
సిద్ధు జొన్నలగడ్డ చిన్నస్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్‌గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్ధంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజలాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్‌గా ఎదిగిన వర్ధమాన హీరోల్లో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడు.
డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధూని ఒకేసారి పెద్ద స్టార్‌గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు ద్వారా పూర్తిగా వన్‌మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఆ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్‌తో యాక్షన్, కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధూ ఆ సినిమాకి కధారచయితగా కూడా వ్యవహరించడం విశేషం.
జోష్ సినిమాలో చిన్నపాత్రతో మొదలైన సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ శీను, భీమిలి కబడ్డి జట్టు..లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్‌లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధూ హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఎ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కోవిడ్ సమయంలో ధియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది.
పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిధ్దూకి డిజె టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్‌లో సిధ్దూకి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకుని వాలెంటైన్స్ డే సందర్భంగా ధియేటర్లలో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ కూడా ఉండడం.

అప్పట్లో ఆరెంజ్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రీ రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం... నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్‌కి పోటీగా హీరోయిన్ ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు.
ఆసక్తికరంగా... సిద్ధూ ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ వారం ఆసక్తికరంగా, సిద్ధు ’ఇట్స్ కాంప్లికేటెడ్’ (కృష్ణ అండ్ అతని లీల) పేరుతో ఆరెంజ్‌కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రీ రిలీజ్‌కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందూ వెనుకా చూసుకోకుండా సిద్ధూ తన సినిమాని రామ్‌చరణ్ సినిమా రీ రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రీరిలీజ్‌లో సిద్ధూ చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్లు సాధించింది.
తెలుగు చిత్రసీమలో సిద్ధూ ఎదుగుదల ప్రశంసించదగ్గదే. స్థిరత్వం అంకితభావంతో సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధూ ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్ డమ్ ఎప్పుడూ నిలకడగా ఉండడం తెలుగు చిత్రసీమలో సాధ్యం కాదని సిధ్దూ గుర్తించాలి. అన్ని రకాలుగా తమకన్నా పెద్ద హీరోలతో పోటీ పడే విషయంలో యువ హీరోలు కాస్త వివేకంతో వ్యవహరించాలని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment