billiards
-
బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్ అద్వానీ
న్యూఢిల్లీ: భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) దిగ్గజం పంకజ్ అద్వానీ తన విజయవంతమైన కెరీర్లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని పంకజ్ చెప్పాడు. ‘అరుదైన గౌరవానికి అర్హుడినైనందుకు ఆనందంగా ఉంది. సుదీర్ఘమైన కెరీర్లో అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు వల్లే అత్యున్నత శిఖరాలను అధిరోహించాను’ అని అద్వానీ అన్నాడు. గత నవంబర్‌లో 38 ఏళ్ల వయసులోనూ భారత విఖ్యాత ఆటగాడు అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఓవరాల్‌గా 26వ టైటిల్‌ను గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్, ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో టైటిళ్లున్నాయి. -
పంకజ్ అద్వానీ ఖాతాలో 26వ ప్రపంచ టైటిల్
దోహా: క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్లో 38 ఏళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1000–416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిపై గెలుపొందాడు. సెమీఫైనల్స్‌లో పంకజ్ 900–273తో రూపేశ్ షా (భారత్), సౌరవ్ కొఠారి 900–756తో ధ్రువ్ సిత్వాలా (భారత్)పై విజయం సాధించారు. గతంలో పంకజ్ పాయింట్ల ఫార్మాట్లో 8 సార్లు...లాంగ్‌ఫార్మాట్‌లో 8 సార్లు... స్నూకర్‌లో 8 సార్లు... టీమ్ ఫార్మాట్లో ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. -
11 ఏళ్ల వయసులోనే చాంపియన్.. బ్రిలియంట్ పంకజ్
మన దేశంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఆరాధించే ఆటగాళ్ల జాబితాలో అతను ఉండడు..! ఎందుకంటే అతను క్రికెటర్ కాదు! అతను సాధించిన విజయాలపై అన్ని వైపుల నుంచీ ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు..! ఎందుకంటే అతనేమీ ఒలింపిక్స్ పతకం గెలవలేదు! పాపులారిటీ పరంగా చూస్తే ఆ జాబితాలో అతని పేరు ఎక్కడా కనిపించదు! కానీ.. అతను విశ్వ వేదికలపై నమోదు చేసిన ఘనతలేమీ చిన్నవి కావు! అసాధారణ ఆటతో అతను చూపించిన ఫలితాలు అసమానం! బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్స్‌పై అతను అందుకున్న విజయాలు నభూతో..! ‘క్యూ’ స్పోర్ట్స్‌లో విశ్వవ్యాప్తంగా వేర్వేరు వేదికలపై వరుస విజయాలతో సత్తా చాటిన ఆ దిగ్గజమే పంకజ్ అద్వానీ! ఏకంగా 25 వరల్డ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన స్టార్. పంకజ్ అద్వానీకి అప్పుడు సరిగ్గా ఐదేళ్లు.. తండ్రి వ్యాపారరీత్యా ఆ కుటుంబం కొన్నేళ్లుగా కువైట్‌లోనే స్థిరపడిపోయింది. దానికి సంబంధించిన ఒక పని కోసం పంకజ్ తండ్రి అర్జున్ అద్వానీ కుటుంబంతో సహా వారం రోజుల పాటు బెల్గ్రేడ్కు వెళ్లాడు. పని ముగిసిన తర్వాత వారంతా తిరిగి కువైట్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే హోటల్ యాజమాన్యం వీరి గదికి వచ్చి ‘మీరు కువైట్ వెళ్లే అవకాశం ఇక ఏమాత్రం లేదు. కువైట్‌లో యుద్ధం జరుగుతోంది. ఆ దేశాన్ని ఇరాక్ ఆక్రమించింది. విమానాలన్నీ బంద్. మీరు ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు’ అని చెప్పేశాడు. దాంతో పంకజ్ తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో వ్యాపారం మొత్తం వదిలేసి నేరుగా భారత్‌కు వచ్చేశాడు. ముందుగా ముంబై చేరిన ఆ కుటుంబం ఆపై బెంగళూరులో స్థిరపడింది. అయితే దాన్నే తన జీవితంలో కీలకమైన మలుపుగా పంకజ్ చెప్పుకున్నాడు. కువైట్‌లో ఉండుంటే తాను బిలియర్డ్స్ వైపు వెళ్లకపోయేవాడినని, వ్యాపారంలోనే మునిగిపోయేవాడినని అతను అన్నాడు. తన సన్నిహితులు కొందరి కారణంగా, సరదాగా ఆ ఆట వైపు ఆకర్షితుడైన తను భవిష్యత్తులో అదే ఆటలో స్టార్‌గా ఎదుగుతానని పంకజ్ కూడా ఏనాడూ ఊహించలేదు. జూనియర్ స్థాయి నుంచే.. ఒక్కసారి ‘టేబుల్’ ఓనమాలు నేర్చుకున్న తర్వాత పంకజ్‌కు ఏనాడూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 11 ఏళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయిలో బిలియర్డ్స్ టైటిల్ గెలిచిన తర్వాత 15 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ కూడా సొంతం చేసుకున్నాడు. జాతీయ జూనియర్ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ టైటిల్స్ మాత్రమే కాదు.. 17 ఏళ్లకే జాతీయ సీనియర్ స్నూకర్ ట్రోఫీ గెలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తుది ఫలితాలు మాత్రమే కాదు.. అతని ఆటను చూసినప్పుడే మున్ముందు పెద్ద విజయాలు సాధించగలడని, గత తరం భారత బిలియర్డ్స్ దిగ్గజం గీత్ సేథీ సాధించిన ఘనతలను అధిగమించగలడని ‘క్యూ’ స్పోర్ట్స్ నిపుణులు పంకజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాస్తవరూపం దాల్చడం విశేషం. ఒకటి తర్వాత మరొకటి.. అపార ప్రతిభ ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీ కారణంగా పంకజ్‌కు ఆరంభంలోనే విశ్వ వేదికలపై విజయాలు దక్కలేదు. అయితే 14 ఏళ్లకే ఇంగ్లండ్‌లో వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో పాల్గొని అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరో నాలుగేళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్లో గెలవడంతోనే అతను ఏమిటో అందరికీ తెలిసింది. 18 ఏళ్ల వయసులో సాధించిన ఈ తొలి టైటిల్‌తో పంకజ్ విజయప్రస్థానం ఘనంగా మొదలైంది. ఆ తర్వాత ఎదురులేకుండా సాగిన అతని జోరు ఏకంగా 25వ ప్రపంచ టైటిల్ వరకు సాగింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అతని ఆటకు ట్రోఫీలన్నీ దరి చేరాయి. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్న పంకజ్ తన పేరిట పలు రికార్డులను నమోదు చేశాడు. స్టీవ్ డేవిస్, జాన్ హిగిన్స్, జడ్ టంప్, డింగ్హుయ్.. ఇలా అప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన దిగ్గజాలను పంకజ్ వరుసగా ఓడిస్తూ వచ్చాడు. వరల్డ్ బిలియర్డ్స్‌లో ఒక అరుదైన రికార్డు పంకజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రీడలో ఉన్న రెండు ఫార్మాట్లు (టైమ్ అండ్ పాయింట్)లలో విశ్వ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఒకే సమయంలో వరల్డ్ చాంపియన్ , కాంటినెంటల్ (ఆసియా) చాంపియన్ గా కూడా ఉన్న ఏకైక ఆటగాడిగా పంకజ్ నిలిచాడు. ఒలింపిక్స్ ఒక్కటే గొప్ప కాదు దురదృష్టవశాత్తూ బిలియర్డ్స్, స్నూకర్లలో ఏ ఆటకు కూడా ఒలింపిక్స్‌లో చోటు లేదు. పంకజ్ ఇన్నేళ్ల ప్రదర్శనను చూస్తే ఒలింపిక్స్‌లో అతను కచ్చితంగా పతకాలు సాధించగలిగేవాడని ఎవరైనా చెప్పగలరు. ఇదే విషయాన్ని గతంలో ఒక అభిమాని పంకజ్‌కు గుర్తు చేశాడు. ఇన్ని ఘనతలతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించి ఉంటే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అయ్యేవాడివి అంటూ అతను వ్యాఖ్యానించాడు. దీనిపై పంకజ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘అంతా బాగుంది అంటున్నారు సరే.. ఏ క్రీడాకారుడైనా ఒలింపిక్స్ పతకం గెలిస్తేనే గొప్పా, అది లేకపోతే తక్కువా?! నాలుగేళ్లకు ఒకసారి చూపించే ప్రదర్శనను బట్టి ఒక క్రీడాకారుడి గొప్పతనాన్ని అంచనా వేస్తారా? నా దృష్టిలో దానికంటే నా దేశం తరఫున వరుసగా నాలుగేళ్ల పాటు నాలుగు వరల్డ్ చాంపియన్ షిప్‌లు గెలవడం కూడా గొప్పే. నేను దానిని ఇష్టపడతాను’ అంటూ అతను జవాబిచ్చాడు. విజయాల జాబితా (మొత్తం 25 ప్రపంచ టైటిల్స్) వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (పాయింట్ ఫార్మాట్) – 8 వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ (లాంగ్ ఫార్మాట్) – 8 వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ – 1 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (15 రెడ్స్) – 3 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (6 రెడ్స్) – 2 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ చాంపియన్య్ షిప్ – 1 ఆసియా క్రీడలు – 2 స్వర్ణాలు (2006, 2010) ఆసియా చాంపియన్ షిప్‌లు – 12 జాతీయ చాంపియన్ షిప్‌లు – 34 -
IBSF World Billiards Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్లలో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. 8: పాయింట్ల ఫార్మాట్లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022). 8: లాంగ్ ఫార్మాట్లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018). 8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019). 1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014). -
పంకజ్ అద్వానీ ఖాతాలో ఎనిమిదో ఆసియా టైటిల్
దోహా: భారత మేటి క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్ 6–2 (101–66, 100–0, 101–29, 44–100, 104–90, 101–21, 88–100, 101–78) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాపై గెలుపొందాడు. 2005, 2008, 2009, 2010, 2012, 2017, 2018లలో కూడా పంకజ్ ఆసియా బిలియర్డ్స్ టైటిల్‌ను సాధించాడు. -
అంతిమ సమరంలో సౌరవ్ కొఠారి పరాజయం
మెల్బోర్న్: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్లో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి రన్నరప్‌గా నిలిచాడు. మెల్బోర్న్లో ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సౌరవ్ 967–1307తో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. పలుమార్లు ఆధిక్యం చేతులు మారిన ఈ మ్యాచ్‌లో మొదటి సెషన్లో కొఠారి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెషన్లో తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చాడు. ఒకదశలో 250 పాయింట్లతో వెనుకంజలో ఉన్న గిల్‌క్రిస్ట్ 313 పాయింట్లు సాధించి 949–917తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే జోరును మూడో సెషన్లోనూ కొనసాగించి పీటర్ విజేతగా నిలిచాడు., -
ప్రపంచ టైటిల్ @ 21
యాంగూన్ (మయన్మార్): ప్రపంచ టైటిల్ సాధించడం ఇంత సులువా అన్నట్లు... ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ఎదురే లేదన్నట్లు... బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో ఘనతను నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది నాలుగో ప్రపంచ టైటిల్ నెగ్గాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్ ఫైనల్లో అతడు 1500–299 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన భాస్కర్ బాలచంద్రను అతి సునాయాసంగా ఓడించాడు. అతడీ టైటిల్‌ను రికార్డు స్థాయిలో నాలుగోసారి నెగ్గడం విశేషం. కాగా, పంకజ్‌కిది కెరీర్లో 21వ ప్రపంచ టైటిల్. గత గురువారం ఇదే వేదికపై జరిగిన 150 పాయింట్ల ఫార్మాట్లోనూ పంకజ్ టైటిల్ సాధించాడు. ‘తాజా విజయంతో నేను శిఖరంపై ఉన్నాను. ఈ విభాగంలో ఎంతోమంది మేటి ఆటగాళ్లు ఉన్నారు. వారం వ్యవధిలోనే టైమ్ ఫార్మాట్‌తోపాటు లాంగ్ అప్ ఫార్మాట్లోనూ ప్రపంచ టైటిల్స్ గెలవడం అమితానందాన్నిస్తోంది. రాబోయే పది రోజుల్లో ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల పంకజ్ అద్వానీ వ్యాఖ్యానించాడు. గతంలో పంకజ్... బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్లో ఎనిమిది సార్లు (2018, 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005)... పాయింట్ల ఫార్మాట్లో ఆరుసార్లు (2018, 2017, 2016, 2014, 2008, 2005)... వరల్డ్ స్నూకర్ టీమ్ విభాగంలో ఒకసారి (2018), వరల్డ్ స్నూకర్ వ్యక్తిగత విభాగంలో మూడుసార్లు (2017, 2015, 2003)... వరల్డ్ సిక్స్ రెడ్ స్నూకర్ వ్యక్తిగత విభాగంలో రెండుసార్లు (2015, 2014)... వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ విభాగంలో (2014) ఒకసారి టైటిల్స్ గెలిచాడు. -
ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా సౌరవ్ కొఠారి
విశ్వ వేదికపై గతంలో రెండుసార్లు తుది పోరులో బోల్తా పడ్డ భారత బిలియర్డ్స్ ఆటగాడు సౌరవ్ కొఠారి మూడో ప్రయత్నంలో మాత్రం మెరిశాడు. తొలిసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో సౌరవ్ కొఠారి 1134–944 పాయింట్ల తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో సౌరవ్ కొఠారి 1317–1246 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ డేవిడ్ కాసియర్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. -
పంకజ్ ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్
పంకజ్ ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్ బెంగళూరు: సొంతగడ్డపై రాణించిన భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో 16వ ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో 31 ఏళ్ల పంకజ్ 6–3 (150–33, 150–95, 124–150, 101–150, 150–50, 150–35, 86–150, 150–104, 150–15) ఫ్రేమ్‌ల తేడాతో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను ఓడించాడు. సెమీఫైనల్స్‌లో పంకజ్ 5–0తో ఆంగ్ హెచ్టె (మయన్మార్)పై, పీటర్ 5–1తో ధ్వజ్ హరియా (భారత్)పై గెలిచారు. గతంలో పంకజ్ బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్లో ఏడుసార్లు, పాయింట్స్ ఫార్మాట్లో మూడుసార్లు, టీమ్ ఫార్మాట్లో ఒకసారి, స్నూకర్‌లో రెండుసార్లు, సిక్స్ రెడ్ స్నూకర్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. -
ఓవరాల్ చాంప్‌గా విజయవాడ డివిజన్
విజయవాడ స్పోర్ట్స్ : సికింద్రబాద్‌లో ఈ నెల 18 నుంచి 29వ తేదీ వరకు జరిగిన దక్షిణ æమధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించిన విజయవాడ డివిజన్జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టును చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అర్జున్ముండియ అభినంధించారు. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో అర్జున్ ముండియా విజయవాడ జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేశారు. -
ఓవరాల్ చాంప్‌గా విజయవాడ డివిజన్
విజయవాడ స్పోర్ట్స్ : సికింద్రబాద్‌లో ఈ నెల 18 నుంచి 29వ తేదీ వరకు జరిగిన దక్షిణ æమధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించిన విజయవాడ డివిజన్జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టును చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అర్జున్ముండియ అభినంధించారు. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో అర్జున్ ముండియా విజయవాడ జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేశారు. -
పంకజ్ కొత్త చరిత్ర
ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ సొంతం మూడోసారి ‘గ్రాండ్ డబుల్’ సాధించిన తొలి ఆటగాడు కెరీర్లో రికార్డు స్థాయిలో 12వ ప్రపంచ టైటిల్ లీడ్స్: భారత స్టార్ పంకజ్ అద్వానీ బిలియర్డ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఆటతీరుతో గత వారమే పాయింట్ల ఫార్మాట్లో విజేతగా నిలిచిన అతను టైమ్ ఫార్మాట్లో కూడా ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో పంకజ్ 1928-893తో ప్రపంచ మూడో ర్యాంకర్ రాబర్ట్ హాల్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. ఐదు గంటల పాటు జరిగిన ఫైనల్లో 29 ఏళ్ల పంకజ్ పూర్తి హవా కొనసాగించాడు. తొలి గంటలో 185 బ్రేక్ పాయింట్లు సాధించిన భారత స్టార్ ఆ తర్వాత కూడా చెలరేగిపోయాడు. 85, 92, 123 బ్రేక్ పాయింట్లతో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఆడుతున్న హాల్ మాత్రం 89, 64, 64 బ్రేక్ పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. ఓరాల్‌గా తొలి సెషన్ ముగిసేసరికి పంకజ్ 746-485 ఆధిక్యంలో నిలిచాడు. రెండో సెషన్లో కూడా పంకజ్ 94, 182, 289, 145 బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. దీంతో ఇంకా గంట ఆట మిగిలి ఉండగానే దాదాపుగా టైటిల్‌కు చేరువగా వచ్చాడు. చివరి గంటలో కూడా పంకజ్ 94, 93, 59, 58, 62, 90 బ్రేక్ పాయింట్లను సాధించాడు. చివరకు వెయ్యికిపైగా పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఉమాదేవికి రజతం మహిళల విభాగంలో రెవన్న ఉమాదేవి వరుసగా రెండోసారి రజతంతో సరిపెట్టుకుంది. లీడ్స్‌లోనే మంగళవారం జరిగిన ఫైనల్లో ఆమె 191-237 ఎమ్మా బోని (ఇంగ్లండ్) చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 90 నిమిషాల సెషన్లో బోని 44, 31 పాయింట్లతో రెండు బ్రేక్‌లు సాధించింది. ఓవరాల్‌గా కెరీర్లో బోనికి ఇది 9వ టైటిల్. ఏప్రిల్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో కూడా ఉమాదేవి.. బోని చేతిలోనే ఓడటం గమనార్హం. ఒకే ఏడాదిలో పాయింట్ల, టైమ్ ఫార్మాట్లో ప్రపంచ టైటిల్స్ (గ్రాండ్ డబుల్)ను మూడోసారి సాధించిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతంలో పంకజ్ 2005 (మాల్టా), 2008 (బెంగళూరు)లో గ్రాండ్ డబుల్‌ను సాధించాడు. ఇప్పుడు మూడోసారి గెలిచి మైక్ రస్సెల్ (2010, 2011లో గ్రాండ్ డబుల్)నూ అధిగమించాడు. కెరీర్లో 12 ప్రపంచ టైటిల్‌ను నెగ్గిన ఆటగాడిగా రికార్డులకెక్కిన ఈ బెంగళూరు ప్లేయర్‌కు... వ్యక్తిగత విభాగాల్లో ఇది 9వ టైటిల్. ఈ సందర్భంగా గీత్‌సేథీ (8 టైటిల్స్) రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ‘ఒకేసారి ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్నందుకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ విజయాలు నా మాటలను కప్పేశాయి. ఇక్కడికి రావడానికి ముందు గేమ్, ఫిట్నెస్ కోసం చాలా కష్టపడ్డా. అది ఇప్పుడు ఫలితాన్నిచ్చింది. మా అమ్మ జన్మదినం రోజున 12వ టైటిల్ గెలవడం చాలా ప్రత్యేకమైందిగా భావిస్తున్నా’. - పంకజ్ -
పంకజ్ అద్వానీ శుభారంభం
టైమ్ ఫార్మాట్ వరల్డ్ చాంపియన్‌షిప్ లీడ్స్: పాయింట్ ఫార్మాట్ బిలియర్డ్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మరుసటి రోజే భారత ఆటగాడు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్ టోర్నీలోనూ శుభారంభం చేశాడు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో అద్వానీ తన తొలి లీగ్ మ్యాచ్‌లో 701-510 తేడాతో భారత్‌కే చెందిన అరుణ్ అగర్వాల్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 128 పాయింట్ల బెస్ట్ బ్రేక్ నమోదు చేసిన అద్వానీ, ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాడు. భారత్‌కే చెందిన ధ్వజ్ హరియా, అలోక్, ధ్రువ్ సిత్వాలా, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్య కూడా తమ తొలి లీగ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించారు. -
ప్రపంచ ఛాంపియన్‌గా అద్వానీ
బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. సింగపూర్ క్రీడాకారుడు గిల్‌క్రిస్ట్‌పై 6-2 తేడాతో గెలిచాడు. తాను ఏడో స్వర్గాన్ని అధిగమించానని ఈ సందర్భంగా అద్వానీ చెప్పాడు. తన ఆశయం సగమే పూర్తయిందని, మరో ఫార్మాట్లో ఇంకా విజయం సాధించాలని అన్నాడు. మంచి వార్త కోసం అందరూ వేచి చూడాలని చెప్పాడు. అప్పుడే ఎవరూ అభినందనలు తెలపొద్దని కూడా అన్నాడు. ఇప్పటివరకు పంకజ్ అద్వానీ 150కి పైగా అంతర్జాతీయ ట్రోఫీలు వశమయ్యాయి. -
3 బంతులు... బిలియర్డ్స్ 21 బంతులు... స్నూకర్
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని పట్టణాలన్నింటిలోనూ భారీ సంఖ్యలో ‘పూల్స్’ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సంపన్నుల ఆటగా పరిమితమైన బిలియర్డ్స్ ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు గ్రూప్‌లుగా పూల్స్‌కు వెళ్లి గంటలు గంటలు ‘టైమ్‌పాస్’ చేస్తున్నారు. ఆడేవాళ్లకు సరే... ఆడని వాళ్లకు మాత్రం అదో ‘మిస్టరీ’. చాలామందికి బిలియర్డ్స్కు, స్నూకర్‌కు తేడా ఏంటనే సందేహం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఆటల గురించి తెలుసుకుందాం. - ఐవీ రాజీవ్ (భారత బిలియర్డ్స్ ఆటగాడు) బిలియర్డ్స్ బిలియర్డ్స్‌లో రెడ్, వైట్, ఎల్లో రంగుల్లో 3 బంతులు ఉంటాయి. రెడ్ను ఆబ్జెక్ట్ బాల్‌గా వ్యవహరిస్తారు. మిగతా రెండు బంతులను ఒక్కో ఆటగాడు ఎంచుకుంటాడు. వీటిని క్యూ బాల్స్ అంటారు. నిర్ణీత స్థానం (బ్లాక్ స్పాట్)లో రెడ్ బాల్‌ను ఉంచుతారు. మొదటి ఆటగాడు తన వైట్ లేదా ఎల్లో బాల్‌తో (క్యూ బాల్‌తో) రెడ్ బాల్‌ను, మరో బాల్‌ను ఒకే షాట్లో కొట్టాల్సి ఉంటుంది. ఇది బోర్డుపై ఉండే డి సర్కిల్నుంచే ఆడాలి. ఈ తరహాలో షాట్ ఆడటాన్ని బిలియర్డ్స్ భాషలో కెనాన్గా వ్యవహరిస్తారు. దీనికి 2 పాయింట్లు లభిస్తాయి. ఆ తర్వాత పాటింగ్ (పాకెట్లో వేయడం) ద్వారా పాయింట్లు లభిస్తాయి. మొదటి ఆటగాడు తన క్యూ బాల్‌తో రెడ్ బాల్‌ను పాకెట్లో వేయాలి. అప్పుడు 3 పాయింట్లు లభిస్తాయి. ఇదే తరహాలో మరో క్యూ బాల్‌ను పాకెట్లో వేస్తే 2 పాయింట్లు దక్కుతాయి. ఇదే తరహాలో మరో క్యూ బాల్‌కు తగులుతూ సదరు ఆటగాడి క్యూ బాల్ పాకెట్లో పడితే దానిని ఇన్ ఆఫ్ అంటారు. దీనికి 3 పాయింట్లు లభిస్తాయి. పాకెట్లో రెడ్ బాల్ పడిన ప్రతీ సారి దానిని టేబుల్‌పై యథాస్థానంలో ఉంచుతారు. ఒక మ్యాచ్‌లో ఆధిక్యాన్ని తేల్చేందుకు పాయింట్ల పద్ధతిని లేదా సమయం పద్ధతిని ఉపయోగిస్తారు. గంట, 2 గంటలు...లేదా 100 పాయింట్లు, 200 పాయింట్ల పద్ధతిలో ఆట సాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో దీనిని ఒక గేమ్‌గా వ్యవహరిస్తారు. బెస్ట్ ఆఫ్ పద్ధతిలో గేమ్‌ల ద్వారా విజేతను తేలుస్తారు. స్నూకర్ సాధారణంగా ఇంట్లో ఆడే క్యారమ్తో ఎక్కువ పోలికలు ఉండటంతో ఈ ఆటపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. స్నూకర్‌లో మొత్తం 21 బాల్స్ ఉంటాయి. ఇందులో 15 రెడ్ బంతులు కాగా మరో 6 ఇతర రంగులు ఉంటాయి. వాటిలో ఒక్కో బంతికి నిర్ణీత పాయింట్లు ఉంటాయి. ఎల్లో (2 పాయింట్లు), గ్రీన్ (3), బ్రౌన్ (4), బ్లూ (5), పింక్ (6), బ్లాక్ (7) పాయింట్లు ఉంటాయి. ఇందులో కూడా వైట్‌బాల్‌ను క్యూ బాల్‌గా వ్యవహరిస్తారు. దీనినీ డి బాక్స్నుంచే ఆడాల్సి ఉంటుంది. స్నూకర్‌లో కేవలం పాటింగ్ మాత్రమే ఉంటుంది. బిలియర్డ్స్ తరహాలో ప్రత్యర్థి బాల్‌ను ఆడే ప్రయత్నం చేస్తే (ఇన్ ఆఫ్) దానిని ఇక్కడ ఫౌల్‌గా పరిగణిస్తారు. ఆరంభంలో 15 రెడ్ బాల్స్‌ను పింక్‌తో కలిపి ఫ్రేమ్‌లో ఉంచుతారు. దానిని బ్రేక్ చేశాక ఆట మొదలవుతుంది. ఆటగాడు రెడ్ బాల్‌ను పాటింగ్ చేస్తే 1 పాయింట్ లభిస్తుంది. రెడ్ బాల్ వేసిన ప్రతీ సారి తాను ఏ కలర్ బాల్ ఆడాలనుకుంటున్నాడో రిఫరీకి చెప్పి అదే బాల్‌ను పాకెట్లో వేయాలి. పాకెట్లో వేసిన బంతికి కేటాయించిన పాయింట్లు ఆటగాడికి లభిస్తాయి. పాటింగ్ కాగానే ఆ బంతి మళ్లీ బోర్డుపైకి వస్తుంది. రెడ్ బాల్ వేసి మళ్లీ ఫాలోగా మరో బాల్...ఈ తరహాలో బోర్డుపై ఉన్న 15 రెడ్ బాల్స్ పూర్తయ్యే వరకు ఆట సాగుతుంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఫ్రేమ్‌గా వ్యవహరిస్తారు. బిలియర్డ్స్ బోర్డును సాధారణంగా టేబుల్ బెడ్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 6 పాకెట్లు ఉంటాయి. ఇది 6 ్ఠ 12 అడుగులు ఉంటుంది. ఆట సాగేటప్పుడు స్టాన్స్ చాలా కీలకం. దానిని బట్టే ఆడే తీరు మారుతుంది. టేబుల్‌పై చేతిని ఉంచి దానిపైనుంచి క్యూ స్టిక్‌తో షాట్ ఆడతారు. దీనిని బ్రిడ్జ్‌గా వ్యవహరిస్తారు. క్యూ స్టిక్ చివరను టిప్‌గా వ్యవహరిస్తారు. ఆడేటప్పుడు టిప్ స్లిప్ కాకుండా తరచూ చాక్‌తో దానిని రుద్దుతూ ఉంటారు. ఒక ప్లేయర్ తన ఆట ఆడి పక్కకు వచ్చాక, మరో ఆటగాడు ఆడేందుకు సిద్ధమవుతాడు. ఈ వ్యవధిని విజిట్ అంటారు.