మన దేశంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఆరాధించే ఆటగాళ్ల జాబితాలో అతను ఉండడు..! ఎందుకంటే అతను క్రికెటర్ కాదు! అతను సాధించిన విజయాలపై అన్ని వైపుల నుంచీ ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు..! ఎందుకంటే అతనేమీ ఒలింపిక్స్ పతకం గెలవలేదు! పాపులారిటీ పరంగా చూస్తే ఆ జాబితాలో అతని పేరు ఎక్కడా కనిపించదు!
కానీ.. అతను విశ్వ వేదికలపై నమోదు చేసిన ఘనతలేమీ చిన్నవి కావు! అసాధారణ ఆటతో అతను చూపించిన ఫలితాలు అసమానం! బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్స్‌పై అతను అందుకున్న విజయాలు నభూతో..! ‘క్యూ’ స్పోర్ట్స్‌లో విశ్వవ్యాప్తంగా వేర్వేరు వేదికలపై వరుస విజయాలతో సత్తా చాటిన ఆ దిగ్గజమే పంకజ్ అద్వానీ! ఏకంగా 25 వరల్డ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన స్టార్.
పంకజ్ అద్వానీకి అప్పుడు సరిగ్గా ఐదేళ్లు.. తండ్రి వ్యాపారరీత్యా ఆ కుటుంబం కొన్నేళ్లుగా కువైట్‌లోనే స్థిరపడిపోయింది. దానికి సంబంధించిన ఒక పని కోసం పంకజ్ తండ్రి అర్జున్ అద్వానీ కుటుంబంతో సహా వారం రోజుల పాటు బెల్‌గ్రేడ్‌కు వెళ్లాడు. పని ముగిసిన తర్వాత వారంతా తిరిగి కువైట్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే హోటల్ యాజమాన్యం వీరి గదికి వచ్చి ‘మీరు కువైట్ వెళ్లే అవకాశం ఇక ఏమాత్రం లేదు. కువైట్‌లో యుద్ధం జరుగుతోంది. ఆ దేశాన్ని ఇరాక్ ఆక్రమించింది. విమానాలన్నీ బంద్. మీరు ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు’ అని చెప్పేశాడు. దాంతో పంకజ్ తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో వ్యాపారం మొత్తం వదిలేసి నేరుగా భారత్‌కు వచ్చేశాడు.
ముందుగా ముంబై చేరిన ఆ కుటుంబం ఆపై బెంగళూరులో స్థిరపడింది. అయితే దాన్నే తన జీవితంలో కీలకమైన మలుపుగా పంకజ్ చెప్పుకున్నాడు. కువైట్‌లో ఉండుంటే తాను బిలియర్డ్స్ వైపు వెళ్లకపోయేవాడినని, వ్యాపారంలోనే మునిగిపోయేవాడినని అతను అన్నాడు. తన సన్నిహితులు కొందరి కారణంగా, సరదాగా ఆ ఆట వైపు ఆకర్షితుడైన తను భవిష్యత్తులో అదే ఆటలో స్టార్‌గా ఎదుగుతానని పంకజ్ కూడా ఏనాడూ ఊహించలేదు.
జూనియర్ స్థాయి నుంచే..
ఒక్కసారి ‘టేబుల్’ ఓనమాలు నేర్చుకున్న తర్వాత పంకజ్‌కు ఏనాడూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 11 ఏళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయిలో బిలియర్డ్స్ టైటిల్ గెలిచిన తర్వాత 15 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ కూడా సొంతం చేసుకున్నాడు. జాతీయ జూనియర్ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ టైటిల్స్ మాత్రమే కాదు.. 17 ఏళ్లకే జాతీయ సీనియర్ స్నూకర్ ట్రోఫీ గెలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తుది ఫలితాలు మాత్రమే కాదు.. అతని ఆటను చూసినప్పుడే మున్ముందు పెద్ద విజయాలు సాధించగలడని, గత తరం భారత బిలియర్డ్స్ దిగ్గజం గీత్ సేథీ సాధించిన ఘనతలను అధిగమించగలడని ‘క్యూ’ స్పోర్ట్స్ నిపుణులు పంకజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాస్తవరూపం దాల్చడం విశేషం.
ఒకటి తర్వాత మరొకటి..
అపార ప్రతిభ ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీ కారణంగా పంకజ్‌కు ఆరంభంలోనే విశ్వ వేదికలపై విజయాలు దక్కలేదు. అయితే 14 ఏళ్లకే ఇంగ్లండ్‌లో వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్‌లో పాల్గొని అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరో నాలుగేళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్‌లో గెలవడంతోనే అతను ఏమిటో అందరికీ తెలిసింది.
18 ఏళ్ల వయసులో సాధించిన ఈ తొలి టైటిల్‌తో పంకజ్ విజయప్రస్థానం ఘనంగా మొదలైంది. ఆ తర్వాత ఎదురులేకుండా సాగిన అతని జోరు ఏకంగా 25వ ప్రపంచ టైటిల్ వరకు సాగింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అతని ఆటకు ట్రోఫీలన్నీ దరి చేరాయి. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్న పంకజ్ తన పేరిట పలు రికార్డులను నమోదు చేశాడు. స్టీవ్ డేవిస్, జాన్ హిగిన్స్, జడ్ టంప్, డింగ్‌హుయ్.. ఇలా అప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన దిగ్గజాలను పంకజ్ వరుసగా ఓడిస్తూ వచ్చాడు.
వరల్డ్ బిలియర్డ్స్‌లో ఒక అరుదైన రికార్డు పంకజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రీడలో ఉన్న రెండు ఫార్మాట్‌లు (టైమ్ అండ్ పాయింట్)లలో విశ్వ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఒకే సమయంలో వరల్డ్ చాంపియన్ , కాంటినెంటల్ (ఆసియా) చాంపియన్ గా కూడా ఉన్న ఏకైక ఆటగాడిగా పంకజ్ నిలిచాడు.
ఒలింపిక్స్ ఒక్కటే గొప్ప కాదు
దురదృష్టవశాత్తూ బిలియర్డ్స్, స్నూకర్‌లలో ఏ ఆటకు కూడా ఒలింపిక్స్‌లో చోటు లేదు. పంకజ్ ఇన్నేళ్ల ప్రదర్శనను చూస్తే ఒలింపిక్స్‌లో అతను కచ్చితంగా పతకాలు సాధించగలిగేవాడని ఎవరైనా చెప్పగలరు. ఇదే విషయాన్ని గతంలో ఒక అభిమాని పంకజ్‌కు గుర్తు చేశాడు.
ఇన్ని ఘనతలతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించి ఉంటే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అయ్యేవాడివి అంటూ అతను వ్యాఖ్యానించాడు. దీనిపై పంకజ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘అంతా బాగుంది అంటున్నారు సరే.. ఏ క్రీడాకారుడైనా ఒలింపిక్స్ పతకం గెలిస్తేనే గొప్పా, అది లేకపోతే తక్కువా?! నాలుగేళ్లకు ఒకసారి చూపించే ప్రదర్శనను బట్టి ఒక క్రీడాకారుడి గొప్పతనాన్ని అంచనా వేస్తారా? నా దృష్టిలో దానికంటే నా దేశం తరఫున వరుసగా నాలుగేళ్ల పాటు నాలుగు వరల్డ్ చాంపియన్ షిప్‌లు గెలవడం కూడా గొప్పే. నేను దానిని ఇష్టపడతాను’ అంటూ అతను జవాబిచ్చాడు.
విజయాల జాబితా (మొత్తం 25 ప్రపంచ టైటిల్స్)
వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (పాయింట్ ఫార్మాట్) – 8
వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ (లాంగ్ ఫార్మాట్) – 8
వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ – 1
వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (15 రెడ్స్) – 3
వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (6 రెడ్స్) – 2
6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ – 1
స్నూకర్ వరల్డ్ టీమ్ కప్ – 1
స్నూకర్ వరల్డ్ టీమ్ చాంపియన్‌య్ షిప్ – 1
ఆసియా క్రీడలు – 2 స్వర్ణాలు (2006, 2010)
ఆసియా చాంపియన్ షిప్‌లు – 12
జాతీయ చాంపియన్ షిప్‌లు – 34
Comments
Please login to add a commentAdd a comment