‘గంగా.. నేను మిమ్ముల మల్లా చూస్తనో లేదో.. ’ అంటూ ఏడ్చేస్తున్నాడు పోషన్న– ఇండియాలో ఉన్న తన భార్య గంగజలకు వీడియో కాల్ చేసి. ‘ఏ.. ఊకో.. గా జ్వరానికే గట్ల బేజారైతే ఎట్ల? ఏంగాదు’ భర్తకు ధైర్యం చెప్తోంది గంగజల. ‘లేదే.. కుడి షెయ్యి లేస్తలేదు.. చూష్నవ్ కదా.. ఏం మింగస్తలేదు.. మాట సూత సక్కగొస్త...’ అంటూండగానే అతని మాట పడిపోయింది. ఏదో చెప్పబోతున్నాడు.. గొంతు పెగలట్లేదు. దుఃఖం వస్తోంది అతనికి. ఏడుస్తున్నాడు. దుబాయ్‌లోని వర్కర్స్ క్యాంప్ గదిలో తన భర్త పడ్తున్న అవస్థ ఇండియాలో ఉన్న గంగజలకు భయం పుట్టించింది. అయితే ధైర్యం కోల్పోలేదు ఆమె. వెంటనే దుబాయ్‌లోనే ఉన్న గల్ఫ్ గ్రూప్ సేవా సమితి సభ్యులకు వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ గ్రూప్ ద్వారా పోషన్నకు పని ఇప్పించిన ‘స్టార్ సర్వీస్ ఎల్‌ఎల్‌సి’ సిబ్బంది మీద ఒత్తిడి పెట్టించింది. ‘పోషన్నను ఆసుపత్రిలో చేర్పించండి లేదంటే వీసా ఇప్పించి ఇండియాకైనా పంపించండి’ అని వొత్తిడి తెచ్చింది. తప్పించుకోలేక పోషన్నను ఆసుపత్రిలో చేర్పించారు ఆ ఉద్యోగనియామక ఏజెన్సీ సిబ్బంది.
దీనికి ముందు సంగతి
కొక్కెరకాని పోషన్న ఉరఫ్ కొక్కెని పోషన్న యేడాదిన్నర కిందట దుబాయ్‌కి వెళ్లాడు. వీసాకోసం స్థానిక సబ్ ఏజెంట్, జగిత్యాల్‌లో ఉన్న లైసెన్స్‌డ్ గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెంట్ (గల్ఫ్‌లో ఉపాధి చూపించేందుకు కేంద్రప్రభుత్వం ద్వారా అనుమతిపత్రం పొందిన ఏజెంట్)కి దాదాపు 70 వేల రూపాయలు చెల్లించాడు. స్టార్ సర్వీస్ ఎల్‌ఎల్‌సీ అనే దుబాయ్ ఏజెన్సీ ద్వారా అక్కడ పోషన్నకు పని ఇప్పించారు ఇక్కడి ఏజెంట్లు. ఇచ్చిన పని చేసుకుంటూ పోతున్న పోషన్నకు ఒకరోజు జ్వరంతో మొదలైన అనారోగ్యం పక్షవాతానికి దారితీసింది. తను పనిచేస్తున్న కంపెనీ తరపున పోషన్నకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆ సంస్థగాని, ఉద్యోగం చూపించిన ఏజెన్సీగాని పట్టించుకోలేదు. పోషన్నకు బీపీ ఎక్కువై, సరైన సమయంలో వైద్యం అందక కుడి చేయి అచేతనమైంది. ఆ తర్వాత మాటా పడిపోయింది.
బీమా లేకే
నిజానికి పోషన్నకు దొరికింది వర్క్ వీసా కాదు. విజిట్ వీసా. దీనివల్లే అక్కడ కంపెనీ అతనికి ఇన్సూరెన్స్, హెల్త్‌కార్డ్ రెండూ ఇవ్వలేదు. ఫలితంగా పోషన్న అనారోగ్యం పక్షవాతం దాకా పోయింది. దీనికంతటికీ కారకులు.. పోషన్నను దుబాయ్‌కి పంపిన ఏజెంట్లే. వాళ్లు అతనికి వర్క్ వీసా కాకుండా విజిట్ వీసా ఇవ్వడం వల్ల వలస కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ‘ప్రవాస భారతీయ బీమా’ పథకం వర్తించలేదు. రెండేళ్లకు కలిసి 325 రూపాయల ప్రీమియం చెల్లిస్తే వలస వెళ్లినచోట ఏదైనా ప్రమాదం జరిగినా, అంగవైకల్యం సంభవించినా పదిలక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. పోషన్నలా అనారోగ్యం కలిగితే లక్ష రూపాయలతోపాటు, స్వదేశం రావడానికి ఎయిర్ టికెట్టూ దొరుకుతుంది. ఈ విషయం పోషన్నకు, గంగ జలకు తెలియక చాలా నష్టపోయింది ఆ కుటుంబం. ఏజెంట్లు తమకు చేసిన అన్యాయం మీద కడుపు మండింది ఆమెకు.
పోరాటం షురూ
తన భర్తకు వీసా ఇప్పించిన ఏజెంట్‌ను నిలదీసింది గంగజల. ‘విజిట్ వీసాకు బీమా ఉండదు’ అని చెప్పాడు. ‘పనికోసం దరఖాస్తు పెట్టుకుంటే విజిటింగ్ వీసా ఎలా ఇచ్చారు?’ అని ప్రశ్నించింది. మోసానికి పాల్పడినందుకు బీమా కింద వచ్చే లక్షరూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది. ఈ విషయమై కలెక్టర్, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ (హైదరాబాద్, ఢిల్లీ)కూ దరఖాస్తు చేసుకుంది. విచారణకు ఆదేశమిచ్చారు జిల్లా కలెక్టర్. ఇది తెలిసి ఎంతోకొంత డబ్బిచ్చి పక్కకు తప్పుకోవాలనుకున్నాడు ఏజెంట్. ఒప్పుకోని గంగజల.. ‘ఇంటర్ వరకు చదువుకున్న నాకే మోసం జరిగితే అసలు అక్షరం ముక్క తెల్వకుండా గల్ఫ్‌కు పోతున్న ఎంతమందికి ఇంకెంత మోసం జర్గుతుండచ్చు? మా ఆయన మంచంల పడేదాకా ఈ పాలసీ గురించి తెల్వకపోయే. నా అసుంటోళ్లు ఇంకెంతమంది ఉన్నరో? గందుకే కొట్లాడుతున్నా. ఈ కొట్లాటతోని వేరోళ్లకన్నా తెలివస్తది.. తెలుసుకుంటరు. ఇందుకోసం అవసరమనుకుంటే ఢిల్లీకీ వోతా’ అంటోంది గంగజల. – సరస్వతి రమ
ఈ మోసం ఎంత కాలం?
జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, జైన గ్రామంలో ఉండే గంగజల ఇంటర్ చదివింది. ఆపై చదివించే స్థోమత లేని ఆమె కుటుంబం అప్పటికే దుబాయ్ వెళ్లొచ్చిన పోషన్నకు ఇచ్చి పెళి ్లచేసింది. పెళ్లయిన యేడాదిన్నరకే పిల్లాడు పుట్టాడు. పెళ్లి, భార్య డెలివరీకి అయిన అప్పులు, ఊర్లో పనీ దొరక్క మళ్లీ గల్ఫ్‌కు వెళ్లాలనుకున్నాడు పోషన్న. తన బంగారం అమ్మి లక్షాయాభైవేల రూపాయలు భర్తకు ఇచ్చింది గంగజల. ఇరాక్‌కు వీసా ఇప్పిస్తానని ఆ డబ్బు తీసుకున్న ఏజెంట్ పారిపోయాడు. కొన్నాళ్లాగి గల్ఫ్ కోసం మళ్లీ ప్రయత్నించిన పోషన్నకు ఈసారి దుబాయ్‌కి వీసా దొరకడంతో దుబాయ్‌కు వెళ్లాడు. ఈ రకమైన మోసానికి గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment