![Snooker Legend Griffiths Passed Away At 77 - Here Are Intresting Facts of His Life](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/3/123.jpg.webp?itok=ARlD6r84)
వేల్స్: బ్రిటన్‌కు చెందిన ప్రపంచ స్నూకర్ మాజీ చాంపియన్, దిగ్గజం టెర్రీ గ్రిఫిత్(Terry Griffiths) కన్నుమూశారు. వయోభార సంబంధిత అనారోగ్య కారణాలతో 77 ఏళ్ల గ్రిఫిత్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కుమారుడు వేన్ తన తండ్రి మరణ వార్తను ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
ఓ క్వాలిఫయర్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టి విజేతగా ఆవిర్భవించిన ఘనత గ్రిఫిత్ సొంతం చేసుకున్నాడు. అదే విధంగా.. 1970 దశకం చివర్లో, 80 దశకంలో మేటి స్నూకర్ చాంపియన్‌గా ఎదిగాడు. 1979లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు.
‘ట్రిపుల్ క్రౌన్’ గెలిచిన 11 మందిలో గ్రిఫిత్ ఒకడిగా నిలిచాడు. స్నూకర్ క్రీడలో మాస్టర్స్, యూకే చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈ మూడు గెలిస్తే ‘ట్రిపుల్ క్రౌన్’ విజేతగా అభివర్ణిస్తారు. గ్రిఫిత్ ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన మరుసటి ఏడాది 1980లో మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
బస్ కండక్టగా.. పోస్ట్‌మాన్‌గా
రెండేళ్ల తర్వాత 1982లో యూకే చాంపియన్‌షిప్ నెగ్గాడు. సాధారణంగా బిలియర్డ్స్, స్నూకర్ ఆడేవాళ్లంతా సంపన్నులే ఉంటారు. కానీ గ్రిఫిత్ మాత్రం సాధారణ వ్యక్తి. 15 ఏళ్ల వయసులో గనుల్లో పనిచేశాడు.
తదనంతరం బస్ కండక్టర్, ఇన్సురెన్స్ ఏజెంట్, పోస్ట్‌మన్‌గానూ బతుకుబండి లాగించాడు. 1978లో ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతో గ్రిఫిత్ రాత మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment