
గత కొంతకాలంగా దక్షిణాది సినిమాలకు అత్యంత విశ్వసనీయ నేస్తంగా వర్ధిల్లుతున్నాయి గల్ఫ్ దేశాలు.. ముఖ్యంగా దుబాయ్. మన అవార్డు ఫంక్షన్ల నుంచీ, సంగీత కార్యక్రమాలు, ఇతరత్రా ఈవెంట్స్ దాకా దుబాయ్‌తో భాయ్ భాయ్ అంటుంటారు దక్షిణాది చిత్ర ప్రముఖులు.. అందులోనూ మన తెలుగు సినీ ప్రముఖులు మరింత ముందుంటార ని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఏ వేడుకా లేకపోయినా, ఏ ముఖ్యమైన కార్యక్రమం లేకపోయినా కూడా టాలీవుడ్ స్టార్లు తరచుగా దుబాయ్‌కి రాకపోకలు సాగిస్తుండడం కనిపిస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.
(చదవండి: వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?)
చీమ చిటుక్కు మంటే చాలు చిటికెలో దాన్ని బయటకు తెచ్చేసి చీల్చి చెండాడేసే ఈ సోషల్ మీడియా యుగంలో... రహస్యాల్ని కాపాడుకోవడానికి తెరమీద వీరోచితంగా పోరాటాలు చేసే హీరోలు...తెరవెనుక మాత్రం ఛలో దుబాయ్ అంటున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది.
వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, తెలుగు టాప్ స్టార్లు, డైరెక్టర్లు ఇప్పుడు అరబ్ దేశాలను తాము ఇష్టపడే సమావేశ గమ్యస్థానాలుగా మార్చుకుంటున్నారని అర్ధమవుతోంది. దీనికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఇటీవల, టాలీవుడ టాప్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు సుకుమార్ లు అబుదాబిలో చక్కర్లు కొడుతూ కనిపించారు, వారి తదుపరి చిత్రం గురించి చర్చించడానికే వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారని సమాచారం. రంగస్థలం తో భారీ విజయాన్ని నమోదు చేసిన వీరి కాంబినేషన్, ఆధునిక టచ్‌తో కూడిన యాక్షన్–ప్యాక్డ్ చిత్రం కోసం మళ్లీ చేతులు కలిపింది.
(చదవండి: సల్మాన్ కొత్త సినిమాకు ఘోరమైన పరిస్థితి!)
మరోవైపు టాప్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా దుబాయ్‌లో ప్రఖ్యాత తమిళ దర్శకుడు అట్లీతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే బన్నీ తదుపరి చిత్రంపై రకరకాల అంచనాలు , పుకార్లు షికారు చేస్తుండగా, వాటికి ఊతమివ్వడం ఇష్టం లేకే బన్నీ, అట్లీలు కూడా గల్ఫ్ బాట పట్టి ఉంటారని అంటున్నారు.
‘ఈ తారలు మీడియా హడావిడి, తొంగి చూడడాలు లేకుండా వారితో సహకరించడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమ పెద్దల జోక్యం లేకుండా చర్చలు జరపడానికి తగిన గోప్యతను కోరుకుంటారు‘ అని ఒక నిర్మాత తెలిపారు. అకాల లీక్‌లు తరచుగా వాస్తవాలను ఇష్టారాజ్యంగా వక్రీకరిస్తాయని ఆ నిర్మాత వివరిస్తున్నారు.
‘ప్రత్యర్థి నిర్మాతలు కొన్నిసార్లు మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం, సగం వండిన సమాచారాన్ని అందజేస్తారు, ఇది అనవసరమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ఒక ప్రాజెక్ట్ పాన్–ఇండియా చిత్రం అని చెప్పవచ్చు, మరొక దాంట్లో అల్లు అర్జున్ తో స్క్రీన్ ను పంచుకోనున్నారంటూ ఎవరెవరో తారలను సూచిస్తుంది, ఇది చిత్రాన్ని రూపొందించే రూపకర్తల వాస్తవ ప్రణాళికల చుట్టూ గందరగోళాన్ని సృష్టిస్తుంది.
‘హైదరాబాద్, ముంబై చెన్నై లు ఫొటో/ వీడియోగ్రాఫర్లతో నిండిపోవడంతో, తెలుగు తారలు అధికారిక ప్రకటనలు చేయడానికి ముందుగా, ప్రాజెక్ట్‌లను ఖరారు చేయడానికి తెలివిగా తగిన ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో, ఒక్క ఎయిర్‌పోర్ట్‌ను చూసినా లేదా లీక్ అయిన ఇమేజ్ అయినా కూడా విపరీతమైన పుకార్లు నిరాధారమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ‘తరచుగా, ఈ నివేదికలలో ఎటువంటి నిజం ఉండదు,‘ అని ఆ నిర్మాత విశ్లేషించారు.