డార్జిలింగ్
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన డార్జిలింగ్ నుంచి ప్రతియేటా పిల్లలు భారీ సంఖ్యలో మాయమైపోతున్నారు! 'చైల్డ్ ఇన్ నీడ్ ఇన్స్టిట్యూట్ (సిని)' అనే సంస్థ విడుదల చేసిన నివేదికను బట్టి చూస్తే, ఇలా పిల్లలు మాయమైపోతున్న ప్రదేశాలలో డార్జిలింగ్ అగ్రస్థానంలో ఉంది. 2012 సంవత్సరంలో డార్జిలింగ్ జిల్లాలో 924 మంది పిల్లలు మాయమైతే, 2010లో 430 మందే అదృశ్యం అయ్యారు. పైపెచ్చు, తప్పిపోతున్న వారిలో సగానికి పైగా ఆడపిల్లలే ఉంటున్నారు.
డార్జిలింగ్ ప్రాంతం సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో ఇక్కడినుంచి నేపాల్ మీదుగా వేరే దేశాలకు పిల్లలను తరలించే అవకాశం ఎక్కువగా ఉందని సిని అదనపు డైరెక్టర్ రాజీవ్ కె. హల్దర్ తెలిపారు. ఇలా సరిహద్దులకు దగ్గరగా ఉన్న జిల్లాల్లోని మారుమూల గ్రామాల నుంచి పిల్లలను ఎత్తుకుపోయి విదేశాలకు అమ్మేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను ఇల ఎత్తుకుపోయి వారిని ఫ్యాక్టరీలు, పొలాలు లేదా ఇళ్లల్లో పనివారిగా చేరుస్తున్నారు. ఇక ఆడపిల్లలనైతే బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించడం, చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేయడం, లేదా వారిని భిక్షాటనలోకి దించడం లాంటివి చేస్తున్నారు.
దేశంలోనే ఇలా పిల్లలు మాయమైపోతున్న రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో ఉంది. నేపాల్, బంగ్లాదేశ్లతో ఈ రాష్ట్రానికి సరిహద్దు ఉండటం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మొత్తం ఎంతమంది పిల్లలు తప్పిపోయినా, గట్టిగా ఆ కేసుల్లో 4 శాతం ఫిర్యాదులు కూడా రావట్లేదు. పిల్లలు తప్పిపోతే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ దాఖలుచేసి, ఆ కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా పోలీసులు మాత్రం తమ తీరు మార్చుకోవట్లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 2012 సంవత్సరంలో ఏకంగా 19 వేల మంది పిల్లలు మాయమైపోయినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది!!