
వాషింగ్టన్: అమెరికా మోజు తగ్గుతోందా? ఈ ప్రశ్నకు అమెరికా పర్యాటకశాఖ మాత్రం అవుననే చెబుతోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య గత ఆరు నెలల్లో 13 శాతం తగ్గిందట. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి నుంచి జూన్ వరకు ప్రయాణికుల సంఖ్య 12.9 శాతం తగ్గింది. ఈ ఆరు నెలల్లో చివరి మూడు నెలలు.. అంటే ఏప్రిల్, మే, జూన్‌లో 18.3 శాతం తగ్గుదల నమోదైంది.
‘2017 తొలి త్రైమాసికంలో తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై అమెరికా అంత తీవ్రమైన ఆంక్షలు అమలు చేయలేదు. అయితే రెండో త్రైమాసికంలో మాత్రం కఠినమైన ఆంక్షలు విధించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అమెరికా విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న మార్పులే ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణమ’ని బ్రాండ్ యూఎస్‌ఏ ప్రెసిడెంట్, సీఈవో క్రిస్ థాంప్సన్ అన్నారు. భారత్‌లో పెరుగుతున్న మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణమై ఉండవచ్చని థాంప్సన్ అభిప్రాయపడ్డారు.