దుబాయ్‌ టూర్‌: అది అరబిక్‌ కడలందం.. | Dubai Tour: Top Tourist Attractions | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ టూర్‌: అది అరబిక్‌ కడలందం..

Published Sun, Feb 21 2021 10:45 AM | Last Updated on Sun, Feb 21 2021 2:26 PM

Dubai Tour: Top Tourist Attractions - Sakshi

ఇసుక దిబ్బలు.. ఉప్పు ఊట ప్రకృతి నిర్దేశించిన ప్రాంతం..
అదే ఉప్పు ఊట తీరంలో.. అవే ఇసుక దిబ్బల మీద
ఆకాశ హార్మ్యాలు, నోరెళ్లబెట్టే ఆశ్చర్యాలతో ఆ ప్రాంతం  మానవ మేధస్సు మలచిన పర్యాటక దేశం అయింది!
అందుకే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చరిత్రలో రాసుంటుంది ‘ది వర్డ్‌ ఇంపాజిబుల్‌ ఈజ్‌ నో వేర్‌ ఇన్‌ ది వొకాబులరీ ఆఫ్‌ ది యూఏఈ’ అని.
గాడ్‌ మేడ్‌ వరల్డ్‌ .. మ్యాన్‌ మేడ్‌ డెన్మార్క్‌ అనే నానుడి వచ్చింది కాని దుబాయ్‌ను చూస్తే డెన్మార్క్‌ సరసన దుబాయ్‌నీ కలుపుకోవచ్చు. కళ్లు మూసి తెరిచేలోగా అభివృద్ధి అనే మాటకు ప్రాక్టికల్‌ రూపంగా చూడొచ్చు దుబాయ్‌ని. 

సాంకేతికత పునాదిగా.. లేబర్‌ క్యాంపుల స్వేదం గోడలుగా నిలబడ్డ అద్భుతం. అది అరబిక్‌ కడలందం.. చూసి.. అనుభూతిని పదిలపరచుకోవాల్సిందే. అభివృద్ధి సరే.. షాపింగ్‌ మాల్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్క్స్‌ లేని ఒరిజినల్‌ దుబాయ్‌ ఎలా ఉంటుందో.. చూడాలన్న ఆశతో విమానం ఎక్కాను. దుబాయ్‌ చూడ్డానికి చలికాలం మంచి కాలం. టూరిస్ట్‌ సీజన్‌ కూడా. అన్నిరకాల సందళ్లతో దుబాయ్‌ ఫెస్టివల్‌గా అలరారుతుంది. అలా ఈ కరోనా టైమ్‌లో కూడా  టూరిస్ట్‌లకు విమాన టికెట్లను కట్‌ చేసి గేట్లు తెరిచింది ఆ దేశం.  అయితే కరోనా నిరోధక జాగ్రత్తలతో. ఇండియా నుంచి బయలుదేరే 72 గంటల ముందు కరోనా పరీక్ష చేసుకున్నా సరే.. దుబాయ్‌ విమానాశ్రయంలో దిగిన వెంటనే మళ్లీ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే.

విహారంలోనూ అడుగడుగునా ఆ జాగ్రత్తలు పాటించాల్సిందే. మాస్క్‌ లేకపోయినా.. భౌతిక దూరం పాటించకపోయినా మూడువేల దిర్హామ్స్‌ జరిమానా కట్టాల్సిందే. రోడ్ల మీద రెండు మీటర్లకో సర్కిల్‌ కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి పదీ ముప్పై అయిదు నిమిషాలకు బయలుదేరి దుబాయ్‌లో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీ కోవిడ్‌ టెస్ట్, పెయిడ్‌ కోవిడ్‌ రెండింటి సౌకర్యమూ ఉంది. పెయిడ్‌ టెస్ట్‌ చేయించుకొని గంటలో బయటపడ్డాం. కాని ఫలితాలు వెలువడే దాకా హోటల్‌ గది దాటే వీల్లేదు.  ఎకానమీ బడ్జెట్‌లో ఫైవ్‌ స్టార్‌ సేవలందిస్తున్న రోవ్‌ హోటల్‌లో మా బస. పన్నెండు గంటల్లోపు అంటే తెల్లవారి ఉదయం మూడు గంటలకు నెగటివ్‌ అని, హ్యాపీగా దుబాయ్‌ని చుట్టిరావచ్చనే రిపోర్ట్‌ అందింది.  మొత్తం నాలుగు రోజుల టూర్‌ అది. 

దుబాయ్‌ ఆత్మ దుబాయ్‌ ఫ్రేమ్‌
దుబాయ్‌ అనగానే బుర్జ్‌ ఖలీఫానే గుర్తు చేస్తుంది మెదడు. దుబాయ్‌ ఫ్రేమ్‌ని చూసేంత వరకు నేనూ బుర్జ్‌ ఖలీఫానే దుబాయ్‌ ఐడెంటిటీగా భావించాను. కాని ఫ్రేమ్‌ని చూశాక.. బుర్జ్‌ ఖలీఫా కేవలం టూరిస్ట్‌ అట్రాక్షన్‌ మాత్రమే అనిపించింది. ఎందుకంటే దుబాయ్‌ ఫ్రేమ్‌ దుబాయ్‌ ఆత్మ. ఆ నిర్మాణం అచ్చెరువొందే అద్భుతమే. దీర్ఘచతురస్రాకారంలో నిలువుగా ఉంటుందీ కట్టడం. 93 మీటర్ల వెడల్పు, 152 మీటర్ల పొడవున్న  (అంటే ఇంచుమించు 50 అంతస్తుల ఎత్తు అన్నమాట) రెండు టవర్లను ఆ ఎత్తులోనే కలుపుతూ వంద చదరపు మీటర్ల వంతెనతో నిర్మాణమైన దుబాయ్‌ ఫ్రేమ్‌ దుబాయ్‌ చరిత్ర, వర్తమానం, భవిష్యత్‌కు ప్రతీక. ఆ ఫ్రేమ్‌ గడప భాగంలో దుబాయ్‌ గతాన్ని చూపే గ్యాలరీ ఉంటుంది. వాళ్ల జీవన శైలి, ఉపాధి, వర్తక వాణిజ్యాలు, వాడిన పనిముట్లు, పాత్రలు, దుస్తులు, ఆయుధాలు వంటివన్నీ అందులో చూడొచ్చు.. డిజిటల్‌ డిస్‌ప్లేలో.  దీన్ని సందర్శించాక లిఫ్ట్‌లో స్కై డెక్‌ తీసుకెళ్లారు. మొత్తం దుబాయ్‌ని చూపించే అంతస్తు.

రెండు టవర్లను కలిపే వంతెనే ఆ స్కై డెక్‌. ఆ వంతెన పై నుంచి ఉత్తరం దిక్కు చూస్తే పాత దుబాయ్‌ అంతా దర్శనమిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయిల్‌ నిక్షేపాలను కనుగొనకముందున్న దుబాయ్‌.. సముద్రంలో ముత్యాలు, చేపల వేట వృత్తులుగా ఉన్న ప్రాంతం, దుకాణాలు, పరిశ్రమలు, ఇళ్లు, ఓ మోస్తరు మిద్దెలు, మేడలు, క్రీక్‌.. కనిపిస్తాయి.. 360 డిగ్రీల కోణంలో. దక్షిణం వైపు.. అదే 360 డిగ్రీల కోణంలో నవీన దుబాయ్‌ గ్లామర్, నిలువెత్తు ప్రగతి, ఠీవి కళ్లకు కడుతుంది. మధ్యలో గ్లాస్‌ వాక్‌వే ఉంటుంది. అంటే నడిచేదారి.. కిందికి చూస్తే పాత, కొత్త దుబాయ్‌ అంతా 360 డిగ్రీల కోణంలో మనల్ని వెంబడిస్తుంది. ఈ స్కై డెక్‌లో వర్తమాన దుబాయ్‌ పూర్వాపరాలన్నీ ఉంటాయి.

ఇందులో దుబాయ్‌లో తొలిసారి ల్యాండ్‌ అయిన విమానం ‘ఎయిర్‌ ఇండియా’ అనీ,  1959 వరకు మన కరెన్సీ అక్కడ చలామణీలో ఉందన్న విషయాలూ తెలిశాయక్కడ.  లిఫ్ట్‌లో కిందికి వెళ్లాక దుబాయ్‌ ఫ్యూచర్‌ గ్యాలరీ ఉంటుంది. వైద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక రంగాల్లో అది సాధించబోయే అధునాతన అభివృద్ధికి సంబంధించిన నమూనాను చూపించే గ్యాలరీ అది. అక్కడే గాజు గోడలకు ఆనుకొని దుబాయ్‌ ఫ్రేమ్‌ నిర్మాణాన్ని వివరించే సమాచారమూ ఉంటుంది.  ఈ ఫ్రేమ్‌   అమెరికాలోని స్ట్యాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కన్నా హైట్, సెయింట్‌ లూయిస్‌లోని గేట్‌ వే ఆర్చ్‌ కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌కి దాదాపు సగం ఉంటుంది. 2018 నుంచి సందర్శనకు సిద్ధమైంది. ప్రతి రోజు 200 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుంది అదీ 20 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా. టికెట్స్‌ను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలి.  

సాయంకాలం.. జుమేరా బీచ్‌
జుమేరా.. దుబాయ్‌లోని ధనిక వర్గం ఉండే తీర ప్రాంతం. చక్కటి విహార స్థలం. చిల్‌ ఈవినింగ్స్‌ను గడపాలనుకునే యూత్‌  మెచ్చే హ్యాంగవుట్‌ ప్లేస్‌. ఇండియన్, చైనీస్, థాయ్, జపనీస్, ఇటాలియన్, మెక్సికన్‌.. ఎన్నని చెప్తాం.. ప్రపంచంలోని అన్ని రుచులతో క్యుజైన్స్‌  ఘుమఘుమలాడుతుంటాయి. భారతీయ వంటకాలకు సంబంధించి ఇక్కడ బాంబే బంగ్లా ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్‌ సెటప్‌ కూడా భారతీయ కోటను పోలి ఉంటుంది. ప్రతిరోజు ఆకాశంలో డ్రోన్స్‌ షో ఉంటుంది. షాపింగ్‌ ప్రియులకు ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌ ఉంటాయి. విందువినోదాలతో  జుమేరా బీచ్‌లో సాయంకాలాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు. 

దుబాయ్‌ సూక్‌...
ఎప్పుడెప్పుడు చూడాలా అని నేను ఆత్రుత పడ్డ ప్రాంతం.. ఒరిజినల్‌ దుబాయ్‌.. దుబాయ్‌ సూక్, బర్‌ దుబాయ్‌ను చూసే వేళ రానే వచ్చింది.. రెండో రోజున. సూక్‌ అంటే అరబ్బీలో అంగడి అని అర్థం. దుబాయ్‌లోని దిగువ, మధ్యతరగతికి అనువైన, అనుకూలమైన షాపింగ్‌ సెంటర్‌. వాకింగ్‌ టూర్‌గా సాగింది ఆ సందర్శన. దుబాయ్‌లో పెరిగి, అక్కడే ఉంటున్న హైదరాబాదీ వనిత ఫరీదా అహ్మద్‌ గైడ్‌గా వ్యవహరించింది. ముందుగా సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్మే ‘స్పైస్‌ సూక్‌’ నుంచి మా వాకింగ్‌ టూర్‌ ప్రారంభమైంది. ఇరుకు రోడ్లు.. వాటికి వారగా రెండు వైపుల సంప్రదాయ దుకాణాల సముదాయంతో హైదరాబాద్‌లోని బేగం బజార్, సికింద్రాబాద్‌లోని జనరల్‌ బజార్‌ను గుర్తుకు తెస్తుంది దుబాయ్‌ సూక్‌. ఇరాన్, ఇండియా నుంచి వచ్చిన కుంకుమపువ్వు మొదలు అన్నిరకాల సుగంధ ద్రవ్యాలతో కొలువు తీరి ఉన్న ఆ అంగడిని చూసుకుంటూ దుబాయ్‌ స్పెషల్‌ అయిన అండా పరోటా, దుబాయ్‌ శాండ్‌విచ్‌.. ఖడక్‌ చాయ్‌ అమ్మే ఒక టీస్టాల్‌  ముందుకు వచ్చాం. దాన్ని నడిపిస్తున్నది ఒక మలయాళీ. వాటి రుచి చూడాల్సిందే అని పట్టుబట్టింది ఫరీదా.

ఆర్డర్‌ ఇచ్చి.. అక్కడే .. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం మధ్యలో గుండ్రంగా వేసి ఉన్న బెంచీల దగ్గరకు వచ్చాం. ఆ హోల్‌సేల్‌ మార్కెట్లో సరుకులు మోసే కూలీలు సేద తీరడానికి ఏర్పాటు చేసిందా సీటింగ్‌ ఏరియా. అంత బిజీ ఏరియాలోనూ ప్రశాంతంగా అనిపించింది. ఈలోపు అండా పరాఠా (ఆమ్లెట్‌ పరాఠా), దుబాయ్‌ శాండ్‌విచెస్‌ విత్‌ డాకూస్‌ సాస్‌ రానే వచ్చాయి. ఫరీదా చెప్పింది వినకపోయి ఉంటే ఒక మంచి రుచిని మిస్‌ అయ్యేవాళ్లం. అక్కడున్న అందరికీ  అండా పరాఠా రుచి తొలి పరిచయమే. దుబాయ్‌ శాండ్‌ విచెస్‌ కూడా... అందులో ఒమన్‌ నుంచి వచ్చిన చిప్స్‌ ప్రత్యేకం. అన్నిటికన్నా ముఖ్యం.. తప్పకుండా ప్రస్తావించాల్సిన టేస్ట్‌ డాకూస్‌ సాస్‌. కువైట్‌ టమాటా సాస్‌ అది. కారంగా కాకుండా.. తీపిగా కాకుండా.. జిహ్వ పదేపదే కోరుకునే రుచి అది. తర్వాత చెప్పుకోవాల్సింది ఖడక్‌ చాయ్‌.. దుబాయ్‌ స్పెషల్‌ చాయ్‌. వేడివేడి ఖడక్‌ చాయ్‌ పెదవులు దాటి.. నాలుక మీద నుంచి గొంతులోకి జారిందంటే చాలు.. ఒక్క సిప్‌కే ఉన్న చికాకులు.. వేధించే తలనొప్పి గాయబ్‌. కప్‌లో  చాయ్‌  ఖలాస్‌ అయ్యేలోపు ఉత్సాహం వెంటపడుతుంది. అతిశయోక్తి కాదు అనుభవం. ఆ ఉత్సాహం వెంటరాగా మా నడకసాగింది. సుగంధ ద్రవ్యాలతో తయారైన ఔషధాలు, తలనూనెలు, కీళ్ల నొప్పుల ఆయిల్స్‌ అమ్మే దుకాణాలు అన్నిటినీ దాటుకొని అవతలి ఒడ్డున ఉన్న బర్‌ దుబాయ్‌  సూక్‌ మార్కెట్‌ను చూడ్డానికి తీసుకెళ్లే స్టీమర్లున్న తీరానికి చేరుకుని మోటార్‌ బోట్‌ ఎక్కాం. 

శివాలయం.. గ్రాండ్‌ మాస్క్‌ 
స్పైస్‌ సూక్‌కి ఆవల తీరం బనియా సూక్‌తో మొదలవుతుంది. బనియా సూక్‌ అంతా బట్టల దుకాణాల సముదాయం. ప్రపంచ పటంలో దుబాయ్‌ అస్తిత్వం కనిపించగానే పాకిస్తానీయులు చాలా మంది దుస్తుల వర్తకం కోసం దుబాయ్‌ చేరారు. ఆ అమ్మక ప్రాంతమే బనియా సూక్‌. అలా ఆ షాప్‌ల వెంట వెళుతుంటే ఆ గల్లీల్లో తులసి దళాల వాసన, గులాబీ, మందార, కనకాంబరం, చామంతి, బంతులు విరిసిన పూల మొక్కలు పలకరించాయి ఒక్కసారిగా. అరే.. అని అచ్చెరువొందేలోపే వాటిని ఆనుకొని ఉన్న కాశీదారాలు, హారతి కర్పూరాలు, వత్తులు, దీపపు కుందులు, పుట్నాల పప్పు ప్రసాదాలు విక్రయించే దుకాణాలూ .. విశాలమైన ప్రాంగణం.. క్యూ కోసం కట్టిన బారికేడ్లు..కనిపించాయి.

ప్రశ్నార్థకంగా గైడ్‌ వైపు చూస్తే నవ్వుతూ ఆమె గోపురంలాంటి గుండ్రటి ఆకారాన్ని చూపించింది. ‘గుడా?’ అనే ఎక్స్‌ప్రెషన్‌ని పాస్‌ చేసేలోపే ‘శివాలయం’ అంది. శివరాత్రి రోజు బ్రహ్మాండమైన వేడుక జరుగుతుందట.  ఆ ఆవరణను ఆనుకునే మస్‌జిద్‌ ఉంటుంది.. అదే ‘గ్రాండ్‌ మాస్క్‌’. ‘‘మస్‌జిద్‌ను ఆనుకునే ఈ గుడి ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని కాని, ఇంత చిన్న అసహనాన్ని కాని నేను చూడలేదు, వినలేదు. ఎవరి ప్రార్థనలు వాళ్లు చేసుకుంటారు, వెళ్లిపోతారు. ఒకరికొకరు కనీసం డిస్టర్బెన్స్‌ కూడా ఫీలయిన సందర్భం లేదు’ అని తన అనుభవాన్ని చెప్పింది ఫరీదా. ఒక మంచి భావనను మనసునిండా నింపుకుంటూ ముందుకు నడిచాం. 

అరేబియన్‌ టీ హౌస్‌..
శివాలయం, గ్రాండ్‌ మాస్క్‌ దాటి ఎడమవైపు తిరిగి... కాస్త ముందుకు వెళితే మరో ఆపాత మధురాన్ని పదిలపరచుకుంటున్న దృశ్యం సాక్షాత్కరిస్తుంది. అదే అరేబియన్‌ టీ హౌసెస్‌ ఉన్న ఏరియా. దుబాయ్‌ కొత్త అభివృద్ధిలో ఆ ప్రాంతపు అసలైన జీవనశైలి, అలవాట్లు కొట్టుకుపోకుండా కాపాడుకునే ప్రయత్నమే ఆ వీధి. చాయ్, కాఫీల తయారీలో దుబాయ్‌ది భిన్నమైన రుచి... సేవనంలో వైవిధ్యమైన అభిరుచి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేని కాలంలో ఆ ఎడారి ఉష్ణోగ్రతను, వడగాల్పుల ధాటిని తట్టుకునేలా ఆనాటి ఇంటి నిర్మాణాలు ఎలా ఉండేవో అచ్చంగా ఆ ఇళ్లనే కట్టి.. వాకిట్లో గద్దెలు (పరుపులు), పిల్లోలు వేసి.. మధ్యలో టీ కెటిల్, కప్పులు పెట్టి తేనీటిని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు నేటివ్‌ మెమొరీస్‌ను తాజాపరచుకుంటున్నారు ‘అరేబియన్‌ టీ హౌస్‌’పేరుతో. ఆ స్ట్రీట్‌కి ఆనుకొని ఉన్న రోడ్డు దాటి ముందుకు సాగితే.. కూడలిలో ఓ పడవ (నమూనా) కనిపిస్తుంది. మిగిలిన ప్రపంచంతో దుబాయ్‌ని అనుసంధానించిన ఆ దేశపు తొలి పడవ ప్రయాణానికి ప్రతీకలా. 

అయితే ఇక్కడ ఒకటి ప్రస్తావించుకోవాలి. పూర్వ దుబాయ్‌ వాసులకు పడవ తయారు చేయడం తెలియదు. వాళ్లకు ఆ విద్య నేర్పింది  ఎవరో తెలుసా? మలయాళీలు. దుబాయ్‌ వాసులు కేరళ వచ్చి వాళ్ల దగ్గర పడవ తయారీ నేర్చుకున్నారు. బదులుగా వాళ్లొచ్చి దుబాయ్‌లో వ్యాపారం చేసుకునే ఒప్పందాన్నీ కుదుర్చుకున్నారు. నేటికీ దుబాయ్‌ అరబ్బులకు కేరళీయులంటే అపారమైన అభిమానం, గౌరవం. ఇంకా చెప్పాలంటే ఇండియా అంటే మొదటగా వాళ్లకు గుర్తొచ్చేది కేరళనే. అడుగడుగునా మలయాళీలు కనిపిస్తారు అన్నిరకాల పనులు, బాధ్యతల్లో. కాని ఆ కూడలిలో ఉన్న పడవ నమూనాను తయారు చేసింది మాత్రం చైనీయులట.  

