![Pushpa 2 movie effect will be on Allu Arjun's next film](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/allu-arjun.jpg.webp?itok=GVtxPNs9)
గంగోత్రి నుంచి స్టైలిస్ట్ స్టార్ దాకా టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ప్రయాణం దినదిన ప్రవర్ధమానమవుతూ సాగింది. ఆ తర్వాత ఆయన ఐకాన్‌స్టార్ గా మారే క్రమంలో పుష్పతో జరిగిన ట్రాన్స్‌ఫార్మేషన్ మాత్రం ఒక విస్ఫోటనం అని చెప్పాలి. అప్పటి దాకా అగ్రగామి టాలీవుడ్ హీరోల్లో టాప్ 5 లో సైతం లేని బన్నీని ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ పోటీకి హై జంప్ చేయించిన చిత్రం అది.
ఆ తర్వాత పుష్ప 2 ది రూల్(Pushpa 2: The Rule) అల్లు అర్జున్ క్రేజ్‌ని పూర్తిగా ఆకాశానికి ఎత్తేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా ఇలా అకస్మాత్తుగా నెంబర్ వన్ పొజిషన్‌లో ఎగిరి కూర్చున్నది లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనేది సినీ పండితుల అంచనాలకు సైతం అందడం లేదు. రెండో పార్ట్ రిలీజ్‌కి ముందే బీహార్ రాష్ట్రంలో బన్నీ కార్యక్రమంలో లాఠీచార్జి జరగడమే ఆశ్చర్యం అనుకుంటే పుష్ప 2 విడుదలయ్యాక హిందీ సినిమాల రికార్డులన్నీ చెరిపేయడం మరింత ఆశ్చర్యం....
ధియేటర్ల రికార్డుల పరంపర అలా ఉంచితే... ప్రస్తుతం ఈ సినిమా నెట్టింట కూడా సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక మొత్తం చెల్లించి నెట్‌ఫ్లిక్స్ స్వంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో అత్యధిక వీక్షకులు చూసిన 2వ ఆంగ్లేతర చిత్రంగా నిలవడం విశేషం. ఏదేమైనా.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడనేది నిజం. ఇలా అల్లు అర్జున్ ఇమేజ్ విషయంలో వరుసపెట్టి పుష్ప 2 సృష్టించిన ఆశ్చర్యాల నుంచి ఇప్పుడిప్పుడే మనం తేరుకుంటున్నాం.
ఈ నేపధ్యంలో కొత్తగా ఓ ప్రశ్న ఉదయిస్తోంది....నెక్ట్స్ ఏమిటి? అని. నెక్ట్స్ ఏముంది? అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది అంటూ ఎవరైనా ఠక్కున చెప్పేయవచ్చు. పుష్ప కి ముందు అయితే ఇలా అల్లు అర్జున్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం అంటే మామూలుగా విని ఊరుకునే వార్త మాత్రమే. అయితే ఇప్పుడు అలా కాదు. ఆకాశమంత ఎదిగిన పుష్పరాజ్ ఇమేజ్ ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతీ అడుగునూ పట్టి కుదిపేస్తోంది. ఆ ఇమేజే ఇప్పుడు బన్నీకి సవాల్‌గా మారనుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ సహా టాప్ హీరోలు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కునే ఉంటారు. అయితే వీరందరి కన్నా కాస్త భిన్నమైనదిగానే ఐకాన్ స్టార్ పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే... పుష్పరాజ్ అనే క్యారెక్టర్ విపరీతంగా ప్రేక్షకుల మదిలోకి చొచ్చుకుపోయింది. దాంతో బన్నీ నెక్ట్స్ మూవీ పైన ప్రేక్షకుల్లో ఆశలు ఏ స్థాయిలో ఉంటాయో, అవి బన్నీ తర్వాతి సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనాలకు అందడం లేదు.
ముందుగానే కధ, పాత్రల తీరుతెన్నులపై చర్చలు ముగిసినా, పుష్ప 2 తర్వాత... రానున్న అల్లు అర్జున్ సినిమాల్లోని ఐకాన్ స్టార్ పాత్ర ల్లో ఆయన పెరిగిన ఇమేజ్‌కు తగ్గట్టుగా కొన్నయినా మార్పు చేర్పులు చేయక తప్పదు. అన్నీ చేసినా... పుష్పరాజ్ స్థాయిలో మరో పాత్రను అల్లు అర్జున్‌కి తీసుకురాగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంతేకాకుండా ఒక హీరోకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అదే స్థాయిలో అసూయలు, ప్రొఫెషనల్ శతృత్వాలూ తప్పవు. సహజంగానే అవి బన్నీ ఫెయిల్యూర్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకుని తలకెత్తుకున్న కిరీట భారాన్ని తడబడకుండా మోయడంలో నేర్పరితనాన్ని చూపడంపైనే ఐకాన్ స్టార్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తడబడితే మాత్రం... అల్లు అర్జున్ అనే హీరోకి పుష్పరాజ్ పాత్ర వరమూ, శాపమూ రెండూ తానే అవడం తధ్యం.
Comments
Please login to add a commentAdd a comment