యాంగూన్ (మయన్మార్): ప్రపంచ టైటిల్ సాధించడం ఇంత సులువా అన్నట్లు... ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ఎదురే లేదన్నట్లు... బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో ఘనతను నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది నాలుగో ప్రపంచ టైటిల్ నెగ్గాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్ ఫైనల్లో అతడు 1500–299 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన భాస్కర్ బాలచంద్రను అతి సునాయాసంగా ఓడించాడు. అతడీ టైటిల్‌ను రికార్డు స్థాయిలో నాలుగోసారి నెగ్గడం విశేషం. కాగా, పంకజ్‌కిది కెరీర్‌లో 21వ ప్రపంచ టైటిల్. గత గురువారం ఇదే వేదికపై జరిగిన 150 పాయింట్ల ఫార్మాట్‌లోనూ పంకజ్ టైటిల్ సాధించాడు. ‘తాజా విజయంతో నేను శిఖరంపై ఉన్నాను.
ఈ విభాగంలో ఎంతోమంది మేటి ఆటగాళ్లు ఉన్నారు. వారం వ్యవధిలోనే టైమ్ ఫార్మాట్‌తోపాటు లాంగ్ అప్ ఫార్మాట్‌లోనూ ప్రపంచ టైటిల్స్ గెలవడం అమితానందాన్నిస్తోంది. రాబోయే పది రోజుల్లో ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల పంకజ్ అద్వానీ వ్యాఖ్యానించాడు. గతంలో పంకజ్... బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్‌లో ఎనిమిది సార్లు (2018, 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005)... పాయింట్ల ఫార్మాట్‌లో ఆరుసార్లు (2018, 2017, 2016, 2014, 2008, 2005)... వరల్డ్ స్నూకర్ టీమ్ విభాగంలో ఒకసారి (2018), వరల్డ్ స్నూకర్ వ్యక్తిగత విభాగంలో మూడుసార్లు (2017, 2015, 2003)... వరల్డ్ సిక్స్ రెడ్ స్నూకర్ వ్యక్తిగత విభాగంలో రెండుసార్లు (2015, 2014)... వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ విభాగంలో (2014) ఒకసారి టైటిల్స్ గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment