ప్రతీకాత్మక చిత్రం
ఇంటి ముందు మొక్కలు నవ్వుతుంటాయి. ఇంటి మీద జాతీయ పతాకం ఎగురుతుంటుంది. దేశాధ్యక్షుడు తన కారు తానే నడుపుకుంటాడు. చట్టసభల ప్రతినిధులు రైల్లో ప్రయాణిస్తుంటారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అలాగే... పెచ్చుమీరని ప్రభుత్వ ఆంక్షలూ ఉన్నాయి. మహాత్మాగాంధీ, దలైలామా, క్వీన్ రెండవ ఎలిజబెత్‌లను ఒకే చోట చూసే అవకాశం వచ్చింది. వాళ్ల పక్కనే షారూక్ ఖాన్, కరీనా కపూర్‌లను కూడా. ఇదంతా ఆస్ట్రేలియాలో అతి పెద్ద నగరం సిడ్నీలో. వేదిక పేరు మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం.
సిడ్నీలో మరో అద్భుతమైన ప్రదేశం డార్లింగ్ హార్బర్‌లోని సీలైఫ్ అక్వేరియం. సీ లైఫ్ అక్వేరియంలో గాజు ట్యూబ్‌లో మనం ఉంటాం. జలచరాలు సముద్రంలో ఉంటాయి. ఇందులో నడుస్తూ మన పక్క నుంచి, తల మీద నుంచి పరుగులు తీసే జలచరాలను చూడడం గమ్మత్తుగా ఉంటుంది. ఇక సోమర్స్‌బే వాటర్ ఫాల్స్, వాటమొల్లా బీచ్‌ల పర్యటనతోపాటు ఆస్ట్రేలియాలో ఉన్న పది నెలల కాలంలో మురుగన్ టెంపుల్, రామలింగేశ్వర ఆలయం, అయ్యప్ప, సాయిబాబా, ఇస్కాన్ ఆలయం, మహంకాళి ఆలయాలను కూడా చూశాను. ఇవన్నీ ఇచ్చిన సంతృప్తికంటే కమ్యూనిటీ గార్డెన్ డెవలప్‌మెంట్ కోసం పని చేయడం ఎక్కువ సంతోషాన్నిచ్చింది.
మొక్కలంటే ప్రాణం... సిడ్నీకి సమీపంలోని వెంట్ వర్త్ విల్లీలో మా అమ్మాయి దగ్గర పది నెలలున్నాం. అక్కడి ప్రజలు శ్రమజీవులు, కష్టపడి పని చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రోజూ విధిగా గార్డెనింగ్ కోసం రెండు గంటలు కేటాయిస్తారు. ప్రతి ఇంటి ముందు పూలచెట్లు, క్రీపర్‌లు అల్లుకుని ఉంటాయి. దేశభక్తి కూడా ఎక్కువ. ఇంటి మీద వాళ్ల జాతీయ పతాకం ఉంటుంది. ప్రకృతిని ప్రేమిస్తారు. సహజ వనరులను మితంగా ఖర్చు చేస్తారు. మినరల్స్, భూగర్భ జలాలను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించాలనే ఆశయం వారిది. నీటి కోసం బోర్ వేయరు, చెరువులు, నదుల నీటినే వాడతారు.
స్థలం కొంటే ఇల్లు కట్టాల్సిందే...
మనుషులు అత్యాశకు పోనివ్వకుండా నిజాయితీగా జీవించడానికి ఆస్ట్రేలియా నిబంధనలు కూడా కారణమే. అక్కడ ఎవరైనా ఇళ్ల స్థలం కొన్నారంటే తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇన్వెస్ట్‌మెంట్ ధోరణిలో స్థలం కొని తరాల పాటు ఉంచుకోవడాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు. దాంతో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటేనే స్థలం కొంటారు. భూమి అందుబాటు ధరలో ఉంటుంది.
కమ్యూనిటీ గార్డెన్..
కాలనీల్లో కమ్యూనిటీ గార్డెన్ పెంపకం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. మడులు లీజ్‌కిస్తారు. ఒక్కొక్క మడికి ఏడాదికి ముప్పై డాలర్లు చెల్లించాలి. కూరగాయల మొక్కల విత్తనాలు, ఎరువులు, మందులు ఇస్తారు. ఆ పండించిన కూరగాయలు నేలను లీజుకు తీసుకున్న వాళ్లకే చెందుతాయి. విజిటింగ్ వీసా మీద వెళ్లిన వాళ్లు గార్డెనింగ్ సోషల్ సర్వీస్ చేయవచ్చు. అలా పది నెలల పాటు గార్డెన్ పని చేశాం. నా సర్వీస్‌కు మెచ్చి వెంట్ వర్త్ విల్లే చీఫ్ మిసెస్ రాబిన్ ప్రశంసా పత్రం ఇచ్చారు.
లైబ్రరీలో తెలుగు పుస్తకాలు...
వెంట్‌వర్త్ విల్లీలో ఉన్న కమ్యూనిటీ లైబ్రరీని చూశాం. అందులో ఇరవై మూడు భాషల పుస్తకాలున్నాయి. భారతీయ భాషల్లో పంజాబీ, మరాఠి, హిందీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పుస్తకాలున్నాయి. తెలుగు పుస్తకాలు కనిపించకపోవడంతో బాధనిపించింది. అక్కడ విచారిస్తే లైబ్రరీ సభ్యత్వం ఉన్న వాళ్లు రిక్వెస్ట్ చేస్తే పరిగణనలోకి తీసుకుంటారని తెలిసింది. అక్కడ పర్మినెంట్ వీసాలోనూ, సిటిజన్‌షిప్‌తోనూ నివసిస్తున్న యాభై మంది తెలుగు వాళ్ల చేత సంతకాలు చేయించి, మా అల్లుడి చేత రిక్వెస్ట్ లెటర్ పెట్టించగలిగాం. ఆ ప్రయత్నంతో లైబ్రరీలో తెలుగు పుస్తకాలు కూడా వచ్చాయి. అక్కడ ఉన్న పది నెలల కాలంలో సాధించిన విజయాలివి. ఆస్ట్రేలియా ట్రిప్ ప్రభావం మా మీద హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది.
ప్రతినిధులు లోకల్ ట్రైన్‌లో
ఆస్ట్రేలియాలో రైళ్లలో ఒక్కోసారి రైలు మొత్తానికి ముగ్గురు ప్రయాణిస్తున్న దృశ్యాన్ని కూడా చూశాం. బస్సులు కూడా అంతే. సామాన్యులకు సర్వీస్‌లన్నింటినీ అందుబాటులో ఉంచాలనేది అక్కడి ప్రభుత్వ నియమం. చట్టసభల ప్రతినిధులు కూడా లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు. ఎటువంటి హడావుడి లేకుండా ప్రెసిడెంట్ తన కారును తాను నడుపుకుని పోవడం అక్కడ సర్వసాధారణం. గన్ కల్చర్ లేకపోవడంతో ఎటువంటి భయమూ ఉండదు. ఇక్కడ జీవన వ్యయం చాలా ఎక్కువ. ఎకానమీ సమానంగా పంపిణీ జరుగుతుంది.
ఎలక్ట్రీషియన్ అయినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా సంపాదనలో తేడా ఉండదు. అందుకే ఎవరికీ ఎవరి మీద ఆసూయ పెరగదు. నిస్వార్థంగా, నిజాయితీగా ఉంటారు. తరతరాల కోసం కూడబెట్టాలనే ఆలోచన ఉండదు. ఇక్కడ భవిష్యత్తు కోసం కూడ బెట్టేది వ్యక్తిగత ఆస్థులను కాదు. ప్రకృతి వనరులను నిల్వ చేస్తారు. ఈ ఆలోచన గొప్పగా అనిపించింది. మనుషులు నిస్వార్థంగా జీవించడానికి ఇవన్నీ కారణాలే. సౌకర్యాల కల్పనలో ఎంత ఉదారంగా ఉంటుందో, నిబంధనలను ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం అంతే కచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మితిమీరిన స్వేచ్ఛకు దారి తీయడం లేదు. అక్షరాలా అమలవుతోందనిపిస్తుంది.
– చైతన్యమాధవుని అశోక్ రాజు, వీణారాణి
Comments
Please login to add a commentAdd a comment