వాకింగ్‌ కంటిన్యూ చేస్తే..
 కరీనా కపూర్‌ వంటి బాలీవుడ్‌ స్టార్ల కటౌట్‌లతో ఇండియన్‌ పార్టీ వేర్‌ షాపులు, మలబార్‌ గోల్డ్‌ వంటి గోల్డ్‌ షోరూమ్స్, ఆర్టిఫీషియల్‌ జ్యుయెలరీ దుకాణాలున్న మీనా బజార్, పానీ పూరీ, చాట్‌ భండార్‌లు, బిర్యానీ పాయింట్లు, కబాబ్‌ సెంటర్లు, మధ్యతరగతి (ఎక్కువగా భారతీయులు.. దాదాపు ప్రతి ఫ్లాట్‌ బాల్కనీలో తులసి మొక్కలు కనిపిస్తూంటాయి) రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లతో మినీ ఇండియా కనిపిస్తుంది. అక్కడ ‘అల్‌ ఉస్తాద్‌ స్పెషల్‌ కబాబ్‌’ చాలా ఫేమస్‌. ముఖ్యంగా ఇరానియన్‌ కబాబ్స్‌కి. ప్రపంచంలోని ఏ దేశం వాళ్లు దుబాయ్‌ వచ్చినా అల్‌ ఉస్తాద్‌ స్పెషల్‌ కబాబ్‌లో భోజనం చేయందే ఫ్లైట్‌ ఎక్కరు. మాంసాహార ప్రియుల జిహ్వచాపల్యానికి పర్‌ఫెక్ట్‌ అడ్రెస్‌. కుంకుమపువ్వుతో చికెన్, బోటీ చికెన్, చికెన్‌ కబాబ్స్, పుదీనా టీ కోసం ఇక్కడ క్యూ కడ్తారు. సల్మాన్‌ ఖాన్, షారూఖ్‌ ఖాన్, సంజయ్‌ దత్‌వంటి ఎందరో బాలీవుడ్‌ స్టార్లు కేవలం అల్‌ ఉస్తాద్‌ స్పెషల్‌ కబాబ్స్‌ టేస్ట్‌ చేయడానికే దుబాయ్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకుంటారటంటే ఆ మసాలా ఘాటుకెంత క్రేజో చూడండి!! అలా అల్‌ ఉస్తాద్‌ స్పెషల్‌ కబాబ్‌లో లంచ్‌తో మా దుబాయ్‌ సూక్‌ వాకింగ్‌ టూర్‌ ముగిసింది. 

గ్లోబల్‌ విలేజ్‌
ఆ సాయంకాలం గ్లోబల్‌ విలేజ్‌కు వెళ్లాం. దునియా మొత్తం దుబాయ్‌ ముంగిట్లో ఉందా అనిపించే ఉత్సవం అది. ప్రపంచాన్ని ఒక గ్రామంగా చూపించే ఎగ్జిబిషన్‌. 78 దేశాల సంస్కృతులు, రుచులు, అభిరుచులు, ప్రత్యేకతలు, ఉత్పత్తులు ఆయా దేశాల పెవిలియన్స్‌ (గుడారాలు)లో ఆకర్షిస్తుంటాయి. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు 159 రోజులు సాగే ఈ గ్లోబల్‌ విలేజ్‌కి ప్రతిరోజూ 45 వేల మంది సందర్శకులు హాజరవుతుంటారు. పదహారు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన 3 వేల అయిదు వందల షాపులు (రెస్టారెంట్స్‌ను కలుపుకొని), అడ్వెంచర్‌ గేమ్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్క్స్, మ్యూజియంలు, టీ కొట్లు, కెఫ్టీరియాలతోపాటు నాటకాలు, న్యత్యాలకు వేదికలూ కొలువుతీరి ఉన్నాయి. అయితే దేశాలకు ప్రాతినిధ్యం వహించే వాటిని దుకాణాలు అనకుండా పెవిలియన్స్‌ అంటారు. అలా అన్నిట్లోకి ఇండియాదే అతి పెద్ద పెవిలియన్‌. మన దేశానికి సంబంధించి 250 షాపులున్నాయక్కడ. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటిగంట దాకా ఉంటుంది. 92 దేశాలకు చెందిన పదివేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. 1997లో ప్రారంభమైన ఈ గ్లోబల్‌ విలేజ్‌కి 2021 సిల్వర్‌ జుబ్లీ ఇయర్‌. ఈ పాతికేళ్లలో ఒక్క ఏడు కూడా విరామం తీసుకోలేదు. 2020 కరోనా కాలంలోనూ నిర్వహించారు. ఎందుకంటే దుబాయ్‌లో ఏప్రిల్‌ తర్వాత కరోనా ప్రభావం కనపడింది అని చెప్పారు గ్లోబల్‌ విలేజ్‌ గైడ్‌. ప్రతి సోమవారం మహిళలు, ఫ్యామిలీ స్పెషల్‌గా ఉంటుందీ గ్లోబల్‌ విలేజ్‌. 

బాలీవుడ్‌ పార్క్స్‌..
మూడో రోజున బాలీవుడ్‌ పార్క్స్‌ మా విజిటింగ్‌ ప్లేస్‌ అయింది. హాలీవుడ్‌కు ‘యూనివర్సల్‌ స్టూడియో’ ఉంది. అలాంటి సినిమా ఫక్కీ వినోదాన్ని పంచే ప్రాంగణమేదీ బాలీవుడ్‌కు లేదు. అందుకే  దుబాయ్‌లో చోటు సంపాదించుకుంది ‘బాలీవుడ్‌ పార్క్స్‌’ పేరుతో. ఇది పూర్తిగా ఫ్యామిలీ డెస్టినేషన్‌. సినిమాటిక్‌ రైడ్స్, థ్రిల్లింగ్‌ అట్రాక్షన్స్, బాలీవుడ్‌ యాక్షన్, మ్యూజిక్, డాన్స్, డ్రామా, స్టాండప్‌ కామెడీ వంటి వినోదాత్మకమైన  లైవ్‌ షోస్‌ ఉంటాయిక్కడ. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్స్‌ డాన్, లగాన్, షోలే, జిందగీ నా మిలేగీ దొబారా, రావన్, క్రిష్‌ వంటి సినిమా పేర్లతో థియేటర్లున్నాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోస్‌ కోసం. అలాగే సంజయ్‌లీలా భన్సాలీ వంటి దర్శకుల సినిమాల సెట్టింగ్స్‌ను పోలిన కట్టడంతో రాజ్‌మహల్‌ అనే థియేటరూ ఉంది. మొత్తానికి చిన్న, పెద్ద అందరినీ అలరించే ఈ బాలీవుడ్‌ పార్క్స్‌ అచ్చంగా యూనివర్సల్‌ స్టూడియోను పోలి ఉంటుంది.

అల్‌ సీఫ్‌..
 ఆ సాయంకాలం అల్‌ సీఫ్‌కు వెళ్లాం. ఇదీ దుబాయ్‌ సూక్‌లాంటి నేటివిటీ షాపింగ్‌ ప్రాంతం. అరేబియా బ్యాక్‌వాటర్స్‌ ఒడ్డున పరుచుకొని ఉంటుంది. మట్టి గోడల ఇళ్లల్లో కొట్లను నిర్వహిస్తుంటారు. విహరిస్తూ ఉంటే చిన్నప్పుడు చదువుకున్న అరేబియా కథల్లోని ఇళ్లు, ఆ సంస్కృతి స్ఫురణకు వస్తూంటాయి. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్న అల్‌ ఫనార్‌ రెస్టారెంట్‌లో డిన్నర్‌ ముగించాం. ఎక్కడికి వెళ్లినా దుబాయ్‌ ఖడక్‌ చాయ్‌ను సేవించాల్సిందే. 

బుర్జ్‌ ఖలీఫా... దుబాయ్‌ మాల్‌
ఈ రెండిటితోనే మోడర్న్‌ దుబాయ్‌ ప్రసిద్ధి అని వేరేగా చెప్పక్కర్లేదు. బుర్జ్‌ ఖలీఫా... ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం. రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్, షాప్స్, హోటల్స్‌ ఉన్న ఆకాశహర్మ్యం అది. దీంట్లో కూడా మొదటి అంతస్తులో ఆ కట్టడం గురించిన వివరా లుంటాయి. బుర్జ్‌ ఖలీఫా స్కై (148వ అంతస్తు) వరకూ వెళ్లాం. ఆ బాల్కనీలో కూర్చొని కింద కనిపిస్తున్న దుబాయ్‌ను చూస్తూ టీ, కాఫీ తాగడం ఒక అనుభూతి. దుబాయ్‌ మాల్‌ కాంప్లెక్స్‌ నుంచే బుర్జ్‌ ఖలీఫాకు ప్రవేశం ఉంటుంది. అక్కడ ఫుడ్‌ కోర్ట్‌ ప్రాంగణంలోనే ఉంటుంది బుర్జ్‌ ఖలీఫా టికెట్‌ కౌంటర్‌. దుబాయ్‌ మాల్‌ విషయానికి వస్తే.. అదొక సముద్రం. సముద్రం అంటే గుర్తొచ్చింది.. ఆ మాల్‌లో ఆక్వేరియం ఒక అట్రాక్షన్‌. ప్రపంచంలోని ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ అన్నీ ఆ మాల్‌లో దొరుకుతాయి.

బట్టలు, బొమ్మలు, వరల్డ్‌ ది బెస్ట్‌ కాస్మోటిక్స్‌ మొదలు ఎలక్ట్రానిక్‌ గూడ్స్, టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్స్‌ దాకా .. ప్రతి ఒక్కటీ దుబాయ్‌ మాల్‌లో లభ్యం. డ్యూటీ ఫ్రీ కాబట్టి మిగిలిన చోట్లతో పోలిస్తే ధరా తక్కువే. బట్టలు, బొమ్మల కన్నా ఎలక్ట్రానిక్‌ గూడ్స్, పెర్‌ఫ్యూమ్స్, సన్‌గ్లాసెస్‌ అక్కడ తీసుకుంటే మంచిదని అక్కడ ఓ షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణీయుడి సూచన. అయితే బుర్జ్‌ ఖలీఫాలా దుబాయ్‌ మాల్‌ను ఒక గంటలో చుట్టిపెట్టలేం. కనీసం ఒక్కరోజు కచ్చితంగా కావాలి.. షాపింగ్‌ చేసినా.. చేయకుండా మాల్‌ అంతా చూడాలనుకున్నా. ఒకవేళ అంత సమయం వెచ్చించలేకపోతే ముందుగా దుబాయ్‌మాల్‌ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఏ అంతస్తులో ఏ మూల ఏ షాప్‌ ఉందో ఆ యాప్‌లో తెలుసుకొని జీపీఆర్‌ఎస్‌ సహాయంతో నేరుగా వెళ్లొచ్చు. నాలుగే అంతస్తులైనా.. వైశాల్యంలో పెద్దది. అందుకే యాప్‌ ఫోన్‌లో ఉంటే ప్రయాస ఉండదు. ఇదీ నా దుబాయ్‌ ప్రయాణం. 

నిలువెత్తు దుబాయ్‌ ప్రగతికి ప్లాన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌లలో.. రాళ్లు మోసిన కూలీలలో... శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కర్మచారుల్లో.. టూరిస్ట్‌లకు సేవలందిస్తున్న హాస్పిటాలిటీలో.. డాక్టర్లలో.. నర్సుల్లో.. టీ కాచి వేడివేడిగా అందిస్తున్న చాయ్‌వాలాల్లో.. రెస్టారెంట్లలో.. కూడళ్లల్లో.. ప్రతిచోటా భారతీయులున్నారు. దుబాయ్‌ పురోగతిలో ఉపాధి పొందుతూ.. దుబాయ్‌ పురోగతికి పాటుపడుతూ! 
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement