కొండచరియలు పడి 38 మంది మృతి
బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రకృతి బీభత్సం
20 మందికి గాయాలు, 15 మంది గల్లంతు; ప్రధాని సంతాపం
డార్జిలింగ్/సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో డార్జిలింగ్, కలింపాంగ్, కర్సెవోంగ్ సబ్ డివిజన్లలో 38 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడగా 15 మంది గల్లంతయ్యారు. ఒక్క మిరిక్ ప్రాంతంలోనే 21 మంది మృతిచెందగా, 13 మంది గల్లంతయ్యారు. కలింపాంగ్, లావా, సుఖియా బ్లాక్, గోరుబతన్‌లలో మరో 17 మంది చనిపోయారని రాష్ట్ర విపత్తు సహాయక శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇళ్లు దెబ్బతిని, బురదలో కూరుకుపోయాయి. 10వ, 55వ నంబరు జాతీయ రహదారులు దెబ్బతినడంతో సిలిగురి, మటిగరా, డార్జిలింగ్ తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. 55వ నంబర్ జాతీయ రహదారిపై నింబుజోరా వద్ద ఉన్న వంతెన కొట్టుకుపోయింది. సెవోక్, కాలిబరి తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు రోడ్లపై చిక్కుకుపోయారు.
సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) సహాయక చర్యలు చేపడుతోంది. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌ఓ) సిబ్బంది రోడ్లపై పడిన కొండచరియలను తొలగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్ఘటన ప్రాంతాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున, విపత్తులో నష్టపోయిన వారికి రూ. 1.25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలన మండలి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని, వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. పరిస్థితిని సమీక్షించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును రాష్ట్రానికి పంపారు.