
ఇది వేసవి సూర్యుడు ప్రచండ భానుడై ప్రతాపం చూపే సమయం. దాంతో జనమంతా చల్లని పానీయాలకు జై కొట్టే సమయం. సాధారణంగానే కూల్ డ్రింక్స్ అమ్మకాలు పీక్స్‌లో ఉండే ఈ టైమ్‌లో అత్యధిక వ్యాపారాన్ని దక్కించుకోవాలని కోలా బ్రాండ్స్ తహతహలాడుతాయి. రకరకాల ప్రకటనల ద్వారా దాహార్తి నిండిన గొంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. దాంతో ఈ సీజన్ ఆసాంతం ప్రకటనల ‘కోలా’హలంతో నిండిపోతుంది.
వేసవి వచ్చినప్పుడల్లా కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ మధ్య ఆధిపత్య పోరు ఆటోమేటిక్‌గా వేడెక్కడం కోలా కంపెనీల్లో రివాజు. అది ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సారి ఆధిపత్య పోరు బ్రాండ్స్‌తో ఆగేటట్టుగా లేదు. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ అగ్రనటుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు దీనికి జతయ్యేట్టుగా ఉంది. దానికి కారణం పుష్ప, పెద్దిలే...అదేనండీ.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లే.
పుష్ప తో ఆల్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ఉవ్విళ్లూరాయి. అదే క్రమంలో ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ తన దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ ని ఎంచుకుంది. పుష్పరాజ్‌తో... చాలా ఉత్తేజకరమైన ఎనర్జిటిక్ వీడియోలను తయారు చేసి విడుదల చేసింది. అవి బాగా జనంలోకి దూసుకెళ్లాయి కూడా. అయితే ఇప్పుడు థమ్స్ అప్‌కి ప్రత్యర్ధిగా ఉన్న క్యాంపా కోలా...బన్నీకి ధీటైన మరో నటుడి గురించి సాగించిన అన్వేషణ మరో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఆగింది. తాజా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఈ కోలా బ్రాండ్ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది.
ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ (Ram Charan) ను క్యాంపాకోలా తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం కూల్‌గా మాట్లాడుకోవాల్సిన కూల్ టాపిక్‌ను వేడి వేడిచర్చలకు కేంద్ర బిందువైన హాట్ టాపిక్‌గా మార్చింది.
ప్రస్తుతం మెగా , అల్లు కుటుంబాల బంధం మధ్య బన్నీ, చెర్రీలనే అడ్డుగీతలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రామ్ చరణ్, అల్లు అర్జున్ పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనడం చాలా చిన్నమాట. బయటకు చెప్పకున్నా, సోషల్ మీడియాలో అన్‌ఫాలోల దగ్గర నుంచి ఫాలోయర్స్, ఫ్యాన్స్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం వరకూ బన్నీ, చెర్రీల వార్... గట్టిగా నడుస్తూనే ఉంది.
ఈ నేపధ్యంలో రెండు బలమైన కూల్ డ్రింక్ బ్రాండ్స్ కాంపా కోలా, థమ్స్ అప్ లకు వారు అంబాసిడర్‌లుగా ఎంపిక కావడంతో ఈ వైరం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రెండు బ్రాండ్స్ భవిష్యత్తులో రూపొందించే ప్రకటనలు ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో.. ఎంత హీట్ తెస్తాయో.....చూడాలి.
మరోవైపు క్యాంపా కోలా ప్రకటనలు రామ్ చరణ్ స్టార్ స్టేటస్‌పై ఎక్కువగా ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మగధీర, ఆర్‌ఆర్‌ఆర్ లలోని ప్రసిద్ధ సినిమా సన్నివేశాలను ఇవి వాడుకుంటున్నాయి.