Travel and tourism
-
ప్రపంచంలోని 10 ఉత్తమ హోటళ్లు (ఫోటోలు)
-
టీటీఎఫ్ హైదరాబాద్ 2022: ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్)హైదరాబాద్- 2022 రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 4 దేశాలు, 150 స్టాళ్లు, 19 రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిజం ప్రతినిధులు టూరిజం ప్రచారంలో భాగంగా టూరిజం స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యటకాభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారన్నారు. కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అలాగే భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం లభించేలా టూరిజంప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కరివేన, ఉద్ధండ పూర్ రిజర్వాయర్ల ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిని సీఎం నేతృత్వంలో చేస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద అర్బన్ ఎకో టూరిజం పార్క్, కేసీఆర్ ఎకో పార్క్, అతిపెద్ద జలపాతాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల గత రెం డేళ్లనుంచి పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టూరిజంలో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీటీఎఫ్ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పుణ్యక్షేత్రాలకు టూరిజం కళ..
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో పర్యాటకం మళ్లీ పుంజుకుంటోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వాటిని సందర్శించేందుకు ఆసక్తి కనపరుస్తున్న వారి సంఖ్య 35–40 శాతం మేర పెరిగింది. ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తమ పోర్టల్, యాప్‌లలో ప్రయాణికులు చేసే ఎంక్వైరీల నెలలవారీ ధోరణులను విశ్లేషించి ఇక్సిగో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆధ్యాత్మిక ప్రాంతాలకు పర్యటనలపై ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో కట్రా (83 శాతం), తిరుపతి (73 శాతం), హరిద్వార్ (36 శాతం), రిషికేష్ (38 శాతం శాతం) రామేశ్వరం (34 శాతం) ఆగ్రా (29 శాతం), ప్రయాగ్‌రాజ్ (22 శాతం) వారణాసి (14 శాతం) మొదలైనవి ఉన్నాయి. ఐఆర్సీటీసీ తాజాగా రామాయణ యాత్ర రైలు టూర్, బుద్ధిస్ట్ సర్క్యూట్ రైళ్లు, జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర, ఢిల్లీ–కాట్రా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదలైనవి నిర్వహిస్తుండటం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగేందుకు దోహదపడుతోంది. అయితే సంఖ్యాపరంగా మాత్రం ఎంత మంది వెడుతున్నారన్నది మాత్రం సర్వేలో వెల్లడి కాలేదు. బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి రావడం కూడా పర్యాటకుల్లో.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లలో ప్రయాణాలపై ధీమా పెరిగేందుకు దోహదపడుతున్నట్లు ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో అలోక్ బాజ్‌పాయ్ తెలిపారు. కన్ఫర్మ్‌టికెట్‌లోనూ అదే ధోరణి.. టికెట్ల సెర్చి ఇంజిన్ కన్ఫర్మ్టికెట్ నిర్వహించిన అధ్యయనంలో కూడా దాదాపు ఇలాంటి ధోరణులే వెల్లడయ్యాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే రైళ్ల కోసం తమ యాప్, వెబ్సైట్లలో ఎంక్వైరీలు 35–40 శాతం మేర పెరిగినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ కుమార్ కొత్తా తెలిపారు. రామేశ్వరం విషయంలో ఎంక్వైరీలు 47 శాతం పెరిగాయి. కట్రా (వైష్ణోదేవి)కి సంబంధించి 36 శాతం, ప్రయాగ్‌రాజ్.. వారణాసికి చెరి 8 శాతం, హరిద్వార్ (30 శాతం), రిషికేష్ (29 శాతం), తిరుపతి (7 శాతం) మేర ఎంక్వైరీలు పెరిగినట్లు దినేష్ వివరించారు. ఆధ్యాత్మిక అనుభూతి కోసమే కాకుండా యోగా, ఆయుర్వేద స్పాలు మొదలైన వాటితో ప్రశాంతత, పునరుత్తేజం పొందేందుకు కూడా పర్యాటకులు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. చదవండి: భారతీయులు వీటి కోసం ఖర్చుకు వెనకాడలేదు! -
ఆ అందాలు ఆస్వాదించాలంటే ఊటీ వెళ్లాల్సిందే!
చెవుల మీదకు వేళ్లాడే జడలు, హాఫ్‌వైట్ లుంగీ, ఎరుపు–నలుపు కలగలిసిన చక్కటి నేత ఓణీ. సంప్రదాయ చేనేత ఓణీలోని నేత సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ వస్త్రధారణ. సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ చేత్తో చిటికెలు వేస్తూ ఉత్సాహభరితంగా సాగే ఈ డాన్స్ పేరు టోడా ట్రైబల్ డాన్స్. టోడా ఆదివాసీల సంప్రదాయ నృత్యం. ఈ డాన్సుతోపాటు నీలగిరుల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఊటీబాట పట్టాల్సిందే. ఈ నృత్యం చేస్తున్న వాళ్లు టోడా ఆదివాసీ మహిళలు. ఆదిమ కాలం నుంచి నీలగిరుల్లో నివాసం ఉన్నది వీళ్లే. ఊటీ ట్రిప్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. టీ తోటల మధ్య మలుపులు తిరుగుతూ సాగే రోడ్డు ప్రయాణమే గొప్ప ఆనందం. ఇక్కడ పర్యటించేటప్పుడు కారు అద్దాలను దించుకుని, మాస్కు తీసిసి హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఊటీ టూర్లో ఎత్తైన పీక్ దొడబెట్ట, బొటానికల్ గార్డెన్, టీ గార్డెన్ల విహారం ఎప్పుడూ ఉండేవే. ఈ సారి వాటన్నింటితోపాటు టోడా ట్రైబల్ విలేజ్, రోజ్ గార్డెన్, కూనూర్తోపాటు దేశంలోని వివిధ నిర్మాణశైలులను ప్రతిబింబించే ప్యాలెస్‌ల మీద కూడా ఓ లుక్కేయండి. చాలా చూడాలి! నీలగిరులు ఊటీగా మార్పు చెందే క్రమంలో వెలసిన నిర్మాణాలివి. మైసూర్ మహారాజు నిర్మించుకున్న ఫెర్న్ హిల్ ప్యాలెస్ జోద్పూర్ మహారాజు ఆరన్మోర్ ప్యాలెస్ జామ్‌నగర్ నవాబు నవానగర్ ప్యాలెస్ ఇందోర్, పోర్బందర్, కొచ్చిన్, ట్రావెన్కోర్ రాజవంశీకులు నిర్మించుకున్న వేసవి విడిదులు, వెస్ట్రన్ స్టైల్ చర్చ్‌లు కూడా ఉన్నాయిక్కడ. బస: ఊటీలో మంచి హోటళ్లున్నాయి. ఉత్తరాది, దక్షిణాది, కాంటినెంటల్ రుచులు కూడా దొరుకుతాయి. ఈ టూర్లో ఊటీ స్పెషల్ టీ తాగడం మర్చిపోకూడదు. ఆవిరి బండి ప్రయాణం ఊటీ టూర్ అనగానే మొదటగా టాయ్‌ట్రైన్ గుర్తుకు వస్తుంది. ఆవిరితో నడిచే ఈ రైలు ప్రయాణాన్ని కూనూర్ వరకు కొనసాగించవచ్చు. మనకు ఎనభైల నాటి సినిమాల్లో ఊటీ లొకేషన్లుగా కనిపించే అనేక ప్రాంతాలు కూనూర్లోనివే. తెలుగు సినిమాలో కాదు. బాలీవుడ్ సినిమాలకు కూడా ఇది మంచి లొకేషనే. - వాకా మంజులారెడ్డి చదవండి: Bibi Ka Maqbara: ‘దక్కన్ తాజ్’ ఎవరు కట్టించారో తెలుసా?! -
Travel Tips: ప్రయాణానికి ముందు జాగ్రత్తలు మర్చిపోకండి!
కచ్ మహోత్సవ్‌కు వెళ్లాలనుకున్న వాళ్లు టెంట్ సిటీలో బస చేయాలనుకుంటే షెడ్యూల్ విడుదల అయిన వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంట్ సిటీ అంటే... ఈ వేడుకల కోసం చక్కటి వ్యూ ఉన్న ప్రదేశంలో టూరిజం డిపార్ట్మెంట్ గుడారాలతో సిద్ధం చేసిన నగరం. ఇందులో దాదాపుగా స్టార్ హోటల్ సౌకర్యాలన్నీ ఉంటాయి. ►పగలు సూర్యుడి కిరణాలు కళ్ల మీద పడి దృష్టిని చెదరగొడుతుంటాయి. కాబట్టి టూర్‌కి వెళ్లేటప్పుడు కూలింగ్ గ్లాసెస్తోపాటు పెద్ద హ్యాట్, గొడుగు దగ్గర ఉంచుకోవాలి. ►రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తక్కువ కాబట్టి ఉలెన్ జాకెట్లు తీసుకెళ్లాలి. దేశ సరిహద్దు కావడంతో ఇక్కడ సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. ►ఐడీ కార్డు దగ్గర ఉంచుకోవాలి. అలాగే గ్రూప్‌గా వెళ్లినవాళ్లు గ్రూప్ నుంచి విడివడి ఒంటరిగా మరీ దూరంగా వెళ్లకపోవడమే మంచిది. ►ఒకవేళ వెళ్లినట్లయితే ఐడీకార్డు చూపించి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. ►పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికుల సంప్రదాయాలను హేళన చేయరాదు, తేలిక చేసి మాట్లాడరాదు. ►ఇతరుల సంప్రదాయాలను గౌరవించడమే సంస్కారం అని మర్చిపోకూడదు. చదవండి: చిన్నవయసులో ఆర్ధరైటిస్.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి -
అక్కడ స్థలం కొంటే ఇల్లు కట్టాల్సిందే..
ఇంటి ముందు మొక్కలు నవ్వుతుంటాయి. ఇంటి మీద జాతీయ పతాకం ఎగురుతుంటుంది. దేశాధ్యక్షుడు తన కారు తానే నడుపుకుంటాడు. చట్టసభల ప్రతినిధులు రైల్లో ప్రయాణిస్తుంటారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అలాగే... పెచ్చుమీరని ప్రభుత్వ ఆంక్షలూ ఉన్నాయి. మహాత్మాగాంధీ, దలైలామా, క్వీన్ రెండవ ఎలిజబెత్లను ఒకే చోట చూసే అవకాశం వచ్చింది. వాళ్ల పక్కనే షారూక్ ఖాన్, కరీనా కపూర్లను కూడా. ఇదంతా ఆస్ట్రేలియాలో అతి పెద్ద నగరం సిడ్నీలో. వేదిక పేరు మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం. సిడ్నీలో మరో అద్భుతమైన ప్రదేశం డార్లింగ్ హార్బర్లోని సీలైఫ్ అక్వేరియం. సీ లైఫ్ అక్వేరియంలో గాజు ట్యూబ్‌లో మనం ఉంటాం. జలచరాలు సముద్రంలో ఉంటాయి. ఇందులో నడుస్తూ మన పక్క నుంచి, తల మీద నుంచి పరుగులు తీసే జలచరాలను చూడడం గమ్మత్తుగా ఉంటుంది. ఇక సోమర్స్బే వాటర్ ఫాల్స్, వాటమొల్లా బీచ్‌ల పర్యటనతోపాటు ఆస్ట్రేలియాలో ఉన్న పది నెలల కాలంలో మురుగన్ టెంపుల్, రామలింగేశ్వర ఆలయం, అయ్యప్ప, సాయిబాబా, ఇస్కాన్ ఆలయం, మహంకాళి ఆలయాలను కూడా చూశాను. ఇవన్నీ ఇచ్చిన సంతృప్తికంటే కమ్యూనిటీ గార్డెన్ డెవలప్మెంట్ కోసం పని చేయడం ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మొక్కలంటే ప్రాణం... సిడ్నీకి సమీపంలోని వెంట్ వర్త్ విల్లీలో మా అమ్మాయి దగ్గర పది నెలలున్నాం. అక్కడి ప్రజలు శ్రమజీవులు, కష్టపడి పని చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రోజూ విధిగా గార్డెనింగ్ కోసం రెండు గంటలు కేటాయిస్తారు. ప్రతి ఇంటి ముందు పూలచెట్లు, క్రీపర్లు అల్లుకుని ఉంటాయి. దేశభక్తి కూడా ఎక్కువ. ఇంటి మీద వాళ్ల జాతీయ పతాకం ఉంటుంది. ప్రకృతిని ప్రేమిస్తారు. సహజ వనరులను మితంగా ఖర్చు చేస్తారు. మినరల్స్, భూగర్భ జలాలను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించాలనే ఆశయం వారిది. నీటి కోసం బోర్ వేయరు, చెరువులు, నదుల నీటినే వాడతారు. స్థలం కొంటే ఇల్లు కట్టాల్సిందే... మనుషులు అత్యాశకు పోనివ్వకుండా నిజాయితీగా జీవించడానికి ఆస్ట్రేలియా నిబంధనలు కూడా కారణమే. అక్కడ ఎవరైనా ఇళ్ల స్థలం కొన్నారంటే తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో స్థలం కొని తరాల పాటు ఉంచుకోవడాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు. దాంతో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటేనే స్థలం కొంటారు. భూమి అందుబాటు ధరలో ఉంటుంది. కమ్యూనిటీ గార్డెన్.. కాలనీల్లో కమ్యూనిటీ గార్డెన్ పెంపకం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. మడులు లీజ్కిస్తారు. ఒక్కొక్క మడికి ఏడాదికి ముప్పై డాలర్లు చెల్లించాలి. కూరగాయల మొక్కల విత్తనాలు, ఎరువులు, మందులు ఇస్తారు. ఆ పండించిన కూరగాయలు నేలను లీజుకు తీసుకున్న వాళ్లకే చెందుతాయి. విజిటింగ్ వీసా మీద వెళ్లిన వాళ్లు గార్డెనింగ్ సోషల్ సర్వీస్ చేయవచ్చు. అలా పది నెలల పాటు గార్డెన్ పని చేశాం. నా సర్వీస్‌కు మెచ్చి వెంట్ వర్త్ విల్లే చీఫ్ మిసెస్ రాబిన్ ప్రశంసా పత్రం ఇచ్చారు. లైబ్రరీలో తెలుగు పుస్తకాలు... వెంట్వర్త్ విల్లీలో ఉన్న కమ్యూనిటీ లైబ్రరీని చూశాం. అందులో ఇరవై మూడు భాషల పుస్తకాలున్నాయి. భారతీయ భాషల్లో పంజాబీ, మరాఠి, హిందీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పుస్తకాలున్నాయి. తెలుగు పుస్తకాలు కనిపించకపోవడంతో బాధనిపించింది. అక్కడ విచారిస్తే లైబ్రరీ సభ్యత్వం ఉన్న వాళ్లు రిక్వెస్ట్ చేస్తే పరిగణనలోకి తీసుకుంటారని తెలిసింది. అక్కడ పర్మినెంట్ వీసాలోనూ, సిటిజన్షిప్తోనూ నివసిస్తున్న యాభై మంది తెలుగు వాళ్ల చేత సంతకాలు చేయించి, మా అల్లుడి చేత రిక్వెస్ట్ లెటర్ పెట్టించగలిగాం. ఆ ప్రయత్నంతో లైబ్రరీలో తెలుగు పుస్తకాలు కూడా వచ్చాయి. అక్కడ ఉన్న పది నెలల కాలంలో సాధించిన విజయాలివి. ఆస్ట్రేలియా ట్రిప్ ప్రభావం మా మీద హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ప్రతినిధులు లోకల్ ట్రైన్లో ఆస్ట్రేలియాలో రైళ్లలో ఒక్కోసారి రైలు మొత్తానికి ముగ్గురు ప్రయాణిస్తున్న దృశ్యాన్ని కూడా చూశాం. బస్సులు కూడా అంతే. సామాన్యులకు సర్వీస్‌లన్నింటినీ అందుబాటులో ఉంచాలనేది అక్కడి ప్రభుత్వ నియమం. చట్టసభల ప్రతినిధులు కూడా లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. ఎటువంటి హడావుడి లేకుండా ప్రెసిడెంట్ తన కారును తాను నడుపుకుని పోవడం అక్కడ సర్వసాధారణం. గన్ కల్చర్ లేకపోవడంతో ఎటువంటి భయమూ ఉండదు. ఇక్కడ జీవన వ్యయం చాలా ఎక్కువ. ఎకానమీ సమానంగా పంపిణీ జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా సంపాదనలో తేడా ఉండదు. అందుకే ఎవరికీ ఎవరి మీద ఆసూయ పెరగదు. నిస్వార్థంగా, నిజాయితీగా ఉంటారు. తరతరాల కోసం కూడబెట్టాలనే ఆలోచన ఉండదు. ఇక్కడ భవిష్యత్తు కోసం కూడ బెట్టేది వ్యక్తిగత ఆస్థులను కాదు. ప్రకృతి వనరులను నిల్వ చేస్తారు. ఈ ఆలోచన గొప్పగా అనిపించింది. మనుషులు నిస్వార్థంగా జీవించడానికి ఇవన్నీ కారణాలే. సౌకర్యాల కల్పనలో ఎంత ఉదారంగా ఉంటుందో, నిబంధనలను ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం అంతే కచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మితిమీరిన స్వేచ్ఛకు దారి తీయడం లేదు. అక్షరాలా అమలవుతోందనిపిస్తుంది. – చైతన్యమాధవుని అశోక్ రాజు, వీణారాణి -
మనకు మనమే ఓ ఉత్తరం రాసుకుందాం!
పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఉత్తరం పోస్టు చేసి ఎన్నాళ్లైంది? అసలు ఉత్తరం రాసి ఎన్నేళ్లయింది? ఓ సారి ఉత్తరం రాసి మన వాళ్లను సర్ప్రైజ్ చేస్తే? ఇవన్నీ మనవాళ్ల సంతోషం కోసం చేసే పనులు. మన సంతోషం కోసం కూడా ఓ పని చేద్దాం. మనకు మనమే ఉత్తరం రాసి పోస్ట్ చేసుకుందాం. ఎక్కడ నుంచి ఎక్కడికి పోస్ట్ చేయాలి? హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్‌కెళ్లి అక్కడ ఓ ఉత్తరం రాసి మన ఇంటికి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఉత్తరం రాసే ముందు ఒకటి తెలుసుకోవాలి! ఇంతకీ... ఈ హిక్కిమ్ ఎక్కడుంది? హిక్కిమ్ ఈ పదం సిక్కిమ్లాగ ధ్వనిస్తోంది. కానీ ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, లాహుల్ స్పితి జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే ఎల్తైన పోస్ట్ ఆఫీస్. ఎల్తైన అంటే కట్టడపు ఎత్తు కాదు. అత్యంత ఎల్తైన ప్రదేశంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అన్నమాట. ఎంత ఎత్తంటే... 17, 060 అడుగుల ఎత్తులో ఉంది. పిన్‌కోడ్ 172114. ఇక్కడి నుంచి టపా రోజూ కాలి నడకన రికాంగ్ పియో వరకు తీసుకువెళ్లి అక్కడ నుంచి బస్‌లో రవాణా చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిమ్లా చేరి అక్కడ రైలెక్కి కల్కాలో దిగి మళ్లీ బస్సెక్కి ఢిల్లీ చేరుతుంది ఉత్తరం. అంత కష్టం మీద ఢిల్లీ చేరుతుంది. ఆ తర్వాత సులువుగా రెక్కలు విప్పుకుని గమ్యంలో వాలుతుంది. ఉత్తరం రాయడానికి అంతదూరాన ఉన్న హిక్కిమ్కి వెళ్లాలా? నిజమే. ఈ ఉత్తరం రాయడంతోపాటు అందమైన స్పితి లోయ సౌందర్యాన్ని, బౌద్ధ భిక్షువుల జీవనశైలిని దగ్గరగా చూడాలంటే వెళ్లి తీరాల్సిందే. ఆరు నెలలే... స్నోఫాల్ ఎక్కువగా ఉండే శీతాకాలం మాత్రం పోస్టాఫీస్‌ను మూసేస్తారు. పోస్టాఫీస్‌ను మాత్రమే కాదు, రోడ్డు రవాణా రాకపోకలు కూడా నిలిచిపోతాయి. మిగిలిన ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఎండాకాలం మొదలైన తర్వాత యథాతథంగా జన జీవన స్రవంతితో అనుసంధానమవుతుంది. ఆరు నెలల కాలంలో దాదాపు ఐదు వందలకు పైగా ఉత్తరాలు బట్వాడా అవుతాయంటే గొప్ప విషయమే. మారుమూల గ్రామాలకు కూడా మొబైల్ ఫోన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత మామూలు పోస్టాఫీసుల్లో కూడా ఈ మాత్రపు బట్వాడా ఉండడం లేదు. ఇక్కడ మరో సంగతి ఏమిటంటే... ఈ హిక్కిమ్ గ్రామంతోపాటు పరిసర గ్రామాలకు కూడా బ్యాంకు లేకపోవడంతో సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలు కూడా ఈ పోస్టాఫీస్ ద్వారానే జరుగుతున్నాయి. శీతాజలం... నిజానికి హిమాచల్ ప్రదేశ్ పర్యటన అనగానే సిమ్లా తొలిస్థానంలో ఉండేది. అది ఒకప్పుడు. సిమ్లా క్రేజ్ తగ్గిపోయిన తర్వాత కులు, మనాలి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆహ్లాదకరమైన పర్యటన కోరుకునే మధ్య వయసు వాళ్లకు అది చక్కటి వెకేషన్ పాయింట్. అడ్వెంచర్ లేని టూర్ మహాబోర్ అనుకునే యువతకు స్పితి లోయ ఒక సాహసాల లోగిలి. స్పితి లోయకు వెళ్లడానికి కులు లోయ నుంచి దారి ఉంటుంది. స్పితిలోయకు వెళ్లే దారిలో రొహటాంగ్ పాస్ దాటిన తర్వాత ఒక పక్కగా కుంజుమ్ కనుమ కనిపిస్తుంది. శీతాకాలంలో మంచు కప్పి ఉంటుంది. ఎండలు మొదలయ్యేసరికి ఆ మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. ఈ ప్రవాహం చేరే పల్లపు ప్రదేశమే స్పితి లోయ. స్పితి అంటే మధ్యనున్న నేల అని అర్థం. టిబెట్ పొలిమేర ఇది. బౌద్దానికి అచ్చి వచ్చిన నేల. హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్ ఈ స్పితి జిల్లాలోనే ఉంది. స్పితికి హిక్కిమ్కు మధ్య దూరం పద్దెనిమిది కిలోమీటర్లు. ఈ పర్యటనలో బౌద్ధ భిక్షువులు కనిపిస్తారు. తెల్లటి మంచు మధ్య కొండవాలులో ఎర్రటి దుస్తులు ధరించి మౌనంగా వెళ్తుంటారు. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం! హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రదేశాలకు టూర్ వెళ్లేటప్పుడు మరికొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పితి వ్యాలీ టూర్‌కి అనుమతి తప్పనిసరి. ఇది ఇండో–చైనా సరిహద్దు కావడంతో ఈ జాగ్రత్తలన్నీ. సిమ్లా, మనాలి, కులూ, రాంపూర్, కాజా, రేకాంగ్ పీయో వంటి చోట్ల ప్రభుత్వ అధికారులు ఈ అనుమతి జారీ చేస్తారు. ఇందుకోసం పాస్‌పోర్టు ఒరిజినల్‌తోపాటు ఒక ఫొటోకాపీ, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని వెళ్లాలి. టూర్ ప్లాన్ వివరాలు (ఎన్ని రోజుల పర్యటన, పర్యటనలో ఏయే ప్రదేశాలున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు వంటివి) తెలియచేయాలి. టిక్కెట్లు, బస కోసం బుక్ చేసుకున్న హోటల్ వివరాలు చూపించాలి. వీటిని పరిశీలించిన తరవాత అనుమతి పత్రం మీద స్టాంప్ వేసి ఇస్తారు. ఇది రెండు వారాలకు మాత్రమే. ఒకవేళ టూర్ మరికొన్ని రోజులు పొడిగించాల్సిన అవసరం ఏర్పడితే కారణాలను తెలియచేస్తూ మరో అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: ‘సీఎం సాబ్... నాకు పెళ్లి కూతుర్ని చూడండి’ -
పాతికవేలతో హరిద్వార్‌కు స్పెషల్ టూర్!
ఐఆర్సీటీసీ ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్ కుంభ్ స్పెషల్ టూర్ నిర్వహిస్తోంది. ఆరు రోజుల పర్యటనలో ఢిల్లీ, హరిద్వార్, ముస్సోరీ, రిషికేశ్‌లు ఉంటాయి. ఈ ప్యాకేజ్‌లో ఒకరికి 31, 200 రూపాయలవుతుంది. డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 24,100 రూపాయలవుతుంది. హైదరాబాద్ – ఢిల్లీ రానుపోను విమాన చార్జీలు కూడా ప్యాకేజ్‌లోనే. ఏప్రిల్ రెండవ తేదీ ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కాలి. పర్యటన పూర్తయిన తర్వాత ఏడవ తేదీ రాత్రి పదకొండుకు హైదరాబాద్‌లో దిగడంతో పర్యటన పూర్తవుతుంది. ఆరు రోజుల్లో ► మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి ఎనిమిదిన్నరకు ఢిల్లీలో విమానం దిగిన తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం. మధ్యాహ్న భోజనం తర్వాత లోటస్ టెంపుల్, కుతుబ్‌మినార్, సాయంత్రం అక్షర్ధామ్దర్శనం. ► రెండవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత గది చెక్ అవుట్ చేయాలి. రోడ్డు మార్గాన ముస్సోరికి ప్రయాణం. ముస్సోరి చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్, మాల్ రోడ్డులో ఒక రౌండ్ తిరగడం. మాల్ రోడ్డు మొత్తం నడిస్తే ముస్సోరి జనజీవనాన్ని చదివినట్లే. ► మూడవరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ముస్సోరిలోని పర్యాటక ప్రదేశాలను చూపిస్తారు. ఆ రాత్రి బస కూడా ముస్సోరిలోనే. ► నాలుగవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రూమ్ చెక్ అవుట్ చేసి దారిలో డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మందిర్, రిషికేశ్‌లను చూసుకుంటూ హరిద్వార్ చేరుతుంది ట్రిప్. రాత్రి బస అక్కడే. ► ఐదవ రోజు హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ దర్శనం, హర్ కీ పౌరిలో గంగాతీర విహారం, గంగా హారతి తర్వాత రాత్రి గదికి చేరడం, ఆ రోజు బస కూడా హరిద్వార్‌లోనే. ► ఆరవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి ప్రయాణం ఢిల్లీకి సాగిపోతుంది. రాత్రి ఏడు గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దించడంతో ప్యాకేజ్ నిర్వహకుల బాధ్యత పూర్తవుతుంది. ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇండిగో విమానం ఎక్కి పదకొండు గంటలకు హైదరాబాద్‌లో దిగడంతో టూర్ పూర్తవుతుంది. ప్యాకేజ్‌లో ఇవన్నీ ఉంటాయి! ► విమానం టిక్కెట్లు, ఐదు రాత్రులు బస సౌకర్యం (ఢిల్లీ 1, ముస్సోరి 2, హరిద్వార్ 2), ఐదు రోజులు బ్రేక్‌ఫాస్ట్, రాత్రి భోజనం. ► సైట్ సీయింగ్ కోసం ఏసీ మినీ బస్ ఉంటుంది. పర్యాటకుల సౌకర్యం కోసం ఒక ఎస్కార్ట్ సర్వీస్, టూరిస్ట్‌లకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఇవేవీ ప్యాకేజ్‌లో ఉండవు! పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకి పికప్, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి డ్రాప్, మధ్యాహ్న భోజనాలు, విమానంలో ఆహారం–పానీయాలు ప్యాకేజ్‌లో ఉండవు. దుస్తులు ఉతికించుకోవడం, వాటర్ బాటిల్స్, మద్యం, ఇతర పానీయాలు ఇందులో వర్తించవు. బస కోసం కేటాయించే హోటళ్లు ఢిల్లీలో హోటల్ సదరన్, ముస్సోరిలో హోటల్ ప్రైడ్, హరిద్వార్‌లో హోటల్ రీజెంటా ఆర్కోస్. -
రారండోయ్.. డార్జిలింగ్ పిలుస్తోంది!
సాక్షి ప్రతినిధి, డార్జిలింగ్ : డార్జిలింగ్.. పశ్చిమబెంగాల్లో సముద్రమట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం. హిమాలయ పర్వత పాదాల్లో ఉండే ఈ ప్రాంతం.. బ్రిటీష్ కాలం నుంచే కాఫీ, టీ, పర్యాటకానికి, విడిదికి ప్రసిద్ధి. ఊటీ, కొడైకెనాల్, కర్ణాటక పశ్చిమ కనుమలు, సిమ్లా, కశ్మీర్‌కు.. ఇక్కడి భౌగోళిక వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాలు ఏటవాలుగా ఉంటే.. ఇది మాత్రం నిట్టనిలువుగా ఉంటుంది. నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్‌లకు మధ్యలో ఉంటుంది. భారతదేశ చికెన్ నెక్‌ను కలిపే సిలిగురి, డార్జిలింగ్ చాలా దగ్గరగా ఉంటాయి. వేసవిలో రాత్రిపూట కనిష్టంగా 6 డిగ్రీలు.. పగలు గరిష్టంగా 28 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటే ఈ ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ వారు ఏనాడో గుర్తించారు ఈ ప్రాంతానికి 1814 దశకంలోనే బ్రిటీష్ వారు చేరుకున్నారు. తర్వాత గుర్ఖా రాజును ఓడించి ఈస్టిండియా కంపెనీ తమ వలస ప్రాంతంగా మార్చుకుంది. ఈ ప్రాంతం బ్లాక్ ఫర్మెంటెడ్ టీకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అస్సాం టీ లాంటి అరుదైన రకాలకు డార్జిలింగ్ చిరునామా. ఈ రకాలకు యురోప్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. ఇక్కడ తేయాకు తోటల పెంపకాన్ని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున చేపట్టారు. స్థానికంగా ఉండే గుర్ఖా, షేర్పా ప్రజలు, మరికొందరు తెగల ప్రజలను కూలీలుగా నియమించుకుని విస్తారంగా సాగు చేసేవారు. దాదాపు 200 ఏళ్లుగా తేయాకు తోటల వ్యాపారం నిరి్వరామంగా కొనసాగుతోంది. రోడ్డు రైలు మార్గాలు అద్భుతం.. సాగుచేసిన తేయాకు తరలింపు ప్రారంభంలో కష్టమయ్యేది. దీంతో రైలు, రోడ్డు మార్గాలను నిర్మించారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ అని పిలుస్తారు. ఇది ఇండియన్ రైల్వేలో అంతర్భాగం. కానీ నేటికీ ఇది మీటర్ గేజ్‌గా ఉండటంతో దీన్ని టాయ్ ట్రైన్ అని ముద్దుగా పిలుస్తారు. మైదాన ప్రాంతమైన న్యూ జపాలాయ్, సిలిగురి నుంచి శిఖరపు అంచున్న ఉన్న డార్జిలింగ్ వరకు 79 కి.మీ. దూరం ఈ రైల్వే ఇప్పటికీ పనిచేస్తూ పర్యాటకులను అలరిస్తోంది. ఇందులో ‘గుమ్’రైల్వే స్టేషన్ 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ కావడం గమనార్హం. యునెస్కో దీన్ని గుర్తించింది. ఇండియాలో బొగ్గుతో నడిచే ఏకైక రైలు ఇదే. పాములా మెలికలు తిరిగిన రోడ్డు అంచు నుంచి వేల మీటర్ల లోతులో ఉండే లోయలను చూస్తే కలిగే ఆ ఆనందమే వేరు. ఇంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నా.. ఏ వాహనం కూడా పట్టు తప్పకుండా రోడ్డు నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్ విలువలు, టైర్లు జారిపోకుండా ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలు చూసి ఆశ్చర్యపోతాం. ప్రతి మూల మలుపు వద్ద వాహనాలు ప్రమాదవశాత్తూ జారిపోయినా లోయలోకి పడిపోకుండా.. 50 మీటర్ల వరకు ఏపుగా పెరిగే దృఢమైన దేవదారు వృక్షాలు పెంచారు. నేషనల్ హైవే 55గా ఈ రోడ్డు మార్గాన్ని పిలుస్తారు. సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రాంతం నేపాల్‌కు చాలా సమీపంలో ఉంటుంది. పర్వతం అంచుకు వెళ్తే నేపాల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ దాదాపు గుర్ఖాలే ఉంటారు. వీరి మాతృభాష నేపాలీనే. మెజారిటీ హిందువులు, తర్వాతి స్థానంలో బౌద్ధులు ఉంటారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో 99 శాతం వ్యాపారులే. హోటల్, వాహనాలు, రిటైల్, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. మైదాన ప్రాంతం నుంచి నీరు, కూరగాయలు, సరుకులు, గ్యాస్ ప్రతిరోజూ పర్వతంపైకి రవాణా చేస్తారు. అందుకే ఇక్కడ ధరలు కాస్త అధికంగానే ఉంటాయి. గణపతి, శివుడి ఆలయాలు అధికం. బౌద్ధ దేవాలయాలు, అక్కడక్కడా బ్రిటీష్ వారి కాలంలో నిర్మించిన చర్చీలు కన్పిస్తుంటాయి. ఇక్కడ ఉండే ప్రధాన వర్గం నేపాలీ గుర్ఖాలు, షెర్పాలు తదితర వర్గాలు ఉంటాయి. భారత సైన్యంలో వీరికి ప్రత్యేక రెజిమెంట్లు ఉంటాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో వీరిదే కీలక పాత్ర. ఒక సందర్భంలో బోస్‌ను కాపాడేందుకు బ్రిటీష్ యుద్ధ ట్యాంకులను పేల్చేందుకు వీరే మానవబాంబులుగా మారారు. అందానికి అధిక ప్రాధాన్యం! ఈ ప్రజలు సాధారణ ఎత్తు ఐదున్నర అడుగల ఎత్తు. గుండ్రటి ముఖాలు. విశాలమైన నుదురుతో తెల్లగా, అందంగా ఉంటారు. అందానికి ప్రాధాన్యం ఇస్తారు. వీరు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుంటారు. మహిళలు జుట్టుకు, ముఖానికి, పెదాలకు రంగు లేకుండా కనిపించరు. ఈ విషయంలో మగవారూ తక్కువేమీ కాదు. అన్నీ లేటెస్ట్‌వే వాడతారు. తమ ఇంటికి ఇంధ్రధనస్సు రంగులతో తోరణాలు ఉంటా యి. వీరి ఇళ్లపైనా రంగురంగుల జెండాలు ఎగురుతుంటాయి. డార్జిలింగ్‌లో రోడ్డుకు సమాంతరంగా ఐదు లేదా ఏడో అంతస్తు ఉంటుంది. ఏడో అంతస్తు నుంచి కిందికి వెళ్తుంటారు. ఎందుకంటే ఇంటి లోయలో పునాదులు ఉంటాయి. అందుకే, రోడ్డుకు సమాంతరంగా కట్టుకుంటూ వచ్చేసరికి అది ఐదు లేదా ఏడవ అంతస్తు అవుతుంటుంది. ఎలా చేరుకోవచ్చు? హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌కు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానంలో శంషాబాద్ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయం వరకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి డార్జిలింగ్ తేయాకు తోటలకు దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాగ్డోగ్రాలో డార్జిలింగ్ కొండలపైకి చేరుకునేందుకు ట్యాక్సీలు ఉంటాయి. ఒంటిరిగా వెళ్లేవారు, ఔత్సాహికుల కోసం బైకులు కూడా కిరాయికి లభిస్తాయి. ఘాట్‌రోడ్డు అందాలు చూసుకుంటూ నిట్టనిలువునా 80 కిలోమీటర్ల దూరం ఉన్న డార్జిలింగ్ చేరుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇస్తుంది. కాగా, నగరాల్లో బోటనీ, అగ్రికల్చర్, జువాలజీ, ఆయుర్వేదం, ఎంబీబీఎస్, వెటర్నరీ, సోషియాలజీ తదితర విద్యనభ్యసించే విద్యార్థులకు డార్జిలింగ్ ఓ అద్భుత అధ్యయన కేంద్రం. అలాంటి విద్యార్థులకు సబ్సిడీతో ఇక్కడికి వచ్చేలా చేస్తే వారికి క్షేత్రస్థాయి విజ్ఞానం పెరుగుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. హోం స్టే పర్యాటకంలో భాగం చేసేలా చూస్తామని పేర్కొన్నారు. అరుదైన వృక్ష, జంతు జాలాలు.. డార్జిలింగ్‌లో కాఫీ, టీ తోటలతో పాటు ఎన్నో వేల అరుదైన వృక్ష, జంతు జాలాలకు నిలయం. ఇక్కడ ఉండే వృక్షజాతులు ఇండియాలో మరెక్కడా కనబడవు. ఇక్కడి ప్రజలు తమ ఇళ్ల ముందు అందమైన పూలు పూసే గుల్మాలు, ఆర్కిడ్స్‌ను పెంచుకుంటారు. గోడలపై అరుదైన శైవలాలు, శిలీంధ్రాలు, పరాన్న జీవి మొక్కలు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు అధికంగా ఉంటాయి. వీటి రాకను తెలుసుకునేందుకు ప్రతి ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటారు. -
దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం..
ఇసుక దిబ్బలు.. ఉప్పు ఊట ప్రకృతి నిర్దేశించిన ప్రాంతం.. అదే ఉప్పు ఊట తీరంలో.. అవే ఇసుక దిబ్బల మీద ఆకాశ హార్మ్యాలు, నోరెళ్లబెట్టే ఆశ్చర్యాలతో ఆ ప్రాంతం మానవ మేధస్సు మలచిన పర్యాటక దేశం అయింది! అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలో రాసుంటుంది ‘ది వర్డ్ ఇంపాజిబుల్ ఈజ్ నో వేర్ ఇన్ ది వొకాబులరీ ఆఫ్ ది యూఏఈ’ అని. గాడ్ మేడ్ వరల్డ్ .. మ్యాన్ మేడ్ డెన్మార్క్ అనే నానుడి వచ్చింది కాని దుబాయ్‌ను చూస్తే డెన్మార్క్ సరసన దుబాయ్నీ కలుపుకోవచ్చు. కళ్లు మూసి తెరిచేలోగా అభివృద్ధి అనే మాటకు ప్రాక్టికల్ రూపంగా చూడొచ్చు దుబాయ్‌ని. సాంకేతికత పునాదిగా.. లేబర్ క్యాంపుల స్వేదం గోడలుగా నిలబడ్డ అద్భుతం. అది అరబిక్ కడలందం.. చూసి.. అనుభూతిని పదిలపరచుకోవాల్సిందే. అభివృద్ధి సరే.. షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ లేని ఒరిజినల్ దుబాయ్ ఎలా ఉంటుందో.. చూడాలన్న ఆశతో విమానం ఎక్కాను. దుబాయ్ చూడ్డానికి చలికాలం మంచి కాలం. టూరిస్ట్ సీజన్ కూడా. అన్నిరకాల సందళ్లతో దుబాయ్ ఫెస్టివల్‌గా అలరారుతుంది. అలా ఈ కరోనా టైమ్‌లో కూడా టూరిస్ట్‌లకు విమాన టికెట్లను కట్ చేసి గేట్లు తెరిచింది ఆ దేశం. అయితే కరోనా నిరోధక జాగ్రత్తలతో. ఇండియా నుంచి బయలుదేరే 72 గంటల ముందు కరోనా పరీక్ష చేసుకున్నా సరే.. దుబాయ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే మళ్లీ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే. విహారంలోనూ అడుగడుగునా ఆ జాగ్రత్తలు పాటించాల్సిందే. మాస్క్ లేకపోయినా.. భౌతిక దూరం పాటించకపోయినా మూడువేల దిర్హామ్స్ జరిమానా కట్టాల్సిందే. రోడ్ల మీద రెండు మీటర్లకో సర్కిల్ కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి పదీ ముప్పై అయిదు నిమిషాలకు బయలుదేరి దుబాయ్‌లో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీ కోవిడ్ టెస్ట్, పెయిడ్ కోవిడ్ రెండింటి సౌకర్యమూ ఉంది. పెయిడ్ టెస్ట్ చేయించుకొని గంటలో బయటపడ్డాం. కాని ఫలితాలు వెలువడే దాకా హోటల్ గది దాటే వీల్లేదు. ఎకానమీ బడ్జెట్లో ఫైవ్ స్టార్ సేవలందిస్తున్న రోవ్ హోటల్లో మా బస. పన్నెండు గంటల్లోపు అంటే తెల్లవారి ఉదయం మూడు గంటలకు నెగటివ్ అని, హ్యాపీగా దుబాయ్‌ని చుట్టిరావచ్చనే రిపోర్ట్ అందింది. మొత్తం నాలుగు రోజుల టూర్ అది. దుబాయ్ ఆత్మ దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ అనగానే బుర్జ్ ఖలీఫానే గుర్తు చేస్తుంది మెదడు. దుబాయ్ ఫ్రేమ్‌ని చూసేంత వరకు నేనూ బుర్జ్ ఖలీఫానే దుబాయ్ ఐడెంటిటీగా భావించాను. కాని ఫ్రేమ్‌ని చూశాక.. బుర్జ్ ఖలీఫా కేవలం టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే అనిపించింది. ఎందుకంటే దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ ఆత్మ. ఆ నిర్మాణం అచ్చెరువొందే అద్భుతమే. దీర్ఘచతురస్రాకారంలో నిలువుగా ఉంటుందీ కట్టడం. 93 మీటర్ల వెడల్పు, 152 మీటర్ల పొడవున్న (అంటే ఇంచుమించు 50 అంతస్తుల ఎత్తు అన్నమాట) రెండు టవర్లను ఆ ఎత్తులోనే కలుపుతూ వంద చదరపు మీటర్ల వంతెనతో నిర్మాణమైన దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ చరిత్ర, వర్తమానం, భవిష్యత్‌కు ప్రతీక. ఆ ఫ్రేమ్ గడప భాగంలో దుబాయ్ గతాన్ని చూపే గ్యాలరీ ఉంటుంది. వాళ్ల జీవన శైలి, ఉపాధి, వర్తక వాణిజ్యాలు, వాడిన పనిముట్లు, పాత్రలు, దుస్తులు, ఆయుధాలు వంటివన్నీ అందులో చూడొచ్చు.. డిజిటల్ డిస్ప్లేలో. దీన్ని సందర్శించాక లిఫ్ట్‌లో స్కై డెక్ తీసుకెళ్లారు. మొత్తం దుబాయ్‌ని చూపించే అంతస్తు. రెండు టవర్లను కలిపే వంతెనే ఆ స్కై డెక్. ఆ వంతెన పై నుంచి ఉత్తరం దిక్కు చూస్తే పాత దుబాయ్ అంతా దర్శనమిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయిల్ నిక్షేపాలను కనుగొనకముందున్న దుబాయ్.. సముద్రంలో ముత్యాలు, చేపల వేట వృత్తులుగా ఉన్న ప్రాంతం, దుకాణాలు, పరిశ్రమలు, ఇళ్లు, ఓ మోస్తరు మిద్దెలు, మేడలు, క్రీక్.. కనిపిస్తాయి.. 360 డిగ్రీల కోణంలో. దక్షిణం వైపు.. అదే 360 డిగ్రీల కోణంలో నవీన దుబాయ్ గ్లామర్, నిలువెత్తు ప్రగతి, ఠీవి కళ్లకు కడుతుంది. మధ్యలో గ్లాస్ వాక్‌వే ఉంటుంది. అంటే నడిచేదారి.. కిందికి చూస్తే పాత, కొత్త దుబాయ్ అంతా 360 డిగ్రీల కోణంలో మనల్ని వెంబడిస్తుంది. ఈ స్కై డెక్‌లో వర్తమాన దుబాయ్ పూర్వాపరాలన్నీ ఉంటాయి. ఇందులో దుబాయ్‌లో తొలిసారి ల్యాండ్ అయిన విమానం ‘ఎయిర్ ఇండియా’ అనీ, 1959 వరకు మన కరెన్సీ అక్కడ చలామణీలో ఉందన్న విషయాలూ తెలిశాయక్కడ. లిఫ్ట్‌లో కిందికి వెళ్లాక దుబాయ్ ఫ్యూచర్ గ్యాలరీ ఉంటుంది. వైద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక రంగాల్లో అది సాధించబోయే అధునాతన అభివృద్ధికి సంబంధించిన నమూనాను చూపించే గ్యాలరీ అది. అక్కడే గాజు గోడలకు ఆనుకొని దుబాయ్ ఫ్రేమ్ నిర్మాణాన్ని వివరించే సమాచారమూ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అమెరికాలోని స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా హైట్, సెయింట్ లూయిస్‌లోని గేట్ వే ఆర్చ్ కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌కి దాదాపు సగం ఉంటుంది. 2018 నుంచి సందర్శనకు సిద్ధమైంది. ప్రతి రోజు 200 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుంది అదీ 20 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా. టికెట్స్‌ను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. సాయంకాలం.. జుమేరా బీచ్ జుమేరా.. దుబాయ్‌లోని ధనిక వర్గం ఉండే తీర ప్రాంతం. చక్కటి విహార స్థలం. చిల్ ఈవినింగ్స్‌ను గడపాలనుకునే యూత్ మెచ్చే హ్యాంగవుట్ ప్లేస్. ఇండియన్, చైనీస్, థాయ్, జపనీస్, ఇటాలియన్, మెక్సికన్.. ఎన్నని చెప్తాం.. ప్రపంచంలోని అన్ని రుచులతో క్యుజైన్స్ ఘుమఘుమలాడుతుంటాయి. భారతీయ వంటకాలకు సంబంధించి ఇక్కడ బాంబే బంగ్లా ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్ సెటప్ కూడా భారతీయ కోటను పోలి ఉంటుంది. ప్రతిరోజు ఆకాశంలో డ్రోన్స్ షో ఉంటుంది. షాపింగ్ ప్రియులకు ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ ఉంటాయి. విందువినోదాలతో జుమేరా బీచ్‌లో సాయంకాలాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు. దుబాయ్ సూక్... ఎప్పుడెప్పుడు చూడాలా అని నేను ఆత్రుత పడ్డ ప్రాంతం.. ఒరిజినల్ దుబాయ్.. దుబాయ్ సూక్, బర్ దుబాయ్‌ను చూసే వేళ రానే వచ్చింది.. రెండో రోజున. సూక్ అంటే అరబ్బీలో అంగడి అని అర్థం. దుబాయ్‌లోని దిగువ, మధ్యతరగతికి అనువైన, అనుకూలమైన షాపింగ్ సెంటర్. వాకింగ్ టూర్‌గా సాగింది ఆ సందర్శన. దుబాయ్‌లో పెరిగి, అక్కడే ఉంటున్న హైదరాబాదీ వనిత ఫరీదా అహ్మద్ గైడ్‌గా వ్యవహరించింది. ముందుగా సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్మే ‘స్పైస్ సూక్’ నుంచి మా వాకింగ్ టూర్ ప్రారంభమైంది. ఇరుకు రోడ్లు.. వాటికి వారగా రెండు వైపుల సంప్రదాయ దుకాణాల సముదాయంతో హైదరాబాద్‌లోని బేగం బజార్, సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌ను గుర్తుకు తెస్తుంది దుబాయ్ సూక్. ఇరాన్, ఇండియా నుంచి వచ్చిన కుంకుమపువ్వు మొదలు అన్నిరకాల సుగంధ ద్రవ్యాలతో కొలువు తీరి ఉన్న ఆ అంగడిని చూసుకుంటూ దుబాయ్ స్పెషల్ అయిన అండా పరోటా, దుబాయ్ శాండ్విచ్.. ఖడక్ చాయ్ అమ్మే ఒక టీస్టాల్ ముందుకు వచ్చాం. దాన్ని నడిపిస్తున్నది ఒక మలయాళీ. వాటి రుచి చూడాల్సిందే అని పట్టుబట్టింది ఫరీదా. ఆర్డర్ ఇచ్చి.. అక్కడే .. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం మధ్యలో గుండ్రంగా వేసి ఉన్న బెంచీల దగ్గరకు వచ్చాం. ఆ హోల్‌సేల్ మార్కెట్లో సరుకులు మోసే కూలీలు సేద తీరడానికి ఏర్పాటు చేసిందా సీటింగ్ ఏరియా. అంత బిజీ ఏరియాలోనూ ప్రశాంతంగా అనిపించింది. ఈలోపు అండా పరాఠా (ఆమ్లెట్ పరాఠా), దుబాయ్ శాండ్విచెస్ విత్ డాకూస్ సాస్ రానే వచ్చాయి. ఫరీదా చెప్పింది వినకపోయి ఉంటే ఒక మంచి రుచిని మిస్ అయ్యేవాళ్లం. అక్కడున్న అందరికీ అండా పరాఠా రుచి తొలి పరిచయమే. దుబాయ్ శాండ్ విచెస్ కూడా... అందులో ఒమన్ నుంచి వచ్చిన చిప్స్ ప్రత్యేకం. అన్నిటికన్నా ముఖ్యం.. తప్పకుండా ప్రస్తావించాల్సిన టేస్ట్ డాకూస్ సాస్. కువైట్ టమాటా సాస్ అది. కారంగా కాకుండా.. తీపిగా కాకుండా.. జిహ్వ పదేపదే కోరుకునే రుచి అది. తర్వాత చెప్పుకోవాల్సింది ఖడక్ చాయ్.. దుబాయ్ స్పెషల్ చాయ్. వేడివేడి ఖడక్ చాయ్ పెదవులు దాటి.. నాలుక మీద నుంచి గొంతులోకి జారిందంటే చాలు.. ఒక్క సిప్‌కే ఉన్న చికాకులు.. వేధించే తలనొప్పి గాయబ్. కప్‌లో చాయ్ ఖలాస్ అయ్యేలోపు ఉత్సాహం వెంటపడుతుంది. అతిశయోక్తి కాదు అనుభవం. ఆ ఉత్సాహం వెంటరాగా మా నడకసాగింది. సుగంధ ద్రవ్యాలతో తయారైన ఔషధాలు, తలనూనెలు, కీళ్ల నొప్పుల ఆయిల్స్ అమ్మే దుకాణాలు అన్నిటినీ దాటుకొని అవతలి ఒడ్డున ఉన్న బర్ దుబాయ్ సూక్ మార్కెట్‌ను చూడ్డానికి తీసుకెళ్లే స్టీమర్లున్న తీరానికి చేరుకుని మోటార్ బోట్ ఎక్కాం. శివాలయం.. గ్రాండ్ మాస్క్ స్పైస్ సూక్కి ఆవల తీరం బనియా సూక్తో మొదలవుతుంది. బనియా సూక్ అంతా బట్టల దుకాణాల సముదాయం. ప్రపంచ పటంలో దుబాయ్ అస్తిత్వం కనిపించగానే పాకిస్తానీయులు చాలా మంది దుస్తుల వర్తకం కోసం దుబాయ్ చేరారు. ఆ అమ్మక ప్రాంతమే బనియా సూక్. అలా ఆ షాప్‌ల వెంట వెళుతుంటే ఆ గల్లీల్లో తులసి దళాల వాసన, గులాబీ, మందార, కనకాంబరం, చామంతి, బంతులు విరిసిన పూల మొక్కలు పలకరించాయి ఒక్కసారిగా. అరే.. అని అచ్చెరువొందేలోపే వాటిని ఆనుకొని ఉన్న కాశీదారాలు, హారతి కర్పూరాలు, వత్తులు, దీపపు కుందులు, పుట్నాల పప్పు ప్రసాదాలు విక్రయించే దుకాణాలూ .. విశాలమైన ప్రాంగణం.. క్యూ కోసం కట్టిన బారికేడ్లు..కనిపించాయి. ప్రశ్నార్థకంగా గైడ్ వైపు చూస్తే నవ్వుతూ ఆమె గోపురంలాంటి గుండ్రటి ఆకారాన్ని చూపించింది. ‘గుడా?’ అనే ఎక్స్‌ప్రెషన్‌ని పాస్ చేసేలోపే ‘శివాలయం’ అంది. శివరాత్రి రోజు బ్రహ్మాండమైన వేడుక జరుగుతుందట. ఆ ఆవరణను ఆనుకునే మస్జిద్ ఉంటుంది.. అదే ‘గ్రాండ్ మాస్క్’. ‘‘మస్జిద్ను ఆనుకునే ఈ గుడి ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని కాని, ఇంత చిన్న అసహనాన్ని కాని నేను చూడలేదు, వినలేదు. ఎవరి ప్రార్థనలు వాళ్లు చేసుకుంటారు, వెళ్లిపోతారు. ఒకరికొకరు కనీసం డిస్టర్బెన్స్ కూడా ఫీలయిన సందర్భం లేదు’ అని తన అనుభవాన్ని చెప్పింది ఫరీదా. ఒక మంచి భావనను మనసునిండా నింపుకుంటూ ముందుకు నడిచాం. అరేబియన్ టీ హౌస్.. శివాలయం, గ్రాండ్ మాస్క్ దాటి ఎడమవైపు తిరిగి... కాస్త ముందుకు వెళితే మరో ఆపాత మధురాన్ని పదిలపరచుకుంటున్న దృశ్యం సాక్షాత్కరిస్తుంది. అదే అరేబియన్ టీ హౌసెస్ ఉన్న ఏరియా. దుబాయ్ కొత్త అభివృద్ధిలో ఆ ప్రాంతపు అసలైన జీవనశైలి, అలవాట్లు కొట్టుకుపోకుండా కాపాడుకునే ప్రయత్నమే ఆ వీధి. చాయ్, కాఫీల తయారీలో దుబాయ్‌ది భిన్నమైన రుచి... సేవనంలో వైవిధ్యమైన అభిరుచి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేని కాలంలో ఆ ఎడారి ఉష్ణోగ్రతను, వడగాల్పుల ధాటిని తట్టుకునేలా ఆనాటి ఇంటి నిర్మాణాలు ఎలా ఉండేవో అచ్చంగా ఆ ఇళ్లనే కట్టి.. వాకిట్లో గద్దెలు (పరుపులు), పిల్లోలు వేసి.. మధ్యలో టీ కెటిల్, కప్పులు పెట్టి తేనీటిని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు నేటివ్ మెమొరీస్‌ను తాజాపరచుకుంటున్నారు ‘అరేబియన్ టీ హౌస్’పేరుతో. ఆ స్ట్రీట్‌కి ఆనుకొని ఉన్న రోడ్డు దాటి ముందుకు సాగితే.. కూడలిలో ఓ పడవ (నమూనా) కనిపిస్తుంది. మిగిలిన ప్రపంచంతో దుబాయ్‌ని అనుసంధానించిన ఆ దేశపు తొలి పడవ ప్రయాణానికి ప్రతీకలా. అయితే ఇక్కడ ఒకటి ప్రస్తావించుకోవాలి. పూర్వ దుబాయ్ వాసులకు పడవ తయారు చేయడం తెలియదు. వాళ్లకు ఆ విద్య నేర్పింది ఎవరో తెలుసా? మలయాళీలు. దుబాయ్ వాసులు కేరళ వచ్చి వాళ్ల దగ్గర పడవ తయారీ నేర్చుకున్నారు. బదులుగా వాళ్లొచ్చి దుబాయ్‌లో వ్యాపారం చేసుకునే ఒప్పందాన్నీ కుదుర్చుకున్నారు. నేటికీ దుబాయ్ అరబ్బులకు కేరళీయులంటే అపారమైన అభిమానం, గౌరవం. ఇంకా చెప్పాలంటే ఇండియా అంటే మొదటగా వాళ్లకు గుర్తొచ్చేది కేరళనే. అడుగడుగునా మలయాళీలు కనిపిస్తారు అన్నిరకాల పనులు, బాధ్యతల్లో. కాని ఆ కూడలిలో ఉన్న పడవ నమూనాను తయారు చేసింది మాత్రం చైనీయులట. వాకింగ్ కంటిన్యూ చేస్తే.. కరీనా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్ల కటౌట్లతో ఇండియన్ పార్టీ వేర్ షాపులు, మలబార్ గోల్డ్ వంటి గోల్డ్ షోరూమ్స్, ఆర్టిఫీషియల్ జ్యుయెలరీ దుకాణాలున్న మీనా బజార్, పానీ పూరీ, చాట్ భండార్లు, బిర్యానీ పాయింట్లు, కబాబ్ సెంటర్లు, మధ్యతరగతి (ఎక్కువగా భారతీయులు.. దాదాపు ప్రతి ఫ్లాట్ బాల్కనీలో తులసి మొక్కలు కనిపిస్తూంటాయి) రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో మినీ ఇండియా కనిపిస్తుంది. అక్కడ ‘అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్’ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇరానియన్ కబాబ్స్‌కి. ప్రపంచంలోని ఏ దేశం వాళ్లు దుబాయ్ వచ్చినా అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్‌లో భోజనం చేయందే ఫ్లైట్ ఎక్కరు. మాంసాహార ప్రియుల జిహ్వచాపల్యానికి పర్ఫెక్ట్ అడ్రెస్. కుంకుమపువ్వుతో చికెన్, బోటీ చికెన్, చికెన్ కబాబ్స్, పుదీనా టీ కోసం ఇక్కడ క్యూ కడ్తారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, సంజయ్ దత్వంటి ఎందరో బాలీవుడ్ స్టార్లు కేవలం అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్స్ టేస్ట్ చేయడానికే దుబాయ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారటంటే ఆ మసాలా ఘాటుకెంత క్రేజో చూడండి!! అలా అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్‌లో లంచ్‌తో మా దుబాయ్ సూక్ వాకింగ్ టూర్ ముగిసింది. గ్లోబల్ విలేజ్ ఆ సాయంకాలం గ్లోబల్ విలేజ్‌కు వెళ్లాం. దునియా మొత్తం దుబాయ్ ముంగిట్లో ఉందా అనిపించే ఉత్సవం అది. ప్రపంచాన్ని ఒక గ్రామంగా చూపించే ఎగ్జిబిషన్. 78 దేశాల సంస్కృతులు, రుచులు, అభిరుచులు, ప్రత్యేకతలు, ఉత్పత్తులు ఆయా దేశాల పెవిలియన్స్ (గుడారాలు)లో ఆకర్షిస్తుంటాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు 159 రోజులు సాగే ఈ గ్లోబల్ విలేజ్‌కి ప్రతిరోజూ 45 వేల మంది సందర్శకులు హాజరవుతుంటారు. పదహారు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన 3 వేల అయిదు వందల షాపులు (రెస్టారెంట్స్‌ను కలుపుకొని), అడ్వెంచర్ గేమ్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, మ్యూజియంలు, టీ కొట్లు, కెఫ్టీరియాలతోపాటు నాటకాలు, న్యత్యాలకు వేదికలూ కొలువుతీరి ఉన్నాయి. అయితే దేశాలకు ప్రాతినిధ్యం వహించే వాటిని దుకాణాలు అనకుండా పెవిలియన్స్ అంటారు. అలా అన్నిట్లోకి ఇండియాదే అతి పెద్ద పెవిలియన్. మన దేశానికి సంబంధించి 250 షాపులున్నాయక్కడ. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటిగంట దాకా ఉంటుంది. 92 దేశాలకు చెందిన పదివేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. 1997లో ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్‌కి 2021 సిల్వర్ జుబ్లీ ఇయర్. ఈ పాతికేళ్లలో ఒక్క ఏడు కూడా విరామం తీసుకోలేదు. 2020 కరోనా కాలంలోనూ నిర్వహించారు. ఎందుకంటే దుబాయ్‌లో ఏప్రిల్ తర్వాత కరోనా ప్రభావం కనపడింది అని చెప్పారు గ్లోబల్ విలేజ్ గైడ్. ప్రతి సోమవారం మహిళలు, ఫ్యామిలీ స్పెషల్‌గా ఉంటుందీ గ్లోబల్ విలేజ్. బాలీవుడ్ పార్క్స్.. మూడో రోజున బాలీవుడ్ పార్క్స్ మా విజిటింగ్ ప్లేస్ అయింది. హాలీవుడ్‌కు ‘యూనివర్సల్ స్టూడియో’ ఉంది. అలాంటి సినిమా ఫక్కీ వినోదాన్ని పంచే ప్రాంగణమేదీ బాలీవుడ్‌కు లేదు. అందుకే దుబాయ్‌లో చోటు సంపాదించుకుంది ‘బాలీవుడ్ పార్క్స్’ పేరుతో. ఇది పూర్తిగా ఫ్యామిలీ డెస్టినేషన్. సినిమాటిక్ రైడ్స్, థ్రిల్లింగ్ అట్రాక్షన్స్, బాలీవుడ్ యాక్షన్, మ్యూజిక్, డాన్స్, డ్రామా, స్టాండప్ కామెడీ వంటి వినోదాత్మకమైన లైవ్ షోస్ ఉంటాయిక్కడ. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ డాన్, లగాన్, షోలే, జిందగీ నా మిలేగీ దొబారా, రావన్, క్రిష్ వంటి సినిమా పేర్లతో థియేటర్లున్నాయి ఎంటర్టైన్మెంట్ షోస్ కోసం. అలాగే సంజయ్‌లీలా భన్సాలీ వంటి దర్శకుల సినిమాల సెట్టింగ్స్‌ను పోలిన కట్టడంతో రాజ్‌మహల్ అనే థియేటరూ ఉంది. మొత్తానికి చిన్న, పెద్ద అందరినీ అలరించే ఈ బాలీవుడ్ పార్క్స్ అచ్చంగా యూనివర్సల్ స్టూడియోను పోలి ఉంటుంది. అల్ సీఫ్.. ఆ సాయంకాలం అల్ సీఫ్‌కు వెళ్లాం. ఇదీ దుబాయ్ సూక్లాంటి నేటివిటీ షాపింగ్ ప్రాంతం. అరేబియా బ్యాక్‌వాటర్స్ ఒడ్డున పరుచుకొని ఉంటుంది. మట్టి గోడల ఇళ్లల్లో కొట్లను నిర్వహిస్తుంటారు. విహరిస్తూ ఉంటే చిన్నప్పుడు చదువుకున్న అరేబియా కథల్లోని ఇళ్లు, ఆ సంస్కృతి స్ఫురణకు వస్తూంటాయి. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్న అల్ ఫనార్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించాం. ఎక్కడికి వెళ్లినా దుబాయ్ ఖడక్ చాయ్‌ను సేవించాల్సిందే. బుర్జ్ ఖలీఫా... దుబాయ్ మాల్ ఈ రెండిటితోనే మోడర్న్ దుబాయ్ ప్రసిద్ధి అని వేరేగా చెప్పక్కర్లేదు. బుర్జ్ ఖలీఫా... ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం. రెసిడెన్షియల్ ఫ్లాట్స్, షాప్స్, హోటల్స్ ఉన్న ఆకాశహర్మ్యం అది. దీంట్లో కూడా మొదటి అంతస్తులో ఆ కట్టడం గురించిన వివరా లుంటాయి. బుర్జ్ ఖలీఫా స్కై (148వ అంతస్తు) వరకూ వెళ్లాం. ఆ బాల్కనీలో కూర్చొని కింద కనిపిస్తున్న దుబాయ్‌ను చూస్తూ టీ, కాఫీ తాగడం ఒక అనుభూతి. దుబాయ్ మాల్ కాంప్లెక్స్ నుంచే బుర్జ్ ఖలీఫాకు ప్రవేశం ఉంటుంది. అక్కడ ఫుడ్ కోర్ట్ ప్రాంగణంలోనే ఉంటుంది బుర్జ్ ఖలీఫా టికెట్ కౌంటర్. దుబాయ్ మాల్ విషయానికి వస్తే.. అదొక సముద్రం. సముద్రం అంటే గుర్తొచ్చింది.. ఆ మాల్లో ఆక్వేరియం ఒక అట్రాక్షన్. ప్రపంచంలోని ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నీ ఆ మాల్లో దొరుకుతాయి. బట్టలు, బొమ్మలు, వరల్డ్ ది బెస్ట్ కాస్మోటిక్స్ మొదలు ఎలక్ట్రానిక్ గూడ్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్స్ దాకా .. ప్రతి ఒక్కటీ దుబాయ్ మాల్లో లభ్యం. డ్యూటీ ఫ్రీ కాబట్టి మిగిలిన చోట్లతో పోలిస్తే ధరా తక్కువే. బట్టలు, బొమ్మల కన్నా ఎలక్ట్రానిక్ గూడ్స్, పెర్ఫ్యూమ్స్, సన్‌గ్లాసెస్ అక్కడ తీసుకుంటే మంచిదని అక్కడ ఓ షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణీయుడి సూచన. అయితే బుర్జ్ ఖలీఫాలా దుబాయ్ మాల్‌ను ఒక గంటలో చుట్టిపెట్టలేం. కనీసం ఒక్కరోజు కచ్చితంగా కావాలి.. షాపింగ్ చేసినా.. చేయకుండా మాల్ అంతా చూడాలనుకున్నా. ఒకవేళ అంత సమయం వెచ్చించలేకపోతే ముందుగా దుబాయ్‌మాల్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే.. ఏ అంతస్తులో ఏ మూల ఏ షాప్ ఉందో ఆ యాప్‌లో తెలుసుకొని జీపీఆర్ఎస్ సహాయంతో నేరుగా వెళ్లొచ్చు. నాలుగే అంతస్తులైనా.. వైశాల్యంలో పెద్దది. అందుకే యాప్ ఫోన్లో ఉంటే ప్రయాస ఉండదు. ఇదీ నా దుబాయ్ ప్రయాణం. నిలువెత్తు దుబాయ్ ప్రగతికి ప్లాన్ చేసిన ఆర్కిటెక్ట్‌లలో.. రాళ్లు మోసిన కూలీలలో... శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కర్మచారుల్లో.. టూరిస్ట్‌లకు సేవలందిస్తున్న హాస్పిటాలిటీలో.. డాక్టర్లలో.. నర్సుల్లో.. టీ కాచి వేడివేడిగా అందిస్తున్న చాయ్వాలాల్లో.. రెస్టారెంట్లలో.. కూడళ్లల్లో.. ప్రతిచోటా భారతీయులున్నారు. దుబాయ్ పురోగతిలో ఉపాధి పొందుతూ.. దుబాయ్ పురోగతికి పాటుపడుతూ! – సరస్వతి రమ -
ఉప్పు తిన్నెలలో.. పున్నమి వెన్నెలలో
గుజరాత్‌లోని ‘రాణ్ ఆఫ్ కచ్’ను ఎప్పటినుండో చూడాలని అనుకుంటున్నాం. చివరికి ఈ ఏడాది అక్టోబర్ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకొని స్నేహితులం అందరం కలిసి బయలుదేరాం.మొదటిరోజు ఉదయం హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వరకు, అక్కడి నుండి కచ్ జిల్లాలోని కాండ్ల వరకు విమానంలో వెళ్ళాం. అక్కడి నుండి బస్సులో మూడు గంటల ప్రయాణం తరువాత ధొర్దొలో మా కోసం ఏర్పాట్లు చేసిన రిసార్టుకు చేరుకున్నాం. దాదాపు పదిహేను ఎకరాల్లో వందకు పైగా ఉన్న వివిధ రకాల టెంట్లతో రంగురంగుల విద్యుద్దీపాలతో రిసార్ట్ అందంగా మెరిసిపోతూ కనిపించింది. పున్నమి వెన్నెలలో ఉప్పు తిన్నెల మధ్య ఉన్న రిసార్టు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. మధ్యలో ఖాళీ ప్రదేశంలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం వేదిక ఏర్పాటు చేశారు. రాత్రి భోజనం తర్వాత గుజరాతీ జానపద గేయాలను ఆలపించి సాంప్రదాయిక సంగీత వాయిద్యాలను, గుజరాతీ సాంప్రదాయిక నృత్యం ‘గార్భా’ను కళాకారులు ప్రదర్శించారు. ‘గార్భా’ నృత్యంలో ప్రేక్షకులు కూడ పాలుపంచుకున్నారు. చివరకు అందరితో ‘హౌసీ’ ఆట ఆడించారు. విజేతలకు అప్పటికప్పుడు బహుమానాలు అందించారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు బయలుదేరి ఉప్పు ఎడారిలో సూర్యోదయాన్ని చూడటానికి వెళ్ళాము. ఆ ప్రదేశం దేశ సరిహద్దుకు దగ్గర కావడంతో మధ్యమధ్యలో బీఎస్ఎఫ్ దళాలకు చెందిన సైనికులు పహారా కాస్తూ కనిపించారు. చల్లని ఈదురు గాలులతో ఆకాశం మేఘావృతమైనప్పటికీ కాస్త ఆలస్యంగానైనా సూర్యోదయాన్ని వీక్షించడం అద్భుత అనుభూతి. ఉప్పు పట్టికలలో సూర్యకాంతి పరావర్తనం చెంది వింత శోభలతో మైమరపించింది. స్వామి నారాయణ్ టెంపుల్, భుజ్ ఐదు కిలోమీటర్ల తిరుగు ప్రయాణం ఒంటె బండి పై సాగింది. అల్పాహారం తర్వాత గుజరాత్ కి ప్రత్యేకమైన ‘రోగన్ ఆర్ట్’ విశిష్టతను తెలుసుకోవటానికి 60 కిలోమీటర్ల దూరంలోని నిరోన పల్లెకు వెళ్ళాం. అక్కడ రోగన్ ఆర్ట్ నిపుణులు, ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుగ్రహీత అబ్దుల్ గఫార్ ఖత్రి ఇంటికి చేరుకున్నాం. ఈ కళ మూడు వందల ఏళ్ల క్రితం పర్షియాలో పుట్టి తదుపరి కచ్ ప్రాంతానికి వచ్చిందని, వారి కుటుంబంలో దాదాపు తొమ్మిది తరాలవారు ఈ కళ పై ఆధారపడి జీవిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం. రోగన్ ఆర్ట్‌కు ఉపయోగించే పదార్థాన్ని ఆముదం నూనె నుండి నలభై ఎనిమిది గంటల పాటు ప్రాసెస్ చేసి ఒక జిగురు లాంటి పదార్థాన్ని తయారుచేస్తారు. దానికి సహజ రంగులు కలిపి, లెదర్ లేదా సిల్క్ వస్త్రంపై వివిధ ఆకృతుల్లో సన్నని డిజైన్లను గీయడమే ఈ రోగన్ ఆర్ట్ ప్రత్యేకత. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అప్పటికప్పుడు ఈ పద్ధతిలో ఒక చిత్రాన్ని గీసి ప్రదర్శించాడు కూడా. మధ్యాహ్న భోజనం తర్వాత నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీనుగం అనే పల్లెలో క్రాఫ్ట్ విలేజ్‌ను సందర్శించాం. గుజరాత్లో కచ్, భుజ్ ప్రాంతాలలో గతంలో వచ్చిన భూకంపాల వలన ఉపాధి కోల్పోయిన వారికి సహాయంగా సబర్మతి ఆశ్రమం ఫౌండేషన్ ఒక విలేజ్ క్రాఫ్ట్ సెంటర్‌ను నెలకొల్పి చేతివృత్తుల వారిని ప్రోత్సహిస్తోంది. తద్వారా ఆ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తోంది. ఆ కేంద్రంలో కలప వస్తువుల తయారీదారులు, అద్దాలతో అందంగా వివిధ వస్తువులను తీర్చిదిద్దే పనివారు మొదలు వివిధ చేతివృత్తుల వారు అక్కడ రకరకాల వస్తువులను తయారు చేస్తూ కనిపించారు. అక్కడినుండి ఇంకా ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి, ఆ జిల్లాలోనే ఎత్తైన ప్రదేశం కాలాడుంగర్ ప్రాంతానికి బయలుదేరాం. దారి మధ్యలో అయస్కాంత ప్రభావ క్షేత్రాన్ని చూశాం. అయస్కాంత ప్రభావం వల్ల బస్సు ఇంజను ఆపి, న్యూట్రల్లో ఉంచినా కూడా ఎత్తు ప్రదేశం వైపుకి ప్రయాణించటం చూశాం.కాలడుంగర్ చేరుకున్నాక దాదాపు నాలుగు వందల మీటర్ల ఎత్తు పైకి ఒంటె పై ప్రయాణించాం. సాయం సమయంలో ఆ కొండ ప్రాంతాల అందాలను అంత ఎత్తు నుండి చూస్తూ సూర్యాస్తమయాన్ని వీక్షిస్తూ ఆనందించడం గొప్ప అనుభూతి. తర్వాత పైన ఉన్న వ్యూ పాయింట్‌కి చేరుకున్నాం. ఆ కొండ అందాలని తిలకిస్తూ, పక్కనే ఉన్న శ్రీ దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకుని ఆరు గంటల హారతిని అందుకున్నాం. అక్కడి నుండి దుర్భిణితో చూస్తే పాకిస్తాన్ బోర్డర్ కనిపిస్తుందని స్థానికులు చెప్పారు. ఆ రాత్రికి ఎనిమిది గంటల ప్రాంతంలో రిసార్ట్ చేరుకున్నాం. స్నేహితులతో వ్యాసకర్త అనీజ సూర్యదేవర మరుసటి రోజు అల్పాహారం ముగించుకొని అక్కడి నుండి ఎనభై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భుజ్‌కు బస్సులో బయలుదేరాము. మార్గమధ్యంలో ‘కర్కాటక రేఖ’ మనదేశంలో నుండి ప్రయాణించే ప్రదేశాన్ని చూశాం. భుజ్, కచ్ రెండు ప్రాంతాలూ ఉప్పు భూములు కావటంతో ప్రయాణించినంతసేపు అక్కడ మొక్కలు, చెట్లు కనపడలేదు. దారిపొడవునా తుమ్మ చెట్లు మాత్రం విరివిగా పెరిగి ఉన్నాయి. మిగిలిన ప్రదేశమంతా ఉప్పు మైదానమే. భుజ్‌లో ఉన్న స్వామినారాయణ్ దేవాలయాన్ని దర్శించుకున్నాం. మొత్తం పాలరాతితో కట్టిన ఈ దేవాలయం పరిశుభ్రంగా, చాలా అందంగా, వివిధ డిజైన్లతో రెండు అంతస్తులుగా కట్టబడి ఉంది. ఫ్లోరింగ్ లో కూడా రంగురంగుల డిజైన్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో నల్ల రాతితో చేసిన శ్యాంబాబా, రాధాకృష్ణ తదితర ఐదుగురు దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. పదకొండు గంటల హారతి తీసుకొని అక్కడి నుండి ఆయినామహల్ కు వెళ్ళాం. పురాతన కాలంలో గుజరాత్, మహారాష్ట్రలను ఏలిన మహారాజులు నివసించిన భవనాన్ని అందంగా తీర్చిదిద్ది మ్యూజియంలా మలిచారు. మహారాణులు, చక్రవర్తులు ఉపయోగించిన వివిధ అలంకరణ వస్తువులు, యుద్ధ సామాగ్రి, అద్దాల బట్టలు, తదితర అనేక వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. రాణీ పద్మావతికి సంబంధించిన ఫోటోలు, దుస్తులు, అలంకరణ సామగ్రి కూడా ఈ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. వివిధ పరిమాణాల్లో, వివిధ ఆకృతులలో అద్దాలు అందమైన కార్డ్ వుడ్ ఫ్రేములో అమర్చినవి దాదాపు వందకు పైనే ఉన్నాయి. మ్యూజియంలో ఈ అద్దాలు అతి పెద్ద ఆకర్షణ. అందుకే దీనికి ‘ఆయినామహల్’ అన్న పేరు వచ్చింది. తదుపరి ప్రక్కనే ఉన్న ఫ్రాగ్ మహల్ కూడా సందర్శించాం. భిన్న సంస్కృతికి మారుపేరైన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని భుజ్, కచ్ ప్రాంతవాసుల ఆచార, వ్యవహార, సాంస్కృతిక విషయాలను, అక్కడి విశిష్ట ప్రాంతాలను దర్శించిన జ్ఞాపకాలను పదిలంగా దాచుకుని తిరుగు ప్రయాణం అయ్యాం. -
లక్ష్య సాధనకు పర్యాటకశాఖ ప్రణాళికలు
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకుల స్వర్గధామంగా వెలుగొందుతున్న విశాఖకు టూరిస్టుల తాకిడిని మరింతగా పెంచడానికి పర్యాటకశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం విశాఖకు వస్తున్న పర్యాటకుల సంఖ్యను మూడేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పథకాలు సిద్ధం చేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.5 కోట్ల మంది పర్యాటకులు విశాఖ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సంఖ్యను 2022 నాటికి 4.95 కోట్లకు పెంచడానికి పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలను పెంచనుంది. ఇందులో భాగంగా దేశ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు అదనంగా 5 వేల గదులను పర్యాటక శాఖ సమకూర్చనుంది. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఆయా ప్రాంతా లకు వెళ్లేందుకు వీలుగా రోడ్లను పర్యాటక శాఖ ఇతర శాఖల చేయూతతో అభివృద్ధి చేయనుంది. కొత్త పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తేనుంది. ముఖ్యంగా సాహస క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా పారామోటార్ రైడింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటిపై ఆసక్తి పెరిగేలా ఏర్పాట్లను విస్తృతం చేస్తున్నారు. పలు పర్యాటక ప్రదేశాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు, స్నానపు గదులు, మంచినీటి సదుపాయాలు లేవు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి పర్యాటకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని అక్కడ కనీస సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటితో పాటు విశాఖను ఆకర్షించడానికి ఈవెంట్లను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ఊదరగొట్టింది. విశాఖ ఉత్సవ్, భీమిలి ఉత్సవ్, యాటింగ్ ఫెస్టివల్, సౌండ్స్ ఆన్ సాండ్స్ వంటి వాటి కార్యక్రమాలు మొదలు కావడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించడం మినహా ఆ కార్యక్రమాలు ఆశించిన ప్రయోజనం నెరవేద వెచ్చించి నిర్వహించినా నిధుల దుర్వినియోగమే తప్ప ఆశించినంతగా పర్యాటకులను ఆకట్టుకోలేకపోయింది. బొర్రా గుహలు గత ఏడాది విశాఖ ఉత్సవ్‌కు రూ.3.5 కోట్లు, అరకు బెలూన్ ఫెస్టివల్‌కు రూ.4 కోట్లు, యాటింగ్ ఫెస్టివల్‌కు రూ.4 కోట్లు, విశాఖ–అరకు మధ్య ట్రయిన్ స్టోరీకి రూ.5 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అయితే వీటిలో విశాఖ ఉత్సవ్, అరకు బెలూన్ ఫెస్టివల్‌ను మాత్రమే నిర్వహిం చారు. మిగిలిన యాటింగ్ ఫెస్టివల్, ట్రయిన్ స్టోరీలు రద్దయ్యాయి. రూ.4 కోట్లు వెచ్చించిన అరకు బెలూన్ ఫెస్టివల్ ఆదరణ లేక అభాసు పాలయింది. ఇలా జనాదరణ లేని ఈవెంట్లకు కోట్లాది రూపాయలు చెల్లించి మంచినీళ్లలా ఖర్చు చేసింది. కోట్లు వెచ్చించి నిర్వహించే ఫెస్టివల్స్, ఈవెంట్లను సద్వినియోగం చేసి ఉంటే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్దేశించుకున్న పర్యాటకుల సంఖ్య లక్ష్యం ఇలా.. 2020 2021 2022 3,73,95,337 4,30,04,639 4,94,55,334 గత మూడేళ్లలో విశాఖకు వచ్చిన పర్యాటకుల సంఖ్య ఇలా... 2017 2018 2019 2,13,92,728 2,50,13,607 1,22,14,292 విశాఖ తీరంలో (మే వరకు) విదేశీ పర్యాటకులు 2017 2018 2019 92,958 95,759 41,753 -
ఆ రంగాల్లో 2.5 కోట్ల ఉద్యోగాలు
బెంగళూరు : దేశంలో ట్రావెల్, టూరిజం రంగాలు భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించాయని తెలిసింది. 2017లో ఈ రంగాలు కలిసి 2.59 కోట్ల ఉద్యోగాలు సృష్టించాయని, అదేవిధంగా జీడీపీకి రూ.5 లక్షల కోట్లను అందించాయని ఇండియన్ ఇండస్ట్రి బాడీ ఫిక్కీ, సర్వీసు సంస్థ కేపీఎంజీ రిపోర్టులు వెల్లడించాయి. దేశంలో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తలుగా ట్రావెల్, టూరిజం రంగాలు ఉన్నాయని, ప్రత్యక్షంగానే ఈ రంగాలు 2.59 కోట్ల ఉద్యోగాలు అందించాయని ఈ రిపోర్టులు తెలిపాయి. దేశీయ ఎకానమీలో ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ కీలక రంగాలుగా ఉన్నాయని, ఫారిన్ టూరిస్ట్ అరైవల్స్‌లో ఏడాది ఏడాదికి 15.6 శాతం స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేశాయని చెప్పాయి. ట్రావెల్ ఇండస్ట్రి భవిష్యత్తును మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వర్చ్యువల్/ అగ్మెంటెడ్ రియాల్టీ నిర్థారించనున్నాయని ఈ రిపోర్టులు తెలిపాయి. ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ సేల్స్ 2017 నుంచి 2021 నాటికి 14.8 శాతం పెరగనుందని రిపోర్టులు అంచనావేశాయి. 2019 నాటికి ప్రపంచంలో ఆరవ అతిపెద్ద బిజినెస్ ట్రావెల్ మార్గెట్గా భారత్ నిలువనుందని పేర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వాడకం పెరుగడంతో, భారత్ డిజిటల్ ఎనాబుల్ టూరిస్ట్ గమ్యంగా మారనుందని చెప్పాయి. -
అమెరికాపై మోజు తగ్గుతోందా?
వాషింగ్టన్: అమెరికా మోజు తగ్గుతోందా? ఈ ప్రశ్నకు అమెరికా పర్యాటకశాఖ మాత్రం అవుననే చెబుతోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య గత ఆరు నెలల్లో 13 శాతం తగ్గిందట. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి నుంచి జూన్ వరకు ప్రయాణికుల సంఖ్య 12.9 శాతం తగ్గింది. ఈ ఆరు నెలల్లో చివరి మూడు నెలలు.. అంటే ఏప్రిల్, మే, జూన్‌లో 18.3 శాతం తగ్గుదల నమోదైంది. ‘2017 తొలి త్రైమాసికంలో తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై అమెరికా అంత తీవ్రమైన ఆంక్షలు అమలు చేయలేదు. అయితే రెండో త్రైమాసికంలో మాత్రం కఠినమైన ఆంక్షలు విధించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అమెరికా విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న మార్పులే ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణమ’ని బ్రాండ్ యూఎస్ఏ ప్రెసిడెంట్, సీఈవో క్రిస్ థాంప్సన్ అన్నారు. భారత్‌లో పెరుగుతున్న మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణమై ఉండవచ్చని థాంప్సన్ అభిప్రాయపడ్డారు. -
విశాఖలో హాలిడే ఎక్స్పో
హైదరాబాద్: విశాఖపట్టణంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న హాలిడే ఎక్స్పో ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్లో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్వి టూర్స్అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేత ఆర్వి రమణ తెలిపారు. తమ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కల్పిస్తున్నామన్నారు. విశాఖలోని గేట్‌వే హోటల్లో మూడు రోజులపాటు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. 2015 సంవత్సరంలో మానస సరోవరం, బదరీనాథ్, కేదారీనాథ్, అమర్నాథ్, కాశీవిశ్వనాథ్ యాత్రలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఎగ్జిబిషన్లో ఔత్సాహిక పర్యాటకులు తనను కలిసి తగిన సూచనలు తీసుకోవచ్చన్నారు. వివరాలకు ఫోన్: 8106666134లో సంప్రదించాలని కోరారు. -
‘ట్రావెల్ మార్ట్’ అదుర్స్
-
కొలువులకు కొదవ లేని.. ట్రావెల్ అండ్ టూరిజం
మనిషి తాను పుట్టిన చోటే ఉండిపోతే ఇప్పటికీ నాగరికుడిగా మారేవాడు కాదు. ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రగతి సాధ్యమైంది. కొత్త ప్రాంతాలు, కొత్త ప్రజలు, నూతన సంస్కృతులను తెలుసుకోవాలంటే.. పర్యటించాలి. ఎలాంటి వనరులు లేకపోయినా పర్యాటకంతోనే మనుగడ సాగిస్తున్న దేశాలున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం.. ట్రావెల్ అండ్ టూరిజం. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్ అండ్ టూరిజాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగావకాశాలకు లోటే ఉండదు. ప్రశంసలు, పురస్కారాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రవాణా, పర్యాటక నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టూరిజం విభాగాల్లో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లు, టూరిస్ట్ గైడ్లు వంటి కొలువులు లభిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు, ట్రాన్స్పోర్ట్ అండ్ కార్గో కంపెనీల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అనుభవజ్ఞులకు విదేశాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. వృత్తిలో తగిన అనుభవం సంపాదించి సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే.. విద్యాసంస్థల్లో ట్రావెలింగ్, టూరిజం కోర్సుల ఫ్యాకల్టీగా కూడా పనిచేయొచ్చు. కొత్త ప్రాంతాలను, విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ వృత్తిలో ఉంటుంది. రకరకాల భాషలు, నేపథ్యాలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంతృప్తికరమైన సేవలందిస్తే క్లయింట్ల నుంచి ప్రశంసలు, పేరు ప్రఖ్యాతలు, తద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయి. సేవల ద్వారా మంచి గుర్తింపు పొందిన టూరిజం నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పురస్కారాలను ప్రదానం చేస్తుంటాయి. టూరిజం రంగంలో పురోగమనమే తప్ప తిరోగమనం అనేది ఉండదు. ఇది రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న కెరీర్. కావాల్సిన నైపుణ్యాలు: టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్‌కు మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లో పట్టు ఉండాలి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా క్లయింట్లకు సేవలందించే గుణం ముఖ్యం. ప్రయాణాల్లో శారీరక అలసటను తట్టుకొనే సామర్థ్యం పెంచుకోవాలి. కుటుంబ, వ్యక్తిగత జీవితాన్ని కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇందులో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటికీ సిద్ధపడినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. అర్హతలు: భారత్‌లో ట్రావెల్ అండ్ టూరిజంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత డిప్లొమాలో చేరొచ్చు. అలాగే ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. అడ్వెంచర్ టూరిజం రంగంలో స్థిరపడాలనుకుంటే పర్వతారోహణ(మౌంటెయినీరింగ్) కోర్సుల్లో చేరాలి. వేతనాలు: టూరిజం రంగంలో పని చేస్తున్న సంస్థను బట్టి ఆదాయం అందుకోవచ్చు. పేరు ప్రఖ్యాతలున్న ట్రావెల్ కంపెనీలో వేతనాలు అధికంగా ఉంటాయి. కౌంటర్ క్లర్క్‌కు నెలకు రూ.13 వేల నుంచి రూ.17 వేలు, అసిస్టెంట్‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.24 వేల నుంచి రూ.30 వేలు, రీజినల్ మేనేజర్‌కు రూ.35 వేల నుంచి రూ.50 వేల వేతనాలు అందుతాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్-నెల్లూరు వెబ్సైట్: www.iittm.org నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్ వెబ్సైట్: www.nimindia.net ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్ - హైదరాబాద్ వెబ్సైట్: www.nithm.ac.in