ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని పట్టణాలన్నింటిలోనూ భారీ సంఖ్యలో ‘పూల్స్’ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సంపన్నుల ఆటగా పరిమితమైన బిలియర్డ్స్ ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు గ్రూప్‌లుగా పూల్స్‌కు వెళ్లి గంటలు గంటలు ‘టైమ్‌పాస్’ చేస్తున్నారు. ఆడేవాళ్లకు సరే... ఆడని వాళ్లకు మాత్రం అదో ‘మిస్టరీ’. చాలామందికి బిలియర్డ్స్‌కు, స్నూకర్‌కు తేడా ఏంటనే సందేహం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఆటల గురించి తెలుసుకుందాం.
- ఐవీ రాజీవ్ (భారత బిలియర్డ్స్ ఆటగాడు)
బిలియర్డ్స్
బిలియర్డ్స్‌లో రెడ్, వైట్, ఎల్లో రంగుల్లో 3 బంతులు ఉంటాయి. రెడ్‌ను ఆబ్జెక్ట్ బాల్‌గా వ్యవహరిస్తారు. మిగతా రెండు బంతులను ఒక్కో ఆటగాడు ఎంచుకుంటాడు. వీటిని క్యూ బాల్స్ అంటారు. నిర్ణీత స్థానం (బ్లాక్ స్పాట్)లో రెడ్ బాల్‌ను ఉంచుతారు. మొదటి ఆటగాడు తన వైట్ లేదా ఎల్లో బాల్‌తో (క్యూ బాల్‌తో) రెడ్ బాల్‌ను, మరో బాల్‌ను ఒకే షాట్‌లో కొట్టాల్సి ఉంటుంది. ఇది బోర్డుపై ఉండే డి సర్కిల్‌నుంచే ఆడాలి. ఈ తరహాలో షాట్ ఆడటాన్ని బిలియర్డ్స్ భాషలో కెనాన్‌గా వ్యవహరిస్తారు. దీనికి 2 పాయింట్లు లభిస్తాయి. ఆ తర్వాత పాటింగ్ (పాకెట్‌లో వేయడం) ద్వారా పాయింట్లు లభిస్తాయి. మొదటి ఆటగాడు తన క్యూ బాల్‌తో రెడ్ బాల్‌ను పాకెట్‌లో వేయాలి. అప్పుడు 3 పాయింట్లు లభిస్తాయి. ఇదే తరహాలో మరో క్యూ బాల్‌ను పాకెట్‌లో వేస్తే 2 పాయింట్లు దక్కుతాయి. ఇదే తరహాలో మరో క్యూ బాల్‌కు తగులుతూ సదరు ఆటగాడి క్యూ బాల్ పాకెట్‌లో పడితే దానిని ఇన్ ఆఫ్ అంటారు. దీనికి 3 పాయింట్లు లభిస్తాయి. పాకెట్‌లో రెడ్ బాల్ పడిన ప్రతీ సారి దానిని టేబుల్‌పై యథాస్థానంలో ఉంచుతారు. ఒక మ్యాచ్‌లో ఆధిక్యాన్ని తేల్చేందుకు పాయింట్ల పద్ధతిని లేదా సమయం పద్ధతిని ఉపయోగిస్తారు. గంట, 2 గంటలు...లేదా 100 పాయింట్లు, 200 పాయింట్ల పద్ధతిలో ఆట సాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో దీనిని ఒక గేమ్‌గా వ్యవహరిస్తారు. బెస్ట్ ఆఫ్ పద్ధతిలో గేమ్‌ల ద్వారా విజేతను తేలుస్తారు.
స్నూకర్
సాధారణంగా ఇంట్లో ఆడే క్యారమ్‌తో ఎక్కువ పోలికలు ఉండటంతో ఈ ఆటపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. స్నూకర్‌లో మొత్తం 21 బాల్స్ ఉంటాయి. ఇందులో 15 రెడ్ బంతులు కాగా మరో 6 ఇతర రంగులు ఉంటాయి. వాటిలో ఒక్కో బంతికి నిర్ణీత పాయింట్లు ఉంటాయి. ఎల్లో (2 పాయింట్లు), గ్రీన్ (3), బ్రౌన్ (4), బ్లూ (5), పింక్ (6), బ్లాక్ (7) పాయింట్లు ఉంటాయి. ఇందులో కూడా వైట్‌బాల్‌ను క్యూ బాల్‌గా వ్యవహరిస్తారు. దీనినీ డి బాక్స్‌నుంచే ఆడాల్సి ఉంటుంది. స్నూకర్‌లో కేవలం పాటింగ్ మాత్రమే ఉంటుంది. బిలియర్డ్స్ తరహాలో ప్రత్యర్థి బాల్‌ను ఆడే ప్రయత్నం చేస్తే (ఇన్ ఆఫ్) దానిని ఇక్కడ ఫౌల్‌గా పరిగణిస్తారు. ఆరంభంలో 15 రెడ్ బాల్స్‌ను పింక్‌తో కలిపి ఫ్రేమ్‌లో ఉంచుతారు. దానిని బ్రేక్ చేశాక ఆట మొదలవుతుంది. ఆటగాడు రెడ్ బాల్‌ను పాటింగ్ చేస్తే 1 పాయింట్ లభిస్తుంది. రెడ్ బాల్ వేసిన ప్రతీ సారి తాను ఏ కలర్ బాల్ ఆడాలనుకుంటున్నాడో రిఫరీకి చెప్పి అదే బాల్‌ను పాకెట్‌లో వేయాలి. పాకెట్‌లో వేసిన బంతికి కేటాయించిన పాయింట్లు ఆటగాడికి లభిస్తాయి. పాటింగ్ కాగానే ఆ బంతి మళ్లీ బోర్డుపైకి వస్తుంది. రెడ్ బాల్ వేసి మళ్లీ ఫాలోగా మరో బాల్...ఈ తరహాలో బోర్డుపై ఉన్న 15 రెడ్ బాల్స్ పూర్తయ్యే వరకు ఆట సాగుతుంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఫ్రేమ్‌గా వ్యవహరిస్తారు.
బిలియర్డ్స్ బోర్డును సాధారణంగా టేబుల్ బెడ్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 6 పాకెట్‌లు ఉంటాయి. ఇది 6 ్ఠ 12 అడుగులు ఉంటుంది.
ఆట సాగేటప్పుడు స్టాన్స్ చాలా కీలకం. దానిని బట్టే ఆడే తీరు మారుతుంది.
టేబుల్‌పై చేతిని ఉంచి దానిపైనుంచి
క్యూ స్టిక్‌తో షాట్ ఆడతారు. దీనిని బ్రిడ్జ్‌గా వ్యవహరిస్తారు.
క్యూ స్టిక్ చివరను టిప్‌గా వ్యవహరిస్తారు. ఆడేటప్పుడు టిప్ స్లిప్ కాకుండా తరచూ చాక్‌తో దానిని రుద్దుతూ ఉంటారు.
ఒక ప్లేయర్ తన ఆట ఆడి పక్కకు వచ్చాక, మరో ఆటగాడు ఆడేందుకు సిద్ధమవుతాడు. ఈ వ్యవధిని విజిట్ అంటారు.
3 బంతులు... బిలియర్డ్స్ 21 బంతులు... స్నూకర్
Published Fri, Feb 21 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement