ఆదిలాబాద్: నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్, ఈ–మెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. ఐదు దశాబ్దాల ముందుకు వెళ్తే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం లేఖల ద్వారానే జరిగాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారాన్ని ఉత్తరం, టెలిఫోన్, టెలిగ్రామ్ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉండేది.
సెల్‌ఫోన్ వినియోగం.. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడకం తర్వాత సమాచార వ్యవస్థలో విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. నేటి తరానికి ఇంచుమించుగా ఉత్తరం అంటే తెలియని పరిస్థితి ఉంది. అందుకే ఉత్తరాన్ని తిరిగి పరిచయం చేసేందుకు, తెలిసిన వారికి మరోసారి గుర్తు చేసేందుకు తపాలాశాఖ నడుం బిగించింది. లేఖరులకు పోటీ పెడుతోంది.
‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియజేయాలన్నా, వ్యాపార అవసరాల ని మిత్తం సమాచారం పంపించాలన్నా ఒకప్పుడు పె న్ను, పేపరు తీసుకుని లేఖలు రాసేవారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కానరాదు. మొబైల్ ఫోన్ ద్వారా స మస్త సమాచారాన్ని క్షణాల్లో వివిధ మార్గాల్లో చేరవేస్తున్నారు.
ఫోన్‌లోనే ప్రత్యక్షంగా వాయిస్ కాల్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఖండాంతరాల్లో ఉన్న వారితో సైతం వీడియో కాల్ ద్వారా మాట్లాడే పరిస్థితి ఉండడంతో లేఖల ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఒకప్పటి సమాచార సాధనమైన ఉత్తరాన్ని నేటి యువతరానికి గుర్తు చేసేందుకు తపాలా శాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘థాయి ఆఖర్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది.
బహుమతులు ఇలా..
రెండు కేటగిరీల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 12 మందికి మించకుండా ప్రథమ రూ.25 వేలు, ద్వితీయ రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందజేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సదవకాశం. వయసుతో పనిలేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్ట్ చేయాలి. – ఎన్.అనిల్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా శాఖ పర్యవేక్షకులు
రెండు విభాగాల్లో..
ఈ పోటీల్లో భారతదేశ పౌరులు పాల్గొనవచ్చు. 18 ఏళ్ల లోపు వారికి ఒక కేటగిరీ, ఆపై వారిని మరో కేటగిరీగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చారు. ఎ4 సైజ్ పేపరుపై రాసి ఎన్వలప్ కవర్‌లో పంపించవచ్చు.
ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్ల్యాండ్ లెటర్ అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. వ్యాసం చేతితో మాత్రమే రాసి పంపించాలి. లేఖలు పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయస్సు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ఎస్‌పీవోఎస్, ఆదిలాబాద్ డివిజన్ చిరునామాకు అక్టోబరు 31లోగా పంపించాలి.
Comments
Please login to add a commentAdd a comment