గుజరాత్‌లోని ‘రాణ్ ఆఫ్ కచ్’ను ఎప్పటినుండో చూడాలని అనుకుంటున్నాం. చివరికి ఈ ఏడాది అక్టోబర్ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకొని స్నేహితులం అందరం కలిసి బయలుదేరాం.మొదటిరోజు ఉదయం హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వరకు, అక్కడి నుండి కచ్ జిల్లాలోని కాండ్ల వరకు విమానంలో వెళ్ళాం. అక్కడి నుండి బస్సులో మూడు గంటల ప్రయాణం తరువాత ధొర్దొలో మా కోసం ఏర్పాట్లు చేసిన రిసార్టుకు చేరుకున్నాం. దాదాపు పదిహేను ఎకరాల్లో వందకు పైగా ఉన్న వివిధ రకాల టెంట్లతో రంగురంగుల విద్యుద్దీపాలతో రిసార్ట్ అందంగా మెరిసిపోతూ కనిపించింది. పున్నమి వెన్నెలలో ఉప్పు తిన్నెల మధ్య ఉన్న రిసార్టు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. మధ్యలో ఖాళీ ప్రదేశంలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం వేదిక ఏర్పాటు చేశారు.
రాత్రి భోజనం తర్వాత గుజరాతీ జానపద గేయాలను ఆలపించి సాంప్రదాయిక సంగీత వాయిద్యాలను, గుజరాతీ సాంప్రదాయిక నృత్యం ‘గార్భా’ను కళాకారులు ప్రదర్శించారు. ‘గార్భా’ నృత్యంలో ప్రేక్షకులు కూడ పాలుపంచుకున్నారు. చివరకు అందరితో ‘హౌసీ’ ఆట ఆడించారు. విజేతలకు అప్పటికప్పుడు బహుమానాలు అందించారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు బయలుదేరి ఉప్పు ఎడారిలో సూర్యోదయాన్ని చూడటానికి వెళ్ళాము. ఆ ప్రదేశం దేశ సరిహద్దుకు దగ్గర కావడంతో మధ్యమధ్యలో బీఎస్‌ఎఫ్ దళాలకు చెందిన సైనికులు పహారా కాస్తూ కనిపించారు. చల్లని ఈదురు గాలులతో ఆకాశం మేఘావృతమైనప్పటికీ కాస్త ఆలస్యంగానైనా సూర్యోదయాన్ని వీక్షించడం అద్భుత అనుభూతి. ఉప్పు పట్టికలలో సూర్యకాంతి పరావర్తనం చెంది వింత శోభలతో మైమరపించింది.
స్వామి నారాయణ్ టెంపుల్, భుజ్
ఐదు కిలోమీటర్ల తిరుగు ప్రయాణం ఒంటె బండి పై సాగింది. అల్పాహారం తర్వాత గుజరాత్ కి ప్రత్యేకమైన ‘రోగన్ ఆర్ట్’ విశిష్టతను తెలుసుకోవటానికి 60 కిలోమీటర్ల దూరంలోని నిరోన పల్లెకు వెళ్ళాం. అక్కడ రోగన్ ఆర్ట్ నిపుణులు, ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుగ్రహీత అబ్దుల్ గఫార్ ఖత్రి ఇంటికి చేరుకున్నాం. ఈ కళ మూడు వందల ఏళ్ల క్రితం పర్షియాలో పుట్టి తదుపరి కచ్ ప్రాంతానికి వచ్చిందని, వారి కుటుంబంలో దాదాపు తొమ్మిది తరాలవారు ఈ కళ పై ఆధారపడి జీవిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం. రోగన్ ఆర్ట్‌కు ఉపయోగించే పదార్థాన్ని ఆముదం నూనె నుండి నలభై ఎనిమిది గంటల పాటు ప్రాసెస్ చేసి ఒక జిగురు లాంటి పదార్థాన్ని తయారుచేస్తారు. దానికి సహజ రంగులు కలిపి, లెదర్ లేదా సిల్క్ వస్త్రంపై వివిధ ఆకృతుల్లో సన్నని డిజైన్లను గీయడమే ఈ రోగన్ ఆర్ట్ ప్రత్యేకత. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అప్పటికప్పుడు ఈ పద్ధతిలో ఒక చిత్రాన్ని గీసి ప్రదర్శించాడు కూడా.
మధ్యాహ్న భోజనం తర్వాత నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీనుగం అనే పల్లెలో క్రాఫ్ట్ విలేజ్‌ను సందర్శించాం. గుజరాత్‌లో కచ్, భుజ్ ప్రాంతాలలో గతంలో వచ్చిన భూకంపాల వలన ఉపాధి కోల్పోయిన వారికి సహాయంగా సబర్మతి ఆశ్రమం ఫౌండేషన్ ఒక విలేజ్ క్రాఫ్ట్ సెంటర్‌ను నెలకొల్పి చేతివృత్తుల వారిని ప్రోత్సహిస్తోంది. తద్వారా ఆ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తోంది. ఆ కేంద్రంలో కలప వస్తువుల తయారీదారులు, అద్దాలతో అందంగా వివిధ వస్తువులను తీర్చిదిద్దే పనివారు మొదలు వివిధ చేతివృత్తుల వారు అక్కడ రకరకాల వస్తువులను తయారు చేస్తూ కనిపించారు.
అక్కడినుండి ఇంకా ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి, ఆ జిల్లాలోనే ఎత్తైన ప్రదేశం కాలాడుంగర్ ప్రాంతానికి బయలుదేరాం. దారి మధ్యలో అయస్కాంత ప్రభావ క్షేత్రాన్ని చూశాం. అయస్కాంత ప్రభావం వల్ల బస్సు ఇంజను ఆపి, న్యూట్రల్‌లో ఉంచినా కూడా ఎత్తు ప్రదేశం వైపుకి ప్రయాణించటం చూశాం.కాలడుంగర్ చేరుకున్నాక దాదాపు నాలుగు వందల మీటర్ల ఎత్తు పైకి ఒంటె పై ప్రయాణించాం. సాయం సమయంలో ఆ కొండ ప్రాంతాల అందాలను అంత ఎత్తు నుండి చూస్తూ సూర్యాస్తమయాన్ని వీక్షిస్తూ ఆనందించడం గొప్ప అనుభూతి. తర్వాత పైన ఉన్న వ్యూ పాయింట్‌కి చేరుకున్నాం. ఆ కొండ అందాలని తిలకిస్తూ, పక్కనే ఉన్న శ్రీ దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకుని ఆరు గంటల హారతిని అందుకున్నాం. అక్కడి నుండి దుర్భిణితో చూస్తే పాకిస్తాన్ బోర్డర్ కనిపిస్తుందని స్థానికులు చెప్పారు. ఆ రాత్రికి ఎనిమిది గంటల ప్రాంతంలో రిసార్ట్ చేరుకున్నాం.
స్నేహితులతో వ్యాసకర్త అనీజ సూర్యదేవర
మరుసటి రోజు అల్పాహారం ముగించుకొని అక్కడి నుండి ఎనభై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భుజ్‌కు బస్సులో బయలుదేరాము. మార్గమధ్యంలో ‘కర్కాటక రేఖ’ మనదేశంలో నుండి ప్రయాణించే ప్రదేశాన్ని చూశాం. భుజ్, కచ్ రెండు ప్రాంతాలూ ఉప్పు భూములు కావటంతో ప్రయాణించినంతసేపు అక్కడ మొక్కలు, చెట్లు కనపడలేదు.
దారిపొడవునా తుమ్మ చెట్లు మాత్రం విరివిగా పెరిగి ఉన్నాయి. మిగిలిన ప్రదేశమంతా ఉప్పు మైదానమే. భుజ్‌లో ఉన్న స్వామినారాయణ్ దేవాలయాన్ని దర్శించుకున్నాం. మొత్తం పాలరాతితో కట్టిన ఈ దేవాలయం పరిశుభ్రంగా, చాలా అందంగా, వివిధ డిజైన్లతో రెండు అంతస్తులుగా కట్టబడి ఉంది.
ఫ్లోరింగ్ లో కూడా రంగురంగుల డిజైన్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో నల్ల రాతితో చేసిన శ్యాంబాబా, రాధాకృష్ణ తదితర ఐదుగురు దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. పదకొండు గంటల హారతి తీసుకొని అక్కడి నుండి ఆయినామహల్ కు వెళ్ళాం. పురాతన కాలంలో గుజరాత్, మహారాష్ట్రలను ఏలిన మహారాజులు నివసించిన భవనాన్ని అందంగా తీర్చిదిద్ది మ్యూజియంలా మలిచారు. మహారాణులు, చక్రవర్తులు ఉపయోగించిన వివిధ అలంకరణ వస్తువులు, యుద్ధ సామాగ్రి, అద్దాల బట్టలు, తదితర అనేక వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి.
రాణీ పద్మావతికి సంబంధించిన ఫోటోలు, దుస్తులు, అలంకరణ సామగ్రి కూడా ఈ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. వివిధ పరిమాణాల్లో, వివిధ ఆకృతులలో అద్దాలు అందమైన కార్డ్ వుడ్ ఫ్రేములో అమర్చినవి దాదాపు వందకు పైనే ఉన్నాయి. మ్యూజియంలో ఈ అద్దాలు అతి పెద్ద ఆకర్షణ. అందుకే దీనికి ‘ఆయినామహల్’ అన్న పేరు వచ్చింది. తదుపరి ప్రక్కనే ఉన్న ఫ్రాగ్ మహల్ కూడా సందర్శించాం. భిన్న సంస్కృతికి మారుపేరైన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని భుజ్, కచ్ ప్రాంతవాసుల ఆచార, వ్యవహార, సాంస్కృతిక విషయాలను, అక్కడి విశిష్ట ప్రాంతాలను దర్శించిన జ్ఞాపకాలను పదిలంగా దాచుకుని తిరుగు ప్రయాణం అయ్యాం.
Comments
Please login to add a commentAdd a comment