ట్‌వే వాడతారు. తమ ఇంటికి ఇంధ్రధనస్సు రంగులతో తోరణాలు ఉంటా యి. వీరి ఇళ్లపైనా రంగురంగుల జెండాలు ఎగురుతుంటాయి. డార్జిలింగ్‌లో రోడ్డుకు సమాంతరంగా ఐదు లేదా ఏడో అంతస్తు ఉంటుంది. ఏడో అంతస్తు నుంచి కిందికి వెళ్తుంటారు. ఎందుకంటే ఇంటి లోయలో పునాదులు ఉంటాయి. అందుకే, రోడ్డుకు సమాంతరంగా కట్టుకుంటూ వచ్చేసరికి అది ఐదు లేదా ఏడవ అంతస్తు అవుతుంటుంది. 

ఎలా చేరుకోవచ్చు? 
హైదరాబాద్‌ నుంచి డార్జిలింగ్‌కు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానంలో శంషాబాద్‌ నుంచి బాగ్‌డోగ్రా విమానాశ్రయం వరకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి డార్జిలింగ్‌ తేయాకు తోటలకు దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాగ్‌డోగ్రాలో డార్జిలింగ్‌ కొండలపైకి చేరుకునేందుకు ట్యాక్సీలు ఉంటాయి. ఒంటిరిగా వెళ్లేవారు, ఔత్సాహికుల కోసం బైకులు కూడా కిరాయికి లభిస్తాయి. ఘాట్‌రోడ్డు అందాలు చూసుకుంటూ నిట్టనిలువునా 80 కిలోమీటర్ల దూరం ఉన్న డార్జిలింగ్‌ చేరుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇస్తుంది. కాగా, నగరాల్లో బోటనీ, అగ్రికల్చర్, జువాలజీ, ఆయుర్వేదం, ఎంబీబీఎస్, వెటర్నరీ, సోషియాలజీ తదితర విద్యనభ్యసించే విద్యార్థులకు డార్జిలింగ్‌ ఓ అద్భుత అధ్యయన కేంద్రం. అలాంటి విద్యార్థులకు సబ్సిడీతో ఇక్కడికి వచ్చేలా చేస్తే వారికి క్షేత్రస్థాయి విజ్ఞానం పెరుగుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. హోం స్టే పర్యాటకంలో భాగం చేసేలా చూస్తామని పేర్కొన్నారు.  

అరుదైన వృక్ష, జంతు జాలాలు.. 
డార్జిలింగ్‌లో కాఫీ, టీ తోటలతో పాటు ఎన్నో వేల అరుదైన వృక్ష, జంతు జాలాలకు నిలయం. ఇక్కడ ఉండే వృక్షజాతులు ఇండియాలో మరెక్కడా కనబడవు. ఇక్కడి ప్రజలు తమ ఇళ్ల ముందు అందమైన పూలు పూసే గుల్మాలు, ఆర్కిడ్స్‌ను పెంచుకుంటారు. గోడలపై అరుదైన శైవలాలు, శిలీంధ్రాలు, పరాన్న జీవి మొక్కలు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు అధికంగా ఉంటాయి. వీటి రాకను తెలుసుకునేందుకు ప్రతి ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement