Fun Day
-
నమ్మకమే పునాది.. కోల్పోతే కష్టమే!
సంధ్య, రాజీవ్ ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ యాంబిషస్ ప్రొఫెషనల్స్. సంధ్య ఒక సాఫ్ట్వేర్ డెవలపర్‌గా, రాజీవ్ ప్రోడక్ట్ మేనేజర్‌గా ఒక అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, ఇల్లు కట్టుకోవడం, వివిధ దేశాలకు టూర్ వెళ్లడం వంటి కలల గురించి తరచుగా మాట్లాడుకునేవారు. పరస్పర గౌరవం, ఎమోషనల్ ఇంటిమసీతో ఉండేవారు. అయితే, పెళ్లికి ఆరునెలల ముందు పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. కొత్త ప్రాజెక్ట్ రావడంతో ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం, డెడ్‌లైన్‌కు ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఒత్తిడి, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనుల కారణంగా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయారు. ఎప్పుడైనా మాట్లాడుకున్నా, అతిథుల జాబితాలు, బడ్జెట్లు, లాజిస్టిక్స్ చుట్టూ తిరిగేవి. డేట్ నైట్స్, ఫిజికల్, ఎమోషనల్ ఇంటిమసీలు తగ్గిపోయాయి.సంధ్య మామూలుగానే రిజర్వ్డ్ వ్యక్తి. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు పనిలో మరింతగా మునిగిపోయింది. తన కెరీర్లో రాణించి, పెళ్లి సజావుగా జరిగితే మిగతావన్నీ సవ్యంగా సాగుతాయని భావించింది. కాని, రాజీవ్ మాత్రం ఎమోషనల్‌గా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తరచుగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ‘పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగనివ్వు రాజీవ్. పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు టైమ్ అంతా మనదే కదా’ అంటూ అతని మాటలను తోసివేసేది సంధ్య. ఆ సమయంలోనే రాజీవ్ టీమ్‌లోకి ప్రియ అనే కొత్తమ్మాయి చేరింది. చురుగ్గా, సరదాగా ఉండే వ్యక్తి. ప్రాజెక్ట్ టైమ్‌కి పూర్తిచేయాలని లేట్ అవర్స్‌లో కూడా పనిచేసేది. మొదట్లో రాజీవ్, ప్రియల సంభాషణలు ప్రొఫెషన్‌కు సంబంధించినవే ఉండేవి. క్రమేపీ అవి పర్సనల్ స్థాయికి చేరాయి. రాజీవ్ ఆలోచనలను ప్రియ ప్రశంసించేది. అతని పని ఒత్తిడి పట్ల సహానుభూతి చూపించి, సంధ్య నుంచి అందని మద్దతును అతనికి అందించగలిగింది. ఫ్రెండ్లీ బాంటర్ త్వరగా ఫ్లర్ట్గా మారింది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా, అదేమీ హానికరం కాదని, తన పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపించదని రాజీవ్ సమర్థించుకునేవాడు. వారాలు గడిచేకొద్దీ అతను తన ఫోన్‌ను సంధ్య నుంచి దాచడం ప్రారంభించాడు. ఓ రోజు ఇద్దరూ కలిసి ఔటింగ్‌కు వెళ్లారు. డ్రింక్స్ తీసుకెళ్లడానికి రాజీవ్ పక్కకు వెళ్లిన సమయంలో వచ్చిన నోటిఫికేషన్ చూడటానికి సంధ్య అతని ఫోన్ ఓపెన్ చేసింది. ప్రియ, రాజీవ్‌ల మధ్య జరిగిన చాటింగ్ ఆమె కంటపడింది. అంతే, ఆమె మనసు ముక్కలైంది. రాజీవ్‌పై పెట్టుకున్న నమ్మకం ధ్వంసమైంది. ఆ తర్వాత రాజీవ్‌తో సమయం గడపడం సంధ్య జీవితంలో అతి కష్టమైన పని అయింది. కోపం, బాధ, అవమాన భావాలతో సతమతమయ్యేది. ఇదంతా భరించలేక ఒకరోజు రాజీవ్‌ను అడిగేసింది. రాజీవ్ తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ సంధ్య అతన్ని క్షమించలేకపోయింది. తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు. అయినా రాజీవ్ పై మళ్లీ నమ్మకం ఉంచడం చాలా కష్టమనిపించింది. అతనికి మరో అవకాశం ఇవ్వాలా? లేక పెళ్లిని రద్దు చేసుకోవాలా? అనే సందేహంలో ఉంది సంధ్య. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌కి వెళ్లింది. ఇద్దరికీ మూడు నెలల కౌన్సెలింగ్ తర్వాత, ఒకరిపై ఒకరికి మళ్లీ పూర్తిగా నమ్మకం ఏర్పడ్డాక పెళ్లి చేసుకున్నారు. నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి పది సూత్రాలు..» క్రమబద్ధమైన మంచి చర్యల ద్వారా నమ్మకం పెరుగుతుంది.» మోసం చేసిన వ్యక్తి పూర్తి బాధ్యతను స్వీకరించాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి.» తప్పు చేసినవారిని క్షమించడం మీ మానసిక శాంతి కోసమే, అది నిదానంగా జరుగుతుంది.» ఎమోషనల్ ఓపెన్నెస్ బంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది.» హద్దులను నిర్దేశించుకోవడం, గౌరవించడం ఆరోగ్యకరమైన బంధానికి కీలకం.» నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి భాగస్వాములిద్దరూ కృషి చేయాలి.» భాగస్వాములిద్దరూ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం వ్యక్తిగత వృద్ధికి, బంధం బలమవ్వడానికి దోహదం చేస్తుంది.» బంధానికి విలువ ఉందా లేదా అన్నది ఆలోచించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి.» బంధాన్ని బలంగా, మంచి పునాదితో తిరిగి నిర్మించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి.» అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలి. -
వాలి చేతిలో రావణుడి పరాజయం
వరగర్వంతో కయ్యానికి కాలుదువ్వి, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓటమి పాలైనా, రావణుడికి బుద్ధి రాలేదు. పులస్త్యుడి వల్ల కార్తవీర్యార్జునుడి చేతి నుంచి బతికి బయటపడ్డాడు గాని, లేకుంటే అతడి చేతిలోనే అంతమైపోయేవాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో జరిగిన పరాభవాన్ని రావణుడు త్వరలోనే మరచిపోయాడు. ముల్లోకాలలో బలవంతులుగా పేరుమోసిన వారందరినీ జయించాలన్న కండూతి అతడికింకా పోలేదు. కిష్కింధ పాలకుడైన వాలి మహాబలవంతుడని రావణుడు తన మంత్రుల ద్వారా విన్నాడు. ఎలాగైనా, వాలితో యుద్ధం చేసి, అతణ్ణి గెలవడం ద్వారా లోకానికి తన బలం చాటాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పుష్పకాన్ని అధిరోహించి, కిష్కింధకు వెళ్లాడు.రావణుడు కిష్కింధకు వెళ్లేసరికి వాలి నగరంలో లేడు. వాలి సభా మందిరంలో అతడి మంత్రి తారకుడు, మామ సుషేణుడు, యువరాజైన వాలి తమ్ముడు సుగ్రీవుడు, ఇతర వానర యోధులు ఉన్నారు. ‘నేను లంకాధిపతిని. నన్ను రావణుడంటారు. వాలి ఎక్కడ? నేను వాలితో యుద్ధం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘రావణా! మా రాజు వాలి ఇప్పుడు నగరంలో లేడు. అతడు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో నాలుగు సముద్రాలలో స్నానం చేసి, సంధ్యావందనం పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. నువ్వు అప్పటి వరకు వేచి ఉండవచ్చు. అయినా, వాలితో యుద్ధం నీకు క్షేమం కాదు. అదిగో ఆ అస్థిపంజరాల గుట్టలు చూడు. వాలితో యుద్ధానికి వచ్చి, అతడి చేతిలో హతమైపోయిన అభాగ్యులవే అవన్నీ. కాదూ కూడదూ ఇప్పటికిప్పుడే అతడి వద్దకు వెళ్లాలనుకుంటే, ఈ వేళకు అతడు దక్షిణ సముద్రంలో స్నానం చేస్తూ ఉంటాడు. నువ్వు నిరభ్యంతరంగా అక్కడకు వెళ్లవచ్చు’ అన్నాడు తారకుడు.రావణుడు పుష్పకవిమానంలో దక్షిణ సముద్రానికి వెళ్లాడు. ఆ సమయానికి వాలి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు.వాలిని వెనుక నుంచి ఒడిసి పట్టుకుందామనే ఉద్దేశంతో రావణుడు అతడి వైపు నడిచాడు. ఓరకంటితో వాలి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రావణుడు దగ్గరకు రాగానే, హఠాత్తుగా అతడి మెడను చంకలో ఒడిసి పట్టుకుని, ఆకాశంలోకి పైకెగిరాడు. వాలి చర్యకు రావణుడు దిగ్భ్రాంతి చెందాడు. అతడి పట్టును విడిపించుకోవడానికి గోళ్లతో రక్కాడు. దంతాలతో కొరికాడు. అయినా, వాలి లెక్క చేయకుండా ఎగురుతూ పోయి, తూర్పు సముద్రంలో మునిగి స్నానం చేశాడు. నిష్ఠగా సంధ్యావందనం చేశాడు. ఇన్ని చేస్తూనే రావణుడి మెడ మీద నుంచి తన పట్టును ఏమాత్రం సడలించలేదు. రావణుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హాహాకారాలు చేశాడు.వాలి అతడి హాహాకారాలను ఏమాత్రం పట్టించుకోకుండా, అక్కడి నుంచి రావణుడిని పట్టుకుని ఆకాశమార్గంలో ఎగురుతూ ఉత్తర సముద్రం వద్దకు వెళ్లాడు. సముద్రంలో తనతో పాటు రావణుడిని కూడా ముంచుతూ తేల్చుతూ స్నానం చేశాడు. అక్కడ యథావిధిగా సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. వాలి చేష్టలకు రావణుడికి శక్తులన్నీ ఉడిగిపోయి, భయం పట్టుకుంది.వాలి అక్కడి నుంచి పైకెగిరి కిష్కింధ వైపు ప్రయాణం ప్రారంభించాడు. కిష్కింధ నగరం వెలుపల ఉపవనంలో రావణుడిని విసిరేశాడు. రావణుడు పొదల మధ్య పడ్డాడు. ఈ దెబ్బకు రావణుడికి కళ్లు బైర్లు కమ్మాయి.రావణుడిని చూసి, వాలి వినోదంగా నవ్వాడు.‘చూడటానికి మహారాజులా ఉన్నారు? ఇంతకీ తమరెవరు? ఎక్కడి నుంచి తమరి రాక? ఏ పని మీద వచ్చారు?’ అని వేళాకోళంగా ప్రశ్నించాడు.కొద్ది క్షణాలకు రావణుడు తేరుకున్నాడు. నెమ్మదిగా గొంతు పెగల్చుకుని, ‘వానరేశ్వరా! నన్ను రావణుడంటారు. నేను లంకాధిపతిని. దేవతలను జయించినవాణ్ణి. అయితే, నీ శక్తి అమోఘం, అద్భుతం, అద్వితీయం. గమన వేగంలో నువ్వు గరుడుడిని, వాయువును మించిపోయావు. నన్ను ఏకంగా చంకలో ఇరికించుకుని, మూడు సముద్రాల్లో ముంచి తేల్చావు. బుద్ధి గడ్డితిని నీతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నీ శక్తిని చూశాక నేను నా ఆలోచనను విరమించుకుంటున్నాను. నీ అంతటి వీరుణ్ణి నేను ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. ఈ క్షణం నుంచి మనిద్దరం స్నేహితులుగా బతుకుదాం’ అన్నాడు.రావణుడి కోరికను వాలి సమ్మతించాడు. అతడిని స్నేహితుడిగా అంగీకరించాడు. తనతో పాటు కిష్కింధ నగరానికి తీసుకుపోయి, ఘనంగా ఆతిథ్యం ఇచ్చాడు.వాలికి అతిథిగా రావణుడు కిష్కింధలో కొన్నాళ్లు గడిపి, వాలి వద్ద సెలవు తీసుకుని లంకకు తిరిగి వెళ్లిపోయాడు. -
Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?
సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’ అన్నాడు మంత్రి. మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు. అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు. దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు. ‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు. ‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు. ‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా! - యు.విజయశేఖర రెడ్డి -
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
పిల్లల కథ -‘తెలిసొచ్చింది మహా ప్రభో’
మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనాదక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు! బద్ధకంతో ఏ పనీ చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళుతున్నారని.. ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్లి.. సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్లి ‘ప్రణామాలు సాధుపుంగవా! మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాల ప్రయత్నించినా వారు మారడంలేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు’ అని ప్రార్థించాడు. ‘దీనికి పరిష్కారం ఉంది’ అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. ‘సాధువు చెప్పినట్లుగా చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. ‘అలాగే రాజా’ అని చెప్పి.. ‘రాబోవు దసరా పండుగనాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. కనుక దసరా రోజున పురుషులంతా.. మన రాజ్యం నడి బొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తెచ్చుకొనవలెను’ అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు.. సంచి, కర్ర ఎందుకు తెచ్చుకోమన్నారో అర్థం కాలేదు. దసరా రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ బద్ధకస్తులు చాలామంది సంచి, కర్ర, తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు.. అక్కడికి వచ్చిన వారినుద్దేశించి ‘మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ.. తెచ్చుకున్న సంచి, కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్లి.. కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి.. సంచిలో నింపుకొని రావాలి. ఇప్పుడే బయలుదేరి మీకప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్లీ ఇదే ప్రాంగణానికి రావాలి’ అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారంతా. సంచి,కర్రలు ఉన్నవాళ్లు పండ్లను కొట్టి.. సంచి నింపుకొని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకొని వచ్చారు. సంచులు, కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజులపాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు. వెంటనే రాజ భటులు వారందరినీ తీసుకెళ్లి ఒకొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి, కర్రను తీసుకెళ్లనందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది. చెరసాలలో ఉన్న వారం రోజులూ వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని.. బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్ధకించకుండా తామూ సంచి, కర్ర తీసుకువెళ్లి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మథన పడ్డారు. తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటకి తీసుకొచ్చారు. అప్పుడు వారినుద్దేశించి రాజు ‘ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది’ అన్నాడు. వెంటనే వాళ్లంతా ‘క్షమించండి రాజా! తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం’ అన్నారు ముక్తకంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తుల జాడే లేకుండా పోయింది. - ఏడుకొండలు కళ్ళేపల్లి -
మంత్ర ఖడ్గం!
పూర్వం ఉజ్జయినిని మహామల్లుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే మహాయోధుడు. అయితే ఆయనకు ఒక చింత ఉండేది. ఒక్కగానొక్క కొడుకు మణిదీపుడు యుద్ధ విద్యలందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడుకాదు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజు తిరుగులేని యోధుడై ఉండాలి అని మహామల్లుడు కొడుక్కి ఎంతచెప్పినా ఫలితం ఉండేదికాదు. మణిదీపుడికి కష్టపడి యుద్ధవిద్యలు నేర్వడం ఇష్టంలేదు. చిన్నప్పుడు విన్న కథల్లోలాగ మంత్రఖడ్గాన్ని సంపాదించి దానితో విజయాలను అందుకోవాలని అతను కలలు కంటుండేవాడు. ఒకరోజు.. రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. తన బాధను సాధువుతో చెప్పాడు మహామల్లుడు. ‘దాని గురించి మీరు చింత పడకండి. మణిదీపుడిని నాతో పంపండి. అతని కోరిౖకైన మంత్రఖడ్గాన్ని ఇచ్చి పంపుతాను. కానీ దానిని ఉపయోగించాలంటే కనీస నైపుణ్యం ఉండాలి కదా! దాన్ని కూడా మణిదీపుడికి ఏమాత్రం కష్టంలేకుండా అతి తక్కువ సమయంలో నేర్పించి పంపిస్తాను’ అన్నాడు. మణిదీపుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇటు యుద్ధవిద్యలూ వస్తున్నాయి. అటు తాను కోరుకున్న మంత్రఖడ్గమూ లభిస్తున్నది. ఇంకేం కావాలి! సాధువు వెంట బయలుదేరి ఆశ్రమం చేరాడు. సాధువు తానే మణిదీపుడికి కత్తియుద్ధం నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోతున్న మణిదీపుడితో ‘సాధువుకి క్షత్రియవిద్యలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నేను వయసులో ఉన్నప్పుడు మనరాజ్య సైన్యంలో పనిచేశాను. వయసయ్యాక ప్రశాంత జీవితం గడపాలని ఆశ్రమం నిర్మించుకున్నాను. అయితే నావద్దకు వచ్చినవారికి కాదనకుండా క్షత్రియ విద్యలు నేర్పిస్తున్నాను’ అన్నాడు. ఆరోజు సాయంత్రం అభ్యాసం అయ్యాక మణిదీపుడి భుజంతట్టి ‘ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేస్తున్నావు. నేననుకున్నదానికంటే ముందే యుద్ధవిద్యలు నేర్చుకోగలవు’ అంటూ ప్రశంసించాడు. మణిదీపుడి మీద సాధువు పొగడ్తలు బాగా పనిచేశాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. యుద్ధవిద్యలు కష్టం అనుకున్నాడు. కానీ అవి తేలికే అని గ్రహించాడు. యుద్ధవిద్యలన్నీ నేర్పి అతనిని తిరిగి రాజధానికి పంపే సమయంలో.. సాధువు మంత్రఖడ్గాన్ని ఇస్తూ ‘ఇది మా పూర్వీకులది. నేను సైన్యంలో పనిచేస్తున్నప్పటి నుండీ నా దగ్గర ఉంది. ఇది నీకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది’ అన్నాడు. మణిదీపుడు ఆనందంగా రాజ్యం చేరుకున్నాడు. కొడుకు ప్రయోజకుడై వచ్చినందుకు మహామల్లుడు సంతోషించి పట్టాభిషేకం చేశాడు. రాజయ్యాక కూడా మణిదీపుడు రోజూ అభ్యాసం చేయకుండా ఉండలేకపోయేవాడు! కొంతకాలానికి పొరుగున ఉన్న కోసలరాజుకు దుర్బుద్ధి పుట్టింది. బాగా అభివృద్ధి చెందిన ఉజ్జయినిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలని దాడిచేశాడు. తన వద్ద ఉన్న మంత్రఖడ్గంతో మణిదీపుడు యుద్ధరంగాన చెలరేగిపోయాడు. ఘన విజయం లభించాక సాధువుని కలసి ‘మీరు ప్రసాదించిన మంత్రఖడ్గం వల్ల ఇంతటి విజయం లభించింది!’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయం ఖడ్గానిది కాదు. నీ నైపుణ్యానిది. యుద్ధవిద్యలంటే ఇష్టంలేని నీవు ఒకసారి వాటిని నేర్చుకోవడం ప్రారంభించాక నీలో ఎక్కడలేని ఆసక్తి కలిగింది. అది సహజం. ఏవిద్య అయినా నేర్చుకోవడం మొదలుపెడితే ఇక దానిని వదలబుద్ధికాదు. ఆ లక్షణమే నీకు యుద్ధంలో విజయం లభించేట్టు చేసింది. ఇందులో మంత్రతంత్రాల ప్రమేయం ఏమీలేదు. నీ మనసులో యుద్ధవిద్యల పట్ల ఆసక్తికలగడానికి నేను మంత్రఖడ్గం అనే అబద్ధం ఆడాను. అది మామూలు ఖడ్గమే! కృషిని నమ్ముకునేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకు’ అన్నాడు. ఆ సాధువు మణిదీపుడిని వెంటబెట్టుకుని మహామల్లుడి వద్దకు వచ్చాడు. ‘ప్రభూ! మీరు నన్ను మన్నించాలి. మణిదీపుడు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి చూపడం లేదని మీరు బాధపడుతున్నారని తెలిసి నేను సాధువుగా మీ వద్దకు వచ్చి మంత్రఖడ్గం పేరుతో మణిదీపుడ్ని ఆకర్షించి యుద్ధవిద్యల్లో ఆరితేరేట్టు చేశాను. ఒకప్పుడు నేను మీ సైన్యంలో పనిచేసి మీ ఉప్పు తిన్నవాణ్ణి. ఆ కృతజ్ఞత కొద్దీ మీ బాధ తీర్చాలని భావించాను. సాధువుగా వచ్చి పరదేశినని అబద్ధం చెప్పాను. నేను చేసిందాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి’ అన్నాడు సాధువు. దానికి మహామల్లుడు ఆనందిస్తూ ‘మీ స్వామిభక్తి ఆశ్చర్య పరుస్తున్నది. మీలాంటివారు ఆస్థానంలో ఉండాలి. ఇకమీదట మీరు మా ముఖ్య సలహాదారునిగా ఉండి రాజ్యరక్షణలో మీ శిష్యునికి తోడ్పడండి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సాధువు సంతోషంగా అంగీకరించాడు. -డా. గంగి శెట్టి శివకుమార్ -
స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!
‘స్టీలు సామాన్లు కొంటాం.. పాత ఇనుప సామాన్లు కొంటాం..’ అనేది పాతదే. త్వరలోనే ‘స్టీలు ఇళ్లను కొంటాం..’ అని కూడా వినపడొచ్చు. ఎందుకంటే, భవిష్యత్తులో చాలామంది స్టీలు ఇళ్లల్లోనే నివసించనున్నారు. ఈ మధ్యనే వాషింగ్టన్‌లోని ఓ ప్రైవేటు సంస్థ నాలుగు స్టీల్ గ్రెయిన్ హౌస్‌లను నిర్మించింది. చూడటానికి పాతకాలపు ధ్యానపు డబ్బాల్లా ఉన్నాయి. కానీ, వీటిలోపల విశాలమైన బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఇందులోని టెంపరేచర్ సిస్టమ్ పనిచేస్తుంది. పైగా ఇన్‌బిల్ట్ సీసీ కెమెరాలతో పనిచేసే స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిని కంటికిరెప్పలా కాపాడుతుంది. దీన్ని మడతేసి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లచ్చు కూడా. అవుట్డోర్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవారికి ఈ ఇల్లు భలే బాగుంటుంది. అయితే ఈ ఇంటి ధర 1.6 మిలియన్ డాలర్లు (అంటే రూ. 13 కోట్లు). ఈ ఇళ్ల ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ స్టీలు ఇళ్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: కొండను కొంటారా? ఔను! అమ్మకానికి సిద్ధంగా ఉంది!) -
19 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీగానే! ఎవరీ బ్రియానా?
ఈ రంగుల ప్రపంచంలో చీకటి లోకమనేది ఒకటుంటుందని, అందులో దేనికైనా తెగించే మనుషులుంటారని తెలుసుకోలేరు కొందరు. కేవలం తమ కలల ప్రపంచం వైపు పరుగులు తీస్తూ జీవితాలనే పోగొట్టుకుంటుంటారు. బ్రియానా మైట్‌ల్యాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో అదే పొరబాటు చేసింది. అమెరికాలోని బర్లింగ్టన్ వర్మోంట్లో కెల్లీ, బ్రూస్ దంపతులకు 1986లో బ్రియానా జన్మించింది. ఈస్ట్ ఫ్రాంక్లిటన్ అనే చిన్న పట్టణంలో తన అన్నతో కలిసి పెరిగింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో పాటు తమ పొలాల్లోనే పనులకు వెళ్తూ, స్కూల్లో చదువుకునేవారు. ఇంట్లో అంతా ఆమెని ముద్దుగా బ్రీ అని పిలిచేవారు. బ్రీకి తన జీవనశైలి ఏమాత్రం నచ్చేది కాదు. పొలం పనులకు, పల్లె జీవితానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటికి 15 మైళ్ల దూరంలో ఉన్న ఎనోస్బర్గ్ ఫాల్స్ హైస్కూల్లో చేరతానని పేరెంట్స్‌పై ఒత్తిడి తెచ్చింది. అక్కడే పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని పట్టుబట్టింది. మొదట సంకోచించిన పేరెంట్స్ చివరికి బ్రీ కోరికను కాదనలేకపోయారు. ఆరు నెలలు గడిచేసరికి ఆ హైస్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయ్యి.. ఇంకాస్త పైస్థాయికి వెళ్లేందుకు ఎఉఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అందుకోసం మోంట్‌గోమేరీకి దగ్గరల్లో తన చిన్ననాటి స్నేహితురాలు జిలియన్తో కలిసి రూమ్‌లో ఉంటూ, జాబ్ చేసుకుంటూనే చదువుకునేది. తనున్న పట్టణం తన బాయ్ ఫ్రెండ్‌ని కలవడానికి, ఉద్యోగానికి, భవిష్యత్తులో ఎదుగుదలకూ అనువైనదని ఆమె నమ్మింది. 2004 మార్చి 19 శుక్రవారం ఉదయాన్నే తన తల్లిని కలిసిన బ్రీ.. తనకు మరో పార్ట్ టైమ్ జాబ్ దొరికిందని, మర్నాడే డ్యూటీలో జాయి¯Œ అవుతానని చెప్పింది. ఆ ఆనందంలోనే కెల్లీని రెస్టారెంట్‌కి తీసుకెళ్లింది. అప్పుడే తన కెరీర్ గురించి తల్లితో మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర దాటే సరికి రూమ్ దగ్గర డ్రాప్ చేసి, కెల్లీ వెళ్లిపోయింది. కెల్లీ బ్రీని చూడటం అదే చివరిసారి. అదేరోజు ఈవినింగ్ డ్యూటీకి వెళ్లిన బ్రీ సోమవారం వరకూ రాకపోయేసరికి రూమ్ మేట్ జిలియన్కి భయమేసి బ్రీ కుటుంబానికి, పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్రీ శుక్రవారం రాత్రి 11:20కే డ్యూటీ నుంచి తన రూమ్‌కు బయలుదేరిందని తెలుసుకున్నారు. డ్యూటీ తర్వాత పార్టీకి రమ్మని పిలిచిన కొలిగ్స్‌తో ‘రేపు ఉదయాన్నే న్యూ జాబ్‌లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడు త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి’ అందట. మరో రెండు రోజులు గడిచేసరికి ఓ షాకింగ్ నిజం అక్కడ మీడియాని షేక్ చేసింది. అప్పటికే కేసు నమోదైన యాక్సిడెంట్ కారు ఎవరిదో కాదని, కనిపించకుండా పోయిన ‘బ్రీ’దేనని తేలింది. మార్చి 20 శనివారం ఉదయానికి మోంట్‌గోమెరీ రోడ్ నం. 118లో పాడుబడిన ఇంటిని చాలా విచిత్రంగా వెనుక నుంచి ఢీ కొట్టి ఉందట ఆ కారు. ఎవరో తాగుబోతు యాక్సిడెంట్ చేసి, పారిపోయి ఉంటాడని భావించిన ఓ పోలీసు దాన్ని స్థానిక గ్యారేజ్‌కి తరలించాడట. ఆ ఇల్లు ఓ నిర్మానుష్యమైన దారిలో పెద్ద మలుపు దాటగానే ఉంటుంది. అదేం ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. అయితే ఈ వార్తలు వెలుగులోకి రావడంతో చాలామంది సాక్షులు ఆ కారుని తాము చూశామంటూ ముందుకొచ్చారు. ఆ రాత్రి పన్నెండుంపావుకి ఆ ఇంటిముందు హెడ్ లైట్స్ వెలుగుతున్న కారుని గమనించానని ఒకరు, పన్నెండున్నరకి లైట్స్ వెలగడంతో కారు టర్న్ చేస్తున్నారేమో అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాత్రి రెండున్నర తర్వాత బ్రీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోబాటియాలే కూడా ఆ కారుని చూశాడు. ఆగి, అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, తన దారిన తాను వెళ్లిపోయాడట. ‘అది బ్రీ కారని నీకు తెలుసా?’ అని అడిగితే అప్పటికి తెలియదని చెప్పాడు. ఏది ఏమైనా 11.20కే కారులో బయలుదేరిన బ్రీ, పన్నెండుంపావుకే ఆ కారులో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశం తన ఆఫీస్‌కి చాలా దగ్గర్లో ఉంది. అంటే గంట సమయంలోనే తను మిస్ అయ్యింది. ఇక మరుసటి రోజు మార్చి 20న ఆ పోలీసు కారుని గ్యారేజ్‌కి పంపించకముందు ఓ బృందం విహారయాత్రకు వెళ్తూ ఆ కారుని చూసి ఆగింది. వారంతా తమ కెమేరాల్లో చాలా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలే తర్వాత ఈ క్రైమ్‌సీన్ కి కీలక సాక్ష్యాలయ్యాయి. అయితే ఆ పర్యాటకులు కారు పక్కనే విరిగిన బ్రేస్లెట్ చూసినట్లు చెప్పారు. కానీ అది పోలీస్ రికార్డుల్లో లేదు. మొదట అనుమానం రోబాటియాలే మీదకు మళ్లింది. అయితే అతడు విచారణ కొనసాగుతుండగానే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో కేసుకు ముందు సాగలేదు. బ్రీ మిస్సింగ్‌కి ఐదువారాల ముందు మౌరా ముర్రే అనే అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లంతైంది. బ్రీ కారు దొరికిన ప్రదేశానికి సరిగ్గా 90 మైళ్ల దూరంలోనే ముర్రే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా విచారణ జరిపినా ఫలితం లేదు. మిస్సింగ్‌కి 3 వారాల ముందు ఒక పార్టీలో బ్రీకి తన మాజీ స్నేహితురాలు లాక్రోస్కి మధ్య గొడవ జరిగిందట. లాక్రోస్ ఆ గొడవలో బ్రీని ముక్కు విరిగేలా కొట్టిందట. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న బ్రీ.. లాక్రోస్పై తన ప్రతాపాన్ని చూపించకుండా వదిలిపెట్టిందట. ఆ కథ తెలుసుకున్న పోలీసులు, లాక్రోస్ని కూడా విచారించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. ఇలా ఎంతమందిని ప్రశ్నించినా? నిజానిజాలు బయటపడలేదు. చాలామంది బ్రీ పారిపోయి ఉంటుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదని వాదించేవారు, ఇదో మానవ అక్రమ రవాణా కేసని నమ్ముతారు. బ్రీ ఎవరి నుంచో తప్పించుకునే క్రమంలో కారు వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, అందుకే లైట్స్ వెలుగుతూ, డోర్స్ ఓపెన్ లోనే ఉన్నాయని ఊహిస్తుంటారు. పైగా కరాటేలో నిష్ణాతురాలైన బ్రీని ఒకరు కిడ్నాప్ చేయలేరని ఎక్కువ మందే ఉండి ఉంటారనేది డిటెక్టివ్స్ మాట. 2022 మార్చి 18న ఇప్పటి దాకా దొరకని కొత్త డీఎన్ఏ దొరికిందని వెళ్లడించడంతో అది క్రిమినల్‌ది అయ్యే అవకాశం ఉండొచ్చని ఆశ మొదలైంది. పదిహేడేళ్లప్పుడు మాయం అయిన బ్రీకి ఇప్పుడు సుమారు 36 ఏళ్లు ఉండి ఉండొచ్చు. అయితే గత 19 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
11 ఏళ్ల వయసులోనే చాంపియన్.. బ్రిలియంట్ పంకజ్
మన దేశంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఆరాధించే ఆటగాళ్ల జాబితాలో అతను ఉండడు..! ఎందుకంటే అతను క్రికెటర్ కాదు! అతను సాధించిన విజయాలపై అన్ని వైపుల నుంచీ ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు..! ఎందుకంటే అతనేమీ ఒలింపిక్స్ పతకం గెలవలేదు! పాపులారిటీ పరంగా చూస్తే ఆ జాబితాలో అతని పేరు ఎక్కడా కనిపించదు! కానీ.. అతను విశ్వ వేదికలపై నమోదు చేసిన ఘనతలేమీ చిన్నవి కావు! అసాధారణ ఆటతో అతను చూపించిన ఫలితాలు అసమానం! బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్స్‌పై అతను అందుకున్న విజయాలు నభూతో..! ‘క్యూ’ స్పోర్ట్స్‌లో విశ్వవ్యాప్తంగా వేర్వేరు వేదికలపై వరుస విజయాలతో సత్తా చాటిన ఆ దిగ్గజమే పంకజ్ అద్వానీ! ఏకంగా 25 వరల్డ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన స్టార్. పంకజ్ అద్వానీకి అప్పుడు సరిగ్గా ఐదేళ్లు.. తండ్రి వ్యాపారరీత్యా ఆ కుటుంబం కొన్నేళ్లుగా కువైట్‌లోనే స్థిరపడిపోయింది. దానికి సంబంధించిన ఒక పని కోసం పంకజ్ తండ్రి అర్జున్ అద్వానీ కుటుంబంతో సహా వారం రోజుల పాటు బెల్గ్రేడ్కు వెళ్లాడు. పని ముగిసిన తర్వాత వారంతా తిరిగి కువైట్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే హోటల్ యాజమాన్యం వీరి గదికి వచ్చి ‘మీరు కువైట్ వెళ్లే అవకాశం ఇక ఏమాత్రం లేదు. కువైట్‌లో యుద్ధం జరుగుతోంది. ఆ దేశాన్ని ఇరాక్ ఆక్రమించింది. విమానాలన్నీ బంద్. మీరు ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు’ అని చెప్పేశాడు. దాంతో పంకజ్ తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో వ్యాపారం మొత్తం వదిలేసి నేరుగా భారత్‌కు వచ్చేశాడు. ముందుగా ముంబై చేరిన ఆ కుటుంబం ఆపై బెంగళూరులో స్థిరపడింది. అయితే దాన్నే తన జీవితంలో కీలకమైన మలుపుగా పంకజ్ చెప్పుకున్నాడు. కువైట్‌లో ఉండుంటే తాను బిలియర్డ్స్ వైపు వెళ్లకపోయేవాడినని, వ్యాపారంలోనే మునిగిపోయేవాడినని అతను అన్నాడు. తన సన్నిహితులు కొందరి కారణంగా, సరదాగా ఆ ఆట వైపు ఆకర్షితుడైన తను భవిష్యత్తులో అదే ఆటలో స్టార్‌గా ఎదుగుతానని పంకజ్ కూడా ఏనాడూ ఊహించలేదు. జూనియర్ స్థాయి నుంచే.. ఒక్కసారి ‘టేబుల్’ ఓనమాలు నేర్చుకున్న తర్వాత పంకజ్‌కు ఏనాడూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 11 ఏళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయిలో బిలియర్డ్స్ టైటిల్ గెలిచిన తర్వాత 15 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ కూడా సొంతం చేసుకున్నాడు. జాతీయ జూనియర్ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ టైటిల్స్ మాత్రమే కాదు.. 17 ఏళ్లకే జాతీయ సీనియర్ స్నూకర్ ట్రోఫీ గెలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తుది ఫలితాలు మాత్రమే కాదు.. అతని ఆటను చూసినప్పుడే మున్ముందు పెద్ద విజయాలు సాధించగలడని, గత తరం భారత బిలియర్డ్స్ దిగ్గజం గీత్ సేథీ సాధించిన ఘనతలను అధిగమించగలడని ‘క్యూ’ స్పోర్ట్స్ నిపుణులు పంకజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాస్తవరూపం దాల్చడం విశేషం. ఒకటి తర్వాత మరొకటి.. అపార ప్రతిభ ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీ కారణంగా పంకజ్‌కు ఆరంభంలోనే విశ్వ వేదికలపై విజయాలు దక్కలేదు. అయితే 14 ఏళ్లకే ఇంగ్లండ్‌లో వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో పాల్గొని అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరో నాలుగేళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్లో గెలవడంతోనే అతను ఏమిటో అందరికీ తెలిసింది. 18 ఏళ్ల వయసులో సాధించిన ఈ తొలి టైటిల్‌తో పంకజ్ విజయప్రస్థానం ఘనంగా మొదలైంది. ఆ తర్వాత ఎదురులేకుండా సాగిన అతని జోరు ఏకంగా 25వ ప్రపంచ టైటిల్ వరకు సాగింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అతని ఆటకు ట్రోఫీలన్నీ దరి చేరాయి. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్న పంకజ్ తన పేరిట పలు రికార్డులను నమోదు చేశాడు. స్టీవ్ డేవిస్, జాన్ హిగిన్స్, జడ్ టంప్, డింగ్హుయ్.. ఇలా అప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన దిగ్గజాలను పంకజ్ వరుసగా ఓడిస్తూ వచ్చాడు. వరల్డ్ బిలియర్డ్స్‌లో ఒక అరుదైన రికార్డు పంకజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రీడలో ఉన్న రెండు ఫార్మాట్లు (టైమ్ అండ్ పాయింట్)లలో విశ్వ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఒకే సమయంలో వరల్డ్ చాంపియన్ , కాంటినెంటల్ (ఆసియా) చాంపియన్ గా కూడా ఉన్న ఏకైక ఆటగాడిగా పంకజ్ నిలిచాడు. ఒలింపిక్స్ ఒక్కటే గొప్ప కాదు దురదృష్టవశాత్తూ బిలియర్డ్స్, స్నూకర్లలో ఏ ఆటకు కూడా ఒలింపిక్స్‌లో చోటు లేదు. పంకజ్ ఇన్నేళ్ల ప్రదర్శనను చూస్తే ఒలింపిక్స్‌లో అతను కచ్చితంగా పతకాలు సాధించగలిగేవాడని ఎవరైనా చెప్పగలరు. ఇదే విషయాన్ని గతంలో ఒక అభిమాని పంకజ్‌కు గుర్తు చేశాడు. ఇన్ని ఘనతలతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించి ఉంటే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అయ్యేవాడివి అంటూ అతను వ్యాఖ్యానించాడు. దీనిపై పంకజ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘అంతా బాగుంది అంటున్నారు సరే.. ఏ క్రీడాకారుడైనా ఒలింపిక్స్ పతకం గెలిస్తేనే గొప్పా, అది లేకపోతే తక్కువా?! నాలుగేళ్లకు ఒకసారి చూపించే ప్రదర్శనను బట్టి ఒక క్రీడాకారుడి గొప్పతనాన్ని అంచనా వేస్తారా? నా దృష్టిలో దానికంటే నా దేశం తరఫున వరుసగా నాలుగేళ్ల పాటు నాలుగు వరల్డ్ చాంపియన్ షిప్‌లు గెలవడం కూడా గొప్పే. నేను దానిని ఇష్టపడతాను’ అంటూ అతను జవాబిచ్చాడు. విజయాల జాబితా (మొత్తం 25 ప్రపంచ టైటిల్స్) వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (పాయింట్ ఫార్మాట్) – 8 వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ (లాంగ్ ఫార్మాట్) – 8 వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ – 1 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (15 రెడ్స్) – 3 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (6 రెడ్స్) – 2 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ చాంపియన్య్ షిప్ – 1 ఆసియా క్రీడలు – 2 స్వర్ణాలు (2006, 2010) ఆసియా చాంపియన్ షిప్‌లు – 12 జాతీయ చాంపియన్ షిప్‌లు – 34 -
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.. 310 వారాలు వరల్ట్ నెం1.. దటీజ్ రోజర్ ఫెడరర్
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడమే అతని ఘనత కాదు... 310 వారాలు వరల్డ్ నంబర్‌వన్ గా ఉండటమే అతని గొప్పతనాన్ని చెప్పదు... పురుషుల టెన్నిస్ ఆట కూడా అందంగా ఉంటుందని, అలా ‘సాఫ్ట్ టచ్’తో కూడా అద్భుతాలు చేయవచ్చని అతను చూపించాడు. ఒక్క పాయింట్ కోల్పోతేనే రాకెట్ నేలకేసి విసిరికొట్టే ఈ తరం ఆటగాళ్లతో పోలిస్తే, దాదాపు పాతికేళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో వివాదాస్పద మాట పెదవి దాటకుండా పనిపైనే దృష్టి పెట్టిన రుషి అతను.. మైదానం బయట కూడా సామాజిక బాధ్యత మరవని మంచితనం అతని సొంతం.. కోర్టులో అతనితో భీకరంగా తలపడిన ప్రత్యర్థులు అందరూ ఆట ముగియగానే అతని అంత మంచివాడు ఎవరూ లేరని ముక్తకంఠంతో చెప్పగల ఒకే ఒక్క పేరు.. రోజర్ ఫెడరర్.. టెన్నిస్ ప్రపంచంలో అన్నీ సాధించిన పక్కా జెంటిల్మన్ . ఎనిమిదేళ్ల వయసులో ఫెడరర్ మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. సరదాగా మాత్రమే ఆట మొదలు పెట్టినా, సహజ ప్రతిభ ఎక్కడికి పోతుంది? అందుకే కావచ్చు.. తాను ఎక్కువగా శ్రమించకుండానే వరుస విజయాలు వచ్చి పడ్డాయి. అండర్12 స్థాయిలో రెండు జాతీయ టైటిల్స్‌తో అతను మెరిశాడు. అయితే అసలు కష్టం రోజర్‌కు ఇప్పుడొచ్చింది. స్విస్ జాతీయ టెన్నిస్ సమాఖ్య అతని ఆటను ప్రత్యేకంగా గుర్తించింది. వెంటనే నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో చేర్చించమని తల్లిదండ్రులకు సూచించింది. తానుండే బాసెల్ నుంచి డెవలప్మెంట్ సెంటర్ ఉన్న ఎక్యూబ్లె¯Œ ్స దాదాపు 200 కిలోమీటర్లు. అమ్మా, నాన్నని వదిలి వెళ్లలేనంటూ ఆ చిన్నారి ఏడ్చేశాడు. చివరకు ఒప్పించి అక్కడికి పంపించారు. కానీ తీరా వెళ్లాక ఆ సెంటర్లో అంతా ఫ్రెంచ్ భాషనే! తనకేమో ఇంట్లో నేర్చిన జర్మన్ స్విస్ భాష తప్ప ఏమీ రాదు. పైగా క్యాంప్‌లో అందరికంటే చిన్నవాడు. బాధ మరింత పెరిగింది! కానీ ప్రతిరోజు ఫోన్ లో అమ్మతో మాట్లాడుతూ తెచ్చుకున్న ధైర్యానికి తన పట్టుదల జోడించి అక్కడి గట్టిగా నిలబడ్డాడు. అదే వేదిక భవిష్యత్ అద్భుతాలకు పునాదిగా నిలిచింది. దేశ నిబంధనల ప్రకారం తప్పనిసరి అయిన ‘9 ఏళ్ల స్కూల్ చదువు’ ముగించిన తర్వాత రోజర్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి దూసుకుపోయాడు. ఎడ్బర్గ్, బెకర్లను ఆరాధిస్తూ పెరిగిన ఆ కుర్రాడు మునుముందు తాను వారందరినీ మించి శిఖరాన నిలుస్తాడని ఊహించలేదు. వెనక్కి తగ్గకుండా... ‘ఎప్పుడూ కింద పడకపోవడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ పడ్డ ప్రతీసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాట ఫెడరర్‌కు అక్షరాలా వర్తిస్తుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. సుదీర్ఘ కెరీర్లో పదుల సంఖ్యలో అతడు గాయపడ్డాడు. శరీరంలో భుజాల నుంచి కాలి మడమల వరకు వేర్వేరు గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. కానీ అతను తన ఆటను ఆపలేదు. ఫెడరర్ పని అయిపోయిందనుకున్న ప్రతీసారి మళ్లీ బలంగా పైకి లేచాడు. మళ్లీ గొప్ప విజయాలతో దూసుకుపోయాడు. అతనిలో ఈ గొప్పతనమే అందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే 36 ఏళ్ల వయసులో అతను మళ్లీ నంబర్‌వన్ అయ్యాడు. 24 ఏళ్లు అంతర్జాతీయ టెన్నిస్ ఆడినా..1526 సింగిల్స్, 224 డబుల్స్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకోలేదు. అది అతని పట్టుదలకు నిదర్శనం. ఒక్కసారి ఆట మొదలు పెడితే అది గెలుపో, ఓటమే తేలిపోవాల్సిందే తప్ప మధ్యలో ఆయుధాలు పడేసే రకం కాదు అతను. డబుల్స్.. మిక్స్డ్ డబుల్స్.. ‘ఆమె లేకపోతే నా ఆట ఎప్పుడో ముగిసిపోయేది. ఎన్నో క్లిష్ట సందర్భాల్లో నేను టెన్నిస్ ప్రయాణం ఆపేయాలని అనుకున్నా, తాను అండగా నిలిచి నాలో స్ఫూర్తి నింపింది’ అని భార్య మిరొస్లావా (మిర్కా) గురించి ఫెడరర్ తరచూ చెప్పేవాడు. ఆమె కూడా అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయరే. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు 2000 సంవత్సరం.. సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆటగాళ్లుగా అక్కడే తొలి పరిచయం.. అదే టోర్నీలో తొలి ముద్దు కూడా! అయితే 2002లో గాయంతో ఆటకు దూరమైన మిర్కా ఆ తర్వాత ఫెడరర్ సహాయక సిబ్బందిలో భాగమైంది. ఆ సమయంలోనే ఆమె వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన ఫెడరర్ మనసు పారేసుకున్నాడు. 2009లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు.. వారిద్దరూ రెండు జతల కవలలు కావడం విశేషం. మైలా, చార్లిన్ అనే అమ్మాయిల జంట.. వారికంటే ఐదేళ్లు చిన్నదైన లియో, లెన్నీ అబ్బాయిల జంటతో రోజర్ కుటుంబ ఆనందం నాలుగింతలైంది. అన్నట్లు ఫెడరర్‌కు రెండేళ్లు పెద్దదైన అక్క డయానా కూడా ఉంది. దాతృత్వంలో మేటి అక్షరాలా 19 లక్షల 80 వేలు.. ఫెడరర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా సదుపాయాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య అది. తన ఫౌండేషన్ ద్వారా సొంత దేశం స్విట్జర్లాండ్‌లో పలు విరాళాలు అందించిన ఫెడరర్ అంతకంటే మెరుగైన పని తాను చేయాల్సి ఉందని గుర్తించాడు. అందుకు తన అమ్మమ్మ దేశమైన దక్షిణాఫ్రికాను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో పాటు పొరుగు దేశాలు లెసొతొ, మలావి, నమీబియా, జాంబియా, జింబాబ్వేలలో పాఠశాల విద్యను మెరుగుపరచడంలో అతని నిధులు ఉపయోగపడుతున్నాయి. ఇందు కోసం గత కొన్నేళ్లలో అతని సంస్థ సుమారు రూ. 569 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 10 వేల పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచింది. ఫెడరర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ యజ్ఞంలో అతని వ్యక్తిగత స్పాన్సర్లంతా భాగం పంచుకొని సహకారం అందించారు. రోజర్ ఆటతో పాటు ఇలాంటి దాతృత్వం అతడిని ఇతర స్టార్లకంటే ఒక మెట్టు పైన ఉంచింది. వివాదమా.. నీవెక్కడ? అంతర్జాతీయ స్టార్ ఆటగాడంటే ఒక రేంజ్లో ఉండాలి. ఆటలోనే కాదు, మాటల్లో కూడా పదును కనిపించాలి. అప్పుడప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా ‘తానేంటో’ గుర్తించేలా నాలుగు పరుష పదాలు వాడటమో, లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలో చేస్తుండాలి. కానీ ఫెడరర్ గురించి గూగుల్ చేసి చూడండి. వివాదం అన్న పదం కూడా కనిపించదు! గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నా, ఓడినప్పుడు ప్రత్యర్థిని అభినందించినా ఎక్కడా మాటలో, ప్రవర్తనలో కట్టు తప్పలేదు. అదే అతడి గొప్పతనాన్ని రెట్టింపు చేసింది. కావాలంటే 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్‌ను చూడండి.. 21కి తగ్గని వివాదాలు ఉంటాయి. కానీ ఈ స్విస్ స్టార్ మాత్రం ఎప్పటికీ వాటికి దూరమే. ఫెడరర్ ఎక్స్‌ప్రెస్ ►వరుసగా 237 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ ► గెలిచిన మొత్తం టైటిల్స్ 103 ► స్విట్జర్లాండ్ దేశం ఫెడరర్ పేరిట పోస్టల్ స్టాంప్‌తో పాటు నాణేలపై కూడా అతని ఫొటోను ముద్రించింది. ఆ దేశంలో బతికి ఉండగానే అలాంటి గౌరవం అందుకున్న ఏకైక వ్యక్తి. ► సొంత నగరం బాసెల్‌లో ‘ఫెడరర్ ఎక్స్‌ప్రెస్’ అని ఒక రైలుకు పేరు పెట్టారు. ► ఆట ద్వారా సుమారు 130 మిలియన్ డాలర్లు ఆర్జిస్తే, ప్రకటనల ద్వారా మరో 100 మిలియన్లకు పైగా రోజర్ సంపాదించాడు. 30 ఏళ్ల ‘ఫోర్బ్స్’ చరిత్రలో నంబర్‌వన్ గా నిలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్. -
వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ
పట్టణాల్లో నాగరికత రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడల్లో లే అవుట్లై..అండర్‌గ్రౌండ్ డ్రైనేజై.. కూడళ్లలో పార్కులై.. కుళాయిలై.. బడులు.. కాలేజీలు.. కాలక్షేపానికి థియేటర్లు.. షాపింగ్ మాల్సై కనపడుతుంది! వానలు.. వంతలు వచ్చినప్పుడు వరదలై ఉప్పొంగుతుంది కూడా! కానీ ఈ పల్లెలో నాగరికత.. ఇళ్లల్లో ఇంకుడు గుంతలై.. కూడళ్లలో పరిశుభ్రతై.. ఆలోచనల్లో విజ్ఞత, విచక్షణై.. నడక, నడతల్లో సంస్కారమై.. కొలుపులు, కొట్లాటలకు నిర్వాసితై.. స్త్రీ, పురుష సమానత్వమై వెల్లివిరుస్తోంది! అదెక్కడో అభివృద్ధి ఆకాశాన్నంటిన.. హ్యాపీ ఇండెక్స్‌లో పైనున్న దేశాల్లో లేదు! తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నూరు కిలోమీటర్ల పై దూరంలో ఉంది! పేరు.. వెంకంపల్లి! దాని గురించిన వివరాలను తెలుసుకునేందుకు వెల్కమ్ చెప్తోంది!! భగవంతుడి మీద నమ్మకం.. ఆధ్యాత్మికత.. ఈ రెండూ మనిషిని మనిషిగా నిలబెట్టే ప్రయత్నాలు.. మార్గాలు కూడా! ఈ మార్గాలను అనుసరించే మనిషి .. సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాడు. మాటలతో కాదు చేతలతో! అలా భక్తిని.. ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకుని వ్యక్తిగత పరివర్తనతో పాటు పరిసరాల అభివృద్ధికీ పాటుపడ్డ.. పడుతున్న ఊరే వెంకపల్లి! మంజీర ఒడ్డున ఉన్న ఓ చిన్న పల్లెటూరు ఇది. తెలంగాణలోని కామారెడ్డి – మెదక్ జిల్లాల సరిహద్దుల్లోని మారుమూల గ్రామం. చుట్టూరా పచ్చని పంట పొలాలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇదివరకు ఇది తాండూర్ పంచాయతీ పరిధిలో ఉండేది. పంచాయతీల పునర్విభజన జరిగి 2018 ఆగస్టు 2న పంచాయతీగా ఏర్పడింది. 172 కుటుంబాలు నివాసం ఉంటాయిక్కడ. పురుషుల సంఖ్య మూడు వందల యాభై మూడు, మహిళల సంఖ్య మూడు వందల డెబ్భై తొమ్మిది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఇది లింగ వివక్ష లేని ఊరని! గ్రామస్థుల ప్రధాన వృత్తి వ్యవసాయం. సూర్యోదయంతోనే పొలాన్ని చూసుకోనిదే వాళ్ల దినచర్య మొదలవదు. ఊళ్లో అందరూ ఎంతో కొంత చదువుకున్నవారే! ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేస్తున్నవారూ ఉన్నారు. మంజీర ముంచేసింది.. 1989లో కురిసిన భారీ వర్షాలకు మంజీర పొంగి వెంకంపల్లిని చుట్టేసింది. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో గ్రామస్థులంతా ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగులు తీశారు. పైభాగన ఉన్న ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పెద్దగా వ్యవసాయం నడిచేది కాదు. ఇళ్లన్నీ నీట మునగడంతో ఎగువ భాగాన ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. 1990 ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందించిందని గ్రామస్థులు చెప్పారు. అలా ఇళ్లు కట్టుకొని తమ ఊరిని పునర్నిర్మించుకున్నారు. ఏదో పొలం పనులు చేసుకుంటూ మునుపటిలాగే జీవనం సాగించేవారు. పరిసరాల శుభ్రత.. ఊరును ఓ జట్టుగా ఉంచుకునే వంటి వాటి మీద అవగాహన.. ప్రయత్నంలాంటివి లేకుండా! ఆ సమయంలోనే అంటే 1994లో.. వెంకపల్లిని బాన్స్వాడ పట్టణానికి చెందిన తాడ్కొల్ గంగారం, ఆర్ఎంపీ డాక్టర్ నాగభూషణం ఆధ్వర్యంలోని స్వాధ్యాయ బృందం సందర్శించింది. వాళ్లకు ఈ గ్రామంలో.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక.. ఎక్కడ పడితే అక్కడ మురికి నీటి గుంటలు కనిపించాయి. ఇళ్లు..చుట్టూ పరిసరాలు కూడా దోమలు, ఈగలకు ఆలవాలంగా అనిపించాయి. ఆధ్యాత్మిక వచనాల కన్నా ముందు గ్రామానికి పరిశుభ్రత పాఠాలు అవసరమని గ్రహించింది స్వాధ్యాయ బృందం. వాన నీటి సంరక్షణకే కాదు.. మురికి నీటిని తోలేందుకూ ఇంకుడు గుంతలే పరిష్కారమని బోధించింది. ఆ ఊళ్లో చక్కటి డ్రైనేజీ వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఆ సమస్య తీరాక స్వాధ్యాయ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ఆ బృందం ఆశించినదాని కంటే గొప్ప ఫలితాలనే చూపించడం మొదలుపెట్టింది ఆ ఊరు. పరిసరాల పరిశుభ్రతలోనే కాదు.. ఊరి అభివృద్ధిలో కూడా! భక్తిని మూఢ విశ్వాసంగా కాకుండా దైనందిన జీవితానికి అన్వయించడం తెలుసుకున్నారు. స్వాధ్యాయ నేర్పిన ఆధ్యాత్మికతను తమ గ్రామ ప్రగతికి సోపానంగా మలచుకున్నారు. క్రమశిక్షణను అలవరచుకున్నారు. కష్టించి పనిచేయడాన్ని మించిన దైవారాధన లేదని నమ్మారు. తోటి వారిని గౌరవించడాన్ని మించిన మతం లేదనే విశ్వాసాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఒకరికొకరు సాయంగా ఉంటే ఊరంతా బాగుంటుందనే సత్యాన్ని అమలు చేయడం ఆరంభించారు. అదే ఆ ఊరికి నిర్ణయించని కట్టుబాటుగా మారింది. ప్రతిఒక్కరూ వారి ఇళ్ల వద్ద స్వచ్ఛందంగా ఇంకుడుగుంతలను నిర్మించు కున్నారు. దీనివల్ల గ్రామంలో భూగర్భజలాలు పెరగడంతో పాటు మురుగు సమస్య లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గ్రామంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఆవరణలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాల్సిందే! ఆధ్యాత్మిక చింతనలో భాగంగా సొంతడబ్బులతో గ్రామస్థులు 2001లో అమృతాలయాన్ని కట్టుకున్నారు. దానికి ప్రత్యేకంగా పూజారి అంటూ ఎవరు ఉండరు. ప్రతి 15రోజులపాటు ఉదయం, సాయంత్రం గ్రామానికి చెందిన ఒక జంట(దంపతులు) ఆ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. ఈ 15రోజులూ ఆ దంపతులు మాంసం, మద్యం ముట్టుకోరు. గ్రామానికి చెందిన స్వాధ్యాయ భక్తులు కొందరు తీర్థయాత్రల పేరిట వారంరోజులపాటు ఇతరప్రాంతాలకు వెళ్లి స్వాధ్యాయ కార్యక్రమాలు, అందులో భాగంగా స్వయం సమృద్ధి, స్వావలంబన మీద అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పుడు ఆ ఊళ్లో.. .. ఎక్కడా మురికి కాలువలు కనిపించవు. వంట గదిలో వాడిన నీరైనా, బాత్రూమ్లోంచి వెళ్లే మురికి నీరైనా భూమిలోకి ఇంకిపోతాయి. బయట మురికి కాల్వలు లేకపోవడంతో దోమలు, ఈగల బెడద లేదు. ఏ ఇంటికి వెళ్లినా ఇంటి ఆవరణలో కూరగాయలు, ఆకు కూరల మొక్కలు కనిపిస్తాయి. సీజనల్ పండ్ల చెట్లూ పలకరిస్తుంటాయి. టేకు చెట్లు, కొబ్బరి చెట్లను కూడా పెంచుతున్నారు. కరివేపాకు చెట్టు లేని ఇల్లు లేదంటే నమ్మండి! అందరూ ఆర్థికంగా ఎదిగినవారే. పిల్లలంతా ఉన్నత చదువులు చదివిన.. చదువుతున్నవారే. దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే. జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో 15 మంది పనిచేస్తుండగా, మరో 30 మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అలాగే ఇంకొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామంలో దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతున్న వారు మరో నలభై మంది వరకు ఉన్నారు. ఇంజనీరింగ్ వైపే ఎక్కువ మంది వెళ్లారు. ఒకరిద్దరు మెడిసిన్ వైపు వెళ్లినట్టు గ్రామస్థులు పేర్కొన్నారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు యువతులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఊళ్లో యాభై ఏళ్లు పైబడిన వాళ్లే కనిపిస్తారు. అంతా కలసిమెలసి ఉంటారు. సాగులో ఆదర్శం.. వెంకంపల్లి అంటేనే వ్యవసాయం. ఇక్కడ ఆదర్శ సేద్యం చేస్తారు. ఈ గ్రామస్థులకు వెంకంపల్లి సహా తాండూర్, లింగంపల్లి కలాన్ గ్రామాలతో కలిపి దాదాపు 780 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. అప్పట్లో చెరకు పంట ఎక్కువగా సాగయ్యేది. రైతులంతా బెల్లం తయారు చేసేవారు. అనకాపల్లి బెల్లం తయారీలో వెంకంపల్లి రైతులు ముందుండేవారు. పుట్లకొద్ది బెల్లం వండి మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. ప్రభుత్వం బెల్లంపై ఆంక్షలు విధించిన తరువాత బెల్లం తయారీ నిలిచిపోయింది. గతంలో నాలుగైదు వందల ఎకారల్లో చెరకు సాగయ్యేది. ఇప్పుడు కేవలం వంద ఎకరాల్లోనే సాగవుతోంది. చెరకును గాయత్రీ చక్కెర కర్మాగారానికి తరలిస్తారు. అయితే చెరకు సాగుకు కూలీల సమస్య, గిట్టుబాటు లేకపోవడంతో చాలా మంది రైతులు వరివైపు మొగ్గుచూపారు. ఇప్పుడు గ్రామంలో దాదాపు 550 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో చెరకును సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో ఆరుతడి పంటలు సాగవుతాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఇక్కడి రైతులు. రెండు చెరకు హార్వెస్టర్లు, పది వరకు వరి కోత మిషన్లు, 30 వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ గడప తొక్కరు.. గొడవలు.. గట్టు పంచాయతీలు.. గృహ హింస లేని ఊరుగా వెంకంపల్లిని పేర్కొనవచ్చు. గొడవలకు ఆస్కారమే లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ మాటే రాదు ఆ ఊళ్లో. చిన్న చిన్న సమస్యలు ఎదురైతే ఊర్లోనే కూర్చుని మాట్లాడుకుంటారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న సంఘటనలు తక్కువే. ఎన్నికల సమయంలో పోటాపోటీ రాజకీయాలు ఉంటాయి. తరువాత ఎవరి పని వారు చేసుకుంటారు. ఏదైనా సమస్య తలెత్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా గ్రామ పెద్దలు కూర్చుని సమస్యను పరిష్కరించేస్తారు. కుటుంబాల్లో తగాదాలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టే తమ ఊరు వివాదాలు, తగాదాలకు అతీతమైందని చెప్తారు వెంకంపల్లి వాసులు. ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ ఏం ఉంటుంది!! మా వాళ్లకు హక్కుల కన్నా బాధ్యతలు బాగా తెలుసు. అందుకే మా ఊరు క్రమశిక్షణ, శ్రమ, ఐకమత్యానికి మారుపేరుగా నిలిచింది. ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ ఏం ఉంటుంది ఏ ఊరికైనా! – శుభాకర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ పండగవేళ సందడే సందడి.. గ్రామంలోని దాదాపు అన్ని ఇళ్లూ ఆధునిక సౌకర్యాలతో కట్టినవే. బంధువులు, స్నేహితులు వస్తే పార్టీ చేసుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకున్నారు. ఏదేని పరిస్థితుల్లో కరెంటు పోతే ఇన్వర్టర్లు వాడతారు. ఫ్రిజ్‌లు, టీవీలు లేని ఇళ్లు దాదాపు లేవు. గ్రామంలో 45 వరకు కార్లు ఉన్నాయి. వందకు పైగా ద్విచక్ర వాహనాలున్నాయి. పట్టణాల్లో, విదేశాల్లో ఉన్న పిల్లలంతా పండుగల సమయంలో ఊరికి వస్తారు. అప్పుడు వెంకంపల్లి అంతా సందడిగా మారుతుంది. ఇలా ఎప్పుడో జానపద కథల్లో విన్నట్టుగా.. ఊహల్లో కన్నట్టుగా ఉన్న ఈ ఊరు కనిపిస్తున్న సత్యం! ఆల్ ఈజ్ వెల్.. ఫీల్ గుడ్ను భావనల్లోనే కాదు ప్రాక్టికల్‌గా సాక్షాత్కరింపచేసుకుని వెంకంపల్లి ఇతర పల్లెలకే కాదు.. నాగరికతకు చిహ్నంగా భావించే నగరాలకూ స్ఫూర్తి! కులం, మతం పేరుతో మనుషులను దూరం చేస్తున్న సిద్ధాంతాలకు, మూఢభక్తితో నేరప్రవృత్తిని పెంచుతున్న, పెంచుకుంటున్న తత్వాలకు చెంప పెట్టు ఈ పల్లె! ∙సేపూరి వేణుగోపాలచారి సాక్షి, కామారెడ్డి -
ఇండోనేసియాలో ఇంటిపంటలకు కోవిడ్ కిక్కు!
17 వేల ద్వీపాల సమాహారమైన ఇండోనేసియా నగరాలు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారపు అవసరాలు తీర్చడంలో, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అర్బన్ ఫార్మింగ్ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. కరోనా అనంతర కాలంలో వైవిధ్య భరితమైన, రసాయనిక అవశేషాల్లేని ఆహారం కోసం అర్బన్ ఫార్మింగ్ చేపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. సకియా నసుషన్ తన రెండంతస్తుల మేడపైన ఏడాది క్రితం నుంచి సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుమత్రా దీవిలో అతిపెద్ద నగరం మెడాన్ నివాసి ఆమె. ముగ్గురు బిడ్డల తల్లి అయిన సకియా స్థానిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రం బోధిస్తున్నారు. సాగు మెలకువలు తెలిసినప్పటికీ కోవిడ్ మహమ్మారి తాకిడి తర్వాతనే ఆమె ఇంటిపైన పంటలు సాగు చేయటం ప్రారంభించారు. ‘ఇప్పుడు మా ఇంటిల్లిపాదికీ అవసరమైన కూరగాయలన్నీ పండించుకుంటున్నాం. ఆకుకూరలైతే అసలు బయట కొనాల్సిన అవసరమే రావటం లేదు’ అంటారామె. కాలీఫ్లవర్స్, పాలకూర, టొమాటోలు, లెట్యూస్, జపనీస్ మస్టర్డ్ గ్రీన్స్, కీరదోస, పసుపు, అల్లం వంటి అనేక పంటలను టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తున్నారు సకియా. ఆమెను చూసి పరిసరాల్లోని అనేక ఇళ్లపైన కూడా కిచెన్ గార్డెన్లు పుట్టుకొచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇండోనేసియాలో ఆహారోత్పత్తుల ధరలు అమాంతంగా 30–40% పెరగటం కూడా ప్రజలను సేంద్రియ ఇంటిపంటల దిశగా నడిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పండ్లు సాధ్యమైనంత వరకైనా పండించుకోవాలన్న స్పృహ నగరవాసుల్లో విస్తరిస్తోంది. ‘ఇంటిపంటల సాగు దిశగా ప్రజలు కదలటం ఆహారోత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంద’ని వెస్ట్ జావా రాష్ట్రంలో గరుట్ జిల్లాకు చెందిన నిస్సా వర్గడిపుర అనే సామాజిక కార్యకర్త అంటున్నారు. నిస్సా అనేక ఏళ్ల క్రితమే అత్–తారిఖ్ సేంద్రియ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌ను నెలకొల్పి రసాయనాలు వాడకుండా పంటలు పండించడంలో యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కృషికి గాను నాలుగేళ్ల క్రితం ఓ పురస్కారాన్నీ అందుకున్నారు నిస్సా. ఇండోనేసియాలో ఆహార భద్రతకు చిన్న, సన్నకారు రైతుల కుటుంబ సేద్యం మూల స్తంభం వంటిది. అనేక రకాల కూరగాయ పంటలు పండించి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అర్బన్ ఫార్మింగ్ దోహదం చేస్తోంది అంటున్నారు నిస్సా. స్కూల్‌కు అనుబంధంగా ఉన్న రెండున్నర ఎకరాల క్షేత్రంలో 450 రకాల బహువార్షిక, ఏకవార్షిక, సీజనల్ పంటలను నిస్సా సాగు చేస్తుండటం విశేషం. సెంట్రల్ జావా రాష్ట్రంలోని సురకర్త (దీన్ని ‘సోలో’ అని కూడా పిలుస్తారు) నగరం అర్బన్ ఫార్మింగ్‌కు పెద్ద పీట వేస్తోంది. నగరంలో ఇళ్లపైన, ప్రభుత్వ/ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ఎత్తు మడులపై, కుండీల్లో సేంద్రియ ఇంటిపంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. మరోవైపు, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఆకుకూరలు, టొమాటోలు పండించడం అర్బన్ యూత్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. ప్రత్యేక శిక్షణ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. సోలో నగర పొలిమేర ప్రాంతాల్లో హెక్టారు కన్నా తక్కువ క్షేత్రాల్లో అర్బన్ ఫార్మర్స్ వాణిజ్య స్థాయిలో పంటలు పండిస్తున్నారు. పెరటి కోళ్ల పెంపకం, ఇళ్ల దగ్గరే చిన్న సిమెంటు ట్యాంకుల్లో క్యాట్‌ఫిష్ సాగు కనిపిస్తోంది. కూరగాయలు, పండ్లతో పాటు తేనెకు మంచి గిరాకీ ఉందని సోలో సిటీ ఫార్మర్స్ చెబుతున్నారు. ఇండోనేసియా ప్రభుత్వం నగరప్రాంత ప్రజల ఆహార భద్రతకు ప్రత్యేక చట్టాలు చేసి అర్బన్ అగ్రికల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. ఫుడ్ సెక్యూరిటీ కౌన్సిల్ అర్బన్ అగ్రికల్చర్ పథకానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేసింది. దీని అమలు తీరును సోలో నగర మేయర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మహిళా అర్బన్ రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుండటం విశేషం. – పంతంగి రాంబాబు కోవిడ్ నేర్పిన గుణపాఠం వల్ల రోగాలను పారదోలే కార్యకలాపాలకు ఇల్లే కేంద్రంగా మారింది. అందుకే ఇప్పుడు అర్బన్ ఫార్మింగ్ ఊపందుకుంది. మాకు అవసరమైన ఆకుకూరలు, కూరగాయలను ఇంటిపైనే పండించుకుంటున్నాం. – సకియా, అర్బన్ ఫార్మర్, అగ్రికల్చర్ లెక్చరర్, మెడాన్, ఇండోనేసియా -
'డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్'.. మిస్టరీ స్టోరీ
అది 2006 జనవరి 25.. లండన్‌లోని మెట్రోపాలిటన్ హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వకేట్స్‌తో కలసి తమ ఆధీనంలో ఉన్న బెడ్సిట్ అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్ ముందు నిలబడి.. కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. బెడ్సిట్ ఫ్లాట్స్ అంటే.. వసతి గృహాలు లాంటివి. గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలు. ఎంతసేపటికీ తలుపు తియ్యకపోవడంతో.. అనుమానం వచ్చిన వారంతా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తలుపు తెరవగానే.. గుమ్మం ముందే కుప్పలు తెప్పలుగా పడున్న ఉత్తరాలు చూసి షాక్ అయ్యారు. చీకటిగా ఉన్న ఎంట్రెన్స్ గేట్ నుంచి కిచెన్‌లోకి వెళ్లారు. సింక్ నిండా చాలారోజులగా కడగని సామాన్లే. గది అంతా కుళ్లిన వాసన. అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్లేసరికి హాల్లో టీవీ ఆన్‌లోనే ఉంది. టీవీ ముందు సోఫాలో ఓ మహిళ కూర్చుని ఉన్నట్లు కనిపించింది. దగ్గరకు వెళ్లేసరికి గుప్పుమన్న దుర్గంధం నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వలేదు. అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్లుగా ఉన్న ఆ శవం.. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న మహిళదే అని గుర్తించడానికి వారికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె కాళ్ల దగ్గర ఓ షాపింగ్ బ్యాగ్ పడుంది. కాస్త దూరంలో కొన్ని క్రిస్మస్ గిఫ్ట్స్ ప్యాక్ చేసున్నాయి. ఫ్రిజ్‌లోని ప్రొడక్ట్స్ 2003 ఎక్స్‌పెయిరీ డేట్‌తో కనిపించాయి. అంటే ఆమె చనిపోయి ఆరోజుకి మూడేళ్లు కావస్తోందా? టీవీ అప్పటి నుంచి ఆన్‌లోనే ఉందా? ఆ షాక్‌తో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి.. విచారణ మొదలుపెట్టారు. నిజానికి హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వొకేట్స్తో ఆ అపార్ట్మెంట్కి రావడానికి కారణం మూడేళ్లుగా ఆ మహిళ అద్దె కట్టకపోవడమే. కేసు విచారణలో భాగంగా ఆ మహిళ ఊరు, పేరు, వయసు అన్నీ ట్రస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలను ఆమె అపార్ట్మెంట్లో సేకరించారు. మరునాడు ఉదయం పత్రికల్లో ‘మూడేళ్లకు బయటపడిన మహిళ శవం’ అనే వార్తతో పాటు.. చనిపోయిన ఆ మహిళ పేరు జాయిస్ కరోల్ విన్సెంట్ అని, ఆమె వయసు 38 ఏళ్లని, మీలో ఎవరికైనా ఆమె గురించి తెలుసా? తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండంటూ ప్రకటనలూ వచ్చాయి. శరీరం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే మిగలడంతో.. ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. తలుపు వేసి ఉన్న ఇంట్లో.. టీవీ చూస్తున్న మహిళ.. కూర్చున్న చోటే ఎలా మరణించింది? అనేది ఎవ్వరికీ అంతుపట్టలేదు. పైగా ఆ ఫ్లాట్స్‌లో ఎంతో మంది ఉంటున్నారు. ‘మూడేళ్లుగా ఏ ఒక్కరికీ కుళ్లిన వాసన రాలేదంటే ఆశ్చర్యమే?’ అదే ప్రశ్న ఆ అపార్ట్మెంట్స్ వాళ్లను అడిగితే.. కిందే పేరుకున్న డంప్ యార్డ్‌ని చూపించారు. ఆ కుళ్లిన వాసన.. కిందున్న చెత్త వల్లే వస్తుందనుకున్నామని చెప్పారు. ఇక ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యేసరికి.. జాయిస్ విన్సెంట్ మాజీ కొలీగ్స్, బాయ్‌ఫ్రెండ్స్, స్నేహితులు ఇలా ఒక్కొక్కరూ బయటికి వచ్చారు. వాళ్లకు తెలిసిన సమాచారాన్ని అందించారు. జాయిస్ 1965 అక్టోబరు 19న లండన్‌లోని హ్యామర్‌స్మిత్ ప్రాంతంలో జన్మించిందని, తండ్రి లారెన్స్.. ఆఫ్రికన్ సంతతికి, తల్లి లిరిస్.. భారత సంతతికి చెందినవారని, తన పదకొండేళ్ల వయసులో తల్లి మరణించిందని, తర్వాత తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూశారని, పదహారేళ్ల వయసులో పాఠశాలను విడిచిపెట్టి.. మ్యూజిక్ వైపు దృష్టిసారిస్తూనే లండన్‌లోని ౖఇఔలో సెక్రటరీగా పని చేసిందని, ఎర్నెస్ట్లోని ట్రెజరీ డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలకు పైగా పని చేసి.. 2001 మార్చిలో ఉన్నట్టుండి రాజీనామా చేసిందని.. ఆమె జీవితంలో నెల్సన్ మండేలా వంటి గొప్పవారిని కలుసుకుందని.. ఇలా కొన్ని వివరాలు సేకరించగలిగారు పోలీసులు. అదే 2001లో తనకు ఎంతో ఇష్టమైన తండ్రి మరణ వార్త ఆమెను చాలా కుంగదీసిందని కొందరు సన్నిహితులు చెప్పారు. నిజానికి జాయిస్ తండ్రి లారెన్స్ 2004లో చనిపోయాడు. అతడి కంటే ముందే జాయిస్ చనిపోయిందన్న విషయం లారెన్స్‌కు తెలియదు. జాయిస్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బెడ్సీట్ ఫ్లాట్స్‌లో ఆశ్రమం పొందుతూ డబ్బుల కోసం హోటల్లో క్లీనర్‌గా మారింది. ఈక్రమంలోనే ఆమె తన కుటుంబానికి, స్నేహితులకు దూరమైంది. తన వాళ్లు ఇంతమంది ఉన్నా.. తను చనిపోయిన విషయం ఏ ఒక్కరూ గుర్తించకపోవడమే ఈ కథ విన్న ప్రతిఒక్కరినీ కదిలించింది. 2003 నవంబర్‌లో ఆమె కడుపులో పుండు కారణంగా రెండు రోజుల పాటు నార్త్ మిడిల్సెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందిందని, ఉబ్బసంతో బాధపడిందని, పెప్టిక్ అల్సర్ అటాక్ అవ్వడం వల్లే చనిపోయిందని అధికారులు భావించారు. ఎలాంటి విషప్రయోగం జరగలేదని రిపోర్ట్ రావడంతో.. సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. టెలివిజన్ అన్నేళ్లుగా పనిచేయడానికి కారణం.. ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ యాక్టివ్‌లో ఉండటమేనని నిర్ధారించారు. అన్నేళ్లుగా టీవీ సౌండ్ వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధాకరమే.అయితే ఈ వార్తను మీడియాలో ఫాలో అయిన కరోల్ మోర్లీ అనే ప్రముఖ దర్శకురాలు.. దీనిపై డాక్యుమెంటరీ తియ్యాలనే ఉద్దేశంతో జాయిస్ స్నేహితులను, బంధువుల్ని కలసినప్పుడు జాయిస్ చనిపోయిందన్న విషయం తెలిసి వాళ్లు షాకయ్యారట. 2011లో మోర్లీ డైరెక్షన్లో వచ్చిన ‘డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ జాయిస్ జీవితాన్ని చూపిస్తూనే.. ఒంటరి జీవితంపై ఎందరినో ఆలోచింపచేసింది. జాయిస్ విన్సెంట్ కథ ఎంత వింతగా ఉంటుందో అంతే విషాదకరమైనది. ‘మనిషికి జీవిత భాగస్వామే అసవరం లేదు.. కనీసం తన అనుకునే మనిషి.. తనకోసం ఆలోచించే మనిషి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం’ అని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. ఏదిఏమైనా కూర్చున్న మనిషి కూర్చున్నట్లే ప్రాణాలు విడవడంతో.. ఆమె మరణానికి సరైన కారణాన్ని తేల్చకపోవడంతో ఈ కథ మిస్టరీగానే మిగిలింది. ∙సంహిత నిమ్మన -
'ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్'.. ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం!
ఇంగ్లండ్‌లో ఏటా ఆగస్టు నెలలో జరిగే ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం. రకరకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతో ఏకంగా పాతికరోజుల పాటు జరిగే సుదీర్ఘ సంబరం కూడా. ప్రస్తుతం ఆగస్టు 5 నుంచి 29 వరకు ఈ సంబరాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఇదివరకు ఎడిన్‌బరో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగేది. దీనిని 1947 నుంచి ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్‌గా మార్చారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, జాతులకు చెందినవారు ఈ సంబరాల్లో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనల వంటివి జరుగుతాయి. వీటితో పాటే వీధుల్లోనూ రకరకాల ప్రదర్శనలు, విచిత్రవేషధారణలు, విన్యాసాలు, సాము గరిడీలు చేస్తూ వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. వేదికలపై 3,548 ప్రదర్శనలతో పాటు, ఆరుబయట వీధుల్లో దాదాపు 55 వేలకు పైగా ప్రదర్శనలు ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సంబరాల్లో హాస్య ప్రదర్శనలకే అగ్రతాంబూలం. హాస్య ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచిన వారికి ఏటా ‘ఎడిన్‌బరో కామెడీ అవార్డ్స్’తో సత్కరిస్తారు. ‘కరోనా’ కారణంగా 2020లో ఈ సంబరాలను నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 6–30 తేదీల్లో నిర్వహించినా, ‘కరోనా’ తీవ్రత కారణంగా 673 ప్రదర్శనలు మాత్రమే జరిగాయి. ‘కరోనా’ భయం చాలావరకు కనుమరుగవడంతో ఈసారి పూర్తిస్థాయిలో సంబరాలు జరుగుతుండటంతో జనాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. విచిత్రవేషధారులతో, సర్కస్ విన్యాసాల ప్రదర్శనలతో ఎడిన్‌బరో వీథులన్నీ కళకళలాడుతున్నాయి. చదవండి: ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా? -
ఆజాద్ హింద్ ఫౌజ్.. ఖుషీ కే గీత్ గాయే జా..!
ఆ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. అలా అడిగాక మొదట అతడు చేసిన పని, తటాల్న నాకేసి చూడడం. నన్ను చూస్తూనే బుగ్గల మీద ఎడం చేత్తో రాసుకున్నాడు, కొన్ని సెకన్లు. దంతాలు ఊడి లోతుకుపోయిన బుగ్గలు. ఓ నిమిషం తరువాత అతడి ముఖంలో చిన్న నవ్వు. అప్పుడే కళ్లూ మెరిశాయి, ఒక్కసారిగా. ‘చూశాను బాబూ!’ స్థిరంగా అన్నాడతడు. అతని గొంతుపెగిలాక నా మనసు శాంతించింది. పాట అందుకుంటే రెండు వీధుల అవతల ఉన్నా ఖంగుమంటూ వినిపించే ఆ గొంతు అంత మార్దవంగా, అంత మంద్రంగా స్పందించడం కొంచెం వింతే. ఎంత గొప్పగా పాడతాడో ఆ పాటలన్నీ ‘కదం కదం బఢాయే జా, ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందగీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాగిపో సాగిపో మున్ముందుకు, ఆనందగీతికలను ఆలపిస్తూ సాగిపో, నీ జీవితాన్ని మాతృభూమి కోసం అర్పించుకో ఎంత బలమైన భావన. ఇదే కాదు శుభ్ సుఖ్ చైన్ కీ బర్ఖా బర్సే, ఎక్ల చొలో, హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ వంటి పాటలూ పాడతాడు. శ్రీరాములు, కొల్లి శ్రీరాములు.. ఒంటి మీద ఖాకీ మిలటరీ యూనిఫారవ్ు. టక్ చేసుకున్నాడు. అప్పటిదే కాబోలు ఆ యూనిఫారవ్ు. శిథిలమైపోయినట్టున్నా, రంగు మాత్రం వెలిసిపోలేదు. అతడు ఒక వయసులో ఎలా ఉన్నాడో చెబుతూ, ఆ శరీరం మీద ఇప్పుడు వేలాడిపోతోంది. దాని వయసు కనీసం యాభయ్ ఏళ్లు. కాళ్లకి బూట్లతోనే బాసిం పట్టు వేసుకుని నేల మీద కూర్చున్నాడు. బూట్లు కూడా అప్పటివేనేమో! స్లాబ్ పనివాళ్ల బూట్లలా ఉన్నాయి. ఆ రూపం చిన్నతనం నుంచి మేం చూస్తున్నదే. మామూలు బట్టల్లో ఏనాడూ చూసిందిలేదు. జుట్టు మరీ ముగ్గుబుట్ట కాలేదు. కొద్దిగా నల్ల వెంట్రుకలూ ఉన్నాయి. నడినెత్తి మీద నుంచి వెనక్కే. ముందంతా బట్టతల, వెనక జులపాలు. నల్లటి శరీరం. నుదురు కింద లోతుకు పోయిన కళ్లు. ఆ మహావ్యక్తిని చూసిన కళ్లు ఇవే! అదృష్టం చేసుకున్నాయి! ‘ఎక్కడ చూశావు శ్రీరాములు?’ ‘బర్మాలో బాబూ!’ ఏదో లోకంలో ఉన్నట్టే ఆ మాటలన్నాడు. నేను ఐదో తరగతిలో ఉండగా, ఓ ఆగస్ట్ 15 పండుగకి ఒక సన్నివేశంలో అతడిని చూసినప్పటి నుంచి నాకు ఓ రకమైన సానుభూతి.. శ్రీరాములంటే. నాన్నగారు చెప్పినదానిని బట్టి గౌరవం కూడా. మా ఇంటి బయటకొచ్చి నిలబడినా మేం చదువుకున్న ఆ స్కూలు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం ఇవతలే అమ్మవారి గుడి. దానికి దగ్గరగా గ్రామ పంచాయతీ కార్యాలయం. ఆ ఘటన జరిగింది ఆ కార్యాలయం ముందే. శ్రీరాములుకి గుర్తుందో లేదో! దారే కాబట్టి ఆ కార్యాలయం ముందు నుంచి పాడుకుంటూ అతడు ఎప్పుడు నడిచి వస్తున్నా, వెళుతున్నా నాకు మాత్రం ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది. తరువాత అతడిని చూస్తున్న కొద్దీ నాకూ అనిపించేది, ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. ఎందరికో ఉన్న అభిప్రాయమే. అలా చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడచిపోయాయి. పదిరోజులకీ, పదిహేను రోజులకీ ఒకసారి ఇంటిముందుకొచ్చి అరుస్తాడు, అటెన్షన్లో నిలబడే, ‘బోసుబాబు అనుచరుడినొచ్చానయ్యా! ధర్మం చెయ్యండి!’ బిచ్చగాళ్లు వచ్చినప్పుడు వేయడానికి సావిట్లో నల్లటి రేకు డబ్బా ఉంటుంది, బియ్యంతో. రెండు కేజీల వరకు పడుతుంది. అంతకంటే పెద్ద డబ్బాలో వడ్లు ఉంటాయి. కొందరికి బియ్యం, కొందరికి ధాన్యం. ఎవరికైనా దోసెడు. నాన్నగారు ఎప్పుడో చెప్పేశారు, శ్రీరాములిని అలా చూడకండని. అందుకే ఎప్పుడొచ్చి నిలబడినా డబ్బా నిండుగా బియ్యం పట్టుకొచ్చి అతడి పాత్రలో పోస్తాం. శ్రీరాములుని చూడగానే ‘జైహింద్’ అనేవారు పిల్లలు. అతడు ఉరిమినట్టు ఇంకా గట్టిగా అనేవాడు, కాలుని నేలకి బలంగా తాటించి, సెల్యూట్ చేస్తూ. ఆ నినాదం ఇచ్చినందుకు పిల్లలని సంతోషపెట్టడం తన కర్తవ్యం అనుకునేవాడు కాబోలు. ఒక్కొక్క వస్తువుని లేదా జంతువుని కొన్ని భాషలలో ఏమంటారో చెప్పేవాడు. ‘కుక్క.. తెలుగులో కుక్క, హిందీలో కుత్తా, ఇంగిలీసులో డాగ్, బర్మాలో హావె, తమిళంలో నాయీ, బెంగాలీలో కుకురో..’ అంటూ చెప్పేవాడు. కానీ ఈ ప్రవర్తనే అతడి మీద మతి స్థిమితం లేనివాడి ముద్ర వేసింది. అది నిజమే, శ్రీరాములుకి మతి చలించిందని నాన్నే చెప్పారు. అలా జరిగిందీ ఒక సందర్భంలోనే. ఇలా కథలు కథలుగా చెప్పుకునేవారు. ఎప్పటి నుంచో శ్రీరాములుతో మాట్లాడాలని చూస్తుంటే, అనుకోకుండా ఈ రోజు సాధ్యపడింది, నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు. అతడి మీద ఇంకాస్త వృద్ధాప్యం పడింది. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు, పై జేబులోంచి బంతిలా చుట్టిన ఒక గుడ్డ తీశాడు, ఖాకీదే. మడత విప్పాక తెలిసింది, అది ఖాకీ టోపీ. ఎంతో భక్తిగా, పద్ధతిగా శిరస్సున అలంకరించుకున్నాడు. ఆ టోపీతో ముఖం ఏదో ప్రత్యేకతని సంతరించుకుంది. సుభాష్‌చంద్ర బోస్ రూపం నా దృష్టిపథంలోకి వచ్చి నిలిచింది వెంటనే. అలాంటిదే టోపీ. ఔను, శ్రీరాములు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసి వచ్చాడు. లోపలికి రమ్మని పదిసార్లు పిలిస్తే మొత్తానికి వచ్చాడు. దూరంతో కూడిన చనువు, మా ఇంట్లో. నేరుగా పెరట్లోకి వెళ్లాం. బావి చూడగానే నీళ్లు తోడుకుని తాగాడు. తడి ముఖంతో, చేతులతో అక్కడే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నేల మీద చతికిలపడ్డాడు. కాస్త ఎత్తుగా ఉండే నూతిపళ్లెం అంచున నేను కూర్చున్నాను. ‘విలేకరుగారు, అమ్మగారు..?’ ఉన్నారా అన్నట్టు అడిగాడు. ‘లేరు, పెళ్లికెళ్లారు. ఏమైనా చెప్పాలా?’ అన్నాను. విలేకరుగారంటే మా నాన్నగారే. ఆ చుట్టుపక్కల ఆయనకు అదే పేరు. ఆంధ్రప్రభకి గ్రామీణ విలేకరి. ఏమీ లేదన్నట్టు తలాడించి, మళ్లీ మౌనం దాల్చాడు శ్రీరాములు. వాస్తవానికి అతడు ఏదో జ్ఞాపకపు గాలానికి చిక్కుకున్నాడనాలి. రెండు నిమిషాల తరువాత మళ్లీ అడిగాను. ‘సుభాష్ బోస్ ఎలా ఉండేవారు?’ ‘శివాలయంలో నందంత అందంగా, కొట్టొచ్చినట్టు ఉండేవారు బాబూ!’ ఒక ఉద్యమ నేత మీద ఎంత గౌరవం ఉంటుందో బాగా అర్థమయింది. ఆ మాట అంటున్నప్పుడు అతడి రెండు చేతులూ నమస్కరిస్తున్నట్టు కలసి గాల్లోకి లేచాయి. నేత్రాలు అర్ధనిమీలితాలయ్యాయి. మద్దూరి అన్నపూర్ణయ్య గారని, ఆయన సుభాష్‌చంద్ర బోస్‌ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు శ్రీరాములు మొదటిసారి విన్నాడట ఆ పేరు. ఈ బోస్గారే సింగపూర్‌లో ఐఎన్ఏతో ఉద్యమం మొదలుపెట్టాడని తెలిసిందట. ఒక వేకువన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడట. ఇంకొకరు ఎవరో చెబితే కలకత్తా వెళ్లి, అక్కడి నుంచి బర్మా చేరుకుని మొత్తానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడట. ఎవరో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుడు రాసిన స్వీయానుభవమే ఎక్కడో చదివాను. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమితో ఫౌజ్ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ తీసుకువచ్చి ఎర్రకోటలో సైనిక విచారణ పేరుతో హింసించారు. యుద్ధఖైదీల్లా కాదు, నేరగాళ్లని చూసినట్టు చూశారు. రెండురోజులకీ మూడురోజులకీ ఒకసారి తిండి పెట్టేవారు. అలాంటి పరిస్థితిలో కొందరిని పరుగెట్టమని, వెనక నుంచి కాల్చి చంపారు కూడా. బతికి బయటపడి ఢిల్లీ నుంచి శ్రీరాములు కోనసీమలో తన స్వగ్రామానికి వచ్చాడని నాన్నగారు చెప్పేవారు. ఆ ఒక్కరోజే అతడు హీరో. ఎలా వెళ్లాడో, ఎలా వచ్చాడో! స్వాతంత్య్రం వచ్చింది. ఊరూవాడా ఉత్సవాలు జరిగాయి. స్వాతంత్య్ర పోరాటం తరువాత చాలామంది స్వాతంత్య్ర సమరయోధులకి జీవనపోరాటం ఎదురైంది. అలాంటి వాళ్లలో శ్రీరాములూ ఉన్నాడు. అసలు ప్రశ్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం శ్రీరాములుకి స్పృహలో ఉందో లేదో! నాకు ఎప్పటికీ గుర్తుంటుందన్న ఆ సందర్భం ఆగస్ట్ 15నే జరిగింది. అంటే శ్రీరాములు అనే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితంలో ఆ రోజు కూడా భిక్షాటనతోనే గడిచింది. శ్రీరాములు గాథంతా నాన్నగారు వార్తాకథనంగా రాశారు. చాలామంది సమరయోధులకి పింఛను వచ్చింది. భూములు దక్కాయి. ఉచిత ప్రయాణాలు అమరాయి. తామ్రపత్రాలూ వచ్చాయి. దేశం కోసం జవానుగా మారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన శ్రీరాములుకి ఏమీ రాలేదు. కారణం, అతడు దేశం కోసం దేశం బయట నుంచి పోరాడాడట. అది నిజమేనని చెప్పే రికార్డేదీ లేదట. ప్రస్తుతం అతడికి భుక్తి గడవడం కష్టంగా ఉందనీ, ఇస్తే ఏ ఉద్యోగమైనా చేస్తాడంటూ కథనం ముగించారట నాన్న. ఎవరో సహృదయుడు స్పందించాడట. మద్రాస్‌లో ఉంటాడట. పెద్ద ఆఫీసరట. నూట యాభయ్ రూపాయల జీతంతో, ఉండడానికి క్వార్టర్స్ సహా అన్నీ ఇస్తానని పత్రికా కార్యాలయానికి ఉత్తరం రాస్తే, అది నాన్నగారికి చేర్చారు వాళ్లు. ఎందుకో ఏమో, అప్పుడే మూడువారాలైనా మా ఊరివైపు రాలేదట శ్రీరాములు. విషయం చెప్పి, ఇంటికే కబురు చేశారు నాన్న. శ్రీరాములు భార్యే కాబోలు ఎవరితోనో కబురు పెట్టింది, ఇప్పుడు అతడిని అంత దూరం పంపలేమన్నదే దాని సారాంశం. నాన్న వాకబు చేశారు. శ్రీరాములుకు మతి చలించిందని తెలిసింది. బోస్ బతికే ఉన్నాడా? విమాన ప్రమాదంలో మరణించాడా? ఇదే ధ్యాసట కొంతకాలం. కారణం దేశమంతా ఇదే చర్చట. ఎలా తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడో, అంతిమంగా బోస్ మరణించడమే నిజమన్న నిర్ణయానికి వచ్చాడట శ్రీరాములు. అప్పటి నుంచి మనిషి మారిపోయాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే చేతికి భిక్షాపాత్ర వచ్చింది. బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించిన సైన్యం తన కవాతులో పాడుకున్న దేశభక్తి గీతాలు భిక్షాపాత్రా, కడుపూ నింపుకోవడానికి అభ్యర్థనలుగా ఉపయోగపడుతున్నాయి. ‘మా పొలాలు చూడు అని నీకు చెప్పడానికి మనసొప్పక చెప్పలేదయ్యా శ్రీరాములు. నీకేమిటీ ఖర్మ? వచ్చి మా పొలం పనుల్లో సాయపడు. ఎంతో కొంత ఇస్తాను.’ నాన్నది చిన్నపాటి సేద్యమే అయినా, సాటి స్వాతంత్య్ర సమరయోధుడికి సాయం చేయాలనుకుని, ఈ మాట అన్నారట. ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయాడట. భిక్షాటనలోనే ఉండిపోయాడు. ‘ఇదిగో! ఇది ఉంచు!’ అని పది రూపాయలు, నా పాకెట్ మనీ, అతడి చేతిలో పెట్టాను. మళ్లీ మొహమాటం. ‘తీసుకో ఫరవాలేదు’ అంటే, జేబులో పెట్టుకుని లేచాడు. ‘సెలవిప్పించండి!’ అన్నాడు, సెల్యూట్ భంగిమలో. నేను కూడా లేచాను. సింహద్వారం దాకా వెళ్లాను. నెమ్మదిగా మెట్లు దిగి వీథిలోకి వెళ్లిపోయాడు శ్రీరాములు. ఎదురుగా కనిపిస్తోంది పంచాయతీ కార్యాలయం. ముందు నుంచే నడిచి వెళుతున్నాడతడు. ఆ రోజూ, అతడు పాడిన సందర్భం ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే గుర్తుకు వచ్చాయి. ఆ ఆగస్ట్ 15కి కూడా బడి దగ్గర నుంచి మమ్మల్నందరినీ ఉరేగింపుగా తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయం ముందు బారులు తీర్చారు. తరగతుల వారీగా నిలబెడుతున్నారు. ఆ పనంతా వీరస్వామి మాస్టారిదే. పిల్లలంతా సిరా నీలం రంగు నిక్కరు, తెల్లచొక్కాలతో, ఆడపిల్లలు కూడా అలాంటి కూడికతోనే గౌన్లు, స్కర్టులతో ముచ్చటగా ఉన్నారు. మా పైనంతా రంగురంగుల కాగితపు జెండాల తోరణాలు. నిటారుగా ఉన్న ఒక సరుగుడు కర్రని కార్యాలయం ముందు పాతిపెట్టారు. దానికే వేలాడుతోంది మువ్వన్నెల జెండా. జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. గోలగోలగా ఉందంతా. కార్యాలయం లోపల ఊరి పెద్దలు పది పన్నెండు మంది ఖద్దరు దుస్తుల్లో తిరుగుతున్నారు, హడావిడి చేస్తూ. బడిపిల్లల గోల కంటే ఎక్కువే ఉంది. ఉదయం తొమ్మిది గంటల వేళకి సర్పంచ్‌గారు కష్టపడి జెండా ఎగరేశారు. వెంటనే వీరాస్వామి మేస్టారు ‘జెండా ఊంఛా రహే హమారా.. విజయీ విశ్వతిరంగా ప్యారా’ అంటూ పిడికిలెత్తి ఉద్విగ్నంగా పాడితే మేమంతా ఉత్సాహంగా అనుసరించాం. ఇంకొద్ది సేపటికి మేం ఎదురుచూస్తున్న చాక్లెట్ల పంపకం మొదలయింది. అప్పుడే లోపల పెద్దల చేతికి తలొక ప్యాకెట్ వచ్చింది. ఇడ్లీ కాబోలు. చాక్లెట్లు చేతుల్లో పడినవాళ్లు పరుగెత్తుతున్నారు. ఐదో తరగతి వాళ్లందరం చివర్న ఉన్నాం. లోపల పెద్దలు తినడం పూర్తి చేసి బయటకొచ్చి చేతులు కడుగుతున్నారు. ఒకళ్ల తరువాత ఒకళ్లు.. ఆ నీళ్లు నెమ్మదిగా ముందుకొస్తున్నాయి, సరిగ్గా జెండా కర్ర దిశగా, ఆ మహానుభావుల ఫొటోలు ఉన్న కుర్చీల కిందకే. వీరాస్వామి మాస్టారు, సరోజినీ టీచరమ్మ, మార్తమ్మ టీచరు, హెడ్మాస్టరు శివలపంతులు గారు, ఆయా వెంకమ్మ అట్టపెట్టెలలో తెచ్చిన చాక్లెట్లు పంచుకుంటూ వస్తున్నారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీరాములు. నేరుగా పంచాయతీ కార్యాలయం ముందుకెళ్లి గట్టిగా అరిచాడు, ‘బాబూ! బోసుబాబు అనుచరుణ్ణొచ్చాను. నాక్కూడా ఓ పొట్లం ఇప్పించండి బాబూ!’ ఒక్క నిమిషం ఆగి మళ్లీ అరిచాడు శ్రీరాములు. చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చిన ఓ ఖద్దరుధారికి ఆ అరుపు చిర్రెత్తించింది. ఏదో అనబోయాడు గాని, గొంతులో నీళ్లు దిగేదాకా ఆగాడు. ఈసారి పాట అందుకున్నాడు శ్రీరాములు. ‘హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ..’ ‘ఛ, అవతలకి పో!’ భరించలేనట్టే అసహనంతో అరిచాడు పెద్దమనిషి. పెద్దలకి కలిగిన అసౌకర్యానికి భయపడిన ప్యూను వెంటనే ప్రత్యక్షమై, ‘పైకెళ్లు.. పో, పైకెళ్లు..’ మీదకెళుతూ అన్నాడు, పొమ్మని బిచ్చగాళ్లకి చెప్పేమాట. అలాంటి చీదరింపులకి అలవాటు పడిపోయినట్టు నిర్లిప్తంగా ఉండిపోయాడు శ్రీరాములు. అంతా అటే చూశారు. నిమిషం తరువాత భారంగా కదిలాడు శ్రీరాములు. పంచాయతీ కార్యాలయం దాటి, ముందుకు వెళ్లిపోయాడు. చెట్లపల్లి వారి ఇంటి పక్క నుంచి వెళ్లే కాలిబాటని అనుసరించాడు. రెండు మూడు నిమిషాల తరువాత గాలి మోసుకొచ్చింది పాట. ‘కదం కదం బఢాయే జా.. ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందతీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ సావిట్లోకి అడుగుపెట్టిన తరువాత దూరం నుంచి శ్రీరాములు కంఠం లీలగా. గెలవాలన్న నిశ్చయం, ఓడిపోతున్నానన్న దిగులుతో కలసి జుగల్బందీ చేస్తున్నట్టుంది. ‘.. ఖుషీ కే గీత్ గాయే జా.. కదం కదం బఢాయే జా..’ జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. ∙డా. గోపరాజు నారాయణరావు -
సరదాగా.. సండేఫన్డే
కవాడిగూడ: నగర వాసుల ఆహ్లాదం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సండే..ఫండే’ సందర్శకులతో హుషారుగా సాగింది. సండే ఫండేను గతంలో ప్రారంభించినప్పటికీ కరోనా నేపథ్యంలో నిలిపి వేశారు. 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సండేఫండేను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ను విద్యుత్ కాంతులు, జాతీయ జెండాలతో అలంకరించారు. నగర వాసులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. చిన్నారులకు ఇష్టమైన తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. యువత జాతీయ జెండాలతో దేశభక్తి చాటుతూ సెలీ్ఫలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొదటి సండే వర్షం ప్రభావం వల్ల సండేఫండేకు అధిక సందర్శకులు హజరు కాలేకపోయారు. సండేఫండే సందర్శంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. (చదవండి: జనాభాను మించి ఆధార్! ) -
క్రైమ్ స్టోరీ: రెండు పిట్టలు.. ఒకే దెబ్బ!
18 నవంబర్ 1996. ఆ రోజు దినపత్రిక చదువుతున్న సీఐ ష్రఘ్వీ తన స్టేషన్ పరిధిలో ఉన్న సహన ఫార్మాస్యూటికల్ కంపెనీ డైరెక్టర్ సరితాదేవిని ఎవరో హత్య చేశారని ఫోన్ రావడంతో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. హత్య జరిగిన గదిలోకి వెళ్లి, అన్నీ పరిశీలించి, పోస్ట్‌మార్టమ్, ఫింగర్ ప్రింట్స్ ఏర్పాట్లు చూడమని, అక్కడ ఉన్న అన్ని వస్తువులూ, ఫైల్స్ కూడా స్టేషన్‌కి పంపమని అక్కడ నుండి బయటకు వచ్చాడు సీఐ. బయట ఉన్న మేనేజర్ని కలుసుకుని, కొన్ని విషయాలు సేకరించి, ఇంకో డైరెక్టర్ నరేష్ రూమ్ వద్దకు వెళ్లాడు సీఐ.. రాత్రి పడిన వర్షానికి చిత్తడిగా ఉన్న నేల మీద నెమ్మదిగా నడుస్తూ. ‘ఈ కంపెనీ, చనిపోయిన ఈవిడదేనా? ఈ క్వార్టర్లో ఈవిడతో పాటు ఎవరు ఉంటారు? కొంచెం వివరంగా చెప్పండి’ నరేష్‌ని అడిగాడు సీఐ ష్రఘ్వీ, ‘సార్, ఐదేళ్ల క్రితం సరితాదేవి, హరనాథ్, నరేష్ అనే నా పేరునూ కలిపి, మా పేర్లలో మొదటి అక్షరాలు కలిసి వచ్చేలా కంపెనీకి సహన అని పేరు పెట్టి ప్రారంభించాం. సరిత ఒక్కరే ఈ క్వార్టర్లో ఉంటారు. హరనాథ్ చెన్నైలో ఉంటాడు. నేను ఇక్కడే సిటీలో ఉంటాను’ చెప్పాడు నరేష్. ‘మిస్టర్ నరేష్, గదిలో ఎటువంటి వస్తువులు చోరీకి గురి కాకపోవడం చూస్తూంటే, నిందితుడు కేవలం ఆమెను చంపడానికే వచ్చినట్టుంది. సూటిగా అడుగుతున్నా.. సరితాదేవికి కుటుంబ సభ్యులనుంచి కానీ, బిజినెస్ పరంగా కానీ ఎవరైనా శత్రువులున్నారా?’ ‘ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. తల్లి కూడా ఈ మధ్యనే మరణించింది. ఇక బిజినెస్ పరంగా అంటే, మా పార్ట్నర్ హరనాథ్ తనను తరచూ ఫోన్లో బెదిరిస్తున్నాడు అని చెబుతూండేది. ఇంకో విషయం, అతను కాలేజీ రోజుల నుంచి కూడా ఆమెను ప్రేమించేవాడు. అమె అతడిని దూరంగా ఉంచింది. అందుకే అతను ఇక్కడ ఇమడలేక చెన్నైలో ఉంటున్నాడు. అంతే కాదు, మొన్న జనవరిలో అయితే ఏకంగా ఓ బెదిరింపు లెటర్ వచ్చిందని కూడా చెప్పింది’ చెప్పాడు నరేష్. ‘ఆమె హత్య వలన హరనాథ్‌కి ఏమిటి ప్రయోజనం?’ ‘ఏముంది సార్, మా బిజినెస్ బావుంది. దాని మీద ఇతని కన్ను పడింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఆమెను హత్య చేసి, ఆ నేరం ఇదే ఊర్లో ఉంటున్న నా మీదకు తోసేసి, మా ఇద్దరినీ అడ్డు తొలగించి, కంపెనీ తన అధీనంలోకి తీసుకోవచ్చుగా?’ ‘అయితే, ఆయనే హత్య చేశాడంటారా?’ అడిగాడు సీఐ. ‘లేదు, చేయించి ఉంటాడు. ఎందుకంటే నిన్ననే అతను చెన్నై నుంచి వచ్చి, లాడ్జిలో ఉన్నాడు. రాత్రి నాకు ఫోన్ చేసి, ‘నేను వేరే బిజినెస్ పనిమీద ఇక్కడకు వచ్చేను. నీకు తెలుసుగా, సరితకు చెన్నై సాంబార్ అంటే ఇష్టమని. ఓ సాంబార్ పౌడర్ ప్యాకెట్ తెచ్చాను. అది ఆమెకు అందచేయాలి. మీ మనిషిని పంపిస్తావా?’ అని అడిగాడు. దానికి నేను, ‘ఎవరూ లేరు. అయినా వర్షం వస్తోంది కుదరదు’ అని చెప్పాను. అయినా కానీ రాత్రి ఎవరో మనిషిని ఇచ్చి పంపేడుట. నాకు తెలిసి, ఆ వచ్చిన మనిషి కిరాయి హంతకుడు అయి ఉండవచ్చు’ చెప్పి కంటి నీరు తుడుచుకున్నాడు నరేష్. నరేష్ రూమ్‌లోంచి బయటకు వచ్చిన ష్రఘ్వీ, సెక్యూరిటీ ఆఫీస్ వద్దకు వచ్చి, ‘రాత్రి మేడమ్ గారిని కలుసుకోవడానికి ఎవరు వచ్చారో చెప్పగలవా?’ రాత్రి డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డుని అడిగాడు. అతను చెప్పిన వివరాలు అన్నీ సేకరించి, చివర్లో ‘అతడిని గుర్తు పట్టగలవా?’ అడిగాడు సీఐ. ‘చలి మూలంగా మొహం అంతా మఫ్లర్ చుట్టుకున్నాడు, గుర్తు పట్టలేను సార్. అయితే నేను ఇక్కడ చేరి పదిరోజులే అయ్యింది సార్’ చెప్పాడు గార్డు. ఆ రోజు సాయంత్రం అంతవరకూ లభించిన ఆధారాలతో, లాడ్జిలో ఉన్న హరనాథ్‌ను అదుపులోకి తీసుకుని, స్టేషన్లో విచారణ మొదలెట్టాడు ష్రఘ్వీ. ‘సీ.. మిస్టర్ హరనాథ్! ఏ విధంగా చూసినా సరితాదేవి హత్యలో మీ ప్రమేయం కనబడుతోంది. ఆఫీసులో ఫోన్ బిల్లులు వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆవిడ మిమ్మల్ని తిరస్కరించిందన్న కోపంతో, ఆమెను కంపెనీ షేర్లు అమ్ముకుని బయటకు పొమ్మని బెదిరిస్తూ తరచుగా ఫోన్ చేస్తున్నారని’ చెప్పాడు సీఐ. ‘సార్, అంతా అబద్ధం. ఆమెను ప్రేమించి, ఆమెచే తిరస్కరించబడ్డది నేను కాదు, నరేష్! అతను లైంగికంగా వేధిస్తున్నాడని తరచుగా ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది. నేను ధైర్యం చెప్పేవాడిని. అందుకే మా ఫోన్ బిల్లుల మీద మీకు అనుమానం వచ్చి ఉంటుంది’ చెప్పాడు హరనాథ్. ‘ఇదే విషయం నీ గురించి నరేష్ కూడా చెప్పాడు కానీ, మరి నిన్న రాత్రి ఆమెను హత్య చేసిన ఆ కిరాయి హంతకుడిని ఎందుకు పంపినట్లు?’ అడిగాడు సీఐ. ‘సార్, సరితాదేవిని హత్య చేయమని నేను ఏ మనిషినీ పంపలేదు. నరేష్ తన డ్రైవర్ని పంపడం కుదరదని చెప్పడంతో నేను హోటల్లో ఉన్న ఓ కుర్రాడికి ఓ ప్యాకెట్ ఇచ్చి పంపించాను. కానీ మార్గమధ్యంలో ఎవడో బైకుతో ఆ కుర్రాడిని ఢీకొట్టి, ఆ ప్యాకెట్‌తో ఉడాయించాట్ట. నాకు ఆ విషయం ఈ ఉదయమే తెలిసింది. ప్రస్తుతం ఆ కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు’ అసలు విషయం చెప్పాడు హరనాథ్. ‘సరే, అది అలా ఉంచు. మరి నువ్వు సరితాదేవిని బెదిరిస్తూ రాసిన ఈ లెటర్ మాట ఏమిటి?’ అడిగాడు ష్రఘ్వీ, ఆ లెటర్ హరనాథ్ చేతికిచ్చి. తన ఇంటి అడ్రసుతో ఉన్న లెటర్ హెడ్ మీద తెలుగులో ఉన్న ఆ లెటర్ చదవడం మొదలెట్టాడు హరనాథ్. చెన్నై ,30.12.1995. డియర్ సరితా, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నీకు మొన్న ఫోన్లో చెప్పిన విధంగా, కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా, కంపెనీలో నీ వాటాలు విక్రయించి డైరెక్టర్ పోస్ట్‌కు రాజీనామా చేసి వెడతావని ఆశిస్తున్నా. తరువాత బాధపడి ప్రయోజనం లేదు. ఇట్లు (ఏ.హరనాథ్) ‘సరే, లెటర్ చదివేవు కదా! ఇప్పుడు చెప్పు, ఇది నువ్వు పంపినదేనా?’ అడిగాడు సీఐ ష్రఘ్వీ. ‘ఈ లెటర్ హెడ్ నాదే కానీ, సంతకం నాది కాదు. ఎవరో ఫోర్జరీ చేసినట్లు ఉంది. ఈ లెటరూ నేను పంపలేదు’ ఆశ్చర్యంగా చెప్పాడు హరనాథ్. ‘నిజానిజాలు త్వరలో తెలుస్తాయి కానీ, అంతవరకూ మా అధీనంలో ఉండాలి. ఔనూ ఇంతకీ నిన్న సరితాదేవికి పంపిన ఆ ప్యాకెట్ ఏమిటి? అందులో ఉన్నది సాంబార్ పౌడరేనా లేక..’ అడిగాడు సీఐ. ‘ఒహ్.. అదా సార్? ఆ ప్యాకెట్లో..’ అంటూ మొత్తం విషయం వివరించాడు హరనాథ్. ‘ఓ ఐసీ. ఆ ప్యాకెట్ ఇంకా మా దగ్గరే ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు’ అంటూ స్టేషన్ నుంచి బయటకు నడిచాడు సీఐ ష్రఘ్వీ. ∙∙l మర్నాడు ఉదయం, పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభించడంతో నరేష్ ఇంటికి వెళ్లి, అతడిని అరెస్టు చేశాడు ష్రఘ్వీ. ‘దారుణం, నాకేమీ తెలియదు. కావాలనే ఆ హరనాథ్ నన్ను ఇందులో ఇరికిస్తున్నాడు’ భోరుమని విలపించసాగేడు నరేష్. ‘నీ దొంగ ఏడుపు ఆపు మిస్టర్ నరేష్. అసలు జరిగింది ఏమిటో నేను చెబుతాను విను. హరనాథ్ తన సొంత పనిమీద హైదరాబాద్ వస్తున్నాడన్న విషయం నీకు మూడు రోజుల ముందే తెలిసింది. వెంటనే సరితాదేవిని హత్య చేసి ఆ నేరం హరనాథ్ మీదకు మళ్లేలా పథకానికి రూపకల్పన చేశావు. అందులో భాగంగా నీ దగ్గర ఉన్న హరనాథ్ కొత్త లెటర్ హెడ్ మీద పాత తేదీతో, మొన్ననే ఓ లెటర్ సృష్టించావు.’ ‘అంతా అబద్ధం’ గట్టిగా అరిచాడు నరేష్. ‘కంగారు పడకు. నాకు అనుమానం వచ్చి, నేను అదే లెటర్‌ను మళ్లీ మీ టైపిస్ట్ చేత ఈరోజు టైప్ చేయించా. మీ ఆఫీసు టైప్ మిషన్‌లో ‘ర’, ‘ ?’ అనే అక్షరాలకు దుమ్ము పట్టేయడం వలన మూడు రోజుల క్రితం నువ్వు సృష్టి్టంచిన లెటర్ మీద, అలాగే ఈరోజు లెటర్ మీద కూడా ఒకలాగే వచ్చాయి. మీ టైపిస్ట్‌ను గట్టిగా అడిగేసరికి అతను మీరే ఈ పని చేయించారని ఒప్పేసుకున్నాడు. అతను ప్రస్తుతం మా అధీనంలో ఉన్నాడు.’ ‘బ్రహ్మాండంగా అల్లారు క«థని. ఇంకెందుకు ఆలస్యం. ఆ కిరాయి హంతకుడిని కూడా నేనే పురమాయించేను అని చెప్పండి’ అన్నాడు ఉడికిపోతూ. ‘ఔను. అదీ నిజమే. ఎప్పుడైతే హరనాథ్ మీ మనిషి కోసం ఫోన్ చేశాడో, నువ్వు అనుకోని అదృష్టం కలసివచ్చిందని భావించి, మీ కంపెనీకి తరచూ అద్దెకు టాక్సీని నడిపే కిరాయిహంతకుడు అప్పారావుని ఈ పనికి పురమాయించేవు. మాకు లభ్యమైన ఆధారాలతో అతడిని కస్టడీలోకి తీసుకున్నాం. మా పద్ధతిలో విచారించేసరికి, అతడు జరిగింది అంతా చెప్పి లొంగిపోయాడు’ చెప్పాడు ష్రఘ్వీ. అంతా విన్న నరేష్ చేసేదేమీ లేక మౌనంగా తల వంచుకున్నాడు.‘సీ, మిస్టర్ నరేష్! నేరస్థుడు ఎప్పటికైనా దొరక్కపోడు. కానీ, ఆ ఫోర్జరీ లెటర్, అలాగే కిరాయి హంతకుడు విషయంలో నువ్వు చేసిన పొరబాట్లే నిన్ను పట్టించేశాయి.’ ‘ఔనా! ఏమిటి సార్ ఆ పొరబాట్లు?’ అమాయకంగా అడిగాడు నరేష్. ‘అవీ..’ అంటూ మొత్తం అంతా చెప్పాడు ష్రఘ్వీ. చేసేదేమీ లేక పోలీస్ జీపు ఎక్కాడు నరేష్. ‘మిస్టర్ నరేష్, నిన్ను చూస్తే జాలేస్తోంది. హత్య జరిగిన ఆ ఒక్క రోజూ నువ్వు కొంచెం ఓపిక పట్టి, కొంచెం తెలివి ఉపయోగించుంటే, నువ్వు ‘ఒక్క దెబ్బ’ వేయనక్కర లేకుండానే ఆ ‘రెండు పిట్టలు’ ఎగిరి పోయేవి’ స్టేషన్‌లోపలికి వస్తూ చెప్పాడు సీఐ ష్రఘ్వీ. ‘ఏంటి సార్ మీరనేది?’ కుతూహలంగా అడిగాడు నరేష్. ‘ఔను. సరితాదేవి హత్య జరిగిన రోజు సాయంత్రం, హరనాథ్ ఆమెకు ఫోన్ చేసి, కంపెనీ డైరెక్టర్‌గా తను రిజైన్ చేస్తున్నాననీ, షేర్లు కూడా అమ్మేస్తున్నానీ వాటికి సంబందించిన కాగితాలు ఒక ప్యాకెట్లో పెట్టి, ఓ కుర్రాడితో పంపిస్తున్నానీ, వీలైతే ఆమెను కూడా రిజైన్ చేసి బయటకు వచ్చేయమనీ చెప్పడంతో ఆమె కూడా అంగీకరించిందట. ఇవిగో ఆ సాంబారు పౌడర్ ప్యాకెట్‌తో పాటు ఉన్న రాజినామా కాగితాలు’ అంటూ చూపించాడు. ∙∙l మర్నాడు ట్రైనీ ఎస్సైలతో సమావేశం అయిన సీఐ ష్రఘ్వీ, ఈ కేసు గురించి చెప్పి ‘ఓకే, ఫ్రెండ్స్ అంతా విన్నారుగా! ఇప్పుడు చెప్పండి. నేను ఈ కేసును సునాయాసంగా సాల్వ్ చేయగలిగేలా, నరేష్ చేసిన ఆ రెండు తప్పులు ఏమిటి?’ అడిగాడు. ‘పాత తేదీతో లెటర్ క్రియేట్ చేయడం’ చెప్పాడు ఓ యస్సై. ‘ఆ కిరాయి హంతకుడి వేలిముద్రలు’ చెప్పాడు వేరొకతను. ‘మీరు చెప్పింది కొంచెం వాస్తవమే కానీ, అసలు విషయమేమిటంటే ఆ ఫోర్జరీ లెటర్ తయారు చేసింది 30.12.1995 తేదీతో. అప్పటికి మద్రాసు అనే పేరే వాడుకలో ఉంది. చెన్నై పేరు అమల్లోకి వచ్చింది 17.07.1996 నుంచి. అంటే, ఇతను మర్చిపోయి, రెండు నెలలు క్రితం హరనాథ్ కోసం వేయించిన కొత్త లెటర్ హెడ్ మీద పాత తేదీతో ఆ మేటర్ టైప్ చేయించాడు’ చెప్పాడు సీఐ ష్రఘ్వీ. ‘సార్, అతను చేసిన రెండో తప్పు?’ అడిగాడు ఇంకో ఔత్సాహికుడు. ‘మీరన్నట్టు హంతకుడి వేలిముద్రలు ఎక్కడా లేవు. కిరాయి హంతకుడు కాబట్టి, ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కానీ, ఆ రోజు రాత్రి, వర్షంలో తడిసిన రైన్ కోటు, రైన్ షూస్ గేట్ వద్దే విప్పి వెళ్లమని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో, బూట్లు లేకుండా మట్టి కాళ్లతో మేడమ్ రూమ్‌లోకి వెళ్లడం వలన అక్కడ అతని పాద ముద్రలు దొరికాయి. ఆ పాదముద్రలను చూపించి, కంపెనీలో వారిని ఎంక్వయిరీ చేస్తే కొంతమంది గుర్తుపట్టి చెప్పారు అతను తరచూ వచ్చే టాక్సీ డ్రైవర్ అప్పారావని’ చెప్పాడు సీఐ. ‘వాళ్లు, పాదముద్రలు బట్టి ఎలా గుర్తు పట్టేరు సార్?’ ఆశ్చర్యంగా అడిగాడు ఓ ఎస్సై. ‘ఆ కిరాయిహంతక డ్రైవర్ రెండు పాదాలకీ నాలుగో వేలు భూమికి ఆనకుండా కొంచెం పైకి లేచి ఉంటుంది’ అసలు విషయం చెప్పాడు ష్రఘ్వీ . -
యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
అమెరికన్స్‌ను వణికించిన అపరిష్కృత మిస్టరీల్లో ఈ కథొకటి. అది 1991 డిసెంబర్ 6. రాత్రి 11 దాటింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ‘ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యోగర్ట్’ అనే క్లోజ్ చేసి ఉన్న షాపులోంచి మంటలు రావడం పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, కొద్దిసేపటికే ఫైర్ ఇంజన్ల మోతమోగింది. మంటలార్పేటప్పుడు కనిపించిన భయంకరమైన దృశ్యాలు సంచలనానికి తెరతీశాయి. షాపు వెనుక గది మధ్యలో ఒక అమ్మాయి నగ్నంగా శవమై ఉంది. తన చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఆమె బట్టలతోనే ఆమెని ఎవరో బంధించారు. షాపులో చెలరేగిన మంటలకు సగానికి పైగా శరీరం కాలిపోయింది. వెనుక గదికి వెళ్లి చూస్తే, మరో ముగ్గురు అమ్మాయిలు అదే రీతిలో నగ్నంగా ఓ మూలన పడి ఉన్నారు. తెల్లారేసరికి చనిపోయిన వారి వివరాలను తేల్చేశారు పోలీసులు. మరునాడు దేశమంతా ఇదే వార్త. చనిపోయిన నలుగురిలో జెన్నిఫర్ హార్బిసన్(17), ఎలీజా థామస్(17) ఇద్దరూ ప్రాణస్నేహితులు. అదే షాపులో పార్ట్‌టైమ్ ఉద్యోగులు. ఆ రాత్రి నైట్ షిప్ట్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో సారా హార్బిసన్(15) జెన్నిఫర్ సొంత చెల్లెలు. మరో అమ్మాయి అమీ అయర్స్(13) సారా స్నేహితురాలు. ఈ నలుగురూ జీవితంలో తమకంటూ ప్రత్యేకత ఉండాలని కలలు కన్నవారే. సారా, జెన్నిఫర్ ఇద్దరూ స్పోర్ట్స్‌లో ఎన్నో అవార్డ్స్ సాధించారు. ఇద్దరూ అక్కా చెల్లెల్లా కాకుండా స్నేహితుల్లా కలిసుండేవారు. అమీ కూడా ఎప్పుడూ వారి స్నేహాన్నే కోరుకునేది. తను చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికురాలు. ఫిషింగ్, హార్స్ రైడింగ్, పెట్స్ ట్రైనింగ్.. ఇలా తనదో ప్రత్యేక ప్రపంచం. ఇక ఎలీజా చాలా అందగత్తె. మోడల్ కావాలని కలలు కనేది. మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు కావలసిన డబ్బుల కోసమే పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ కష్టపడేది. ఒక్కోక్కరిదీ ఒక్కో కల. కానీ రాత్రికిరాత్రే అంతా తారుమారై, జీవితాలే ముగిసిపోయాయి. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో నలుగురినీ తీవ్రంగా హింసించి, లైంగిక దాడి చేశారని, తర్వాత తలలపై తుపాకీలతో కాల్చి చంపారని తేలింది. నేరస్థులు షాపు వెనుక డోర్ నుంచి పారిపోయినట్లుగా నిర్ధారించారు. కొన్ని సాక్ష్యాలు కాలి బూడిదైతే, మరికొన్ని మంటలార్పే క్రమంలో కొట్టుకుపోయాయి. దాంతో ఎవ్వరినీ అరెస్ట్ చేయలేకపోయారు. 1999 నాటికి బాధిత కుటుంబాల పోరు పెరిగింది. కేసు దర్యాప్తు చేసే అధికారులూ మారారు. అనుమానితుల్లో మారిస్ పియర్స్, ఫారెస్ట్ వెల్బోర్న్, మైకేల్ స్కాట్, రాబర్ట్ స్ప్రింగ్స్టీన్ అనే పాతికేళ్లలోపు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎవరో కాదు హత్యలు జరిగిన ఎనిమిదో రోజు తుపాకీతో పట్టుబడి, తగిన సాక్ష్యాలు లేక విడుదలైన వాళ్లే! ఈసారి మెక్సికన్ అధికారులు విచారించినప్పుడు నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే, కీలకమైన మరే సాక్ష్యాధారాలు లేకపోవడంతో.. ఆ తర్వాత పోలీసులే తమతో బలవంతంగా ఒప్పించారని చెప్పారు. ఇలాంటి సాక్ష్యం చెల్లదని కోర్టు కొట్టేసింది. పైగా అదే ఏడాది అమీ లైంగిక దాడిలో బయటపడిన డీఎన్ ఏ ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ సరిపోలేదు. మరి అసలు నేరస్థులెవరని కోర్టు అధికారులను నిలదీసింది. ఈ నలుగురిపై అభియోగాలను కొట్టేసింది. అయితే 2010 డిసెంబర్ 25 రాత్రి 11 గంటల సమయంలో మారిస్ పియర్స్ పెట్రోలింగ్ పోలీసుల కంటపడ్డాడు. అతడి కంగారు చూసి... పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, కత్తిదూశాడు. అధికారుల్లో ఒకరైన ఫ్రాంక్ విల్సన్ తుపాకీతో కాల్చి అతడ్ని చంపేశాడు. జెన్నిఫర్, ఎలీజాల డ్యూటీ తర్వాత పార్టీకి వెళ్లాలనేది ఆ నలుగురు అమ్మాయిల ప్లాన్. అందుకే అమీ, సారాలూ వాళ్లతో ఉన్నారు. షాప్ క్లోజ్ చేసే టైమ్‌కి చివరిగా ఉన్న కస్టమర్స్‌ని కూడా పోలీసులు విచారించారు. సుమారు 52 మంది ఆ సమయంలో షాప్‌కి వచ్చి పోయారని ప్రత్యక్షసాక్షుల కథనం. అయితే క్లోజింగ్ టైమ్ కాబట్టి షాప్ ఫ్రంట్ డోర్ జెన్నిఫర్ మూసేసి, ఇతర కస్టమర్స్ లోనికి రాకుండా చేసిందని, ఆ టైమ్‌లో ఓ వ్యక్తి వాష్‌రూమ్ లోపలికి వెళ్లడం గమనించినా, తిరిగి రావడం తాము చూడలేదని కొందరు చెప్పారు. మరోవైపు చివరిగా షాప్ నుంచి బయటపడిన ఓ జంట.. షాప్‌లో ఇద్దరు మగవాళ్లు నక్కి నక్కి ఉన్నట్లు అనిపించిందని, వారిలో ఒకరు గ్రీన్ కలర్ జాకెట్, మరొకరు బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నారని చెప్పారు. అయితే విచారించిన కస్టమర్స్‌లో ఆ ఇద్దరూ మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లే ఈ ఘాతుకానికి ఒడికట్టి ఉంటారని అంచనాలు వేశారు. మరోవైపు సీరియల్ కిల్లర్స్ పాత్రపై దర్యాప్తు చేసినా, ఫలితం దక్కలేదు. పైగా ఈ ఘటన జరిగిన రోజు షాప్‌లో 540 డాలర్లు గల్లంతైనట్లు యాజమాన్యం గుర్తించింది. అయితే అది నేరస్థుల డైవర్ టెక్నిక్‌లో భాగమేనని, వాళ్లు వచ్చింది డబ్బులు కోసం కాదని, అమ్మాయిల కోసమేనన్నది డిటెక్టివ్స్ నమ్మకం. అయితే ముప్పయ్యేళ్లు దాటినా ఈరోజుకీ నేరుస్థులెవరో తేలలేదు. నేటికీ యోగర్ట్ షాప్ పక్కనుంచి వెళ్లే వాళ్లు అక్కడ ఓ క్షణం ఆగుతారు. ఆ నలుగురు అమ్మాయిల స్మారక ఫలకంపై పూలు ఉంచి, ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటారు. ∙సంహిత నిమ్మన -
‘సీలాండ్'.. దేశ జనాభా 27 మంది మాత్రమే!
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సఫోక్ సముద్ర తీరానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వింతదేశం పేరు ‘సీలాండ్’. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవ నిర్మిత ప్రదేశం ఇది. ఒక మానవ నిర్మిత ప్రదేశమే దేశంగా ఏర్పడటం దీని ప్రత్యేకత. ఇది 1967 సెప్టెంబర్ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ ఇక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను నిర్మించుకుంది. యుద్ధం ముగిశాక ఖాళీగా మిగిలిన ఈ కోటకు జాక్ మూరే, అతని కూతురు జేన్ చేరుకున్నారు. వాళ్లిద్దరూ ‘వండర్ఫుల్ రేడియో లండన్’ అనే పైరేట్ రేడియో స్టేషన్ తరఫున ఇక్కడకు వచ్చారు. ఆ పైరేట్ రేడియో స్టేషన్ అధినేత ప్యాడీ రాయ్ బేట్స్ 1967 సెప్టెంబర్ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉన్నాయి. ఈ దేశం తన పౌరులకు పాస్‌పోర్టులూ ఇస్తోంది. ఈ దేశ జనాభా 27 మంది మాత్రమే! చదవండి: World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే! -
చియోంగ్ సిస్టర్స్ మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
కొన్నిసార్లు కథ ఏదో.. కట్టుకథ ఏదో తేల్చలేం! ఎవరిది నేరమో.. ఎవరిది న్యాయపోరాటమో.. గుర్తించలేం! ఏవి కన్నీళ్లో.. ఏవి కపటనాటకాలో ఊహించలేం. ఎవరు బాధితులో.. ఎవరు నిందితులో.. కనిపెట్టలేం! చియోంగ్ సిస్టర్స్ మిస్టరీ అలాంటిదే. అది 1997 జూలై 16. మారిజోయ్ చియోంగ్(21), జాక్వెలిన్ చియోంగ్(23) ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఫిలిప్పీనో–చైనీస్. సాయంత్రం ఆఫీస్ కాగానే.. ఇంటికి కలసి వెళ్లేందుకు.. ఫిలిప్పీన్స్‌లోని సెబు సిటీలో ఉన్న అయాలా మాల్ బయట కలుసుకున్నారు. కానీ రాత్రి పది దాటినా వాళ్లు ఇంటికి రాకపోయేసరికి.. మిస్టర్ డియోనిసియో, మిసెస్ థెల్మా చియోంగ్ దంపతులు పోలీస్‌స్టేషన్‌కి పరుగుతీశారు. అక్కడ ఆ వయసు పిల్లలు.. వారానికి ఒకసారి ఇంటికి రావడమే గొప్ప. దాంతో పోలీసులు కేసైతే నమోదు చేసుకున్నారు కానీ, పెద్దగా శ్రద్ధ చూపించలేదు. సరిగ్గా రెండు రోజులకు కార్కార్ సిటీకి చెందిన రూడీ లసాగా అనే స్థానికుడి నుంచి.. సెబు సిటీ సమీప లోయలో ఓ స్త్రీ మృతదేహం కనిపిస్తోందని పోలీస్‌స్టేషన్‌కి మరో కేసు వచ్చింది. కుళ్లిన దేహంపైన ఉన్న బట్టలను చూసి.. అవి మా అమ్మాయి మారిజోయ్వే అంటూ నెత్తినోరు బాదుకున్నారు చియోంగ్ దంపతులు. పోస్ట్‌మార్టమ్ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా లోయలోకి తోయడం వల్లే చనిపోయిందని తేలింది. మరి జాక్వెలిన్ ఏమైంది? ఫ్రాన్సిస్కో జువాన్ లారానాగా(పాకో), జోస్మాన్ అజ్నార్, రోవెన్ అడ్లావాన్, అల్బర్టో అలెన్ కానో, ఏరియల్ డెనిస్ రష్యాలతో పాటు జేమ్స్ ఆండ్రూ ఉయ్, జేమ్స్ ఆంథోనీ ఉయ్, (ఇద్దరూ సోదరులు, ఒకరు మైనర్) అనే ఏడుగురు యువకుల్ని అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పది నెలల తర్వాత 1998 మే 8న నిందితుల్లో ఒకరైన డెనిస్ రష్యా నోరు విప్పాడు. ‘పాకో ప్రోత్సాహంతో ఆ రోజు అక్కాచెల్లెళ్లిద్దరినీ బలవంతంగా కారులోకి లాగారు. వెంటనే మేము ఏడుగురం వాళ్లని ఓ ఇంటికి తీసుకెళ్లి, వారిని రేప్ చేశాం నాతో సహా. తర్వాత వాళ్లంతా... ఆ అమ్మాయిలకు కళ్లగంతలు కట్టి.. సెబుకొండ లోయ దగ్గరకు తీసుకెళ్లి.. మారిజోయ్ని బలవంతంగా లోయలోకి తోసేశారు. జాక్వెలిన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. కారుతో వెంబడించి పట్టుకుని, ఆమెను రోవెన్ కొట్టాడు. తర్వాత అయాలా సెంటర్ దగ్గర నన్ను దించి, వెళ్లిపోయారు. ఆమెను ఏంచేశారో నాకు తెలియదు. ఈ మొత్తం కేసులో అమ్మాయిల కిడ్నాప్, హత్యలతో నాకు ఏ సంబంధం లేదు’ అంటూ సాక్ష్యం చెప్పాడు. అయితే పాకో, జోస్మాన్లు అసలు ఈ డెనిస్ ఎవరో తమకు జైలుకు వచ్చేవరకూ తెలియదని వాదించారు. థెల్మా.. డెనిస్‌ను కలసి.. సాక్ష్యం చెప్పినందుకు అతడికి బహుమతులు కూడా ఇచ్చింది. అది చాలామందికి గిట్టలేదు. డెనిస్ ఇచ్చిన వాగ్మూలంతో కేసు కీలక మలుపు తిరిగే సమయంలో.. ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి మార్టిన్ ఓకాంపో ఓ హోటల్లో 1999 అక్టోబర్ 9న.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఓకాంపోది కచ్చితంగా హత్యేనన్నది చాలామంది నమ్మకం. ఎందుకంటే డెనిస్ రష్యాను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న సమయంలో ఓకాంపో.. డెనిస్ తరపున ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. పైగా పాకో జూలై 16న సెబులో లేనేలేడని, మనీలాలోని పాఠశాలలో ఉన్నాడని 40 మంది సాక్ష్యం చెప్పారు. అయితే వారంతా పాకో సన్నిహితులేనన్న కారణంతో ఆ సాక్ష్యాలు చెల్లవని ఓకాంపో తీర్పునిచ్చాడు. మొత్తానికి 2004లో పాకో బృందాన్ని నేరస్థులుగా నిర్ధారిస్తూ.. మైనర్, డెనిస్ రష్యాకు మినహా మిగిలిన వారికి మరణశిక్ష విధించింది ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టు. దాంతో ఈ తీర్పుపై స్పెయిన్ ప్రభుత్వం కలగజేసుకుంది. దానికి కారణం పాకో... ఫిలిప్పినో–స్పానిష్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన వ్యక్తి కావడమే. ఈ క్రమంలోనే మరో అంశం తెరమీదకు వచ్చింది. మిస్టర్ డియోనిసియో.. మాదకద్రవ్యాల వ్యాపారవేత్త పీటర్ లిమ్స్ దగ్గర కొన్నాళ్లు పని చేశాడని, చియోంగ్ సిస్టర్స్ మిస్ అవ్వడానికి ముందు.. మిస్టర్ చియాంగ్ లిమ్స్కి వ్యతిరేకంగా డ్రగ్స్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాడని, మిస్సింగ్ తర్వాత సాక్ష్యమివ్వడానికి నిరాకరించా డని తేలింది. దాంతో మానవహక్కుల సంఘం పాకో వెనుకే నిలబడింది. స్పెయిన్ ప్రభుత్వ ప్రభావంతో 2006లో వారి మరణశిక్ష రద్దు అయింది. పైగా 2011లో ‘గివప్ టుమారో’ అంటూ పదిహేనేళ్ల పాటు నిర్దోషి అయిన పాకో శిక్ష అనుభవిస్తున్నాడని.. ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది అతడి కుటుంబం. దాంతో సగానికి సగం మంది పాకో తప్పు చేసి ఉండడని నమ్మడం మొదలుపెట్టారు. నిజంగానే చియోంగ్ కుటుంబం ఏదో దాస్తోందనే అనుమానాలు బలపడ్డాయి. సరిగ్గా అప్పుడే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అవేంటంటే.. మారిజోయ్, జాక్వెలిన్ పోలికల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. తమ భర్తలతో, పిల్లలతో కలసి దిగిన ఫొటోలు. ఆ ఫొటోల్లో.. థెల్మా, డియోనిసియోలు కూడా ఉన్నారు. వాటిని చూసి.. ఈ కథ తెలిసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ‘చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? పెళ్లిళ్లు కూడా చేసుకున్నారా? వేరీజ్ జస్టీస్?’ అంటూ నిందితుల వర్గం విస్తృత ప్రచారం చేసింది. అయితే అదంతా మార్ఫింగ్ మాయాజాల మని కొట్టి పారేసేవారూ లేకపోలేదు. చివరికి ద్వంద్వ పౌరసత్వాన్ని ఉపయోగించుకుని పాకో.. స్పెయిన్ జైలుకు బదిలీ అయ్యాడు. మిగిలిన వారు ఫిలిప్పీన్స్‌లోనే శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష పూర్తి అయ్యేసరికి పాకోకి 61 ఏళ్లు వస్తాయి. అయితే పాకో.. స్పెయిన్‌లో శిక్షను అనుభవిస్తూనే.. కొన్ని ఆంక్షల మధ్య.. పార్ట్‌టైమ్‌గా ఓ హోటల్లో షెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతడ్ని నమ్మేవాళ్లు, అతడ్ని స్ఫూర్తిగా తీసుకునేవాళ్లు ఫిలిప్పీన్స్‌లో చాలామందే ఉన్నారు. ఈ కథలో చియోంగ్ స్టిస్టర్ తల్లి థెల్మా ఎంత ఏడ్చిందో.. పాకో తల్లి మార్గరీటా కూడా అంతే ఏడ్చింది. అంతే పోరాటం చేసింది. ఏది ఏమైనా ఈ కథలో పాకో దోషో, నిర్దోషో తేలనే లేదు. చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? అనే ప్రశ్నలకి ఆ ఫొటోలు తప్ప మరో సాక్ష్యం లేదు. నిజంగానే పాకో బృందం నేరం చేసి ఉంటే.. జాక్వెలిన్ ఏమైంది? చియోంగ్ సిస్టర్స్ బతికే ఉంటే.. ఆ రోజు దొరికిన మృత దేహం ఎవరిది? ఇలా వేటికీ సమాధానాలు లేవు. ∙సంహిత నిమ్మన -
బాక్స్ ఆఫ్ బోన్స్.. ఇప్పటికీ మిస్టరీగానే..!
అది 1992 మార్చి 30. అమెరికాలోని వ్యోమింగ్‌లోని థర్మోపోలిస్లో నివాసముంటున్న న్యూవెల్ సెషన్స్ ఇంట్లో ఉన్నట్టుండి గందరగోళం మొదలైంది. న్యూవెల్, అతడి స్నేహితులు కలసి.. ఓ పాత ట్రంకు పెట్టె తాళాన్ని పగలగొడుతున్నారు. గత ఆరేళ్లుగా అందులో ఏముందనే వారి కుతూహలం.. ఆ పనికి ఉసిగొల్పింది. తాళం ఊడింది. తలుపు తెరుచుకుంది. పాక్షికంగా కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను తీసి చూస్తే.. అందులో ఒక బ్యాగ్.. ఆ బ్యాగ్‌లో ఓ మనిషి అస్థిపంజరం విడి భాగాలు ఉన్నాయి. అంతా షాక్. ఒక్కమాటలో చెప్పాలంటే గజగజా వణికిపోయారు. ఆ షాక్‌లోనే న్యూవెల్ భార్య డైసీ.. ‘ఇప్పుడు ఏం చేద్దాం’ అంది. ‘గొయ్యి తవ్వి పూడ్చిపెట్టడం బెటర్’ అన్నారంతా. అది మరింత నేరం కావచ్చని డైసీ హెచ్చరించింది. దాంతో న్యూవెల్.. ఆ ట్రంక్ పెట్టెను అక్కడ వదిలిపోయిన తన స్నేహితుడు గాబీ కోసం పరుగుతీశాడు. గాబీ ఎదురు పడగానే.. ట్రంక్ పెట్టె గురించి ఆరా తీసి.. అతడి హావభావాలను గమనించాలనుకున్నాడు. గాబీ 1986లో న్యూవెల్‌కి ఓ షెడ్‌ని అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ కొన్ని వస్తువుల్ని అందులో వదిలేసి వెళ్లాడు. వాటిలో ట్రంకు పెట్టె ఒకటి. వదిలేసిన వస్తువుల్ని తీసుకెళ్లడానికి గాబీ చాలా సార్లు షెడ్‌కు వచ్చాడు కానీ..ఆ ట్రంక్ పెట్టెను తీసుకెళ్లే ప్రయత్నమైతే చెయ్యలేదు. ‘ఎందుకు?’ అని న్యూవెల్ అడగనూ లేదు. ఇప్పుడు గాబీని కలసిన న్యూవెల్.. ‘షెడ్లో నువ్వు వదిలిపెట్టిన ట్రంక్ పెట్టె గుర్తుందా?’ అని అడిగాడు. ‘గుర్తుంది.. కానీ దాన్ని నేనెప్పుడూ తెరవలేదు. కొన్నప్పుడే దాని తాళంచెవి మిస్ అయ్యింది. డమ్మీ కీస్‌తో చాలా సార్లు ట్రై చేశా.. కానీ ఓపెన్ కాలేదు..’ అంటూ ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చాడు గాబీ. అందులో మనిషి అస్థిపంజరం ఉందని న్యూవెల్ చెప్పగానే.. ‘వేళాకోళాలు వద్దు బ్రదర్’ అంటూ పెద్దగా నవ్వాడు గాబీ. తాను తమాషా చేయడం లేదని నమ్మించడానికి న్యూవెల్‌కి చాలా సమయమే పట్టింది. అయితే గాబీ సమాధానాల మీద న్యూవెల్‌కి నమ్మకం కుదరలేదు. వెంటనే న్యూవెల్.. జాన్ లమ్లీ అనే అధికారి సాయాన్ని కోరాడు. అతడి సమక్షంలోనే వివిధ పరీక్షల కోసం అస్థిపంజరం ల్యాబ్‌కి తరలింది. ఎడమ పుర్రెలో, ఎడమ భుజంలో బుల్లెట్స్ ఉన్నట్లు ఎక్స్‌రేలు తేల్చాయి. దాంతో పుర్రె ఆకారాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి ఊహచిత్రాలను గీయించి .. విడుదల చేశారు పోలీసులు. దీనిపై పత్రికలు కూడా ప్రత్యేక శ్రద్ధచూపించాయి. లమ్లీ వెంటనే.. గాబీని కలసి, తన స్టైల్లో ప్రశ్నించాడు. అప్పుడు కూడా గాబీ తడబడలేదు. ‘చాలా సార్లు పెట్టె ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. దాన్ని ఎక్కడ కొన్నానో గుర్తులేదు. కానీ.. అది 1973 నాటి పెట్టె’ అని బదులిచ్చాడు. దాంతో వెంటనే లమ్లీ.. అస్థిపంజరాన్ని చెయెన్నేలోని వ్యోమింగ్ స్టేట్ క్రైమ్ ల్యాబ్‌కు అప్పగించాడు. అక్కడి ల్యాబ్ అధికారి శాండీ మేస్.. ఆ అస్థిపంజరం ఒక పురుషుడిదని, సుమారు 5.9 పొడవు ఉంటాడని తేల్చాడు. అప్పుడే దర్యాప్తు చేస్తున్న అధికారులకు.. గాబీ మిసిసిపీలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందింది. దాంతో ఈ హత్యకు గాబీకి కచ్చితంగా సంబంధం ఉందని తేలినా.. గాబీ లేకుండాపోవడంతో ట్రంక్ పెట్టె కేసుకు బ్రేక్ పడినట్టయింది. అప్పట్లో లయోవా వాసి షెల్లీ స్టాట్లర్(16), ఆమె తండ్రి ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘బహుశా ఆ అస్థిపంజరం మీ తాత జోసెఫ్ ముల్వానీది కావచ్చ’ని స్టాట్లర్ తండ్రి పదేపదే అనుమానించాడు. అయితే అప్పట్లో స్టాట్లర్ పెద్దగా పట్టించుకోలేదు. ఏళ్లు గడిచేకొద్ది.. స్టాట్లర్కు తన కుటుంబ చరిత్రపై ఆసక్తి పెరిగింది. ఒకసారి తన అమ్మమ్మ మేరీ అలైస్.. తన భర్త జోసెఫ్ ముల్వానీని తన కొడుకు జాన్ డేవిడ్ మోరిస్ చంపేసి ఉంటాడని బాధపడింది. తన తాత గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసిన స్టాట్లర్కు 2017 వచ్చేసరికి.. ఆ అస్థిపంజరం తన తాత జోసెఫ్దేననే నమ్మకం బలపడింది. వెంటనే తన తల్లి కేథరిన్ డీఎన్ఏతో సరిచూడాలని అధికారులకు సిఫారసు చేసింది. అదే ఏడాది అక్టోబర్ 19న కేథరిన్ నుంచి డీఎన్ఏ నమూనా తీసుకున్నారు అధికారులు. అనుకున్నట్లే ఆ అస్థిపంజరం జోసెఫ్ ముల్వానీదే కావడంతో జాతీయస్థాయిలో ఈ కేసు మరోసారి వార్తలకు ఎక్కింది. జోసెఫ్ ముల్వానీ ఎవరో కాదు. 1941 నాటి ఇల్లినాయిస్ నేషనల్ గార్డ్‌లోని 130వ పదాతిదళంలో సభ్యుడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పసిఫిక్ థియేటర్‌కి పోరాటయోధుడిగా వెళ్లాడు. తర్వాత కాలిఫోర్నియాలో రైల్రోడ్ వర్కర్ అయ్యాడు. మేరీ అలైస్‌ను వివాహం చేసుకున్నాడు. కేథరిన్, ఓఓ, పాట్రిక్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మరి మోరిస్ ఎవరు? మేరీ అలైస్ మొదటి భర్త కొడుకే జాన్ డేవిడ్ మోరిస్. 1963లో జోసెఫ్ లయోవాలో ఇల్లు కొని, అందులోకి కుటుంబంతో సహా మాకాం మార్చాడు. ఉన్నట్టుండి జోసెఫ్ అదృశ్యమయ్యాడు. అప్పుడే 16 ఏళ్ల మోరిస్.. జోసెఫ్‌ను హత్య చేసి పాతిపెట్టి ఉంటాడని, ఆ తర్వాత తవ్వి శరీరభాగాలను పెట్టెలో పెట్టి.. థర్మోపోలిస్ తీసుకుని వెళ్లి ఉంటాడని స్టాట్లర్ కుటుంబం భావించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోరిస్, గాబీ ఒక్కరే కావడం. మోరిస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చలామణీ అయ్యాడని దర్యాప్తులో తేలింది. దాంతో గాబీ ఆత్మహత్య కూడా ఒక డ్రామా కావచ్చనే అనుమానాలు బలపడ్డాయి. అయితే నిజం బయటపడక మునుపే.. న్యూవెల్(ట్రంక్ పెట్టె ఓపెన్ చేసిన వ్యక్తి) 2003న, 2009లో మేరీ అలైస్(జోసెఫ్ భార్య) కన్నుమూశారు. 2019 మార్చి 29న వ్యోమింగ్‌లోని బల్లార్డ్ ఫ్యునరల్ హోమ్‌లో జోసెఫ్ కుటుంబ సమక్షంలో పూర్తి సైనిక స్మారక లాంఛనాలతో గౌరవప్రదంగా జోసెఫ్ అంత్యక్రియలు జరిగాయి. మొత్తానికీ ఈ కథలో గాబీ అలియాస్ మోరిస్ ఏమయ్యాడు? అసలు స్టెప్ ఫాదర్ అయిన జోసెఫ్‌ను ఎందుకు చంపాడు? అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన చదవండి: Alzheimers Disease: ఇవి కూడా అల్జైమర్స్ లక్షణాలేనట!! -
లేడీ ఇన్ బ్లాక్.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే
రెండు విరుద్ధమైన వాదనలెప్పుడూ కథను సుఖాంతం చేయవు. ఏది నిజం? ఏది అబద్ధం? అనే ప్రశ్నలను రగిల్చి, అపరిష్కృతంగా విడిచిపెడతాయి. మిస్టరీలుగా మిగిలిపోతాయి. సరిగ్గా నలభై రెండేళ్ల క్రితం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఐ–74 రోడ్డుపై జరిగిన ఘటన అలాంటిదే. అది 1980 జూన్ నెల. కటిక చీకటి, కారుమబ్బులకు హోరుగాలి తోడైంది. రాబర్ట్ డేవిడ్సన్ అనే వ్యక్తి బైక్ మీద ఇండియానాపోలిస్ లోని తన కూతురు ఇంటికి బయలుదేరాడు. వర్షం మొదలయ్యేలోపు అక్కడికి చేరుకోవాలని ఆయన ఆత్రం. కానీ అలా జరగలేదు. ఉన్నపళంగా జోరువాన మొదలైంది. నిజానికి కొన్ని గంటల ముందు నుంచే తుఫాను హెచ్చరికలు సాగుతున్నాయి. ఆ క్రమంలో రాబర్ట్ ఐ–74 రోడ్డుపైకి వచ్చేసరికి వర్షం పెరగడంతో బైక్ బాక్స్‌లోని రెయిన్ జాకెట్ తీసి వేసుకోవడానికి రోడ్డు పక్కకు బండి ఆపాడు. జాకెట్ తీసి, ధరించేలోపు.. ఉరుము ఉరిమి రాబర్ట్‌ను తాకింది. దారిన పోయేవారికి రాబర్ట్ కుప్పకూలడం స్పష్టంగా కనిపించింది ఆ మెరుపులో. చుట్టుపక్కలున్నవారికి అతడి ఆర్తనాదమూ వినిపించింది. పిడుగు దాడిలో 2,00,000 వోల్టుల కరెంటు ఒక్కసారిగా అతనిపై ప్రవహించడంతో రాబర్ట్‌లో ఉలుకూ పలుకూ లేదు. బతికే ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. సమాచారం అందిన కొంతసేపటికే అంబులెన్స్ అక్కడికి వచ్చేసింది. హుటాహుటిన అంబులెన్స్ ఎక్కించారు. రాబర్ట్ పరిస్థితిని గమనించిన వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్సలోనే అతడు ఇక బతకడని నిర్ధారించారు. అతడిలో ఎలాంటి స్పందనా లేదు. ఏ అవయవం పనిచేయట్లేదు. గాలివాన మరింతగా పెరిగిపోతోంది. ఉన్నట్టుండి అంబులెన్స్‌లోని ఎలక్ట్రిక్ పరికరాలన్నీ పని చేయడం మానేశాయి. చుట్టూ ఉన్న వీధి దీపాలు కూడా ఆరిపోయాయి. కరెంట్ పోయిందని అనుకున్నారంతా. మరి అంబులెన్స్‌కి ఏమైంది? రెండు బ్యాకప్ బ్యాటరీలు ఉండగా ఇలా ఎందుకు జరిగింది? అనే అయోమయంలో ఉన్నారా సిబ్బంది. ఇంతలో ఓ అలికిడి. పైనుంచి కింద దాకా నల్లటి వస్త్రాలను ధరించిన ఓ స్త్రీ మూర్తి అక్కడికి వచ్చింది. అంత పెద్ద హోరు వానలో.. ఆమె ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. చుట్టూ చూడగా... అక్కడ అంబులెన్స్, ఫైరింజిన్, రాబర్ట్ బైక్ తప్ప ఇంకేమీ లేవు. ఆమె చాలా చొరవగా రాబర్ట్‌కు దగ్గరగా వచ్చి.. ‘నేనొకసారి ఇతణ్ణి తాకొచ్చా?’ అని అడిగింది. నిర్ఘాంతపోయారు అక్కడున్నవారు. అంబులెన్స్ సిబ్బందిలో ఒకరు.. ‘ఏదైనా మంచి జరగబోతుందేమో?’ అనుకుంటూ ఆమెకు అనుమతి ఇచ్చారు. దాంతో ఆమె రాబర్ట్‌ని తాకింది. అతడి తలపై చేయి పెట్టి.. ఏవో మంత్రాలు చదివింది. రాబర్ట్‌నే చూస్తూ... మనసులో ఏదో అనుకుంది. కొంత సమయం గడిచాక.. ఆమె అంబులెన్స్ దిగి వెళ్లిపోయింది. ‘మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తుఫాన్లో ఎలా వెళ్తారు?’ లాంటి ఎన్నో ప్రశ్నలను సంధించారు అక్కడున్నవారు. కానీ ఆమె స్పందించలేదు. ఆమె అలా వెళ్లగానే ఇలా అంబులెన్స్‌లో లైట్లు వెలిగాయి. అప్పుడే రాబర్ట్లోనూ స్పందన కనిపించింది. దాంతో అంబులెన్స్ ఆసుపత్రివైపు కదిలింది. ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్నప్పుడు కూడా రాబర్ట్ స్పృహలో లేడని... దాదాపు చనిపోయినట్లే అని వైద్యులు భావించారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడని ప్రకటించారు. రెండు నెలలు గడిచాయి. అతను కోమా నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇలా బతికి ఉన్నాడంటే ఆమే కారణం అన్నారు నాటి ప్రత్యక్షసాక్షులు. ఆమె ఎవరు అని అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదు. నిజానికి అంత పెద్ద పిడుగు పాటుకి గురైన వ్యక్తి బతికి బట్టకట్టడం అనేది మిరాకిల్. అందుకే చాలామంది ఆ సిబ్బంది మాటలను నమ్మసాగారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ధరించిన దుస్తులు 1980 నాటివి కావని, 1800 కాలం నాటివని నాడు అంబులెన్స్‌లో ఉన్న పారామెడికో సిబ్బందిలో ఒకరు బయటపెట్టారు. ఆ విషయం ఆమెని అడుగుదామనుకుంటే.. ఆమె చాలా గంభీరంగా కనిపించిందని.. అడగటానికి భయమేసిందని అతడు చెప్పుకొచ్చాడు. దాంతో ఆ మహిళ ఎవరు అనేదానిపై చర్చ మొదలైంది. ఆమె అనేది అబద్ధమని.. పారామెడికోలు కట్టుకథ అల్లారనే వాదనలు ఒకవైపు నడుస్తుండగానే.. ఆమె దెయ్యమని కొందరు, కాదు దేవదూత అయ్యి ఉంటుందని మరికొందరు వాదనలకు దిగారు. అందుకు తగ్గ ఆధారాలను ఈ కథకు లింక్ చేశారు. ఆమె వచ్చిన సమయంలో అంబులెన్స్‌తో సహా చుట్టూ లైట్స్ ఆరిపోయాయి కాబట్టి.. ఆమె దెయ్యమేనని, పైగా ఆమె ధరించిన దుస్తులు 1800 కాలం నాటివని ప్రత్యక్షసాక్షి చెబుతున్నాడు అందుకని ఆమె కచ్చితంగా దెయ్యమేనని చెప్పుకొచ్చారు చాలామంది. అయితే మరికొందరు మాత్రం ఆమె దేవదూత అనే దానికి ప్రత్యేక కారణం కూడా చెప్పారు. రాబర్ట్‌కి ప్రమాదం జరిగిన రోడ్డు పక్కనే పెద్ద మైదానం ఉందని, అక్కడ 19వ శతాబ్దంలో మతపరమైన ప్రార్థనలు జరిగేవని, వేలమంది ఆ ప్రార్థనల్లో పాల్గొనేవారని, అందువల్ల ఆమె.. దేవదూతేనని వాదించారు. దెయ్యం లేదా దేవదూత లేదా మత ప్రబోధకురాలు కావచ్చు అని కొందరు భావించారు. మొత్తంగా ఆమె ఎవరన్నది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. చావు అంచుల దాకా వెళ్లిన రాబర్ట్‌ని బతకించేంత శక్తి ఆమెకు ఎలా వచ్చింది? అసలు ఆమె ఎవరు? అనేది నేటికీ తేలలేదు. రాబర్ట్ పునర్జన్మ మాత్రం మెడికల్లీ మిస్టరీనే. ∙ఎస్.ఎన్ -
రష్మిక మందన్నా ఫెవరెట్ బుక్ ఏంటో తెలుసా..?
ది ఛేంజ్–మైఖేల్ క్రోగరస్, రోమన్ షాప్లర్ ఫ్రీలాన్స్ రైటర్ మైఖేల్ క్రోగరస్ తన కాలేజి ఫ్రెండ్ రోమన్ షాప్లర్‌తో కలిసి రాసిన పుస్తకం ఇది. తెల్లారి లేచింది మొదలు ప్రశ్నలతోనే మన జీవితం మొదలవుతుంది. మార్పు వేగంగా సంభవించే ఈ ప్రపంచంలో మనం ఎలా మారాలి? పుస్తకం చదవడానికైనా, పదేపదే వాయిదా పడుతున్న పనిచేయడానికైనా టైమ్ ఎందుకు దొరకడం లేదు? కొందరు నిజాయితీ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తారు? బయోటెక్నాలజీ అనేది పరిశ్రమల భవిష్యత్‌గా ఎలా మారనుంది...ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 176 పేజీల ఈ పుస్తకంలో ఎక్కడో ఒకచోట జవాబు దొరకుతుంది. ‘ఆర్థిక ప్రపంచం’ అనే మాట వినబడగానే అక్కడే ఉండే మనకు అది మనది కాని ప్రపంచం అనిపిస్తుంది. అయోమయానికి గురి చేసే అంకెలు, అర్థం కాని నిర్వచనాలు దీనికి కారణం అనేది తెలియదుగానీ ఈ పుస్తకంలోకి వెళితే అలాంటి భయాలు మనల్ని వీడుతాయి. ది మోనోగమి మోడల్, ది స్వార్మ్ ఇంటెలిజెన్స్ మోడల్, ది మీనింగ్ ఆఫ్ లైఫ్ మోడల్, ఛేంజ్ మోడల్....ఇలా రకరకాల మోడల్స్‌ను ఆసక్తికరంగా వివరిస్తారు. మన వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక,ఆర్థిక,పర్యావరణరంగాల వరకు రకరకాల మార్పులు వస్తూనే ఉన్నాయి. మన జీవితాల్లో మార్పు అనేది ఎలా సంభవిస్తుంది, దానితో ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోవచ్చు. నిజానికి ‘మార్పు’ అనేది మనకు కొత్త కాదు. బాల్యం నుంచి అది మన వెంటే ఉంది. చిన్నప్పుడు మన ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు...మొదలైన వాటిలో మార్పులు వేగంగా జరిగేవి. ఈ క్రమంలోనే మార్పుకు సంబంధించి మన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల నుంచి మొదలు ప్రపంచచరిత్ర వరకు ఎన్నో ఉదాహరణలు ఇస్తారు. ‘ఛేంజ్ ఈజ్ నాట్ ఏ చాయిస్...ది వోన్లీ చాయిస్ ఈజ్ డూ యూ డూ ఇట్’ అని చెప్పే ఈ పుస్తకం ప్రాథమిక స్థాయిలో మార్పు గురించి చెబుతుంది. స్వేచ్ఛ–హద్దు అనేవి రెండు విరుద్ధ అంశాలుగా కనిపించిన్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మన స్వేచ్ఛకు హద్దులు నిర్ణయించుకోవాలి. ఉదా: నెట్లో విహరించడం అనేది మన స్వేచ్ఛ అనుకుంటే...‘ఇంత సమయం మాత్రమే’ అంటూ దానికొక కాలపరిమితి ఉండాలి. మార్పు అనేది అపరిచితుడిలాగా కనిపించి అయోమయానికి గురి చేస్తుంది. దీనిలో నుంచి అభద్రత కలుగుతుంది. అభద్రతకు గురైనప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. సంతోషానికి దూరం చేస్తుంది.‘మార్పు’ అనేది కేంద్రబిందువుగా సాగే ఈ పుస్తకంలో వివిధ విషయాలలో నిపుణుల సలహాలు, సంక్లిష్టమైన సిద్ధాంతాలను సరళీకరించి చెప్పడంలాంటివి ఆకట్టుకుంటాయి. చదవండి: Fashion: నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం! -
ఎవరీ సింథియా.. 42 ఏళ్లుగా మిస్సింగ్.. అసలేం జరిగింది?
స్వార్థపూరితమైన ఆలోచనలు కక్షగడితే.. ఆనవాళ్లు, అవశేషాలు కూడా దొరకవనేందుకు సింథియా ఆండర్సన్ కథే సాక్ష్యం.అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో టోలీడోలోని.. ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయే సింథియా. మైఖేల్ ఆండర్సన్ దంపతులకు..1961 ఫిబ్రవరి 4న జన్మించింది. మత సంప్రదాయాల్ని కచ్చితంగా పాటించే మైఖేల్‌కి కూతురు సింథియా అంటే ప్రాణం. సింథియాకూ తండ్రంటే అంతే గౌరవం. ఏనాడూ తండ్రి మాటకు ఎదురు చెప్పిందిలేదు. సహజంగానే అందగత్తెన సింథియాకు మేకప్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే మేకప్ వేసుకోవడమో, నవలలు చదవడమో చేసేది. మొదటి నుంచీ ఆమెకు స్నేహితులు ఎక్కువ. అయినా సరే తండ్రి చెప్పినట్టుగా.. తనకంటూ కొన్ని హద్దులు ఏర్పరచుకుని నడుచుకునేది. తన కుటుంబ గౌరవానికి తలవంపులు తేవద్దనే తలంపుతోనే ఉండేది. ఆమెకు తన 19వ ఏట ఒక కలొచ్చింది.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. తనని ఎత్తుకెళ్లి క్రూరంగా చంపేసినట్లు. బెదిరిపోయి ఇంట్లో వాళ్లకి చెప్పింది. తల్లి, సోదరి ఇద్దరూ సింథియాకు ధైర్యం చెప్పారు. అయితే ఆ కల ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. రోజుల తరబడి వెంటాడడంతో సింథియా కలవరపడింది. తనకు ఏదో జరగబోతోందని శంకించింది. నిత్యం ఆ భయంతోనే గడపసాగింది. కొన్ని రోజులకు అదో మానసిక రుగ్మతగా మారింది. ఓ పక్క కుటుంబ నియమాల ప్రకారం ప్రతిరోజూ ప్రార్థన సమావేశాలు, క్యాంపింగ్ ఈవెంట్స్‌కు హాజరవుతూనే లీగల్ సెక్రెటరీగా ఉద్యోగం చేసేది సింథియా. ఆమె పని చేసే కార్యాలయంలో తను కూర్చునే డెస్క్ ఎదురుగా ఉండే గోడపైన ఓ ఆకతాయి.. ‘ఐ లవ్యూ సిండీ.. బై జీడబ్ల్యూ’ అని స్ప్రే పెయింట్ చేశాడు. సిండీ అనేది సింథియా ముద్దుపేరు. అప్పటికే సింథియా.. పీడ కలతో సతమతమవు తుండటంతో ఆ రాసింది ఎవరనే దానిపై దృష్టి పెట్టలేకపోయింది. తనకొచ్చిన కల ఎక్కడ నిజమవుతుందోనన్న భయంతో తన డెస్క్ దగ్గర ఎమర్జెన్సీ బజర్ ఏర్పాటు చేయించుకుంది. ఎందుకంటే ఉదయం పూట అంతపెద్ద ఆఫీస్‌లో సింథియా ఒక్కత్తే ఉండేది. మిగిలిన కొలీగ్స్ అంతా మధ్యాహ్నం వచ్చేవారు. అది 1981, ఆగస్టు 4.. సింథియా జీవితాన్ని చరిత్రలో కలిపేసిన రోజది. అప్పటికి ఆమెకు ఇరవై ఏళ్లు. మరో రెండువారాల్లో తను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి.. బైబిల్ కాలేజీకి వెళ్లాలనేది ఆమె నిర్ణయం. కానీ అలా జరగలేదు. ఆగస్టు 4న ఉదయం ఎనిమిదిన్నరకి.. బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకుండానే ఆమె తన కారులో ఆఫీస్‌కి బయలుదేరింది. ఎప్పటిలా కాకుండా ఆ రోజు తొమ్మిది నలభై ఐదుకి అంటే కాస్త ఆలస్యంగా ఆమె ఆఫీస్‌కు వచ్చినట్టుగా గమనించాడు వాచ్‌మన్. మధ్యాహ్నం 12 గంటలకు తతిమా సహోద్యోగులు ఆఫీస్‌కి వచ్చేసరికి సింథియా అక్కడ లేదు. తలుపులు తీసే ఉన్నాయి. కారు పార్కింగ్‌లోనే ఉంది. కారు తాళంచెవి, హ్యాండ్ పర్స్ మాత్రం కనిపించలేదు. ఫోన్ రిసీవర్ పక్కకు తీసిపెట్టి ఉంది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రేడియో మోగుతూనే ఉంది. అప్పుడే నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు.. ఆ వాసన ఇంకా ఆఫీస్ వాతావరణంలో తచ్చాడుతూనే ఉంది. మరో విచిత్రం ఏమిటంటే.. ఆమె క్యాబిన్లో ఓ రొమాంటిక్ నవల తెరిచి ఉంది. అందులో.. ‘అతను వచ్చి కత్తితో బెదిరించి.. ఆమెని ఎత్తుకుపోయాడు’ అనే వాక్యం ఉంది. కానీ ఎక్కడా కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు లేవు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు మొదలుపెట్టారు. పేరెంట్స్‌కి తెలియకుండా సింథియాకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడు చర్చిలో సభ్యుడని, బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాడని.. అందుకే సింథియా కూడా ఉద్యోగం మానేసి.. బైబిల్ కాలేజీలో జాయిన్ కావాలనుకుందని.. ఇలా ఏవేవో విషయాలు బయటికి లాగారు. సింథియా ఆఫీస్‌లో.. జీడబ్ల్యూ (ఐ లవ్యూ కింద ఉన్న లెటర్స్) పేరున్న వ్యక్తిని కూడా ప్రశ్నించారు. అతడికీ, ఈ కేసుకు ఏ సంబంధం లేదని తేలింది. మరోవైపు సింథియాకి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఏవేవో బెదిరింపు కాల్స్ వచ్చేవని, వాటితో ఆమె చాలా ఇబ్బంది పడేదని కొందరు కొలీగ్స్ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులకు ఓ అజ్ఞాత మహిళ.. పోలీసులకు ఫోన్‌చేసి ‘మా పక్కింటి అబ్బాయి.. సింథియాని బలవంతంగా బంధించాడు. అతడి తల్లిదండ్రులు అతడితో లేరు. పక్కిల్లే కావడంతో ఆ విషయం నాకు తెలిసింద’ని చెప్పింది. పూర్తి వివరాలు అడిగేసరికి ఆమె భయపడి ఫోన్ కట్ చేసింది. దాంతో పోలీసులు అనుమానాస్పదమైన కొన్ని ఇళ్లను సోదా చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మరోవైపు.. సింథియా పనిచేసే లా ఆఫీస్‌లో రిచర్డ్ నెలర్ అనే న్యాయవాదికి మాదకద్రవ్యాలకు సంబంధించిన నేర చరిత్ర ఉంది. ఈ క్రమంలో నెలర్కి సంబంధించిన చట్టవిరుద్ధమైన డ్రగ్ యాక్టివిటీ గురించి సింథియాకి ఏమైనా తెలిసిందా? అదే ఆమెకు శాపమైందా? అనే యాంగిల్ల్లోనూ విచారణ కొనసాగింది. కానీ కేసు ముందుకు కదల్లేదు. ఇంట్లో కఠినమైన నియమనిబంధనలను తాళలేక ఇంట్లోంచి తప్పించుకునేందుకు సిం«థియానే అలాంటి నాటకమాడిందనే వాదనా బలంగా వినిపించింది. అదే నిజమైతే.. సింథియా అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. వాటిని వినియోగించినట్లు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. ఎప్పటికైనా సింథియా తిరిగి వస్తుందని ఆశపడ్డాడు తండ్రి మైఖేల్. ఫోన్ నంబర్ మార్చినా, ఇళ్లు మారినా సింథియా తిరిగి రావాలనుకుంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో అదే ఇంట్లో, అదే ఫోన్ నంబర్‌తోనే గడిపింది ఆ కుటుంబం. చివరికి ఆమె వివరాలు తెలుసుకోకుండానే చనిపోయారు సింథియా తల్లిదండ్రులు. అసలు ఆ రోజు ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా చంపేశారా? లేక సింథియానే కుటుంబాన్ని వదిలి పారిపోయిందా? మానసిక రుగ్మతతో ఏ ఆత్మహత్యకైనా పాల్పడిందా? అనేది నేటికీ మిస్టరీనే. సంహిత నిమ్మన -
గులాబీ రంగు అమ్మాయిలకే కాదు బ్రిటిష్ ఆర్మీకీ ఇష్టమే!.. పింక్ పాంథర్స్ విశేషాలు తెలుసా!
అమ్మాయిలకు గులాబీలన్నా.. గులాబీ రంగన్నా ఇష్టం అంటారు. నిజానికి గులాబీ రంగు బ్రిటిష్ ఆర్మీకి ఇష్టమట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎడారి ప్రాంతాల్లోని సైనిక దళాలకు సహాయం చేసిన వాహనాల రంగు ఈ గులాబీనే. వీటికి ‘పింక్ పాంథర్స్’ లేదా ‘పింకీస్’అని పేరు. సాధారణంగా అడవులు, కొండల్లో కాపలాకాసే సైనికులను, శత్రువులు త్వరగా గుర్తించకుండా ఉండటానికి ఆర్మీ ఎక్కువగా ఆకుపచ్చ, గోధుమరంగులను ఉపయోగిస్తుంది. కానీ, ఈ రంగులు ఎడారి ప్రాంతాల్లో ఉపయోగపడవు. ఇందుకోసం 1968– 1984 బ్రిటిష్ ఎస్ఏఎస్ ఈ పింక్ పాంథర్ జీప్లను ఉపయోగించింది. ఈ ఉపాయం బాగా పనిచేసింది. దగ్గరగా చూస్తే కాని కనిపించని ఈ వాహనాలు ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడాయి. తర్వాత ఇదే ఉపాయాన్ని ఇంకొన్ని దేశాలు కూడా ఉపయోగించాయి. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వినియోగం ఆగిపోయింది. అప్పట్లో మిగిలిపోయిన వాటిలో ఇరవై వాహనాలను ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2019లో నిర్వహించిన ఓ వేలంలో 1968 ల్యాండ్‌రోవర్ 2ఏ పింక్ పాంథర్ రూ. 64 లక్షలకు అమ్ముడుపోయింది. మిగిలినవి మ్యూజియంలో ప్రదర్శనల్లో ఉపయోగిస్తున్నారు. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్
పూర్వపు వాళ్లలోను, ఇప్పటి వాళ్లలోను మనం జ్ఞాపకం ఉంచుకో తగిన ఉపాయశాలులందరిలో గొప్పవాడెవడో చెప్పగలరా? కొందరు ఒకడు గొప్పవాడు అంటే మరికొందరు ఇంకొకడు మరీ గొప్పవాడంటారు. కానీ నిజం తెలిసినవాళ్లంతా అబునువాస్ పేరే చెబుతారు. అబునువాస్ జీవితమంతా హాస్యకథలుగా, తమాషాపనులతో, మంచి మంచి ఉపాయాలతో నవ్వుల మాటలతో గడచిపోయింది. అంతేకాదు ఎన్నోసార్లు తన యుక్తితో హాస్యంతో ఎన్నో చిక్కుల్లోంచి బయటపడ్డాడు. ఆయన ఎవ్వరినైనా సరే నవ్వించాలనుకున్నాడా.. తమాషా మాటల్తో కడుపుబ్బేట్టు నవ్వించేవాడు. ఎంత తెలివిగలవాడినైనా చాదస్తుడనిపించాలంటే ఏదో యుక్తిపన్ని బోల్తా కొట్టించేసేవాడు. మామూలు మనుషుల్నే కాదు మహారాజుల్నీ లెక్కలేకుండా హాస్యమాడేవాడు. ఈ అబునువాస్కు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకి నీళ్లు పెట్టటానికి ఒక పెద్దపళ్లెం కావలసివచ్చింది. పొరుగింటి వాళ్లను అడిగాడు. వాళ్లు అబునువాస్కు రాగిపళ్లెం ఇచ్చారు. దాన్ని మూడురోజులు తన వద్దే ఉంచుకున్నాడు. నాలుగోరోజున ఆ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం పెట్టి ఆ రెండిటినీ తీసుకెళ్లి పొరుగింటివాళ్లకు ఇచ్చాడు. పక్కింటి పెద్ద మనిషి తమ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం కూడా ఉడడం చూసి ‘అయ్యో ఈ చిన్నపళ్లెం మాది కాదే!’ అన్నాడు. దానికి అబునువాస్ ‘మీరిచ్చిందేదో మీకు తిరిగి ఇచ్చేశాను. మీ రాగిపళ్లెం నా దగ్గర ఉన్నప్పుడు దానికి ఈ చిన్నపళ్లెం పుట్టింది. ఇది రాగిపళ్లెం బిడ్డ కాబట్టి ఈ రెండూ మీవే’ అని చెప్పాడు. అబునువాస్ తెలివి తక్కువతనానికి నవ్వుకుని ఇంకో పళ్లెం కూడా వస్తూంటే పోనివ్వటమెందుకని ‘మీరు చెప్పింది నిజమే! మా పళ్లానికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇదీ మాదే. పళ్లాలకు కూడా బిడ్డలు పుట్టే చల్లని ఇల్లు మీది’అన్నాడు పొరుగింటాయన. మూడురోజులు పోయాక అబునువాస్ మళ్లీ వాళ్లింటికి వెళ్లి ఆ పళ్లమే ఇంకోసారి అరువడిగాడు. ఈసారి ఇంకో మంచి బిడ్డను తీసుకొస్తుందనే సంతోషంతో వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పళ్లాన్ని తెచ్చిచ్చాడు. అబునువాస్ నవ్వుకుంటూ ఆయనకు నమస్కారం పెట్టి రాగిపళ్లెం చంకనబెట్టుకొని ఇంటికి పోయాడు. ఈసారి పళ్లెం తీసుకుపోయి ఎన్నాళ్లయినా తిరిగి ఇవ్వలేదు. పొరిగింటాయన వచ్చి పళ్లెం కావాలని అడిగాడు. అబునువాస్ ఎంతో విచారంగా‘ఏం చేయమంటారు బాబూ.. మీకు పుట్టెడు దుఃఖవార్త చెప్పాల్సి వచ్చింది. మీ పళ్లెం చచ్చిపోయింది బాబూ’ అని చెప్పాడు. ‘ పళ్లెం చచ్చిపోవడమేమిటి?’ విస్తుపోయాడు పొరుగింటి మనిషి. ‘ఈ విషయం మీకు చాలా దుఃఖం కలుగజేస్తుందనే నేను మీకు ఇన్నాళ్లూ చెప్పలేదు. ఏం చెయ్యను? చివరికి చెప్పక తప్పలేదు’ అన్నాడు అబునువాస్. ఆ మాటకు పొరుగింటి పెద్దమనిషికి తగని కోపం వచ్చింది. ‘తమాషాగా ఉందా? రాగిపళ్లెం చావటమేమిటి?నన్ను పిచ్చివాణ్ణనుకుంటున్నావా?’ అంటూ మండిపడ్డాడు. ‘ఆ రాగిపళ్లమే కదండీ ఇంతకుముంద బిడ్డను కనిందీ..’ గుర్తుచేశాడు అబునువాస్.‘అవును’ చెప్పాడు పొరుగింటాయన. ‘ఈ సృష్టిలో బిడ్డల్ని కనేవన్నీ ఏనాడో ఒకనాడు చచ్చిపోకమానవు బాబూ? ఎటొచ్చీ మీ రాగిపళ్లెం పాపం పరాయింట్లో చచ్చిపోవటమే చాలా విచారకరం. ఏం చేస్తాం.. దానికి అలా రాసిపెట్టి ఉంది’ అని ఓదార్చాడు అబునువాస్. అలా ఆ రాగిపళ్లాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఇంకోసారి ఒకడు అబునువాస్ దగ్గరకు వచ్చి అతని గాడిదను అరువు అడిగాడు. పని మీద తన గాడిద ఊరికి వెళ్లిందని అబునువాస్ చెప్తూండగానే పెరట్లోంచి గాడిద ఓండ్రపెట్టింది. ‘దొడ్లో గాడిద అరుస్తూంటే ఊరెళ్లిందని చెప్తున్నావ్.. నువ్వేం పెద్దమనిషవయ్యా?’ అంటూ నిలదీశాడతను. ‘నీకు కావలసింది మా గాడిదా? దాని అరుపా? గాడిదైతే ఇక్కడలేదు. దాని అరుపు కావాలంటే తీసుకుపో’ అంటూ గాడిదలాగా ‘ఈ.. ఓర్.. ఈ ..ఓర్’ అంటూ ఓండ్రపెట్టి ‘ఇదిగోనయ్యా.. గాడిద అరుపు. దానిమీద ఎక్కి నీ దారిన నువ్వు పో త్వరగా’ అని చెప్పాడు. తెల్లబోయాడు ఆ పెద్దమనిషి. ఇంకోసారి ఇంకా మంచి తమాషా జరిగింది. అబునువాస్ రెండంతస్తుల మేడ కట్టాడు. అంతా కట్టిన తరువాత ఆ మేడ అమ్మాలని బేరం పెట్టాడు. అంత పెద్దమేడ ఎవరికీ అవసరం లేకపోయింది. అడిగినవాళ్లే లేకపోయారు. చివరికెట్లాగో అబునువాస్ తన మేడ మీది అంతస్తు మాత్రం ఒక వ్యాపారస్తుడికి అమ్మగలిగాడు. వర్తకుడు మేడ మీద ప్రవేశించాక కిందిభాగం కూడా కొనమని అతణ్ణి అడగసాగాడు అబునువాస్. వ్యాపారస్తుడు మాత్రం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. ఒకనాటి ఉదయం అబునువాస్ చాలామంది కూలీలను పిలిపించి తన ఇంటి గోడలు పగలగొట్టమన్నాడు. ఈ గడబిడ ఏమిటా అని పైనున్న వర్తకుడు కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు. అంతమంది కూలీలు అబునువాస్ చెప్పినట్టే మేడ గోడలను కూలగొట్టసాగారు. కంగారుపడుతూ ఆ వర్తకుడు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ అరిచాడు. ‘కింది అంతస్తు అమ్ముతానంటే ఎవరూ కొనలేదు. అందుచేత పగలగొట్టించేస్తున్నాను. నీ పై అంతస్తును జాగ్రత్తగా చూసుకో. నీ మేడ విరిగి నా కూలీల మీద పడి వాళ్లకు దెబ్బలు తగిలితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు అబునువాస్. ‘పగలగొట్టించకండి.. కింది అంతస్తు కూడా నేనే కొంటాను’ అంటూ ఆ వర్తకుడు కింది అంతస్తు కూడా కొన్నాడు విధిలేక. ఆఖరికి ఆ ఊరి రాజుకూడా అబునువాస్ హాస్యపుదెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకనాటి రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. అబునువాస్ ఇంటి కింద.. భూమిలో వెండినాణాలతో నిండిన బిందెలు ఉన్నట్టు రాజుకి కలలో కనబడింది. తెల్లవారే ఆ బిందెలను తవ్వుకురమ్మని పదిమంది పనివాళ్లను అబునువాస్ ఇంటికి పంపాడు రాజు. అప్పుడు అబునువాస్ ఇంట్లోలేడు. పనివాళ్లు ఇంటి కింది నేలను తవ్వేస్తూంటే ఏమీ చేయలేక ఏడుస్తూ దూరంగా నిలబడింది అబునువాస్ భార్య. ఎంత పెళ్లగించినా వెండిబిందెలు కనబడలేదు. రాజుగారి కూలీలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అబునువాస్ ఇంటికి రాగానే అతని భార్య ఏడుస్తూ సంగతంతా చెప్పింది. ‘మరేమీ పరవాలేదులే. రాజుగారికి తగిన శాస్తి నే చేస్తాగా! నువ్వు దిగులు పడకు’ అంటూ భార్యను ఓదార్చాడు అబునువాస్. వండిన అన్నాన్ని కొంత తీసి ఒక పళ్లెంలో వేసుకుని దాని మీద ఒక తువాలు కప్పాడు. తువాలు మీద చాలా ఈగలు వాలాయి. అందులో కొన్ని లోపలికి దూరి అన్నం తినటానికి ప్రయత్నించాయి. మరునాడు తెల్లవారగానే తువాలు కప్పిన అన్నపు పళ్లాన్ని రాజుగారి కోటకు తీసుకెళ్లాడు. ‘ప్రభూ.. నాదొక ఫిర్యాదు. కొందరు నా ఇంటికి పిలవకుండానే వచ్చి నా ఆహారాన్ని తినేస్తున్నారు. వాళ్లను దండించ కుండా ఎట్లా ఊరుకోమంటారో మీరే చెప్పండి’ అని రాజుగారిని అడిగాడు. అబున్వాస్ ఏదో కట్టుకథలాంటిది చెబుతున్నాడేమో అనుకున్నాడు రాజు. తన పనివాళ్లు అతని ఇంట్లో నేలను పెళ్లగించిన విషయం చెబుతున్నాడేమోనని కూడా రాజుకి అనుమానం కలిగింది. ‘ఇంతకీ నువ్వు ఫిర్యాదు చేస్తున్నది ఎవరి మీద?’ అని అడిగాడు రాజు. తను తెచ్చిన అన్నపు పళ్లెం మీద కప్పిన తువాలు తీశాడు అబునువాస్. వెంటనే మూడు ఈగలు ఎగిరిపోయాయి. ‘వీటి మీదే నా ఫిర్యాదు’ అన్నాడు అబునువాస్ ఆ ఈగలను చూపిస్తూ. రాజుకి నవ్వు వచ్చింది. ‘ఈగల మీదా నీ ఫిర్యాదు? సరే. నన్ను ఏం చేయమంటావో చెప్పు’ అన్నాడు. ‘చట్టంప్రకారం నాకు న్యాయం చెయ్యమంటున్నాను. ఈగల్ని దండించడానికి మీరు నాకు అనుమతి ఇవ్వాలి. అంతే ప్రభూ’ అన్నాడు అబునువాస్. ‘భేష్.. ఈగలను దండించటానికి నీకు అనుమతి ఇచ్చాను. ఈగలు ఎక్కడ కనిపించినా నీ ఇష్టం వచ్చినట్టు దండించు’ అన్నాడు రాజు నవ్వుతూ. రాజుగారు ఈ తీర్పుని ఒక కాగితం మీద కూడా రాసి సంతకం చేసి అబునువాస్కి ఇచ్చాడు. అబునువాస్ ఈగలను దండించటానికి పెద్ద దుడ్డుకర్ర చేయించాడు. ఆ కర్ర చివర గట్టి ఇనుప పొన్ను వేయించాడు. ఎక్కడ ఈగ కంటబడితే అక్కడ కర్రతో కొట్టేసేవాడు. బజారుకు వెళ్లినప్పుడు ఖర్జూరపు పళ్ల బుట్టల మీద ఈగలు వాలటం చూసి దుడ్డుకర్ర విసిరేవాడు. పళ్లన్నీ చితికిపోయేటట్టు కర్రతో బాదేవాడు. అంగడివాళ్లు ‘ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు?’ అని గదమాయించి అడిగితే ‘నేనేమీ మీ పళ్లను కొట్టటం లేదయ్యా! వాటి మీద వాలిన ఈగల్నే దండిస్తున్నాను’ అని జవాబు చెప్పి రాజుగారు ముద్రవేసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించేవాడు. వాళ్లు ‘ఇదేం మేళంరా!’ అనుకుంటూ ఊరుకునేవాళ్లు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అబునువాస్ వెర్రి చేష్టలకు విసుక్కునేవాళ్లు విసుక్కుంటున్నారు. నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. రాజుగారు కూడా ఈ వింత చేష్టలన్నీ విని విరగబడి నవ్వాడు. చివరకు ఒకనాడు రాజుగారు రాజసభలో తీర్పులు చెబుతున్నాడు. అబునువాస్ కూడా వెళ్లి రాజుగారికి దగ్గరగా కూర్చున్నాడు. రాజుగారు ఏదో నేరాన్ని విచారణచేశాడు. గంభీరంగా తీర్పు చెబుతుండగా రాజుగారి వీపు మీద ఈగ వాలింది. చటుక్కున తన దుడ్డుకర్రతో రాజుగారి వీపు మీద గట్టిగా బాదాడు అబునువాస్. అతని ఆ చర్యకు సభంతా ఘొల్లుమంది. అబునువాస్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. రాజుగారిని కొట్టినందుకు అతనిని శిక్షించాలని పట్టుబట్టారు. ‘అబునువాస్.. ఏమిటీ పిచ్చి? రాజుగారిని కొడతావా?’ అని అధికార్లు అబునువాస్ మీద మండిపడ్డారు. జంకుగొంకు లేకుండా అబునువాస్ ‘నేను తప్పేం చేయలేదే? నన్ను శిక్షించడం న్యాయంకాదు. నేను రాజుగారి వీపు మీద వాలిన ఈగను కొట్టానుగాని, రాజుగారిని కొట్టలేదు. రాజుగానే ఈగల్ని చంపటానికి నాకు అనుమతి ఇచ్చారు’ అని చెప్పాడు. రాజుగారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అనుమతి పత్రం జేబులోంచి తీసి అందరికీ చూపించాడు. ఇంకేం మాట్లాడతారు? అతను చెప్పిందంతా నిజమే. అతనిని నిర్దోషిగా వదలక తప్పిందికాదు. ‘వెధవ ఈగలకి తగిన శాస్తి జరిగింది. అవి నా ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా నా సొమ్మును తీసుకోటానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అన్నాడు అబునువాస్. మరోసారి ఇంకో విచిత్రమైన సంగతి జరిగింది. పట్నంలో ఒక భాగ్యవంతుడైన వర్తకుడు మేకమాంసం వండించి మంచి విందు తయారు చేస్తున్నాడు. విందు భోజనం వండేటప్పుడు ఒక బిచ్చగాడు అక్కడ ఏమి జరుగుతూందో చూద్దామని వచ్చాడు. పాపం.. వాడు కాస్త దూరంగా వంటలు తయారుచేసే చోటు నుంచి వచ్చే ఘుమఘుమలాడే ఆ గాలిని పీల్చుకుంటూ కూచున్నాడు. వాసనే ఇంత కమ్మగా ఉంటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందోనని విందు గురించి ఊహించుకోసాగాడు. అయితే ఆ ధనవంతుడు, ఆ బిచ్చగాడికి పిడికెడు అన్నం కూడా పెట్టించలేదు. మరునాడు ఆ వర్తకుడు కనిపించినప్పుడు ‘అయ్యా.. మీరెంత మంచివారో.. మీ వంట పందిరి దగ్గరైనా నన్ను కూచోనిచ్చారు! మీ విందులోని పసందైన మేకమాంసం కూరల కమ్మని వాసన పీల్చేటప్పటికే నాకు సంతృప్తిగా భోజనం చేసినట్టయింది’ అన్నాడు. ‘సరి..సరి.. అందుకేనేమో నిన్న మా మేకమాంసం రుచీపచీ లేకుండా పోయింది. ఆ కమ్మని వాసనంతా నువ్వే పీల్చేసి ఉండాలి సందేహం లేదు’ అన్నాడు వర్తకుడు. అంతటితో ఊరుకోక రాజు వద్దకు వెళ్లి తన మేకమాంసం కూరల కమ్మని వాసనంతా అపహరించుకుపోయాడని బిచ్చగాడి మీద అన్యాయంగా ఫిర్యాదు చేశాడు. రాజు.. వర్తకుల పక్షపాతి కాబట్టి అతడు చెప్పిన ఫిర్యాదు నమ్మి ఆ నేరం చేసినందుకు బిచ్చగాడు పన్నెండు వెండి నాణాలు ఆ వర్తకుడికి ఇచ్చి తీరాలని తీర్పు చెప్పాడు. బిచ్చగాడి చేతిలో పైసా లేదు. పాపం ఏడుస్తూ వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు వాడికి అబునువాస్ ఎదురుపడ్డాడు. రాజుగారి అన్యాయపు తీర్పు సంగతి చెప్పాడు. అబునువాస్ జాలిపడి ‘నేను నీకు సాయం చేస్తాను దిగులుపడకు. నీ అప్పు తీర్చిపారెయ్యటానికి రేపు ఉదయం కలుసుకుందాంలే’ అని ధైర్యం చెప్పాడు. మరుసటి దినం అబునువాస్ బిచ్చగాడితో సహా రాజసభకు వెళ్లాడు. వర్తకుడు కూడా తన పైకాన్ని తీసుకోటానికి వచ్చాడు. అబునువాస్ వర్తకుణ్ణి చూసి ‘నీ డబ్బు చెల్లిస్తే పుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నావయ్యా?’ అని అడిగాడు. ‘ఆ సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వండి’ అన్నాడు వర్తకుడు. అబునువాస్ పన్నెండు వెండి నాణాలు తీసి బిచ్చగాడి చేతికిచ్చాడు. ‘ఇదిగో.. వీటిని భూమి మీద పడెయ్యి’ అన్నాడు అబునువాస్. అట్లాగే బిచ్చగాడు ఆ నాణాల్ని నేల మీద పడేశాడు. అవి రాతి నేల మీద పడగానే గణగణమని మోగాయి. ‘విన్నావా? ఆ నాణాల టింగు టింగు మోత!’ అన్నాడు అబునువాస్. ‘ఆ విన్నాను..’ చెప్పాడు వర్తకుడు. ‘ఆ వెండినాణాల్లో నీకు రావలసిన భాగం ఆ టింగ్ టింగే. తీసుకో’ అన్నాడు అబునువాస్. ‘నీ భోజనం కమ్మదనం వాసన చూసినంత మాత్రాన నువ్వు నష్టపోతే ఆ బిచ్చగాడి డబ్బు గణగణ ధ్వని నువ్వు విన్నావు గనుక అది నీకు ముట్టినట్టే. ఇక వెళ్లు’ అన్నాడు అబునువాస్. అతను చెప్పిన న్యాయం ప్రకారం బిచ్చగాడు వర్తకుడికి పన్నెండు కాసులూ చెల్లించినట్టే అని రాజుగారు కూడా ఒప్పుకున్నారు. తగాదా తీరిపోయింది. (‘వేటగాడి కొడుకు ఇతర విదేశ కథలు’ సంకలనం నుంచి) చదవండి: బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..! -
కథ: ఫిబ్రవరి 14.. ప్రేమా.. నీ విలువెంత..?
అదే ఘోరమైన తప్పు ఇవాళ మళ్ళీ చేశాను. అదేదో నేను కావాలని చేయలేదు. ఎవరో నా మట్టిరంగు శరీరంలో ఉండి, ఆ క్షణంలో నా సమస్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుని, వాళ్ళే నా రక్షకులైనట్టు, నా జీవితాన్ని చైతన్యవంతం చేసే ఉత్ప్రేరకాలు అయినట్టు, నా ఆత్మను వెలిగించే దైవత్వం ఏదో వాళ్లలో నిండి ఉన్నట్టు ఆ క్షణంలో కళ్ళు మూసుకునిపోయి చేయడం వలన ఇప్పుడు ఒంటరిగా మిగిలాను. ఆ తప్పిదం వలన నా కలలన్నీ నీటి బుడగల్లా పేలిపోయాయి. నేనొంటరిగా అలా పక్కమీద వాలిపోయాను. ఈ బాధను ఎవరితో ఎలా పంచుకోవాలి? ప్రేమలో నా అపజయాలను, నా ఓటమిని, నాతో దీర్ఘకాలం ప్రయాణం చేయలేని నా స్నేహితులను, నేను ఫ్రిజిడిటీతో బాధపడుతున్నాను అని భావించే నేను ఇష్టపడిన మగవాళ్ళను, వాళ్లు నన్ను ఎక్సయిట్ చేయలేక పడిన నిరుత్సాహాన్నీ ఎవరితో ఎలా పంచుకోను? ఈ బాధ.. కాలం గడుస్తున్న కొద్దీ నన్ను అలసటకు గురిచేయసాగింది. నిస్సందేహంగా పరిణతి చెందిన పురుషులు, మనం నివసిస్తున్న సమాజంలో తమదైన ముద్ర వేయగల పురుషులంటే నా కిష్టం అని చెప్పగలను. చాలామంది చెప్తారు.. ప్రేమకు హద్దులు లేవని. నేనూ అలాగే అంటాను. ప్రేమకు హద్దుల్లేవు అని. నన్ను నన్నుగా ప్రేమించే పురుషుడు పెళ్లయిన వాడా? పెళ్లికాని వాడా? ధనికుడా? డబ్బులేని వాడా? సామాజిక స్థాయిలో ఉన్నత, నిమ్న అంశాలు ఇవన్నీ నాకు పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కానేకావు. ఇంతా చెప్పాక నన్ను ప్రేమించే వాడు నాకు ఎంత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తానో మీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను. అతడికి నా ప్రేమను కూడా అంతే ప్రత్యేకంగా మూటకట్టి మరీ ఇస్తాను. మేమిక్కడికి, ఈ ఫిబ్రవరి 14 సాయంత్రం పూట ఈ పండుగ వాతావరణాన్ని సంపూర్తిగా హృదయంలో నింపుకోవడానికి వచ్చాము. ఈ పూట మా ప్రేమ ప్రయాణంలో ఏ అవరోధమూ, ఆటంకమూ లేకుండా సాయంత్రమంతా గడపడానికి ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాము. ఈ మూడు నక్షత్రాల హోటల్ టెర్రస్ మీద కూర్చుని చూస్తుంటే ఈ ప్రపంచం ఎంత బావున్నది? కొన్ని వేల నియాన్ దీపాలు వెదజల్లుతున్న కాంతిలో చీకటి రాత్రి అన్ని వైపుల నుండీ పువ్వులు వెదజల్లుతున్న పరిమళాలతో సౌందర్య భరితంగా కనిపిస్తున్నది. మనోల్లాసకరమైన మంద్ర సంగీతానికి అంతే మంద్రంగా నాట్యం చేస్తున్న యువతీ యువకులు. ప్రతి యువతీ ఒక రాజకుమారిలాగా, ప్రతి యువకుడూ ఒక రాకుమారుడిలాగా కనిపిస్తూ వాతావరణంలో ఒక ప్రేమ రాజసాన్ని నింపుతున్నారు. బయట వాలంటైన్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి కొన్ని సమూహాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వుంది. ప్రేమికులు కనిపిస్తే చాలు బలవంతంగా తీసుకుని వెళ్లి తాళి కట్టించే సమూహాల నుండి దూరంగా, ఏ ఆటంకమూ లేని ఈ ప్రదేశంలో అతడితో నా బంధం మొదలుకావడానికి ఇదొక అద్భుతమైన, అందమైన సమయం. దేశపు తూర్పు ప్రాంతంలో ఇది వసంత సమయం. అవును నా జీవితంలో కూడా ఇది వసంత సమయమే. అతడు చాలా ఫార్మల్ సూట్లో ఎర్ర టై కట్టుకుని, కోట్ ముందు గుండీలు పెట్టుకునే బొత్తాంలో ఎర్రగులాబీ తురుముకుని ఒక అరిస్టోక్రాట్లాగా వచ్చాడు. తన జీవితంలో దుష్ట గ్రహాలు కలుగచేసే దుష్ట ప్రభావాలను తొలగించడానికి మూడువేళ్ళకు మూడు రంగురాళ్ల ఉంగరాలు ధరించి వచ్చాడు. నన్ను చూడగానే అతడి మొహంలో ఒక చిన్న ఆశాభంగం కనిపించింది. బహుశా నేను ప్రత్యేకంగా తన కోసమే తయారై ట్రెండీగా వస్తానని ఊహించి ఉంటాడు. అతడలా ఎందుకు ఊహించాడో నాకు తెలియదు.. కానీ అలంకరణ విషయంలో నేను చాలా పొదుపు. మా అమ్మ లాగా, ఇతర ఆడవాళ్ళలాగా నేను గంటల తరబడి అద్దం ముందు గడపను. ఈ క్షణాన నేను ఎర్రగులాబీ రంగు చీర కట్టుకుని వున్నాను. మేడలో చిన్న లాకెట్. ఎప్పటిలాగే జుట్టు లూజుగా వదిలివేశా. కొంచెంగా నాకు ఇష్టమైన ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ అద్దుకున్నా . చెవులకు చిన్న జూకాలు. ప్రత్యేకమైన సందర్భాల కోసం ప్రత్యేకంగా తయారవడం కన్నా ఇలా సింపుల్‌గా ఉండటమే నా కిష్టం. నా ప్రేమను చాలా డాంబికంగా ప్రదర్శించే శక్తిని ఆ సమయంలో నాలో వున్నదో లేదో నాకు తెలియదు. ‘నువ్వు చాలా అందంగా, ప్రత్యేకంగా, ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత ఆకర్షణీయమైన స్త్రీలా కనిపిస్తున్నావు. కానీ ఎందుకింత సింపుల్‌గా డ్రెస్ చేసుకున్నావు?’ మెరిసే కళ్ళతో అతడు అడిగిన ప్రశ్నకు నేను నవ్వి ఊరుకున్నాను. మా టేబుల్‌కి కాస్త దూరంలో మరొక టేబుల్ దగ్గర ఒక జంట తమ ఇద్దరు పిల్లలతో కూర్చుని వుంది. ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరు.. మరొకరికి ఎనిమిదేళ్ళు వుంటాయేమో! పిల్లలు ఇద్దరూ ఫోర్క్‌లు, కత్తులతో కుస్తీ పడుతున్నారు. అతడు తరచూ ఆ పిల్లల వంక చూస్తూ నా వైపు చూస్తున్నాడు. మిగిలిన జీవితం తన వెనుక మిగల్చబోయే ఒకానొక జ్ఞాపకం గురించి అతడు పరధ్యానంలో పడి పోయాడేమో. అతడి ఆలోచన గురించి ఇప్పుడు నేను చెప్పడం కాస్త అసంబద్ధంగా ఉంటుంది. ఈ క్షణం నాది. ఈ అద్భుతమైన క్షణం నాది. ఈ పారవశ్యం నాది. ఈ క్షణం మోహంతో మొదలై ఆత్మీయతగా పరిణతి చెంది, గౌరవంగా కుదురుకుని, అనుబంధంగా పండి కలకాలం వీడలేని బంధంగా మారిపోయే పరిణామశీలతకు ఇది నాంది. అతడు లేని జీవితం అలసి సొలసి విశ్రమించిన ఎడారి! నేను ఇష్టపడి కొనుక్కున్న హైదరాబాదీ పర్సులో నుండి ఒక డార్క్ చాకోలెట్ తీసి అతడికి ఇచ్చాను. ఆ చాకోలెట్ నేను ఢిల్లీలో కొని ఈ రోజు కోసం ఫ్రిజ్‌లో దాచి వుంచాను. ఆ పింక్ కలర్ ర్యాపర్‌ను నేను తాకనైనా తాకకుండా అతడికోసమే దాచి వుంచాను. ఎవరు చెప్పారో సరిగ్గా గుర్తు లేదు కానీ జపనీస్ తమకు ఇష్టమైన పురుషులకు ఈ ప్రత్యేకమైన వాలంటైన్స్ డే రోజున చాకోలెట్స్ బహుమతిగా ఇస్తారట. సరిగ్గా నెల రోజుల తరువాత మార్చ్ 14 నాడు పురుషులు తమ స్త్రీలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట. అతడు ఆ పింక్ కలర్ ర్యాపర్‌ను జాగ్రత్తగా సున్నితంగా విప్పి ఒక చిన్న బిట్ మునిపంటితో కొరికి ‘రుచికరం’ అన్నాడు. వెంటనే మళ్ళీ ‘ నువ్వు నా కోసం ప్రత్యేకంగా చేదుగా, వగరుగా వుండే ఈ చాకోలెట్ కొన్నావు కదూ! నువ్వు బయటకి చాలా గట్టిగా సాధించలేని శిఖరంలా కనిపిస్తావు కానీ లోపల చాలా సున్నితం’ అన్నాడు. మేము ఒకరి చేతిలో మరొకరం చేతిని బంధించి ఉంచాము. మా చేతి వేళ్ళు ఒకదానితో మరొకటి పెనవేసుకున్నాయి. చుట్టూ జనంతో ఉత్సహంగా , ఉల్లాసంగా , సంతోష సంబరాలతో ఉద్విగ్నంగా వున్న ఆ వాతావరణంలో మాలో ఒకరిపట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి దారిదొరకలేదు మాకు. అతడు మెల్లగా ‘అందుకే మనకు కాస్త ప్రయివసీ కావాలి అన్నాను. కేవలం నువ్వు, నేను మాత్రమే ఉండగలిగే చోటు. నీ సాహచర్యాన్ని నేను మాత్రమే అనుభూతించగలిగే చోటు. ఇక్కడ ఇలా మనలని ఎవరైనా చూస్తే జరిగే పరిణామాలు నేనూహించగలను. నా బాధ నా గురించి కాదు. నీ గురించే! నీ రెప్యుటేషన్ గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు. నన్ను మాత్రం గాలి అలలలో తేలి వస్తున్న బ్రయాన్ ఆడమ్ ‘Everything I do, I do it for you’ పాట పూర్తిగా లీనం చేసుకున్నది. అతడికి అర్థం అయ్యేట్లు నేనెలా చెప్పాలి.. ‘కొండల మీద నుండి దూకే ఒక జలపాతాన్ని నేను’ అని! శతసహస్ర రేకులుగా విచ్చుకున్న ప్రేమ కుసుమం నుండి రెక్కలన్నీ ఒక్కసారిగా రాల్చేస్తే ప్రేమను పొందడమూ, అపురూపంగా జ్ఞాపకాల వెన్నెల భరిణలో దాచుకోవడమూ, అప్పడప్పుడూ ఆ భరిణ తీసి ఆ మధుర, మంజుల ముద్ర శ్వాసను ఆఘ్రాణించడమూ కష్టమని! అతడిది నిర్మల హృదయమే. సమాజంలో వివిధ స్థాయిలలో ఉన్న రకరకాల వ్యక్తులతో ఉండే వైయక్తికమైన స్నేహసౌరభాలను అతడు అనుభూతించగలడు. ఈ ప్రత్యేకమైన సందర్భం సెలబ్రేట్ చేసుకోవడానికి అతడు నా కోసం ఒక చిన్న ఎర్ర గులాబీని కూడా తీసుకుని రాలేదు. ప్రేమికుల రోజున ఎర్ర గులాబీ ఇచ్చుకోవడం సంప్రదాయం. అతడా సంప్రదాయాన్ని పాటించలేదు. ఈ వాతావరణాన్ని మత్తిల్ల చేయడానికి ఒక పెర్ఫ్యూమ్‌నైనా అతడు కానుకగా ఇవ్వలేదు. మా మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ బంధానికి భవిష్యత్తు లేదని అతడికి తెలుసేమో. అయినా మేమిద్దరమూ ప్రేమికులరోజు గురించి చాలా అభిప్రాయాలను, ఉటంకింపులను పంచుకున్నాము. ప్రేమ, విధేయత రెండూ ఒకటేనని.. ప్రేమ ఒక రక్షణ కవచంలా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఇద్దరమూ అంగీకరించాము. చాలా రోజుల తరువాత మా ఇద్దరికీ ఇలా కలిసే అవకాశం దొరికింది. నేను మెల్లగా ఒక సాధారణ స్త్రీగా మారిపోతున్నాను ఈ మత్తిల్లిన వాతావరణంలో. రాత్రి మెల్లగా చిక్కబడుతున్నది. క్యాండిల్ లైట్ డిన్నర్‌కి మూడు నక్షత్రాల హోటల్ సిద్ధం అవుతున్నది. అతడు తన కోటు బటన్ విప్పి లోపల దాచిన ఒక సన్నటి పాకెట్ బయటకు తీశాడు. అది గిఫ్ట్ ర్యాపర్‌తో చుట్టిలేకపోవడంతో నేను చాలా తేలికగా పోల్చుకోగలిగాను. అదొక వేణువు. ఎక్కడో అరణ్యగర్భంలోని వెదురు చెట్టు నుండి లేలేత వెదురుముక్కను కోసీ, నదీ తీరంలోని గులక రాళ్ళతో పదును తేల్చి, నీళ్లలో నానబెట్టి సున్నితంగా చేసి, ఓ అద్భుతమైన కళాకారుడు తన ఆత్మనంతా ఆ వెదురులోకి ఒంపి, నిలువెల్లా గాయాలతో శ్వాస నింపి, ప్రతి అద్భుతమైన భావానికి అపురూపమైన ప్రాణ శబ్దాన్ని ఇవ్వగల వేణువు. ఆకుపచ్చదనం పండితే మధురమై, ఆ తీవ్ర మాధుర్యంలో మనలని మనం కోల్పోతామట. అది సాధ్యమేనా? నా ఎదురుగా ఉన్న అతడు, అత్యంత నాగరీకమైన దుస్తులు ధరించి లోలోపల అంత దైవత్వాన్ని కలిగివున్నాడా? బహుశా ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆ వేణువు మీద అతడు పాడే పాటలో నేను కరిగి, నీరై, నా లోని నిశ్చలత్వం పారిపొయ్యెలా చేసే రసవిద్య అతడిలో ఉన్నదా? ఒకానొక మార్మికమైన గూడు ఏదో నా చుట్టూ అల్లుకుంటున్న భావన. నా కళ్ళు కృతజ్ఞత తో చెమర్చాయి. అతడి వెచ్చనైన గొంతు మెల్లగా వినిపిస్తున్నది.. ‘నీ స్వచ్చమైన, సుందరమైన అభిరుచి నాకు తెలిసీ ఇలాంటి గిఫ్ట్ తీసుకుని వచ్చానని నవ్వుతావేమోనని మొదట నాకు చాలా భయమేసింది. నిన్ను దేనితోనూ కొనలేనని నువ్వన్నమాట నాకు గుర్తున్నది. నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రసవిద్య తెలిసి ఉండాలి. గతనెల నేను ఇన్స్పెక్షన్ పని మీద జార్ఖండ్ వెళ్ళాను. ఆ రాత్రి.. కొద్ది దూరం నుండి వినిపిస్తున్న వేణుగానాన్ని విన్నాను. అలాంటి వేణునాదాన్ని ఇంతకుముందెప్పుడూ నేను విని ఉండలేదు. ఎంత మధురమైన నాదం అంటే బహుశా ఆ కోయిల గానానికి కూడా అంత మాధుర్యం ఉండదేమో! అప్పుడే అనిపించింది .. ఆ అద్భుతమైన వేణువునే ఈ రోజు నేను నీకు ఇవ్వగల అపురూపమైన కానుక అని. ఆ మరునాడే మావాళ్లను పిలిచి ఆ వేణువు ఊదే వ్యక్తిని తీసుకుని రమ్మని చెప్పాను. అతికష్టం మీద వాళ్లు అతడిని పట్టుకున్నారు. అతడొక చిన్నపిల్లాడు. పేదరికం వలన తన వయసుకు రెండింతల పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. అన్నం తిని ఎన్నిరోజులు అయిందో పొట్ట వీపుకు అతుక్కొని ఉంది. ఆ పిల్లాడి తల్లి తండ్రులు చనిపోయారట. ఆ అబ్బాయి ఈ భూమి మీద బతికి ఉండటానికి కావల్సిన ఒక్క కారణం కూడా లేదు. నేను ఆ పిల్లాడికి రెండు వందల రూపాయలు ఇచ్చి ముందు కడుపు నిండా అన్నం తినమన్నాను. మందు తాగితే అస్సలు ఊరుకోను అని చెప్పాను. ఎందుకంటే గిరిజనులు చేతిలో డబ్బు పడగానే మద్యం షాప్‌కే పరుగెడతారు. ఆ పిల్లాడు మద్యం షాప్‌కి వెళ్లకుండా ఒక కన్ను వేసి ఉంచమని మా వాళ్లతో చెప్పాను. అప్పుడు చూశాను ఆ పిల్లాడి నడుముకు వేళ్ళాడుతున్న వేణువును. ‘నాకు ఆ వేణువు అమ్ముతావా?’ అని అడిగాను. వెంటనే ఆ పిల్లాడు వేణువును దాచేసుకున్నాడు. నేనా పిల్లాడితో ‘వేణువు ఇస్తే మరొక రెండువందలు ఇస్తాను’ అన్నాను. వాడు ఒప్పుకోలేదు. చివరకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాను. వాడికి నా ఆఫర్‌ను కాదనే శక్తి లేదు. మార్కెట్లో యాభై రూపాయలు కూడా చేయని వేణువుకు వెయ్యి రూపాయలు. కానీ బహుమతిగా ఇచ్చే వేణుగానం విలువ వాడికి ఎలా తెలుస్తుంది? ఆ వేణువులాంటి దానివే నువ్వు కూడా. నువ్వూ అమూల్యం. ఒక అమూల్యమైన నీకు, నీలాంటి అమూల్యమైన వేణువును మించిన బహుమతి కచ్చితంగా సరిపోతుంది’ అతడి మాటలు నేను ఎంతోసేపు వినలేక పోయాను. అకస్మాత్తుగా నా ప్రపంచం అంతా ఒక విషాదంతో నిండిపోయింది. ఆ వేణువు నా హృదయంలో ఒక దుఃఖ గీతం పాడసాగింది. ఎప్పటిలాగే నా లోలోపలి ఆత్మ మేలుకున్నది. ప్రేమ గురించిన నా భౌతికమైన వాంఛలన్నీ ఒక్కసారిగా కొట్టుకునిపోయాయి. ఆ వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? నేను ప్రేమించిన ఈ మనిషికి ప్రేమ విలువ తెలుసా? ప్రేమ విలువ తెలియడానికి, ప్రేమ విలువ తెలియకపోవడానికి ఒక మనిషికి కావలసినది ఏమిటి? డబ్బేనా? ఇతడికి డబ్బు వుంది కనుక ప్రేమ విలువ తెలుస్తుందా? డబ్బు లేదు కనుక వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? అంటే డబ్బు వున్నది కనుక అతడు ఏదైనా కొనగలడా? నేను ఒక ఎనిగ్మాటిక్ పరిమళంలోకి ప్రయాణిస్తున్నాను. మామిడిపళ్ళ మాధుర్యంలోకి, కొండలమీద నుండి దూకే చిన్న జలపాతంలోకి ప్రయాణిస్తున్నాను. నా స్పృహ, అస్తిత్వం ఒక గొప్ప వరదలో కొట్టుకుని పోతున్నదా? నా శరీరం మొత్తం నిరసనతో వణికిపోతున్నది. నేను మరొక్క మాట కూడా మాట్లాడలేక పోయాను. త్వరగా డిన్నర్ ముగించి త్వరగా వెళ్ళిపోదామని చెప్పాను. ఎక్కడో ఏదో జరగకూడనిది జరిగింది అన్న విషయాన్ని అతడు పసిగట్టినట్టున్నాడు. నేను మూర్ఖురాలినా? భౌతికమైన ఆనందాలు, సంతోషాలు పొందే క్రమంలో అవన్నీ చాలా అల్పమైన విషయాలని తెలియచెప్పే ఒక హింసాత్మక డెమి ఉమన్ నేనా? నేనెవరిని? అతడు ఎంచుకున్న మనిషినా? అతడి మనిషినా? బంధాల భవిష్యత్తును ముందుగానే గుర్తించగలిగితే మనమెవరమూ బహుశా బంధాలలోకి ఎప్పటికీ స్వయంగా వెళ్ళమేమో! ఒరియా మూలం : మోనాలిసా జెనా తెలుగు సేత : వంశీకృష్ణ -
ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే..
ఐదునదుల పంజాబ్‌లో ఆ ఒక్కరోజు ఆరోనది కనిపించింది. అది నెత్తుటినది. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతంతో ఆనాడు అమృత్సర్ రక్తపుటేరునే చూసింది. సంవత్సరాది (వైశాఖి) పండగ జరుపుకోవడానికి వచ్చి, ఆ మైదానంలో కూర్చున్న దాదాపు ఇరవైవేల మంది నిరాయుధుల మీద 1650 తూటాలు పేలాయి. స్వాతంత్య్రోద్యమం మలుపు తిరిగింది. ఆ దురంతంలో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కంటే పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓడ్వయ్యర్(1912–19) పెద్ద దోషి అని ప్రముఖ చరిత్రకారుడు కేకే ఖుల్లర్ అంటారు. అదో విడి ఘటన కాదు. ముందూ వెనుకా కుట్రలు ఉన్న గొలుసుకట్టు ఘటనలకు పరాకాష్ట. జనరల్ డయ్యర్ ఎక్కుపెట్టించిన ఆ 90 తుపాకులకు అందిన ఆదేశం వెనుక ఓడ్వయ్యర్ జాత్యహంకారం ఉంది. లాలా లాజ్పతిరాయ్ 1920 ఫిబ్రవరిలో అమెరికా నుంచి వచ్చి వాస్తవాలు సేకరించారు. 12 అంశాలతో ఆరోపణల పత్రం తయారు చేశారు. ఓడ్వయ్యర్ ఆత్మకథ ‘ఇండియా యాజ్ ఐ న్యూ ఇట్’ కూడా ఆ క్రమాన్ని వర్ణించింది. నిజానికి పంజాబీలకు ‘గుణపాఠం’ చెప్పాలన్న అతడి ఆలోచన మూడేళ్ల నాటిది. మొదటి ప్రపంచ యుద్ధం కోసం పంజాబ్ నుంచి ఎక్కువమంది యువకులను ఓడ్వయ్యర్ సైన్యంలో చేర్పించాడు. 1914 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో 27,522 మంది సైన్యంలో చేరితే అందులో 13,400 మంది పంజాబీలు. గ్రేట్‌వార్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కాలమే ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టడానికి అనువైనదని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న గదర్ పార్టీ భావించింది. ఆ పార్టీలో ఎక్కువ మంది పంజాబీలే. అప్పుడే ఇండోజర్మన్ ప్రణాళిక బయటపడింది. అంటే ఇంగ్లండ్‌ను భారత్ నుంచి తరిమి వేయడానికి ప్రయత్నిస్తున్న భారతీయ తీవ్ర జాతీయవాదులకు జర్మన్ అండగా ఉండాలన్న యోజన. గదర్ వీరులకు ఐరిష్ ఉగ్రవాదులు అండగా ఉన్నారన్న వార్తలూ వచ్చాయి. అందుకే తీవ్ర జాతీయవాదాన్నీ, స్వాతంత్యోద్య్రమాలనూ ఎంత క్రూరంగా అణచివేసినది దాదాపు 485 పేజీల ఆత్మకథలో ఓడ్వయ్యర్ చాలా రాశాడు. సిక్కులు–గదర్ పార్టీ మధ్య బంధాన్ని చెప్పడానికి అధ్యాయమే (17) కేటాయించాడు (ఈ పుస్తకంలో మనకి ఆసక్తి కలిగించేది 8వ అధ్యాయం ‘హైదరాబాద్ డెక్కన్ 1907 – 09’. ఆ కాలంలో ఓడ్వయ్యర్ నిజాం సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్). హోంరూల్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో 1916 ఏప్రిల్‌లో పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఓడ్వయ్యర్, ‘అనీబిసెంట్, తిలక్, బిపిన్‌చంద్ర పాల్ పంజాబ్‌లో ప్రవేశిస్తే చల్లారిపోతున్న తీవ్ర జాతీయవాదోద్యమ జ్వాల మళ్లీ ఎగసిపడుతుంద’ని హెచ్చరించాడు. వారు పంజాబ్‌లోకి రాకుండా బహిష్కరించాడు. పంజాబ్‌లోనే కాదు, భారత్ అంతటా ఉద్రిక్త వాతావరణమే. దీనికి భయపడిన ఫలితమే రౌలట్ బిల్లు. భాతీయుల నిరసనల మధ్య 1919 మార్చి 18న చట్టమైంది. మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ పతనంతో ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారనీ, ‘హిందూ తీవ్రవాదులు’ ఈజిప్ట్, సిరియా, ఇరాక్ బాటలో ‘స్వయం నిర్ణయాధికారం’ కోరుతున్నారనీ ఓడ్వయ్యర్ అంటాడు. ఈ రెండు కారణాలు ఆ రెండు మతాలవాళ్లని ఇంగ్లిష్ పాలనకి వ్యతిరేకంగా ఐక్యం చేశాయనీ తేల్చాడు. ఈ ‘అపవిత్ర’ బంధం అమృత్‌సర్‌లో బాగా కనిపించిందని కూడా విశ్లేషించాడు. ఇందుకు ప్రతినిధులుగా జర్మనీలో చదువుకుని వచ్చిన ‘కశ్మీరీ ముస్లిం’ న్యాయవాది సైఫుద్దీన్ కిచ్లూ, ‘హిందూ సర్జన్’ డాక్టర్ సత్యపాల్లను చూపాడు. వీళ్లిద్దరూ హింసామార్గంలో ఆందోళన ఆరంభించారని అరోపించాడు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మార్చి 30న హర్తాల్ పాటించవలసిందిగా గాంధీజీ పిలుపునిచ్చారు. ఉత్తర భారతం, పంజాబ్ ప్రాంతంలో లాహోర్, గుజ్రన్‌వాలా, షేక్‌పురా, ముల్తాన్, జలంధర్, కాసూర్, అమృత్సర్లు భగ్గుమన్నాయి. ఉత్తర భారతంలో కొన్ని రైల్వే స్టేషన్లు దగ్ధమైనాయి. ఇంగ్లిష్ వాళ్ల మీద దాడులు జరిగాయి. ఉత్తర భారత తీవ్ర జాతీయవాదులంతా పంజాబ్ మీద దృష్టి సారించారంటాడు ఓడ్వయ్యర్. ‘ఏప్రిల్ 6న లాహోర్‌లో పెద్ద విప్లవం (గదర్) వస్తుంది. అదే మా జాతీయ దినోత్సవం. ఇంగ్లిష్ వాళ్ల అధికారం పతనమయ్యే రోజు అదే’ అంటూ పత్రికలలో రాశారని కూడా అంటాడు. మళ్లీ ఏప్రిల్ 6న మరొక హర్తాల్‌కు గాంధీజీ పిలుపునిచ్చారు. ఇదే జలియన్‌వాలా బాగ్ దురంతానికి నాంది. ఏప్రిల్ 6,7 తేదీలలో గాంధీజీ ఢిల్లీ నుంచి పంజాబ్ వస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఓడ్వయ్యర్ నిషేధాజ్ఞలు విధించాడు. భారత ప్రభుత్వం కూడా గాంధీజీ కదలికల మీద ఆంక్షలు పెట్టింది. 9వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులలో పల్వాల్ దగ్గర అరెస్టు చేసి, నిషేధాజ్ఞల ఆదేశాలు అందించారు. గాంధీజీ అక్కడ నుంచే బొంబాయి వెళ్లిపోవడానికి అంగీకరించారు. బర్మా పంపేయాలని సూచించాడు ఓడ్వయ్యర్. ఏప్రిల్ 9న శ్రీరామనవమి. పైకి ప్రశాంతంగా ఉన్నా, కిచ్లూ, సత్యపాల్లను వెంటనే అరెస్టు చేయమని ఆరోజే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ మైల్స్ ఇర్వింగ్‌ను ఓడ్వయ్యర్ ఆదేశించాడు. 10వ తేదీన ఆ ఇద్దరినీ ఇంటికి పిలిచి అరెస్టు చేసి, ధర్మశాల అనే చోటకు చేర్చాడతడు (ఈ సంగతిని హంటర్ కమిషన్ ఎదుట చెప్పాడు). వీరిని విడుదల చేయాలని డిప్యూటీ కమిషనర్ ఇంటి ముందు జనం ఆందోళనకు దిగారు. కాల్పులు జరిగాయి. కొంతమంది చనిపోయారు. ఆవేశంతో జనం రాళ్లు విసిరారు. రోడ్డు మీద ఏ యూరోపియన్ కనిపించినా చావగొట్టారు. ఆ మరునాడే మార్సెల్లా షేర్వుడ్ అనే ఆంగ్ల మహిళ మీద దాడి జరిగింది (19న ఆమెను కలుసుకున్న తరువాత ఆ దాడి జరిగిన వీధి కూచా కురిచాహన్ గుండా వెళ్లే ప్రతి భారతీయుడిని నేలమీద పాములా పాకించారు సైనికులు. ఒక పెళ్లి బృందం, ఒక అంధుడు, గర్భవతి కూడా ఆ ‘శిక్ష’ అనుభవించారు. డయ్యర్ పంజాబ్ రక్షకుడని షేర్వుడ్ కీర్తించారు). ఒక బ్యాంక్ మీద ఆందోళనకారులు దాడి చేసి ఐదుగురు యూరోపియన్లను చంపారు. 9వ తేదీన అమృత్సర్ రైల్వేస్టేషన్ రక్షణ కోసం జలంధర్ నుంచి బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ తన దళాలతో వచ్చాడు. ఇతడికి అన్ని బాధ్యతలు అప్పగించి ఓడ్వయ్యర్ లాహోర్ వెళ్లిపోయాడు. 13వ తేదీ సూర్యాస్తమయం నాటి ఆ దుర్ఘటనలో 379 మంది మరణించారనీ, 1,137 మంది గాయపడ్డారనీ ప్రభుత్వం ప్రకటించింది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యుడు విఎన్ తైవ్రాజ్ ఆ సంఖ్యను 530 అని చెప్పాడు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ విషయం లేవనెత్తిన మాలవీయ మృతులు 1000 మంది అని చెప్పాడు. ఆర్య సమాజ్ ప్రముఖుడు స్వామి శ్రద్ధానంద 1500 మంది అని చెప్పాడు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. అందుకే చాలామంది వైద్యం అందక చనిపోయారు. ఆ మరునాడు కూడా గుజ్రన్‌వాలా, ఇంకొన్ని పట్టణాల మీద ఏరోప్లేన్‌ల ద్వారా బాంబులు కురిపించాడు ఓడ్వయ్యర్. 14వ తేదీ తెల్లవారుజామున కాల్పుల వార్త ఓడ్వయ్యర్‌కు లాహోర్‌లోనే అందింది. దేశ ప్రజలకు నెలా పదిహేను రోజుల తరువాత తెలిసింది. ఆంధ్రపత్రిక జూలై 12 డేట్‌లైన్‌తో ప్రచురించింది. అట్లాంటి ఓడ్వయ్యర్ మీద కాల్పులు జరపడానికి 21 ఏళ్లు ఎదురుచూశాడు ఒక యువకుడు. పేరు ఉద్దమ్‌సింగ్. - డా. గోపరాజు నారాయణరావు -
పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ వివాహ బంధం.. అలా.. ముగిసింది!
ఒకరి కోసం ఒకరు పుట్టరు.. ఒకరి కోసం ఒకరు అని జతకడతారు! హిందీ హీరోయిన్ రీనా రాయ్.. పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ కూడా అలాగే ప్రేమించుకొని నిఖాతో జతకట్టారు! పెళ్లిళ్లు నిజంగానే స్వర్గంలో నిర్ణయం అయితే విడాకుల ప్రస్తావన ఉండేది కాదేమో! ఆకర్షణలు, అభిప్రాయాలు, జీవన శైలులు, సంస్కృతి, సంప్రదాయాలు, కులం, మతం వేదికగా జరుగుతాయి కాబట్టే వీటిల్లో ఏ ఒక్కటి సర్దుబాటు కాకపోయినా విడాకుల ప్రస్తావన.. పరిష్కారంగా ఉంటుంది. రీనా, మొహిసిన్ల ప్రేమ.. పెళ్లి కూడా అలాగే ముగిసిపోయింది. ఆ కథే ఈ వారం.. శత్రుఘ్న సిన్హాతో ప్రేమ వైఫల్యం రీనా రాయ్‌ను చాలా కలచివేసింది. సరిగ్గా ఆ సమయంలోనే పరిచయం అయ్యాడు.. మొహిసిన్ ఖాన్. అతని చెలిమి ఆమెకు గొప్ప ఊరటైంది. ఆ ఆదరణ ఆమె మనసుకు అయిన గాయాన్ని మాన్చేసింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా మారింది. ఈ జంట తరచూ కలసుకోవడం.. కలసి బయటకు వెళ్లడం.. సహజంగానే సినిమా పత్రికలకు ఆసక్తిరేపాయి. రీనా, మొహిసిన్ డేటింగ్ అంటూ కథనాలనూ ప్రచురించాయి. అవి అటు క్రికెట్‌ను.. ఇటు బాలీవుడ్‌నూ ఆకర్షించాయి. కరాచీలో.. ఇరు రంగాల్లోని ఈ ఇరువురి అభిమానులు వీళ్ల ప్రేమకథనాలను ఆస్వాదిస్తూండగా.. ఆ జంట పెళ్లి వార్త బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ ఇద్దరూ కరాచీలో రహస్యంగా నిఖా చేసుకుని ముంబై వచ్చారు. ఆ టైమ్‌లో రీనా, మొహిసిన్ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థాయిలో ఉన్నారు. ‘మొహిసిన్ సంగతేమో కానీ ఈ పెళ్లితో రీనా తన కెరీర్‌కు తానే ఎండ్ కార్డ్ వేసుకుంది’ అని అభిప్రాయపడ్డారు ఆమె శ్రేయోభిలాషులంతా! వాళ్ల అంచనాలకు విరుద్ధంగా పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది రీనా. సర్దుకుపోవాల్సిందే.. బ్రిటిష్ పౌరసత్వంతో లండన్‌లో స్థిరపడాలనేది మొహిసిన్ ఖాన్ నిర్ణయం. అది రీనాకు నచ్చకపోయినా భర్త కోసం సరేననుకుంది. షూటింగ్స్ ఉన్నప్పుడు ముంబై రావడం.. అయిపోగానే లండన్ వెళ్లిపోవడం ఆమె షెడ్యూల్లో భాగమయ్యాయి. ఈలోపు ఆ జంటకు బిడ్డ పుట్టింది. పాపను పెంచడం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది రీనా. మొహిసిన్ నటించాలనుకున్నాడు. అతని ఉత్సాహానికి అడ్డు చెప్పలేదు రీనా. క్రికెటర్ మొహిసిన్ ఖాన్ బాలీవుడ్ స్క్రీన్ మీద హీరోగా లాంచ్ అయ్యాడు. కానీ సినీ ప్రేక్షకులు అతణ్ణి పెద్దగా ఆదరించలేదు. దాంతో ఆ కుటుంబం లండన్, ముంబైల రాకపోకలు ఆగిపోయి లండన్‌లోనే ఉండడం మొదలైంది. అది రీనాకు చాలా కష్టమైపోయింది. అంతేకాదు మొహిసిన్ ఖాన్ విలాసవంతమైన జీవన శైలికీ ఆమె ఇబ్బంది పడింది. అప్పుడు తన తల్లికి ఫోన్ చేసింది ‘పెళ్లంటే ఏంటీ.. ఇలాగే ఉంటుందా?’ అని. ‘తప్పదు. సర్దుకుపోవాల్సిందే. అసలు పెళ్లంటేనే సర్దుబాటు’ అంటూ నచ్చచెప్పింది రీనా వాళ్లమ్మ. ప్రయత్నించింది రీనా. కానీ సఖ్యత కుదరలేదు. ఆ బంధం నిలవలేదు. కూతురి కస్టడీ మొహిసిన్ ఖాన్‌కే దక్కింది. రీనా తర్వాత మొహిసిన్ ఖాన్ మళ్లీ రెండుసార్లు వివాహబంధంలో ఇమిడే ప్రయత్నం చేశాడు. అప్పుడుగానీ బిడ్డ కస్టడీని రీనాకు అప్పగించలేదు కోర్టు. ఇప్పుడు ఆ కూతురు(సనమ్)తోనే కలసి ముంబైలో ఓ యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తోంది రీనా. జీవితం పట్ల రిగ్రెట్స్గానీ లేవు, శత్రుఘ్న సిన్హా, మొహిసిన్ మీద కంప్లయింట్స్గానీ ఏమాత్రం లేవని చెప్తుంది రీనా రాయ్. - ఎస్సార్ -
మరోకథ: నరావతారం
అప్పటివరకూ కళ్ళు కూడా మాటలాడతాయని నాకు తెలీదు. అందరి ముఖాలు మాస్కులతో కప్పేస్తే.. కేవలం కళ్ళ ద్వారా మాటలు, కళ్ళతోనే పరిచయాలు, కళ్ళతోనే పలకరింపులు, కళ్ళతోనే ప్రశ్నలు, జవాబులు. కానీ మా పూర్ణమ్మ మాత్రం తన చీర కొంగునే మూతికి చుట్టుకొని రోజూ కూరగాయలు అమ్మేస్తుంది. అన్ని పది, ఇరవయ్ బేరాలే కాబట్టి ఒకవేలు చూపిస్తే 10, రెండు వేళ్లు చూపితే 20.. నాకు మాత్రం స్పెషల్ 10 రూపాయలకు 6 తోటకూర కట్టలు ..5 కట్టలు వ్యాపారం కోసం ఒక కట్ట మాత్రం సహకారం. ఈ సహకారం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఒక రెండు నెలలు ముందుకు వెళ్ళాలి. అప్పుడే లాక్డౌన్ పెట్టిన రెండవ వారం అనుకుంటా.. ఎప్పటిలాగే మా ఆఫీస్ ఎదురుగా ఉన్న మా రాముడు గుడికి వెళ్ళాను. ‘అదేంటి గుడి కుడా లాక్డౌన్ కదా’ అని మీ డౌట్. చెప్పాగా ఆ గుడి ఎదురుగానే మా బ్యాంకు .. ఆ గుడిలో పని చేసే స్టాఫ్ అంతా ఆ దేవుడికి సేవ చేసి జీతం మాత్రం మా బ్యాంకులో తీసుకుంటారు. కాబట్టి అది మా కోవెలే. ‘మేనేజర్ గారు, మాస్క్ వేసుకొని ఈ పక్కనుంచి రండి .. అటు సీసీ కేమరా ఉంది. బయటి వారిని రానీయకూడదు’ అంటూ గౌరవంతో కూడిన ఒక చిట్కా చెప్పాడు గురవయ్య. గుడిలో అతను సన్నాయి మేళం ఉద్యోగి. ∙∙ నెమ్మదిగా కెమెరా కళ్ళకు దొరకకుండా రామచంద్రుని దర్శించుకున్నాను. ఆ రోజు అంతటికి నేనే భక్తుణ్ణి కదా ఆ దేవదేవుని కళ్ళు కూడా చాల ఆశ్చర్యంగా, ఆర్తితో చూసినట్లు అనిపించింది. గర్భగుడి నుంచి ఒక పక్కగా తిరిగి కెమెరా కన్నుగప్పి రావడం దాదాపు అసాధ్యం. కాబట్టి గుడి వెనుక భాగం నుంచి వద్దామని అటుగా వెళ్ళాను. గుడి చాలా ప్రశాంతంగా వుంది.. నేను, దేముడు అంతే! ఇంతలో టక్.. టక్ అనే శబ్దం.. ఏమిటో అని చూశాను. అక్కడ ఏమి కనిపించ లేదు. మళ్లీ టక్.. టక్ అనే శబ్దం. అటుగా వెళ్ళాను. గర్భాలయానికి వెనుకగా ఒక చిన్న తోట. అందులో 10 తాబేళ్లు.. నీరసంగా నడవడానికి శక్తి లేక ఎదురు చూస్తున్నాయి. అయ్యో అదేమిటి అని దగ్గరగా నడిచాను. ఒక కాకి అరుస్తోంది.. మరొక కాకి ఒక చని పోయిన తాబేలు పైన కూర్చొని దాన్ని ఎలా తినాలో తెలియక దాని డిప్పను కొడుతోంది. అదే ఆ శబ్దం. నాకు చాల బాధ వేసింది. ఆ తాబేళ్లు రోజూ వచ్చే భక్తులు వేసే ప్రసాదాలు, ఆ గుడిలో అర్చకులు వేసే ఆకు కూరలతో బతికేవి. ఇప్పుడు కనీసం ఒక భక్తుడు కూడా లేడు.. ప్రసాదం లేదు.. ఆ కాకిని తోలి, గురవయ్యకు ఆ చనిపోయిన తాబేళ్లును తీసి శుభ్రం చేయమని చెప్పాను. నేను తిరిగి ఆఫీసుకు వచ్చాను కానీ నా మనసంతా ఆ తాబేళ్లు మీదే వుంది. పాపం.. ఆ దేవుని గుడిలో కాదు.. కాదు.. దేవుని ఒడిలో ఆకలికి చనిపోయిన తాబేలుని తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ∙∙ మా అటెండరు ఆదిబాబుని పంపి ఊరిలో ఏమైనా తాబేళ్లు తినడానికి దొరుకుతాయేమో అని చూశాను. ‘కనీసం టీ దుకాణం కూడా లేదు సర్’ అంటూ తిరిగి వచ్చాడు. ‘సరే.. నా క్యారేజి అంతా ఒక పేపర్లో వేసి వాటికి పెట్టు’ అన్నాను. వాటితో పాటుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టి మరీ వచ్చాడు మా ఆదిబాబు. ఎదో నా మనశ్శాంతికి గానీ అవి అన్నం, కూర, పెరుగు తింటాయో లేదో నాకు తెలీదు. నేను తినకుండా వాటికి పెట్టాను. అంతే అప్పటికి నా మనసు శాంతించింది. ఇంటికెళ్ళానే గానీ ఒకటే ప్రశ్న.. గుడిలో రామావతారం.. గుడి వెనుక కూర్మావతారం.. రామావతారం ఒక జీవన విధానం.. అట్లాంటి రాముని పూజించే నేను నరావతారం.. కాబట్టి ఆ కూర్మావతారాలను కాపాడాలి. బతుకు.. బతికించు.. అని చిన్నప్పుడు చదివిన ఒక ఇంగ్లిష్ కొటేషన్ గుర్తుకు తెచ్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో ఒక పెద్ద తాబేలు ఈ భూమిని మోస్తున్నట్లు నేను దానికి ఎదురుగా కూర్చొని దాని బరువుకు సరిపడా తోటకూర నా బ్యాంకు లాకర్లో నుంచి తీసి ఇచ్చినట్లు.. ఆ తాబేలు చాలా ఆనందంగా సంతకం పెట్టి బయటకు వచ్చినట్లు కల... ∙∙ అప్పటికే భళ్ళున తెల్లారింది. లేస్తూనే దేవుని మొహం చూసే అలవాటు ప్రకారం సెల్ ఆన్ చేశాను. సెల్లో శ్రీ రామచంద్రుని ఫోటో, రాముని పాదం దగ్గర తాబేలు కన్పించాయి. దెబ్బతో నిద్ర మత్తు వదలి ఆఫీస్‌కు రెడీ అయి బయలుదేరాను. దారిలో ఉదయం 6 నుంచి 9 వరకూ కూరగాయలకు, పాలకు, నిత్యావసర వస్తువుల కోసం లాక్ డౌన్లో రిలీఫ్ అంట. జనాలు భయంతో, భక్తితో, ప్రాణాల మీద ఆశతో పద్ధతిగా ఒక లైన్లో నిలబడి, బేరాలు ఏమీ ఆడకుండా, మొహం నిండా మాస్క్ కప్పుకొని మరీ కూరగాయలు కొంటున్నారు. నేను ఆదిబాబు ఒక సంచి నిండా ఆకుకూరలు అదే రాత్రి కలలో చెప్పిన సందేశం ప్రకారం తోటకూర కొన్నాము. వేగంగా ఆఫీస్‌కు వెళ్లి ఆదిబాబుకు తాళాలు ఇచ్చి నేను కోవెల వెనుక భాగానికి వెళ్ళాను. మళ్లీ గురవయ్య కనిపించి ‘సర్ కరెంటు లేదు. ముందు వైపు నుంచి రండి. కెమెరా ఇప్పుడు పని చేయదుగా’ అన్నాడు నేను రాముని దర్శనానికి వస్తున్నా అనుకొని. ‘లేదు గురవయ్యా..’ అంటూ నేను వచ్చిన పని చెప్పాను. తను వెంటనే నా చేతిలో సంచి అందుకొని తోటకూర అంతా ప్రతి తాబేలుకు అందే విధంగా సర్దాడు. నిన్న నా క్యారేజ్ భోజనం తిన్నాయేమో కొద్దిగా నడుస్తున్నాయి. ఆకు పచ్చని ఆకులు చూడగానే వాటికీ ప్రాణం లేచి వచ్చినట్లుంది. నెమ్మది.. నెమ్మదిగా.. అవి తాబేళ్లు కదా గబగబా నడవవుగా! ఈ పరిస్థితిలో అసలు నడవలేవు. వచ్చి తోటకూర తినడం ప్రారంభించాయి. నాకు నిజంగా మనసుకు శాంతిగా ఉంది. ఈ హడావుడిలో ఉదయం నేను టిఫిన్ చేయక పోయినా నా కడుపు నిండి పోయింది. ∙∙ మరి దేవుణ్ణి దర్శించకుండా నేరుగా ఆఫీస్‌కు వచ్చేశా. ఇక నుంచి ప్రతి రోజూ 10 రూపాయల తోటకూర 10 తాబేళ్ల పలకరింపు నా దినచర్యగా మారిపోయింది. నేను సెలవు పెట్టిన రోజు ఈ పని ఆదిబాబు, ఆదిబాబు సెలవు పెడితే నేను.. ఒక్క వారం గడిచింది. అవి మామూలుగా అంటే నెమ్మది నెమ్మదిగానే కానీ ఆరోగ్యంగా నడవడం చూసి నాకు మరిన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. రోజూ తోటకూర అంటే వాటికీ బోర్ కదా అని వెరైటీగా ఒకరోజు గోంగూర, మరొకరోజు బచ్చలికూర, చుక్కకూర ఇలా పెట్టటం మొదలు పెట్టా. అంతే అవి ఇంకా ఉత్సాహంగా నన్ను మా ఆది బాబుని చూసి గుర్తు పట్టి ముందుకు రావడం, వాటికీ ఆకులు వేసి నీరు పెట్టగానే అవి మా వైపు చూసే ఒక లాంటి ఆత్మీయమైన చూపు ఇప్పటి వరకు ఏ సినిమా డైరెక్టర్ చూపించని ఫ్రేమ్. అదుగో అలా మేము రోజూ కొనే ఆకుకూరల కొట్టు ఓనరే పూర్ణమ్మ. మొదట్లో ‘బాబూ.. రోజూ ఆకు కూరలేనా.. ఈ బెండకాయ, ఆనపకాయ కుడా కొనండి బాబూ’ అనేది. మేము నవ్వే వాళ్ళం. ఒకరోజు ఆవిడ ఆకు కూరలుపెట్టలేదు. అయ్యో అనుకొని మేము మరొక దగ్గరికి పోతుంటే పూర్ణమ్మ ఆపి..‘బాబూ మీరు రోజూ కొంటారు. ఈ రోజు అక్కడికి పోతే రేపు నా కాడికి రారు. ఆగండి నేనే తెస్తాను’ అంటూ మళ్ళి తన దగ్గరున్న మిగిలిన కూరగాయలు కొనమంది. మా ఆదిబాబు ఇక ఆగలేక మొత్తం కథ చెప్పాడు. అంతే ఆవిడ చాల నొచ్చుకొని ‘ఎంత మాట బాబూ.. ఆగండి నేనే తెస్తాను’ అని 10 రూపాయలు తీసుకొని 6 కట్టలు తెచ్చిచ్చింది. ‘అదేంటి 5 కట్టలే కదా?’ అని అడిగితే ‘అది నా వాటా బాబూ’ అంది. సాయానికి ఎవరైతే ఏమిటి.. రాముడికి ఉడత చేయలేదా..! ∙∙ అంతే.. ఇక ప్రతిరోజూ నేను, మా ఆది బాబు.. పూర్ణమ్మ కొట్టు దగ్గర ఆగడం.. ఆవిడ ఒక సంచి నిండా ఆకు కూరలు నింపడం .. కానీ 10 రూపాయలు మాత్రమే తీసుకోవడం నాకు భలే అనిపించింది. మా అపార్ట్మెంట్లో ‘పాపం రోడ్డున వస్తున్న వలస కూలీలకు ఒక రోజు భోజనం చేసి పెడదాం’ అని చెబితే సగం మంది డబ్బులు ఇవ్వలేదు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. వారివి త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు. కానీ మనసులు మాత్రం ఇరుకు. ‘ఇంకెన్నాళ్లో ఈ లాక్డౌన్..’ అని అందరూ అనుకుంటున్నారు. అందరికి ఇళ్ళల్లో కూర్చొని తినడానికి బోర్ కొట్టింది. కానీ నాకు మాత్రం ఎన్ని రోజులైనా పర్లేదు.. మా కూర్మావతారాలకు నేను ఉన్నాను, నాకు హనుమంతుడిలా మా ఆదిబాబు, ఉడతలా పూర్ణమ్మ ఉన్నారు. ఇంతలో ఒకరోజు రాత్రి ఫోన్.. మా అత్తా, మామలకు ఒంట్లో బాగోలేదు అర్జెంట్‌గా రమ్మనమని. ఆఫీస్‌కు లీవ్‌లెటర్ రాసి పెట్టి, తాళాలు ఇస్తూ ఆదిబాబుకు అంతా చెప్పాను. మా కూర్మావతారాల గురించి కూడా. ఆ రాత్రే ఏలూరు బయలుదేరాం. బస్సులు, రైళ్ళు లేవుగా! నా కారు మీదే. తీరా వెళ్ళాక తెలిసింది అక్కడ అందరూ ఏదో అంతుపట్టని ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారని. హాస్పిటల్ అంతా ఒక తెలియని వింత వాతావరణం. ఎప్పుడు ఎవరికి ఏమి అవుతుందో తెలియదు.. వ్యాధి పేరు తెలిస్తే ప్రపంచంలో ఎక్కడ మందు ఉన్నా తెప్పిద్దాం అనే ఆలోచనలో వుంది ప్రభుత్వం. నాకు మా ఆవిడను చూస్తే చాలా భయం వేసింది. అప్పటికే ఆవిడ ఇంకా షాక్‌లోనే వుంది. చివరకు మా అత్తమామలు ఉన్న వార్డుకు చేరుకున్నాం. అక్కడ బెడ్స్ పైన రోగులు ఉండుండీ పడిపోయి కొట్టుకుంటున్నారు. అలాగని ఫిట్స్ కాదు! ∙∙ ప్రభుత్వ అధికారులు అన్ని విధాలా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పేషెంట్స్ నుంచి అన్ని వివరాలూ సేకరిస్తున్నారు. పరీక్షలకు పంపుతున్నారు. కానీ ఫలితం శూన్యం. మరో కొత్త వైరసేమో అని ఇంకా భయంగా ఉంది. ఈలోపు పుణె నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అది వైరస్ కాదు అని తెలిసింది. మరి ఏమిటి అని మరింతగా పరిశీలన చేస్తున్నారు. రోగుల ఇళ్లు, పరిసరాలు, వారు వాడే నీరు, పిల్చే గాలి, తినే ఆహారం.. ఇలా అన్నీ.. అన్నీ పరీక్షిస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియా రోజుకో కథనం ప్రసారం చేస్తున్నాయి. నాకు అక్కడ ఉండాలంటేనే భయం వేసింది. నీళ్ళు తాగాలన్నా భయమే.. బయటి హోటల్లో తినాలన్నా భయమే.. ఆరోగ్యశాఖ మంత్రి ప్రభుత్వపరంగా మరో రెండు రోజుల్లో ఈ వింత వ్యాధికి కారణం చెబుతాం అని ఇప్పుడే టీవీలో చెబుతున్నారు. మా మామగారి పరిస్థితి విషమించింది. కారణం తెలీదు. మా మామగారిని మరింత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్‌కి మార్చారు. ఒక రోజు గడిచింది. ఒక భయంకరమైన వార్త నా చెవిన పడింది. ఆ ఊరి వాళ్ళు వాడే కూరగాయలు, ఆకుకూరల మీద వాడే పురుగు మందుల వలన ఈ వింత వ్యాధి వచ్చిందని కలెక్టర్‌గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెబుతున్నారు. ఎదురుగా 96 ఏళ్ల మా మామగారు మృత్యువుతో పోట్లాడుతున్నారు. అంతే చప్పున నాకు మా కూర్మావతారాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఫోన్ అందుకొని మా ఆదిబాబుకి ఫోన్ చేశా. ‘సర్.. ఇప్పుడే కొత్తిమీర కొని వేసి వస్తున్నాను. అవి బాగానే వున్నాయి’ అని అతను చెప్పేలోపే ‘వద్దు .. వద్దు తీసేయ్.. తీసేయ్’ అంటూ గట్టిగా చెప్పాను లేదు అరిచాను. ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం సహజంగా బతకగలిగే జీవిని చంపడం నాకు ఇష్టం లేదు. నాకు అర్థం కాలేదు.. నేను నిజంగా నరావతారమా? లేక రాక్షస అవతారమా? ఛా.. అసలు ఎం జరుగుతోంది? అని ఆలోచించేలోపు ఆఫీస్ నుంచి ఫోన్ .. ‘ఆడిట్ ఉంది. రేపు తప్పకుండా ఆఫీసుకు రావాల’ని. ∙∙ ఆఫీస్‌కు వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళడానికి నాకు మనసు అంగీకరించలేదు. పూర్ణమ్మ కొట్టు దగ్గర ఆగాను. నన్ను చూసిన వెంటనే పూర్ణమ్మ ఆత్రంగా ఆకుకూరలు సంచిలో సర్దడానికి రెడీ అవుతోంది. ‘అమ్మా ఈ కూరగాయలు మంచివేనా?’ అని అడిగాను. ఆమెను అనుమానించాలని నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకో అలా అనుకోకుండా ఆ ప్రశ్న నా నోటివెంట రాగానే వెంటనే పూర్ణమ్మ ‘బాబూ ... మా తాత, మా నాన్న నుంచి మాకు ఇదే యాపారం. నలుగురికి కడుపునింపే అదృష్టం అందరికి రాదు బాబూ.. ఇక మంచి చెడు అంటావా .. మా తాత, మా నాన్న పురుగు మందులు, యూరియా ఏస్తే పురుగులే కాదు మడుసులు సస్తారని నాటు మందులు ఏసి పండించిన పంట బాబు ఇది. ‘‘రైతు అంటే అందరికి అన్నం పెట్టాలిరా.. అంతే గానీ ఎవడి ఇంటి ఇల్లాలి కంట కన్నీరు పెట్టించ కూడదురా’’ అనే వాడు మా తాత. అంత వరకూ ఎందుకు బాబూ.. ప్రతివారం ఇగో ఈ సంఘం వోల్లు వచ్చి మా తోట, పంటా చూసుకొని అన్ని కూరగాయలు, ఆకు కూరలు వొట్టుకెలతారు’ అంటూ ఒక కార్డు ఇచ్చింది. అప్పుడు నాకు అర్థమయింది.. పూర్ణమ్మకు సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలీదేమో గానీ ధర్మంగా అన్న పెట్టడం మాత్రం తెలుసు. ఆమెకు మనసులోనే క్షమాపణలు చెప్పుకొని ఆకుకూరల కోసం మనః శాంతిగా సంచి ఇచ్చాను. నా ఈ లాక్డౌన్ రామాయణంలో పూర్ణమ్మ ఉడుత కాదు.. కాశీ అన్నపూర్ణమ్మ.. - ఇప్పిలి మధు -
సూసైడ్ సాంగ్: ఓ పాట వందల ప్రాణాలు తీసింది.. నేటికీ మిస్టరీనే..
మాటల్లో చెప్పలేని భావాన్ని కూడా పాటలోని రాగం స్పష్టంగా పలికి స్తుంది. మనసుల్ని సుతారంగా మీటుతూ భావోద్వేగాలను స్పృశిస్తుంది. అలాంటి ఓ పాట వందల మంది ప్రాణాలు తీసేసింది. హంగేరీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ‘హంగేరియన్ సూసైడ్ సాంగ్’ చరిత్ర నేటికీ ఓ మిస్టరీనే. స్మైల్ క్లబ్స్ 1933.. అప్పుడప్పుడే పలు దేశాలు మొదటి ప్రపంచ యుద్ధం మిగిల్చిన విషాదం నుంచి తేరుకుంటున్నాయి. అప్పటికే ఎందరో సైనికుల్ని కోల్పోయిన హంగేరీ రాజధాని బుడాపెస్ట్ ప్రజలను మాత్రం మరో విషాదం ఏడిపించింది. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు జనం. ఏదో మైకం కమ్మినట్లు, దెయ్యం పట్టినట్లు.. ట్రాన్స్‌లోకి వెళ్లి పెద్దపెద్ద భవనాల మీద నుంచి, నదుల వంతెనల మీద నుంచి దూకేయసాగారు. కారణం లేకుండానే మెడకు ఉరితాళ్లు బిగించుకునేవారు. పదుల సంఖ్యతో మొదలైన ఆత్మహత్యలు వందలకు చేరుకున్నాయి. దాంతో ఆ పరిసరప్రాంతాల్లోని నదులు, ఎత్తైన కట్టడాల చుట్టూ పోలీసులు కాపలా కాయసాగారు. ఎవరైనా చనిపోవాలని నదిలోకి దూకేస్తే వెంటనే రక్షించేవారు. ఇలా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కానీ, ప్రజల్లో ఆత్మహత్య ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కేవలం బుడాపెస్ట్‌లోనే కాకుండా హంగేరీలోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి ఘటనలే కనిపించసాగాయి. డిప్రెషన్‌తోనే అలా ప్రవర్తిస్తున్నారని భావించిన ప్రభుత్వ అధికారులు.. ప్రజలకు కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికీ సూసైడ్స్ ఆగలేదు. అంత యుద్ధమప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోని జనం ఇప్పుడింతటి మనోవ్యాకులతకు ఎందుకు గురవుతున్నారో అర్థం కాలేదు నిపుణులకు, ప్రభుత్వ యంత్రాంగానికి. అసలు కారణం తెలుసుకోవడం కోసం.. కొందరు వైద్య నిపుణులు, మరికొందరు రక్షణ సిబ్బంది, పలు శాఖల అధికారులతో ఓ విచారణ కమిటీ ఏర్పడింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి, ప్రాణాలతో బయటపడిన వారిని ఆ కమిటీ ప్రశ్నించడంతో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ‘గ్లూమీ సండే’. అదొక పాట. నిత్యం రేడియోలో ప్లే అవుతున్న ఆ పాటను విన్న తర్వాత మదిలో ఏదో తెలియని ఆవేదన మొదలైందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోబోయామని తెలిపారు వాళ్లు. దాంతో అధికారులు తక్షణమే ఆ పాట ప్రసారాన్ని నిలిపేశారు. వరుస ఆత్మహత్యలతో అప్పటికే బుడాపెస్ట్‌కు ఆత్మహత్యల నగరంగా పేరు వచ్చేసింది. ఆ పేరును పోగొట్టే లక్ష్యంతో పలు స్మైల్ క్లబ్స్ ఏర్పాటయ్యాయి. అందులో జాయిన్ అయినవారిని డిప్రెషన్‌కి దూరం చేసి, నవ్వమని ప్రోత్సహించేవారు. ఎక్కడికక్కడ అహ్లాదాన్ని కలిగించే విధంగా నవ్వుతున్న మోనాలిసా, హాలీవుడ్ యాక్టర్స్ చిత్రాలను వేలాడదీసేవారు. నవ్వుకున్న గొప్పతనంపై అవగాహన కల్పిస్తూ.. ప్రజలంతా స్మైలీ మాస్కులు ధరించేలా ప్రోత్సహించారు. నవ్వే పెదవులని ముఖానికి అతికించుకుని అద్దంలో చూసుకోమనేవారు. వరుస ఆత్మహత్యలు సరే.. ప్రజల స్మైలీ మాస్కులతో మరోసారి ప్రపంచం దృష్టిలో పడింది బుడాపెస్ట్. మొత్తానికి.. ఒక పాట మనుషుల మనసులను కకావికలం చేసి, జీవితంపై విరక్తి పుట్టించడం ఊహించని పరిణామమే. మరి, బుడాపెస్ట్ ఆత్మహత్యలకు కారణం ‘గ్లూమీ సండే’ పాటేనా? మరింకేదైనా మిస్టరీ ఉందా? అనేవారికి మాత్రం నేటికీ సమాధానం దొరకలేదు. అయితే లాస్లీ జావోర్ రాసిన మూలకథనం (ఫెయిల్యూర్ లవ్ స్టోరీ) ఆధారంగా హంగేరీలో చాలా సినిమాలు వచ్చాయి. ఇదీ.. పాట చరిత్ర.. 1933లో రెజ్సే సీరెస్ అనే పియానిస్ట్ స్వరపరచిన ఈ పాట అసలు సాహిత్యం ‘ప్రపంచం అంతమవుతోంది’ అనే పేరుతో ఉంటుంది. యుద్ధం వల్ల కలిగే నిరాశ, ప్రజల పాపాల గురించిన ప్రార్థనతో ముగుస్తుందీ గీతం. అయితే లాస్లీ జావోర్ అనే కవి ఆ పాటను ‘గ్లూమీ సండే’గా మార్చి సొంత లిరిక్స్‌ను జోడించాడు. అందులో ప్రేయసి చనిపోవడంతో, ఆమె ప్రియుడి ఆత్మహత్య ఆలోచనలతో నిండిన వేదన ఉంటుంది. (అయితే లాస్లీ తన భార్యతో విడిపోయినప్పుడు ఈ పాట రాశాడనే వాదన కూడా ఉంది) 1935లో పాల్ కల్మర్ హంగేరియన్‌లో రికార్డ్ చేశాడు. 1936లో హాల్ కెంప్ ఆంగ్లంలో తర్జుమా చేశాడు. 1941లో ‘బిల్లీ హాలిడే’ వెర్షన్ పేరిట.. పాట ఆంగ్ల ప్రపంచానికీ పరిచయమై ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయితే బీబీసీ 2002 వరకూ ఈ పాటను నిషేధించింది. - సంహిత నిమ్మన చదవండి: ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్ బ్యూటిఫుల్..! -
దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం..
ఇసుక దిబ్బలు.. ఉప్పు ఊట ప్రకృతి నిర్దేశించిన ప్రాంతం.. అదే ఉప్పు ఊట తీరంలో.. అవే ఇసుక దిబ్బల మీద ఆకాశ హార్మ్యాలు, నోరెళ్లబెట్టే ఆశ్చర్యాలతో ఆ ప్రాంతం మానవ మేధస్సు మలచిన పర్యాటక దేశం అయింది! అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలో రాసుంటుంది ‘ది వర్డ్ ఇంపాజిబుల్ ఈజ్ నో వేర్ ఇన్ ది వొకాబులరీ ఆఫ్ ది యూఏఈ’ అని. గాడ్ మేడ్ వరల్డ్ .. మ్యాన్ మేడ్ డెన్మార్క్ అనే నానుడి వచ్చింది కాని దుబాయ్‌ను చూస్తే డెన్మార్క్ సరసన దుబాయ్నీ కలుపుకోవచ్చు. కళ్లు మూసి తెరిచేలోగా అభివృద్ధి అనే మాటకు ప్రాక్టికల్ రూపంగా చూడొచ్చు దుబాయ్‌ని. సాంకేతికత పునాదిగా.. లేబర్ క్యాంపుల స్వేదం గోడలుగా నిలబడ్డ అద్భుతం. అది అరబిక్ కడలందం.. చూసి.. అనుభూతిని పదిలపరచుకోవాల్సిందే. అభివృద్ధి సరే.. షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ లేని ఒరిజినల్ దుబాయ్ ఎలా ఉంటుందో.. చూడాలన్న ఆశతో విమానం ఎక్కాను. దుబాయ్ చూడ్డానికి చలికాలం మంచి కాలం. టూరిస్ట్ సీజన్ కూడా. అన్నిరకాల సందళ్లతో దుబాయ్ ఫెస్టివల్‌గా అలరారుతుంది. అలా ఈ కరోనా టైమ్‌లో కూడా టూరిస్ట్‌లకు విమాన టికెట్లను కట్ చేసి గేట్లు తెరిచింది ఆ దేశం. అయితే కరోనా నిరోధక జాగ్రత్తలతో. ఇండియా నుంచి బయలుదేరే 72 గంటల ముందు కరోనా పరీక్ష చేసుకున్నా సరే.. దుబాయ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే మళ్లీ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే. విహారంలోనూ అడుగడుగునా ఆ జాగ్రత్తలు పాటించాల్సిందే. మాస్క్ లేకపోయినా.. భౌతిక దూరం పాటించకపోయినా మూడువేల దిర్హామ్స్ జరిమానా కట్టాల్సిందే. రోడ్ల మీద రెండు మీటర్లకో సర్కిల్ కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి పదీ ముప్పై అయిదు నిమిషాలకు బయలుదేరి దుబాయ్‌లో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీ కోవిడ్ టెస్ట్, పెయిడ్ కోవిడ్ రెండింటి సౌకర్యమూ ఉంది. పెయిడ్ టెస్ట్ చేయించుకొని గంటలో బయటపడ్డాం. కాని ఫలితాలు వెలువడే దాకా హోటల్ గది దాటే వీల్లేదు. ఎకానమీ బడ్జెట్లో ఫైవ్ స్టార్ సేవలందిస్తున్న రోవ్ హోటల్లో మా బస. పన్నెండు గంటల్లోపు అంటే తెల్లవారి ఉదయం మూడు గంటలకు నెగటివ్ అని, హ్యాపీగా దుబాయ్‌ని చుట్టిరావచ్చనే రిపోర్ట్ అందింది. మొత్తం నాలుగు రోజుల టూర్ అది. దుబాయ్ ఆత్మ దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ అనగానే బుర్జ్ ఖలీఫానే గుర్తు చేస్తుంది మెదడు. దుబాయ్ ఫ్రేమ్‌ని చూసేంత వరకు నేనూ బుర్జ్ ఖలీఫానే దుబాయ్ ఐడెంటిటీగా భావించాను. కాని ఫ్రేమ్‌ని చూశాక.. బుర్జ్ ఖలీఫా కేవలం టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే అనిపించింది. ఎందుకంటే దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ ఆత్మ. ఆ నిర్మాణం అచ్చెరువొందే అద్భుతమే. దీర్ఘచతురస్రాకారంలో నిలువుగా ఉంటుందీ కట్టడం. 93 మీటర్ల వెడల్పు, 152 మీటర్ల పొడవున్న (అంటే ఇంచుమించు 50 అంతస్తుల ఎత్తు అన్నమాట) రెండు టవర్లను ఆ ఎత్తులోనే కలుపుతూ వంద చదరపు మీటర్ల వంతెనతో నిర్మాణమైన దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ చరిత్ర, వర్తమానం, భవిష్యత్‌కు ప్రతీక. ఆ ఫ్రేమ్ గడప భాగంలో దుబాయ్ గతాన్ని చూపే గ్యాలరీ ఉంటుంది. వాళ్ల జీవన శైలి, ఉపాధి, వర్తక వాణిజ్యాలు, వాడిన పనిముట్లు, పాత్రలు, దుస్తులు, ఆయుధాలు వంటివన్నీ అందులో చూడొచ్చు.. డిజిటల్ డిస్ప్లేలో. దీన్ని సందర్శించాక లిఫ్ట్‌లో స్కై డెక్ తీసుకెళ్లారు. మొత్తం దుబాయ్‌ని చూపించే అంతస్తు. రెండు టవర్లను కలిపే వంతెనే ఆ స్కై డెక్. ఆ వంతెన పై నుంచి ఉత్తరం దిక్కు చూస్తే పాత దుబాయ్ అంతా దర్శనమిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయిల్ నిక్షేపాలను కనుగొనకముందున్న దుబాయ్.. సముద్రంలో ముత్యాలు, చేపల వేట వృత్తులుగా ఉన్న ప్రాంతం, దుకాణాలు, పరిశ్రమలు, ఇళ్లు, ఓ మోస్తరు మిద్దెలు, మేడలు, క్రీక్.. కనిపిస్తాయి.. 360 డిగ్రీల కోణంలో. దక్షిణం వైపు.. అదే 360 డిగ్రీల కోణంలో నవీన దుబాయ్ గ్లామర్, నిలువెత్తు ప్రగతి, ఠీవి కళ్లకు కడుతుంది. మధ్యలో గ్లాస్ వాక్‌వే ఉంటుంది. అంటే నడిచేదారి.. కిందికి చూస్తే పాత, కొత్త దుబాయ్ అంతా 360 డిగ్రీల కోణంలో మనల్ని వెంబడిస్తుంది. ఈ స్కై డెక్‌లో వర్తమాన దుబాయ్ పూర్వాపరాలన్నీ ఉంటాయి. ఇందులో దుబాయ్‌లో తొలిసారి ల్యాండ్ అయిన విమానం ‘ఎయిర్ ఇండియా’ అనీ, 1959 వరకు మన కరెన్సీ అక్కడ చలామణీలో ఉందన్న విషయాలూ తెలిశాయక్కడ. లిఫ్ట్‌లో కిందికి వెళ్లాక దుబాయ్ ఫ్యూచర్ గ్యాలరీ ఉంటుంది. వైద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక రంగాల్లో అది సాధించబోయే అధునాతన అభివృద్ధికి సంబంధించిన నమూనాను చూపించే గ్యాలరీ అది. అక్కడే గాజు గోడలకు ఆనుకొని దుబాయ్ ఫ్రేమ్ నిర్మాణాన్ని వివరించే సమాచారమూ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అమెరికాలోని స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా హైట్, సెయింట్ లూయిస్‌లోని గేట్ వే ఆర్చ్ కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌కి దాదాపు సగం ఉంటుంది. 2018 నుంచి సందర్శనకు సిద్ధమైంది. ప్రతి రోజు 200 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుంది అదీ 20 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా. టికెట్స్‌ను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. సాయంకాలం.. జుమేరా బీచ్ జుమేరా.. దుబాయ్‌లోని ధనిక వర్గం ఉండే తీర ప్రాంతం. చక్కటి విహార స్థలం. చిల్ ఈవినింగ్స్‌ను గడపాలనుకునే యూత్ మెచ్చే హ్యాంగవుట్ ప్లేస్. ఇండియన్, చైనీస్, థాయ్, జపనీస్, ఇటాలియన్, మెక్సికన్.. ఎన్నని చెప్తాం.. ప్రపంచంలోని అన్ని రుచులతో క్యుజైన్స్ ఘుమఘుమలాడుతుంటాయి. భారతీయ వంటకాలకు సంబంధించి ఇక్కడ బాంబే బంగ్లా ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్ సెటప్ కూడా భారతీయ కోటను పోలి ఉంటుంది. ప్రతిరోజు ఆకాశంలో డ్రోన్స్ షో ఉంటుంది. షాపింగ్ ప్రియులకు ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ ఉంటాయి. విందువినోదాలతో జుమేరా బీచ్‌లో సాయంకాలాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు. దుబాయ్ సూక్... ఎప్పుడెప్పుడు చూడాలా అని నేను ఆత్రుత పడ్డ ప్రాంతం.. ఒరిజినల్ దుబాయ్.. దుబాయ్ సూక్, బర్ దుబాయ్‌ను చూసే వేళ రానే వచ్చింది.. రెండో రోజున. సూక్ అంటే అరబ్బీలో అంగడి అని అర్థం. దుబాయ్‌లోని దిగువ, మధ్యతరగతికి అనువైన, అనుకూలమైన షాపింగ్ సెంటర్. వాకింగ్ టూర్‌గా సాగింది ఆ సందర్శన. దుబాయ్‌లో పెరిగి, అక్కడే ఉంటున్న హైదరాబాదీ వనిత ఫరీదా అహ్మద్ గైడ్‌గా వ్యవహరించింది. ముందుగా సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్మే ‘స్పైస్ సూక్’ నుంచి మా వాకింగ్ టూర్ ప్రారంభమైంది. ఇరుకు రోడ్లు.. వాటికి వారగా రెండు వైపుల సంప్రదాయ దుకాణాల సముదాయంతో హైదరాబాద్‌లోని బేగం బజార్, సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌ను గుర్తుకు తెస్తుంది దుబాయ్ సూక్. ఇరాన్, ఇండియా నుంచి వచ్చిన కుంకుమపువ్వు మొదలు అన్నిరకాల సుగంధ ద్రవ్యాలతో కొలువు తీరి ఉన్న ఆ అంగడిని చూసుకుంటూ దుబాయ్ స్పెషల్ అయిన అండా పరోటా, దుబాయ్ శాండ్విచ్.. ఖడక్ చాయ్ అమ్మే ఒక టీస్టాల్ ముందుకు వచ్చాం. దాన్ని నడిపిస్తున్నది ఒక మలయాళీ. వాటి రుచి చూడాల్సిందే అని పట్టుబట్టింది ఫరీదా. ఆర్డర్ ఇచ్చి.. అక్కడే .. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం మధ్యలో గుండ్రంగా వేసి ఉన్న బెంచీల దగ్గరకు వచ్చాం. ఆ హోల్‌సేల్ మార్కెట్లో సరుకులు మోసే కూలీలు సేద తీరడానికి ఏర్పాటు చేసిందా సీటింగ్ ఏరియా. అంత బిజీ ఏరియాలోనూ ప్రశాంతంగా అనిపించింది. ఈలోపు అండా పరాఠా (ఆమ్లెట్ పరాఠా), దుబాయ్ శాండ్విచెస్ విత్ డాకూస్ సాస్ రానే వచ్చాయి. ఫరీదా చెప్పింది వినకపోయి ఉంటే ఒక మంచి రుచిని మిస్ అయ్యేవాళ్లం. అక్కడున్న అందరికీ అండా పరాఠా రుచి తొలి పరిచయమే. దుబాయ్ శాండ్ విచెస్ కూడా... అందులో ఒమన్ నుంచి వచ్చిన చిప్స్ ప్రత్యేకం. అన్నిటికన్నా ముఖ్యం.. తప్పకుండా ప్రస్తావించాల్సిన టేస్ట్ డాకూస్ సాస్. కువైట్ టమాటా సాస్ అది. కారంగా కాకుండా.. తీపిగా కాకుండా.. జిహ్వ పదేపదే కోరుకునే రుచి అది. తర్వాత చెప్పుకోవాల్సింది ఖడక్ చాయ్.. దుబాయ్ స్పెషల్ చాయ్. వేడివేడి ఖడక్ చాయ్ పెదవులు దాటి.. నాలుక మీద నుంచి గొంతులోకి జారిందంటే చాలు.. ఒక్క సిప్‌కే ఉన్న చికాకులు.. వేధించే తలనొప్పి గాయబ్. కప్‌లో చాయ్ ఖలాస్ అయ్యేలోపు ఉత్సాహం వెంటపడుతుంది. అతిశయోక్తి కాదు అనుభవం. ఆ ఉత్సాహం వెంటరాగా మా నడకసాగింది. సుగంధ ద్రవ్యాలతో తయారైన ఔషధాలు, తలనూనెలు, కీళ్ల నొప్పుల ఆయిల్స్ అమ్మే దుకాణాలు అన్నిటినీ దాటుకొని అవతలి ఒడ్డున ఉన్న బర్ దుబాయ్ సూక్ మార్కెట్‌ను చూడ్డానికి తీసుకెళ్లే స్టీమర్లున్న తీరానికి చేరుకుని మోటార్ బోట్ ఎక్కాం. శివాలయం.. గ్రాండ్ మాస్క్ స్పైస్ సూక్కి ఆవల తీరం బనియా సూక్తో మొదలవుతుంది. బనియా సూక్ అంతా బట్టల దుకాణాల సముదాయం. ప్రపంచ పటంలో దుబాయ్ అస్తిత్వం కనిపించగానే పాకిస్తానీయులు చాలా మంది దుస్తుల వర్తకం కోసం దుబాయ్ చేరారు. ఆ అమ్మక ప్రాంతమే బనియా సూక్. అలా ఆ షాప్‌ల వెంట వెళుతుంటే ఆ గల్లీల్లో తులసి దళాల వాసన, గులాబీ, మందార, కనకాంబరం, చామంతి, బంతులు విరిసిన పూల మొక్కలు పలకరించాయి ఒక్కసారిగా. అరే.. అని అచ్చెరువొందేలోపే వాటిని ఆనుకొని ఉన్న కాశీదారాలు, హారతి కర్పూరాలు, వత్తులు, దీపపు కుందులు, పుట్నాల పప్పు ప్రసాదాలు విక్రయించే దుకాణాలూ .. విశాలమైన ప్రాంగణం.. క్యూ కోసం కట్టిన బారికేడ్లు..కనిపించాయి. ప్రశ్నార్థకంగా గైడ్ వైపు చూస్తే నవ్వుతూ ఆమె గోపురంలాంటి గుండ్రటి ఆకారాన్ని చూపించింది. ‘గుడా?’ అనే ఎక్స్‌ప్రెషన్‌ని పాస్ చేసేలోపే ‘శివాలయం’ అంది. శివరాత్రి రోజు బ్రహ్మాండమైన వేడుక జరుగుతుందట. ఆ ఆవరణను ఆనుకునే మస్జిద్ ఉంటుంది.. అదే ‘గ్రాండ్ మాస్క్’. ‘‘మస్జిద్ను ఆనుకునే ఈ గుడి ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని కాని, ఇంత చిన్న అసహనాన్ని కాని నేను చూడలేదు, వినలేదు. ఎవరి ప్రార్థనలు వాళ్లు చేసుకుంటారు, వెళ్లిపోతారు. ఒకరికొకరు కనీసం డిస్టర్బెన్స్ కూడా ఫీలయిన సందర్భం లేదు’ అని తన అనుభవాన్ని చెప్పింది ఫరీదా. ఒక మంచి భావనను మనసునిండా నింపుకుంటూ ముందుకు నడిచాం. అరేబియన్ టీ హౌస్.. శివాలయం, గ్రాండ్ మాస్క్ దాటి ఎడమవైపు తిరిగి... కాస్త ముందుకు వెళితే మరో ఆపాత మధురాన్ని పదిలపరచుకుంటున్న దృశ్యం సాక్షాత్కరిస్తుంది. అదే అరేబియన్ టీ హౌసెస్ ఉన్న ఏరియా. దుబాయ్ కొత్త అభివృద్ధిలో ఆ ప్రాంతపు అసలైన జీవనశైలి, అలవాట్లు కొట్టుకుపోకుండా కాపాడుకునే ప్రయత్నమే ఆ వీధి. చాయ్, కాఫీల తయారీలో దుబాయ్‌ది భిన్నమైన రుచి... సేవనంలో వైవిధ్యమైన అభిరుచి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేని కాలంలో ఆ ఎడారి ఉష్ణోగ్రతను, వడగాల్పుల ధాటిని తట్టుకునేలా ఆనాటి ఇంటి నిర్మాణాలు ఎలా ఉండేవో అచ్చంగా ఆ ఇళ్లనే కట్టి.. వాకిట్లో గద్దెలు (పరుపులు), పిల్లోలు వేసి.. మధ్యలో టీ కెటిల్, కప్పులు పెట్టి తేనీటిని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు నేటివ్ మెమొరీస్‌ను తాజాపరచుకుంటున్నారు ‘అరేబియన్ టీ హౌస్’పేరుతో. ఆ స్ట్రీట్‌కి ఆనుకొని ఉన్న రోడ్డు దాటి ముందుకు సాగితే.. కూడలిలో ఓ పడవ (నమూనా) కనిపిస్తుంది. మిగిలిన ప్రపంచంతో దుబాయ్‌ని అనుసంధానించిన ఆ దేశపు తొలి పడవ ప్రయాణానికి ప్రతీకలా. అయితే ఇక్కడ ఒకటి ప్రస్తావించుకోవాలి. పూర్వ దుబాయ్ వాసులకు పడవ తయారు చేయడం తెలియదు. వాళ్లకు ఆ విద్య నేర్పింది ఎవరో తెలుసా? మలయాళీలు. దుబాయ్ వాసులు కేరళ వచ్చి వాళ్ల దగ్గర పడవ తయారీ నేర్చుకున్నారు. బదులుగా వాళ్లొచ్చి దుబాయ్‌లో వ్యాపారం చేసుకునే ఒప్పందాన్నీ కుదుర్చుకున్నారు. నేటికీ దుబాయ్ అరబ్బులకు కేరళీయులంటే అపారమైన అభిమానం, గౌరవం. ఇంకా చెప్పాలంటే ఇండియా అంటే మొదటగా వాళ్లకు గుర్తొచ్చేది కేరళనే. అడుగడుగునా మలయాళీలు కనిపిస్తారు అన్నిరకాల పనులు, బాధ్యతల్లో. కాని ఆ కూడలిలో ఉన్న పడవ నమూనాను తయారు చేసింది మాత్రం చైనీయులట. వాకింగ్ కంటిన్యూ చేస్తే.. కరీనా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్ల కటౌట్లతో ఇండియన్ పార్టీ వేర్ షాపులు, మలబార్ గోల్డ్ వంటి గోల్డ్ షోరూమ్స్, ఆర్టిఫీషియల్ జ్యుయెలరీ దుకాణాలున్న మీనా బజార్, పానీ పూరీ, చాట్ భండార్లు, బిర్యానీ పాయింట్లు, కబాబ్ సెంటర్లు, మధ్యతరగతి (ఎక్కువగా భారతీయులు.. దాదాపు ప్రతి ఫ్లాట్ బాల్కనీలో తులసి మొక్కలు కనిపిస్తూంటాయి) రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో మినీ ఇండియా కనిపిస్తుంది. అక్కడ ‘అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్’ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇరానియన్ కబాబ్స్‌కి. ప్రపంచంలోని ఏ దేశం వాళ్లు దుబాయ్ వచ్చినా అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్‌లో భోజనం చేయందే ఫ్లైట్ ఎక్కరు. మాంసాహార ప్రియుల జిహ్వచాపల్యానికి పర్ఫెక్ట్ అడ్రెస్. కుంకుమపువ్వుతో చికెన్, బోటీ చికెన్, చికెన్ కబాబ్స్, పుదీనా టీ కోసం ఇక్కడ క్యూ కడ్తారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, సంజయ్ దత్వంటి ఎందరో బాలీవుడ్ స్టార్లు కేవలం అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్స్ టేస్ట్ చేయడానికే దుబాయ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారటంటే ఆ మసాలా ఘాటుకెంత క్రేజో చూడండి!! అలా అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్‌లో లంచ్‌తో మా దుబాయ్ సూక్ వాకింగ్ టూర్ ముగిసింది. గ్లోబల్ విలేజ్ ఆ సాయంకాలం గ్లోబల్ విలేజ్‌కు వెళ్లాం. దునియా మొత్తం దుబాయ్ ముంగిట్లో ఉందా అనిపించే ఉత్సవం అది. ప్రపంచాన్ని ఒక గ్రామంగా చూపించే ఎగ్జిబిషన్. 78 దేశాల సంస్కృతులు, రుచులు, అభిరుచులు, ప్రత్యేకతలు, ఉత్పత్తులు ఆయా దేశాల పెవిలియన్స్ (గుడారాలు)లో ఆకర్షిస్తుంటాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు 159 రోజులు సాగే ఈ గ్లోబల్ విలేజ్‌కి ప్రతిరోజూ 45 వేల మంది సందర్శకులు హాజరవుతుంటారు. పదహారు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన 3 వేల అయిదు వందల షాపులు (రెస్టారెంట్స్‌ను కలుపుకొని), అడ్వెంచర్ గేమ్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, మ్యూజియంలు, టీ కొట్లు, కెఫ్టీరియాలతోపాటు నాటకాలు, న్యత్యాలకు వేదికలూ కొలువుతీరి ఉన్నాయి. అయితే దేశాలకు ప్రాతినిధ్యం వహించే వాటిని దుకాణాలు అనకుండా పెవిలియన్స్ అంటారు. అలా అన్నిట్లోకి ఇండియాదే అతి పెద్ద పెవిలియన్. మన దేశానికి సంబంధించి 250 షాపులున్నాయక్కడ. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటిగంట దాకా ఉంటుంది. 92 దేశాలకు చెందిన పదివేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. 1997లో ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్‌కి 2021 సిల్వర్ జుబ్లీ ఇయర్. ఈ పాతికేళ్లలో ఒక్క ఏడు కూడా విరామం తీసుకోలేదు. 2020 కరోనా కాలంలోనూ నిర్వహించారు. ఎందుకంటే దుబాయ్‌లో ఏప్రిల్ తర్వాత కరోనా ప్రభావం కనపడింది అని చెప్పారు గ్లోబల్ విలేజ్ గైడ్. ప్రతి సోమవారం మహిళలు, ఫ్యామిలీ స్పెషల్‌గా ఉంటుందీ గ్లోబల్ విలేజ్. బాలీవుడ్ పార్క్స్.. మూడో రోజున బాలీవుడ్ పార్క్స్ మా విజిటింగ్ ప్లేస్ అయింది. హాలీవుడ్‌కు ‘యూనివర్సల్ స్టూడియో’ ఉంది. అలాంటి సినిమా ఫక్కీ వినోదాన్ని పంచే ప్రాంగణమేదీ బాలీవుడ్‌కు లేదు. అందుకే దుబాయ్‌లో చోటు సంపాదించుకుంది ‘బాలీవుడ్ పార్క్స్’ పేరుతో. ఇది పూర్తిగా ఫ్యామిలీ డెస్టినేషన్. సినిమాటిక్ రైడ్స్, థ్రిల్లింగ్ అట్రాక్షన్స్, బాలీవుడ్ యాక్షన్, మ్యూజిక్, డాన్స్, డ్రామా, స్టాండప్ కామెడీ వంటి వినోదాత్మకమైన లైవ్ షోస్ ఉంటాయిక్కడ. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ డాన్, లగాన్, షోలే, జిందగీ నా మిలేగీ దొబారా, రావన్, క్రిష్ వంటి సినిమా పేర్లతో థియేటర్లున్నాయి ఎంటర్టైన్మెంట్ షోస్ కోసం. అలాగే సంజయ్‌లీలా భన్సాలీ వంటి దర్శకుల సినిమాల సెట్టింగ్స్‌ను పోలిన కట్టడంతో రాజ్‌మహల్ అనే థియేటరూ ఉంది. మొత్తానికి చిన్న, పెద్ద అందరినీ అలరించే ఈ బాలీవుడ్ పార్క్స్ అచ్చంగా యూనివర్సల్ స్టూడియోను పోలి ఉంటుంది. అల్ సీఫ్.. ఆ సాయంకాలం అల్ సీఫ్‌కు వెళ్లాం. ఇదీ దుబాయ్ సూక్లాంటి నేటివిటీ షాపింగ్ ప్రాంతం. అరేబియా బ్యాక్‌వాటర్స్ ఒడ్డున పరుచుకొని ఉంటుంది. మట్టి గోడల ఇళ్లల్లో కొట్లను నిర్వహిస్తుంటారు. విహరిస్తూ ఉంటే చిన్నప్పుడు చదువుకున్న అరేబియా కథల్లోని ఇళ్లు, ఆ సంస్కృతి స్ఫురణకు వస్తూంటాయి. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్న అల్ ఫనార్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించాం. ఎక్కడికి వెళ్లినా దుబాయ్ ఖడక్ చాయ్‌ను సేవించాల్సిందే. బుర్జ్ ఖలీఫా... దుబాయ్ మాల్ ఈ రెండిటితోనే మోడర్న్ దుబాయ్ ప్రసిద్ధి అని వేరేగా చెప్పక్కర్లేదు. బుర్జ్ ఖలీఫా... ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం. రెసిడెన్షియల్ ఫ్లాట్స్, షాప్స్, హోటల్స్ ఉన్న ఆకాశహర్మ్యం అది. దీంట్లో కూడా మొదటి అంతస్తులో ఆ కట్టడం గురించిన వివరా లుంటాయి. బుర్జ్ ఖలీఫా స్కై (148వ అంతస్తు) వరకూ వెళ్లాం. ఆ బాల్కనీలో కూర్చొని కింద కనిపిస్తున్న దుబాయ్‌ను చూస్తూ టీ, కాఫీ తాగడం ఒక అనుభూతి. దుబాయ్ మాల్ కాంప్లెక్స్ నుంచే బుర్జ్ ఖలీఫాకు ప్రవేశం ఉంటుంది. అక్కడ ఫుడ్ కోర్ట్ ప్రాంగణంలోనే ఉంటుంది బుర్జ్ ఖలీఫా టికెట్ కౌంటర్. దుబాయ్ మాల్ విషయానికి వస్తే.. అదొక సముద్రం. సముద్రం అంటే గుర్తొచ్చింది.. ఆ మాల్లో ఆక్వేరియం ఒక అట్రాక్షన్. ప్రపంచంలోని ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నీ ఆ మాల్లో దొరుకుతాయి. బట్టలు, బొమ్మలు, వరల్డ్ ది బెస్ట్ కాస్మోటిక్స్ మొదలు ఎలక్ట్రానిక్ గూడ్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్స్ దాకా .. ప్రతి ఒక్కటీ దుబాయ్ మాల్లో లభ్యం. డ్యూటీ ఫ్రీ కాబట్టి మిగిలిన చోట్లతో పోలిస్తే ధరా తక్కువే. బట్టలు, బొమ్మల కన్నా ఎలక్ట్రానిక్ గూడ్స్, పెర్ఫ్యూమ్స్, సన్‌గ్లాసెస్ అక్కడ తీసుకుంటే మంచిదని అక్కడ ఓ షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణీయుడి సూచన. అయితే బుర్జ్ ఖలీఫాలా దుబాయ్ మాల్‌ను ఒక గంటలో చుట్టిపెట్టలేం. కనీసం ఒక్కరోజు కచ్చితంగా కావాలి.. షాపింగ్ చేసినా.. చేయకుండా మాల్ అంతా చూడాలనుకున్నా. ఒకవేళ అంత సమయం వెచ్చించలేకపోతే ముందుగా దుబాయ్‌మాల్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే.. ఏ అంతస్తులో ఏ మూల ఏ షాప్ ఉందో ఆ యాప్‌లో తెలుసుకొని జీపీఆర్ఎస్ సహాయంతో నేరుగా వెళ్లొచ్చు. నాలుగే అంతస్తులైనా.. వైశాల్యంలో పెద్దది. అందుకే యాప్ ఫోన్లో ఉంటే ప్రయాస ఉండదు. ఇదీ నా దుబాయ్ ప్రయాణం. నిలువెత్తు దుబాయ్ ప్రగతికి ప్లాన్ చేసిన ఆర్కిటెక్ట్‌లలో.. రాళ్లు మోసిన కూలీలలో... శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కర్మచారుల్లో.. టూరిస్ట్‌లకు సేవలందిస్తున్న హాస్పిటాలిటీలో.. డాక్టర్లలో.. నర్సుల్లో.. టీ కాచి వేడివేడిగా అందిస్తున్న చాయ్వాలాల్లో.. రెస్టారెంట్లలో.. కూడళ్లల్లో.. ప్రతిచోటా భారతీయులున్నారు. దుబాయ్ పురోగతిలో ఉపాధి పొందుతూ.. దుబాయ్ పురోగతికి పాటుపడుతూ! – సరస్వతి రమ -
అబార్షన్: మందులు వాడినా ఫలితం లేదు
నా వయసు 29 సంవత్సరాలు. కొంతకాలంగా నెలసరి సమయంలో నాకు చాలా తక్కువగా రక్తస్రావం జరుగుతోంది. ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటోంది. ఏడాది కిందట నాకు అబార్షన్ జరిగింది. ఆ తర్వాత నుంచే ఈ సమస్య మొదలైంది. నేను ప్రభుత్వాసుపత్రిలో చూపించుకుంటే, మందులు ఇచ్చారు. మందులు వాడినా ఫలితం పెద్దగా లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉందా? – అవంతి, మెంటాడ (విజయనగరం జిల్లా) మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో హార్మోన్లలో అసమతుల్యత పెరిగి ఉన్నట్లుండి బరువు పెరగడం వల్ల, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో అండాశయాలలో నీటిబుడగలు, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి వంటి వాటివల్ల కూడా రక్తస్రావం కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల గర్భాశయ కండరాలు కుంచించుకున్నట్లయ్యి పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిన్ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి విపరీతంగా ఉండవచ్చు. కొందరిలో చాలా అరుదుగా అబార్షన్ కోసం డి అండ్ సి ద్వారా గర్భాశయం శుభ్రం చేసినప్పుడు, ఎక్కువగా చెయ్యడం వల్ల గర్భాశయ పొర దెబ్బతినడం వల్ల బ్లీడింగ్ తక్కువగా అవ్వవచ్చు. అలానే ఎక్కువసార్లు అబార్షన్లు చెయ్యించుకోవడం వల్ల కొందరిలో అడినోమయోసిన్ అనే సమస్య ఏర్పడి కూడా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సిబిపి, ఈఎస్ఆర్, ఎస్ఆర్–టిఎస్హెచ్, ఎస్.ఆర్.ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని పెల్విక్ స్కానింగ్ చేయించుకుని సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే ఆహారనియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలు చెయ్యడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి నీ సమస్య తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ఈ బెల్ట్ వేస్తే బెల్లీ ఫ్యాట్ మాయం!
‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అనేది పాత సామెత. ‘చిక్కినమ్మే చక్కనమ్మ’ ఇది లేటెస్ట్ ట్రెండ్. నిజానికి ఎవరైనా సరే.. సన్నగా, సరైన కొలతలతో ఉంటే.. మిగతాదంతా మేకప్‌తో, క్రేజీ డ్రెస్‌లతో కవర్ చేసేసుకోవచ్చు. అందుకే లావుగా, బొద్దుగా కనిపించే కంటే.. స్లిమ్‌గా, జీరో సైజ్ మెయిన్టైన్ చెయ్యడానికే ఇష్టపడుతుంటారు అమ్మాయిలు. అలాంటి వారి కోసమే ఈ స్లిమ్మింగ్ బెల్ట్. ఇది ఆకర్షణీయమైన ఆకృతిని అందిస్తుంది. ఈ ఫిట్నెస్ బెల్ట్ కొవ్వు ఉన్న శరీరభాగాలకు చుట్టుకుంటే.. అధిక ఫ్రీక్వెన్సీ మసాజ్ వైబ్రేషన్‌తో, తేలికపాటి హీట్‌తో.. కొవ్వును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా పొట్ట, నడుము భాగాల్లో కొవ్వుని పూర్తిగా కరిగిస్తుంది. లేటెస్ట్ ఎలిప్టికల్ స్వింగింగ్ మసాజ్ టెక్నాలజీతో రూపొందిన ఈ ప్రొడక్ట్.. బరువు తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. శారీరక వ్యాయామంలానే.. భుజం, తొడలు, వీపు భాగం, చేతులు ఇలా కొవ్వు పేరుకున్న ప్రదేశాల్లో ఈ బెల్ట్‌ను చుట్టుకుని రోజుకు పది నిమిషాలు ఉంచితే చాలు. బెల్ట్ ముందు భాగంలో రెడ్, గ్రీన్ బటన్స్ ఉంటాయి. బెల్ట్‌ని బాడీకి కావాల్సిన విధంగా అడ్జెస్ట్ చేసుకునే వీలుంటుంది. దీనికి కనెక్ట్ చేసుకునేందుకు హైక్వాలిటీ రిమోట్ ఉంటుంది. దానిలో ఆన్/ఆఫ్ బటన్‌తో పాటు టైమర్ బటన్, ఆటో 1,2,3 అనే మోడ్స్, మాన్యువల్ బటన్ వేర్వేరుగా ఉంటాయి. 5 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు, 12 నిమిషాలు అని నాలుగు టైమింగ్ బటన్స్ ఉంటాయి. ఫంక్షన్, స్ట్రాంగ్, వీక్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ బెల్ట్‌కి ప్రత్యేకమైన చార్జర్ లభిస్తుంది. ఈ న్యూ టెక్నాలజీ బెల్ట్ ధర 52 డాలర్లు. అంటే 3,787 రూపాయలు. ఇలాంటి మోడల్స్ అదనపు సౌకర్యాలతో మార్కెట్లో చాలానే అమ్ముడుపోతున్నాయి. -
ప్రమాదంలో పుడమి కవచం
పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ కవచానికి చిల్లు పడింది. ఈ చిల్లు నానాటికీ విస్తరిస్తోంది. కవచానికి ఏర్పడిన ఈ చిల్లులోంచి తీక్షణమైన అతి నీలలోహిత కిరణాలు నేలను తాకుతున్నాయి. వీటి తాకిడి వల్ల మనుషులు చర్మ కేన్సర్ బారిన పడుతున్నారు. సముద్రజీవులు ముప్పు అంచుకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకోకుంటే, భూమ్మీద ఉన్న సమస్త జీవరాశులకూ ముప్పతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పుడమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ సహజ కవచమే ‘ఓజోన్ పొర’. ఒక ఆక్సిజన్ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్ అణువుకు మరో ఆక్సిజన్ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్’ను ‘ట్రైయాక్సిజన్’ అని కూడా అంటారు. ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్ పొర మందం మారుతూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటోంది. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, హెడ్రాక్సిల్, క్లోరిన్, బ్రోమిన్ వంటి వాటి వల్ల ఓజోన్ పొర దారుణంగా తరిగిపోతోంది. ఓజోన్ పొర సహజమందాన్ని పోగొట్టుకున్నా, పూర్తిగా నాశనమైనా ఓజోన్ పొరకు చిల్లు పడిందని అంటాం. ధ్రువప్రాంతాల్లో ఓజోన్ పొర పలచబడటం వల్ల సూర్యుని అతి నీలలోహిత కిరణాలు ఆ ప్రాంతానికి మరింత తీక్షణంగా తాకుతాయి. ఫలితంగా, అక్కడి మంచు శరవేగంగా కరిగిపోయి, సముద్రాల్లో నీటిమట్టం అమాంతం పెరిగి తీరాలు మునిగిపోతాయి. విపరీతమైన ఇంధన వినియోగం, ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజరేటర్లలో వాడే వాయువులు విపరీత పరిమాణంలో వెలువడుతుండటం వల్ల ఓజోన్ పొరకు చిల్లుపడి, అది నానాటికీ విస్తరిస్తోంది. భూమ్మీద అక్కడక్కడా చెలరేగే కార్చిచ్చులు కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల అమెజాన్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపగలదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవీ అనర్థాలు ఓజోన్ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల మనుషులకు చర్మ క్యాన్సర్ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. అకాల వార్ధక్యం ముంచుకొస్తుంది. వివిధ పంటలు దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడుతుంది. గోధుమలు, వరి, బార్లీ వంటి తిండిగింజల పంటలకు, కూరగాయల పంటలకు తీరని నష్టం కలుగుతుంది. ఫలితంగా ఆహార లభ్యతకు విఘాతం ఏర్పడుతుంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు కూడా నశించి, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పెంపుడు జంతువులు క్యాన్సర్లకు గురవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు త్వరగా నశిస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల మనుషుల జీవితం దుర్భరంగా మారుతుంది. ప్రపంచానికి ఊపిరితిత్తుల్లో మంటలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులను ప్రపంచానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తారు. ప్రపంచ జనాభాకు అవసరమైన ఆక్సిజన్‌లో దాదాపు ఇరవై శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే అందుతోంది. ప్రపంచంలోనే అత్యంత దట్టమైన సువిశాలమైన వర్షారణ్యాలు అమెజాన్ అడవులు. ఇవి బ్రెజిల్ సహా తొమ్మిది దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. గత ఆగస్టులో బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఒక వ్యక్తి దమ్ముకొట్టి, ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేసిన సిగరెట్ పీక కారణంగానే దావానలం వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. వారాల తరబడి రగులుతున్న ఈ కార్చిచ్చును ఆర్పడానికి బ్రెజిల్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించినా, ఇప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు బ్రెజిల్లో 77 వేల కార్చిచ్చు సంఘటనలు జరిగాయి. వాటిని రోజుల వ్యవ«ధిలోనే ఆర్పేశారు. అయితే, ఆగస్టులో చెలరేగిన కార్చిచ్చు మాత్రం ఇప్పటికీ అదుపులోకి రాకపోవడం యావత్ ప్రపంచాన్నే ఆందోళనలో ముంచెత్తుతోంది. అమెజాన్ అడవుల్లో వేలాది ఎకరాల మేరకు వృక్షసంపద మంటలకు ఆహుతవుతోంది. మంటలను చల్లార్చేందుకు బ్రెజిల్ సైనిక విమానాలు గగనతలం నుంచి భారీస్థాయిలో నీటిని గుమ్మరిస్తున్నాయి. అమెజాన్ కార్చిచ్చుపై ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ కూటములు, వివిధ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చల్లారని మంటల కారణంగా అమెజాన్ అడవుల్లో ఏ మేరకు విస్తీర్ణంలో చెట్లు నాశనమయ్యాయో కచ్చితంగా తెలియడం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అమెజాన్ కార్చిచ్చును ‘అంతర్జాతీయ సంక్షోభం’గా అభివర్ణించారు. ఈ సమస్య పరిష్కారానికి పారిశ్రామిక దేశాలన్నీ ముందకు రావాలని ఆయన జీ–7 సమావేశాల్లో పిలుపునిచ్చారు. అమెజాన్ కార్చిచ్చును చల్లార్చే ప్రక్రియకు సాయం చేయడానికి జీ–7 దేశాలు సంసిద్ధత వ్యక్తం చేసినా, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో మాత్రం వాటి సాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అమెజాన్ కార్చిచ్చును అడ్డుపెట్టుకుని పారిశ్రామిక దేశాలన్నీ బ్రెజిల్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయాలని భావిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను పర్యావరణాన్ని నాశనం చేయాలనుకోవడం లేదని, బ్రెజిల్‌ను కాపాడుకోవాలనుకుంటున్నానని అన్నారు. అమెజాన్ కార్చిచ్చుపై అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా, ఈ కార్చిచ్చు వల్ల చెలరేగే పొగలు వాతావరణంలోని ఎగువభాగానికి– అంటే స్ట్రాటోస్పియర్ వరకు చేరుకుంటాయని, దీనివల్ల ఓజోన్ పొరకు మరింత ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓజోన్ ఉపయోగాలూ అనర్థాలూ ఓజోన్ పొర సాధారణంగా వాతావరణానికి ఎగువ భాగమైన స్ట్రాటోస్పియర్ వద్ద ఉంటుంది. అది అక్కడ ఉండటమే క్షేమం. అక్కడి నుంచి ఓజోన్ పొర భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు చేరుకోకుండా అడ్డు పడుతుంది. వాతావరణంలోని దిగువభాగమైన స్ట్రాటోస్పియర్లో ఓజోన్ అతి స్వల్పంగా ఉంటుంది. భూమ్మీద పరిసరాల్లో ఆక్సిజన్ 21 శాతం ఉంటుంది. మనం పీల్చేది ఆక్సిజన్ (ఓ2) మాత్రమే. మనుషులతో పాటు సమస్త జీవరాశుల శ్వాసక్రియకు ఓ2 రూపంలో ఉన్న ఆక్సిజన్ మాత్రమే అవసరం. భూమ్మీద పరిసరాల్లో ఓజోన్ అత్యంత స్వల్పస్థాయిలో– అంటే, పది లక్షల భాగాలకు ఒక వంతు (0.0001 శాతం) మాత్రమే ఉంటుంది. శ్వాసక్రియకు ఉపయోగపడే ఆక్సిజన్‌కు ఎలాంటి వాసనా ఉండదుగాని, ఓజోన్‌కు వాసన ఉంటుంది. ఈ వాసన దాదాపు క్లోరిన్ వాసననుపోలి ఉంటుంది. భూమి పరిసరాల్లోని వాతావరణం దిగువ పొరలో ఓజోన్ పరిమాణం ఎక్కువైతే, దానివల్ల జీవరాశికి మేలు బదులు కీడే ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. మనుషులకు, జంతువులకు శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. ఓజోన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలు సజావుగా పండని పరిస్థితులు తలెత్తుతాయి. స్ట్రాటోస్పియర్ వద్ద షార్ట్వేవ్ అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల ఆక్సిజన్ ఓజోన్‌గా పరిణామం చెందుతుంది. భూమికి చేరువలో ఆవరించి ఉన్న వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్పై అతి నీలలోహిత కిరణాల ప్రభావం ఏర్పడితే, భూవాతావరణానికి చేరువలోనే ఓజోన్ సాంద్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే పర్యావరణానికి చాలా అనర్థాలు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఓజోన్ పొర ఎందుకు అవసరం? అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్లనే ఏర్పడే ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్లో భూమి చుట్టూ ఆవరించి ఉండటం భూమ్మీద మనుగడ సాగించే జీవరాశికి అత్యంత అవసరం. ఓజోన్ పొర సూర్యుడి నుంచి 290 నానోమీటర్ల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యంతో (వేవ్‌లెంగ్త్) వెలువడే అతి నీలలోహిత కిరణాలను సమర్థంగా అడ్డుకోగలదు. ఫలితంగా అతి నీలలోహిత కిరణాల ప్రమాదకర రేడియేషన్ ప్రభావం నుంచి జీవరాశికి రక్షణ ఏర్పడుతుంది. సహజమైన ఈ రక్షణ కొరవడితే మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకే ముప్పు తప్పదు. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్ర పరికరాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించడం వల్ల ఓజోన్ పొర ఇప్పటికే దెబ్బతింది. ముఖ్యంగా దక్షిణార్ధగోళంలో ఓజోన్ పొరకు చిల్లుపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించే ప్రమాదకర రసాయనాల వల్ల ఓజోన్ పొరకు నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు దశాబ్దాల కిందటే తమ పరిశోధనల్లో గుర్తించారు. ఫలితంగా ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 1987లో ప్రపంచంలోని ప్రధాన దేశాలు మాంట్రియల్ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఓజోన్ పొరకు 1 శాతం విఘాతం ఏర్పడితే, భూమ్మీద నివసించే మనుషుల్లో వ్యాపించే క్యాన్సర్లు 2–5 శాతం మేరకు పెరుగుతాయి. క్యాటరాక్ట్ వంటి కంటి సమస్యలు గణనీయంగా పెరగడమే కాకుండా, మనుషుల్లోను, జంతువుల్లోను రోగనిరోధక శక్తి దారుణంగా దెబ్బతింటుంది. భూమ్మీద నివసించే మనుషులకు, పశుపక్ష్యాదులకు, సముద్రాల్లోను, నదుల్లోను జీవించే జలచరాలకు ఆహారాన్ని ఇచ్చే వృక్షజాతుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఫలితంగా జీవజాతులు క్రమంగా అంతరించిపోయే ప్రమాదం తలెత్తుతుంది. ఓజోన్ పొర ఎందుకు దెబ్బతింటోంది? పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక యంత్రపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రపరికరాలు పనిచేయడానికి రసాయనాలు, ఇంధనం వాడుక కూడా పెరిగింది. అధునాతన యంత్రపరికాలలో వాడే కొన్ని రసాయనాలు ఓజోన్ పొరకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాదాపు ఐదుదశాబ్దాల కిందటే ఈ సంగతిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ రసాయనాలన్నింటినీ స్థూలంగా ‘ఓజోన్ డెప్లీటింగ్ సబ్‌స్టన్సెస్’ (ఓడీఎస్) అని పేరు పెట్టారు. ఈ ఓడీఎస్ రసాయనాలలో చాలావరకు రసాయనాలు పర్యావరణానికి నేరుగా ముప్పు కలిగించవు. భూమికి చేరువగా ఉన్న వాతావరణంలో ఇవి ఉన్నంత సేపూ వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇవి భూమిని ఆవరించి ఉన్న తొలి వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్ను దాటుకుని, స్ట్రాటోస్పియర్ను చేరుకున్నప్పుడే, అక్కడ ఓజోన్ పొరపై ప్రభావం చూపుతాయి. ఇవి ఓజోన్‌తో జరిపే రసాయనిక చర్యల వల్లనే సమస్య తలెత్తుతోంది. ఇవి ఓజోన్ అణువు నుంచి ఒక్కో ఆక్సిజన్ పరమాణువును కాజేస్తాయి. ఫలితంగా ఓజోన్ తన సహజమైన ట్రైయాక్సైడ్ రూపాన్ని కోల్పోయి మామూలు ఆక్సిజన్ (డయాక్సైడ్–ఓ2) రూపంలో మిగులుతుంది. స్ట్రాటోస్పియర్కు చేరిన రసాయనాలు ఓజోన్ నుంచి కాజేసిన ఆక్సిజన్ పరమాణువును కలుపుకొని కొత్తగా రూపాంతరం చెందుతాయి. వీటి ప్రభావంతో ఓజోన్ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిన ప్రదేశంలో ఖాళీ ఏర్పడి, సూర్యుడి అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమ్మీదకు దూసుకొస్తాయి. క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో ఫ్లోరోక్లోరో కార్బన్లు, కార్బన్ టెట్రా క్లోరైడ్, బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్లు వంటి రసాయనాలను ఓజోన్ పొరను దెబ్బతీసే ‘ఓడీఎస్’ రసాయనాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల ఓజోన్ పొరకు ఏర్పడే ముప్పును గుర్తించిన తర్వాత వీటిలో ‘హాలోన్స్’గా పిలిచే బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్ల వాడకాన్ని కేవలం అగ్నిమాపక యంత్రాలకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ఓజోన్ను దెబ్బతీసే ఇతర రసాయనాలతో పోల్చుకుంటే, హాలోన్స్ పదిరెట్లు ఎక్కువగా ఓజోన్ను దెబ్బతీస్తాయి. భారీ ఎత్తున అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులు చెలరేగిన ప్రాంతాల్లో అనివార్యంగా హాలోన్స్ను ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఓజోన్ పొర దెబ్బతినక తప్పని పరిస్థితులు ఉంటాయి. రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఓజోన్ పొర ఓజోన్ పొర ఇప్పటికే రెండు ప్రాంతాల్లో బాగా దెబ్బతింది. ఆస్ట్రేలియా భూభాగానికి ఎగువన వాతావరణ పరిధిలో ఓజోన్ పొర మందం దాదాపు 5–9 శాతం మేరకు తగ్గింది. దీనివల్ల అక్కడ భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు తగినంత వడబోత లేకుండానే, నేరుగా ప్రసరించే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ ఆరుబయట ఎక్కువసేపు గడిపేవారు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక దక్షిణ ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా వద్ద కూడా ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సెప్టెంబర్–నవంబర్ నెలల మధ్య కాలంలో ఓజోన్ పొరకు రంధ్రం మరింతగా విస్తరిస్తోంది. దక్షిణార్ధగోళంలో అక్కడక్కడా సంభవించిన భారీస్థాయి అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా ఈ ప్రాంతంలో ఓజోన్ పొరకు విఘాతం కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ వంటి ‘ఓడీఎస్’ రసాయనాల వినియోగం ఓజోన్ పొరకు మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు కిందకే వస్తాయి. ఇవి వర్షాలు కురిసినప్పుడు భూమ్మీదకు తిరిగి చేరుకునే పరిస్థితి ఉండదు. భూమ్మీద నుంచి పైకెగసిన ఈ రసాయనాలు స్ట్రాటోస్పియర్ వద్ద దీర్ఘకాలం అలాగే ఉంటాయి. ఓజోన్ పొరకు ఇవి కలిగించే అనర్థం అంతా ఇంతా కాదు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక క్లోరిన్ పరమాణువు ఏకంగా లక్ష ‘ఓజోన్’ అణువులను దెబ్బతీయగలదు. ఇక బ్రోమిన్ అయితే క్లోరిన్ కంటే 40 రెట్లు ఎక్కువగా హాని చెయ్యగలదు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న ‘ఓడీఎస్’ రసాయనాలలో క్లోరోఫ్లోరో కార్బన్స్ రసాయనాలదే సింహభాగం. ఓజోన్ను దెబ్బతీసే రసాయనాల్లో వీటి వాటా 80 శాతానికి పైగానే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 1995 సంవత్సరానికి ముందుగా తయారైన రిఫ్రిజిరేటర్లు, ఇళ్లల్లోను, వాహనాల్లోను ఉపయోగించే ఎయిర్ కండిషనర్ల లోను వీటి వాడుక విపరీతంగా ఉండేది. వీటితో పాటు ఆస్పత్రులలో ఉపయోగించే క్లీనింగ్ ఏజెంట్లు, స్టెరిలంట్స్, పరుపులు, కుషన్ల తయారీకి వాడే ఫోమ్, హోమ్ ఇన్సులేషన్ పదార్థాలను తయారు చేసే పరిశ్రమల్లోను క్లోరోఫ్లోరో కార్బన్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ తెచ్చిపెడుతున్న ముప్పును గుర్తించిన తర్వాత వీటి స్థానంలో హైడ్రోఫ్లోరో కార్బన్లు వాడటం మొదలైంది. ఇవి క్లోర్లోఫ్లోరో కార్బన్స్‌తో పోల్చు కుంటే కొంత తక్కువ హానికరమైనవి. ఇవే కాకుండా, భారీ అగ్నిమాపక యంత్రాలలో వాడే హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కోల్డ్ క్లీనింగ్, వేపర్ డీగ్రీజింగ్, కెమికల్ ప్రాసెసింగ్, పరిశ్రమల్లో వాడే జిగురు వంటి పదార్థాల తయారీలో ఉపయోగించే మీథైల్ క్లోరోఫామ్ వంటివి కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఎలా నివారించగలం? ఓజోన్ పొర మరింతగా దెబ్బతినకుండా చూడాలంటే అదంతా మనుషుల చేతుల్లోనే ఉంది. మనుషులు కాస్త మెలకువ తెచ్చుకుని, ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ఓజోన్ పొరను కాపాడుకోవడానికి మనుషులు ముఖ్యంగా తగ్గించుకోవాల్సినవేవంటే... రసాయనిక ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. రసాయన పురుగు మందులకు బదులు సేంద్రియ పురుగు మందులను వాడాలి. పెట్రోలియం ఉత్పత్తుల వాడుకను తగ్గించుకోవాలి. ప్రయాణాల కోసం ప్రైవేటు వాహనాలను విచ్చలవిడిగా వాడే బదులు వీలైనంతగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగ ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో రసాయనాలతో తయారైన క్లీనింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీటిలో వినియోగించే రసాయనాలు ఓజోన్ పొరకు తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటి బదులు పర్యావరణానికి చేటు చెయ్యని క్లీనింగ్ ఉత్పత్తులను వాడుకోవాలి. మాంట్రియల్ ఒడంబడిక తర్వాత దానిపై సంతకాలు చేసిన దేశాలు క్లోరోఫ్లోరో కార్బన్ రసాయనాల వాడుకను గణనీయంగా తగ్గించుకున్నాయి. అయితే, ఈ ఒడంబడికలో ఓజోన్ పొరకు ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్‌ను చేర్చలేదు. నైట్రస్ ఆక్సైడ్ వాడుకను కూడా కట్టడి చేస్తేనే ఓజోన్ పొరను కాపాడుకోగలుగుతాం. -
రజనీ వర్సెస్ కట్టప్పా!
రజనీ: కట్టప్పా... నీకో విషయం తెలుసా? మా ఊళ్లో చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. దీపాలు కూడా ఉండేవి కావు. అయినా సరే, అర్థరాత్రి వరకు కష్టపడి చదివేవాడిని... కట్టప్ప: అదెలా????!!!!! రజనీ: అగరుబత్తి వెలిగించి ఆ వెలుగులో శ్రద్ధగా చదువుకునేవాడిని... కట్టప్ప: ???????!!!!!!!!??????? రజనీ: మరి నీ సంగతి? కట్టప్ప: మీకు ఆ ఆగరు బత్తి అయినా ఉండేది. మాకు అది కూడా కొనే స్తోమత లేదు. అయినా సరే రాత్రి బాగా కష్టపడి చదువుకునేవాడిని.... రజనీ: అదెలా సాధ్యం?????!!!!!! కట్టప్ప: మా ఇంటి పక్కన ప్రకాశ్, సూర్య అనే ఇద్దరు అన్నదమ్ములు, వారి చెల్లి జ్యోతి అని ఉండేవారు. రాత్రి సమయంలో వారిని మా ఇంటికి పిలిచి, వాళ్ల వెలుగులో చదువుకునేవాడిని. గబ్బర్‌సింగ్ వర్సెస్ సాంబ! గబ్బర్: అరెవో సాంబా... ఎంతమంది? సాంబ: ఇద్దరు దొరా... గబ్బర్: నేను లెక్కల్లో కొంచెం వీక్... 2 దేని తరువాత వస్తుంది? సాంబ: 1 తరువాత వస్తుంది... గబ్బర్: అలాగా... 2కు ముందు ఏముంటుంది? సాంబ: 1 గబ్బర్: మరి మధ్యలో ఏముంటుంది? సాంబ: ఏమీ ఉండదు దొరా! గబ్బర్: మరి అలాంటప్పుడు రెండూ ఒకేసారి రావచ్చు కదా! ఏమిటి పిచ్చి వేషాలు? సాంబ:???!!!!! -
నక్షత్ర ఫలాలు
అశ్వని: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేష రాశిలోకి వస్తాయి. వీరు సాత్వికులు, అందరితోనూ స్నేహంగా మెలగుతారు. నేర్పు, ఓర్పు కలిగి అందరికీ ఆదర్శప్రాయులుగా ఉంటారు. ధైర్యం ఎక్కువ. ఆభరణాలపై మక్కువ చూపుతారు. పొదుపు గుణం ఉంటుంది.. మంచి రూపవంతులు. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రతివిషయంలోనూ సమర్థతను చాటుకుంటారు. నక్షత్రాధిపతి కేతువు. మేషరాశికి అధిపతి కుజుడు. వీరు వైఢూర్యం ధరించవచ్చు. కేతువు జ్ఞానకారకుడు. జ్యోతిష్యం, వేదాంతం, యోగశాస్త్రాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు. భరణి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేష రాశిలోకి వస్తాయి. వీరు అభిమానవంతులు, ధైర్యవంతులు కాగలరు. కళల పట్ల ఆసక్తి మెండు. అలంకారప్రియులై ఉంటారు. వస్త్రాభరణాలపై మక్కువ అధికం. భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారు. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. రాజకీయ, విద్య, సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. లౌకికజ్ఞానం ఎక్కువ. దూరదృష్టి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. పదవులు, హోదాలు చేపడతారు. జీవిత మధ్య కాలం నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు. వీరు వజ్రం ధరించాలి. కృత్తిక: ఈనక్షత్రంలోని మొదటి పాదం మేషరాశిలోకి, మిగతా మూడు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. మేషరాశికి కుజుడు, వృషభరాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి(సూర్యుడు). మంచి వర్చస్సు, రూపం కలిగి ఉంటారు. ైైధైర్యసాహసాలు అధికం. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. పరిపాలకులుగా, మంచి హోదాలలో బాధ్యతలు చేపట్టి గుర్తింపు పొందుతారు. బంధువుల పట్ల ఎక్కువ అభిమానం చూపుతారు. చిన్నతనంలో కొన్ని ఇబ్బందులు పడ్డా మధ్య వయస్సు నుంచి అభివృద్ధి ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు. జనాకర్షణ కలిగి ఉంటారు. దానగుణం, దైవభక్తి మెండుగా ఉంటాయి. వీరు కెంపు ధరించాలి. రోహిణి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి చంద్రుడు. రాశ్యాధిపతి శుక్రుడు. వీరు ఎప్పుడూ ప్రశాంతంగా, క్లిష్టమైన సమస్యలను సైతం నేర్పుగా పరిష్కరించుకునే నైపుణ్యం కలిగి ఉంటారు. మేధావులు, విజ్ఞానవంతులై ఉంటారు. స్నేహితులు అధికం. ఆకర్షణీయమైన రూపం. కార్యసాధకులు. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకునే గుణం ఉంటుంది. తెలివితేటలతో ఉన్నత శిఖరాలకు చేరతారు. ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. భోగభాగ్యాలు, సుఖసంతోషాలతో జీవిస్తారు. వీరు ముత్యం ధరించవచ్చు. మృగశిర: ఈ నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు వృషభరాశిలోకి, చివరి రెండు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. వృషభరాశికి శుక్రుడు, మిథునరాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. ఎప్పుడూ ఉత్సాహవంతులుగా ఉంటారు. కోపం కూడా ఎక్కువే. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. స్వాభిమానం, దైవభక్తి అధికం. ఎవరికీ తలవంచని మనస్తత్త్వం. శాస్త్రవేత్తలుగా, రచయితలుగా, వ్యవసాయదారులుగా, అధ్యాపకులుగా రాణిస్తారు. రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సాధించాలన్న పట్టుదల ఉంటుంది. పరోపకారులు. త్యాగాలకు సైతం సిద్ధపడే గుణం ఉంటుంది. వీరు పగడం ధరించాలి. ఆరుద్ర: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మిథునరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి రాహువు. రాశ్యాధిపతి బుధుడు. వ్యాపారులు, ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లుగా రాణిస్తారు. ఫొటోగ్రఫీ, ప్రచురణలు, కళారంగాలపై మక్కువ చూపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. గర్వం, పట్టుదల అధికం. చపలత్వం కలిగి ఉంటారు. ప్రతివిషయంపై వాదనలంటే ఇష్టపడతారు. మేధావులై సన్మానాలు కూడా పొందుతారు. పెద్దలంటే గౌరవం అధికం. నిగ్రహశక్తి ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు విద్యల్లో ప్రవేశం కలిగి ఉంటారు. వీరికి ఆలస్యంగా గుర్తింపు వస్తుంది. వీరు గోమేధికం ధరించాలి. పునర్వసు: ఈ నక్షత్రంలోని మూడు పాదాలు మిథునరాశిలోకి, చివరి పాదం కర్కాటకరాశిలోకి వస్తాయి. మిథునరాశికి బుధుడు, కర్కాటకరాశికి చంద్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. మంచిరూపం, తెలివితేటలు కలిగి ఉంటారు. ధర్మబుద్ధి, ఔదార్యం, దైవభ క్తి ఉంటుంది. యుక్తిగా పనులు చక్కదిద్దుకునే నేర్పు ఉంటుంది. పరోపకారులై మంచి గుర్తింపు పొందుతారు. హాస్యచతురులు. తరచూ శ్వాససంబంధ వ్యాధులు బాధిస్తాయి. అన్నవస్త్రాలకు లోటు ఉండదు. అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఉన్నత విద్యావంతులు, పండితులు కాగలరు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఉద్యోగాల్లో రాణిస్తారు. న్యాయశాస్త్రంపై ఆసక్తి చూపుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు. పుష్యమి: ఈనక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి చంద్రుడు. మొరటుతనం కలిగి ఉంటారు. స్ఫురద్రూపి, సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో పాటు ధనాపేక్ష అధికం. ఉత్తమ గుణాలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏకాంత జీవనానికి ఇష్టపడతారు. మధుర పదార్థాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి అభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు. మధ్య వయస్సులో రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంటుంది. న్యాయ, తర్కశాస్త్రాలపై మక్కువ చూపుతారు. వీరు నీలం ధరించవచ్చు. ఆశ్లేష: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి చంద్రుడు, నక్షత్రాధిపతి బుధుడు. మంచి పనులతో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలపై ఆసక్తి అధికం. దైవభక్తి, సేవాభావం ఎక్కువగా ఉంటుంది. మంచి దేహదారుఢ్యంతో పాటు భాగ్యవంతులై ఉంటారు. శాంతస్వభావులు. చపలత్వం కూడా ఎక్కువే. ఆగ్రహం వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు. ప్రశాంత జీవనం అంటే ఇష్టపడతారు. ఏదో ఒక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టునే గుణం కలిగి ఉంటారు. మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురైనా మొత్తంమీద జీవితం సాఫీగానే సాగుతుంది. చిన్నతనంలో కష్టాలు అనుభవించినా మధ్య వయస్సు నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. వీరు పచ్చ ధరించవచ్చు. మఖ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి(సూర్యుడు) అధిపతి. నక్షత్రాధిపతి కేతువు. ధైర్యవంతులై ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావన అధికం. పెద్దల పట్ల గౌరవం కలిగి బంధువులకు ఉపకారం చేస్తారు. కార్యసాధకులు. కళలపై ఆసక్తి ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. విలాసజీవనం గడుపుతారు. దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. యుక్తాయుక్త విచక్షణ కలిగి ఎదుటవారి సమస్యలు సైతం పరిష్కరించే సత్తా కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యవసాయదారులు, కళాకారులుగా రాణిస్తారు. వీరు వైఢూర్యం ధరించవచ్చు. పుబ్బ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి అధిపతి రవి(సూర్యుడు), నక్షత్రాధిపతి శుక్రుడు. కళాభిరుచి కలిగి ప్రసంగాలు, తర్కం అంటే ఇష్టపడతారు. దైవభక్తి మెండు. అలంకారప్రియులు, ఆభరణాలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. కార్యసాధకులు, నేర్పరులై ఉంటారు. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధించే తత్వం. గణాంకాలు, కళారంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. స్నేహానికి ప్రాణమిస్తారు. అందర్నీ ప్రేమించే గుణం ఉంటుంది. చిన్నతనంలో కొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరు వ జ్రం ధరించవచ్చు. ఉత్తర: ఈ నక్షత్రంలోని మొదటి పాదం సింహరాశిలోకి, మిగతా మూడు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి(సూర్యుడు), కన్యారాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి. సాధుప్రవర్తన, త్యాగనిరతి కలిగి ఉంటారు. సంఘంలో విశేషమైన గౌరవం పొందుతారు. తరచూ సన్మాన, సత్కారాలు జరుగుతాయి. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి చూపుతారు. పరాక్రమవంతులై శత్రువులను జయిస్తారు. బంధుప్రియులు. మిత్రులు అధికంగా ఉంటారు. వ్యాపారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులుగా రాణిస్తారు. ప్రకృతి ఆరాధకులు. ఉన్నత విద్యావంతులై ప్రతిభను చాటుకుంటారు. వీరు కెంపు ధరించాలి. హస్త: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు అధిపతి. నక్షత్రాధిపతి చంద్రుడు. మంచి రూపంతో అందర్నీ ఆకర్షిస్తారు. దైవభక్తి, పెద్దలయందు గౌరవం ఎక్కువ. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. రెండుమూడు విధాలుగా ధనసంపాదన ఉంటుంది. ఉన్నత విద్యావంతులు కాగలరు. నిపుణ్యత, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. స్వయం కృషితో అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, న్యాయనిపుణులుగా రాణిస్తారు. మంచి ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. వీరు ముత్యం ధరించవచ్చు. చిత్త: ఈ నక్షత్రంలోని మొదటి రెండుపాదాలు కన్య, చివరి రెండుపాదాలు తులారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. పట్టుదల, కోపం ఎక్కువగా ఉంటాయి. తాము చెప్పిందే వేదమనే తత్వం. అలంకారప్రియులై ఉంటారు. రెండుమూడు విద్యలలో ప్రవేశం ఉంటుంది. శాస్త్రవిజ్ఞానం, వ్యవసాయరంగాలపై ఆసక్తి చూపుతారు. అందరిలోనూ గుర్తింపునకు ఆరాటపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఎక్కువగా ఉద్యోగులు, వ్యవసాయదారులు, రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు పగడం ధరించవచ్చు. స్వాతి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశికి అధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి రాహువు. స్వతంత్రంగా జీవించాలనే తపన ఉంటుంది. ఎవరినీ లెక్కపెట్టరు. బాధ్యతలు అప్పగిస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుని పూర్తి చేసే మనస్తత్త్వం. బుద్ధిమంతులు, బంధువర్గానికి అత్యంత ఇష్టులై ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. న్యాయదృష్టి, విజ్ఞత కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాలలో రాణిస్తారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా కూడా కొనసాగుతారు. వీరు గోమేధికం ధరించాలి. విశాఖ: ఈ నక్షత్రంలోని మూడు పాదాలు తుల, చివరి పాదం వృశ్చిక రాశిలోకి వస్తాయి. తులా రాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. సూక్ష్మబుద్ధి కలిగి, వివేకంతో వ్యవహరిస్తారు. విద్యావేత్తలు, పండితులు కాగలరు. యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా చేసుకుంటారు. ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. జీవిత మధ్య భాగం నుంచి భోగభాగ్యాలు అనుభ విస్తారు. ఉపకార గుణం ఉంటుంది. సమర్థతను చాటుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలుగా ఎక్కువగా రాణిస్తారు. కనకపుష్యరాగం ధరించవచ్చు. అనూరాధ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చికరాశికి కుజుడు అధిపతి కాగా, నక్షత్రాధిపతి శని. భోగభాగ్యాలు అనుభవిస్తారు. కష్టజీవులుగా ఉంటారు. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా స్థిరపడతారు. మంచిరూపం, పాపభీతి కలిగి ఉంటారు. శౌర్యవంతులు, మేధావులు కాగలరు. సంగీత, సాహిత్య, లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. కష్టాలెదురైనా ఎప్పుడూ చింతించక సంతోషంగా ఉంటారు. కొందరు గణితం, జ్యోతిషం, సాముద్రికాలలో ఆసక్తి చూపుతారు. వీరు నీలం ధరించాలి. జ్యేష్ఠ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి బుధుడు. వ్యాపారదృక్పథం కలిగి ఉంటారు. పొదుపు గుణం ఎక్కువ. బాగా ఆలోచిస్తే గానీ ఒక నిర్ణయానికి రారు. స్నేహితులంటే ఎక్కువగా ఇష్టపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయ రంగాలలో రాణిస్తారు. చమత్కారులు, హాస్యచతురులు. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి మెండు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరి పచ్చ ధరించాలి. మూల: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి కేతువు. వీరు యజమానులకు మేలు చేసే వారై ఉంటారు. సమాజసేవపై మక్కువ చూపుతారు. రహస్యాలు పసిగట్టే తత్వం. బంధువులంటే ఇష్టపడతారు. ఎంతటి సమస్య ఎదురైనా ఏమాత్రం భ యపడరు. విషయ పరిజ్ఞానం అధికం. శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, ఉద్యోగులుగా రాణిస్తారు. క ష్టపడి పైకి వస్తారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీరు వైఢూర్యం ధరించాలి. పూర్వాషాఢ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయి. ధనూరాశికి గురుడు అధిపతి, నక్షత్రాధిపతి శుక్రుడు. ఉన్నత విద్యావంతులు, సంగీత, సాహిత్యకారులు కాగలరు. వినయవిధేయతలు , దానగుణం కలిగి ఉంటారు. సంపన్నులతో స్నే హం చేస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తరచూ సన్మాన, సత్కారాలు పొందుతారు. అధ్యాపకులు, కళాకారులు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు వజ్రం ధరించాలి. ఉత్తరాషాఢ: ఈ నక్షత్రంలోని మొదటి పాదం ధనుస్సు రాశిలోకి, మిగతా మూడు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. ధనుస్సు రాశికి గురుడు, మకర రాశికి శని అధిపతులు. నక్షత్రాధిపతి రవి(సూర్యుడు). వీరికి రవి దశతో జీవితం ప్రారంభమవుతుంది. అందరికీ ఆప్తులై ఉంటారు. శ్రమ, కష్టాలను తట్టుకునే తత్వం. నాయకత్వ లక్షణాలు కలిగి జనాకర్షణ ఉంటుంది. స్వశక్తితో పైకి వస్తారు. ఇతరుల మేలు మర్చిపోరు. మిత్రులు ఎక్కువగా ఉంటారు. శాస్త్రవిజ్ఞానం, న్యాయశాస్త్రాలంటే ఇష్టపడతారు. ఉన్నతపదవులు చేపడతారు. వీరు కెంపు ధరించాలి. శ్రవణం: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి శని, నక్షత్రాధిపతి చంద్రుడు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. బంధువులకు సాయపడతారు. విద్యావంతులై ఉన్నత హోదాలు చేపడతారు. ఔదార్యం, ఉపకారబుద్ధి, మాటల చాతుర్యం కలిగి ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. సుగంధ ద్రవ్యాలంటే ఇష్టమెక్కువ. వ్యాపారాల్లో ఎక్కువగా రాణిస్తారు. వ్యవసాయంపై కూడా ఆసక్తి ఉంటుంది. సంగీత, సాహిత్య ప్రియులు కాగలరు. ఆకర్షణీయమైన రూపం ఉంటుంది. వీరు ముత్యం ధరించాలి. ధనిష్ఠ: ఈ నక్షత్రంలోని మొదటి రెండుపాదాలు మకరరాశిలోకి, చివరి రెండుపాదాలు కుంభరాశిలోకి వస్తాయి. మకర, కుంభరాశులకు శని అధిపతి. నక్షత్రాధిపతి కుజుడు. ఎరుపు దుస్తులు, వస్తువులంటే ఇష్టపడతారు. దానగుణం, సౌమ్యగుణం కలిగి ఉంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకునే లక్షణం ఉంటుంది. శ్రమించే తత్వం. క్రీడాకారులుగా, వ్యవసాయదారులుగా రాణిస్తారు. ఉన్నతోద్యోగులుగా కూడా స్థిరపడతారు. సంగీతంపై మక్కువ చూపుతారు. అధిక సంపాదనపై అభిలాష ఉంటుంది. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. భూములు, వాహనాలు కలిగి ఉంటారు. వీరు పగడం ధరించవచ్చు. శతభిషం: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి శని అధిపతి. నక్షత్రానికి రాహువు అధిపతి. బంధువులకు ఉపకారం చేస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. నీతినిజాయితీలు, ధైర్యసాహసాలు కలిగి ఉంటారు. వాక్చాతుర్యం కలిగి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. పరిశోధనలు, వైద్యం, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. వాదనల్లో ఆరితేరతారు. వక్తలుగా కూడా రాణిస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వీరు గోమేధికం ధరించాలి. పూర్వాభాద్ర: ఈ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు కుంభరాశిలోకి, చివరి పాదం మీన రాశిలోకి వస్తాయి. కుంభానికి శని, మీనరాశికి గురుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. వినయవిధేయతలు, సేవాభావం కలిగి ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. విచక్షణాజ్ఞానంతో మంచిచెడ్డలను అంచనా వేస్తారు. గొప్ప పనులు చేసి అందరి ప్రశంసలు పొందుతారు. రెండు మూడు విద్యల్లో రాణిస్తారు. ధనవంతులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. కళాభిరుచి, వైద్య నైపుణ్యం ఉంటుంది. ప్రతిభావంతులై సన్మానాలు పొందుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు. ఉత్తరాభాద్ర: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీన రాశిలోకి వస్తాయి. మీన రాశికి గురుడు అధిపతి. నక్షత్రాధిపతి శని. ధైర్యం వీరి సొంతం. నీతినిజాయితీలకు ప్రాణం ఇస్తారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మనస్సు చంచ లం. వీరు నాయకులుగా, వ్యాపారులుగా, ఉద్యోగులుగా రాణిస్తారు. నమ్మినవారికి ఎన్ని కష్టాలెదురైనా సాయం అందించే గుణం ఉంటుంది. జీవిత ప్రారంభంలో కొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ అభివృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. నచ్చని విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. వీరు నీలం ధరించాలి. రేవతి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీన రాశిలోకి వస్తాయి. మీనరాశికి గురుడు, నక్షత్రానికి బుధుడు అధిపతులు. వ్యాపార లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పట్టుదల అధికం. శ్రమకు, కష్టాలకు భయపడరు. మేధావులై ఉంటారు. రచనలు, జ్యోతిషం, గణిత శాస్త్రాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. విద్యావేత్తలు కాగలరు. జీవిత మధ్య దశలో ధనవంతులు, ఆస్తిపరులు కాగల అవకాశాలు ఉంటాయి. వాక్పటిమతో అందర్నీ ఆకట్టుకునే గుణం కలిగి ఉంటారు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. వీరు పచ్చ ధరించాలి. -
కృష్ణా పుష్కరాలు
జ్యోతిష శాస్త్రం ప్రకారం పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవగురువు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఏ రాశిలో సంచరిస్తాడో, అప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ పుష్కరాలు, కన్యారాశిలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణానదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రానదికీ పుష్కరాలు వస్తాయి. ఈ పవిత్ర పుష్కర సమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకూ, పితృపిండ ప్రదానానికీ అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, కూరగాయలు, తేనె, పీట, అన్నం, పుస్తకం ... ఇలా ఎవరి శక్తిని బట్టి వారు రోజుకు కొన్ని చొప్పున దానం చెయ్యడం వల్ల ఇహలోకంలో సుఖసంపదలు పొందడంతోపాటు అంత్యమున ముక్తి కలుగుతుందని రుషి ప్రమాణం. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు, పిండప్రదానాలు పుణ్యఫలాన్నిస్తాయి. కృష్ణానదికి 2016 ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ కాలంలో కృష్ణలో స్నానాదులు, పూజలు, దానధ ర్మాలు, పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తే పుణ్యఫలం కలుగుతుంది. పుష్కరాలలో నదీ స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుంది. జన్మజన్మల పాపాలూ నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది. ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదిపేరును మనం స్నానం చేసేటప్పుడు ముమ్మారు మనస్సులో తలచుకున్నా కొంతమేర పుష్కర స్నానఫలితం పొందచ్చునని శాస్త్రవచనం. కృష్ణానది శ్రీమహావిష్ణువు శరీరం. శివుని అష్టమూర్తులలో ఒకటైన జలస్వరూపం. శివకేశవ స్వరూపం. మహాపాపాలను పోగొడుతుంది. కృష్ణానదీ విశేషం కృష్ణానది దక్షిణ భారతదేశంలోని ముఖ్యనదులలో ఒకటి. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో మహాబలేశ్వరం వద్ద ఉద్భవించింది. మహాబలేశ్వర లింగం పైనుండి ప్రవహించి పెద్ద నదిగా మారింది. తుంగభద్ర, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు ఉపనదులు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి మీదుగా ఏటిమొగ, ఎదురుమొండి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. కృష్ణానదీ తీర క్షేత్రాలు శ్రీశైలం: ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహిని. ఇక్కడి స్వామివారు మల్లికార్జునుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అమ్మవారు భ్రమరాంబ. శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శ్రీశైలం పురాణ ప్రసిద్ధమైన శైవ క్షేత్రం.అమరారామం: దేవ రాజయిన అమరేశ్వరుడు ప్రతిష్ఠించడంచేత ఇక్కడి స్వామిని అమరేశ్వరస్వామి అని అంటారు. ఇక్కడి దేవికి బాల చాముండిక అనీ, రాజ్యలక్ష్మీదేవి అనీ పేర్లు. ఇది శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడి స్వామిని క్రౌంచనాథుడంటారు. అలంపురం: అమ్మవారు జోగులాంబ. స్వామి బాలబ్రహ్మేశ్వర స్వామి. అలంపురం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కృష్ణా, తుంగభద్రా నదుల సంగమ స్థానం. తుంగానది ‘బ్రహ్మ’ స్వరూపమని, భద్రానది ‘శివ’ స్వరూపమని, కృష్ణానదిని ‘విష్ణు’ స్వరూపమని చెబుతారు వేదాద్రి: కృష్ణా తీరంలోని ఆలయం. యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఇక్కడి దైవం. జ్వాలానరసింహ, సాలగ్రామ నరసింహ, యోగానంద నరసింహ, వీర నరసింహ, చెంచులక్ష్మీ నరసింహులను పూజిస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని ప్రతీతి. వాడపల్లి: నృసింహస్వామి. మూసీ, కృష్ణానదుల సంగమస్థానం. ఇక్కడ స్వామి వారు ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉన్నట్లుగా వారికెదురుగా ఉండే దీపం కదులుతుంటుంది. ఇక్కడున్న అగస్త్యేశ్వరస్వామి లింగరూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. చిలుమూరు - ఐలూరు: సీతారాములు అయోధ్యకు వెళ్తూ శివుని ప్రతిష్ఠింపదలచారు. శివలింగాన్ని తీసుకురావడం కోసం హనుమంతుని కాశీనగరానికి పంపారు. ముహూర్త సమయానికి హనుమంతుడు రాలేక పోవడంతో - సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగం. గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి సైకత (ఇసుక) లింగం, చిలుమూరు. హనుమంతుడు ముహూర్తం దాటిన తరువాత కాశీ నుండి శివలింగాన్ని తెచ్చాడు. అప్పటికే లింగప్రతిష్ఠ జరగడంతో బాధపడిన హనుమంతుడు దానిని నది ఆవలి ఒడ్డుకు వేయగా ఆ లింగం స్వయంగా ప్రతిష్ఠితమైంది. ఆ లింగమే రామలింగేశ్వరస్వామి - ఐలూరు. ఈ రెండు శివలింగాలూ పశ్చిమాభిముఖాలే. హనుమంతుడు ప్రతిష్ఠించిన స్వామివారి ఆలయానికి పక్కగా రఘునాయక ఆలయం ఉంది. చిలుమూరు గుంటూరు జిల్లాలో, ఐలూరు కృష్ణాజిల్లాలో ఉన్నాయి. శ్రీకాకుళం: ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వరుడు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి. స్వామికి వెనుకగా దశావతారాలు చెక్కిన శిల్పం ఉన్నది. ఆలయ గోపురం మిక్కిలి పెద్దది. ఇచటి స్వామివారికి 108 సాలగ్రామ శిలాహారముంది. ఏకరాత్ర మల్లికార్జునస్వామి: కృష్ణా తీరం. అమ్మవారు బాలాత్రిపుర సుందరి. ఆంధ్ర మహావిష్ణువు ఆలయం పక్కన ఉంది. కృష్ణకు ఉత్తర తీరాన ప్రతిష్ఠితం. కృతయుగం కన్నా ముందే నిర్మింపబడిందని విశ్వాసం. స్వర్ణమయ దేవాలయం. వరదలు వచ్చినా శిథిలం కాని ఆలయం. ఇక్కడున్న మర్రిచెట్టు ప్రాచీనమైనది. విజయవాడ: కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన ఆలయం ఉంది. స్వామి పేరు మల్లేశ్వరస్వామి. అర్జునుడిక్కడ ప్రతిష్ఠించిన శివలింగం విజయేశ్వరస్వామి. హంసలదీవి: ఇక్కడి దేవుడు వేణుగోపాలస్వామి. కృష్ణాసాగర సంగమ స్థానం. అతి ప్రాచీనమైన ఆలయం మంగళగిరి: రాజ్యలక్ష్మీ నరసింహస్వామి. ధర్మరాజు ప్రతిష్ఠించాడు. గోపురం మిక్కిలి ఎత్తయినది. కొండపై పానకాల నరసింహస్వామివారి మూర్తి ఉంది. ఈ స్వామి మూర్తి నైఋతీ ముఖంగా ఉంటుంది. తోట్లవల్లూరు: మల్లికార్జునస్వామి, భ్రమరాంబ. నర్సోబావాడి: శ్రీదత్తాత్రేయస్వామి. కోరిన కోరికలు తీరతాయని నమ్మిక. కృష్ణా పంచగంగా సంగమం. మహారాష్ర్టలో ఉంది. మాహులీ: సంగమేశ్వరస్వామి. కృష్ణా-వేణీ నదీ సంగమం. కోల్ నృసింహ: షోడశ భుజ నృసింహ. కృష్ణా, కోయినా నదీ సంగమం కృష్ణానదిలో కలిసే చోటు. దీనిని పంచనదీ సంగమ క్షేత్రమని అంటారు. మహాబలేశ్వర్: ఇది పంచనదీ జన్మస్థానం. అతిబల, మహాబల, రాక్షసుల సంహారం ఇక్కడే జరిగింది.పుష్కరాలు జరిగే స్థలాలు: కృష్ణానదీ పరివాహక ప్రాంతాలైన విజయవాడ, అలంపురం, వాడపల్లి, మట్టపల్లి తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. -
ముఖ్యమైన పండుగలు
ఏప్రిల్.. 8 ఉగాది, తెలుగు సంవత్సరాది 11 {శీపంచమి 13 మేష సంక్రమణం. 14 తమిళ సంవత్సరాది 15 }రామనవమి 22 మదనపౌర్ణమి 25 సంకటహర చతుర్థి మే 1 మేడే, కార్మిక దినోత్సవం, శుక్రమూఢమి ప్రారంభం 4 చిన్నకర్తరీ ప్రారంభం 5 మాసశివరాత్రి 9 అక్షయ తృతీయ, సింహాచల నృసింహస్వామి చందనోత్సవం 11 శంకరజయంతి, అగ్నికర్తరి ప్రారంభం 20 నృసింహజయంతి 21 బుద్ధజయంతి 25 రోహిణి కార్తె ప్రారంభం,సంకటహర చతుర్థి 28 కర్తరీ త్యాగం. 31 హనుమజ్జయంతి జూన్ 3 మాసశివరాత్రి 8 మృగశిర కార్తె ప్రారంభం 17 రామలక్ష్మణ ద్వాదశి 22 ఆరుద్ర కార్తె ప్రారంభం 23 సంకటహర చతుర్థి జూలై 2 శనిత్రయోదశి 3 మాసశివరాత్రి 6 పూరీ జగన్నాథ రథయాత్ర, రంజాన్. 9 స్కందపంచమి 12 శుక్రమూఢమి సమాప్తం 15 తొలి ఏకాదశి 16 కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం 19 గురుపౌర్ణమి 23 సంకటహర చతుర్థి 31 గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం ఆగస్టు 1 మాసశివరాత్రి 6 నాగచతుర్థి 7 నాగపంచమి 11 గోదావరి అంత్యపుష్కరాలు సమాప్తం, కృష్ణానది పుష్కరాలు ప్రారంభం. 12 వరలక్ష్మీ వ్రతం 15 స్వాతంత్య్ర దినోత్సవం 18 రాఖీ పండగ, శ్రావణ పౌర్ణమి 21 సంకటహర చతుర్థి 25 }Mృష్ణజన్మాష్టమి 30 మాసశివరాత్రి సెప్టెంబర్ 1 పోలాల అమావాస్య 2 చంద్రదర్శనం 5 వినాయక చవితి 6 ఋషిపంచమి 12 గురుమూఢమి ప్రారంభం, పరివర్తన ఏకాదశి 15 అనంతపద్మనాభ వ్రతం 17 మహాలయపక్షం ప్రారంభం 19 ఉండ్రాళ్ల తదియ, సంకటహర చతుర్థి అక్టోబర్.. 1 శరన్నవరాత్రులు ప్రారంభం. 2 గాంధీ జయంతి, చంద్రదర్శనం 8 సరస్వతీ పూజ 9 దుర్గాష్టమి 10 మహర్నవమి, గురుమూఢమి సమాప్తం 11 విజయదశమి 18 అట్లతదియ 19 సంకటహర చతుర్థి 28 ధనత్రయోదశి, మాసశివరాత్రి 29 నరకచతుర్థి 30 దీపావళి పండగ నవంబర్ 1 చంద్రదర్శనం 3 నాగుల చవితి 4 నాగపంచమి 11 చిలుకద్వాదశి, క్షీరాబ్ది 12 శనిత్రయోదశి 14 కార్తీక పౌర్ణమి, బాలల దినోత్సవం, 17 సంకటహర చతుర్థి 27 మాసశివరాత్రి డిసెంబర్ 1 చంద్రదర్శనం 5 సుబ్రహ్మణ్యషష్ఠి 10 గీతాజయంతి, మోక్షద ఏకాదశి 13 దత్తజయంతి, కోరల పౌర్ణమి 16 ధనుస్సంక్రమణం ప్రారంభం 17 సంకటహర చతుర్థ్ధి 25 {Mిస్మస్ 27 మాసశివరాత్రి 30 చంద్రదర్శనం. జనవరి 2017 1 ఆంగ్లసంవత్సరాది 8 ముక్కోటి ఏకాదశి 13 భోగిపండగ 14 మకర సంక్రాంతి 15 కనుమ పండగ 16 ముక్కనుమ 26 రిపబ్లిక్‌డే. 29 చంద్రదర్శనం 31 తిలచతుర్థి ఫిబ్రవరి 1 మదనపంచమి, శ్రీపంచమి 3 రథసప్తమి 7 భీష్మ ఏకాదశి 11 మహామాఘి 25 మహాశివరాత్రి మార్చి 9 నృసింహ ద్వాదశి 12 హోలిపండగ 13 లక్ష్మీజయంతి, వసంతోత్సవం 20 శుక్రమూఢమి ప్రారంభం 26 మాసశివరాత్రి 29 శ్రీ హేవళంబి నామ సంవ త్సర ఉగాది -
ఉగాది కృత్యం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్! ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!! గాయత్రీ ధ్యానమ్ ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయైర్ముఖైీస్ర్తక్షణై యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖచక్ర మదారవింద యుగళం హస్త్వైహంతీం భజే నవగ్రహ స్తుతి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ! గురుశుక్ర శనిభ్యశ్చ! రాహవే కేతవే నమః లక్ష్మీ స్తుతి లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం పంచాంగ కర్త: సింహంభట్ల సుబ్బారావు ఉగాది కృత్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. తెలుగువారు చాంద్రమానం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం రీత్యా ఈ పండుగ జరుపుకుంటారు. ఉదయమే అభ్యంగన స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించడం, అనంతరం షడ్రుచులతో కూడిన (తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు) ఉగాది పచ్చడిని తినడంతో పండుగ ప్రారంభమవుతుంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు, జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు. పంచాంగ సారాంశం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడినదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు కార్యసిద్ధికి తోడ్పడతాయి. ఈ పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది. చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీదుర్ముఖినామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 30వది దుర్ముఖినామ సంవత్సరం. అధిపతి రుద్రుడు, రుద్రుని ఆరాధించిన సకలసంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే, రజతదానం మంచిది. కర్తరులు... చైత్ర బహుళ ద్వాదశి తత్కాల త్రయోదశి, బుధవారం, అనగా మే 4 నుంచి డొల్లు కర్తరి (చిన్న కర్తరి) ప్రారంభం. వైశాఖ శుక్ల పంచమి, బుధవారం అనగా మే 11 నుంచి నిజ కర్తరి(అగ్నికర్తరి) ప్రారంభం. వైశాఖ బహుళ సప్తమి, శనివారం అనగా మే 28న కర్తరి పరిసమాప్తమవుతుంది. కర్తరీ కాలంలో శంకుస్థాపనలు, గృహ నిర్మాణాలు చేయరాదు. మూఢములు గురు మూఢమి... భాద్రపద శుక్ల ఏకాదశి, సోమవారం, అనగా సెప్టెంబర్ 12వ తేదీ నుంచి గురుమూఢమి ప్రారంభం. ఆశ్వయుజ శుక్ల నవమి, సోమవారం అనగా అక్టోబర్ 10వ తేదీన మూఢమి సమాప్తం. శుక్ర మూఢమి... చైత్ర బహుళ నవమి, ఆదివారం అనగా మే 1 నుంచి మూఢమి ప్రారంభం. ఆషాఢ శుక్ల అష్టమి, మంగళవారం అనగా జూలై 12న మూఢమి సమాస్తమవుతుంది. తిరిగి ఫాల్గుణ బహుళ అష్టమి, సోమవారం అనగా మార్చి(2017) 20 నుంచి మూఢమి ప్రారంభం. శ్రీహేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల చవితి శుక్రవారం అనగా మార్చి(2017) 31న ముగుస్తుంది. మకర సంక్రమణం... పుష్య బహుళ విదియ, శనివారం అనగా 2017 జనవరి 14న ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం మకరరాశిలో పగలు 12.48గంటలకు రవి ప్రవేశం. మకర సంక్రాంతి అయిన ఈరోజున దానధర్మాల వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం చేకూరతాయి. పుష్కరాలు... ఈ ఏడాది జూలై 31నుంచి గోదావరి నదికి అంత్య పుష్కరాలు ప్రారంభమై 12రోజుల పాటు జరుగుతాయి. ఈ 12రోజులు గోదావరిలో స్నానాదులు, దానధర్మాలు ఆచరించడం ఉత్తమం. అలాగే, శ్రావణ శు.అష్టమి తత్కాల నవమి గురువారం అనగా ఆగస్టు 11వ తేదీ రాత్రి ఉత్తర 2వ పాదం కన్యారాశిలో గురుని ప్రవేశంతో కృష్ణానది పుష్కరాలు ప్రారంభవుతాయి. గ్రహణాలు: ఈ సంవత్సరం మన ప్రాంతానికి కనిపించే గ్రహణములు లేవు. నుదుట తిలకాన్ని (బొట్టు, తిలకం) ఎందుకు ధరిస్తారు? తిలకం, బొట్టు అనేవి తిలకధారితో పాటు ఎదుటివ్యక్తికి పవిత్రభావాన్ని కలిగిస్తాయి. కులం, మతం. శాఖ లేదా భగవంతుడిని పూజించే విధానం ఆధారంగా తిలకధారణ రూపు, రంగుల్లో తేడాలుంటాయి. పూర్వంలో.... బొట్టును విభిన్న రూపాల్లో ధరించేవారు. విద్యాసంబంధమైన వృత్తిని అనుకరించేవారు పవిత్రతకు చిహ్నంగా చందనాన్ని, వీరత్వానికి చిహ్నంగా ఎర్రటి కుంకుమను, సంపద సృష్టికి ప్రతీకగా పసుపుబొట్టును, ఇక శూద్రుడు.. పైమూడింటిని ఆమోదిస్తూ నల్లటి భస్మం, కస్తూరి లేదా బొగ్గుపొడిని వర్ణాలవారీగా ధరించేవారు. వై ఆకారంలో ఉండే విధంగా వైష్ణవ భక్తులు చందనపు బొట్టును, శైవభక్తులు వీభూదిని (అడ్డంగా)మూడు రేఖలుగా (త్రిపుండ్రాలు) ధరిస్తారు. దేవీభక్తులైతే ..ఎర్రని కుంకుమను బొట్టు పెట్టుకుంటారు. జ్ఞాపకశక్తికి, ఆలోచనకు మూలస్థానమైన కనుబొమ్మల మధ్య భాగంలో తిలకాన్ని ధరిస్తారు. దీన్నే యోగభాషలో ఆజ్ఞా చక్రమంటారు.‘ పరమాత్ముడిని నేను స్మరిస్తుండాలి. నా కర్తవ్యం పూర్తయ్యేవరకు ఈ పవిత్రభావం నిలవాలి. నా ప్రవర్తన సక్రమంగా ఉండాలి’ ఈ ప్రార్థనతో తిలకధారణ చేయాలి. తప్పుడు విధానాలను, ఆలోచనలను నిలువరించడమే కాకుండా పరమాత్మ దీవెనగా తిలకం నిలుస్తుంది. ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాల ద్వారా శరీరం మొత్తానికి శక్తి పుడుతుంది. నుదురు, కనుబొమ్మల భ్రుకుటి ఈ తరంగాలకు మూలస్థానం. అందువల్లే ఎప్పుడైనా క్లేశం పుడితే తలనొప్పి కలుగుతుంది. నుదుటిని చల్లబరిచి మనల్ని తిలకం శాంతింపజేస్తుంది. శక్తి నష్టాన్ని నివారిస్తుంది. చందనాన్ని, భస్మాన్ని కొన్నిసార్లు నుదురు మొత్తాన్ని ఆవరించేలా ధరిస్తాం. అయితే, ప్లాస్టిక్ బొట్లు ఉపయోగించడం వల్ల కేవలం అలంకారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదు. -
దేశం సిగ్గుపడి, గర్వించింది!
దేడ్ కహానీ - నో వన్ కిల్డ్ జెస్సికా ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం... అనగనగా ఒక దేశం. సంస్కృతికి, సంప్రదాయానికి పెట్టింది పేరు. స్త్రీలను గౌరవించడంలో ప్రపంచంలోనే తలమానికం. సాక్షాత్తూ అమ్మవారి నుదుటి కుంకుమ ఆ దేశమేనని వేదాలు, పురాణాలు, కవితలు ఘోషిస్తాయి. ఆ దేశ రాజధాని మాత్రం ‘నిర్భయ’గా కామాంధులు రక్కసి కోరలు చాచి, అతివల మానభంగ భక్షణ చేసి, శిక్ష లేకుండా విడుదల కాగలిగిన విచ్చలవిడి నగరం. అయిదేళ్ల బాలికలైనా, అరవయ్యేళ్ల వృద్ధురాలైనా ఆ నగరంలో కాదేదీ మాన హరణకు అనర్హం అన్నట్టు ఉంటుంది. నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాల లాంటి నీచ రాజకీయ నాయకులంతా దండిగా ఒకే దగ్గిరుండి కాపు కాస్తుంటారు ఆ నగరంలో. ప్రపంచమంతా ధీర గంభీరంగా ఎదుగుతున్న ఆధునిక యువతి జీవితం... ఆ నగరంలో మాత్రం ఓ మందు గ్లాసు (బాటిల్ కూడా కాదు, గ్లాసే) విలువ కూడా చెయ్యదు. సరిగ్గా 1999లో అలాంటి సంఘటనే జరిగింది. జెస్సికాలాల్ అనే ఓ అందమైన, వర్ధమాన మోడల్... సినిమాల్లో హీరోయిన్గా అవకాశాల కోసం కలలు కంటూ, పార్ట్ టైమ్‌గా ఓ రెస్టారెంట్లో బార్ టెండర్‌గా పనిచేస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో. హర్యానాకి చెందిన బడా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడి కొడుకు మనుశర్మ అనేవాడు స్నేహితులతో కలిసి ఆ రెస్టారెంటుకొచ్చాడు పార్టీకి. 12 గంటల తర్వాత మద్యం అమ్మకూడదన్న నియమం వలన మనుశర్మకి జెస్సికాలాల్ మరో గ్లాసు మద్యం అమ్మడానికి నిరాకరించింది. మాటా మాటా పెరిగి, ఆవేశంగా రివాల్వర్ తీసి రెండు బుల్లెట్లతో జెస్సికాలాల్‌ని చంపేశాడు మనుశర్మ. అప్పటి హర్యానా ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని జెస్సికా అక్క పెట్టిన కేసులో సాక్ష్యాలన్నీ కొనేసి, తారుమారు చేసేసి ఆరు సంవత్సరాల కాలయాపన తర్వాత 2006లో జెస్సికా లాల్‌ని ఎవరూ చంపలేదని (?) మనుశర్మ నిర్దోషని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. యావత్ భారతావని ‘సిగ్గుపడింది’. కుంచించుకుపోయింది. కానీ ప్రభుత్వాలు, చట్టం ఇక్కడ మర్చిపోయిన విషయం ఒకటుంది. 1999 తర్వాత 2000 నుంచి మిలీనియమ్‌లో భారతీయ సమాజంలో యువతరం అంతకుముందులా లేరని, టెక్నికల్‌గా ఎదుగుతూ సంఘటిత చైతన్య శక్తిగా సామాజిక మాధ్యమాల్లో ఎదుగు తున్నారని. ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ ద్వారా అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చి దేశ భవితవ్యాన్ని నిర్ణయించే బలంగా మారుతున్నారని. జెస్సికాలాల్‌ని మనుశర్మ చంపాడని, ఆ కేసులో రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్లే దోషులు విడుదలయ్యారని ఎస్సెమ్మెస్‌ల ద్వారా జాతిని, మీడియాని మేలుకొలిపింది యువత. మీడియా సపోర్ట్‌తో సుప్రీంకోర్టుని, అప్పటి ప్రధాని, రాష్ట్రపతిని బలవంతంగా కదిలించింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం మూసేసిన కేసును తిరిగి తెరిచేలా, ప్రభుత్వం తలవంచి ఆ దుష్టుడి మెడ వంచేలా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేదాకా యువ భారతం కదం తొక్కింది. ఈసారి సాక్ష్యాలను పోలీస్ డిపార్టమెంట్ కాకుండా మీడియా సంపాదించింది. దోషులు ఖైదీలయ్యారు. దేశం ‘గర్వించింది’. ఇది జరిగిన కథ. ఇందులో సిగ్గుపడే ఫస్ట్ హాఫ్ అంతా మరణించిన జెస్సికాది, ఒంటరిగా పోరాడి ఓడిపోయిన ఆమె అక్కది. గర్వించిన సెకండ్ హాఫ్ అంతా మీడియా తరఫున ఒక జర్నలిస్టుది. చైతన్యవంతమైన యువ భారతావనిది. వాటన్నిటికీ చిత్రరూపమే... ‘నో వన్ కిల్డ్ జస్సికా’. 2006లో న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్డింగే ఈ సినిమా టైటిల్. అదే ఈ కథని రాసుకోవడానికి దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తాని ప్రేరేపించింది. మరణించిన జెస్సికాలాల్గా మైరా కర్ణ్ అనే అమ్మాయి నటిస్తే, ఆమె అక్క సబ్రినాలాల్గా విద్యాబాలన్ జీవించింది. దిగువ, మధ్యతరగతి అమ్మాయి తాలూకు అబలత్వాన్ని, నీరసాన్ని, గమ్యం లేని పోరాటాన్ని, బలహీనతల్ని, అణుచుకున్న ఆవేశాన్ని, నిస్సహాయతని అడుగడుగునా ప్రదర్శించేసింది విద్యాబాలన్. ఈ పాత్రకి పూర్తి విరుద్ధంగా ఆధునిక భారతదేశ వీర వనితగా, సబలగా, ఎదురు లేని జర్నలిస్టుగా మీరా గైటీ అనే పాత్రలో రాణీముఖర్జీ ఈ చిత్రం సెకండ్ హాఫ్‌కి ప్రాణం పోసింది. చాలా ఎలక్ట్రిఫయింగ్ నటన ఆమెది. అందుకే ఆ ఏటి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఒక సమస్యని ప్రతిబింబిస్తే... ఆ కథకుడో, దర్శకుడో దాని పరిష్కారాన్ని తమ మేథస్సుతో సూచించాలి. పరిష్కారం కూడా లభించని దేశ అత్యున్నత సమస్యని తీసేటప్పుడు కథకుడు, దర్శకుడు ప్రేక్షకుల ఆదరణ చూరగొనాలంటే చాలా జాగ్రత్తగా స్క్రిప్టు రాసుకోవాలి. అదే చేశాడు రాజ్‌కుమార్ గుప్తా. ఆ సమస్యని, పరిష్కారాన్ని తక్కువ చూపెట్టి, వాటి మధ్యనున్న పాత్రల డ్రామాని వస్తువుగా తీసుకున్నాడు. అందుకే తెలిసున్న కథే అయినా ప్రేక్షకులు 9 కోట్ల బడ్జెట్‌కి ఆరు రెట్లు కలిపి 58 కోట్ల వసూళ్లిచ్చారు నిర్మాత రోనీ స్క్రూవాలాకి. అమిత్ త్రివేది సంగీతం, అనయ్ గోస్వామి కెమెరా, ఆరతీ బజాజ్ ఎడిటింగ్ మూడూ ఒక వ్యక్తే చేసినంత సింక్‌లో ఉంటాయి ఈ సినిమాకి. అనురాగ్ కశ్యప్ దగ్గర బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్ అనే సినిమాలకి అసోసియేట్‌గా పనిచేసిన రాజ్‌కుమార్ గుప్తా దర్శకుడిగా నాలుగు సినిమాలు చేశాడు. కానీ ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ మాత్రమే ప్రేక్షకాదరణని చూరగొంది. ఆ దర్శకుడి ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసింది. విద్యాబాలన్‌ని, రాణీముఖర్జీ ఇండియా గేట్ దగ్గిర క్యాండిల్స్‌తో నివాళి అర్పించడానికి రమ్మనే సన్నివేశం నిజంగా నిస్తేజానికి, చైతన్యానికి మధ్య సంఘర్షణ. ఒక పక్క బాధ, మరో పక్క ఆవేశం రెండు పాత్రల ద్వారా, వాటి మధ్య మాటల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. టేకింగ్ పరంగా ఇవాళ్టి సమకాలీన దర్శకులంత బాగా సినిమా ఉండకపోయినా కంటెంట్ బలంగా ఉండటం వల్ల ప్రేక్షకుడు ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోడు. నిజంగా జరిగిన ఘటన కాబట్టి సహజంగానే చిత్రీకరించాడు. ఈ ఘోరానికి సమాజం పట్ల అసహ్యం వేసినా, మళ్లీ యువ సమాజం ఆ తప్పుని సరిదిద్దిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్తూ... నవ్య సమాజ నిర్మాణానికి నడుము బిగించి కదం తొక్కే ప్రతి యువతికి, యువకుడికి అభినందనపూర్వక నమస్సుమాలర్పిస్తూ... భారతీయ మహిళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికీ ఉందని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. -
అసలు సిసలు ప్రేయసీ!
టీవీ టైమ్ కుటుంబ కలహాలు, బాంధవ్యాల మధ్య విభేదాలు, ప్రేమ కోసం పోరాటాలు, పగలు ప్రతీకారాలు... ఏ సీరియల్ అయినా ఉండేవి ఇవే. కానీ వాటిని ఎంత డిఫరెంట్‌గా చూపించాం, ఎంత కొత్తగా అల్లుకున్నాం అన్నదాని మీదే సక్సెస్ ఆధారపడివుంటుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని తీసినట్టుగా ఉంటుంది ‘ఇది ఒక ప్రేమకథ’ సీరియల్. ఎన్ని ప్రేమకథలు చూడలేదు? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, అంతస్తుల భేదాల వల్ల వారి ప్రేమలో అవరోధాలు ఏర్పడటం, ఆ తర్వాత రకరకాల సమస్యలు... చాలా సీరియళ్లు ఇలా నడిచాయి. అయితే ‘ఇది ఒక ప్రేమకథ’లో మాత్రం పాత్రల చిత్రణ బాగుంది. హీరో సాఫ్ట్ నేచర్, హీరో తల్లిగా జ్యోతి అద్భుతమైన అభినయం, చక్కని సంభాషణలు కలగలసిన ధారావాహిక అది. ఉత్కంఠను రేకెత్తించే కథనం కూడా బలాన్ని చేకూరుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా హీరోయిన్ శ్రీవాణి తన పాత్రకి చక్కగా సరిపోయింది. పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయింది. స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే సున్నితత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ మార్కులు కొట్టేస్తోంది. అసలు ప్రేయసి అంటే ఇలానే ఉండాలి అనిపించేలా చేస్తోంది. అందుకే ఆ సీరియల్ సక్సెస్‌లో శ్రీవాణి భాగం కాస్త ఎక్కువే! -
వారఫలాలు (20-03-2016 / 26-03-2016)
20 మార్చి నుంచి 26 మార్చి, 2016 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ పరిచినా అవసరాలకు సొమ్ము అందు తుంది. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వాహన యోగం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహకారం అందుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల నుంచి మాట పడతారు. కష్టం మీది ఫలితం మరొకదిగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, పసుపు రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాబడి సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటా బయటా అనుకూలస్థితి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో పాటు భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. తెలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలు విదేశీ పర్యటనలు చేస్తారు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి నూతనోత్సాహం. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం. సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. అన్నింటా మీదే పైచేయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. బంధుమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగులకు శుభ వార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. బంధువులు, మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. కళారంగం వారికి సన్మానాలు, అవార్డులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌కు అర్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు అమలు చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు అనుకూల బదిలీలు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. నలుపు, నేరేడు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులకు శ్రీకారం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కుటుంబ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థుల కృషి ఫలించే సమయం. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యో గులకు కోరుకున్న మార్పులు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్య టనలు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం!
శిక్ష మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 37 ఆ హత్యకి కారణం వైవాహిక జీవిత వ్యవస్థ పుట్టాక కొన్ని కోట్ల సార్లు జరిగిన హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం! తన భార్య లూసీకి, తన ఫ్రెండ్ లేన్సింగ్‌తో గల సంబంధం గురించి హెన్రీకి తెలిసి నమ్మలేకపో యాడు. కానీ తను నియమించిన డిటెక్టివ్ ఋజువు సంపాదించి తెచ్చి చూపించాక నిర్ఘాంతపోయాడు. లేన్సింగ్ని చంపాలని నిర్ణ యించుకున్నాడు. లూసీ కోసం చంపు తున్నాడు కాబట్టి ఆమె కళ్ల ముందే అతణ్ని చంపదలచుకున్నాడు. తనని పోలీసులకి పట్టిస్తే తనమీద కన్నా లేన్సింగ్ మీదే ఆమెకి అధిక ప్రేమ ఉన్నట్లు లేదా తనని గాఢంగా ప్రేమిస్తున్నట్లు అని భావిం చాడు. తగిన అవకాశం కోసం ఓపికగా వేచి ఉన్నాడు.ఆ శనివారం రాత్రి తన ఇంటికి వచ్చిన లేన్సింగ్‌తో కలిసి ఎప్పటిలా హెన్రీ డ్రింక్ తీసుకున్నాడు. ఇద్దరూ పిట్ట గోడ దగ్గర నిలబడి ఉండగా హెన్రీ తన భార్యతో చెప్పాడు. ‘‘ఇటు చూడు లూసీ.’’ ఆమె తల తిప్పి చూడగానే లేన్సింగ్ రెండు కాళ్లూ పట్టుకుని ఎత్తి అతన్ని కింద పడేసాడు. ఏడో అంతస్థు నించి తలకిందు లుగా పడ్డ లేన్సింగ్ తల పగిలి పుర్రెలోని మెదడు కూడా బయటికి వచ్చేసింది. ఆడవాళ్లు ఎమోషనల్‌గా ప్రవర్తిస్తారు. ఆ ఎదురు చూడని దుర్ఘటనకి లూసీ సరిగ్గా అలాగే ప్రవర్తించింది. అయితే హెన్రీ పోలీసులు వచ్చేలోగా లూసీని తన అధీనంలోకి తీసుకోగలిగాడు. ‘‘లేన్సింగ్ తాగిన మత్తులో జారి కిందపడ్డాడని నేను పోలీసులతో చెప్తాను. నువ్వూ అదే చెప్పడం మంచిది. నువ్వు నిజం చెప్పినా అందుకు ఋజువు లేదు. ఋజువు లేని సాక్ష్యాన్ని కోర్టులో కొట్టే స్తారు. మనిద్దరి మీదా పత్రికల్లో అవా కులు, చెవాకులు రాస్తారు. వాటిలో ఒకటి లేన్సింగ్‌తో నీకు గల సంబంధం. ఆ ఋజువు కోర్టుకిస్తే, నాకు శిక్షపడే పక్షంలో నా ఆస్తిలోంచి నీకు పెన్నీ కూడా రాదు. కాబట్టి లేన్సింగ్ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడం నాకన్నా నీకే మంచిది. నేను అన్నిటికీ తెగించినవాణ్ని.’’ లూసీ పోలీసులు వచ్చేసరికి షాక్‌లోనే ఉంది. తన భర్త చెప్పిందే వారికి చెప్పింది. ఆమె మానసిక స్థితిని గమనించిన పోలీసులు కూడా లూసీని గుచ్చి గుచ్చి ప్రశ్నించలేదు. ‘‘లేన్సింగ్ డిప్రెస్డ్గా కనిపించాడు. ఒంటరిగా ఉండలేనని ఫోన్‌చేసి ఇంటికి వచ్చాడు. భోజనానికి మునుపు, తర్వాత చాలా తాగాడు. లాయర్‌గా లేన్సింగ్ ఆదాయం ఈ మధ్య బాగా తగ్గడం అందుకు కారణం’’ హెన్రీ పోలీసులకి చెప్పాడు. చివరగా లేన్సింగ్ టై పిట్టగోడ దగ్గరికి చేరుకున్నాక అతని కదలికల్ని గురించి కూడా చెప్పాడు. వాళ్లకి ఆ దంపతులు అబద్ధం ఆడుతున్నా రన్న అనుమానం కలగలేదు. లేన్సింగ్ ఆదాయం తగ్గిందన్న సంగతి వారి విచారణలో నిర్ధారణయ్యాక ఆ కేసుని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా మూసేసారు. తనకి వచ్చిన కేన్సర్.. మూలాల నించి తొలగిపోయిందని తెలిసిన రోగిలా ఆనందించాడు హెన్రీ. ‘‘లూసీ! లేన్సింగ్ చేసిన ద్రోహానికి అతన్ని నేను చంపాను. నేనిక ఎన్నటికీ వాడి మొహం చూడాల్సిన అవసరం లేదు’’ కొద్ది రోజుల తర్వాత హెన్రీ తన భార్యతో చెప్పాడు. ఆ హత్య జరిగాక మొదటిసారి లూసీ తన భర్త మొహం వంక కొద్దిసేపు దీర్ఘంగా చూసింది. ఆ మొహంలో పగ కాని, బాధ కాని, క్రోధం కాని, జాలి కాని... అసలెలాంటి భావాలు కనిపించలేదు. ‘‘ఏమిటా చూపు?’’ అడిగాడు. లూసీ జవాబు చెప్పలేదు. ఓ ప్రశ్న అడిగింది. ‘‘ఏం జరగనట్లే మానసిక క్షోభ లేకుండా జీవించగలరా? మీ ప్రియ మిత్రుడ్ని చంపాననే బాధ లేదా? మీరు శిక్షకి అర్హులని మీకు అనిపించడం లేదా?’’ ‘‘నా మీదకి దాడి చేసిన క్రూర మృగాన్ని చంపినట్లుగానే నీ ప్రియుడ్ని చంపాను. ఇది అతి పాత న్యాయం. కన్నుకి కన్ను. చేతికి చెయ్యి. శిక్ష దేనికి?’’ వారిద్దరి మధ్యా లేన్సింగ్ గురించి జరిగిన ఆఖరి సంభాషణ అది. హెన్రీ ఆమెకి ఇంకో ప్రియుడు లభించే అవకాశం కల్పించదలచుకోలేదు. తన భార్య పూర్తిగా తనకే దక్కాలనే స్వార్థంతో తన పన్నెండు మంది మగ మిత్రులకి దూరం అయ్యాడు. కాని ఆమె పెట్టెలో అడుగున వెదికి ఉంటే లూసీ లేన్సింగ్ని మర్చిపో లేకపోతోందని అతని ఫోటోని చూసి గ్రహించేవాడు. ఆఫీస్ పనిమీద హెన్రీ చికాగోకి కారులో బయదేరాడు. అకస్మాత్తుగా మంచు కురవసాగింది. కార్ రేడియోని ఆన్ చేస్తే మంచు తుఫాను అని తెలిసింది. ఇంకో అరగంటలో గమ్యానికి చేరతాడు కాబట్టి హెన్రీ కారుని మధ్యలో ఆపదలచు కోలేదు. కారుని జాగత్తగా, వేగం పరిమితి మించకుండా పోనివ్వసాగాడు. పొగ మంచు వల్ల రోడ్డు ఐదారు అడుగుల మేర దూరమే కనిపించసాగింది. పక్క రోడ్లోంచి వచ్చిన కలప లారీ డ్రైవర్‌కి హెన్రీ కారు కనపడలేదు. రెండు లైట్ల కాంతి హెన్రీ కంట్లో గుచ్చుకుంది. సరిగ్గా నాలుగైదు క్షణాల్లో అతని కారు ఆ పద హారు చక్రాల లారీ కిందికి వెళ్లిపోయింది. హెన్రీ మరణించలేదు. లూసీ హాస్పి టల్‌కి హెన్రీని చూడడానికి వచ్చినప్పుడు చెప్పింది. ‘‘డాక్టర్ ఇది అద్భుతం అని చెప్పాడు. మీ మొహానికి తప్ప శరీరంలోని ఇంకే భాగానికీ దెబ్బ తగల్లేదుట.’’ అతను ఆరు వారాలు హాస్పిటల్లోనే గడిపాడు. ఆరో వారం డాక్టర్ హెన్రీతో చెప్పాడు. ‘‘కట్లు విప్పాక తెలిసింది. మీ మొహం బాగా దెబ్బతింది. పిల్లలు చూస్తే జడుకునేలా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. కాని అది మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. మీరు వ్యక్తిగతంగా బిల్ చెల్లిస్తే ప్లాస్టిక్ సర్జన్ వచ్చి మిమ్మల్ని చూస్తాడు.’’ కట్లు విప్పిన అతని మొహాన్ని చూడ గానే లూసీ మొహం వివర్ణమైంది. ‘‘అంత భయంకరంగా ఉందా?’’ అడిగాడు. ‘‘అవును. మన ఇల్లు అమ్మయినా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి.’’ ‘‘ఇది నువ్వు కోరిన శిక్ష అనుకుంటు న్నావా? కాదు’’ చెప్పాడు. ఎనిమిది వారాల తర్వాత కట్లు విప్పారు. భర్తకి అద్దం ఇచ్చి చెప్పింది లూసీ... ‘‘చూసుకోండి.’’ అద్దంలోకి చూసిన హెన్రీ కెవ్వున అరిచాడు. ఎదురుగా లేన్సింగ్ ప్రతిబింబం కనిపించింది. ‘‘ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్‌కి ముందు మీ ఫోటో అడిగితే లేన్సింగ్ ఫోటోని ఇచ్చాను. ఇది మీ నేరానికి తగిన శిక్ష’’ లూసీ నెమ్మదిగా చెప్పింది. (మిరియం లించ్ కథకి స్వేచ్ఛానువాదం) -
శిలలే కళలుగా!
విహారం అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్ ‘గెలాక్సీ క్వెస్ట్’లో గ్రహాంతరవాసుల గ్రహం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రహాంతరవాసుల నివాసంగా భ్రమింప జేసిన ఆ ప్రదేశం నిజానికి కృత్రిమంగా సృష్టించింది కాదు. సినిమా కోసం వేసిన భారీ సెట్ కూడా కాదు. గ్రహం కాని ఆ గ్రహం భూమి మీదే ఉంది. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న ‘గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్’ను సందర్శిస్తే మనం వేరే గ్రహంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ స్టేట్ పార్క్‌లో హూడూ శిలలు ప్రధాన ఆకర్షణ. ‘టెంట్ రాక్’ పేరుతో కూడా పిలిచే ఈ శిలలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కనిపిస్తాయి. కోడి, రాణి కిరీటం, చిమ్నీ, పిరమిడ్, స్తంభాలు, దీపస్తంభం మొదలైన ఆకారాల్లో ఉండే ఈ ప్రాచీన శిలలు చూపరులను ఆకట్టుకుంటాయి. గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్‌లో వేలాది ‘హూడూ’లు ఉన్నాయి. వీటిని స్థానికంగా గోబ్లిన్ పేరుతో పిలుస్తారు. ఈ శిలల ఎత్తు... మనిషి ఎత్తు నుంచి పది అంతస్తుల భవంతి ఎత్తు వరకు ఉంటుంది. మన ఊహాశక్తి బలంగా ఉండాలేగానీ, ఒక్కో శిల ఒక్కో కథను మన మదిలో స్ఫురింపచేస్తుంది. పుట్టగొడుగు ఆకారంలో ఉన్న శిలలు ఎక్కువగా ఉండడం వల్ల ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘పుట్టగొడుగు లోయ’ అని పిలిచేవారట. ఈ ప్రాంతాన్ని తొలిసారిగా కొందరు పశువుల కాపరులు కనుగొన్నారట. తర్వాత 1964లో ఇది స్టేట్ పార్క్ హోదా పొందింది. సూర్యాస్తమయ సమయంలో ఈ శిలలపై ప్రతిఫలించే కాంతి కొత్త దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఇక నిండు వెన్నెల్లో ఈ శిలలను చూడడం మాటలకు అందని అనుభవం. ఈ అద్భుత అందాల వెనుక శాస్త్రీయ కారణాల మాట ఎలా ఉన్నా... ఆఫ్రికా జానపద కథల నేపథ్యంలో ఎన్నో వ్యాఖ్యానాలు వినిపిస్తాయి. ఆ కథల్లో వినిపించే ఔషధ కొండ ఇదేనని, ఇక్కడి మట్టిని తాకితే రోగాలు నయమయ్యేవని అంటారు. కొన్ని మౌఖిక జానపద కథల ప్రకారం... శాపవశాత్తూ రాతిశిలలుగా మారిన ఒక రాజ్యమే ఈ ప్రాంతం! ఈ అతిశయాల మాట ఎలా ఉన్నా... రకరకాల ఆకారాల్లో ఉన్న శిలలను అనుసంధానం చేస్తూ మనమే ఒక అందమైన కథ అల్లవచ్చు. ఆఫ్రికన్ కథల ప్రభావమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు గానీ...ఈ ప్రాంతంలో విహరించడం వల్ల స్వీయనియంత్రణ పెరుగుతుందని, ఈ ప్రాచీన శిలల మీద నుంచి వీచే గాలి ఔషధ గుణాలను కలిగి ఉందని... ఇంకా చెప్పాలంటే ఈ ప్రదేశంలో ‘మ్యాజిక్ పవర్స్’ దాగి ఉన్నాయనే విశ్వాసం ఉంది. అది ఎంత నిజమో తెలియదు గానీ...‘గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్’ను ఒక్క సారి చూస్తే చాలు భూగ్రహంలోనే కొత్త గ్రహాన్ని చూసిన అనుభూతి కలుగు తుంది! -
డిజిటల్ బాల్యం!
ఫేమస్ టూన్ ఒకప్పుడు... టీవీలు లేవు. సెల్ఫోన్లు లేవు. నెట్ కనెక్షన్ లేదు. ఫేసుబుక్కు లేదు. బోలెడంత తీరిక మాత్రం ఉంది. ఆ తీరిక తీరాలలో ‘బాల్యం’ వెన్నెల వెలుగులో వెండికొండలా వెలిగిపోయేది. ఆట, మాట, పాట... అన్నీ ఒక సామూహిక స్వరమయ్యాయి. ఈ సామూహిక ఆటలు, పాటలు చూడడానికి, వినడానికి వినోదప్రాయంగా కనిపించినా సారాంశంలో మాత్రం రేపటి పౌరులు నేర్చుకోవాల్సిన విలువలను నిశ్శబ్దంగా నేర్పాయి. ఆ తరువాత... టీవీలు వచ్చాయి. టీవీలు కలర్ టీవీలయ్యాయి. రకరకాల చానెళ్లు ఠీవిగా దూసుకొచ్చాయి. పిల్లలకు తీరిక ఉంది కానీ ఆ తీరికంతా టీవీల ముందుకొచ్చేసింది. అప్పట్లా ఆటలు లేవు. పాటలు లేవు. అట్టే మాటలు లేవు. టీవీ నవ్వితే నవ్వడం. టీవీ ఏడిస్తే ఏడ్వడం. ఆ తరువాత కంప్యూటర్లు వచ్చాయి. ఇంటింటికీ వచ్చాయి. ఆ కంప్యూటర్లలోకి గేమ్స్ వచ్చాయి. అసలు సిసలు గేమ్స్‌కు బాల్యాన్ని దూరం చేశాయి. ఎవరికి వారు ఒంటరి దీవికి మాత్రమే పరిమితమయ్యేలా చేశాయి. అలాంటి డిజిటల్ బాల్యాన్ని వెనిజులా కార్టూనిస్ట్ రేమా ఎంత బాగా చెప్పారో చూడండి! - పాషా -
ఫ్రెంచ్ ఫ్రైస్... మీరు చేయలేరా?!
సాయంత్రం పూట మంచి సినిమా చూస్తూ, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ, కోక్ చప్పరిస్తుంటే వచ్చే మజాయే వేరు. కాకపోతే ఫ్రైస్ కావాలంటే రెస్టారెంటుకు ఆర్డరివ్వాలి. లేదంటే మనమే వెళ్లి తెచ్చుకోవాలి. ఏం మనం చేసుకోలేమా? చేసుకోవచ్చు. కానీ బంగాళాదుంపల్ని కట్ చేయడం తలచుకుంటే వాటిని తినాలన్న ఆశ చచ్చిపోతుంది. ఎందుకంటే అన్నిటినీ సమానంగా కట్ చేసుకోవడం అంత చిన్న విషయమేమీ కాదు. అలా కట్ చేయకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగోవు. అందుకే వాటిని చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటారు అందరూ. ఆ ఇబ్బందిని తీర్చడానికి వచ్చిందే ఈ ‘ఫ్రెంచ్ ఫ్రై కట్టర్’. బంగాళాదుంపను చెక్కు తీసి, దీనిలో పెట్టి, స్టేప్లర్ని నొక్కినట్టు ఒక్క నొక్కు నొక్కితే చాలు... క్షణంలో క్షణంలో పొడవాటి ముక్కలు రెడీ. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెల కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. రూ. 500 లోపే! -
పదును పెట్టాలా?!
రోజువారీ పనుల్లో చాకు చాలా అవసరం. కూరగాయలు కోయాలన్నా, పండ్లను ముక్కలు చేయాలన్నా చాకే మన ఆయుధం. అయితే అది కసకసా తెగాలి. లేదంటే మన సమయమంతా వృథానే. కానీ కొన్నాళ్లు వాడాక ప్రతి చాకూ మొద్దుబారిపోతుంది. అప్పుడేం చేస్తారు? పారేసి కొత్తది కొనుక్కుంటారా? అయితే మీరు డబ్బును వృథా చేస్తున్నట్టే లెక్క. దీన్ని చూడండి... ‘నైఫ్ షార్ప్‌నర్’ అంటారు దీన్ని. ఇది ఇంట్లో ఉంటే చాకులు పారేయాల్సిన పని లేదు. మొద్దుబారిన చాకును ఈ షార్ప్‌నర్ మీద పెట్టి కాసేపు రుద్దితే చాలు... బాగా పదునెక్కుతుంది. ఆ తర్వాత మీరు దాన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా పదును పెట్టుకోవచ్చు. కాబట్టి అస్తమానం కొత్త చాకులు కొనే బదులు ఒకే ఒక్కసారి దీన్ని కొనుక్కోండి. దీని వెల 150/- రూపాయలు. ఆన్లైన్లో అయితే 124/- రూపాయలకి కూడా వచ్చేస్తోంది. -
గ్రేట్ లవ్‌స్టోరీస్
‘హౌ స్వీట్ ఇటీజ్ టు లవ్ సమ్‌వన్’ బెస్మెర్(యు.ఎస్)కు చెందిన ప్రముఖ గాయకుడు పి.జె. స్పారగిన్స్ గొంతులో ప్రేమ పాట తీయగా వినిపిస్తోంది. కొత్తగా వినిపిస్తోంది. గొప్పగా వినిపిస్తోంది. చాలామంది పి.జె అభిమానుల్లాగే ఆ స్వరమాధురిలోని ఆహ్లాదాన్ని ఆస్వాదించింది ట్రేసీ. ట్రేసీకి పాటలంటే ఇష్టం. పాటలను స్పారగిన్స్ గొంతు నుంచి వినడం అంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టమే అతడికి దగ్గర చేసింది. వారిని ప్రేమికుల్ని చేసింది. ఆపైన దంపతులనూ చేసింది. స్పారగిన్స్లో ట్రేసీకి అమితంగా నచ్చేది ఏమిటంటే... ఆమె మానసిక స్థితికి తగినట్లు పాటలు పాడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే... తన పాటలతో ట్రేసీని ఎప్పుడూ జోష్‌లో ఉంచేవాడు. అంతలో ట్రేసీ చెల్లి కిడ్నీ సమస్యతో బాధపడుతూ చనిపోయింది. ఆ విషాదాన్ని తట్టుకోలేక విషాదపు చీకట్లోకి వెళ్లిపోయింది ట్రేసీ. అది స్పారగిన్సని చాలా బాధించింది. ఆమె నవ్వకపోతే అతడు తట్టుకోలేడు. అందుకే ఆమెకు ఎన్నో విధాల ధైర్యం చెప్పేవాడు. పాటలతో ఆహ్లాదపరిచేవాడు. ‘ఆస్తులు... అంతస్తులు... పదవులు... హోదాలు... జీవితంలో ఏదైనా మరిచిపో... కాని నవ్వడం మాత్రం మరిచిపోకు’ అని చెప్పేవాడు. భర్త మాటలతో మళ్లీ ఆనందపు వెలుగుల్లోకి వచ్చింది ట్రేసీ. ఎప్పట్లానే మనసారా నవ్వసాగింది. కానీ నవ్వులను చూసి విధికి కన్నుకట్టిందేమో.. మరోసారి కన్నీటిని వాళ్ల జీవితాల్లో కుమ్మరించింది. ట్రేసీని అనారోగ్యం చుట్టుముట్టింది. లుపస్ వ్యాధితో బాధపడుతోన్న ఆమెకు కిడ్నీ మార్పిడి చేయడం అత్యవసరం, లేకపోతే బతకదు’ అని హెచ్చరించారు వైద్యులు. ఎప్పుడూ ధైర్యం చెప్పే స్పారగిన్స్ ఈసారి తానే ధైర్యాన్ని కోల్పో యాడు. అతడి మనసు దుఃఖనదిగా మారింది. స్నేహితులు ఓదార్చి ధైర్యం చెప్పారు. గుండె నిబ్బరం చేసుకుని ట్రేసీని బతికించుకునే పనిలో పడ్డాడు. కానీ దురదృష్టం మరోసారి వెక్కిరించింది. ట్రేసీకి మ్యాచ్ అయ్యే కిడ్నీ ఎక్కడా దొరకలేదు. దాంతో తన కిడ్నీని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు స్పారగిన్స్. అయితే ‘పర్ఫెక్ట్ మ్యాచ్’ అని మొదట చెప్పినప్పటికీ హై బీపీ కారణంగా స్పారగిన్స్ తన కిడ్నీని ఇవ్వడం కుదరదని చెప్పారు వైద్యులు. బరువు తగ్గితే ఫలితం ఉంటుందని సలహా ఇచ్చారు. దాంతో బరువు తగ్గే ప్రయత్నాలు మొదలెట్టాడు. అందుకోసం నానా తంటాలు పడ్డాడు. ఎలాగైతేనేం... ముప్ఫై కిలోల వరకు బరువు తగ్గాడు.స్పారగిన్స ప్రయత్నం ఊరికే పోలేదు. డాక్టర్లు ఆపరేషన్‌కి ఓకే అన్నారు. నాలుగు గంటల పాటు జరిగిన ఆపరేషన్ విజయవంతం అయింది. బిర్మింగ్‌హామ్ ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు ఆస్పత్రి సిబ్బంది ఈ దంపతులకు ఈస్టర్ కానుక ఇచ్చారు. ఆ కానుకలో రెండు హృదయాలు కనిపిస్తాయి. అవి ప్రేమలోని గొప్పదనాన్ని చాటి చెప్పుతున్నట్లుగా కనిపిస్తాయి. అసలైన ప్రేమకు స్పారగిన్స, ట్రేసీలే నిలువెత్తు ఉదాహరణ అని నిర్ధారిస్తున్నట్టుగా అనిపిస్తాయి. -
గుండె గుప్పెండంత ఊహ ఉప్పెనంత...
సినిమా వెనుక స్టోరీ - 38 ఆ హాల్లో నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు విజయభాస్కర్ మొదలుకొని ఆఫీసుబాయ్ దాకా పది, పదిహేను మంది ఉన్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్‌తో సహా కథ చెబుతున్నాడు. కొందరు ముసి ముసిగా నవ్వుతుంటే, ఇంకొందరు పగలబడి నవ్వుతున్నారు. ఈ రియాక్షన్స్ అన్నీ రవికిశోర్ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ‘శుభం’ అంటూ త్రివిక్రమ్ స్క్రిప్టు మూసేశాడు. అక్కడున్నవాళ్లంతా త్రివి క్రమ్కి కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్ భాస్కర్ - త్రివిక్రమ్ ఇద్దర్నీ రవికిశోర్ హగ్ చేసుకున్నారు. ఆ హగ్‌లోనే తెలిసి పోయింది... కథ ఎంత బాగా నచ్చేసిందో! ‘నువ్వేకావాలి’ ఉషాకిరణ్ మూవీస్ బ్యానలో రూపొందినా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మేకింగ్ అంతా చూసు కున్నది రవికిశోరే. ‘నువ్వే కావాలి’ ఎండింగ్లో ఉండగానే విజయ్‌భాస్కర్, త్రివిక్రమ్లిద్దరికీ అడ్వాన్స్ ఇచ్చేసి ‘‘నెక్స్ట్ సినిమా కూడా మనం కలిసి చేస్తున్నాం’’ అనేశారాయన. వాళ్లిద్దరూ ఆయనకు అంత బాగా కనెక్టయిపోయారు. వాళ్లతో పని చేస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోంది. ఇలాంటి ఫీలింగ్ అతి కొద్దిమంది దగ్గరే కలుగు తుంది. ‘నువ్వే కావాలి’ రిజల్ట్ ఎలా ఉన్నా సరే, వాళ్లిద్దరితో కలిసి పనిచేయాలని రవి కిశోర్ డిసైడయ్యారు. అలాగని ‘నువ్వే కావాలి’ మీద డౌట్లు లేవాయనకు! ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ నమ్మకమే నిజమైంది. ‘నువ్వే కావాలి’ ఇండస్ట్రీని ఊపేసింది. ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే ముగ్గురూ నెక్స్ట్ సినిమా పనిలో పడ్డారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో శ్రీనివాస్ అపార్ట్మెంట్. థర్డ్ ఫ్లోర్లో శ్రీ స్రవంతీ మూవీస్ ఆఫీస్. అక్కడ రెండు నెలలు కూర్చుని త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు రెడీ చేసేశాడు. దాన్ని మెయిన్ టీమ్ అందరికీ వినిపిస్తే హండ్రెడ్ మార్క్స్ వేసేశారు. ఎప్పుడో దర్శకుడు కేవీరెడ్డి గారి టైమ్‌లో ఇలా టీమ్ అందరికీ స్క్రిప్టు వినిపించేవారట. రవికిశోర్‌కు కూడా ఆ పద్ధతి ఇష్టం. ఆయన ఎంత హ్యాపీ అంటే బ్రీఫ్ కేస్‌లో చెక్కు బుక్కులన్నీ తీసేసి, ఈ స్క్రిప్టే పెట్టుకుని తిరుగుతున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా తనివి తీరా చదువు కుంటున్నారు. కథ మొత్తం కంఠస్థం వచ్చేసింది. ఏ హీరోతో అయినా చేయడానికి రెడీ. కానీ ఈ కథ ఎవరికో రాసిపెట్టే ఉండుంటుంది. అవును... రాసి పెట్టి ఉంది... వెంకటేశ్‌కి! రవికిశోర్‌కి నిర్మాత డి.సురేశ్‌బాబు చాలా క్లోజ్. అక్కడ్నుంచి ప్రపోజల్. ‘‘విజయ్‌భాస్కర్ - త్రివి క్రమ్లతో చేయడానికి మా వెంకటేశ్ రెడీ! మీకు ఓకేనా?’’ అంత పెద్ద హీరో పిలిచి డేట్లు ఇస్తానంటే, ఎవరు మాత్రం కాదంటారు? రవికిశోర్‌కు బ్రహ్మాండంగా ఓకే త్రివిక్రమ్ కథ చెప్పాడు. వెంకటేశ్ ఫ్లాట్! ‘‘వాట్ ఎ లవ్ లీ క్యారెక్టైరె జేషన్’’ అనుకున్నాడు. కానీ వెంకటేశ్కో డౌట్! సెకండాఫ్ మొత్తం ఓ ఇంట్లోనే నడిచి పోతోంది. ఆడియన్స్‌కి కొంచెం రిలీఫ్ కావాలి కదా! అవును నిజమే! గుడ్ సజెషన్. ఎంతైనా సీనియర్ సీనియరే! ‘మిస్టర్ బీన్’ ఇన్స్పిరేషన్తో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి, అతణ్ణి హీరో హీరోయిన్లకు తారసపడేలా చేస్తే...? త్రివిక్రమ్ అదే చేశాడు. బ్రహ్మానందం లాంటోడు ఈ క్యారెక్టర్ చేస్తేనా...? లాంటోడేంటి? బ్రహ్మానందమే చేస్తాడు. చేయాలి కూడా! ఓకే అన్నాడు కూడా! క్యారెక్టర్స్ అన్నిటికీ స్టార్స్ ఫిక్స్డ్. కేవలం టూ క్యారెక్టర్స్ బ్యాలెన్స్. ఒకటి - హీరోయిన్ పాత్ర. రెండోది - హీరోయిన్ ఫాదర్ పాత్ర. ప్రొడ్యూసర్, డెరైక్టర్లిద్దరికీ ఒకటే చాయిస్... ప్రకాశ్‌రాజ్! అతనైతే హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ ప్రకాశ్‌రాజ్ ఆ టైమ్‌లో ఫుల్ బిజీ. దానికి తోడు ఫుల్ ట్రబుల్స్‌లో కూడా ఉన్నాడు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ వాళ్లు అతని మీద బ్యాన్ పెట్టారు. ప్రకాశ్‌రాజ్‌ను తెలుగు సినిమాల్లో పెట్టుకోవడానికి వీల్లేదు. రవికిశోర్‌కి కోపం వచ్చింది. ‘‘నా క్యారెక్టర్‌కి అతనే కావాలి. నేను అతణ్ణే పెట్టుకుంటాను.’’ పరిస్థితి కొంచెం హాట్ హాట్‌గానే ఉంది. నాజర్, రఘువరన్ లాంటి వాళ్లతో ఈ పాత్ర చేయించేయొచ్చు. కానీ, ప్రకాశ్‌రాజ్ అయితేనే ఆ డెప్త్ వస్తుంది. అందుకే ఓ పని చేస్తే? ప్రకాశ్‌రాజ్ సీన్స్ అన్నీ పెండింగ్‌లో పెట్టి, మిగతా వెర్షన్ కంప్లీట్ చేసేస్తే? బాగానే ఉంది కానీ, హీరోయిన్ తేలడం లేదు. త్రిష... ఇంకెవరో... ఎవరో... చాలా ఆప్షన్స్. కానీ ఫ్రెష్ ఫేస్ అయితే నే బాగుంటుంది. విజయభాస్కర్ ముంబై వెళ్లాడు. మోడల్ కో-ఆర్డినేటర్స్ దగ్గర చాలామంది అమ్మాయిల స్టిల్స్ చూశాడు. వాళ్లల్లో ఒకమ్మాయి నచ్చేసింది. ‘పాగల్పన్’ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. పేరు - ఆర్తీ అగర్వాల్. కానీ ఇప్పుడు న్యూయార్క్‌లో ఉంది. నో కాంటాక్ట్. మామూలుగా అయితే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసేవారు. కానీ, ఆ పాత్ర ఆమెకే రాసిపెట్టినట్టుంది. అందుకే న్యూయార్క్‌లో ఆమె గురించి వేట మొదలైంది. సురేశ్‌బాబు ఫ్రెండొకరు న్యూయార్క్‌లోనే ఉంటారు. ఆయన ద్వారా ట్రై చేస్తే దొరికేసింది. ఆర్తి వచ్చీ రావడంతోనే షూటింగ్ స్టార్ట్. సినిమా మొత్తం దాదాపు హీరోయిన్ ఇంట్లోనే! అందుకే నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డెరైక్టర్ పేకేటి రంగాతో హౌస్‌సెట్ వేయించేశారు. 60 లక్షల ఖర్చు. సీన్లు.. సాంగ్స్.. షూటింగ్ చకచకా సాగిపోతోంది. అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. న్యూజిలాండ్‌లో రెండు పాటలు తీయాలి. అదీ నెక్స్ట్ షెడ్యూల్లో! ఈలోగా అక్కడ నుంచి ఫోన్! ‘‘సీజన్లో చేంజ్ ఉంది. మీరొచ్చే టైమ్‌కి గ్రీనరీ ఉండదు. వస్తే ఇప్పుడే రావాలి’’. ఇక్కడేమో 10 - 15 మంది ఆర్టిస్టులతో షూటింగ్ జరుగుతోంది. ఇది అర్ధంతరంగా వదిలేసి, న్యూజిలాండ్ వెళ్తే మళ్లీ డేట్లు దొరకడం కష్టం. రవికిశోర్ ఒకటే అన్నారు. ‘‘మనుషుల డేట్లు ఎలాగైనా తీసుకోవచ్చు. ప్రకృతి డేట్లు మన చేతిలో ఉండవు.’’ షెడ్యూల్ ఆపేసి మరీ న్యూజిలాండ్ వెళ్లారు! ఫ్లయిట్లో ఆ రెండు పాటలూ వింటూనే ఉంది ఆర్తి. తెలుగు అస్సలు రాకపోయినా వినీ వినీ బట్టీ వచ్చేశాయామెకు! న్యూజిలాండ్‌లో దిగగానే ఆ పాటలు పాడేయడం కూడా మొదలుపెట్టింది. తీరా అక్కడికి వెళ్లాక వెంకటేశ్‌కి ఫుల్ ఫీవర్. ఆ ఫీవర్‌తోనే షూటింగ్ చేసేశాడు. న్యూజిలాండ్ నుంచి సరాసరి చెన్నైలో ల్యాండింగ్. అక్కడ ‘ఎం.జి.ఎం. అమ్యూజ్మెంట్ పార్క్’లో షూటింగ్. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, బ్రహ్మానందం, ‘కళ్లు’ చిదంబరం, బేబీ పింకీలపై కామెడీ సీన్స్. అక్కడి నుంచి మళ్లీ ఊటీ. త్రివిక్రమ్ స్క్రిప్ట్ మహాత్మ్యమో, రవికిశోర్ ప్లానింగ్ చిత్రమో, విజయ భాస్కర్ దర్శక చాతుర్యమో కానీ షూటింగ్ చాలా స్మూత్‌గా జరిగిపోతోంది. ‘పిక్నిక్’ అనేమాట అందరూ వాడేస్తుం టారు. కానీ, ఇక్కడ మాత్రం అది నిజం. 64 రోజులు 64 క్షణాల్లా గడిచిపోయాయి. ప్రకాశ్‌రాజ్ రిలేటెడ్ సీన్స్ ఒక్కటే బ్యాలెన్స్. వీళ్లకు అదృష్టం కలిసొచ్చింది. ఇక్కడ పరిణామా లన్నీ మారిపోయాయి. మునుపటి హీట్ లేదు. ప్రకాశ్‌రాజ్ నిరాహారదీక్షకు దిగడంతో అన్ని సమస్యలూ కొలిక్కి వచ్చేశాయి. ఆయనపై బ్యాన్ కూడా తీసే శారు. ఆ న్యూస్ వచ్చిన మరుక్షణం ప్రకాశ్ రాజ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సెట్లో ఉన్నాడు. కంటిన్యుయస్‌గా 17 రోజులు వర్క్ చేశాడు. హమ్మయ్యా... సినిమాకు గుమ్మడికాయ కొట్టేయొచ్చు! ఇప్పుడు అసలు పనంతా మ్యూజిక్ డెరైక్టర్ కోటి చేతిలో ఉంది. బ్రహ్మాండంగా రీ-రికార్డింగ్ చేయాలి. ఇదే టార్గెట్. నో టైమ్ లిమిట్. ట్వంటీ సిక్స్ డేస్ తర్వాత... రవి కిశోర్, విజయ్‌భాస్కర్ ఫైనల్ అవుట్‌పుట్ చూశారు. కొన్ని ఎపిసోడ్స్‌లో రీ-రికార్డింగ్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. రవికిశోర్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. కోటికి అర్థమైపోయింది. మళ్లీ రికార్డింగ్ థియే టర్లో కూర్చున్నాడు. స్మాల్ చేంజెస్. 99కి 100కి ఒక్కటే కదా తేడా! అదిప్పుడు ఫుల్ ఫిల్ అయిపోయింది. రవికిశోర్ ఈసారి చూసి కోటిని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆ హగ్‌లోనే రిజల్ట్ తెలిసిపోయింది. 2001 సెప్టెంబర్ 6... 3 గంటల 12 నిమిషాలు ఓపిక పడితే తప్ప రిజల్ట్ తెలియదు. అవును... ఈ సినిమా నిడివి అంతే! బయటికొచ్చిన వాళ్లంతా ‘‘సినిమా బాగుంది కానీ, లెంగ్త్ ఎక్కువైపోయింది’’ అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కంగారు పడిపోతున్నారు. రవికిశోర్ మాత్రం చాలా తాపీగా ఉన్నారు. ఆయనకు ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి భరోసా. ఆ టైమ్‌లో వెంకటేశ్కిది డిఫరెంట్ అటెంప్ట్. దానికి తోడు సినిమాలో నో ఫైట్స్. ఫ్యాన్స్‌లో కొంత డైలమా ఉంటుంది. నాలుగు రోజులు ఆగితే అంతా సెట్ అయిపో తుంది. అవతలేమో పెద్దపెద్దవాళ్లు కూడా ఫోన్లు చేసి, అరగంట సినిమా ఎడిట్ చేసేయమంటున్నారు. ముఖ్యంగా సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమంటున్నారు. రవికిశోర్ మాత్ర ం మొండిగా ఉన్నారు. ఒక్క షాట్ కూడా తీసేది లేదు. ఈ సినిమా సూపర్‌హిట్... అంతే. ఎస్... వన్ వీక్ తర్వాత రిజల్ట్ అదే! అందరూ ఈ సినిమాను ‘నువ్వు నాకు నచ్చావ్’ అనడం మొదలుపెట్టారు. ‘స్రవంతి’ రవికిశోర్ టేబుల్ మీద ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు ఎప్పుడూ ఉంటుంది. అదో ఇన్స్పిరేషన్ ఆయనకు! జాబ్ శాటిస్ఫేక్షన్ ... జేబు శాటిస్ఫేక్షన్ కలగాలంటే స్క్రిప్టే పరమావధి అనే విషయం ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది! వెరీ ఇంట్రస్టింగ్ ⇒వెంకటేశ్ పారితోషికం మినహాయిస్తే, ఈ సినిమాకైన బడ్జెట్ నాలుగున్నర కోట్ల రూపాయలు. ⇒ఈ సినిమాకు ఆర్తీ అగర్వాల్ పారితోషికం పది లక్షలు. ⇒తమిళంలో ఈ చిత్రాన్ని విజయ్‌తో రీమేక్ చేశారు. యావరేజ్. కన్నడంలో మాత్రం హిట్. ⇒‘ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని...’ పాట కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 60 పల్లవులు రాశారు. ఫైనల్‌గా ఫస్ట్ రాసిన పల్లవి ఓకే అయ్యింది. - పులగం చిన్నారాయణ -
దేవుని నిస్వార్థ ప్రేమకు సంకేతం
సిలువ మరణం మార్చి 25 గుడ్ ఫ్రైడే సందర్భంగా... ప్రతి సంవత్సరం ప్రపంచ క్రైస్తవులందరు, క్రీస్తు సిలువలో తన ప్రాణమర్పించిన దినాన్ని ‘గుడ్‌ఫ్రైడే’ (శుభ శుక్రవారం)గా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. ఈ సదాచారం మానవాళి పాప శాప పరిహారం నిమిత్తం ఆ దైవం జరిగించిన సంపూర్ణ రక్షణ కార్యంగా పరిగణించడానికే. ఈ ప్రపంచ చరిత్రలో ఎందరో మహనీయులు ఎన్నో ఉత్తమ కారణాల నిమిత్తం తమ ప్రాణాలర్పిం చారు. వారు కొంత కాలానికి, ఒక ప్రాంతానికి, జాతికి, మతానికి మాత్రమే పరిమితమయ్యారు. క్రీస్తు సిలువ మరణం రెండువేల సంవత్సరాలకు పూర్వం జరిగినప్పటికీ నేటికీ విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని కలిగివుంది. చరిత్రలో ఒక వ్యక్తి మరణం ఈ ప్రపం చాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రభావవంతం చేయగలగటం అనేది క్రీస్తు విషయంలోనే జరిగిందేమో. సిలువ మరణం అత్యంత అవమానకరమైన క్రూరమైన అమానవీయ మైన, కఠినమైన హింసాయుత శిక్ష. అయితే పరిశుద్ధుడు, దైవసుతుడైన యేసుక్రీస్తు ఆనాడు ఇంత క్రూర శిక్షను ఎందుకు భరించాల్సి వచ్చింది? క్రీస్తు సిలువ మరణం మానవ సమాజానికి సాధించిన పరిహారం ప్రాయశ్చిత్తం ఎలాంటివి? క్రీస్తు సిలువ మరణం ఈ ప్రపంచానికి వెల్లడి చేసిన సందేశం ఏమిటి? మానవాళికి చూపిన మార్గం ఏమిటి? సిలువ దేనికి సంకేతంగా, స్ఫూర్తిగా నిలిచింది? అన్న విషయాలు మనం అవగతం చేసుకోవాలి. సిలువలో క్రీస్తు మరణం మనకు ప్రత్యక్షపరచే ఆధ్యాత్మిక, సాంఘిక సత్యాలు, అంశాలు ఏమిటి అని చూస్తే... ప్రేమ, న్యాయం మూర్తీభవించిన ఘట్టం మానవాళి పట్ల దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచారు? దేవుడు తన న్యాయాన్ని ఎలా అమలుపరచారు? అనే విషయాలపై పౌలు అను భక్తుడు ఏం అన్నాడంటే... ‘‘మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపో యెను’’ (రోమా 5:8). ‘‘మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చి త్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ యున్నది’’ (1యోహా 4:10). క్రీస్తు సిలువ మరణం గొఱ్ఱెలవలె దారి తప్పిన మానవాళి యెడల దేవునికున్న ప్రేమ వెల్లడి చేస్తుంది. అదే సమయంలో సిలువ దైవ న్యాయమును సూచిస్తుంది. మరణ శాసన మెక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసినవాని మరణం అవశ్యం. ఆలాగే క్రీస్తు కూడా అనేకుల పాపాన్ని భరించడానికి తనను తాను అర్పించు కున్నాడు. మన పాపాలకు శిక్షగా మనకు బదులుగా ఆయన సిలువలో శిక్ష అనుభ వించాడు. క్రీస్తు సిలువ మరణం పాపం యొక్క భయంకరత్వాన్ని సూచిస్తుంది. సిలువ అంటే శ్రమకు సూచన. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువు చెప్పారు. సద్భక్తితో బ్రతకనుద్దేశించే ప్రతి ఒక్కరూ శ్రమను ఎదుర్కొనక తప్పదు. క్రైస్తవ విశ్వాస దృక్పథంలో శ్రమ ఒక భవిష్య మహిమను కలిగినది. శ్రమలకు సహనం ఓ ఆయుధం. కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమ పడటమే మంచిది. క్రైస్తవ విశ్వాస సమాజం సిలువ శ్రమల్లో నుండి అంకురించింది. శ్రమల యందే క్రైస్తవ సంఘం వర్ధిల్లింది, విస్తరించింది. జీవితంలో సిలువను మోస్తే కిరీటం ధరిస్తాం. శ్రమలు మనల్ని అంతమొం దించటానికి కాదు. అవి నిత్య మహిమకు సోపానాలు. సిలువ మరణం క్రీస్తు అంతం కాదు. అక్కడనుండే ఆయన మహిమ ఈ లోకానికి ప్రత్యక్షమైనది. క్రీస్తు సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టూ ఈ లోకంలో ప్రతి పాపినీ కడిగి శుద్ధి చేసింది. సిలువ మానవ సంబంధాల సంధి పాపం మానవుణ్ని దేవునికి దూరం చేసింది. అలాగే తోటి మానవుల మధ్య సంబంధాల విఘాతాన్ని, అగాథాన్ని సృష్టించింది. అలా విచ్ఛిన్నమైన దైవ మానవ సంబంధాలు క్రీస్తు సిలువ మరణం ద్వారా బలపడ్డాయి. మనం దేవుణ్ని తండ్రి అని పిలువగలుగు తున్నాం. ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి చేరగలుగుతున్నాం. ఇక ఏ మధ్య వర్తిత్వం అవసరం లేదు. ఏ సిఫారసూ అక్కర్లేదు. సిలువ దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న పాపమనే శాపాన్ని తొలగించి, దేవునితో మానవునికి సత్సంబంధాన్ని ఏర్పరచింది. మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది. అంతరాలు లేని అసమానతలు లేని అస్పష్టత లేని సమాజం... క్రీస్తు సిలువ సమాజం. నిస్వార్థ సేవకు స్ఫూర్తి ప్రతి సేవ ప్రతిఫలాన్నీ పారితోషికాన్నీ అపేక్షించి చేసేదే. కాని క్రీస్తు తన జీవిత సూత్రాన్ని ఆరంభంలోనే స్పష్టపరిచారు. ‘‘మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెననెను’’ (మార్కు 10:45). సిలువ ఒక ఉగ్ర సమాజానికి స్ఫూర్తి కాదు. సిలువ ఎప్పటికీ ఓ నిస్వార్థ, ప్రేమపూరిత, కరుణాసహిత, త్యాగ పూరిత సేవకు బలమైన స్ఫూర్తిగా నిలిచింది. మదర్ థెరిస్సా వంటి సమాజ సేవకులకు స్ఫూర్తిగా నిలిచింది. స్వార్థం ద్వేషం దోపిడీ గల ప్రపంచంలో సిలువ మనిషికి శాంతిని కలిగించింది. అన్ని కాలాల్లోనూ మనుషులకు ఓ బాటను చూపించింది. క్రీస్తు సిలువ భావం, ప్రభావం మన జీవిత ఆచరణలో భాగమై సాగాలి. ఆయన త్యాగంలో వివాదం లేదు. మానవాళి రక్షణయే ఆయన ధ్యేయం. ఎందరు నిందలు మోపినా, ఎన్ని అవమానాలు పెట్టినా, కొరడాలతో కొట్టినా, సిలువకు మేకులతో కొట్టి ఆయన దేహాన్ని వేలాడదీసి అతి కిరాతకంగా చంపినా ఆయన స్వరం ఒక్కటే. ‘‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము’’. అంటే ఆయన సందేశం ఒక్కటే... క్షమాపణ. ఇది ఎక్కడా కనిపించని వినిపించని దైవ త్యాగం, స్వరం, సందేశం. అందుకే సిలువ మరణం క్రీస్తు పరాజయం కాదు, మానవ పాప పరిహారార్థమై ప్రభువు సాధించిన ఘన విజయం. మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి అందరినీ ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది. - రెవ॥పెయ్యాల ఐజక్ వరప్రసాద్ -
ఈ విజయుడు ఆపద్బాంధవుడు!
ఆదర్శం కొన్ని విషాదాలు విషాదాలకు మాత్రమే పరిమితమైపోతాయి. కొన్ని విషాదాలు మాత్రం...సరికొత్త పనులకు శ్రీకారం చుట్టేలా చేస్తాయి. ముంబాయిలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసే విజయ్ ఠాకూర్ తాను ట్యాక్సీ డ్రైవర్ కావాలని ఎప్పుడు అనుకొని ఉండరు. అవుతానని కూడా ఊహించి ఉండరు. విజయ్ జీవితంలో జరిగిన ఒక విషాదసంఘటన ఆయన చేస్తున్న వృత్తినే మార్చేసింది. 1982లో...మూడు నెలల గర్భిణి అయిన విజయ్ భార్య సరోజ్‌కు పొత్తికడుపులో నొప్పి మొదలైంది. తెల్లవారుజామున రెండు గంటల సమయం. భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి విజయ్‌కి ఒక్క ట్యాక్సీ కూడా కనిపించలేదు. ఇక చేసేదేమిలేక అందేరి రైల్వేస్టేషన్‌కు వెళ్లి చాలా ఎక్కువ ఛార్జీ చెల్లించి ఒక ట్యాక్సీని మాట్లాడుకొని భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో సరోజ్ గర్భం పోయింది. ఈ విషాదం విజయ్‌ని కుదిపేసింది. ‘‘నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు’’ అనుకున్నారు బలంగా మనసులో. తాను చేస్తున్న ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న విజయ్ ఆ తరువాత ఒక ఫియట్ కారు కొనుగోలు చేసి ట్యాక్సీ పరిమిట్ తెచ్చుకున్నారు. పేద రోగుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా తన ట్యాక్సీలో హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. తనకు ఏ సమయంలో ఫోన్ చేసినా ఆఘమేఘాల మీద బయలుదేరి వెళతారు విజయ్ ఠాకూర్. భద్రతతో కూడిన వైట్-కాలర్ ఉద్యోగాన్ని వదిలి విజయ్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆయన మంచితనాన్ని కొందరు వేనోళ్ల పొగిడారు. ‘నాలుగు రాళ్లు వెనకేసుకొని శేషజీవితాన్ని హాయిగా గడపకుండా ఎందుకీ కష్టం?’ అన్నవాళ్లే ఎక్కువమంది. ‘‘నా నిర్ణయం పట్ల ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా పశ్చాత్తాపపడలేదు’’ అంటారు విజయ్. ‘‘ఫైర్‌ఫైటర్‌లా నేను ఎప్పుడూ ఎలార్ట్గా ఉంటాను’’ అని చెప్పే విజయ్ అవసరంలో, ఆపదలో ఉన్నవారి నుంచి కాల్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళతారు. ప్రైవేట్ అంబులెన్స్ ఛార్జీలు అందుబాటు ధరల్లో లేకపోవడం, ప్రభుత్వ అంబులెన్స్ సర్వీస్ అరుదుగా మాత్రమే అందుబాటులో ఉండడం కారణంగా తనలాంటి వారి సేవలు అవసరమవుతాయి అంటారు విజయ్. ఒకరోజు తెల్లవారుజామున రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి గురైన ఒక కారును చూశారు విజయ్. ఆ కారులో ఎనిమిది నెలల కూతురితో ఉన్న దంపతులు కనిపించారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తండ్రి, పసిబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డా దురదృష్టవశాత్తు తల్లి మాత్రం చనిపోయింది. ఆమెకు చెందిన రెండు లక్షల విలువైన నగలను వైద్యులు విజయ్‌కు అందించారు. వాటిని హాస్పిటల్‌కు వచ్చిన బంధువులకు అప్పజెప్పారు విజయ్. విజయ్‌కి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి వాళ్లు సిద్ధపడినా ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటే పోతే...విజయ్‌లోని మంచితన గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి. ‘‘డబ్బు కోసం, ప్రచారం కోసం ఏ పనీ చేయను. నేను సహాయపడినవారు క్షేమంగా ఉంటే చాలు...ఆ తృప్తికి మించిన విలువ ఏముంటుంది?’’ అంటారు విజయ్. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొచ్చినా అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా ‘నేనున్నాను’ అంటూ తన ట్యాక్సీతో ప్రత్యక్షమై పేదల పాలిట ఆపద్బాంధవుడు అనిపించుకుంటున్నారు విజయ్ ఠాకూర్. -
పెళ్లయితే ఇక అంతేనా?!
ఇంటర్వ్యూ హీరోయిన్లంతా జీరో సైజు మెయింటెయిన్ చేస్తుంటే... తను మాత్రం బొద్దుగా ఉంటానంటుంది. అందరూ మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోతుంటే... తను మాత్రం చీరకట్టుతోనే కనిపిస్తానంటుంది. అందరూ గ్లామరస్ పాత్రలు చేస్తుంటే తను మాత్రం మహిళ పవర్‌ని, ప్రాధాన్యతని చూపించే పాత్రలు చేస్తుంది. అందరిలా ఉండదు విద్యాబాలన్. అందరిలా మాట్లాడదు కూడా. అందుకే తన ఇంటర్వ్యూ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. చదవి చూడండి... పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ దెబ్బ తింటుందంటారు. నిజమేనా? పెళ్లి కారణంగా కెరీర్ దెబ్బ తింటుం దని నేననుకోను. కావాలని నటనకు దూర మవ్వాలే తప్ప నీకు పెళ్లయ్యింది అంటూ ఎవరూ బయటకు నెట్టేయరు. మన అవసరం ఇండస్ట్రీకి ఉన్నంతకాలం మనం అందులో ఉంటాం. అయితే ఒకటి. ఒక అమ్మాయి ఎంత సక్సెస్ అయినాగానీ, పెళ్లవ్వగానే ఆమెని ఓ మగాడికి భార్యగానే చూస్తారు. మావారిని కొందరు ఫంక్షన్లకు పిలుస్తూ, విద్యని తీసుకురా అంటారు. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మరి అలా ఎందుకు చేస్తారా అనిపిస్తుంది. పెళ్లైపోతే అంతేనా? ఆడపిల్లలకి ఇండివిడ్యువాలిటీ ఉండదా?! ఇండస్ట్రీలో మేల్ డామి నేషన్ గురించి ఏమంటారు? అసలు మనం ఉన్న సమాజమంత టిలో మగాడిదే పై చేయి. సినీ రంగం లోనూ అంతే. కానీ హీరోయిన్ లేకుండా సీరియళ్లు, సినిమాలు ఉంటాయా? ఎక్కడైనా ఆమె అవసరమే. కాబట్టి మహిళను కాదని పక్కన పెట్టేయడానికి వీల్లేదు. ఆ అవసరాన్నే మనం ఉపయో గించుకోవాలి. మగాళ్లతో సమానంగా కష్టపడి, వీలైతే వాళ్లకంటే కాస్త ఎక్కువే ఔట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి. నేనెప్పుడూ అదే చేస్తుంటాను. ధైర్యంగా, సవాళ్లను ఎదుర్కొనే సమర్థు రాలిగా మీ పాత్రలు కనిపిస్తుంటాయి. నిజ జీవితంలో మీరలా ఉంటారా? హండ్రెడ్ పర్సెంట్. నా పాత్రలు నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. చిన్నతనం నుంచీ నేను డైనమిక్. నాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, సవాళ్లను ఎదుర్కొనగలిగే తెగువ... ఇవన్నీ కాస్త ఎక్కువే. అందువల్లేనేమో నేను అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ ఉంటాను. స్త్రీ స్వేచ్ఛ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? స్వేచ్ఛ అందరికీ ఉండాలి. మహిళలు ఇలాగే ఉండాలి అని ఎందుకు నిర్ణయించేస్తారు! వాళ్లూ వాళ్లకు నచ్చినట్టు ఉండాలి. నచ్చింది తినాలి, నచ్చినవి ధరించాలి. మగాడు నిక్కర్లు వేసుకుని తిరిగితే ఎవరూ పట్టించు కోరు. అదే అమ్మాయిలు కాస్త పొట్టి బట్టలు వేస్తే చీప్‌గా చూసేస్తారా? ఏదైనా జరిగితే తన డ్రెస్సింగ్ వల్లే అనేస్తారా? ఈ దృష్టికోణం మారాలి. ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని వాళ్ల దుస్తుల్ని బట్టి అంచనా వేయడం మానెయ్యాలి. ఇంత ఆధునిక భావాలు ఉన్న మీరు మోడ్రన్‌గా ఎందుకు కనిపించరు? ఎందుకు కనిపించను! నేనూ గౌన్లు వేసుకుంటాను. లో నెక్ వేస్తాను. కానీ నాకు చీర అన్నిటికంటే ఇష్టం. అందుకే పెద్దదానిలా కనిపిస్తాను అని కొందరన్నా కూడా చీరనే ధరిస్తాను. అలాగే ఎవరికి నచ్చినవి వాళ్లు వేసుకుంటారు. దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మహిళలపై జరిగే అకృత్యాలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? కేవలం ఆడపిల్లగా పుట్టినందుకే సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా అన్యాయం. అయితే ఇప్పు డిప్పుడే అన్యాయాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తోంది ఆడపిల్లలకి. పూర్తిగా సాధికారత రాకపోయినా రోజుకొక ఆడపిల్లయినా గడప దాటి వచ్చి తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటోందని కచ్చితంగా చెప్పగలను. కానీ ఆడపిల్లలు కూడా కొన్ని పొరపాట్లు చేసి కష్టాల్లో పడుతున్నారు కదా? అవును. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే కావాలని ఎవరూ నష్టపోరు. తెలియక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అది కూడా మనం గమనించాలి. సమాజంలో ఎలాంటి మార్పులు వస్తే ఆడపిల్లల జీవితాలు బాగుంటాయి? అబ్బాయిలకీ, అమ్మాయిలకీ సమాన అవకాశాలు ఉండాలి. కొన్ని రంగాలకి మహిళలు పనికిరారు, అవి పురుషులకే అని నిర్ధారించేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంతరిక్షంలోకే వెళ్లగలిగిన మహిళ ఎక్కడి కైనా వెళ్లగలను. ఏదైనా సాధించగలదు. ఆడపిల్ల అయినంత మాత్రాన తన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయ కూడదు. అలాగే తన అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం, తన కెరీర్‌ని జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మలచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. -
ఐ లవ్ యు నాన్న...
పొద్దున్న లేస్తూ లేస్తూనే ఆదివారపు ఆహ్లాదం అందంగా ఆవరించుకుంది. లేచి ఫ్రెష్ అయి, రోజూ ఉండే స్కూల్, ఆఫీస్ హడావుడి లేదు కాబట్టి కాఫీ కలుపుకుని బాల్కనీలోకి వచ్చా. రెండు రోజుల క్రితమే తెచ్చిన మొక్కలకు అందంగా విరిసీ విరియని గులాబీ పూలను చూస్తుంటే, అవి పాలు కారే పసిపాప నవ్వులలా అనిపించాయి. అలా చూస్తూ ఎంతసేపు ఉన్నానో తెలీదు. నా ఆరేళ్ల కూతురు ‘అమ్మా’ అంటూ వచ్చి చుట్టుకుపోయింది. మామూలుగా స్కూలుకి లేపుతుంటే లేవడానికి మారాం చేసే నా కూతురు ఆదివారం మాత్రం నేను లేపకముందే లేస్తుంది. అస్సలు సతాయించకుండా రెడీ అయిపోతుంది. వాళ్ల నాన్న రెడీ అయి వచ్చేసరికి పాలు తాగి, నీట్‌గా డ్రెస్ చేసుకుంటుంది.ఇంతకూ చెప్పలేదు కదూ! ఆదివారం మా అమ్మాయి అంత బుద్ధిమంతురాలు అవడానికి కారణం.. వాళ్ల నాన్నతో పాటు మార్కెట్‌కి వెళ్లవచ్చు. వారానికి సరిపడే స్టేషనరీ, చాక్లెట్స్, బిస్కెట్స్ తెచ్చుకోవచ్చు. అదీకాక స్పెషల్ ఐస్‌క్రీం తినిరావచ్చు కదా అందుకు. ఆ వేళ కూడా ఇద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరారు. ఆ క్షణం మా అమ్మాయి నవ్వులో ఎంతో సంతోషం. వాళ్లను అలా చూస్తుంటే, నాకు, మా నాన్నగారికి మధ్య ఉన్న అనుబంధం గుర్తొచ్చింది. నేను, నాన్న ఫ్రీగా మాట్లాడుకునేది చాలా తక్కువ. నా ఇద్దరు చెల్లెళ్లు నాన్నతో సరదాగా, ఫ్రీగా మాట్లాడుతుంటారు. నాకెందుకో నాన్నతో మాట్లాడాలంటే ఏదో తెలియని మర్యాదతో కూడిన భయం. కానీ నాకు, మా నాన్నగారికి మధ్య ఉన్న రిలేషన్ ప్రత్యేకమైంది. నేను చెప్పకపోయినా నా ఫీలింగ్స్ నాన్న బాగా అర్థం చేసుకుంటారు. పెళ్లయిన ఈ పదేళ్లలో ఎన్నోసార్లు నాన్నకు ‘వస్తున్నా’ అని చెప్పకుండా విజయవాడ వెళ్లి, సడన్‌గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకునేంతలో, ‘‘బడే (పెద్దోడా)’’ అని పిలుస్తూ నాన్న ఎదురొచ్చి నన్ను సర్ప్రైజ్ చేసేవారు. ‘‘మీకెలా తెలుసు మేము వస్తున్నామని, ఎవరూ చెప్పలేదు కదా’’ అంటే, ‘‘నాకు అనిపించింది నువ్వు వస్తావని’’ అనేవారు. నాకెప్పుడైనా మనసు బాగోక నాన్నకు ఫోన్ చేద్దాం అని అనుకునేలోపు నాన్నే కాల్ చేసేవారు. నంబర్ చూడగానే మనసులో ఏదో తెలియని ధైర్యం... నాన్న నాతో ఉన్నారని. నాన్న గొంతు వినగానే, టెన్షన్ మొత్తం మాయమైపోయేది. ఆయన ప్రాణం మాలోనే ఉందా అన్నట్టు బతికే నాన్నకు నేనేం చేయగలను... నాన్నంటే నాకెంత ఇష్టమో ఎలా చెప్పగలను... అని ఆలోచిస్తుంటే మొబైల్ రింగ్‌టోన్‌తో నా ఆలోచనలకు ఫుల్స్టాప్ పడింది. నాకు తెలుసు ఆ కాల్ కచ్చితంగా ‘నాన్న’ నుండే అని. కాల్ లిఫ్ట్ చేయగానే నేను అనే మొదటి మాట: ‘ఐ లవ్ యూ నాన్న’... - ఎం.డి.ముజస్సిమ్, D/o సాదిక్ హుస్సేన్, హైదరాబాద్ ‘జిందా’ సంస్కారి మాది హైదరాబాద్. వేసవి సెలవుల్లో మా పెద్దక్కగారింటికి వెళ్లాం. పదిహేను రోజుల తరువాత తిరిగి రైల్లో వస్తున్నాం. మేమెక్కిన కంపార్ట్మెంట్లో ఒక చిన్న సంఘటన జరిగింది. రైల్లో పల్లీలు, పండ్లు, దువ్వెనలు లాంటివన్నీ అమ్మేవాళ్లు వస్తున్నారు, వెళ్తున్నారు. అలాగే ‘జిందా తిలిస్మాత్’ చిన్న సీసాలు అమ్మే అతను వచ్చాడు. అతనికి దాదాపు పద్దెనిమిది ఏళ్లుంటాయి. ‘జిందా తిలిస్మాత్, జిందా తిలిస్మాత్’ అంటూ అరిచాడు. అది విన్న ఒకామె, ‘‘ఏం జిందా తిలిస్మాత్ అయ్యా, వెళ్లు వెళ్లు. రైల్లో ఎవరు కొంటారు దాన్ని’’ అంటూ ఛీత్కారంగా అరిచింది. అతను ఎంతో అవమానంగా ఫీలై, పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడు. ఇంతలో ఛీత్కరించినామె కెవ్వున కేక పెట్టింది. ఆమె కిటికీ పక్కన కూర్చుని, మోచేయి కిటికీపైన పెట్టింది. కిటికీ బోల్ట్ కాస్త లూజ్ అయ్యి, ఆమె చేతిపైన పడింది. పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్తున్న అతను, ఆమె కేకకి వెంటనే వెనక్కి వచ్చాడు. అతన్ని ఛీత్కరించి రెండు నిమిషాలు గడవకముందే ఆ సీసా అవసరం ఆమెకు కలిగింది. ఆ కుర్రాడు ఒక సీసా వంపి, ఆమె మోచేతిపైన రాసి మసాజ్ చేశాడు. అతనికి ఆమె సారీ చెప్పలేదు. కనీసం సీసా డబ్బులు కూడా ఇవ్వలేదు. అతను డబ్బులు అడగనూలేదు. అతని సంస్కారానికి ఎంతో ముచ్చటేసింది. - ఎస్.ఇందిరా నాగేంద్ర, వనస్థలిపురం, హైదరాబాద్ ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
చంద్రబింబం: సెప్టెంబర్ 14 నుండి 20 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ప్రత్యర్థులూ మీ బాటలో సాగుతారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తి చెందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఈ వారం పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు పొందుతారు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఒక ప్రకటన నిరుద్యోగులను నిరాశ పరుస్తుంది. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని పనులు మధ్యలో వాయిదా పడవచ్చు. ఆలోచనలు అంతగా కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకోని ప్రయాణాలు. సోదరులతో వివాదాలు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి ఆహ్వానాలు. వారం చివరిలో అనారోగ్య సూచనలు. వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. నిర్ణయాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు చికాకులు. కళారంగం వారికి గందరగోళం. వారం చివరిలో ధన, వస్తులాభాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. పనులు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ఆస్తి, ధనలాభం. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం: ఆగస్టు 24 నుండి 30 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) మొదట్లో పనులు మందగించినా క్రమేపీ పుంజుకుంటాయి. బంధువులు, మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయరంగం వారికి పదవులు. వారం మధ్యలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో వాహనయోగం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనసౌఖ్యం. ఆలయాల సందర్శనం. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ధనలాభం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి యోగవంతమైన కాలం. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు, బంధువులతో వివాదాలు తీరతాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని ప్రగతి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఈ వారం పట్టింది బంగారమే. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని ర్యాంకులు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల ప్రశంసలు. కళారంగం వారికి అవార్డులు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ప్రారంభంలో నెలకొన్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. భూవివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవ ర్గాలకు పదవీయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. భూ, గృహయోగాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
జాగ్రత్తగా దాచండి!
వాయనం: మార్కెట్‌కి వెళ్లి గంటల తరబడి పరీక్షించి మరీ కూరగాయలు, పండ్లు కొనుక్కొస్తాం. కానీ ఒక్కోసారి అవి రెండు రోజులకే కుళ్లిపోతుంటాయి. బోలెడు డబ్బు పోసి కొన్నవి కళ్లముందే పాడైపోతుంటే చూడలేక, పారేయడానికి చేతులు రాక బాధేస్తూ ఉంటుంది. అయితే నిజానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. కూరగాయలు త్వరగా పాడైపోవడానికి మనం వాటిని దాచే విధానం సరిగ్గా లేకపోవడం కూడా కారణం కావచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని ఎక్కువ రోజులపాటు తాజాగానూ ఉంచుకోవచ్చు. అందుకోసం ఇలా చేసి చూడండి... కూరగాయలను పళ్లతో కలిపి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వేరు వేరు కవర్లలో కానీ బాక్సుల్లో కానీ వేసి పెట్టాలి!ఆకుకూరల్ని ఫ్రిజ్‌లో పెట్టే ముందు కట్ట కట్టడానికి ఉపయోగించిన రబ్బర్‌బ్యాండ్/దారం తీసేయాలి. కాడలు కోసి పెట్టకూడదు. శుభ్రంగా కడిగి, తడి ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో పెడితే వారం వరకూ తాజాగా ఉంటాయి!అంటే నిమ్మ, బత్తాయి, ద్రాక్ష లాంటి సి విటమిన్ ఉండే పండ్లను తప్పకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్ లేకపోతే తడి బట్టలో మూటకట్టి పెట్టాలి. ఆరినప్పుడల్లా బట్టను తడుపుతూ ఉంటే త్వరగా వాడిపోకుండా, కుళ్లిపోకుండా ఉంటాయి. క్యారెట్లను రెండు మూడు రోజుల వరకూ బయటే ఉంచేయవచ్చు. ఫ్రిజ్‌లో పెడుతుంటే మాత్రం వాటి మొదళ్లలో ఉండే పచ్చటి భాగాన్ని కోసి పెట్టాలి. లేదంటే వాటిలోని పోషకాలు పోతాయి!కాలీఫ్లవర్‌కి ఎక్కువగా గాలి సోకితే పురుగులు వచ్చేస్తాయి. అలా అని ఏ బాక్సులోనో పెట్టి మూత బిగిస్తే రంగు మారిపోతుంది. కాబట్టి పాలిథీన్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి!మొక్కజొన్నల్ని వారం పది రోజుల వరకూ ఫ్రిజ్‌లో పెట్టక్కర్లేదు. ఒలిచిన గింజలైతే మాత్రం వెంటనే పెట్టేయాలి!దోస జాతికి చెందిన దేనినీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఓసారి కట్ చేశాక అస్సలు పెట్టకూడదు. వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చల్లదనానికి త్వరగా మెత్తబడిపోతాయి. రుచిలో కూడా కాస్త మార్పు వస్తుంది! ఫ్రిజ్‌లోని చల్లదనం టొమాటోల్లోని యాంటీ ఆక్సిడెంట్లను, పోషకాలను హరిస్తుంది! వంకాయల్ని ఫ్రిజ్‌లో పెట్టవద్దనేది నిపుణుల సూచన. టెంపరేచర్ ఒక స్థాయి దాటితే వాటిలోని పోషకాలకు హాని జరుగుతుందట. పెట్టినా మూడు రోజులకు మించి ఉంచకూడదట! పుట్టగొడుగులకు చెమ్మ తగలకూడదు. కాబట్టి వండాలి అనుకునేంత వరకూ వాటి ని జాగ్రత్తగా ఉంచాలి. నిజానికి వీటిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు.బంగాళదుంపలు, ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బయటే గాలి తగిలేలా ఉంచాలి. కానీ ఈ రెంటినీ ఒకచోట ఉంచకూడదు. ఉంచామో... ఒకటి ఇంకోదాన్ని త్వరగా పాడు చేసేస్తుంది! ఒక్క దెబ్బకి వంద ముక్కలు! వంట చేయడం కంటే వంటకు కూరగాయల్ని సిద్ధం చేయడం పెద్ద పని. ముఖ్యంగా ఆకుకూరల్ని కోయాలంటే బోలెడంత సమయం వెచ్చించాలి. కత్తిపీటలు వాడటం మానేశామేమో... చాకుతో ఆకుకూరల్ని తరగాలంటే చేతులు పడిపోతుంటాయి. పైగా ఒకటికి పదిసార్లు చాకుకి పని చెబితేనే తప్ప అన్ని ముక్కలూ ఒకే పరిమాణంలో రావు. ఇక కరివేపాకు, కొత్తిమీర! కొందరు రెబ్బలు వేసేస్తారు. కానీ కొంతమందికి బాగా తరిగి వేసుకోవడం ఇష్టం. వాటిని చిన్న చిన్న ముక్కలు చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం... హెర్బ్ సిజర్స్! అచ్చంగా కత్తెరలాగే కనిపిస్తుంది కానీ... సరిగ్గా పరిశీలిస్తే నాలుగైదు కత్తెరలు కలిపి చేసినట్టుగా ఉంటుంది హెర్బ్ సిజర్స్. హ్యాండిల్ ఒకటే ఉంటుంది కానీ ఐదు బ్లేడ్స్ ఉంటాయి. దానివల్ల మొత్తం కట్టని ఒకేసారి కత్తిరించేసుకోవచ్చు. కాడలు కోసేసి, మిగిలిన ఆకుకూరని చేత్తో పట్టుకుని కాగితాన్ని కత్తిరించినట్టుగా కత్తిరించుకోవడమే. ఉల్లికాడలు, బీన్స్ లాంటివి కూడా తేలికగా ముక్కలవుతాయి దీనితో. వెల కూడా అందుబాటులోనే ఉంది... 290 రూపాయలు. ఈబే వెబ్సైట్లో అయితే 240 రూపాయలకే లభిస్తోంది! -
కథ: కర్మ
అయితే ఈ మూడ్రోజులూ మూడుపూటలా తిండిపెట్టి దివారాత్రాలు దివాణంలో ఉంచండ్రా వీణ్ని. ఈలోపు నా కష్టాలు కరగకపోతే వీణ్ని కండకో ముక్కగా నరికి, మన దివాణంలోని కుక్కలకు వెయ్యండి’’ అని పెద్ద పాలేరు వైపు చూసి హుకూం జారీ చేశాడు సూర్రెడ్డి. ‘‘ఆహా! సిరిగల మొఖం. కాకపోతే ఆ సిరి జేబుకాడికి రాకుండా శనిగాడు మోకాలడ్డుతున్నాడు’’ అని ముఖస్తుతితో పాటు మెలిక కూడా పెట్టాడు కొండదేవర. ‘శనిగాడా?’ అని చిచ్చుబుడ్డిలా వెలిగిన మొఖాన్ని చిరాగ్గా పెట్టాడు గవరయ్య. ‘‘నువ్వు కొన్ని యేళ్ల నుండి బంగారం పట్టుకున్నా బూడిదయ్యిపోతంది. అవునా? కాదా?’’ అన్నాడు కొండదేవర. తలూపాడు గవరయ్య. ‘‘నేను తలచిందే చెప్తున్నాను, నువ్వు తలూపుతున్నావు. ఏలిననాటి శని నిన్ను ఏపుకు తింటోంది. ఈశ్వరుడైనా శనీశ్వరుడికి భయపడతాడు. కానీ ఆ శనికి ఎలుగుబంటంటే భయం. ఏలిననాటి శని ఈ ఎలుగుబంటి ఎముకతో ఎల్లిపోద్ది. నీ గ్రహచారం మారిపోద్ది’’ అని కొండదేవర చిన్న ఎముక ముక్కనొకదాన్ని గవరయ్య చేతిలో పెట్టి, ‘రెండ్రోజులు ఉంచుకుని నిలవని నీటిలో కలిపేయ’మని చెప్పి, యాభై రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. గవరయ్య కొడుకు ఏదో జబ్బుపడి చచ్చిపోయాడు. కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మనేది పెట్టుకుని పెళ్లాం ప్రాణం విడిచింది. జీవచ్ఛవంలా బతుకుతూ బాధల్ని మర్చిపోవడానికి ఎప్పుడూ తాగుతూ ఒంటిగా ఊరి చివర పాకలో, పెద్ద పంటకాలువ గట్టు మీదుంటాడు. ముక్కు మూసుకుని తపస్సు చేసే మునులకు సైతం దొరకని ఏకాంతం ఎప్పుడూ ఉంటుందా గుడిసెలో. అది జమీందారుగారి దివాణం. రెడ్డిరాజుల హయాంలో పరిపాలన తరువాత బ్రిటిష్‌వారి దగ్గర భరణాలందుకుంటూ స్వాతంత్య్రానంతరం భూములు కొన్ని కరిగిపోయినప్పటికీ ఊరికి పెద్దగా ఉన్న సూర్రెడ్డి గారిదది. రెడ్డిగారికి నీసు లేనిదే ముద్ద దిగదు. కొంగల చెరువులో కొరమీనులు తెప్పించి, మసాలా నూరుతుండగా బట్టలు మడవడానికొచ్చిన చాకలి సూరమ్మ కొండదేవర గురించి చెబితే, ‘పిలవమంది’ సూర్రెడ్డిగారి భార్య. కొండదేవరొచ్చాక, అరుగు మీద సోఫాలో కూర్చుంది రెడ్డిగారి భార్య. బాసింపట్లు వేసుకుని కింద కూర్చొని, తాటాకులతో తయారైన తాళపత్ర గ్రంథం లాంటినొకదాన్ని తీసి, అందులో రూపాయి బిళ్లొకటి పెట్టమన్నాడు కొండదేవర. రూపాయి బిళ్ల పెట్టిన తాటాకుని చూసి ఏవో లెక్కలేసి నిట్టూర్చాడు. ‘‘తెలిసింది తల్లీ, దిష్టి దిగదుడిచి బయట పారేసిన ఎండు మిరపకాయని గానీ, నిమ్మకాయని గానీ, మసి బొగ్గుని గానీ ఈ ఇంటి యజమాని దాటాడు. అందుకే చెడు జరుగుతోంది తల్లీ’’ అని తాళపత్రాన్ని తాడుతో ముడేశాడు కొండదేవర. వాన నీటి కోసం చాతక పక్షులు చకచకా చలాగ్గా ఆకాశంలో తిరుగుతున్నాయి. ఆకాశమంతా కారు నలుపు. చిరుచిరు చినుకులతో స్నానం చేస్తున్న పచ్చటి పొలాల్లోని మట్టిరోడ్డులో తెల్లటి అంబాసిడర్ కారులో సూర్రెడ్డి గారున్నారు. ఆయనకు పంట యాభై ఎకరాలు, పాడి యాభై శాల్తీల దాకా ఉన్నాయి. గుబురు మీసాలున్న ఆయన గుండెల్లో ఇప్పుడు గుబులుగా ఉంది. పులివాగు పక్కనే ఆయన యాభై ఎకరాల ఏక చెక్కమడి వరి పైరుంది. పోయినేడాది పులివాగు పొంగి, గట్టు తెగి, రెడ్డిగారి పొలాలన్నింటినీ ముంచేసింది. ఇసుక పొలాల్లో మేటేసింది. వరి గింజలన్నీ ఇసుక పాలయ్యాయి. తూర్పు కొండల మీద కురిసిన వాననీరు పులివాగులోంచి కొంగ చెరువులోకి వస్తుంది. చెరువు నిండి వెనక్కి పోటు పొడుస్తుంది. వెనక్కి ప్రవహించే ఆ పోటుకి, ఎదురొచ్చే కొండనీరుకి మధ్య ఘర్షణ జరిగి, సుడిగుండాలు ఏర్పడి నీటి ఒరిపిడికి తూము దగ్గర గట్టుకి గండి పడింది. ఈసారి అలా జరగ్గూడదని కూలీల్ని పెట్టి ఇసుక బస్తాలు ఇబ్బడి ముబ్బడిగా వేయించి, గట్టుని కంచుకోటలా కట్టించాడు. కారు ముందు సీట్లో పెద్ద పాలేరు, వెనుక సీట్లో రెడ్డిగారు, కారు బయట చేతులు కట్టుకుని ముగ్గురు పాలేళ్లున్నారు. ‘‘పంట చేతికొచ్చేసరికి కొరివి దెయ్యంలా తుపాను తగలడుతుంది. చేలన్నింటికీ గండి కొట్టండి. నీరు దిగకుండా గడ్డివాముల పైన సరిగ్గా సర్దండి. నీళ్లు లోపలికి దిగితే, కుళ్లిపోయిన గడ్డి చివరికి చలిమంటకి కూడా పనికిరాదు’’ అని పాలేళ్లకి పనులు పురమాయించి, కారు ఇంటికి పోనిమ్మన్నాడు సూర్రెడ్డి. ఆకాశంలో మబ్బుల్లాగే ఆయన మనసులో మథనం. పోయినేడాది తుపాను వల్ల తినే తిండిలో ఇసుక పోసుకున్నట్టయింది. మందలో ఆయనకిష్టమైన ఆవు లక్ష్మి రేపో మాపో ఈనడానికి సిద్ధంగా ఉంది. అదెన్ని ఈతలు ఈనినా చచ్చిపోయిన లేగ దూడకే జన్మనిస్తుంది. సూర్రెడ్డికి ఆ ఆవు అంటే ఆరోప్రాణం. దానికేదన్నా జరిగితే, తల్లిలా తల్లడిల్లిపోతాడు. కారు దివాణంలోకొచ్చింది. కారు దిగి, కొండదేవరని చూసి, ‘‘పనులు మానేసి ఇలాంటి పగటి వేషగాళ్ల దగ్గర కూర్చున్నావా’’ అని భార్యని హూంకరించాడు. కొండదేవర అహం దెబ్బతింది. ముఖం మాడినా మాట మార్చి, ‘‘అయ్యగారి తత్త్వాన్ని తరచి చూస్తే, అయ్యగారు లోపల చెరుకు బయటికి కరుకు’’ అన్నాడు. ‘‘ఇలా అబద్ధాలాడే జనాన్ని మోసం చేస్తారు’’ సోఫాలో కూర్చుంటూ అన్నాడు సూర్రెడ్డి. ‘‘అయ్యగారూ! నేను అబద్ధాలాడి మీ నెత్తిన చెయ్యెడితే భగవంతుడు నా నెత్తిన చెయ్యెడతాడు. నేను మంత్రమేసిన ఈ నిమ్మకాయ, పసుపు, కుంకుమల్ని మీకు దిగదుడిసి ఊరవతల పచ్చని చెట్టు కింద పారెయ్యమనండి. మూడ్రోజుల్లోపే ఆ చెట్టు భగ్గున మండిపోద్ది, మీ కష్టాలు భళ్లున పగిలిపోతాయి. మీరు బూడిద చల్లితే బంగారం పండుద్ది’’ అన్నాడు నమ్మకమైన ఉపాయాల్ని చెబుతున్నట్టు కొండదేవర. సూర్రెడ్డిగారికి సర్రున కాలింది. ‘‘ఓహో! అలాగా! అయితే ఈ మూడ్రోజులూ మూడుపూటలా తిండిపెట్టి దివారాత్రాలు దివాణంలో ఉంచండ్రా వీణ్ని. ఈలోపు నా కష్టాలు కరగకపోతే వీణ్ని కండకో ముక్కగా నరికి, మన దివాణంలోని కుక్కలకు వెయ్యండి’’ అని పెద్ద పాలేరు వైపు చూసి హుకూం జారీ చేశాడు. కొండదేవర కొయ్యబారిపోయాడు. ‘‘పోన్లేండి, కోటి విద్యలు కూటి కొరకే కదా, వదిలెయ్యండి పాపం’’ అంది జాలిగా సూర్రెడ్డి భార్య. సూర్రెడ్డి కళ్లతో కోపాన్ని ఆమె మీదకు విసిరాడు. ఆమె సోఫాలోంచి లేచి వంటింట్లోకి వెళ్లిపోయింది. ‘‘నిన్ను బొట్టు పెట్టి బతిమిలాడాలా? అయ్యగారిని తీసుకెళ్లి అతిథిలా ఈ మూడ్రోజులు మర్యాద చెయ్యండి’’ అని అవే కళ్లను పెద్దపాలేరు మీదకి విసిరాడు. వాడు వడివడిగా వెళ్లి వీధి గేట్లు మూసేశాడు. అప్పటిదాకా గలగలా గోదారిలా సాగిన కొండదేవర మాటలు గొంతులో విషం పోసినట్టు, ఆనకట్ట వేసినట్టు ఆగిపోయాయి. పెద్దపాలేరు కొండదేవరని తీసుకెళ్లి తూర్పు పక్క గదిలో పెట్టి తాళం పెట్టాడు. తిరిగి వచ్చి సూర్రెడ్డి దగ్గర నిలబడ్డాడు. సూర్రెడ్డి సోఫాలోంచి లేచి లోపలికెడుతూ వాడి దగ్గర ఆ పసుపు, కుంకుమ, నిమ్మకాయ తీసుకొచ్చి, నాకు దిగదుడిసి మన పశువుల పాక దగ్గర తాడిచెట్ల దగ్గర ఏదో దాని మొదట్లో పెట్టు’’ అన్నాడు పెద్ద పాలేరుతో. ఆ రాత్రంతా కుంభవృష్టి కురిసింది. బడబాగ్ని భయపడేట్టు కురిసింది. గొడుగులు గుమ్మం దాటి రాకుండా విసురుగా కురిసింది. వాగూ వంక ఏకమయ్యేట్టు కురిసింది. ఆ రాత్రి పడిన పిడుగులకు పిల్లలే కాదు, పెద్దలు కూడా నిద్రపోలేదు. మెరుపులతో ఆ రాత్రి పట్టపగలయ్యింది. కొండదేవర మనసు కీడు శంకించింది. తెల్లారింది. అయినా వర్షం కురుస్తూనే ఉంది. కిటికీలోంచి కొండదేవర కొండల్ని చూశాడు. హత్య చేసిన హంతకుల్లా కనబడ్డాయవి. తాతల నాటి మామిడి చెట్టొకటి గోడని ఆనుకుని ఉంది. ఆ గోడ తన గోడుని విననంటూ చెట్టంత ఎత్తుగా ఉంది. పరగడుపునే పరిగెడుతూ పెద్దపాలేరు దివాణంలోకొచ్చాడు. పశువుల కొట్టం కూలిపోయేలా ఉందని సూర్రెడ్డికి చెప్పాడు. కారు కుదరదని, గొడుగు నిలబడదని మైకా కవరు కప్పుకుని సూర్రెడ్డి రెడీ అయ్యి, పశువుల పాక దగ్గరకు పాలేర్లందరినీ తీసుకెళ్లాడు. గండ్లు కొట్టించినా చేలంతా నీరే. మెరక పొలాల్లోని నీరు పల్లపు పొలాలైన తన చేలలోకి వచ్చి పడుతున్నాయి. గట్టు మీద నిలబడి గమనించాడు. పంటంతా పడిపోయింది. మట్టిలోంచి పుట్టిన మాణిక్యాలు మట్టిగొట్టుకుపోతున్నాయి. గొడ్లన్నీ మోకాళ్ల వరకూ మునిగి ఉన్నాయి. గబగబా గొడ్లన్నింటి పలుపుతాళ్లు విప్పేశారు. వాటన్నింటినీ పల్లం పొలాల్లోని పాక నుండి మెరక పొలాల్లోని పాకలోకి తోలారు. సూడి ఆవు నిలబడలేక నీళ్లలో పడుకుంది. దాని పీకల దాకా నీళ్లున్నాయి. సూర్రెడ్డికి ప్రాణం నీరైపోయింది. దాన్ని లేపి, దివాణంలోకి తోలుకు రమ్మన్నాడు. అప్పుడే చెవుల్లో కర్ణభేరి పగిలేలా పిడుగొచ్చి తాడితోపుల్ని తాకింది. అంత వానలోనూ అగ్ని ఆరక, తాడిచెట్లన్నీ తగలబడిపోతున్నాయి. ఆవుని తోలుతున్న సూర్రెడ్డి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు. దివాణంలో ఆవుని అరుగు మీద కట్టేశారు. వర్షం మాత్రం వదలని శనిలా కురుస్తూనే ఉంది. పొద్దుగూకింది. ఆ రోజు ఆవు ఈనుతుందని అరుగుమీద పాలేర్లందరూ పచార్లు చేస్తున్నారు. కొండదేవరున్న గదికి బయట రాత్రిళ్లు తాళం పెట్టట్లేదు. కొండదేవర తిరిగే కాలు, ఆడే నోరు ఆగవు. అయినా అతను పారిపోయే ప్రయత్నాలు చెయ్యడం లేదు. ఆకాశమంత గోడ, కసిగా చూసే కుక్కలు. రాత్రిళ్లు వాటిని వదిలిపెట్టడంతో అవి అరుస్తూ దివాణమంతా షికార్లు కొడుతుంటాయి. బయట వాటికి దొరికితే పరుగున వచ్చి పీక కొరికేస్తాయేమోనని భయం. వాటి నోటన పడి చచ్చే కంటే, సూర్రెడ్డి చేతిలో తన్నులో, తిట్లో తినడమే ఉత్తమమని ఊరుకున్నాడు. పైగా వరండా దగ్గర పారుతున్న వరద నీటిని చూసి, ఊరంతా ఉప్పెనలా ఉంటుందని భయపడ్డాడు. ప్రమాదాల్ని పసిగట్టి పారిపోవాలన్న ప్రయత్నాన్ని పాతాళ గంగలోకి తొక్కేశాడు. అర్ధరాత్రయ్యింది. లాంతరు వెలుగులో సూర్రెడ్డి తన క్రీనీడను చూసుకుంటున్నాడు. ఆలమందల్ని ఆదుకున్నానన్న ఆనందం ఉన్నా, ఆవు ఆదుర్దా కలిగిస్తోంది. పులివాగు పరిస్థితి తలచుకున్నప్పుడల్లా మరింత కలవరం కలిగిస్తోంది. ఆయనకు గడియ గడియ గండంలా ఉంది. ఆవు ఈనింది. షరా మామూలే చనిపోయిన దూడ అనుకున్నారందరూ. కానీ దూడ బతికే ఉంది. దక్కదనుకున్న దూడ దక్కేసరికి అంబా అంటున్న ఆవుని చూసి సూర్రెడ్డి సంబరం అంబరాన్ని దాటింది. ఆ రాత్రి ఆయనిక నిద్రపోలేదు. గోవుతో గోముగా ఊసులాడాడు. ఉల్లాసంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెల్లగా, ముద్దుముద్దుగా ఉన్న లేగదూడతో ముద్దులాడాడు. చక్కగా చెప్పాలంటే చిన్నపిల్లాడైపోయాడు. సరిగ్గా చెప్పాలంటే, పాలేళ్ల ఆశ్చర్యానికి కేంద్రబిందువయ్యాడు. అరుగు మీద నుండి ఆకాశంలోకి చూశాడు సూర్రెడ్డి. కాకి నలుపు కుండలతో సూదుల్ని అమాంతం దిమ్మరిచ్చినట్టు కురిసిన వాన వెలిసింది. ఆకాశంలో నిశ్శబ్దం. అన్ని రోజులు శబ్దం చేసిన ఆ నింగిన నిశ్శబ్దం భయంకరంగా ఉంది. తెరిపిచ్చిన వాతావరణంతో తెల్లారింది. ఆ వాతావరణం ఎప్పుడూ చూడనంత కొత్తగా ఉంది. తూర్పు కొండలు జడ్జి ముందు బోనులో నుంచున్న నిర్దోషుల్లా నిలబడి ఉన్నాయి. పొద్దుపొద్దున్నే పెద్ద పాలేరొచ్చి, పెద్ద శుభవార్త తెచ్చాడు. పులివాగు తెగలేదనీ, దాని ప్రవాహానికి కొంగల చెరువు గట్టుకి గండి పడి, ఆ నీరు ఊరిని ఆనుకుని ఉన్న పెద్ద పంటకాలువలోకి వచ్చి పడిందనీ, పంట పాడవ్వలేదనీ చెప్పాడు. ఆ రోజు సూర్రెడ్డిగారు కొండదేవరని తీసుకొచ్చి, కొరమీనులతో కూడుపెట్టి, కాసులిచ్చి, కొత్త బట్టలెట్టి పంపించారు. కొండదేవర వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. ఒక్కోసారి ఒకరి ఆనందం మరొకరి విషాదానికి దారి తీయొచ్చు. సూర్రెడ్డిగారి సంబరం ఆ అర్ధరాత్రిలో గవరయ్యకి గండం అయ్యింది. వాన పడుతుండటంతో పనుల్లేక గవరయ్య చేతిలో తాగడానికి తడిలేకపోయింది. చివరికి ఎలాగైతేనేం అప్పు పుట్టించాడు. తాగుబోతుకి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ప్రపంచంలో ఎక్కడైనా అప్పు పుట్టుద్ది. కొంగల చెరువుకి గండి పడిన ఆ క్రితం రోజు సాయంత్రం ఉడుకు సారా మనసారా, తనివితీరా, కరువు తీరా ఖాళీ కడుపుతో తాగాడు. ముసురుని చూసి మురిసిపోతా వాతావరణం చల్లదనానికి పీకల దాకా పూటుగా తాగాడు. నిషా తలకెక్కింది. మైకంతో మగత మొదలయ్యింది. గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. చెరువు నీరు పెద్ద పంట కాలువలో పడి ఆ అర్ధరాత్రి పొంగి పొర్లింది. అంతటి నీరుకి కాలువ సరిపోక, నీరు బయటికొచ్చి ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. పాకని ఆనుకుని ప్రవాహం మొదలైంది. కాలం మాయా స్వరూపం. పాక మట్టిగోడలు కరిగిపోవడం మొదలయ్యాయి. పాకలోకి నీళ్లు చొరబడ్డాయి. అయినా గవరయ్యకి మెలకువ రాలేదు. గవరయ్య కర్మ కాలింది. పాక పైకప్పు కూలింది. కర్మకు ఈశ్వరుడైనా బద్ధుడే. పాకని ప్రవాహం తనలో ఇముడ్చుకుంది. పాక తనతో గవరయ్యను ఈడ్చుకుపోయింది. చుట్టూ నీరు, నిశీధి. కాసేపు గింజుకుని ఆ జీవుడు జన్మ చాలించాడు. కొన్ని రోజుల తర్వాత గోదాట్లో గవరయ్య శవం తేలింది. ఉబ్బి ఉన్న శరీరాన్ని కింద నుండి చేపలు పొడుచుకుని తింటున్నాయి. అతని చేతి పిడికిలిలో మాత్రం ఎలుగుబంటి ఎముక బలంగా బిగుసుకుని ఉంది. బయట వాటికి దొరికితే పరుగున వచ్చి పీక కొరికేస్తాయేమోనని భయం. వాటి నోటన పడి చచ్చే కంటే, సూర్రెడ్డి చేతిలో తన్నులో, తిట్లో తినడమే ఉత్తమమని ఊరుకున్నాడు కొండదేవర. కొత్త పుస్తకాలు రాస్తా (నవల) ఆంగ్లమూలం: జి.జానకీశాస్త్రి స్వేచ్ఛానువాదం: డా.పి.మహాలక్ష్మి పేజీలు: 216; వెల: 100 ప్రతులకు: అనువాదకురాలు, శ్రీకనకమహాలక్ష్మి నర్సింగ్ హోమ్, 14-25-11/1, మహారాణిపేట, విశాఖపట్నం-530002. ఫోన్: 0891-2565676 కాలంతెరలు (నానీలు) రచన: కోసూరి రవికుమార్ పేజీలు: 48; వెల: 40 ప్రతులకు: కవి, దాచేపల్లి, గుంటూరు జిల్లా-522414. ఫోన్: 9491336488 శిష్య శతకము రచన: డా. కడిమిళ్ల వరప్రసాద్ పేజీలు: 32; వెల: 40 ప్రతులకు: కె.రమేశ్, 3-6-50, యర్రమిల్లివారి వీధి, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్: 08814-274876 ప్రశ్నోత్తరాల్లో పంచమ వేదం తెలుగు సాహిత్యంలో సమున్నతమైన స్థానాన్ని సంపాదించుకుని, పంచమవేదంగా పేరు పొందింది మహాభారతం. అంతటి విశిష్ఠమైన గ్రంథాన్ని అధ్యయనం చేయడం అందరికీ అవసరమే. వ్యావహారిక భాషలో పిలకా గణపతి శాస్త్రి వంటివారు రాసిన కవిత్రయ భారతాన్ని ఒకటికి నాలుగు సార్లు చదివితే కాని ముఖ్యమైన విషయాలు గుర్తుండవు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేసిన నండూరి గోవిందరావు సాహితీ సేద్యం కూడా విస్తారంగా చేసిన అనుభవంతో భారతాన్ని మథించి, దానిని ఏవిధంగా అందిస్తే పాఠకులు పదికాలాలపాటు గుర్తు పెట్టుకోగలరో ఒక అవగాహనకు వచ్చారు. దాని ఫలితమే ప్రశ్నోత్తరాల రూపం. పద్ధెనిమిది పర్వాలకు 2,517 ప్రశ్నలు-సమాధానాలు పొందుపరిచారు. మహాభారతము- ప్రశ్నోత్తర మాలిక రచన: డా. నండూరు గోవిందరావు పేజీలు: 278; వెల: 125 ప్రతులకు: రచయిత, ఇంటి నం: 1-9-1113/31, విద్యానగర్, హైదరాబాద్- 500044. ఫోన్: 9849801490 - డి.వి.ఆర్. భాస్కర్ -
చంద్రబింబం: ఆగస్టు 17 నుండి 23 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఆప్తులు దగ్గరవుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఊహించని రీతిలో ఆహ్వానాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పైస్థాయి ప్రశంసలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం పరిష్కారమవుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి అవార్డులు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వారం మధ్యలో అనారోగ్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీసేవలకు తగిన గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనులు చకచకా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. గృహ నిర్మాణ, కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో రుణాలు చేస్తారు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త విషయాలు గ్రహిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవులు. వారంమధ్యలో ఆలయాల దర్శనం. ఆరోగ్యభంగం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైన కేసు అనుకూలంగా పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనుల్లో జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటన వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
గర్వంగా చెబుతారు..!
పంచామృతం ‘నా శరీరంలో మరో జీవిని సమాధి చేయను...’ అని ప్రకటించుకొన్నారు ప్రఖ్యాత పెయింటర్ లియోనార్డో డావించి. ‘శాకాహారులు ఈ ప్రకృతికి ప్రియమైన వాళ్లు..’ అని చెప్పారు విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. శాకాహారుల్లో ఒక గర్వం ఉంటుంది. నవీన మానవుడి ఆహారపు గొలుసులో కూడా వీళ్లు ప్రత్యేకమైన వాళ్లు. ఇలాంటి వారిలో మనకు బాగా తెలిసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు శాకాహారులం అని గర్వంగా ప్రకటించుకున్నారు. వారిలో కొందరు... విద్యాబాలన్... తమిళ-బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన విద్య తన కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఆమె మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. తను సహజసిద్ధంగానే వెజిటేరియన్‌ని అనే విద్య ఈ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా కోరుకోవడం లేదు. అమితాబ్ బచ్చన్... ఆహారం మనిషి శక్తిస్థాయిని ప్రభావితం చేస్తుందని అనుకుంటే... అమితాబ్ శక్తి స్థాయి పూర్తిగా శాకాహారం వల్ల సమకూరినదే. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) తరపున వరసగా మూడుసార్లు ‘హాటెస్ట్ వెజిటేరియన్’గా పురస్కారాన్ని అందుకున్నారీయన. కేట్ విన్స్లెట్... ఈ టైటానిక్ సుందరి ‘పెటా’ మద్దతుదారు. మాంసం కోసం బాతులను కోయడాన్ని చూడటం కేట్‌ను శాకాహారిగా మారేలా చేసిందట. తనవంతుగా జీవహింసను తగ్గించడానికి మాంసాహారాన్ని వదిలేసి, పెటా తరపు ప్రచార కర్తగా మారారు. మల్లికా షెరావత్... సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపించినా... మల్లిక స్వాభావికంగా జంతుహింసకు చాలా దూరమట. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా నాన్‌వెజ్‌ను ముట్టిందే లేదట. పెటావాళ్లు తనను ‘సెక్సియెస్ట్ వెజిటేరియన్’గా ఎంపిక చేయడం కూడా తనకు గర్వకారణమటున్నారు. కంగనా రనౌత్... హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్‌పుత్‌ల కుటుంబం నుంచి వచ్చిన కంగనా తన జీవనశైలిలో భాగంగా మాంసాహారాన్ని త్యజించారు. చాలా సంవత్సరాల నుంచి శాకాహారిగా ఉంటున్నాననీ, అప్పట్నుంచి గ్లామరస్‌గా తయారయ్యాయననీ కంగనా చెబుతున్నారు. అందంగా తయారవ్వాలనుకుంటున్న వాళ్లు తన దారికి వచ్చేయాలని కూడా కంగనా సలహా ఇస్తున్నారు! -
ఎవరైనా ఉన్నారా ?
నిజాలు దేవుడికెరుక: జనవరి 2007. బ్రిటన్‌లోని నాటింగ్ హామ్.... ‘‘వావ్... ఈ ఇల్లు భలేవుంది డాడ్’’ పెద్ద కూతురి మాట వినగానే అబ్దుల్ రషీద్ ముఖం వికసించింది. అతడికి తెలుసు... తన భార్యకి, పిల్లలకి ఇల్లు చాలా నచ్చుతుందని. 3.6 మిలియన్ డాలర్లు పోసి సొంతం చేసుకున్నాడు, నచ్చకుండా ఎలా ఉంటుంది! ‘‘నిజం రషీద్... అద్భుతంగా ఉంది. కానీ మనకింత పెద్ద ఇల్లు అవసరమా?’’ అంది రషీద్ భార్య నబీలా ఇల్లంతా పరికించి చూస్తూ. పదిహేడు బెడ్రూములు, ఓ థియేటర్, జిమ్ తదితర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్న ఆ ఇంటిని చూస్తే ఎవరూ ఈ ప్రశ్న అడక్కుండా ఉండరు. ‘‘అలా అంటావేంటి నబీలా? ఇలాంటి ఇంట్లో ఉండటం ఎంత బాగుంటుంది చెప్పు! మన ఆరుగురికీ ఇల్లు పెద్దదే. కానీ ఇక్కడ నేను వ్యాపారం కూడా ప్రారంభించబోతున్నానని చెప్పాను కదా! దీన్ని మన కలల స్వర్గంలానే కాదు, మంచి బిజినెస్ సెంటర్‌గా కూడా మారుస్తాను’’ భర్త హుషారు చూసి ముచ్చటేసింది నబీలాకి. రషీద్ మంచి వ్యాపారి. దుబాయ్‌లో హాస్పిటళ్లు, హోటళ్లు నడుపుతున్నాడు. లాభాలను పండిస్తున్నాడు. ‘‘మళ్లీ కొత్త వ్యాపారమన్నమాట. కానివ్వు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావ్ కదా!’’ అంది నబీలా నవ్వుతూ. ‘‘మరి! ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకునేవాడే జీవితంలో గొప్పవాడు అవుతాడు. నీ భర్త గొప్పవాడవుతానంటే వద్దంటావేంటి?’’ ‘‘అరే... నేనెప్పుడు వద్దన్నాను? నువ్వేం చేసినా సక్సెస్ అవుతావని నాకు నమ్మకం ఉంది. నీకు నచ్చింది చెయ్యి’’ అంది నబీలా భర్త కళ్లలోకి చూస్తూ. ఆమె నమ్మకానికి మురిసిపోయాడు రషీద్. భార్యని, ముగ్గురు కూతుళ్లన్నీ ఇల్లంతా తిప్పాడు. వారి పద్దెనిమిది నెలల కొడుకు హుషారుగా గెంతసాగాడు. ‘‘చివరికి వీడిక్కూడా ఇల్లు నచ్చినట్టుంది నబీలా... చూడు ఎలా గంతులేస్తున్నాడో’’... కొడుకుని ఎత్తుకుంటూ అన్నాడు రషీద్. నబీలా నవ్వింది. ఆ నవ్వుల మధ్య కొత్త ఇంట్లో వారి జీవితం మళ్లీ కొత్తగా మొదలైంది. ‘‘రషీద్... రషీద్’’ భార్య అరుపులు విని గదిలోంచి బయటకు వచ్చాడు రషీద్. నబీలా కంగారుగా వచ్చి అతడి ఎదురుగా నిలబడింది. ‘‘ఏమైంది నబీలా... ఎందుకలా అరిచావ్? అలా ఉన్నావేంటి నువ్వు?’’... ఆతృతగా అడిగాడు. నబీలా వెంటనే మాట్లాడలేకపోయింది. ‘‘అక్కడ... అక్కడ..’’ అంటూ నసిగింది. ‘‘ఏమైంది? ఏదైనా చూసి జడుసుకున్నావా ఏంటి?’’లేదన్నట్టు తలూపింది. ‘‘ఎవరో తలుపు కొట్టారు రషీద్. ఎవరైనా ఉన్నారా అంటూ పిలిచారు కూడా. నేను తలుపు తీసి చూశాను. కానీ ఎవ్వరూ లేరు.’’‘‘అంతేనా... ఒక్కోసారి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎవరూ ఉండి ఉండరు. అయినా నోటితో ఎందుకు పిలుస్తారు? కాలింగ్ బెల్ ఉంది కదా?’’అదీ నిజమే అన్నట్టు చూసింది నబీలా. అయినా ముఖంలో ఆందోళన తగ్గలేదు. బెరుకుగా చూసింది భర్తవైపు. ‘‘భయపడకు డియర్... కొత్త ఇల్లు కదా. అలవాటయ్యే వరకూ కాస్త అలానే ఉంటుంది. అయినా నేను ఉన్నానుగా, భయమెందుకు?’’ అంటూ భార్యను దగ్గరకు తీసుకున్నాడు రషీద్. ‘‘నబీలా... నీ చేత్తో కాస్త కాఫీ ఇస్తావా?’’హాల్లో సోఫాలో కూర్చుని ఫైలు తిరగేస్తూ అరిచాడు రషీద్. ఎంతమంది పనివాళ్లు ఉన్నా భార్య చేతి కాఫీ రుచి అంటే మహా ఇష్టం అతడికి. ‘‘ఓ... ఇప్పుడే తెస్తా’’ అంటూ బదులు వినిపించింది. ఆ వెంటనే మరో స్వరం కూడా వినిపించింది. ‘‘ఎవరైనా ఉన్నారా’’ అంటూ. ఒక్కక్షణం ఫైలు చూడ్డం ఆపి చుట్టూ చూశాడు. ఆ మాట ఎక్కడ్నుంచి వినిపించిందో అర్థం కాలేదు. దాంతో మళ్లీ ఫైల్లో తలదూర్చాడు. క్షణం తర్వాత మెయిన్ డోర్ కొడుతున్నట్టు అనిపించింది. పని ఆపి అటు చూశాడు. ‘‘ఎవరైనా ఉన్నారా?’’.. ఓ మగ మనిషి అరిచాడు.‘‘ఏంటలా చూస్తున్నారు?’’ అప్పుడే అక్కడికి వచ్చిన నబీలా అడిగింది. ‘‘ఎవరో తలుపు కొడుతున్నారు’’ చెప్పాడు. నబీలాకి తన అనుభవం గుర్తొచ్చింది. ‘‘ఇంత రాత్రిపూట ఎవరొస్తారు రషీద్’’ అంది భయంగా. ‘‘చూస్తానుండు’’ అంటూ వెళ్లి తలుపు తీశాడు. కానీ అక్కడెవ్వరూ లేరు. ‘‘ఎవరూ లేరు కదా? నేను చెబితే నమ్మావా?’’ అంది వెనకే నిలబడిన నబీలా. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రషీద్‌కి. సెక్యూరిటీ గార్డ్స్‌ని పిలిచి నిలదీశాడు. ఎవ్వరూ రాలేదని చెప్పారు వాళ్లు. దాంతో మౌనంగా లోనికి నడిచాడు. ఇక పని చేయబుద్ధి కాకపోవడంతో నిద్రకు ఉపక్రమించాడు. కాసేపటికే మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఐదు కావస్తుండగా మెలకువ వచ్చింది రషీద్‌కి.‘‘సారీ రషీద్... నా కదలికలకి మెలకువ వచ్చినట్టుంది నీకు. బాబు ఊరికే కదులుతున్నాడు. ఆకలేస్తోందేమో. పాలు కలిపి తీసుకొస్తాను’’ అంటూ వెళ్లింది. ఓసారి కొడుకు వైపు చూసి మళ్లీ కళ్లు మూసుకున్నాడు రషీద్. పది నిమిషాల తర్వాత ‘రషీద్’ అన్న అరుపు వినబడి ఉలిక్కిపడ్డాడు. ఏమయ్యిందోనని గబగబా పరుగు తీశాడు. పిల్లల బెడ్రూమ్ గుమ్మం దగ్గర నిలబడి ఉంది నబీలా. గజగజా వణుకుతోంది. ఒళ్లంతా చెమటలు! ‘‘నబీలా... ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావ్?’’ అంటూ పట్టి కుదిపాడు. ‘‘రషీద్... పాప... పెద్ద పాప...’’గదిలోకి తొంగి చూశాడు రషీద్. ఏమీ కాలేదు. పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మరి నబీలా ఎందుకు అరచినట్టు! ‘‘పాపా... పాపకేమైంది? నిద్రపోతోంది కదా’’ అన్నాడు అయోమయంగా. ‘‘కానీ నాలుగు నిమిషాల ముందు హాల్లో టీవీ చూస్తోంది’’ అంది వణుకుతున్న స్వరంతో. ‘‘వ్వా....ట్? టీవీ చూస్తోందా? నీకేమైనా మతిపోయిందా? ఈ టైమ్‌లో టీవీ ఎందుకు చూస్తుంది?’’ ‘‘అదే నాకూ అర్థం కాలేదు రషీద్. బాబుకి పాలు కలిపి కిచెన్‌లోంచి బయటకు వచ్చాను. హాల్లో సోఫాలో కూర్చుని పాప టీవీ చూస్తోంది. ఇప్పుడు కిందికొచ్చావేంటి అని అడిగాను. తను మాట్లాడలేదు. టీవీ ఆఫ్ చేసి పడుకో అంటూ అరిచి, మన రూమ్‌కి వస్తూ ఎందుకో పిల్లల గదిలోకి చూశాను. తను గదిలోనే ఉంది. నిద్రపోతోంది. ఇదెలా సాధ్యం రషీద్?’’ ఆశ్చర్యంతో నోరు తెరచుకుని వింటున్నాడు రషీద్. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?’’ అన్నాడు నమ్మలేనట్టుగా.‘‘నిజం రషీద్. ఎప్పుడూ ఎవరో వెనక ఉన్నట్టనిపిస్తుంది. నీడలా వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో నాకేం బాలేదు.’’ఏడుపు ముంచుకొచ్చేసింది నబీలాకి. బేలగా భర్త గుండెల మీద వాలిపోయింది. అతడేమీ మాట్లాడలేదు. భార్య వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. ఆమె చెప్పేదంతా నిజమని అతడికీ తెలుసు. ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఆడవాళ్ల ఏడుపులు వినిపిసున్నాయి. మగవాళ్ల నీడలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల అల్లరి చెవుల్లో పడుతుంది. చూస్తే తమ పిల్లలు బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు. ఇవన్నీ రషీద్ కూడా రుచి చూసిన అనుభవాలే. కానీ భార్యను భయపెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆమెకి కూడా తెలిసిపోయింది. అయినా ధైర్యం చేసి ఉండాలనుకున్నారు కానీ, కొద్ది రోజుల తరువాత తమ బాబు దుప్పటి మీద కనిపించిన రక్తపు మరకలు వారిని ఆందోళనలో పడేశాయి. బాబుకేదైనా అయ్యిందేమోనని ఒళ్లంతా చెక్ చేశారు. కానీ ఎక్కడా చిన్న గాయం కూడా కనిపించలేదు. దాంతో ఇక ఆ ఇంట్లో ఉండలేనని గొడవ చేసింది నబీలా. ఆమె బాధను అర్థం చేసుకున్న రషీద్... రాత్రికి రాత్రే కుటుంబాన్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆ భవంతి వెలుగులోకి వచ్చింది. దాని వెనక ఉన్న చీకటి చరిత్ర అందరికీ తెలిసింది. రషీద్ కొన్న భవంతి పేరు... క్లిఫ్టన్ హాల్. సర్ క్లిఫ్టన్ 1778-1797 మధ్యలో దీనిని నిర్మించారు. జాన్ కార్ అనే ఆర్కిటెక్టు దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఏడు వందల యేళ్లపాటు ఆ వంశస్తులే ఈ భవంతిలో నివసించారు. తర్వాత ఇది వారి బంధువుల చేతికి వచ్చింది. 1958లో ఇక్కడ క్లిఫ్టన్ హాల్ గ్రామర్ స్కూల్‌ను పెట్టారు. 1976 వరకూ అది నిరాటంకంగా కొనసాగింది. అది మూతబడిన తర్వాత నాటింగ్ హామ్ యూనివర్శిటీని ఇందులో పెట్టారు. 2000వ సంవత్సరంలో మొత్తం భవనాన్ని విభజించి, రెండు ఆధునికమైన గృహాలుగా చేశారు. వాటిలో ఒకదాన్ని రషీద్ కొన్నాడు. తొమ్మిది నెలలు నివసించాక భయంతో ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నిజానికి రషీద్ అక్కడ ఓ మ్యారేజ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, ట్రెయినింగ్ కాలేజీ వంటివి పెట్టాలనుకున్నాడు. కానీ ఎవ్వరూ ఆ భవంతిలో అడుగు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఆ ఇంట్లో పని చేయడానికి కూడా ఎవరూ వచ్చేవారు కాదు. సెక్యూరిటీ ఏజెంట్లు కూడా ఓ రాత్రి పని చేశాక మానేసేవారు. దానికితోడు కుటుంబ సభ్యులకే భయంకర అనుభవాలు ఎదురు కావడంతో ఇక ఆ ఇంటిని వదులుకోక తప్పలేదు రషీద్‌కి. అక్కడికీ పరిశోధకులను పిలిపించి ఇల్లు చూపించాడు. వచ్చినవారిలో ఇద్దరు ఆత్మలను చూసి కళ్లు తిరిగి పడిపోయారు. దాంతో అమ్మకానికి పెట్టేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ బ్యాంకు వారు దాన్ని కొనుక్కున్నారు. దెయ్యాలు లేవనేవారు ఆ ఇంటిని కొనడానికి చేసిన అప్పు తీర్చలేక రషీద్ పుకార్లు పుట్టించాడన్నారు. కానీ అది నిజం కాదు. అతడు విజయవంతమైన వ్యాపారి. డబ్బున్నవాడు. అలా చేయాల్సిన అవసరం అతడికి లేదు. పైగా పత్రికాముఖంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను చెప్పాడు! మరోపక్క పోలీసులు, పరిశోధకులు కూడా ఆ ఇంట్లో భయంకర అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆ ఛాయలకు ఇక పోయేది లేదని తేల్చేశారు. వాళ్లెం దుకు అబద్ధం చెప్తారు?! అంటే ఇదంతా నిజమనే అను కోవాలా? అంటే... అక్కడ ఎవరైనా ఉన్నారా? - సమీర నేలపూడి -
మైలపడి పోయెనోయి- నీ మనుజ జన్మ!
తపాలా: మా పిల్లలకు చిన్నప్పుడే తెలుగుభాషపై అభిరుచి, అభిమానం ఏర్పడాలని కొంత ప్రయత్నించాను. దానికోసం ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి తేలికైన పద్యాలను పాడి, తాత్పర్యాలను బోధించేవాణ్ని. వారికి చిన్నపోటీకూడా పెట్టేవాణ్ని. ఎవరు ఎక్కువ పద్యాలు రాగయుక్తంగా, భావయుక్తంగా పాడితే ‘ఇంత’ డబ్బు ఇస్తాననేవాణ్ని. అలా జాషువా, పోతన పద్యాలను కూడా కంఠతా పట్టించాను. ఈ కార్యక్రమమంతా మా పిల్లలు ప్రాథమిక పాఠశాల చదువులప్పుడే జరిగింది. హైస్కూలు చదువు కూడా అయిపోయి కాలేజీలో చేర్పించే సమయమొచ్చి మా అబ్బాయిని గుంటూరులో చేర్పించాను. ఎలాగూ ఇంత దూరం వచ్చాం. పాపయ్యశాస్త్రిగారిని చూసి పోవాలన్న కోరిక ఎన్నాళ్లనుండో ఉండటంతో, అప్పుడక్కడే ‘వార్త’ పత్రిక చీఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న మిత్రుడు పున్నా కృష్ణమూర్తితో మనసులోని మాట చెప్పాను.‘వెళ్దాం పదండి; నేనూ వారిని ఎన్నడూ చూడ్డం పడనేలేదు’ అన్నాడు. ముగ్గురమూ వెళ్లాం. బహుశా అది లక్ష్మీపురమయ్యుంటుంది. రైలుకట్ట అవతలుంది. శాస్త్రిగారు ఇంట్లోనే ఉన్నారు. నమస్కరించా! ‘‘అయ్యా! నేను నల్లగొండ జిల్లా నుండి వచ్చాను. మాకు ఖమ్మం అతి దగ్గరగా ఉంటుంది. వీడు మా అబ్బాయి సిద్ధార్థ. ఇక్కడే చదువుకుంటున్నాడు. వీరు, పున్నా కృష్ణమూర్తి - గుర్రం మల్లయ్యగారి మనవడు - మిమ్ము చూడాలని వచ్చాం’’ అన్నాను. మా పిల్లలకు నేర్పిన వారి పద్యాల గురించి చెప్పాను. ‘‘బుద్ధదేవుని భువిలోన పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో అందమును హత్య చేసెడి హంతకుండ మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ! దీనితో పాటే, అమ్మచేతి తాలింపు కమ్మదనము - భరతదేశాన గుమగుమ పరిమళించెనన్న పద్యమూ, జాషువాగారి గబ్బిలంలోని పద్యాలూ, ఫిరదౌసిలోని పద్యాలు కూడా కొన్నింటిని కంఠతా పట్టించాను’’ అన్నాను. అప్పుడు శాస్త్రిగారు ఓ ఉదంతం చెప్పారు. అదే ఇప్పుడు మీకు చెబుతున్నది. ‘‘నన్ను తెలుగు అకాడెమీవారు సత్కరించడం కోసమని, అకాడెమీ డెరైక్టరుగారు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారు. అకాడెమీ కార్యక్రమాల గురించి, విశ్వవిద్యాలయపు తీరుతెన్నుల గురించి అనేక విషయాలు మాట్లాడాక, అతిథికి కాఫీ ఇవ్వడం కోసమని ఇంట్లోకి వెడుతూ, నా ఎడల వారి అభిమానానికి గుర్తుగా ఓ గులాబీని అందించాను. అప్పటికే నా భార్య కాలం చేసింది. అందువల్ల నేను కాఫీ చేసి పట్టుకురావడానికి కొంత సమయం తీసుకుంది. ఆశ్చర్యం, వారి వద్ద నేనిచ్చిన గులాబీ జాడ కనిపించనే లేదు. కాడ మటుకు టీపాయ్ మీద ఉంది. నేను గ్రహించిందేమంటే, వారు గులాబీ ఒక్కొక్క రేకును వలిచి నమిలి మింగేశారని! నా మొహం వివర్ణమైపోయింది. నాకు పువ్వుల ఎడ ఉన్న ఆర్ద్రతను ‘పుష్పవిలాపం’లో చెప్పానన్న విషయం నా అతిథికి తెలియనిది కాదు. అయినా ఇలా జరిగిందేమిటన్న ఆలోచన నన్ను ప్రశాంతంగా ఉండనీయలేదు’’ అన్నారాయన. పువ్వుల్ని ప్రేమించలేనివాడు తాడితుల్ని, పీడితుల్ని ఏం ప్రేమిస్తాడని ‘పుష్పవిలాపం’ పద్యాల ద్వారా చెప్ప ప్రయత్నించానని ముగించారు. మా అమ్మ ముక్కు గట్టిగా వుండాలి స్వామీ! మా తమ్ముడు బెంగళూరు లో ఉంటాడు. నేను, మా బాబు రిషి, వేసవి సెలవుల్లో బెంగళూరు వెళ్లాం. మా తమ్ముడికి నాలుగేళ్లు బాబు ఉన్నాడు. వాడి పేరు అక్షయ్. అక్షయ్ పుట్టినరోజున కొత్త బట్టలు వేసి, హారతి ఇస్తుంటే, ‘‘నేను దేవుడినా? నాకు హారతి ఇస్తున్నారు’’ అన్నాడు. మేమెంతో ఆశ్చర్యపోయాం. అక్షయ్‌కు వాళ్ల అమ్మ ముక్కు పట్టుకోవటమంటే ఎంతో ఇష్టం. వాళ్ల పక్కింటివాళ్లలో ఒకరు, ‘మీ అమ్మ ముక్కును నేను తీసేసుకుంటాను’ అని సరదాగా అన్నారు. వెంటనే వాడు కొంచెం దిగాలుగా దేవుడి గదిలోకి వెళ్లి, ‘‘మా అమ్మ ముక్కును స్ట్రాంగ్‌గా చేసి ఆంటీ తీసుకువెళ్లకుండా చూడు స్వామీ’’ అని నమస్కరిస్తుంటే, మా అందరికీ నవ్వు ఆగలేదు. అక్షయ్‌తో నేను ఆడుకుంటున్నప్పుడు మా ఇద్దరి తలలు ఢీ కొట్టుకున్నాయి. మరునాడు, ‘‘చూడు అక్షయ్, నా తల వాచిపోయింది’’ అని నేనంటే, వాడు వెంటనే, ‘‘వాచి పోయిందా? వాచ్ పోయిందా?’’అనగానే, వాడి రైమింగ్ వర్డ్స్‌కు ఆశ్చర్యపడి నవ్వుకున్నాం. - విజయశంకర్ ద్రాక్షారామం - గుడిపూడి సుబ్బారావు మలక్‌పేట, హైదరాబాద్ -
ఆదర్శవంతులు
పంచామృతం స్మోకింగ్‌ను సరదాగా మొదలు పెట్టి, హాబీగా మార్చుకుని, అనంతరం దాన్నొక మానలేని అలవాటుగా చేసుకున్న వాళ్లెంతోమంది. ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సిగరెట్ స్మోకింగ్‌కు అతీతులు కాదు. అయితే తనను తాను చంపుకుంటూ, ఎదుటి వాడిని చంపడానికి మనిషి కనిపెట్టుకున్న ఆయుధం సిగరెట్... అనే విషయాన్ని గ్రహించి దాన్ని దూరంగా నెట్టిన వాళ్లూ ఉన్నారు. సిగరెట్ అలవాటును మానుకున్నందుకు గానూ వీళ్లను ఆదర్శవంతులని చెప్పవచ్చు. మానాలని అనుకొంటున్న వారికి స్ఫూర్తిదాతలుగానూ పరిచయం చేయవచ్చు! ఆమిర్‌ఖాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరు పొందిన ఆమిర్‌కు సిగరెట్.. మానుకోలేని అలవాటుగానే ఉండిందట. తొలి భార్య సంతానం అయిన జునైద్, ఇరాలు తండ్రి చేత ఈ అలవాటును మాన్పించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ విషయంలో తను అశక్తుడినని ఆయన చెప్పేవాడట. అయితే సరోగసి పద్ధతిలో పిల్లాడు పుట్టిన ఆనందం ఆమిర్ చేత సిగరెట్ మాన్పించిందట. ఎలా మానగలిగావు? అంటే మాత్రం... దానిపై ఒక గ్రంథమే రాయొచ్చని అంటాడు ఖాన్. సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాల పాటు ఆ అలవాటును మానాలనే ఆలోచనే లేదట సల్లూభాయ్‌కి. అయితే మూడేళ్ల కిందట ఒకసారి సల్మాన్ హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. నరాల సంబంధిత సమస్యతో తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యాడు. అప్పటికి గానీ జ్ఞానోదయం కాలేదు. అప్పటి నుంచి మళ్లీ సిగరెట్ ముట్టింది, ముట్టించిందీ లేదు! హృతిక్ రోషన్ ఈయన ఒకసారి కాదు, గతంలోనే ఐదు సార్లు మానేశాడట! చివరిసారి మాత్రం అలెన్ కార్ రచించిన ఒక మోటివేషనల్ పుస్తకాన్ని చదివి సిగరెట్‌కు శాశ్వతంగా సెలవిచ్చాడట. అందులో సిగరెట్ స్మోకింగ్‌ను వదిలించుకోవడానికి సులభమైన మార్గాలు చదివి వాటిని అమల్లో పెట్టానని హృతిక్ చెబుతాడు. బరాక్ ఒబామా ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్‌కు టీనేజ్‌నుంచే సిగరెట్ అలవాటు ఉందట. అయితే అమెరికా అధ్యక్షుడవ్వడానికి ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయంలో తీవ్రమైన ఒత్తిడికి సిగరెట్ తోడయితే మరింత ఇబ్బంది కలిగేదట. దాంతో అప్పుడు స్మోకింగ్‌కు స్వస్తి చెప్పేశాడట. 2009లో అధ్యక్షుడి హోదాలో సగర్వంగా ‘యాంటీ స్మోకింగ్ బిల్లు’ ను ప్రవేశ పెట్టగలిగానని ఆయన అంటాడు. -
ఘనజీవి
‘‘రావిశాస్త్రి మంచి రచయిత కాడు’’. అది సుబ్బయ్య అభిప్రాయం కాదు. ‘‘రావిశాస్త్రి ఒట్టి చచ్చు రచయిత’’. అదీ సుబ్బయ్య అభిప్రాయం కాదు. ‘‘రావిశాస్త్రి ఈజ్ వెరీ ఎఫిషియన్ట్ రైటర్’’. సుబ్బయ్యలాగే అనేకమంది ‘పాస్’ చేసే ‘రిమార్క్’ అది. రావిశాస్త్రి హాఫ్ హాండ్స్ చొక్కా వేసుకుంటాడు. వేసుకున్న హాఫ్‌హాండ్స్ చొక్కాను టక్ చేసుకుంటాడు. మనిషి చూడ్డానికి తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్నాయన నల్లటి కళ్లద్దాలు పెట్టుకుంటాడు. ఆ కళ్లద్దాలు మందంగా ఉంటాయి. హాఫ్‌హాండ్స్ చొక్కాను టక్ చేసుకునే ఈ తెల్లటి నల్ల కళ్లద్దాల మనిషిని పూర్తిపేరుతో ‘రాచకొండ విశ్వనాథశాస్త్రి’ అని ఎవరూ పిలవరు. ‘చాత్రిబాబు’ అంటారు. లాయర్ బాబు అని కూడా అంటారు. అలాంటి లాయర్‌బాబైన చాత్రిబాబు ‘నంగిరిపింగిరి’గా ఎప్పుడూ రాయలేదు. ధైర్యంగా రాసేడు. జోరుగా రాసేడు. రకరకాల బతుకుల్నీ, ‘అధోజగత్’ జీవుల్నీ; కోర్టుల్లోని ప్లీడర్లనూ, సాక్షులనూ, సారాకాసేవాళ్లనూ, ఆ కాసిన సారాతాగేవాళ్లనూ, సిల్కు జాకెట్లనీ, ‘గవరయ్య’ల్నీ, నాయకుల్నీ, దోపిడీగాళ్లనీ, అమాయకుల్నీ, పిరికివాళ్లనీ అందరినీ బొమ్మ కట్టించేడు. ‘ధైర్యం ఉంటేనే మిగతా సద్గుణాలు (నిలబడతాయి.)... పాపుల్లో సాహసులూ ఉంటారు, భయస్తులూ ఉంటారు. కాని- భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికివారెవరూకూడా మంచివారు కాజాలరు; మంచికి నిలబడలేరు... మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా ఉండాలి,’ అని మనస్ఫూర్తిగా నమ్మి రాసేడు. ‘డబ్బులో వుండే సౌఖ్యాలూ, లేమిలో వుండు దుఃఖాలూ, ధనం కల్పించే గొప్ప గర్వం మదాంధతా, లేమి కల్పించే నిస్పృహ నైచ్యం దైన్యం’ అన్నీ కూడా జీవితంలోంచి బాగా ఎరిగి రాసేడు. ‘నిజంగా జరిగింది నిజంగా జరిగిందా? జరిగినది నిజం జరిగినది నిజమేనా?’ అని అక్షరాలను ఆచితూచి మరీ రాసేడు. ‘దారిద్య్రం ఎవ్వరికీ... (చివరికి తన) పగవాడిక్కూడా ఉండకూడదని’ మరీమరీ తలిచేడు, తలిచి మరీ రాసేడు. ‘‘సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొకచోట ప్రవాహంలా పరవళ్లు తొక్కుతుంది. ఇంకొకచోట జలపాతంలా ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొకచోట కవిత్వంగా మారి కావ్యస్థాయికి తీసుకెళ్తుంది’’. ‘బందోబస్తుగా చాలా భారీగా ఉన్నాడతను. సీమపందిలా ఎర్రగానూ, పనసకాయలా గరుగ్గానూ ఉన్నాడు. బాగా సర్వీసు చేసినప్పటికీ చెడిపోకుండా నిలబడ్డ బెంజి లారీలా దిట్టంగానూ ఉన్నాడు’. (‘రాజు-మహిషి’ నవలలో మందుల భీముడి గురించి) ‘ఆమెకు ముప్పయ్యేండ్లుండొచ్చు. ఒకప్పుడామె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయుంటుంది. చాలారోజుల కిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది (‘మాయ’ కథలో ముత్తేలమ్మ వర్ణన) శంకరగిరి గిరిజాశంకరం, అన్జానా, జాస్మిన్, కాంతాకాంత, గొల్కొండ రాంప్రసాద్ లాంటి మారుపేర్లతోనూ రాశాడు రావిశాస్త్రి. తన కోపం, తన దుఃఖం, సంతోషం, సరదా, క్యూరియాసిటీ వగైరాలు ఇతరులకు తెలియచెయ్యడానికి కూడా ఆయన రచయిత అవతారం ఎత్తాడు. అయితే, ‘తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తూందో అని ఆలోచిం’చి మరీ జాగ్రత్తగా రాసేడు. ‘రచయిత (అయిన) ప్రతివాడూ’ కూడా అలాగే రాయాలని కోరుకున్నాడు. ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, ఆరు చిత్రాలు, మరో ఆరు చిత్రాలు, రుక్కులు, బాకీ కథలతోపాటు, అల్పజీవి, ఇల్లు, సొమ్మలు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త నవలల్ని మళ్లీ మళ్లీ చదువుకొండని వదిలేసివెళ్లిపోయాడు రావిశాస్త్రి. రత్తాలు-రాంబాబు, రాజు-మహిషి లాంటి అసంపూర్ణ నవలలను పూరించుకునే అవకాశం కూడా ఇచ్చివెళ్లాడు. అర్ధాంతరంగా ముగించినా, వాటిని సంపూర్ణంగా పారాయణం చేయగలిగేలా చేసేది రావిశాస్త్రి చేసిన మాటల మాయాజాలం; కాళిదాసులాగా ముచ్చటగొలిపే ప్రతీకల శైలీ విన్యాసం. అసలు ఉపమానాలతోనే కడుపు నింపేస్తాడు. ఒక్కోసారి కథను పక్కనపెట్టి, చదవడం కోసమే చదువుకోగల వినోదం ఇస్తాడు. ఆ తరహా చాలా కొద్దిమందికి లోపమూ, చాలా ఎక్కువమందికి ఆయన అక్షరాల్ని విడిచిపెట్టకుండా చదువుకునే ఆకర్షణాబలమూ! -
భావి సంస్కర్తతో నట్టింట్లోంచి పందిట్లోకి!
‘‘త్వరగా ఆం తినెయ్... లేదంటే బూచాడు వస్తాడు’’ అంటోంది మా ఆవిడ మా బుజ్జిగాడికి అన్నం తినిపిస్తూ. రాత్రివేళల్లో బూచిగాడొస్తున్నాడగానే గబగబా తినేసి, త్వరగా పక్క ఎక్కేస్తుంటాడు వాడు. ఒక ఆనవాయితీగా అనేక తరాల నుంచి వస్తున్న ఈ టెక్నిక్‌ను మా ఆవిడా వాడుతుండటాన్ని గమనించిన నేను సంప్రదాయానికి గల బలాన్ని చూసి ఆశ్చర్యపోయా. అయితే అంతకంటే ఆశ్చర్యపోయే ప్రశ్నొకటి వేశాడు మా బుజ్జిగాడు. ‘‘నానా... ఎప్పులూ బూచాడులే బయంకరంగా ఉంతాలా? బూచిది అంత బయంకరంగా ఉండదా? ‘అదుగో... బూచిది వస్తోం’దంటూ అమ్మ ఎప్పుడూ బయం పెట్టదెందుకు?’’ అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక అప్పటికి కలవర పడ్డా... బూచిదానికీ పిల్లల్ని భయపెట్టే శక్తి ఉంటుంది. ఆం తినిపించేటప్పుడు బయపెట్టడంలో దానికీ తగిన స్థానమివ్వాలి. బూచిదానికీ పిల్లల్ని పక్కతడిపేలా చేయగల శక్తి ఉంటుంది. దానికీ తగిన ప్రోత్సాహమివ్వాలి. బూచిదానికీ తగిన ప్రాచుర్యమివ్వాలి అని భవిష్యత్తులో ఆడబూచీల పక్షం వహించి పోరాడేబోయే ఓ చిన్నారి చలంగారు మా ఇంట పారాడుతున్నారంటూ చాలా సంతోషించా. తర్వాతి రోజుల్లో మా బుజ్జిగాడు కథలు చెబితేనే నిద్రపోనంతగా కాస్త పెద్దాడయ్యాడు. చిన్నప్పటి బూచిగాడి ప్రభావమో ఏమోగానీ... దెయ్యాల కథలు వింటేనే వెంటనే నిద్రపోయేవాడు. ఆ బలహీనత ఎరిగి వాణ్ణి త్వరగా నిద్రపుచ్చాలని నేనూ అవే కథలు చెబుతుండేవాణ్ణి. ఓరోజు నేను జవాబు చెప్పలేనివిధంగా మరో ప్రశ్న వేశాడు వాడు. ‘‘నానా... దెయ్యాలెప్పుడూ తెల్లచీరలే ఎందుకు కడతాయి? రంగు చీరలు కూడా కట్టొచ్చు కదా. వాటికి ఇష్టం ఉండవా? అయినా ఆడబూచీ దెయ్యాలు రంగులను ఇష్టపడకుండా ఎందుకుంటాయి?’’ అన్నది వాడి సందేహం. అప్పటికి ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు. కానీ... ‘‘దెయ్యాలన్నీ చిమ్మచీకట్లో తిరుగుతుంటాయి కద నాన్నా... డార్క్ రంగు చీరలు కట్టుకుంటే ఆ చీకట్లో కళ్లు సరిగ్గా కనపడక, ఒకదానికొకటి గుద్దుకుంటాయేమోనని అలా తెల్లచీరలు కట్టుకుంటాయన్నమాట’’ అని సమాధానమిచ్చా. ఆ జవాబుకు సంతృప్తి పడలేదు వాడు. ‘‘బ్రైటు కలర్సూ, లైటు కలర్సూ, లైటులో బ్రైటు కలర్సూ కట్టుకోవచ్చు కదా’’ అని మళ్లీ అడిగాడు. మళ్లీ ఏం సమాధానం చెప్పాలో తెలియకపోయినా బుడిబుడి నడకలతో నడయాడుతూ భవిష్యత్తులో ఆడదెయ్యాల పాలిట అపర సంఘసంస్కర్తగా మారబోయే వీరేశలింగం-2 మా ఇంట్లో జన్మించినందుకు ఆనందించా. వీడి శ్రేయోదృష్టి వల్ల దెయ్యాల సమాజంలోనూ దెయ్యాలు తెల్లచీరలకు బదులు రంగు చీరలు కట్టే రోజు వస్తుందని, క్రమంగా అవి పంజాబీ డ్రెస్సులూ, చుడీదార్లూ వంటి మోడ్రన్ డ్రస్సుల దిశగా కూడా పరిణమిస్తాయనీ ఆనందించా. ఏ సంస్కరణ అయినా ఇంటితోనే మొదలవ్వాలనే ఓ ఇంగ్లిష్ సామెతను అనుసరించి... ఆడ బుచీల పట్ల, మహిళా దెయ్యాల పట్ల వాడికి గల ఉద్ధరణ శక్తిని మరింత ఉత్సాహపరిచేందుకు కొంత సానుకూలతతో మాట్లాడా. కానీ అదే నా కొంపకు చేటు తెస్తుందని నాకు తెలియదు. పిల్లల్లోని పాజిటివ్ అంశాలను ప్రోత్సహించాలన్న నా దృక్పథం తప్పనీ, దానివల్లనే వాడు దెయ్యాలు చేసే అన్ని చిలిపి పనులకూ అలవాటు పడ్డాడనీ మా ఆవిడ అభియోగం. ఈ విషయమై మా ఆవిడ ఎంత పెద్ద క్లాసు తీసుకుందంటే... వాడు సంఘసంస్కర్తగా మారాక సంస్కరించాల్సిన మొదటి వ్యక్తి మా ఆవిడే అన్నంత భయంకరంగా ఉందా క్లాసు! ఇప్పుడు నా ప్రోత్సాహం వల్ల వాడు చేసిన పనులన్నింటినీ మీకు చూపించేందుకు మిమ్మల్ని ఆహ్వానిద్దామంటే మేం తలదాచుకునేందుకు ఇప్పుడు ఇల్లు లేదు. జస్ట్... పందిరే. ‘ఈ అల్లరేమిట్రా?’’ అని అడిగితే ‘‘శుభకార్యాలకు పందిరి ప్రశస్తం. అది ఆనవాయితీ కూడా’’ అన్నాడు వాడు. ప్రస్తుతం నా చిరునామా: పందిరి నెంబర్ పదహారు తాలూకు రెండో గుంజ, బిసైడ్ గతంలో 9-6-3బి-596/25 నెంబరు గల మాజీ ఇల్లు, శ్రీకర్నగర్ కాలనీ, జిందాబాద్, హైదరాబాద్. మరి ఇల్లు పీకి పందిరేసినా మాజీ ఇల్లయినా ఉండాలికదా... ఏకంగా పదహారో పందిరికి ఎలా షిఫ్టయ్యారూ? అన్నది మీ డౌటా? చెబుతా వినండి. మరేం లేదు. ఇంటి ఓనర్లు వరసగా ఖాళీ చేయిస్తూ పోగా ప్రస్తుతం మేముంటున్న పందిరి నెంబరు పదహారు అయ్యిందన్న మాట! - యాసీన్ -
మిమ్మల్ని ‘బుట్ట’లో వేసేస్తుంది!
ఈసారి మీరు షాప్‌కి వెళ్లినప్పుడు... ‘చెఫ్ బాస్కెట్’ ఇవ్వమని అడగండి. ఒక స్టీలు బుట్టను మీ చేతిలో పెడ తారు. చూడ్డానికి ఇది మామూలు బుట్టలానే అనిపిస్తుంది కానీ... దీని వల్ల ఉన్న ఉపయోగాలేమిటో తెలిస్తే మీరు బుట్టలో పడిపోతారు. దాన్ని వెంటనే కొనేస్తారు. కజ్జికాయలు, గవ్వలు, చిప్స్, ఫింగర్ చిప్స్ లాంటి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదా! వాటిని కడాయిలోంచి తీసేటప్పుడు బోలెడంత నూనె వచ్చేస్తూ ఉంటుంది. అవి తింటే మన గుండెకు మనమే స్పాట్ పెట్టుకున్నట్టు అవుతుంది. పైగా నూనె కూడా బాగా వృథా అయిపోతుంది. అందుకే ఈ చెఫ్ బాస్కెట్ ఇంట్లో ఉండి తీరాలి. వేయించాలనుకున్నవాటిని ఈ బుట్టలో వేసి, నూనె వేసిన కడాయిలో ఉంచాలి. వేగాక తీసేటప్పుడు పెద్దగా నూనె రాదు. బుట్టని కాసేపు ఏదైనా గిన్నె మీద పెడితే... అంటుకున్న కాస్తో కూస్తో నూనె కూడా కారిపోతుంది. పదార్థాలు పొడిగా ఉంటాయి. నూనె కూడా ఆదా! ఈ చెఫ్ బాస్కెట్‌తో మరో రెండు ఉపయోగాలున్నాయి. స్టాండులా మార్చి పండ్లు, కూరగాయలు దాచుకోవచ్చు... ఆవిరి మీద కూరగాయలవీ ఉడికించుకోవచ్చు (ఫొటోలు 1,2). ఉపయోగించనప్పుడు శుభ్రంగా కడిగి, చక్కగా మడత పెట్టేసి దాచేసుకోవచ్చు (ఫొటో3). ఇన్ని ఉపయోగాలున్నాయి కదా అని ధర బోలెడంత ఉంటుందని భయపడక్కర్లేదు. కేవలం 150 రూపాయలకే వచ్చేస్తుంది. ఆన్లైన్లో అయితే రూ. 100 లోపే! -
కొత్త పుస్తకాలు
హోసూరు వంటలు మీకు ‘రామక్కగారి సుమ’ తెలుసా? ఇరవై ఏళ్లుంటాయంతే! తమిళనాడులోని హోసూరులో ఉంటుంది. ‘తల్లి నుడి కోసం, తల్లినుడిలో మాటకోసం, పాటకోసం’ తపన పడే తెలుగు తావు అది. అలాంటి నేలమీది ‘మాలగేర్లో’ పుట్టిన సుమ వాళ్లమ్మ పేరునే ఇంటిపేరుగా పెట్టుకుంది. వాళ్లమ్మ చేసే వంటల్నే కథలుగా మలిచింది. ఒబ్బట్లు, శాస్తాలు, చల్లిపిండి, సబ్బచ్చి బోండాలు, కజ్జాయలు, పులగూరాకు, వెదురుకొమ్ము చారు, పొట్లినంజర మసాలు, పెసలబేడల పాయసం, మొలక ఉలవల చారు... ‘ఉలవల చారు గములు మా ఇల్లు దాటి ఊరుదాటి దిన్నలో మేకలు మేపుతా ఉండే మా అమ్మ దగ్గరకు పోయి నా మింద దూర్లు చెప్పినట్లుంది. ఉడికిన చారును దించుకొని, నీళ్లను ఇంకొక గిన్నెలోకి వంచుకొంటా ఉండగా మా అమ్మాఅబ్బలు వచ్చేసినారు.’ మీకూ నోరూరుతోందా! వంటల్ని రుచి చూపించే సాకుతో వాళ్ల బతుకుల్నీ రుచి చూపించారీ రచయిత్రి. హోసూరు కథలు హోసూరు ప్రాంతీయుడు అగరం వసంత్ గతంలో ‘తెల్లకొక్కర్ల తెప్పం’ కథాసంకలనం తెచ్చారు. ఇప్పుడు ‘వెండిమొయిళ్లు బండబతుకులు’ కథలతో మళ్లీ పలకరిస్తున్నారు. పాముకడుపోడు, పాక్కాయల తోపు, జనిగిలోడు, జొన్నకడ్లగుడి లాంటి 54 పొట్టికథలున్నాయిందులో. లత్తనాయాలు, పుంగుమాటలు, ఇటెంకిటెంకలాంటి ఎన్నో జాతైన మాటలతోపాటు, సింతలేని సితరంగి సంతకొక బడ్డని కన్నెంట లాంటి చమత్కారపు సామెతలూ నాలుక్కి తగులుతాయి. ‘ఇది మా తావు తెలుగు కాదు కదా’ అనుకునేదే లేదు. అక్కున చేర్చుకోవాల్సిన తెలుగు! ‘మన బతుకేమో, మన మాటేమో’ అన్నట్టుగా రాస్తూపోవాలనే (స.వెం.) రమేశప్ప స్ఫూర్తితో కలం పట్టిన ఇతర హోసూరు కథకుల సంకలనం ‘మోతుకుపూల వాన’. నంద్యాల నారాయణరెడ్డి, ఎన్.సురేఖ, కృష్ణకళావతి, అమరనారా బసవరాజు, అశ్వత్థరెడ్డి, మునిరాజు లాంటివాళ్లు రాసిన 19 కథలున్నాయిందులో. ‘మరచిన తెలుగుమాటలు దొరుకుచోటు’ హోసూరు అనిపిస్తుంది ఇవి చదివితే. దీనికి సాక్ష్యంగా అన్నట్టు వచ్చిన పుస్తకం ‘పొరుగు తెలుగు బతుకులు’. హోసూరు నుంచి వచ్చిన సాహిత్యం మీది (రేడియో) వ్యాసాల సంకలనం ఇది. తొలిపలుకి(టెలిఫోన్), అలపలుకి (సెల్‌ఫోన్), మిన్నులువు (రేడియో), కోగురేకు (బ్లేడ్), ఉల్లాకు (కరపత్రం), మలయిక (ఎక్స్కర్షన్) లాంటి ఎన్నో కడుపునింపే మాటలున్న కథల్ని మనసునిండేలా విశ్లేషించారు విజయలక్ష్మి. -
టీవీ సీరియవళ్ళకి వీళ్ళే పెద్ద దిక్కు
టీవీక్షణం కుటుంబంలో అందరి కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లు అన్ని బాధ్యతలూ నెత్తిన వేసుకుంటారు. అన్నీ చక్కబెడతారు. అయితే ఇది ఓ పరిమితి వరకూ మాత్రమే ఉంటుంది. కానీ సీరియళ్లలో ఇంటి పెద్దల్ని ఎప్పుడైనా గమనించారా? వాళ్లు చెప్పిందే వేదం, పాటించేదే సంప్రదాయం అన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఇంటిపెద్దలు ప్రతీ సీరియల్లోనూ కనిపిస్తున్నారు. తల్లో, తండ్రో, బామ్మో... ఎవరైతేనేమి, కుటుంబంలో ఓ పెద్ద! నిలువెల్లా హుందాతనం ఉట్టిపడుతుంది. మాట్లాడితే వారి స్వరం చెవుల్లో ఖంగుమంటుంది. చూపుల్లో తీక్షణత భయపెడుతుంది. కాస్త కన్నెర్రజేస్తే అవతలివారికి నిలువెల్లా వణుకు పుడుతుంది. అలాంటి ఇంటి పెద్దలను పోటీపడి సృష్టిస్తున్నారు దర్శకులు. హిందీలో... ‘న ఇస్ దేశ్ లాడో’లో అమ్మాజీ, ‘బాలికావధు’లో కళ్యాణీదేవి, ‘సాథ్ నిభానా సాథియా’లో కోకిల, ‘సంస్కార్’ లో అన్షుబా, ‘ససురాల్ సిమర్‌కా’లో మాతాజీ, ‘దియా ఔర్ బాతీ హమ్’లో సంతోష్ రాఠీ, ‘కైరీ’లో ఇమర్తీదేవి, ‘ఉతరన్’లో ఠాకూర్, ‘ముక్తిబంధన్’లో ఐ.ఎం.విరానీ ఇంటి పెద్దగా హల్చల్ చేశారు. సీరియల్లో ఇంటి పెద్ద అంటే మంచివాళ్లే కానక్కర్లేదు. కొందరు విలన్స్... కొందరు శాంతమూర్తులు. వాళ్లు ఎలాంటి వాళ్లయినా సరే... ఆ ఇంట్లోని పాత్రలన్నీ వారి కనుసన్నల్లో మెలుగుతాయి. ఊరు ఊరంతా భయంతోనో, గౌరవంతోనో వారికి దణ్నాలు పెడుతుంటుంది. వారు చిటికె వేసినా, కనుసైగ చేసినా పనులు అయిపోతుంటాయి. వారిని అనుసరించే సీరియల్లోని మిగతా పాత్రలన్నీ సాగుతుంటాయి. తెలుగులో కూడా ఈ మధ్య ఇలాంటి పాత్రలు బాగానే వస్తున్నాయి. ‘మంగమ్మగారి మనవరాలు’లో శివ పార్వతి పాత్ర ఈ కోవలోకే వస్తుంది. ‘అపరంజి’లో నాగబాబు పాత్ర అలాంటిదే. కాకపోతే హిందీలో మాదిరిగా కడవరకూ ప్రాధాన్యత లేదా పాత్రకి. మధ్యలో డల్ అయిపోయింది. ‘గోరంతదీపం’లో జయలలిత పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘మొగలిరేకులు’లో శృతి పాత్ర కూడా దాదాపు అలాంటిదే. కానీ దుష్టపాత్ర కావడంతో రాను రాను మిగతా పాత్రలు తమ ప్రాధాన్యతను పెంచుకుంటూ పోయాయి. అయితే నిజానికి ఈ ‘పెద్ద’ పాత్రలకు హిందీలో ఉన్నంత ప్రాధాన్యత తెలుగులో లేదనే చెప్పాలి. మనకి అవసరాన్ని బట్టి ఆ పాత్ర ఉంటోంది. కానీ వాళ్లకు ఆ పాత్ర చుట్టూనే కథ తిరుగుతోంది. ఇదంతా ‘బాలికావధు’లో దాదీసా పాత్రను చూసిన తర్వాత మరీ ఎక్కువయ్యిందంటారు కొందరు. ఆ పాత్రకి కళ్యాణీదేవి ప్రాణప్రతిష్ట చేయడంతో అద్భుతంగా పండింది. ఇక ప్రతి దర్శకుడూ అలాంటి ఓ పాత్రని సృష్టించేస్తున్నాడు. ప్రముఖ నటీనటుల్ని పెట్టడం కూడా ప్లస్ అవుతోంది! -
చిట్కాలు తెలిస్తే చిటికెలో పని!
వాయనం ఇంటిని తళతళలాడేలా ఉంచుకునేందుకు ప్రతి గృహిణీ పెద్ద కసరత్తే చేస్తుంది. చేసీ చేసీ అలసిపోతుంది. నిజానికి అంత అలసిపో నక్కర్లేదు. ఎంత పెద్ద పని అయినా కొన్ని చిట్కాలు పాటిస్తే చిటికెలో అయిపోతుంది. ఇంటి క్లీనింగ్ మాత్రం ఎందుకవ్వదు! వాష్ బేసిన్స్కి పట్టిన మురికి, జిడ్డు వదలాలంటే... వాష్ బేసిన్ రంధ్రాలను మూసేసి, కాసింత గోరువెచ్చని నీళ్లను పోయండి. ఓ రెండు నిమ్మచెక్కల్ని కూడా వేస్తే నిమ్మతో కలిసి నీరు యాసిడ్‌లా పని చేస్తుంది. బేసిన్ క్లీనైపోతుంది. ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు ముందుగా ఉప్పు, నిమ్మరసం కలిపిన నీటిని లోపల చల్లి కాసేపు వదిలేయండి. ఆ తర్వాత బట్టతో తుడిస్తే మరకలు తేలికగా పోతాయి, క్రిములూ చచ్చిపోతాయి. టైల్స్ క్లీన్ చేసేటప్పుడు నీటిలో సర్ఫ్ వేసి, ఆ నీటితో తుడుస్తారు కొందరు. పొరపాటున కాస్త సర్ఫ్ ఎక్కువైనా కూడా ఆ జిడ్డు పోదు. తర్వాత నడిచినప్పుడు కాళ్లు జారిపోతాయి. మార్కెట్లో తక్కువ ధరలో కూడా ఫ్లోర్ క్లీనర్స్ దొరకుతున్నాయి. వాటిని వాడండి. లేదంటే తడి బట్టతో టైల్స్ తుడిచేసి, మరకలున్నచోట బేకింగ్ పౌడర్ చల్లి, స్పాంజితో తుడిచేయండి. మరక మాయమౌతుంది. మౌత్‌వాష్ మన నోటిలో క్రిములనే కాదు, ఇంటిలో క్రిముల్ని కూడా చంపేయగలదు. వాష్ బేసిన్స్లోను, టైల్స్ క్లీన్ చేసే నీటిలోనూ కలిపి వాడుకోవచ్చు. టవళ్లు, దుప్పట్లు, రగ్గులు, కర్టెన్సు, కార్పెట్లు, డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసేటప్పుడు నీటిలో కాస్త వెనిగర్‌ను కలిపితే మీ చేతికి పని తగ్గుతుంది. ఫ్లవర్ వాజుల్లో చేయి దూరక ఇబ్బందిగా ఉంటే... బియ్యం కడిగిన నీటిని వేడి చేసి, ఆ నీటితో కడగండి. ఎంత బాగా శుభ్రమవుతాయో చూడండి! గోడల మీద గీసిన గీతలు, పెయింటు మరకలు పోవాలంటే... హెయిర్ స్ప్రేని మరకమీద స్ప్రే చేసి నానిన తరువాత బట్టతో తుడిచేయండి. ఎంత శుభ్రం చేసినా ఒక్కోసారి ఇల్లు అదోలాంటి వాసన వస్తుంది. అలాంట ప్పుడు కొన్ని కాఫీ గింజల్ని తీసుకుని, ఇంట్లో అక్కడక్కడా ఒక్కోటి పెడితే... ఘుమఘుమలు వస్తాయి కాసేపటికి! -
ఒంటిచెయ్యి
కథ తెల్లారి నిద్రలేవగానే దువా చదువుకుని, అరచేతుల్ని ముఖానికి రుద్దుకోవటం అలవాటు నాకు. ఇవాళ చూస్తే నా కుడి చెయ్యి లేదు. చల్లగా చలనం లేకుండా మంచమ్మీదే ఒకపక్కగా పడిపోయి ఉంది. ఎలా తెగిపోయిందో అర్థం కావడం లేదు. కనీసం ఒక నెత్తుటి చుక్క కూడా కారలేదు. ఏదో వేపమొద్దును తెచ్చి రంపంతో కోస్తే ఎంత నున్నగా కట్ అవుతుందో అలా కట్ అయిపోయింది. ‘‘ఒసేయ్! నా చెయ్యి తెగిపోయిందే’’ బిగ్గరగా అరిచాను దడుసుకుని. మా ఆవిడ బెడ్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘ఓస్ అంతేనా. ఇంకేదో అనుకుని భయపడి చచ్చాను. పోతే పోయిందిలెండి పాడు చెయ్యి. తీసుకెళ్లి అల్మారాలో పెట్టండి. వీలు చూసుకుని డాక్టరు దగ్గరకెళ్లి కుట్టించుకోవచ్చు. ఇంతమాత్రం దానికే అంత కంగారైతే ఎలాగండి’’ -వచ్చినంత వేగంగానే చెప్పి వెళ్లిపోతోందావిడ. అప్పుడు చూశాను. ఒళ్లు జలదరించింది. మా ఆవిడకు ఎడమ చెయ్యి లేదు. అవును ఆమెది ఎడమ చెయ్యి వాటం. అన్నం వడ్డించాలన్నా, గ్లాసు పట్టుకుని నీళ్లు తాగాలన్నా, పుస్తకంలో ఏదైనా రాయాలన్నా, ఇంట్లో కసువు ఊడ్చాలన్నా, చివరికి ఏడేళ్ల పిల్లోడు ‘చాందూ’ని దండించాలన్నా ప్రతిదానికీ ఆమె ఎడమ చేతినే వాడుతుంది. ఇప్పుడా చెయ్యే లేదు. ‘‘నా చెయ్యి సరే. ఆమె చెయ్యి ఎప్పుడు పోయిందీ?’’ నాకేమర్థం కావడం లేదు. మళ్లీ అరిచి ఆమెనే అడుగుదామనుకున్నాను. కానీ ఆగిపోయాను. నాకసలే మతిమరుపు అంటుంటుంది మా ఆవిడ. మరోసారి ఆమెతో ఆ మాట అనిపించుకోవడం తప్పితే, నాకు సమాధానం దొరకదని అర్థమైంది. ఒంటిచేత్తోనే దువా చేసుకుని ఆ అరచేతినే ముఖానికి రుద్దుకుని మంచం దిగాను. నా కుడి చేతిని తీసుకెళ్లి జాగ్రత్తగా అల్మారాలో మా ఆవిడ ఎడమ చేతి పక్కనే పెట్టాను. ఒంటిచేత్తోనే గబగబా బ్రెష్ చేసుకుని, స్నానం కానిచ్చి, టక్ చేసుకుని, టిఫిన్ తిని, లంచ్ బాక్స్ భుజానికి తగిలించుకుని ఆఫీస్‌కని బయల్దేరి ఇంట్లోంచి బయటికొచ్చాను. మా ఇంటి ఓనరు ఎదురయ్యాడు... రెండు చేతులూ లేకుండా. ‘థూ... దీనెమ్మా... ఏదో అయ్యిందిరాబై... ఇవ్వాళ...’ అనుకున్నాను. ‘‘అంకుల్. మీ రెండు చేతులూ...’’ అని డౌట్ అడుగుదామనుకున్నాను. కానీ అతను నా కుడి చెయ్యి గురించి అడిగితే అప్పుడేం చెప్పాలి సమాధానం. అందుకే నోరు మెదపకుండా నవ్వుతూనే ఆఫీస్కెళ్తున్నానని సైగ చేసి వచ్చి టూ వీలర్ ఎక్కాను. విచిత్రం... ఒంటిచేత్తోనే బండిని చక్కగా తోలుతున్నాను. కాదు నేను తోలడం ఏంటి... బండే ఒంటిచేతిగాళ్ల కోసం తయారుచేయబడి ఉంది. ఆ విషయం నేను తొందర్లో గమనించలేదు. వీధిలో అందరూ ఒంటిచేత్తోనే బళ్లు తోలుతున్నారు. ఏమంటే కొందరు కుడిచేత్తో, మరికొందరు ఎడమచేత్తో. అంతే తేడా. అసలు రాత్రికి రాత్రి లోకం ఎలా అవిటిదైపోయిందా అనేది నా పెద్ద డౌటు. నేను ఆఫీసుకెళ్లే దారిలో పెద్ద హాస్పిటల్ ఉంది. అది నేనున్న ఈ మహానగరంలోనే చాలా ఫేమస్. ఆ ఆస్పత్రి ముందు మనుషులంతా తెగిపోయిన తమ చేతుల్ని పట్టుకుని క్యూలో నిల్చుని ఉన్నారు. ‘నో పార్కింగ్’ అని తెలిసినా కూడా ఎలాగోలాగ ధైర్యం చేసి, బండిని సైడ్ తీసుకుని ఆపి, అక్కడివారిని విచారిస్తే దిమ్మతిరిగిపోయింది నాకు. వీళ్లంతా ఎప్పుడో ఏడాది కిందట చేతులు తెగిపోయినవాళ్లనీ, అప్పుడు దరఖాస్తు చేసుకుంటే, ఇవ్వాళ్టికి ఆస్పత్రివాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చారనీ, అందుకే అందరూ క్యూలో నిల్చున్నారనీ దాని సారాంశం. అమ్మా... దానెమ్మ బడవా... ఇప్పుడెట్టా. ఈ చేతిని అతికించుకోవాలంటే ఏడాది వెయిట్ చేయాల్నా? ఇంతమందికి ఈ దేశంలో చేతుల్లేవా? ఇంకా నేనేదో రాత్రికి రాత్రే జరిగిన మిరాకిల్ అనుకుంటున్నా. ఆ ఏడాదిలోపు ఒంటిచేత్తో ఎలా బతకాలో అందరికీ అలవాటైపోతుంది. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా రెండు చేతుల్తో బతకడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే చాలామంది ఒంటిచేతి జీవితానికే అలవాటుపడి ఉన్నారు. కానీ ఎన్ని రోజులైనా నేనలా కాకూడదు. ఎట్టి పరిస్థితిలో ఆస్పత్రికెళ్లి వీలైనంత త్వరగా చేతిని అతికించుకోవాలి. అంటే ఇప్పుడే వెళ్లి ఆపరేషన్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. బండిని నో పార్కింగ్‌లోనే వదిలేసి, హడావిడిగా దరఖాస్తు కౌంటర్ దగ్గరికెళ్లాను. అక్కడ తిరుపతి దేవుని దగ్గర కన్నా పెద్ద క్యూ ఉంది. తిరుపతిలో ఇప్పుడు నాలుగైదు క్యూలైన్లు పెట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇక్కడ ఆ మాత్రం ప్లాన్ కూడా ఉన్నట్టు లేదు. భయపడిపోయాను. ఈ క్యూలో నిలబడితే ఏ వారానికో కానీ బయటపడలేను. ఇక్కడే స్నానాలు, అన్నాలు, నీళ్లు అన్నీ కానిచ్చేస్తున్నారంతా. ఇదే అదనుగా చోటా మోటా వ్యాపారులంతా చెలరేగిపోతున్నారు. క్యూ వెంబడి రకరకాల వస్తువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఏదో ఒకటి కొనమని డిమాండ్ చేస్తున్నారు. కొననివాళ్లను బూతులు తిడుతున్నారు. బలవంతంగా వస్తువులు చేతిలో పెట్టి జేబులు తడిమి మరీ డబ్బులు తీసుకుంటున్నారు. మరీ భీష్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా క్యూలోంచి బయటికి లాగేస్తున్నారు. ‘‘ఇంట్లోంచి బయటికొచ్చాక ఏదో ఒకటి కొనకుండా ఎలా ఉంటారండీ. అలాంటివాళ్లు అసలు ఇంట్లోంచి బయటికి ఎందుకొచ్చారండీ’’ అని ఇంతింత పెద్ద గొంతులేసుకుని అరుస్తున్నారు. ఇప్పుడు చెయ్యేలేదు. ఇంకాసేపు అక్కడుంటే ఏమి లేకుండా పోతుందో చెప్పలేను. అసలే ఆఫీస్‌కు టైం అవుతోంది. ఇక్కడ నిలబడి కుస్తీ పట్టాలంటే జేబు నిండా డబ్బు, ఒంటినిండా సత్తువతో పాటు వారం రోజుల లీవు కావాలి. వెంటనే వెనక్కి వచ్చేసి బండి స్టార్ట్ చేసుకుని నేరుగా ఆఫీస్కొచ్చాను. ఒంటిచేత్తోనే సలాం చేశాడు గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు. వంగి వాడి సలాంను రిసీవ్ చేసుకుని నేరుగా బండిని పార్కింగ్‌లో పెట్టి లిఫ్ట్ పట్టుకుని ఫ్లోర్లోకెళ్లాను. అందరూ ఒంటి చేత్తో కంప్యూటర్ని టపటపలాడిస్తున్నారు. నేనలా చేయగలనా? గబగబా లంచ్ బాక్స్ పక్కనపెట్టి, నా సీట్లో కూర్చొని కంప్యూటర్ ఆన్ చేశాను. విచిత్రం... ఒంటిచేత్తో పనిచేయడం నాకు పెద్ద కష్టమనిపించడం లేదు. అదేదో అలవాటున్న పనిలాగే నా ఒంటిచెయ్యి చేసుకుపోతోంది. ఏకకాలంలో మౌస్‌ని, కీబోర్డ్‌ని దడదడలాడించేస్తోంది. అంతా సంతోషమే కానీ, ఒక్కడంటే ఒక్కడు కూడా నాకు చేయి లేని సంగతిని పట్టించుకుంటున్నట్టు లేడు. అది నాకు కొంత బాధగా అనిపించింది. పక్కనే ఉన్న కొలీగ్‌ను అడిగాను. ‘‘నిన్నటిదాక మీ అందరికీ చేతులున్నాయి కదా. ఇవ్వాళే ఎందుకు లేవు?’’ అని. అతను నవ్వాడు. ‘‘ఒరేయ్ పిచ్చోడా! మాకు చేతుల్లేక చాలా రోజులైంది. నీకే చేతులున్నాయి కాబట్టి, ఇన్నాళ్లూ ఆ సంగతి తెలియలేదు’’ అన్నాడతను. అవును. ఇదే లోకం తీరు. ఏదైనా మనకు లేకుంటేనే ఎదుటివాళ్లకు ఏముందో తెలిసేది. అన్నీ మనకుంటే మనం ఇంకెవ్వర్నీ పట్టించుకోం. కొలీగే కదా అని లైట్ తీసుకున్నాను ఇన్నాళ్లు. ఒక్కమాటలో ఎంత ఫిలాసఫీ చెప్పేశాడు వీడు. అయినా వీళ్లతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే. ఇన్నాళ్లయినా చేతులు కాపాడుకోగలిగాను. కొంచెం గర్వంగా అనిపించింది. లీవు సంగతి గుర్తుకొచ్చి బాస్ గదికెళ్లాను. అతను కాళ్లతో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు. రెండు చేతులు ఎప్పుడు తెగిపోయాయో - లేవు. అతణ్ని పట్టుకుని ఈ కారణంతో లీవ్ అడగటం సబబా అనిపించింది - ఒక్క క్షణం నాకు. అయినా తప్పదనుకుని అడిగేశాను. ‘‘సా...ర్ చెయ్యి అతికించుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. వారం రోజులు లీవ్ కావాలి.’’ అతను నన్ను పిచ్చోడి కన్నా దారుణంగా చూశాడు. ‘‘ఆ తీరికే ఉంటే నేను నా రెండు చేతులు ఎప్పుడో అతికించుకునేవాణ్ని. ఆ తీరికే లేక కనీసం అప్లికేషన్ కూడా ఇంతవరకు పెట్టలేకపోయాను. రోజుల తరబడి లీవులు పెట్టి అందరూ చేతులు అతికించుకోవడం కోసం వెళ్తే, నేను ఆఫీసు మూసుకోవాల్సిందే. అయినా ఇప్పుడు ఆ వెధవ చెయ్యి ఉండి ఏం ఉద్ధరించాలంటా. మూసుకుని మొండిగా పనిచెయ్యడం నేర్చుకో’’ అన్నాడతను. నిజమే. ఇదే కార్పొరేట్ కల్చర్. ఒక్కోసారి ఒక్కో అవయవం శరీరం నుంచి తెగిపడుతున్నా నాది కాదులే అనుకుని ఉద్యోగులు పనిచేస్తుండాలి. నాకు చేయి లేదు కాబట్టి అందరూ చేతులు లేనివాళ్లే కనిపిస్తున్నారు. ఒకవేళ నాకు తల లేకపోయుంటే ఎంతమందికి తలల్లేవో తెలిసిపోయేది. బాస్ ఛీదరింపుతో వచ్చి సీట్లో పడ్డాను. టైం చూసుకుంటే అప్పుడే ఒంటి గంటైపోతోంది. ఆకలి చంపేస్తోంది. ఈ ఆకలిక్కూడా ఒక కాలు, ఒక చెయ్యి లేకుంటే బావుండేది. అప్పుడు తిండి బాధ కొంతైనా తగ్గేది. భోజనం బాక్సు పట్టుకుని లిఫ్టులోనే దిగి క్యాంటీన్కెళ్లాను. ఓ కార్నర్లో ఉన్న టేబుల్‌ను చూసుకుని కూర్చున్నాను. బాక్స్ ఓపెన్ చేయబోయేంతలో వచ్చింది స్వీట్ బాక్స్ పట్టుకుని హెచ్.ఆర్. డిపార్టుమెంట్లో పనిచేసే నా ఫ్రెండ్ సరయు. రావడం రావడంతోనే ‘గుడ్ న్యూస్’ అంటూ పెద్దగా అరుస్తూ లడ్డూ తీసి నా నోట్లో దూర్చింది. సగం లడ్డు లోపలికెళ్లిపోగా మిగతాది కిందపడిపోకుండా పట్టుకుని ‘ఏంటి సంగతి’ అన్నాను నముల్తూనే. ‘‘రాత్రి... నా బేబి, నా ముద్దుల పట్టీ, నా బంగారు తల్లి... నన్ను మనస్ఫూర్తిగా క్షమించేసిందోచ్’’ అంది. ‘‘అవునా? మనస్ఫూర్తిగానా? అసలు పాప మనస్ఫూర్తిగా క్షమించిందన్న సంగతి అంత కచ్చితంగా నీకెలా తెలిసింది?’’ అన్నాను. ఆమె స్వీట్ బాక్స్ టేబుల్ మీద పెట్టి, తన రెండు చేతులూ చూపించింది ఒకేసారి ‘‘టట్టడోయ్’’ అంటూ. ఎంత బావున్నాయో. ఉదయం నుంచి చేతుల్లేనివాళ్లను చూసి జీవితం బోరు కొట్టేసింది. ఆ చేతులు అతికించుకున్నవేమో అని అనుమానంగా చూశాను. కాదు అత్యంత సహజంగా ఉన్నాయి. హంస రెక్కల్లా ఉన్నాయి. మనసుకు ఆనందంగా అనిపించింది. ఆవిడ మళ్లీ స్వీటు బాక్సు చేతుల్లోకి తీసుకుని ఇంకెవరికో ఇవ్వడానికి వెళ్లిపోయింది. నాకు సడన్‌గా, ఆ రాత్రి నా చెయ్యి ఎందుకు పోయిందో స్ఫురించింది. దుఃఖం ఆపుకోలేక బడబడా ఏడ్చేశాను. ‘‘ఒరే.. చాందూ! నీ మీద చెయ్యెత్తిన నాకు... క్షమాపణ ఉందా..?’’ -
మొదటి ప్రపంచ యుద్ధం ఘోరానికి నూరేళ్లు
కాలం గుండెల లో ఎప్పటికీ మానని గాయాన్ని మిగిల్చిన ఘటన అది. అత్యాధునిక ఆయుధాలూ, యూనిఫారాలూ ధరించిన రాతియుగపు మనుషులు చేసిన ‘మొదటి ఆధునిక యుద్ధ’మది. కాలం మీద అది తవ్విన రక్తకాసారాలు ఇప్పటికీ కమురు కంపును వెదజల్లుతూనే ఉన్నాయి. అది చరిత్రను రోదింప చేసిన పెను విషాదం. భవిష్యత్ తరాలు నిర్వేదంతో నవ్వుకునేటట్టు చేసిన పెద్ద ప్రహసనం కూడా అదే. ‘సకల యుద్ధాలకూ స్వస్తి చెప్పడానికి’ మొదలైనా, ఆ విఫల యత్నానికి పది లక్షల మందిని బలి చేసిన ఘోర యుద్ధమది. ప్రపంచ మానవాళి మీద చేదు జ్ఞాపకాల గుచ్ఛాన్ని విసిరి వెళ్లిపోయింది. ఆ మహా సమరంలో విజయం నెత్తుటి ధారలదీ, కన్నీటి చారికలదే. ఆధునిక చరిత్ర పొడవునా ఆ పీడకలల ఊరేగింపు ఆ యుద్ధం ఫలితమే. అదే నూరేళ్ల నాటి మొదటి ప్రపంచ యుద్ధం. గ్రేట్‌వార్. కందకాలు మొదటి ప్రపంచ యుద్ధం అనగానే మొదట గుర్తుకు వచ్చేవి కందకాలు లేదా ట్రెంచ్‌లు. ఎనిమిది లేదా తొమ్మిది అడుగుల లోతున, ఐదడుగుల వెడల్పున మైళ్ల కొద్ది వాటిని తవ్వి అందులో నుంచే యుద్ధం చేశారు. అయితే ఇవి భూలోక నరకాలను మరిపించేవి. వర్షం, మంచుతో ఇవి మోకాలిలోతు బురదతో ఉండేవి. ఎలుకలు లక్షలలో ఉండేవి. ఎక్కడ చూసినా శవాలు, వాటి నుంచి వస్తున్న కుళ్లిన వాసన. కందకాల పక్కనే తవ్వే మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్గంధం మరొకటి. శవాల కళ్లు, కాలేయాలు తిని ఎలుకలు అసాధారణ పరిమాణంలోకి ఎదిగిపోయేవి. యుద్ధాన్ని రొమాంటిక్‌గా ఊహించుకుని వచ్చిన కుర్రాళ్లకీ, స్వచ్ఛంద సైనికులకీ వీటితో జీవితం మీద విరక్తి పుట్టిందంటే అతిశయోక్తి కాదు. కందకంలోకి ప్రవేశించాక నా కాళ్లు ఎప్పుడూ పొడిగా లేవు అని రాసుకున్నాడొక సైనికుడు. ఈ భూమ్మీదకి ‘ట్రెంచ్‌ఫుట్’ ఒక కొత్త రోగాన్ని అవి తెచ్చాయి. కందకాల నుంచి ఆనాటి సైనికులు రాసిన ఉత్తరాలలో వాటిలోని స్థితిగతుల గురించి కలచివేసే, కంటి నీరు తెప్పించే అనేక వర్ణనలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914-నవంబర్ 11, 1918) ఓ అగ్ని పర్వతంలా బద్ధలైన ఆకస్మిక ఘటన కాదు. దాదాపు నలభయ్ సంవత్సరాల వ్యవధిలో యూరప్‌లో సంభవించిన అనేక వికృత రాజకీయ, సైనిక పరిణామాలకు పరాకాష్ట. 1871 నుంచి జరిగిన యుద్ధాలూ, కుటిలత్వాన్ని రంగరించుకున్న దౌత్యాలూ, రహస్య ఒప్పందాల కారణంగా 1909 ప్రాంతానికే ఆ ఖండం రణ దాహంతో తహ తహలాడిపోతున్న రెండు శత్రు శిబిరాలుగా చీలిపోయింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఒక శిబిరంలో చేరాయి. జర్మనీ, ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికం, టర్కీ, ఇటలీ (యుద్ధం వేళకి ఇంగ్లండ్ వైపు జరిగింది) వైరి శిబిరంగాను అవతరించాయి. ఇందులో ‘సూర్యుడు అస్తమించని’ దేశం ఇంగ్లండ్. ‘సూర్యుడి మీద స్థానం’ అని నినాదం అందుకున్న దేశం జర్మనీ. ‘ప్రపంచాధిపత్యం లేదా పతనం’ అంటూ జర్మనీ ఇంకో ఉప నినాదాన్ని కూడా స్వీకరించింది. ఇవన్నీ కలిసి ఆ ఖండాన్ని మందుగుండు గోదాములా మార్చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అపారమైన వ్యయంతో నిర్మించుకున్న మారణాయుధాల గుట్టలతో ఆ గోదామును నింపేశాయి. ఓ చిన్న రివాల్వర్ పేల్చి దానికి నిప్పు ముట్టించినవాడే గవ్రిలో ప్రిన్సిప్. సరాయేవో జంట హత్యలు ‘మా ప్రథమ శత్రువు ఆస్ట్రియా పాలకుడు’ - నరోద్నా ఓద్బ్రానా. ‘ఆస్ట్రియా పాలక హాబ్స్బర్గ్ వంశీకులు ఎవరు కనిపించినా చంపుతాం’- బ్లాక్‌హ్యాండ్. బోస్నియా, హెర్జిగోవినా పాలనా కేంద్రం సరాయేవో నగరం గోడలన్నీ ఇలాంటి రాతలతో, పోస్టర్లతో నిండిపోయి, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న సమయంలో ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికానికి వారసుడు, హాబ్స్బర్గ్ వంశీకుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్.. భార్య సోఫీ చోటెక్తో కలసి అక్కడికే వచ్చాడు. సరాయేవో శివార్లలోనే ఉన్న ఫిలిపోవిక్ సైనిక శిబిరంలో ఉన్న 70,000 ఆస్ట్రియా సేన సంసిద్ధతను, తర్ఫీదును పరీక్షించే పేరుతో ఆ ప్రాంత గవర్నర్ జనరల్ ఆస్కార్ పొటియోరిక్ కావాలని యువరాజును రప్పించాడు. ఈ పని ముగిశాక సరాయేవో సిటీ హాలు(విజేనికా)లో ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఫెర్డినాండ్ హాజరు కావలసి ఉంది. ఏ111 118 నెంబరు నలుపు రంగు 3 గ్రాఫ్ అండ్ స్టిఫ్ట్ స్పోర్ట్స్ కారులో మిల్జాకా నది ఒడ్డునే యాపిల్‌కే మార్గంలో గవర్నర్ పొటియోరిక్, ఫెర్డినాండ్ దంపతులు హాలుకు వెళుతుండగా ఒక యువకుడు డైనమైట్ విసిరాడు. అది తృటిలో తప్పి వెనుక కారు ముందు పడి పేలింది. అయినా ఫెర్డినాండ్ సన్మానానికి హాజరైనాడు. తిరిగి వస్తుంటే మిల్జాకా నది మీదే ఉన్న లాటిన్ బ్రిడ్జికి ఎదురుగా, షిల్లర్ మార్కెట్ అనే తినుబండారాల దుకాణం ముందు రాజ దంపతులను ప్రిన్సిప్ (బెల్జియంలో తయారైన 9ఎ- 17 ఎం ఎం (.380 ఎసిపి) ఫాబ్రిక్ నేషనల్ మోడల్, 1910 సెమీ ఆటోమేటిక్ పిస్తోలుతో) కాల్చి చంపాడు. ప్రిన్సిప్ బ్లాక్‌హ్యాండ్ రహస్యోద్యమ సంస్థ సభ్యుడే. ‘సోఫీ! నువ్వు పిల్లల కోసం బతకాలి’ అంటూనే ఫెర్డినాండ్ చనిపోయాడు. కొన్ని నిముషాలకు సోఫీ కూడా మరణించింది. అప్పటికి ఆమె గర్భవతి. ఆ ఇద్దరిదీ గొప్ప ప్రేమ కథ. వారి పెళ్లికి రాచరికం అంగీకరించలేదు. రాజ్యం అక్కరలేదని హెచ్చరించాక కొన్ని షరతుల మీద (మోర్గనాటిక్ మ్యారేజ్) పెళ్లి చేశారు. ఎవరీ గవ్రిలో ప్రిన్సిప్? సెర్బు జాతీయవాది ఇతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పేలిన మహా మారణాయుధాల కంటె ఇతడు పేల్చిన చిన్న రివాల్వర్ శబ్దమే చరిత్రను కంపించేలా చేసింది. యువరాజు ఫెర్డినాండ్‌ను హతమార్చాలని బ్లాక్‌హ్యాండ్, నరోద్నా ఓద్బ్రానా వంటి సెర్బు ఉగ్రవాద సంస్థలు కొన్ని నెలల నుంచి వేసిన పథకం వలెనే, హాబ్స్బర్గ్ వంశంతో, ఆస్ట్రియా ఆధిపత్యంతో సెర్బులకున్న వైరం కూడా లోతైనది. గవ్రిలో బోస్నియాలోని గ్రహావా లోయలోని ఒబ్లజాజ్ గ్రామంలో పుట్టాడు. తండ్రి జావో ప్రిన్సిప్, ఇతర కుటుంబ సభ్యులంతా ఉద్యమకారులే. జూన్ 28, 1398న జరిగిన కొసావో యుద్ధంలో సెర్బు వీరుడు లాజరస్ చనిపోయినప్పటి నుంచి వీరి పోరాటం సాగుతోంది. విదోవ్దన్ పేరుతో ఆ రోజును అప్పటి నుంచి ప్రతి ఏటా తలుచుకుని పండుగ చేసుకుంటారు. అప్పటి నుంచి సెర్బుల చాలా భూభాగాలతో పాటు మాంటెనీగ్రో, గ్రీస్, బల్గేరియా వంటి బాల్కన్ ప్రాంతాలన్నీ టర్కీ వశమైనాయి. తరువాత టర్కీ బలహీన పడడంతో 1878లో జరిగిన బెర్లిన్ కాంగ్రెస్‌లో కొన్ని ప్రాంతాలను ఇతర రాజ్యాల అధీనంలో ఉంచారు. అలా బోస్నియా, హెర్జిగోవినా ప్రాంతాలు ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ అధీనంలోకి వచ్చాయి. వీటిని కలిపి, పొరుగునే ఉన్న సెర్బియా, దానికి సమీపంలోని కొసావోనూ కలుపుకుని ‘విశాల సెర్బియా’ను ఏర్పాటు చేయాలన్నదే సెర్బుల ఉద్యమం ఉద్దేశం. అదే ఈ అశాంతికి కారణం. అంటే ఆరు దశాబ్దాల నుంచి సెర్బులు చేస్తున్న పోరాటానికి ఇది పరాకాష్ట. సెర్బులు అంటే ఐరోపా దక్షిణాది స్లావ్ జాతీయులే. ఆ కారణంతో జారిస్ట్ రష్యా సెర్బుల ఉద్యమానికి చిరకాలంగా దన్నుగా నిలబడింది. యువరాజు విజేనికా హాలుకు వెళుతుండగా డైనమైట్ విసిరిన మరొక యువకుడు కూడా బ్లాక్‌హ్యాండ్ సభ్యుడే. పేరు- నెడెల్కో కాబ్రినోవిక్. యువరాజు ప్రయాణించిన యాపిల్‌కే దారిలో బాసిక్, ప్రిన్సిప్ సహా ఎనిమిది మందిని ఆయుధాలతో రహస్య సంస్థలు నిలబెట్టాయి. నిజానికి ఈ పథక రచన అంతా సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లోనే కల్నల్ డ్రాగూటిన్ సమక్షంలోనే జరిగింది. ఆయుధాలు కూడా అక్కడ నుంచే రహస్యంగా వచ్చాయి. సరిగ్గా విదోవ్దన్ పండుగ నాడే జూన్ 28, 1914- ఫెర్డినాండ్ సెర్బుల భూభాగంలో పర్యటనకు వచ్చాడు. కాబట్టి అతడు తిరిగి వెళ్లవలసింది- ఆస్ట్రియా రాజధాని వియన్నాకు కాదు, పైలోకాలకే అని సెర్బు జాతీయవాదులు నిశ్చయించుకున్నారు. యుద్ధారంభం తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో చనిపోతే, తమ్ముడు కొడుకు ఫెర్డినాండ్‌ను ఆస్ట్రియా చక్రవర్తి జోసెఫ్ యువరాజుగా ప్రకటించాడు. అతడు కూడా ఇలా దుర్మరణం చెందడం ఆ వృద్ధ చక్రవర్తిని తీవ్రంగా బాధించింది. ‘భగవదేచ్ఛ ఇలా ఉంది!’ యువరాజు మరణవార్తను మోసుకువచ్చిన టెలిగ్రామ్ చూశాక జోసెఫ్ అన్న మాట ఇదే. ఎనభయ్ ఏళ్ల జోసెఫ్ గొప్ప నిర్వేదంలో పడిపోయాడు. కానీ ఆస్ట్రియాకు సన్నిహితుడు, ఫెర్డినాండ్ మిత్రుడు, జర్మనీ చక్రవర్తి విల్హెల్మ్ రంగంలోకి దిగి సెర్బియాకు గుణపాఠం చెప్పే పనికి ఆస్ట్రియాను సిద్ధం చేశాడు. జూలై 5, 1914న విల్హెల్మ్ ఆస్ట్రియాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చాడు. సెర్బియా టర్కీకి పక్కలో బల్లెం మాదిరిగా ఉంది. దీనితో ఈ విధంగా సెర్బియాను లొంగదీయాలని విల్హెల్మ్ పాచిక పన్నాడు. టర్కీ అండతో విల్హెల్మ్ బాగ్దాద్-బెర్లిన్ రైలు మార్గాన్ని నిర్మించాడు. చమురు రవాణాయే దీని ఉద్దేశం. అక్కడి చమురు నిల్వల మీద ఆనాడే విల్హెల్మ్ కన్నేశాడు. ఆ క్రమంలో అతడు ‘ఇస్లాం పరిరక్షకుడు’ అంటూ తనను తాను చిత్రించుకున్నాడు. జర్మనీ అండతో ఆస్ట్రియా జూలై 23, 1914న సెర్బియాకు అల్టిమేటం జారీ చేసింది. కుట్రదారులను ఆస్ట్రియాకు అప్పగించాలన్న షరతు సహా 10 షరతులను విధించింది. వాటిని ఏ దేశమూ ఆమోదించలేదని ఆస్ట్రియాకు తెలుసు. సెర్బియాను యుద్ధంలోకి దించే వ్యూహంలో భాగంగానే ఆ అల్టిమేటం పంపారు. అయినా రెండు తప్ప మిగిలిన షరతులను సెర్బియా ఆమోదించింది. అయినా ‘ధిక్కారం’ పేరుతో ఆస్ట్రియా జూలై 28న సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. ఆస్ట్రియా ఉనికి బాల్కన్ ప్రాంతాలు లేదా సెర్బుల భూభాగాల మీద విస్తరించడం ఇష్టం లేని రష్యా ఆ మరునాడే సేనల తరలింపును ఆరంభించింది. ఈ దూకుడు ఆపాలని హెచ్చరిస్తూ జర్మనీ ఆగస్టు 1, 1914న రష్యా మీద యుద్ధం ప్రకటించింది. అయితే మొదట జర్మనీ తన సేనను నడిపించినది మాత్రం ఫ్రాన్స్ దిశగా. ష్లీఫెన్ పథకం ప్రకారం రష్యా, ఫ్రాన్స్‌లను ఏకకాలంలో దాసోహమనిపించుకోవాలని జర్మనీ వ్యూహం. దారిలో ఉన్న లక్సెంబర్గ్ విధ్వంసం, తరువాత పక్కనే ఉన్న బెల్జియం విధ్వంసం వరసగా జరిగిపోయాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు దాదాపు నలభయ్ కిలోమీటర్ల దూరంలోని మోన్స్ వరకు జర్మనీ సేనలు వచ్చేశాయి. అదో అత్యంత శక్తిమంతమైన సేన. తటస్థ దేశమైన బెల్జియం మీద దాడికి నిరసనగా ఆగస్టు 4న ఇంగ్లండ్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించి, సేనలను ఇంగ్లిష్ చానెల్ మీదుగా ఫ్రాన్స్ వైపు కదిలించింది. మోన్స్ (ఫ్రాన్స్ సరిహద్దు) దగ్గర ఇంగ్లండ్, ఫ్రాన్స్ సేనలు జర్మనీతో తలపడి ఆపాయి. యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడింది. భూ ఉపరితలం మీద నిలబడి ఎక్కువ సమయం యుద్ధం చేయడం సాధ్యం కాలేదు. అయితే వెనక్కు తగ్గే యోచన ఎవరికీ లేదు. దీనితో అవసరమైనవే కందకాలు (ట్రెంచ్‌లు). ఫ్రాన్స్ సరిహద్దు నుంచి బెల్జియం సరిహద్దుల వరకు దాదాపు ఏడు వందల కిలోమీటర్ల మేర ఈ కందకాలు తవ్వి అందులో ఉండి సైన్యాలు నాలుగేళ్లు యుద్ధం చేశాయి. లూసిటేనియా పేల్చివేత: అమెరికా ప్రవేశం ఇటలీ మొదట జర్మనీ శిబిరంలోనే ఉన్నా, సంవత్సరం తరువాత యుద్ధ ఫలితాలను బట్టి ఇంగ్లండ్ శిబిరం వైపు మారింది. ఇక ‘యూరప్ దగ్ధమైతే మనకేమిటి?’ అన్నదే మొదట అమెరికా అనుసరించిన విధానం. కానీ లూసిటేనియా నౌక పేల్చివేత (మే 7, 1915) అంతిమంగా అమెరికాను యుద్ధంలోకి దిగేటట్టు చేసింది. ఇదొక ఘోరమైన సంఘటన. ఇంగ్లండ్‌కు చెందిన ఈ నౌక టైటానిక్ వంటిదే. న్యూయార్క్ నుంచి మే 1, 1915న అట్లాంటిక్ సాగర జలాలలో లివర్‌పూల్‌కు బయలుదేరిన ఈ నౌకలో 1,248 షెల్స్ (యుద్ధంలో ఉపయోగించే శక్తిమంతమైన బాంబులు) ఉన్నాయని ఆరోపణ. ఐరిష్ తీరానికి 8 మైళ్ల దూరంలోనే జర్మనీకి చెందిన యూ-బోట్ యూ-20 టార్పెడోను ప్రయోగించి పేల్చివేసింది. నౌకలో ఉన్న 1,924 మందిలో 1,119 మంది చనిపోయారు. అందులో అమెరికన్లు 128 మంది. ఈ నౌకలో ప్రయాణించవద్దని అప్పుడు అమెరికా పత్రికలు అన్నింటిలోను జర్మనీ ప్రకటనలు ఇవ్వడం విశేషం. ఈ నౌకా మార్గ రక్షణ వ్యవహారాలు చూస్తున్నవాడు అప్పటి ఇంగ్లండ్ నౌకా విభాగం అధిపతి విన్స్టన్ చర్చిల్. కానీ అమెరికాను యుద్ధంలో దించేందుకు కావాలనే టార్పెడోను నౌక వైపు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. 1917లో ఎన్నికలు ముగిసిన తరువాత అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఏప్రిల్ 6న జర్మనీ మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధ రంగాలు మొదటి ప్రపంచ యుద్ధం పశ్చిమ యుద్ధరంగం (ఫాన్స్- బెల్జియం మధ్య) తూర్పు యుద్ధం రంగం (రుమేనియా-రష్యా మధ్య) ఇటాలియన్ ఫ్రంట్, గల్లిపోలీ (టర్కీ) కేంద్రాలుగా జరిగింది. కానీ ఈ యుద్ధంలో అనేక చిన్న చిన్న యుద్ధాలు కనిపిస్తాయి. మోన్స్ యుద్ధం మొదలు మార్నే, టానెన్‌బర్గ్, అర్రాస్, ఐపర్, వెర్డన్, జట్లాండ్, సొమ్మె, పాశ్చాండల్ వంటి అనేక యుద్ధాలు కనిపిస్తాయి. ప్రతి యుద్ధం ఘోరమైనదే. నాలుగేళ్ల పాటు సగటున గంటకు 230 మందిని బలి తీసుకున్న ఘోర యుద్ధమిది. అర్రాస్ యుద్ధంలో విజయం సాధించి పెట్టి కెనడా (నాడు బ్రిటిష్ వలస) స్వతంత్ర దేశమైంది. నాలుగేళ్లు సాగిన ఈ యుద్ధం చరిత్ర మీద ఏ విప్లవమూ వేయలేనంత ముద్రను వేసింది. వ్యవస్థలను తలకిందులు చేసింది. యుద్ధానికి అంకురార్పణ చేసిన జర్మనీ, దాని ప్రోద్బలంతో యుద్ధాన్ని ఆరంభించిన ఆస్ట్రియా-హంగెరీ, పరోక్ష కారణమైన టర్కీ, సెర్బులకు అండగా, జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగిన రష్యా - ఆ నాలుగు మహా సామ్రాజ్యాలు కూలిపోయాయి. రష్యాకు లెనిన్ నాయకత్వం వచ్చింది అప్పుడే. చిత్రం ఏమిటంటే- ఈ ఘోర యుద్ధంలో అంతిమ విజేతలు సెర్బులే. అయితే ఇది చరిత్రలో అంత ప్రాధాన్యం లేని విషయంగా మిగిలిపోయింది. కొన్ని శతాబ్దాల విశాల సెర్బియా స్వప్నం సాకారమౌతూ సెర్బియాను కలుపుకుని కింగ్డమ్ ఆఫ్ సెర్బ్స్, క్రొయేట్స్ అండ్ స్లొవేన్స్ ఆవిర్భవించింది. అప్పటికి కొద్ది నెలల క్రితమే ఏప్రిల్ 28, 1918న టెరిజిన్ సైనిక కారాగారం (ప్రాగ్ శివార్లలో ఉంది)లో గవ్రిలో ప్రిన్సిప్ చనిపోయాడు. కానీ కింగ్డమ్ ఆఫ్ సెర్బ్స్ ఆవిర్భవించిన ఆ క్షణంలో కారాగారం పరిసరాలలోని ఓ శ్మశాన వాటికలో జైలు అధికారి పుణ్యమా అని రహస్యంగా ఖననమైపోయి, గుప్తంగా ఉన్న గవ్రిలో సమాధిలో ప్రేతాత్మ ముఖం మీద ఓ చిరునవ్వు విరిసి ఉండాలి! కానీ 1915 నుంచి దాదాపు 1938 చివరి వరకు నిర్మించిన కొన్ని లక్షల యుద్ధ మృతుల సమాధుల కింద ఉన్న ఆత్మలు మాత్రం ఇప్పటికీ కుమిలిపోతూనే ఉండి ఉండవచ్చు. - డా॥గోపరాజు నారాయణరావు (గ్రేట్ వార్ ఘటనల ఆధారంగా ఈ వ్యాసకర్త రాసిన నవల ‘క్రిస్మస్చెట్టు’ ప్రస్తుతం కినిగె డాట్ కామ్ వెబ్సైట్లో లభ్యమవుతోంది.) బ్రిటిష్ ఇండియా సేనలు పది లక్షలు మొదటి ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ ఇండియా ప్రమేయం తక్కువదేమీ కాదు. పది లక్షల సైన్యం, మూడు లక్షల ఇతర సిబ్బంది యుద్ధ రంగాలకు వెళ్లారు. అందులో 62,000 మంది చనిపోయారు. యుద్ధం తరువాత చనిపోయిన వారిని కలిపితే మొత్తం 74,187 మంది. 67,000 మంది గాయపడ్డారు. (ఆ దారుణ యుద్ధంలో చనిపోయిన మొత్తం సైనికుల సంఖ్య పది లక్షలు.) ఫ్రాన్స్, ఈజిప్ట్, గల్లిపోలీ, మెసపుటేమియా యుద్ధ రంగాలలో వీరు ఎక్కువగా పోరాడారు. ఐపర్ యుద్ధంలో పాల్గొన్న భారత సిపాయీ ఖుద్అదాద్ ఖాన్ ఆ యుద్ధంలో విక్టోరియా క్రాస్‌ను అందుకున్నాడు. ఇంతకీ 1902లో బ్రిటిష్ ఇండియా సైనిక దళాల సర్వ సేనానిగా ఉన్న లార్డ్ కిష్నర్ యుద్ధ సమయంలో ఇంగ్లండ్ ప్రభుత్వంలో యుద్ధ మంత్రిగా పని చేశాడు. ఇతడి పిలుపు మేరకే కొన్ని లక్షల మంది బాలలు యుద్ధంలో చేరారు. మూడు ఖండాలలో, దాదాపు 33 దేశాల సైన్యాలు గ్రేట్‌వార్‌లో తలపడ్డాయి. భారత్-మహాయుద్ధం ఇంగ్లండ్ వలసగా భారతదేశం ఈ యుద్ధంలో పాల్గొన్నది. ముఖ్యంగా పంజాబ్ శక్తి మేరకు సాయం చేసింది. అప్పటిదాకా అరవై వేలు ఉన్న సిక్కు సైన్యం, మొదటి ప్రపంచ యుద్ధంలో చేరండి అంటూ ఇంగ్లండ్ ఇచ్చిన పిలుపునకు తీవ్రంగా స్పందించింది. ఆ సంఖ్య మూడు లక్షలకు చేరింది. అలాగే పది లక్షల రూపాయల వార్ బాండ్లు పంజాబ్‌లోనే అమ్ముడుపోయాయి. ఫ్రాన్స్‌లో సిక్కు సైనికులు పడిన వేదన కొన్ని ఉత్తరాలలో నిక్షిప్తమై ఉంది. అంహిసాయుత పథంలో భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న మహాత్మా గాంధీ ఈ యుద్ధానికి బేషరతు మద్దతు ప్రకటించి విమర్శల పాలైనారు. నిజానికి ఆయన ఎప్పుడు ఇంగ్లండ్ యుద్ధంలో దిగినా స్వచ్ఛందంగా సేవలు అందించాడు. 1906 నాటి జులూ యుద్ధం, బోయర్ యుద్ధంలోనూ ఆయన ఆంగ్లేయులకు తన వత్తాసు పలికాడు. దీనిని అనిబిసెంట్ వంటి వారు కఠిన పదజాలంతో విమర్శించారు కూడా. 1918 ఏప్రిల్‌లో వైస్రాయ్ జరిపిన యుద్ధ గోష్టిలో తీసుకున్న నిర్ణయం మేరకు గుజరాత్ అంతా తిరిగి గాంధీ యువకులను పోగు చేయడానికి ప్రయత్నించి విఫలమైనాడు. ఊరికి పది మంది అంటూ ఆయన ఇచ్చిన నినాదం అపహాస్యానికి గురైంది. మొత్తం పది మంది కూడా రాలేదు. అయితే భారతీయ సైనికులను ఆ యుద్ధంలో ఉపయోగించుకునే హక్కు ఇంగ్లండ్‌కు లేదనీ, ఒకవేళ ఉపయోగించుదలుచుకుంటే దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే విషయం మీద ఒక హామీ ఇవ్వాలనీ మహమ్మదాలి జిన్నా కోరాడు. నిజాం నవాబు సహా, దేశంలోని ఎందరో సంస్థానాధీశులు యుద్ధానికి నిధులూ, సైనికులను సమకూర్చి పెట్టి ప్రభు భక్తిని చాటుకున్నారు. -
కాలిపోయిన వెన్నెల
నిజాలు దేవుడికెరుక జూన్ 1, 2013... ముంబై హాస్పిటల్... అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎమర్జెన్సీ రూమ్ బయట ఉన్న బెంచీ మీద ఓ యాభయ్యేళ్ల వ్యక్తి, నలభయ్యేళ్లు దాటిన మహిళ ఉన్నారు. ఆమె కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. దుఃఖం పొంగుకొస్తుంటే ఆ శబ్దం బయటకు రాకూడదని చీర చెంగును నోటిలో కుక్కుకుంటోంది. ఆమె పక్కనే కూచున్న వ్యక్తి చూపులు శూన్యాన్ని కొలుస్తున్నాయి. బాధను దిగమింగుతున్నట్టుగా గొంతు దగ్గర నరాల కదలిక చెబుతోంది. అంతలో ఎమర్జెన్సీ రూమ్ తలుపులు తెరచుకున్నాయి. నర్స్ బయటకు వచ్చింది. వాళ్లవైపు చూసి, ‘‘లోపలికి రండి’’ అనేసి లోనికి వెళ్లిపోయింది. వణుకుతోన్న కాళ్లను అతి కష్టమ్మీద నేలకు అదిమి పెడుతూ ఇద్దరూ లోనికి నడిచారు. మంచమ్మీద ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి ఉంది. ఒళ్లంతా తెల్లని దుప్పటి కప్పేశారు. ముఖం మాత్రమే కనిపిస్తోంది. చూడలేనంత దారుణంగా ఉందా ముఖం. చర్మం కాలిపోయింది. కండరాలు ఉడికి పోయి, రక్తం ఉబికి వచ్చి దయనీయంగా ఉంది. ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఆమెను పరీక్షిస్తున్నారు. గబగబా వారి దగ్గరకు వెళ్లారు ఆ భార్యాభర్తలిద్దరూ. ‘‘ఏం జరిగింది’’ అనడిగారు కంగారుగా. ‘‘తను మీతో మాట్లాడాలనుకుంటోంది’’ అనేసి వెళ్లిపోయాడు డాక్టర్. నర్సులు దూరంగా జరిగి నిలబడ్డారు. ఆ మహిళ మంచం దగ్గరగా నడిచి, వంగి ఆ అమ్మాయి ముఖంలోకి చూసింది. సగం తెరిచిన కళ్లు... ఆ కళ్ల నుంచి జాలువారుతోన్న కన్నీళ్లు... కన్నబిడ్డను ఆ స్థితిలో చూడలేక ఆ తల్లి ఘొల్లుమంది. తండ్రి గుండె చిక్కబట్టుకున్నాడు. ‘‘ఏదో మాట్లాడాలన్నావంట, ఏమైనా కావాలా తల్లీ?’’ అడిగిందామె. ఆ అమ్మాయి బలవంతాన మాట కూడదీసుకుంది. పలుకులు మూటగట్టుకుంది. గొంతు పెగల్చుకుని చిన్నగా అంది... ‘‘ఎందుకిలా జరిగిందమ్మా? నేనేం పాపం చేశాను?’’ అంతే... మరుక్షణం ఆ మాట మూగబోయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ‘ప్రీతీ’ అన్న కేకతో ఆ ఆసుపత్రి దద్దరిల్లింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి వైద్యులు, నర్సుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. అసలు ఎవరీ ప్రీతి? తనకేం జరిగిందో కూడా తెలియని స్థితిలో నిస్సహాయంగా ఎందుకు మరణించింది? మార్చ్ 28, 2013. బీబీఎంబీ కాలనీ (ఢిల్లీ)... రోషిణి వంట గదిలో ఉంది. ఆమె భర్త అమర్‌సింగ్ రాఠీ హాల్లో కూచుని ఏదో పత్రిక చదువుతున్నాడు. హితేష్ (21), తనూ (19) టీవీలో ఏ చానెల్ చూడాలా అని కొట్లాడుకుంటున్నారు. అప్పుడే బయటి నుంచి సుడిగాలిలా వచ్చింది ప్రీతి. చేతిలో ఉన్న కవర్ని చూపుతూ గంతులేయడం మొదలెట్టింది. ‘‘ఏంటక్కా అది’’... ఆతృతగా అడిగింది తనూ. ‘‘చెప్పనుగా. ముందు నాన్నకే చూపిస్తాను’’ అంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తి ఆయన పక్కనే సోఫాలో కూర్చుంది. చేస్తున్న పని ఆపి కూతురివైపు మురిపెంగా చూశాడు అమర్‌సింగ్. ‘‘ఏంట్రా అది’’ అన్నాడు కవర్ని అందుకుంటూ. దాన్ని తెరచి చూసిన అతడి కళ్లు ఆనందంతో, ఆశ్చర్యంతో అరమోడ్పులయ్యాయి. కూతురి ముఖంలోకి నమ్మలేనట్టుగా చూశాడు. ప్రీతి నవ్వింది. ‘‘నాకు మిలిటరీలో నర్స్‌గా ఉద్యోగం వచ్చింది నాన్నా. ఇంకో నెల రోజుల్లో ముంబై వెళ్లి జాయినవ్వాలి’’ ఆ మాట వింటూనే హితేష్, తనూలు అక్క దగ్గరకు వచ్చేశారు. ‘‘వావ్ అక్కా... కంగ్రాట్స్’’ అన్నాడు హితేష్ ప్రీతిని పట్టి ఊపేస్తూ. ‘‘మరి నా పార్టీ సంగతేంటి’’ అంది తనూ చేతులు రెండూ నడుముకు ఆన్చి, డిమాండ్ చేస్తున్నట్టుగా. ‘‘ఇస్తాలేవే’’ అంటూ చెల్లెలి నెత్తిమీద మొట్టింది ప్రీతి. ఈ సందడికి వంటింట్లోంచి వచ్చిన రోషిణి కూతురి ప్రయోజకత్వాన్ని చూసి పొంగిపోయింది. ‘‘నాకు తెలుసురా నువ్వు అనుకున్నది సాధిస్తావని’’ అంది కళ్లొత్తుకుంటూ. ‘‘అమ్మో... అమ్మ మళ్లీ ట్యాప్ తిప్పింది’’ అన్నాడు హితేష్ భయం నటిస్తూ. అందరూ ఫక్కుమన్నారు. ఆ రోజంతా ఆ ఇంట నవ్వుల పువ్వులు విరబూశాయి. మే 2, 2013... ముంబై రైల్వేస్టేషన్. గరీబ్థ్ ్రవచ్చి ప్లాట్‌ఫామ్ మీద ఆగింది. ఎస్ 2 బోగీలోంచి ప్రీతి జింక పిల్లలా చెంగున దిగింది. ఆ వెనుకే ఆమె తల్లిదండ్రులు, బాబాయ్ వినోద్, పిన్ని సునీత దిగారు. అందరూ కలిసి ‘ఎగ్జిట్’వైపు నడవడం మొదలు పెట్టారు. కబుర్లు చెబుతూ హుషారుగా అడుగులు వేస్తోన్న ప్రీతి... తన భుజాన్ని ఎవరో తట్టినట్టు అనిపించడంతో ఆగి వెనక్కి చూసింది. ఎవరో వ్యక్తి. ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతడెవరో పోల్చుకుందామని ప్రయత్నిస్తుండగానే అతడి చేయి పైకి లేచింది. ప్రీతి శరీరం భగ్గుమంది. ‘అమ్మా’ అంటూ ప్రీతి అరిచిన అరుపు కొన్ని కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. నేలకూలింది ప్రీతి. ఒళ్లంతా మైనంలా కరిగిపోతోంది. రక్తం ఉబికి వస్తోంది. ఒళ్లు కాలిన వాసన గుప్పుమంటోంది. ‘‘ఎవరో యాసిడ్ పోశారు’’ అరిచాడో వ్యక్తి. అమర్‌సింగ్, రోషిణిల గుండెలు అదిరిపోయాయి. ‘ప్రీతీ’ అంటూ కూతురి దగ్గరకు పరుగులు తీశారు. ఒళ్లంతా మంటలు పుడుతోంటే తాళలేక హృదయ విదారకంగా ఏడుస్తోంది ప్రీతి. ‘‘నా బిడ్డని కాపాడండి’’... కేకలు పెట్టింది రోషిణి.అంతలో రైల్వే పోలీసులు వచ్చారు. ప్రీతిని బ్లాంకెట్‌లో చుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ‘‘మీ అమ్మాయికి ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా?’’... ఆ ప్రశ్న వింటూనే ఇబ్బందిగా కదిలాడు అమర్‌సింగ్. రోషిణి మాత్రం... ‘‘మా అమ్మాయి అలాంటిది కాదు సర్’’ అంది ఆవేశంగా. ‘‘ప్రేమించడం తప్పేమీ కాదమ్మా. సాధారణంగా యాసిడ్ దాడులకు పాల్పడేవాళ్లు ప్రేమికులో, ప్రేమిస్తున్నామని వెంటబడే రోమియోలో అయివుంటారు. పోనీ మీ అమ్మాయిని ఎవరైనా వేధిస్తున్నారా?’’ ‘‘లేదు సర్. అలాంటిదేమైనా ఉంటే తను మాకు చెప్పేది.’’ తల పంకించాడు ఇన్స్పెక్టర్. ‘‘సరే... మేం ఇన్వెస్టిగేట్ చేస్తాం’’ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతడి దృష్టి మొత్తం ప్రీతికెవరైనా బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా అన్నదాని మీదే ఉంది. ఆ దిశగానే ఎంక్వయిరీ మొదలు పెట్టాడు. విచారణలో ప్రీతికి ముగ్గురు అబ్బాయిలతో స్నేహం ఉందని తెలిసింది. కానీ ఆ ముగ్గురూ ఆమెకి మంచి స్నేహితులని నిరూపణ కూడా అయ్యింది. పైగా సంఘటన జరిగినప్పుడు వారిలో ఎవ్వరూ ముంబైలో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ లేరు. దాంతో వారిని తన లిస్టు లోంచి తీసేశాడు. పలు కోణాల్లో పరిశోధించాడు కానీ ఫలితం లేకపోయింది. అంతలో ప్రీతి పరిస్థితి విషమించింది. ఒక కన్ను పోయింది. ముఖం, చెవులు, మెడ, మిగతా శరీరమంతా బాగా కాలిపో యింది. లోపలి అవయవాలు సైతం బాగా దెబ్బతినడంతో నెల రోజుల తర్వాత కన్నుమూసింది. చనిపోయే వరకూ ఆమె ఒక్కటే ప్రశ్న అడిగింది... ‘నాకెందుకిలా జరిగింది, నేనేం పాపం చేశాను’? ఆ ప్రశ్నకు సమాధానం దాదాపు 9 నెలల తరువాత తెలిసింది పోలీసులకు. గుర్గావ్ నుంచి రవి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రీతి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలుసన్నాడు. అతడిచ్చిన వివరాలను బట్టి, ప్రీతి పక్కింటి అబ్బాయి అంకుర్ పన్వర్ (21)ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రీతిని అంకుర్ ప్రేమించాడేమో అన్న ఆలోచనతో ఉన్న పోలీసులకు అతగాడు చెప్పిన కారణం విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.అంకుర్ ప్రీతిని ప్రేమించలేదు. అతడికసలు ఆ ఆలోచన కూడా లేదు. అయినా కూడా ప్రీతిని చంపేయాలనుకున్నాడు. అందుకు కారణం... అసూయ. అంకుర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. కానీ దాని మీద శ్రద్ధ లేదు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో తిరుగుతాడు. పార్టీలంటూ టైమ్ వేస్ట్ చేస్తాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కోప్పడుతూ ఉండేవారు. ‘ప్రీతిని చూసి నేర్చుకో, ఎంత చక్కగా చదువుతుందో’ అంటూ క్లాస్ పీకేవారు. వాళ్లు అలా అన్న ప్రతిసారీ ప్రీతి మీద కోపం ముంచుకొచ్చేది. అది కాస్తా ఆమెకు ఉద్యోగం వచ్చేసరికి హద్దులు దాటింది. ‘ప్రీతి అనుకున్నది సాధించింది, నీకు సెటిల్మెంట్ గురించి టెన్షనే లేదు’ అని ఇంట్లోవాళ్లు అనగానే రక్తం మరిగిపోయింది. ఆ ఆవేశంలోనే ప్రీతిని చంపేందుకు స్కెచ్ వేశాడు. ఆమెతోపాటు ముంబై బయలుదేరాడు. రైల్లోనే యాసిడ్ పోయాలనుకున్నాడు కానీ అందరూ ఉండటంతో కుదరలేదు. రైలు దిగాక తాను అనుకున్నది చేశాడు. తన పైశాచికత్వానికి ఆ బంగారు తల్లిని బలి తీసుకున్నాడు. ప్రీతి ఏ పాపం చేయలేదు. అంకుర్ అసూయ జ్వాలలకు ఆహుతైపోయింది... అంతే. కేవలం ద్వేషంతో అంకుర్ చేసిన పని... ఆమె కలల్ని మొదలంట నరికేసింది. ఆమె జీవితాన్నే అంతం చేసింది. ఆమెని అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టింది. ఓ క్షణం ఆలోచిస్తే... ఆవేశం చల్లారిపోతుంది. వాస్తవం స్ఫురిస్తుంది. కర్తవ్యం బోధపడుతుంది. మంచీ చెడుల విచక్షణ తెలుస్తుంది. ఆ ఒక్క క్షణం.. చాలా విలువైనది. అది... కొన్ని జీవితాలను నిలబెడుతుంది. కొన్ని జీవితాలను కూలదోస్తుంది. అందుకే ఏదైనా చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి. అప్పుడు మరో అంకుర్ తయారవ్వడు. మరో ప్రీతి బలవ్వదు. మరే తల్లీ కడుపుకోతతో విలవిల్లాడదు! - సమీర నేలపూడి -
పాలబిందెలో ఉంగరాలాట ఎందుకు ఆడిస్తారు?
నివృత్తం నూతన వధూవరుల విషయంలో పాటించే ఆచారాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. పాల బిందెలో ఉంగరాలాట వాటిలో ఒకటి. ఓ బిందెను పాలతో నింపేస్తారు. తర్వాత అందులో ఉంగరం వేస్తారు. వధూవరులిద్దరూ ఆ ఉంగరాన్ని వెతికి పట్టుకోవాలి. ఎవరి చేతికి చిక్కితే వారే విజేత. తమ వివాహం జరిగిన తరువాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలిద్దరూ ఈ ఆటను ఆడినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. అందువల్లే ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన దంపతులిద్దరి మధ్య బెరుకు పోగొట్టేందుకే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టినట్టు పండితులు చెబుతారు. -
అడవిలో అంతర్జాతీయ వైద్యం
సాంకేతికం చత్తీస్గడ్ రాష్ర్టంలో చాలా జిల్లాలున్నాయి. కానీ బస్తర్ జిల్లా మాత్రం దేశంలోని ప్రతి ఒక్కరికీ పరిచయం. అక్కడున్న ‘అన్నల’ వల్ల ఆ జిల్లా దేశ వ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నక్సల్స్ ప్రాబల్యం వ ల్లే అసలు ఆ ప్రాంతం అన్నింటికీ దూరమైందనే అభిప్రాయం ఉంది. అక్కడ రోడ్లు వేయరు. వేసినా వాటిని ఉండనివ్వరు. ఎవరూ దుకాణం పెట్టరు, ఏ అధికారీ అక్కడ పనిచేయడానికి ఇష్టపడడు... ఇంతమందికి ఇష్టంలేనిది ఆ అటవీ ప్రాంతపు జిల్లా డాక్టర్లకు మాత్రం ఎలా నచ్చుతుంది? అందుకే అక్కడి ప్రజలకు ఏదైనా అనారోగ్యం వస్తే ఒక జీవితం అర్పణం. మందులుండవు. మాకులుండవు. అలా రోగంతో కుంగి కుశించి నశించాల్సిందే. ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయంటే ఆ ప్రాంతంలో... సాధారణ చికిత్సతో తగ్గే డయేరియా వల్ల కూడా మనుషులు చచ్చిపోతున్నారంటే ప్రాథమిక వైద్యం కూడా వారికి ఎంత దూరంలో ఉందో అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో ఆలస్యంగానే అయినా వీరి కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంది. ప్రభుత్వ సంకల్పాన్ని ‘ఎయిమ్స్’ ఆస్పత్రి అర్థం చేసుకుంది. ఫలితంగా బస్తర్ జిల్లాలోని అడవి బిడ్డలకు ఇప్పుడు హై క్లాస్ వైద్యం అందుతోంది! చత్తీస్గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఎయిమ్స్ ఉంది. ఇక్కడ అత్యుత్తమ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. అత్యాధునికమైన 900 బెడ్లు ఉన్న ఈ ఆస్పత్రి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. తాజాగా ఇక్కడి నిపుణులు బస్తర్ జిల్లా ప్రజలకు వరంగా మారారు. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో భారత ప్రభుత్వం వంద సీఆర్పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఒక్కో క్యాంపు పరిధిలో 15 నుంచి 20 గ్రామాలుంటాయి. ఇవే ఆయా గ్రామాలకు వైద్యాలయాలు. అవి వైద్యాలయాలే గాని వైద్యులు మాత్రం ఆర్మీవాళ్లు కాదు లెండి. సాధారణంగా మొబైల్, ఇంటర్నెట్ వంటి ఏ సదుపాయాలకు ఈ గ్రామాలు నోచుకోవు. కానీ, సైన్యానికి ఉండే అవసరాల రీత్యా ఈ క్యాంపుల్లో మాత్రం అవి అందుబాటులో ఉంటాయి. అలా రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ వైద్య బృందం వారానికి రెండు రోజులు ఈ క్యాంపుల ద్వారా ప్రజలకు ‘టెలిమెడిసిన్’ విధానంలో వైద్య చికిత్సలు అందిస్తోంది. ఇదెలా పనిచేస్తుందంటే... ఎయిమ్స్ కేంద్రంలోని వైద్య బృందాలు ఈ ఆర్మీక్యాంపుల్లో పనిచేసే పారామెడిక్, మెడికల్ అసిస్టెంట్లకు స్కైప్ ద్వారా కనెక్ట్ అవుతారు. వైద్యం కోసం వచ్చిన వారితో స్కైప్ ద్వారా వైద్యులు మాట్లాడతారు. వారి పరిస్థితిని నేరుగా వీడియోలో ప్రత్యక్షంగా చూసి లక్షణాలు తెలుసుకున్న అనంతరం స్థానికంగా ఉండే పారామెడిక్లకు ఎలా వైద్యం చేయాలో చెబుతారు. వారి సూచనలు ఫాలో అవుతూ పారామెడిక్‌లు రోగులకు చికిత్సలు చేస్తారు. అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ముందుగానే ఆర్మీక్యాంపుల్లో అందుబాటులో ఉంచడం వల్ల అక్కడికక్కడే వైద్యంతో పాటు మందులు కూడా వారికి అందుతున్నాయి. అయితే కొన్ని క్యాంపుల్లో ఇంటర్నెట్, మొబైల్ సదుపాయం కూడా ఉండదు. అక్కడ డీఎస్‌పీటీ (డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్) ద్వారా రోగులతో మాట్లాడుతారు. ఒకవేళ క్యాంపుల్లో నిర్వహించే వైద్య చికిత్సలతో రోగాలు తగ్గే పరిస్థితి లేనపుడు ఆర్మీయే రోగులను పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్తుంది. ఇదే వైద్య బృందం అక్కడి డాక్టర్ల ద్వారా అవసరమైన చికిత్సలు చేయిస్తుంది. ఈ వైద్యాలయాల నిర్వహణకు పూర్తి సహకారం అందేలా ఆర్మీకి భారత ప్రభుత్వం ఆదేశాలున్నాయి. వీటివల్ల చాలా వ్యాధులకు చికిత్సలు సకాలంలో అందుబాటులో ఉండి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్నాయి. అడవి బిడ్డలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కుడోస్ టు టెక్నాలజీ, కుడోస్ టు టెలిమెడిసిన్! -
సీలెంబుకు పెళ్లి!
తపాలా నేను జిల్లా పరిషత్ హైస్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాణ్ని. నాకు నలుగురు అమ్మాయిలు. నాలుగో అమ్మాయి పేరు లీలావతి. ఆమెను మేం ‘లీలూ’ అని ముద్దుగా పిలుచుకునేవాళ్లం. వచ్చీరాని మాటలతో మమ్మల్ని ఆనంద డోలికల్లో ఊగిస్తూ ఉండేది లీలూ. ఒకరోజు పెండ్లిపిలుపుకని కొందరు పేరంటాళ్లు మా ఇంటికొచ్చారు. వాళ్లు మాకు దగ్గర బంధువులు కాబట్టి, మా వాళ్లు, వాళ్లు బాతాఖానీకి దిగారు. ‘అమ్మాయ్ లీలూ! ఆ చెంబు తీసుకొనిరామ్మా’ అంది మా ఆవిడ. ‘ఇదో మమ్మీ సీలెంబు’ అంది లీలూ. ‘స్టీలు చెంబును సీలెంబుగా పలుకుంది లీలూ’ అని పేరంటాళ్లు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. లీలూ నోట మరిన్ని ముద్దుమాటలు వినాలని, ‘అమ్మా లీలూ పొద్దున ఏం టిఫిన్ తిన్నావు’ అంది ఒకావిడ. ‘ఇగ్లీ సాంబ’ అంది లీలూ. ఇడ్లీని ఇగ్లీగాను, సాంబారును సాంబగా పలుకుతుంది లీలూ అని దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడారు వాళ్లు. లీలూ యుక్త వయసుకు వచ్చాక పెళ్లి కుదిరింది. పెళ్లి ముందురోజు లీలూకు నలుగు పెట్టేందుకు పేరంటాళ్లొచ్చారు. వాళ్లల్లో ఒకావిడ సీలెంబుకు పెళ్లా అంది. ఆమె ఎవరో కాదు, లీలూ చిన్నతనంలో పెండ్లిపిలుపుకని మా ఇంటికొచ్చిన పేరంటాళ్లలో ఒకరు. సీలెంబుకు పెళ్లా అంటే అర్థంకాక, ఆశ్చర్యంగా చూశారు. లీలూ చిన్నతనంలో ముద్దుమాటల గురించి విన్న తర్వాత పేరంటాళ్లు నవ్వుల నలుగు పెట్టారు లీలూకు. - కె.రంగనాథం హరనాథపురం, నెల్లూరు -
కవ్వింత
పార్టీ కృష్ణ: నాకు ఇంత పెద్ద పార్టీ ఎందుకిస్తున్నావో చెప్పనే లేదు శ్రీధర్: నేను చేసిన అప్పుల్ని పంచుకోవడానికి నాకో మనవడు పుట్టాడు. మళ్లీ జన్మ! భార్య: మనం పోతే పునర్జన్మ ఉంటుందా? భర్త: అది తెలియాలంటే ముందు నువ్వు పోవాలిగా. శ్రమదోపిడీ టీచర్: ప్రశాంత్ శ్రమదోపిడీ అంటే ఏమిట్రా? ప్రశాంత్: మీరు దిద్దాల్సిన పరీక్ష పేపర్లు నాచేత దిద్దించడం. విశ్వాసం! నరేష్: నిన్న నేను కొన్న కొత్తకుక్క పిల్లకి మా ఆవిడ నా పేరెందుకు పెట్టిందో అర్థం కావట్లేదురా? దినేష్: నీలాగే విశ్వాసంగా పడుండాలని కాబోలు. ఆచారం మా నాన్న గారు పండక్కి మనిద్దరికీ కొత్త బట్టలు తెచ్చారండీ. భర్త: వంటోడికి కూడా పండక్కి కొత్తబట్టలు పెట్టే మీ ఆచారం మెచ్చుకోతగ్గదే ! కాపురం! రంగయ్య: మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావట. ఎలాంటి అల్లుడు కావాలి? వెంకయ్య: సెల్లుతో కాకుండా పిల్లతో కాపురం చేసేవాడైతే చాలు!! - టి.దినేష్, భీమారం, వరంగల్ -
మాంసం తింటే ఎముకలు మెళ్లో కట్టుకు తిరగాలా...
ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతి చిన్నదానికీ ఆర్భాటం చేసేవాడు. రోజూ మాంసం తెచ్చి వండించేవాడు. రోజూ ఎందుకండీ అని భార్య అంటే... చెప్పింది చెయ్యమంటూ ఆమె మీద అరిచేవాడు. పైగా తాము రోజూ విందు ఆరగిస్తామని అందరికీ తెలిసేలా చేయడానికి మాంసంలోని ఎముకలను అందరూ చూసేలా పారబోసేవాడు. కొన్నాళ్లకు ఆ ఊళ్లోవాళ్లు పెంచుకునే కోళ్లను ఎవరో ఎత్తుకెళ్లటం మొదలుపెట్టారు. వరుసగా అందరి కోళ్లనూ ఎత్తుకెళ్లేసరికి అందరూ కలిసి సదరు వ్యక్తి ఇంటిమీద పడ్డారు. నేను మాంసం కొని తెచ్చుకుంటున్నాను, మీ కోళ్లు ఏమయ్యాయో నాకు తెలీదు అని ఎంత చెప్పినా నమ్మలేదు సరికదా చితక బాదేశారు. కుయ్యో మొర్రో అంటున్న అతడిని చూసి...‘మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్లో వేసుకుని తిరిగితే ఇలానే ఉంటుంది’ అంది భార్య. ఆ మాటే తర్వాత సామెతయ్యింది. -
జనాల్ని కుమ్ముతూ పరుగెత్తే గిత్తల పరుగు
వర్ణం కొయ్ కొయ్... ఎంతైనా స్పెయిన్‌లో పాత సంప్రదాయాలూ, గ్రామీణ వినోదాలూ ఎక్కువే! ఇక్కడ చూడండి: నీరా సొరొందో, అమయ్యా గార్సియా ఇద్దరూ చెట్టుకాండాన్ని రంపంతో కోస్తున్నారు. ఇది పంప్లోనా నగరంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్’లో భాగంగా జరిగే గ్రామీణ క్రీడల ఛాంపియన్‌షిప్‌లో ఒక విభాగం! జనాల్ని కుమ్ముతూ పరుగెత్తే గిత్తల పరుగు కూడా ఈ ఉత్సవంలోనిదే! విదేశాలనుంచి ఇక్కడికి జనం పోటెత్తుతారు. సుమారు పదిలక్షల మంది పాల్గొంటారని అంచనా! అతిథి గృహం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సూ సమైర్ మైదానంలో కనిపించిన దృశ్యం ఇది! సాహస యాత్రికులు కలలుగనే పర్యటన- ఉత్తర పశ్చిమాలను కలిపే ప్రాచీన వర్తక రహదారి ‘సిల్క్ రూట్’! ఆ మార్గంలో సంచరించే వారు వేళగాని వేళల్లో ఇలాంటి చోట బస చేసేవారు. దీన్ని యర్ట్ అంటారు. సంచార తెగల సంప్రదాయ తాత్కాలిక నివాసాలివి. తారల దీవెన జపాన్‌వాళ్లు నమ్మే ఒక ప్రాచీన గాథ ప్రకారం, నక్షత్రదేవత ఒరిహిమె, ఆమె మనసుపడిన నక్షత్రదేవుడు హికొబోషి... పాలపుంత వల్ల విడిపోవాల్సివస్తుంది. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇరువురూ కలిసే వీలుంటుంది. ఆ రోజును ‘తనబాతా’ వేడుకగా జరుపుకొంటారు జపనీయులు. ఆరోజు భక్తులు దేవాలయ ప్రాంగణంలోని వెదురు కొమ్మలకు తమ కోరికలను రాసిన కాగితాల్ని వేలాడదీస్తారు. అలా చేయడం శుభాన్ని కలిగిస్తుందంటారు. -
కూతురు యువరాణి... తండ్రి మహారాజు
సామ్రాజ్యం కూతుర్ని యువరాణిలా చూసుకునే తండ్రుల్ని చాలామందిని చూసుంటాం. కానీ ఆ తండ్రి తన కూతుర్ని నిజంగానే యువరాణిని చేయాలనుకున్నాడు. ఇందుకోసం ప్రపంచ యాత్ర సాగించాడు. చివరికి ఆమెకోసం ఓ సామ్రాజ్యాన్ని కనుక్కొన్నాడు. అక్కడ తమ జెండా పాతాడు. కూతురి నెత్తిన కిరీటం అలంకరించాడు. ఆమెను ఆ సామ్రాజ్యానికి యువరాణిని చేశాడు. హద్దులు దాటిన ఆ కన్నతండ్రి ప్రేమ గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి. పిల్లలు పెరిగే వయసులో పక్కన పడుకోబెట్టి రాజులు, రాజ్యాల గురించి కథలు చెప్పడం చాలామంది తండ్రులు చేసే పనే. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన జెరీమియా హీటన్ కూడా ఇదే పనిచేశాడు. తన కూతురు ఎమిలీకి చిన్ననాటి నుంచి పురాణ గాథలు చెబుతూ వచ్చాడు. వాటిని విపరీతమైన ఆసక్తితో మిన్న ఎమిలీని... ఆ కథల్లోని యువరాణి పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాత్రల్లో తనను తాను ఊహించుకుని, గాల్లో తేలియాడిపోయేది ఎమిలీ. ఐతే యువరాణి పాత్ర ఆమెపై బలమైన ముద్ర వేసి, కొన్నాళ్లకు తాను యువరాణినవుతానంటూ పట్టుబట్టింది. ఐతే మొదట్లో ఈ విషయాన్ని హీటన్ తేలిగ్గానే తీసుకున్నాడు. కానీ కొన్నాళ్లకు కూతురి మనసు అర్థం చేసుకున్నాడు. ఆమెను నిజంగానే యువరాణిని చేయాలని సంకల్పించాడు. మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే హీటన్... తన కూతురికి ఓ రాజ్యాన్ని కట్టబెట్టాలని, కృతనిశ్చయానికి వచ్చాక, కొన్ని నెలల పాటు పనిమానుకున్నాడు. ప్రపంచంలో ఎవరి అధీనంలోనూ లేని ఖాళీ స్థలం కోసం అన్వేషణ సాగించాడు. అతని ప్రయాణం ఈజిప్ట్, సుడాన్ దేశాల మధ్య ఆగింది. ఆన్లైన్ సెర్చ్ ద్వారా ఈశాన్య ఆఫ్రికా ప్రాంతంలోని బిర్ టావిల్ అనే పేరుతో పిలిచే 800 చదరపు మైళ్ల ఎడారి ప్రాంతం ఎవరి అధీనంలోనూ లేదని తెలుసుకున్న హీటన్... అక్కడికెళ్లి జెండా పాతాడు. అప్పటికే తన యువరాణి సామ్రాజ్యం కోసం తయారుచేసి పెట్టుకున్న జెండా అది. ఆ సామ్రాజ్యానికి తన కూతురే యువరాణి అనేందుకు సూచికగా ఓ కిరీటం ఉంటుంది. జెండా పాతి వచ్చాక, హీటన్ చేసిన పని, తన కూతురి పట్టాభిషేకం. ఓ అందమైన వజ్రాల కిరీటం తయారు చేయించి, దాన్ని ఆమె తలకు అలంకరించాడు. ఈ రోజు నుంచి ఆమె ఉత్త ఎమిలీ కాదని, ‘ప్రిన్సెస్ ఎమిలీ’ అని ప్రకటించాడు. ‘‘మా సామ్రాజ్యం స్వతంత్రమైనదిగా ప్రకటిస్తున్నా. ఈ రాజ్యానికి నేనే అధినేతను. ఎమిలీ నిజమైన యువరాణి అయింది. ఇకపై ఎమిలీని చూసినప్పుడు ఆమె అధికారిక నామం ‘ప్రిన్సెస్ ఎమిలీ’తో పలకరించండి. ఆ పదం విన్నప్పుడల్లా తనపై నా ప్రేమ, తనకోసం నేను ఎంత దూరం వెళ్లానో తెలుస్తుంది’’ అంటూ ఫేస్బుక్ సాక్షిగా ప్రకటన తన మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ప్రకటించాడు హీటన్. ప్రస్తుతం ఎమిలీ వయసు ఏడేళ్లు. పూర్తిగా ఊహ తెలిసేవరకు ఆమెను యువరాణిగానే భావించనివ్వమంటున్నాడు హీటన్. తాను చేస్తున్నది చూసి నవ్వుకున్నా పర్వాలేదంటున్నాడతను. ఐతే ఫేస్బుక్లో హీటన్ పోస్టులు చూసి, అతణ్ని ప్రశంసిస్తున్నవాళ్లే ఎక్కువ మంది. తండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండబోదంటూ హీటన్పై ప్రశంసల జల్లు కురిపిస్తూ, మద్దతుగా నిలుస్తున్నారు మిత్రులు. హీటన్ చేస్తోంది కొందరికి పిచ్చిలా అనిపించొచ్చు. ఇంకొందరికి ప్రేమలా అనిపించొచ్చు. వాస్తవమేంటంటే, తన కూతురిపై హీటన్కున్నది పిచ్చి ప్రేమ! -
ఎవరెలా పోయినా...నా దారి రహదారి!
పద్యానవనం తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యావృతుల్ మధ్యముల్, దమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృథాన్యార్థ భం గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమేయేరికిన్? మేలు చేయకపోతే పోయావు కీడు మాత్రం చేయబోకుమంటారు. అంటే, కనీసం తటస్థంగా ఉండమని వేడుకోలన్నమాట! అలా ఉండగలమా? ఎందుకుండలేం, బేషుగ్గా ఉండగలం. ఎవరికీ, ఎప్పుడూ అసలేమీ చేయకుండా ఉంటాం కనుక మనకే ఇబ్బందీ ఉండదనుకుంటారు చాలా మంది. నిజమే! ఏమీ చేయనప్పుడు ఏముంటుంది, మంచి-చెడులు బేరీజు వేయడానికి? ఏదైనా పూని చేస్తే కదా, మంచయినా, చెడయినా! ఎవరికో ఏదో ఎప్పుడూ చేస్తూనే ఉండాలనే తలంపుతో ఉంటారు కొందరు. మంచిదే, చేసేది మంచిదైతే. ఇక చెడిపోయేదేముంది, చేసేది చెడు కానప్పుడు, అనేది మరో తలంపు. హనుమంతుడ్ని చేయబోతే కోతయిందన్న సామెత చందంగా, ఏదో కాస్త మంచి చేద్దామని వెళితే, అక్కడ మనజోక్యం వల్లో, మనతో నిమిత్తం లేకుండానో చెడు జరిగిందనుకో... ఏం చేస్తాం! మన చేతిలో లేకుండా ఏదేదో జరిగిపోతే మనం మాత్రం చేయగలిగేదేముంటుంది? కాకపోతే మన ఉద్దేశం చెడు కాకూడదంతే! ‘యద్భావం తద్భవతిః’. మన తలంపు మంచిదయితే మంచే జరుగుతుందని పెద్దల భావన/దీవెన. మంచి చేసిన వారికి మంచి చేయడం అంత గొప్పేం కాదంటాడు బద్దెనామాత్యుడు. ‘ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, వివరింపంగన్ అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!’ అన్నాడందుకే. మనకు అపకారం చేసినవాడైనా, తప్పు పట్టకుండా ఉపకారం చేయడంలో ఉందట గొప్పదనం! అలా చేసిన వాడే నేర్పరి అంటాడు. మనకంత నేర్పుందా? నేర్పు, ఓర్పు, మార్పు, కూర్పు సంగతలా ఉంచితే, అసలు ముందు మనకో సంకల్పం ఉండాలి నిజంగా అలా చేయాలంటే! మనం యుగకర్తగా కీర్తించే గురజాడ అప్పారావు అందుకేనేమో! ‘....పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్, సొంతలాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్!’ అన్నాడు. ఏదైనా సత్సంకల్పం అనేది, వారి వారి తత్వాన్ని, ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుందేమో అనిపిస్తుంది. కొంతమంది పూని మంచి పనులు చేయడం వెనుక నిర్దిష్టమైన హేతువు కనబడుతుంది. ఆత్మతృప్తికో, కీర్తి కాంక్షతోనో, విశాల దృక్పథంతోనో, తమకూ మంచే జరగాలనో, వచ్చే జన్మలో సద్గతుల కోసమో... ఇలా రకరకాల కారణాలతో మంచి పనులు చేస్తుంటారు. తమ తమ స్థాయికి, తలంపునకు తగిన రీతిలో ఈ మంచిపనులకు పూనుకుంటారు. స్వార్థమో, అసూయో, ఈర్ష్యా-ద్వేషాలో... చెడు పనులు చేసేవారికీ కొన్ని కారణాలుంటాయి. కొందరి చేష్టల వెనుక ఏ లాజికూ ఉండదు. వారి గురించి భర్తృహరి అద్భుతంగా చెప్పారు తన సుభాషితాల్లో! దానికి, ఏనుగు లక్ష్మణకవి చేసిన అత్యద్భుతమైన తర్జుమాయే పై పద్యం. తాము చేపట్టే పనుల విషయంలో నాలుగు రకాలుగా ఉండే జనం గురించి చెప్పాడిందులో! ఇతరుల ప్రయోజనాల్ని కోరుకునే క్రమంలో తమ పనుల్ని కూడా వదులుకునే వారు సజ్జనులు. తమ పని చేసుకుంటూ, పనిలో పనిగా ఇతరుల పనులూ చేసి పెట్టే వారు మధ్యములు. తమ పనులు చేసుకునేందుకు వీలుగా ఇతరుల పనులను చెడగొట్టేవారు నీచులు. ఇక, ఇంకో రకం వాళ్లున్నారు, అసలు వారినేమనాలో ఎవరికీ తెలియదంటాడు. వాళ్లెవరంటే, దానివల్ల తమకు ఏ ప్రయోజనం లేకపోయినా, ఇతరుల పనుల్ని పనిగట్టుకొని చెడగొట్టేవారట. తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి వారూ ఉంటారు. మనం ఆ తెగలోకి రాకుండా జాగ్రత్త పడాలి సుమా! అందుకొక చక్కని మార్గముంది. ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మంగా మహాభారతంలో చెప్పినదాన్ని పాటిస్తే చాలు. అదేంటంటారా! తిక్కన ఓ చక్కని పద్యంలో చెప్పాడీ మాట. ‘‘ఒరులేయవి యొనరించిన, నరవర అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్’’. ఇతరులు మనకు ఏం చేయకూడదని కోరుకుంటామో, అవేవీ మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం. ‘‘ధర్మో రక్షతి రక్షితః’’. ఎవరెలా పోయినా మనం ధర్మబద్ధంగా ఉందాం, దట్సాల్! - దిలీప్‌రెడ్డి