పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఉత్తరం పోస్టు చేసి ఎన్నాళ్లైంది? అసలు ఉత్తరం రాసి ఎన్నేళ్లయింది? ఓ సారి ఉత్తరం రాసి మన వాళ్లను సర్‌ప్రైజ్ చేస్తే? ఇవన్నీ మనవాళ్ల సంతోషం కోసం చేసే పనులు. మన సంతోషం కోసం కూడా ఓ పని చేద్దాం. మనకు మనమే ఉత్తరం రాసి పోస్ట్ చేసుకుందాం. ఎక్కడ నుంచి ఎక్కడికి పోస్ట్ చేయాలి? హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్‌కెళ్లి అక్కడ ఓ ఉత్తరం రాసి మన ఇంటికి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఉత్తరం రాసే ముందు ఒకటి తెలుసుకోవాలి! ఇంతకీ... ఈ హిక్కిమ్ ఎక్కడుంది?
హిక్కిమ్ ఈ పదం సిక్కిమ్‌లాగ ధ్వనిస్తోంది. కానీ ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, లాహుల్ స్పితి జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే ఎల్తైన పోస్ట్ ఆఫీస్. ఎల్తైన అంటే కట్టడపు ఎత్తు కాదు. అత్యంత ఎల్తైన ప్రదేశంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అన్నమాట. ఎంత ఎత్తంటే... 17, 060 అడుగుల ఎత్తులో ఉంది. పిన్‌కోడ్ 172114. ఇక్కడి నుంచి టపా రోజూ కాలి నడకన రికాంగ్ పియో వరకు తీసుకువెళ్లి అక్కడ నుంచి బస్‌లో రవాణా చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిమ్లా చేరి అక్కడ రైలెక్కి కల్కాలో దిగి మళ్లీ బస్సెక్కి ఢిల్లీ చేరుతుంది ఉత్తరం. అంత కష్టం మీద ఢిల్లీ చేరుతుంది. ఆ తర్వాత సులువుగా రెక్కలు విప్పుకుని గమ్యంలో వాలుతుంది. ఉత్తరం రాయడానికి అంతదూరాన ఉన్న హిక్కిమ్‌కి వెళ్లాలా? నిజమే. ఈ ఉత్తరం రాయడంతోపాటు అందమైన స్పితి లోయ సౌందర్యాన్ని, బౌద్ధ భిక్షువుల జీవనశైలిని దగ్గరగా చూడాలంటే వెళ్లి తీరాల్సిందే.
ఆరు నెలలే...
స్నోఫాల్ ఎక్కువగా ఉండే శీతాకాలం మాత్రం పోస్టాఫీస్‌ను మూసేస్తారు. పోస్టాఫీస్‌ను మాత్రమే కాదు, రోడ్డు రవాణా రాకపోకలు కూడా నిలిచిపోతాయి. మిగిలిన ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఎండాకాలం మొదలైన తర్వాత యథాతథంగా జన జీవన స్రవంతితో అనుసంధానమవుతుంది. ఆరు నెలల కాలంలో దాదాపు ఐదు వందలకు పైగా ఉత్తరాలు బట్వాడా అవుతాయంటే గొప్ప విషయమే. మారుమూల గ్రామాలకు కూడా మొబైల్ ఫోన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత మామూలు పోస్టాఫీసుల్లో కూడా ఈ మాత్రపు బట్వాడా ఉండడం లేదు. ఇక్కడ మరో సంగతి ఏమిటంటే... ఈ హిక్కిమ్ గ్రామంతోపాటు పరిసర గ్రామాలకు కూడా బ్యాంకు లేకపోవడంతో సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలు కూడా ఈ పోస్టాఫీస్ ద్వారానే జరుగుతున్నాయి.
శీతాజలం...
నిజానికి హిమాచల్ ప్రదేశ్ పర్యటన అనగానే సిమ్లా తొలిస్థానంలో ఉండేది. అది ఒకప్పుడు. సిమ్లా క్రేజ్ తగ్గిపోయిన తర్వాత కులు, మనాలి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆహ్లాదకరమైన పర్యటన కోరుకునే మధ్య వయసు వాళ్లకు అది చక్కటి వెకేషన్ పాయింట్. అడ్వెంచర్ లేని టూర్ మహాబోర్ అనుకునే యువతకు స్పితి లోయ ఒక సాహసాల లోగిలి. స్పితి లోయకు వెళ్లడానికి కులు లోయ నుంచి దారి ఉంటుంది. స్పితిలోయకు వెళ్లే దారిలో రొహటాంగ్ పాస్ దాటిన తర్వాత ఒక పక్కగా కుంజుమ్ కనుమ కనిపిస్తుంది. శీతాకాలంలో మంచు కప్పి ఉంటుంది. ఎండలు మొదలయ్యేసరికి ఆ మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. ఈ ప్రవాహం చేరే పల్లపు ప్రదేశమే స్పితి లోయ. స్పితి అంటే మధ్యనున్న నేల అని అర్థం. టిబెట్ పొలిమేర ఇది. బౌద్దానికి అచ్చి వచ్చిన నేల. హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్ ఈ స్పితి జిల్లాలోనే ఉంది. స్పితికి హిక్కిమ్‌కు మధ్య దూరం పద్దెనిమిది కిలోమీటర్లు. ఈ పర్యటనలో బౌద్ధ భిక్షువులు కనిపిస్తారు. తెల్లటి మంచు మధ్య కొండవాలులో ఎర్రటి దుస్తులు ధరించి మౌనంగా వెళ్తుంటారు.
ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం!
హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రదేశాలకు టూర్ వెళ్లేటప్పుడు మరికొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పితి వ్యాలీ టూర్‌కి అనుమతి తప్పనిసరి. ఇది ఇండో–చైనా సరిహద్దు కావడంతో ఈ జాగ్రత్తలన్నీ. సిమ్లా, మనాలి, కులూ, రాంపూర్, కాజా, రేకాంగ్ పీయో వంటి చోట్ల ప్రభుత్వ అధికారులు ఈ అనుమతి జారీ చేస్తారు. ఇందుకోసం పాస్‌పోర్టు ఒరిజినల్‌తోపాటు ఒక ఫొటోకాపీ, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని వెళ్లాలి. టూర్ ప్లాన్ వివరాలు (ఎన్ని రోజుల పర్యటన, పర్యటనలో ఏయే ప్రదేశాలున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు వంటివి) తెలియచేయాలి. టిక్కెట్‌లు, బస కోసం బుక్ చేసుకున్న హోటల్ వివరాలు చూపించాలి. వీటిని పరిశీలించిన తరవాత అనుమతి పత్రం మీద స్టాంప్ వేసి ఇస్తారు. ఇది రెండు వారాలకు మాత్రమే. ఒకవేళ టూర్ మరికొన్ని రోజులు పొడిగించాల్సిన అవసరం ఏర్పడితే కారణాలను తెలియచేస్తూ మరో అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment