
ఇది ఏ ఒక్కరి పరిస్థితో కాదు.. సుమారు 25 వేల మందికిపైగా ఉద్యోగస్తుల పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. 2016 టీచర్ల నియమాకాల రద్దు టాపిక్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఎంతో హాయిగా తమ జీవితాల్లోకి వెలుగొచ్చిందని అనుకుంటుండగానే వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. టీచర్లగా ఉద్యోగాలు చేస్తూ సంఘంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను కారు మబ్బు అలుముకుంది. తమ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీచర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇలా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీచర్ల కుటుంబాల్లో కన్నీటి వరదలే తారసపడుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు ఇవ్వడంపై ఆ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమాకాలు కలిపి 25 వేల 753 పోస్టులను చెల్లవంటూ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ఇంతేనా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకిలా జరిగింది.. మాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ మౌనంగా రోదిస్తున్నారు.
2016లో టీచర్ గా నియమించబడ్డ రజత్ హల్దార్ మాట్లాడుతూ.. ‘ మాకు మాటలు రావడం లేదు. మేము అర్హత సాధించిన టీచర్లం. మాకు ఎటువంటి ఆరోపణలు లేవు. సుమారు 19 వేల మంది టీచింగ్ స్టాఫ్ పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ మమ్మల్ని వారు అనర్హులు అంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో మాకు ఏమీ చెప్పుకోవాలో.. ఎవరి చెప్పుకోవాలో తెలయని స్థితిలో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగింది. ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. ఏ దర్యాప్తు సంస్థలు కూడా మా నియామకం చట్టబద్ధతలో జరగలేదని చెప్పలేదు. మేము ఎటువంటి తప్పు చేయలేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు.
కాగా, వెస్ట్ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.
మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం మమతా సర్కారు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.